‘సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల గతేంటి?’ | Political Attack On Fadnavis Govt Over Saif Ali Khan Incident | Sakshi
Sakshi News home page

‘సెలబ్రిటీలకే ఇలా జరిగితే ఇక సామాన్యుల గతేంటి?’

Published Thu, Jan 16 2025 12:27 PM | Last Updated on Thu, Jan 16 2025 12:51 PM

Political Attack On Fadnavis Govt Over Saif Ali Khan Incident

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి.. యావత్‌ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. అటు సినీ, ఇటు ఇతర రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడి ఘటన మహారాష్ట్రలో రాజకీయ అలజడికి కారణమైంది.

సైఫ్‌ అలీఖాన్‌ దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాలయంటూ దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్దవ్‌ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘సెలబ్రిటీలకే భద్రత కరువైనప్పుడు ముంబైలో సామాన్యుల సంగతి ఏంటి?’’ అంటూ ట్వీట్‌ చేశారామె.

ముంబైలో వరుసగా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మరో హై ప్రొఫైల్‌ వ్యక్తిపై దాడి జరగడం నిజంగా నగరానికి సిగ్గుచేటు. ముంబై పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పని తీరును ఈ ఘటన కచ్చితంగా ప్రశ్నిస్తుంది అని అన్నారామె. ఈ క్రమంలో సీనియర్‌ నేత బాబా సిద్ధిఖీ హత్య  ఉదంతంతో పాటు సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై జరిగిన దాడి ఘటనను ఆమె ప్రస్తావించారు.

బాబా సిద్ధిఖీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్‌ఫ్రూఫ్‌గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు ఉండే బాంద్రాలో సైఫ్‌పై దాడి జరిగింది. అలాంటప్పుడు ముంబైలో ఇంకెవరు సురక్షితంగా ఉంటారు?.. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆమె అన్నారు.

మరోవైపు.. పవార్‌ ఎస్పీపీ సైతం ఈ పరిణామంపై స్పందించింది. సైఫ్‌ అలీ ఖాన్‌ లాంటి ప్రముఖ వ్యక్తిపై ఆయన ఇంట్లోనే దాడి చేసినప్పుడు.. సామాన్యుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆ పార్టీ ప్రతినిధి క్లైడ్‌ కాస్ట్రో ట్వీట్‌ చేశారు.

సైఫ్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్‌ ఎంపీ వర్షా గైక్వాడ్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ముంబైలో ఏం జరుగుతోంది?. ప్రముఖులుండే నివాసాల మధ్య.. అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒక నటుడి ఇంట్లోనే దాడి జరగడం శోచనీయం. ఇలాంటప్పుడు సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశిస్తాడు? అని అన్నారామె. తుపాకీ మోతలు, దొంగతనాలు, కత్తిపోట్లు.. ముంబైలో నిత్యకృత్యం అయిపోయాయి. అసలు ముంబైలో ఏం జరుగుతోంది?. వీటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాలి అని అన్నారామె.

అయితే.. తీవ్ర విమర్శల వేళ బీజేపీ స్పందించింది. ఘటనను రాజకీయం చేయొద్దని.. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్‌ కదమ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారాయన. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులెవరైనా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, పోలీసులు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన.

ఇక.. మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్‌ టీం కోరుతోంది. ‘‘సైఫ్‌ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది.  సైఫ్‌ భార్య, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది.  కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది.

గురువారం తెల్లవారుజామున బాంద్రా(Bandra)లోని సైఫ్‌ నివాసంలో 2-2.30 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, ఆయన కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో పని చేసే మరో మహిళకూ గాయాలైనట్లు సమాచారం. వీరిద్దరినీ లీలావతి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఈ ఉదయం స్నిఫర్‌ డాగ్స్‌ సహకారంతో ఏడు బృందాలు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి సహకారంతోనే దుండగుడు లోపలికి ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడ్ని విచారించే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు.. సైఫ్‌కు ఆరు కత్తిపోట్లు అయ్యాయని, రెండు లోతుగా దిగాయని, వెన్నుపూస అతిసమీపంలో మరో గాయం కావడంతో సర్జరీ అవసరం పడిందని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 3గం. సమయంలో సైఫ్‌ను ఆస్పత్రికి తెచ్చారు. ఆయనకు తీవ్ర రక్త స్రావం జరిగింది. సర్జరీ జరిగాక ఎప్పటికప్పుడు ఆయన హెల్త్‌బులిటెన్‌ విడుదల చేస్తామని, ఊహాజనిత కథనాలు ఇవ్వొద్దని వైద్యులు మీడియాను కోరారు.  

54 ఏళ్ల సాజిద్‌ అలీఖాన్‌ పటౌడీ అలియాస్‌ సైఫ్‌ అలీ ఖాన్‌.. బాలీవుడ్‌ యాక్టర్‌గా సుపరిచితుడే. ప్రముఖ క్రికెటర్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్‌ల తనయుడు ఈయన. 1993లో పరంపర చిత్రంతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఎన్టీఆర్‌ దేవర చిత్రంతో టాలీవుడ్‌లోకి డెబ్యూ ఇచ్చి అలరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement