ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ముంబై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి రెండ్రోజులు గడిచినప్పటికీ.. ఇప్పటికీ నిందితుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. నిందితుడు మాత్రం పక్కాగా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి కేసులో ముంబై పోలీసుల(Mumbai Police)పై ఇటు సినీవర్గాల, అటు రాజకీయ వర్గాల నుంచి విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఘటన జరిగి 50 గంటలు దాటిపోయినా.. నిందితుడిని, అతనితో సంబంధం ఉన్నవాళ్లెవరినీ పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు. సెలబ్రిటీల విషయంలోనే ఇలా ఉంటే.. మా పరిస్థితి ఏంటని? సాధారణ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్‌మీడియాలో ముంబై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు నిందితుడు తప్పించుకుంటున్న తీరూ పోలీసులను మరింత ఇబ్బందికి గురి చేస్తోంది.
తాజాగా సైఫ్‌పై దాడి చేసిన దుండగుడి(Saif Attacker)కి సంబంధించిన మరో ఫొటో బయటకు వచ్చింది. దాడి జరిగిన రోజు.. తల కవర్ అయ్యేలా బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లుగా ఫొటోలను తొలుత మీడియాకు పోలీసులు విడుదల చేశారు. ఆపై కొన్నిగంటల వ్యవధిలో విడుదల చేసిన ఫుటేజీలో బ్లూ షర్ట్ కనిపించింది. ఇప్పుడు తాజాగా రిలీజ్‌చేసిన ఫొటోల్లో పసుపు రంగు దుస్తుల్లో కనిపించాడు.
బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని దొరికిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలుగా తెలుస్తోంది. దీంతో.. అక్కడ రైలెక్కి నగరంలోని మరో చోటుకి నిందితుడు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన కొన్ని గంటలకు ఓ దుకాణానికి వెళ్లి హెడ్‌ఫోన్స్ కొన్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
Mumbai, Maharashtra: Officers from the Crime Branch visited the Kabutarkhana area in Dadar and collected CCTV footage from a mobile shop named "Iqra" from where he purchased headphones after attacking actor Saif Ali Khan pic.twitter.com/ILxBjsD7eZ
— IANS (@ians_india) January 18, 2025
ఈ క్రమంలో ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్ల వెంట సీసీకెమెరాలను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతానికి నిందితుడి కోసం గాలింపు చేపడుతున్న బృందాల సంఖ్యను 35కి పెంచారు.
ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం..
దుండగుడ్ని తొలిగా చూసింది సైఫ్ ఇంట పని చేసేవాళ్లు. దీంతో బాంద్రా పోలీసులు వాళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుడి గురించి ఆనవాళ్లను వాళ్ల నుంచి సేకరించారు. సుమారు 35-40 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని, ఐదున్నర అడుగుల ఎత్తు, ఛామనఛాయ రంగు ఉన్నట్లు వెల్లడించారు. ఇక.. దాడిపై సైఫ్ భార్య కరీనా కపూర్(Kareena Kapoor)తో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం సేకరించారు.
అది అరెస్ట్ కాదు!
సైఫ్‌పై దాడి ఘటన కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే వందకుపైగా మందిని విచారించారు. క్రిమినల్ రికార్డులు ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ కార్పెంటర్‌ను పోలీసులు విచారణ కోసం తీసుకొచ్చారు. అయితే సైఫ్ కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడంటూ.. మీడియా హడావిడి చేసింది. అయితే అతను కేవలం అనుమానితుడు మాత్రమేనని, కేవలం విచారణ జరిపి వదిలేశామని, ఈ కేసులో ఇంతదాకా ఎలాంటి అరెస్ట్ చేయలేదని, అలాంటిది ఏమైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని ముంబై పోలీసులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో వస్తున్న విమర్శలను సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ఖండించారు. పోలీసులు అన్నికోణాల్లో.. అన్నివిధాలుగా దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
FIR ప్రకారం..
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(54)పై బుధవారం అర్ధరాత్రి దాటాక 2గం.30ని. ప్రాంతంలో ఆయన నివాసంలోనే దాడి జరిగింది. ఈ ఘటనపై ఆయన కుటుంబం బాంద్రా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఆర్‌లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
దుండగుడు ఆ రాత్రి సైఫ్ చిన్నకొడుకు జెహ్ గదిలోకి ప్రవేశించాడు. వెంటనే.. ఆ చిన్నారి సహాయకురాలు సాయం కోసం కేకలు వేసింది. ఆ అరుపులతో గదిలోకి వచ్చిన సైఫ్‌కి దుండగుడికి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో సైఫ్‌ను ఆరుసార్లు పొడిచాడు. ఆ వెంటనే మరో ఇద్దరు సహాయకులపైనా దుండగుడు హాక్సా బ్లేడ్‌తో దాడి చేసి పారిపోయాడు.
రక్తస్రావం అయిన సైఫ్‌ను తనయుడు ఇబ్రహీం, ఇతర కుటుంబ సభ్యులు ఓ ఆటోను పిలిపించి.. లీలావతి ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 3గం. టైంలో సైఫ్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. వెన్నెముకకు దగ్గరగా కత్తి ముక్క దిగడంతో సర్జరీ చేసి దానిని తొలగించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు.
ఇదీ చదవండి: ముంబైలో దాడులకు గురైన సెలబ్రిటీలు వీళ్లే!
Comments
Please login to add a commentAdd a comment