గూడు చెదిరి.....
- చెట్టుకొకరు, పుట్టకొకరుగా అగ్నిప్రమాద బాధితులు
- పొలం గట్లూ.. చెట్ల కిందే ఆవాసం
- సాయం కోసం ఎదురుచూపులు
- నాగవరం బాధితుల కన్నీటి గాథ
నిన్నమొన్నటి వరకు రెక్కల కష్టాన్ని నమ్ముకుని ఒకరిపై ఆధారపడకుండా గుట్టుగా కాపురం చేసిన ఆ కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. ఊహించని ఉపద్రవం వల్లో.. రెండు వర్గాల మధ్య ఏర్పడిన పంతం వల్లో తెలియదు గానీ అగ్నిప్రమాదం కబళించడంతో ఆ పల్లె నేడు బూడిద కుప్పగా మారింది. ఆహ్లాదంగా, ఆనందంగా గడిపిన ఆ కుటుంబాల్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. బాధితులు పొలం గట్ల వెంట, చెట్ల కింద తలదాచుకుంటూ సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తున్నారు.
గూడూరు : మండలంలోని నాగవరం గ్రామంలో ఈ నెల 17న జరిగిన అగ్నిప్రమాదంలో 42 నివాస గృహాలు, 15 పశువుల పాకలు, 20కి పైగా గడ్డివాములు దగ్ధమయ్యాయి. 56 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. సంఘటన ప్రమాద రూపంలో జరిగిందా లేదా మానవ ప్రేరేపితంగా జరి గిందా అన్న విషయంలో అనుమానాలున్నా.. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు, రెవెన్యూ సిబ్బంది గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.
పొలాల్లోనే ఆశ్రయం...
అగ్నిప్రమాద ఘటన కారణంగా బాధిత కుటుంబాలవారు కట్టుబట్టలతో మిగిలి దుర్భర స్థితిలో రోజులు గడుపుతున్నారు. ఆశ్రయం పొందే అవకాశం లేక సమీప పొలాలు, పొలం గట్లపైనే తలదాచుకుంటున్నారు. అగ్నిప్రమాదం సమయంలో దగ్ధమవగా మిగిలిన వస్తు సామగ్రితో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ప్రమాద ఘటనలో ఇళ్ల మధ్య ఉన్న చెట్లు సైతం బుగ్గిపాలు కావటంతో నిలువ నీడ కరువవుతోంది.
కట్టుబట్టలతోనే అందుబాటులో ఉన్న కర్రలు, వాసాలతో గుడారాలు ఏర్పాటు చేసుకుని దయనీయ స్థితిలో నివసిస్తున్నారు. అసలే నిప్పులు చెరిగే ఎండలు.. ఆపైన వడగాడ్పులతో పొలాల్లో నేలపై ఉంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. ముసలీముతకా సమీప ఆలయాల అరుగుల పైనే తలదాచుకుంటున్నారు.
కదిలిస్తే.. కన్నీరే...
ఎవరిని కదిలించినా కన్నీటి కష్టాలే బయటపడుతున్నాయి. కన్నీటి పర్యంతమవుత తమ కష్టాలు ఏకరువు పెట్టడం కంటతడి పెట్టిస్తోంది. ప్రమాదంలో రేషన్, ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్‌పుస్తకాలు, పొలం దస్తావేజులు తదితర విలువైన పత్రాలు కూడా కాలిపోయాయి. దీంతో ప్రభుత్వ సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఉన్నతాధికారులు తాత్కాలిక రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశించినప్పటికీ ఇప్పటివరకూ అందిన దాఖలాలు లేవు. ఆ ప్రక్రియ పురోగతిలో ఉందని తహశీల్దార్ బీఎల్‌ఎన్ రాజకుమారి చెబుతున్నారు. గృహనిర్మాణ శాఖ ద్వారా, ఐఏవై పథకం ద్వారా గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ నిధులు ఏ మూలకూ చాలవని బాధితులు చెబుతున్నారు. కనీసం ఫౌండేషన్ వరకైనా స్వచ్ఛంద సంస్థలు సాయం అందించాలని వేడుకుంటున్నారు.
ఆపన్నుల సాయం కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. మరికొందరు దహనమైన ఇళ్లలో నివసిస్తే అరిష్టమనే ఆచారం ఉండటంతో కాలి బూడిదై మిగిలిన మొండి గోడల శిథిలాలను తొలగించి, వాటి స్థానంలో తాత్కాలిక పాకలు వేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
పశువులకూ తప్పని పాట్లు...
అగ్నిప్రమాదం కారణంగా గ్రామస్తులతో పాటు పశువులకు కూడా కష్టాలు తప్పటం లేదు. పశువుల పాకలు, వరి గడ్డివాములు కూడా మంటల్లో ఆహుతవడంతో నీడ లేక, ఆహారం దొరకక అవి అలమటిస్తున్నాయి. సరైన నీడ లేకపోయినా.. పొలం గట్లపైనే పవువులను ఉంచుతూ అరకొర మేత వేస్తుండటంతో బక్కచిక్కిపోతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఎకరం వరి గడ్డి రూ.2,500 నుంచి రూ.3 వేల మధ్య పలుకుతోంది.
ఈ పరిస్థితిలో వరిగడ్డి కొనాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేక, పశువులను మేపలేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పశుసంవర్థక శాఖ ద్వారా దాణా, పశుగ్రాసం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఇతోధికంగా సాయం చేస్తే గానీ గ్రామ పరిస్థితులు కొద్దిగానైనా మెరుగుపడే పరిస్థితి లేదు. కనీసం ఆహారం వండుకునేందుకు కూడా వీలు లేని పరిస్థితి ఉందంటే గ్రామ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు, అధికారులు చొరవ తీసుకుని సహాయ కార్యక్రమాలతో పాటు ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చి స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తే గాని గ్రామంలో మునుపటి పరిస్థితి నెలకొనదు.
ఆ పలకరింపులేవీ..
నిన్న, మొన్నటి వరకు ఆ గ్రామంలో ఎవరైనా ఎదురుపడితే ఆత్మీయ పలకరింపులు, కుశల ప్రశ్నలు ఉండేవి. బాబాయ్, అబ్బాయ్, మామయ్య, అల్లుడు.. అంటూ అన్ని వర్గాల ప్రజలు ఆత్మీయంగా పలకరించుకునేవారు. ఇటీవల కాలంలో పరిస్థితి మారింది. గ్రామంలోని రెండు ఊర చెరువుల నుంచి వచ్చే ఫల సాయం ఎవరికి దక్కాలనే పంతం గ్రామంలో చిచ్చు పెట్టింది. తాజా అగ్నిప్రమాదం ఈ వివాదంలో భాగమేననే ఆరోపణలు ఒక వర్గం వారు చేస్తున్నారు. ఏదేమైనా స్నేహపూర్వక వాతావరణంలో కళకళలాడిన ఆ పల్లెలో నేడు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.