సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి కారణం అండర్ వరల్డ్ కాదు: అధికారులు
ఎవరినీ అరెస్ట్ చేయలేదని వెల్లడి
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా 35 పోలీసు బృందాలు ఆగంతకుడి కోసం గాలిస్తున్నాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఉన్నతాధికారులు తెలిపారు. దర్యాప్తుపై హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు.
‘పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే చాలా ఆధారాలు లభించాయి. దుండగుడిని త్వరలో వారు పట్టుకుంటారు’అని తెలిపారు. ఇందుకు సంబంధించి వారిస్ అలీ సల్మానీ అనే ఓ కార్పెంటర్‌ను ప్రశ్నిస్తున్నట్లు అంతకుముందు ముంబై పోలీసులు ప్రకటించారు. ఘటనకు ముందు రెండు రోజులపాటు అతడు సైఫ్ ఫ్లాట్‌లోనే పనులు చేశాడన్నారు. విచారణ అనంతరం అతడికి దాడితో సంబంధం లేదని తేలడంతో వదిలేశామన్నారు.
ఆగంతకుడికి ఎలాంటి నేర ముఠాలతోనూ సంబంధం లేదని అందిన ఆధారాలను బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని బట్టి అతడు 1.37 గంటల సమయంలో మెట్ల ద్వారా ఇంట్లోకి చేరుకున్నట్లు వెల్లడైందన్నారు. అతడుదొంగతనానికి వెళ్లింది సైఫ్ ఇంట్లోకి అనే విషయం కూడా అతడికి తెలిసుండకపోవచ్చని చెప్పారు. కాగా, సైఫ్‌పై దాడి ఘటనతో అండర్ వరల్డ్ గ్యాంగ్‌లకు సంబంధం లేదని మహారాష్ట్ర హోం శాఖ ఉప మంత్రి యోగేశ్ కదమ్ స్పష్టం చేశారు.
బెదిరింపులు వచ్చినట్లుగా సైఫ్ అలీ ఖాన్ సైతం ఎన్నడూ పోలీసులకు చెప్పలేదని, భద్రత కల్పించాలని కోరలేదని కూడా మంత్రి తెలిపారు. ఆయన అడిగితే భద్రత నిబంధనల మేరకు కలి్పంచి ఉండేవారమన్నారు. దాడి ఘటనకు చోరీ యత్నం మాత్రమే కారణమని వివరించారు. ఇలా ఉండగా, సైఫ్ ఇంట్లో చోరీకి యతి్నంచిన దుండగుడే ఈ నెల 14వ తేదీన బాలీవుడ్ మరో స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు.
సైఫ్ కోలుకుంటున్నారు: ఆస్పత్రి వర్గాలు
తీవ్ర కత్తి పోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారని లీలావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆయన కొద్దిసేపు నడిచారని, వెన్నెముకకు తీవ్ర గాయమైనందున బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించామని పేర్కొంది. ఆయనకు ఎలాంటి సమస్యా లేకుంటే మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే చెప్పారు. ‘ఓ వైపు రక్తమోడుతూనే ఆయన ఆస్పత్రి లోపలికి సింహంలా నడుచుకుంటూ వచ్చారు. పక్కన కుమారుడు ఆరేడేళ్ల తైమూర్ మాత్రమే ఉన్నాడు’’ అంటూ గురువారం వేకువజామున సైఫ్ చూపిన గుండెనిబ్బరాన్ని మెచ్చుకున్నారు డాక్టర్ డాంగే.
నేను, సైఫ్ అలీ ఖాన్..
గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో రక్తంతో తడిచిన కుర్తాతో తాను తీసుకెళ్లిన వ్యక్తి నటుడు సైఫ్ అలీ ఖాన్ అనే విషయం లీలావతి ఆస్పత్రికి వెళ్లేదాకా తనకు తెలియదని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా చెప్పారు. ఆస్పత్రి గేటు వద్దకు వెళ్లాక అక్కడి గార్డుతో.. స్ట్రెచర్ తీసుకురా, నేను..సైఫ్ అలీ ఖాన్‌ను అని ఆయన చెప్పాకనే ఆ విషయం తెలిసిందని రాణా శుక్రవారం ముంబైలో మీడియాకు తెలిపారు.
‘సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్టుమెంట్ సమీపం నుంచి వెళ్తుండగా ఒక మహిళ, మరికొందరు తన ఆటోను ఆపారు. అనంతరం రక్తంతో తడిచిన కుర్తాతో ఓ వ్యక్తి ఆటోలో కూర్చున్నారు. ఆయనతోపాటు 8 ఏళ్ల బాలుడు, ఓ యువకుడు, మహిళ కూర్చున్నారు. మొదట వాళ్లు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. కానీ, సైఫ్ లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో, అక్కడికే ఆటోను పోనిచ్చాను. అక్కడికెళ్లాక సైఫ్ ఆస్పత్రి గేట్ వద్ద గార్డును పిలిచారు. దయచేసి స్ట్రెచర్ తీసుకురా..నేను, సైఫ్ అలీ ఖాన్ అని అన్నారు. అప్పుడు సమయం దాదాపు మూడైంది. ఏడెనిమిది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాం’అని రాణా వివరించారు. అప్పటి దాకా ఆయన సైఫ్ అలీ ఖాన్ అనే సంగతి గమనించలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment