CM Devendra fadnavis
-
ఆడియో టేపు కలకలం
సాక్షి, ముంబై : సంచలనంగా మారిన ఆడియో టేపు వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటూ ఆయన కార్యకర్తలతో చెప్పిన మాటల టేపును శివసేన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అది ఎడిట్ చేసిన ఆడియో అని ఫడ్నవిస్ చెబుతున్నారు. శనివారం ఓ మీడియా ఛానెల్‌తో సీఎం ఫడ్నవిస్ మాట్లాడారు. ‘ఆ టేపును నేనూ విన్నాను. అందులో గొంతు నాదే. కాదనను. కానీ, అది ఎడిట్ చేసింది. సామ దాన దండ భేదోపాయాలను ఉపయోగించండి అని చెప్పిన మాట వాస్తవం. కానీ, అది వేరే సందర్భంలో చెప్పాను. పలు సందర్భాల్లో నేను మాట్లాడిన మాటల్ని జత చేసి ఆడియో టేపును సృష్టించారు. పైగా 14 నిమిషాల నిడివి ఉన్న ఆ క్లిప్ అసంపూర్తిగా ఉంది. త్వరలో ఆ ఆడియో క్లిప్‌ను ఎన్నికల సంఘానికి సమర్పించబోతున్నా. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫర్వాలేదు’ అని రిపోర్టర్‌తో ఫడ్నవిస్ చెప్పారు. కాగా, పాల్ఘడ్ లోక్‌సభ స్థానానికి త్వరలో(మే 28వ తేదీన) ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే శుక్రవారం ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ ఆడియో టేపును విడుదల చేశారు. ‘బీజేపీ అంటే ఏంటో ప్రత్యర్థులకు చూపాలని, అవసరమైతే ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా తెగించాలని’ ఫడ్నవిస్ చెప్పారంటూ థాక్రే ఆ క్లిప్‌ను విడుదల చేశారు. -
ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్‌తో ఉద్యోగాలు.. భారీ షాక్!
ముంబై : తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తోన్న 11,700 మందిపై వేటు వేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఎస్సీ, ఎస్టీలుగా చెలామణి అవుతూ 20 ఏళ్లుగా ఉద్యోగాలు అనుభవిస్తున్నవారి జాబితాలో క్లర్క్ నుంచి సీనియర్ కార్యదర్శులదాకా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నకిలీ ఉద్యోగుల తొలగింపు అనివార్యమని, అయితే ఒకే దఫాలో వేటు వేస్తే ఎదురయ్యే న్యాయసమస్యలపై చర్యలు జరుపుతున్నామని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుమిత్ ములి మీడియాకు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి సోమవారం(ఫిబ్రవరి 5న) పలు ఉద్యోగ సంఘాలు, వివిధ పక్షాలకు చెందిన నాయకులతో సీఎస్ భేటీ కానున్నారు. సీఎం ఫడ్నవిస్ సూచన మేరకు జరుగనున్న ఈ భేటీల అనంతరం ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. 20 ఏళ్లుగా ఉద్యోగాలు అనుభవిస్తూ.. : మహారాష్ట్రలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో గడిచిన నాలుగు దశాబద్దాలుగా 63,600 మంది ఉద్యోగాలు పొందారు. వారిలో 51,100 మంది అసలైన అర్హులుకాగా, మిగిలిన 11,700 మంది ఫేక్ సర్టిఫికేట్లతో అక్రమ మార్గంలో ఉద్యోగాలు పొందారు. అక్రమ ఉద్యోగులపై కొన్ని దళిత, గిరిజన సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ‘‘ఒక వ్యక్తి దీర్ఘ కాలం సర్వీసులో ఉన్నప్పుడు అతని కుల ధృవీకరణ తప్పని తేలితే ఉద్యోగం నుంచి తొలగించాల్సిన అవసరంలేదు’’ అన్న ముంబై హైకోర్టు తీర్పు మరింత గందరగోళానికి దారితీసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. 2017 జులైలో సంచలన తీర్పు చెప్పింది. ‘‘రిజర్వేషన్ కేటగరిలో నకిలీ సర్టిఫికెట్లతో పొందిన ఉద్యోగాలు, ప్రవేశాలు చట్టం దృష్టిలో చెల్లుబాటుకావని, అలా ఉద్యోగాలు చేస్తున్న వారిని విధుల నుంచి తప్పించాల్సిందే’’నని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో ఆ 11,700 మందిపై వేటుకు రంగం సిద్ధమైంది. -
ఛనాకా–కొరట బ్యారేజీకి క్లియరెన్స్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు సంబంధిం చిన ప్రాణహితలో భాగంగా చేపట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ, ఛనాకా–కొరట బ్యారేజీ సాగునీటి ప్రాజెక్టులకు మహారాష్ట్ర వన్యప్రాణి బోర్డు క్లియరెన్స్‌లు ఇచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గత కొన్ని నెలలుగా మహారాష్ట్రతో జరుపుతున్న సంప్రదింపుల ఫలితంగా ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఈ రెండు బ్యారేజీల వల్ల వన్యప్రాణులకు ఎలాంటి హాని ఉండదని మహారాష్ట్ర తెలిపింది. ఛనాకా–కొరట బ్యారేజీని పెన్‌గంగ నదిపై నిర్మిస్తున్నారు. 51 వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టుకు తిప్పేశ్వర్ వన్యప్రాణి కేంద్రం నుంచి అనుమతి లభించింది. ప్రాణహిత నదిపై 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న తమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు చాప్రాల్ వన్యప్రాణి కేంద్రం అనుమతిచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన బుధవారం ముంబైలో ఆ రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశమైంది. సమావేశంలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునిగంటివార్, రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ భగవాన్, తెలంగాణ నుంచి ఆదిలాబాద్ సీఈ భగవంతరావు, డిప్యూటీ ఫారెస్ట్ కన్జర్వేటర్ శ్రీనివాస్, పెన్‌గంగ ఎస్ఈ అమ్జద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఛనాకా–కొరట, తమ్మిడిహెట్టి బ్యారేజీలపై సీఈ భగవంతరావు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తూ, వీటి నిర్మాణంతో వన్యప్రాణి కేంద్రాలపై ప్రభావముండదని తేల్చిన మహారాష్ట్ర వన్యప్రాణి మండలి.. జాతీయ వన్యప్రాణి బోర్డుకు సిఫారసు చేసింది. ఆ నిర్ణయం పట్ల హరీశ్‌రావు బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
ముఖ్యమంత్రిపై ఇంకు దాడి..
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమం కోసం హాజరైన ఆయన మీద ఇంకు జల్లేందుకు ఓ యువకుడు యత్నించగా.. సిబ్బంది అప్రమత్తతో ఆయన తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. శనివారం ఉదయం రాలేగావ్ సిద్ధీలో ఓ శంకుస్థాపన క్యార్యక్రమానికి సీఎం ఫడ్నవిస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ యువకుడు ఆయనకు అత్యంత దగ్గరగా వచ్చేందుకు యత్నించాడు. అది గమనించిన భద్రతా సిబ్బంది అతన్ని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఇంక్ బాటిల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతనెవరు? ఆ పని ఎందుకు చేయాలనుకున్నాడన్న విషయాలు తెలియాల్సి ఉంది. -
కూటమి నుంచి పోతే పొండి : సీఎం ఘాటు హెచ్చరిక
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములైన బీజేపీ, శివసేనల మధ్య ‘రాహుల్ గాంధీ సమర్థత’ అంశం చిచ్చురేపింది. ప్రధాని మోదీ ప్రభ తగ్గిపోయిందని, ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, దేశాన్ని నడిపించగల సత్తా రాహుల్ గాంధీకి ఉందంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు తాజా దుమారానికి కారణమయ్యాయి. ముంబైలో శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఫడ్నవిస్.. శివసేన వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వంలో కొనసాగుతూ శివసేన ప్రతిపక్ష పాత్ర పోషించడం కుదరదని, ఆ పార్టీ నాయకులు ఏదిపడితే అతి మాట్లాడటం తగదని చురకలంటించిన సీఎం.. మరో అడుగు ముందుకేసి ‘కూటమిలో ఉండాలో, బయటికి వెళ్లాల్లో తేల్చుకోండి..’ అని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు సవాలు విసిరారు. బీజేపీ-శివసేనలు దశాబ్ధాలుగా మిత్రులుగానే ఉన్నాయని, నాడు బాలా సాహెబ్(బాల్ ఠాక్రే) సంకీర్ణ ధర్మానికి కట్టుబడితే, నేడు ఉద్దవ్ దానికి తూట్లు పొడుస్తున్నారని ఫడ్నవిస్ విమర్శించారు. మోదీ ఓ గ్రాండ్ మాస్టర్! : ప్రధాని మోదీ పనైపోయిందంటూ శివసేన ఎంపీ సంయజ్ రౌత్ చేసిన వ్యాఖ్యలకు సీఎం ఫడ్నవిస్ ఘాటుగా సమాధానమిచ్చారు. సంజయ్ పేరును ప్రస్తావించకుండానే.. కొందరు శివసేన నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని, ఇలాంటి వాళ్లపై వారి అధ్యక్షుడు(ఉద్దవ్) దృష్టిసారిస్తే బాగుంటుందని హితవుపలికారు. ‘‘దేశంలోని ముఖ్యమంత్రులందరికీ మోదీ ఒక రోల్ మోడల్. ఆయన ఒక అద్భుతమైన కమ్యూనికేటర్, అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్, దేశాన్ని మార్చేసిన గ్రేట్ లీడర్’’ అని ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. -
పెను సవాల్: 'బ్లూ వేల్'ను ఆపడం సాధ్యమేనా?
ప్రాణాంతక ఆన్లైన్ గేమ్ 'బ్లూ వేల్ చాలెంజ్'ను నిషేధించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ గేమ్‌లో భాగంగా ముంబైకి చెందిన టీనేజర్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. గేమ్ సర్వర్లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరుతామని ఆయన తెలిపారు. అయితే, సైబర్ భద్రతా నిపుణులు మాత్రం ఈ గేమ్‌ను నిషేధించడం లేదా బ్లాక్ చేయడం ప్రభుత్వానికి సైతం పెద్ద సవాలేనని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అత్యంత సంక్లిష్టమైన, మిస్టరీతో కూడిన ఈ గేమ్ ఒక యాప్ కాదు. ఈ గేమ్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లోగానీ, ఇతర యాప్ స్టోర్లలోగానీ సులభంగా డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు. ఇదొక కమ్యూనిటీ. అంతర్జాతీయంగా సోషల్ మీడియా వెబ్సైట్లను వేదికగా చేసుకొని టీనేజర్లు ఆత్మహత్య చేసుకొనేలా పురికొల్పుతుంది. ఈ చాలెంజ్‌ను నియంత్రించేవారు వివిధ చాట్‌రూమ్స్ వేదికగా ఒకరినొకరు సంప్రదించుకుంటారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకమైన అభిరుచులు గల టీనేజర్లను గుర్తించి.. వారు ఈ గేమ్ ఆడేలా ఎర వేస్తారు. 'పలు సోషల్ మీడియా యాప్స్ వేదికగా చేసుకొని ఈ కమ్యూనిటీ సంప్రదింపులు జరుపుతున్నట్టు రష్యా టీనేజర్ ఆత్మహత్య కేసులో తేలింది. ఈ చాలెంజ్‌ను నిషేధించి.. దేశంలో ప్రవేశించకుండా అడ్డుకోవాలంటే.. యువత అధికంగా ఫాలో అయ్యే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి నియంత్రించాల్సి ఉంటుంది. ఐఎస్పీల ఆధారంగా సెర్చ్లన్నింటినీపై కన్ను వేయాలి. ఈ చాలెంజ్‌కు దారితీసే వెబ్సైట్లు, లింకులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే బ్లాక్ చేయాలి. ప్రభుత్వం ఇవన్నీ చేయగలదు. అదేసమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది' అని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు. నిజానికి ఇది ఆన్లైన్ గేమ్ కూడా కాదు. కానీ ఈ చాలెంజ్ నిర్వాహకుడు లేదా కంట్రోలర్ సోషల్ మీడియా ద్వారా తనకు పరిచయమైన టీనేజర్‌కు పలు టాస్క్‌లు (సాహస కార్యాలు) అప్పజెప్తాడు. దీని గురించి మరో నిపుణుడు స్పందిస్తూ.. 'గత ఆరు నెలలుగా బ్లూవేల్ చాలెంజ్ గురించి నేను చదువుతున్నాను. రష్యాలో పలువురు టీనేజర్లు దీనిబారిన పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ గేమ్‌కు ఇతర పేర్లు కూడా ఉన్నాయని తెలుసుకున్నాను. డార్క్ రూమ్, వేక్ మి అప్ ఎట్ 4.20 ఏఎం వంటి పేర్లు చెలామణిలో ఉన్నాయి. ఈ చాలెంజ్‌ను ఒకరు స్వీకరిస్తే.. సొంతంగా హింసించుకుంటూ చివరకు ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింకులు, కమ్యూనిటీ పేజీలన్నింటినీ గుర్తించి టీనేజర్లకు ఇవి చేరకుండా బ్లాక్ చేయాలి. ఇది కష్టమైన పని. ఎందుకంటే ఏ సోషల్ మీడియా పేజీ దీనిని నిర్వహిస్తుందో మనకు తెలియదు' అని చెప్పారు. 'ఈ చాలెంజ్‌ను పూర్తిగా నిషేధించడం అసాధ్యం. కానీ దీని మూలాలను గుర్తించడం ద్వారా నియంత్రించవచ్చు. దీనికి సంబంధించిన గేట్‌వే లేదా ఐఎస్‌పీలను గుర్తిస్తే బ్లాక్ చేయడం సాధ్యమే. ఈ చాలెంజ్ రష్యాలో మొదలైనట్టు తెలుస్తోంది. దీని మూలాలను గుర్తించి మరింత విస్తరించకుండా దేశాల మధ్య సమాచారాన్ని అందించుకోవడం ద్వారా దీనిని అరికట్టవచ్చు. ఇది కష్టసాధ్యమైనా ప్రభుత్వాలకు అసాధ్యమైతే కాదు' అని మరో నిపుణుడు అభిప్రాయపడ్డారు. -
కలకలం రేపిన రైతు సూసైడ్ నోట్
పుణే: మహారాష్ట్రలో రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో సోలాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య కలకలం రేపింది. ఆయన రాసిన సూసైడ్ నోట్ రైతు ఆగ్రహంపై మరింత అగ్గి రాజేసింది. రైతులకు రుణ మాఫీ తదితర డిమాండ్లను నెరవేర్చేవరకు తన శరీరం దహనం చేయరాదని ఆత్మహత్య చేసుకున్న రైతు నోట్ రాసి మరీ తన ప్రాణాలను తీసుకోవడం మరింత ఆందోళనకు తావిచ్చింది. గురువారం ఉదయం సోలాపూర్ కలెక్టర్ రాజేంద్ర భోంస్లే రైతు ఆత్మహత్య ఉదంతాన్ని ధృవీకరించారు. బుధవారం రాత్రి కర్మాళి తాలూకాలోని వీట్ గ్రామంలో ధనజీ చంద్రకాంత్ జాధవ్ (45) అనే రైతు తన ఇంటికి సమీపంలో చెట్టు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి సందర్శించేంతవరకు తన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించవద్దంటూ తన ఆత్మహత్య నోట్ లో పేర్కొన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతు సంఘాలు 'రాస్తా-రోకో' నిర్వహించి, బంద్‌కు పిలుపునిచ్చాయి. నేను రైతును. నా పేరు ధనజీ చంద్రకాంత్ జాధవ్.ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దయచేసి నా మృతదేహాన్ని గ్రామానికి తరలించకండి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన గ్రామానికి వచ్చేంతవరకు అంత్యక్రియలు నిర్వహించవద్దంటూ . ధనజీ తన లేఖలో పేర్కొన్నారు. దీంతో రైతు రుణమాఫీ ప్రకటించేంతవరకు మృతదేహాన్ని తరలించేందిలేదని రైతులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. అయితే ఇప్పటికే ధనజీ గ్రామాన్ని సందర్శించినట్టు సోలాపూర్ కలెక్టర్ చెప్పారు. రాష్ట్ర మంత్రి విజరు దేశ్‌ముఖ్ గురువారం గ్రామానికి వెళ్లారు. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. కాగా మృతునికి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2.5 ఎకరాల సాగు భూమిపై రూ. 60,000 రుణం తీసుకున్నాట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని దాదాపు 33 రైతు సంఘాలు జూన్ నెల 1వ తేదీ నుంచి వారు నిరవధిక సమ్మె చేస్తున్నాయి. రాష్ట్రంలోని ముంబై, పూణె నగరాలు సహా మొత్తం 20 జిల్లాలకు కూరగాయలు, పండ్లు, పాల రవాణాను రైతులు ఆపేసి సమ్మె చేపట్టారు ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున పాలను, ఉల్లిపాయలను రోడ్లపై పారబోసి మరీ తీవ్ర ఆందోళనకు దిగారు. స్వామి నాథన్ కమిషన్ సిఫారసు అమలు, కనీస మద్దతుధర, రుణాలు మాఫీ , ఫించన్ తదితర డిమాండ్లతో రైతులు పోరాటానికి దిగారు. ఈ ఉద్యమానికి ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పంకజ అలక.. సీఎం బుజ్జగింత
ముంబయి: 'ఇది మా సెక్షన్ పని కాదండి..' అని శంకర్ సినిమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు అంటారే.. దాదాపు అలాంటి సంవాదమే చోటుచేసుకుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రిణి పంకజ ముండేల మధ్య. సోమవారం సింగపూర్ లో జరగనున్న అంతర్జాతీయ జల సదస్సుకు వెళ్లబోనని, ఆ పని నాది కాదని అలక బూనిన పంకజను ముఖ్యమంత్రి ఫడ్నవిస్ బుజ్జగించి చివరకు సింగపూర్ వెళ్లేలా ఒప్పించారు. ఇంతకీ ఆమె అలకకు కారణం ఏమంటే.. గోపీనాథ్ ముండే వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పంకజ.. ఎమ్మెల్యే అవుతూనే మంత్రి పదవి చేపట్టారు. మహారాష్ట్ర జల సంరక్షణ (వాటర్ కంజర్వేషన్) మంత్రిగా ఉన్న ఆమెను.. మంత్రివర్గ విస్తరణలో భాగంగా గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖకు మార్చారు. రెండేళ్లుగా నిర్వహిస్తున్న శాఖ నుంచి ఉన్నపళంగా మార్చేయడంతో పంకజ కొద్దిగా డిసపాయింట్ అయ్యారట. అందుకే సింగపూర్ లో జరిగే కార్యక్రమాలనికి వెళ్లడం లేదని, ఆ శాఖ మంత్రిని కానుకాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నానని శనివారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం దుబాయి పర్యటనలో ఉన్న సీఎం ఫడ్నవిస్.. కొద్ది గంటల్లోనే పంకజ ట్వీట్ పై స్పందించారు. 'సింగపూర్ సదస్సుకు మీరు తప్పక హాజరుకావాలి. సీనియర్ మంత్రిగా అది మీ బాధ్యత. మీరు జల సంరక్షణ మంత్రిగా కాదు.. మహారాష్ట్ర ప్రభుతవ ప్రతినిధిగా సింగపూర్ వెళ్లండి' అని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతే, విమానం టికెట్లు బుక్ చేసుకునే పనిలోపడ్డారు పంకజ.. Reaching singapore tomorrow on monday there is world water leader summit i was invited but now wont attend since i m not minister incharge — PankajaGopinathMunde (@Pankajamunde) 9 July 2016 Of course you must attend WLS 2016. As a senior Minister you would be representing 'The Government of Maharashtra'. https://t.co/czMYpLepMA — Devendra Fadnavis (@Dev_Fadnavis) 9 July 2016 -
మహారాష్ట్ర కేబినెట్లోకి 11మందికి చోటు
ముంబయి: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మరో 11మందికి చోటు దక్కింది. వారిలో పదిమంది కొత్త ముఖాలే. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్తగా ఎంపికైన మంత్రులతో గురువారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ విద్యాసాగరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే గైర్హాజరు అయ్యారు. కొత్త మంత్రివర్గంలో మిత్ర పక్షాలు అయిన శివసేనకు రెండు సహాయ మంత్రి పదవులు, స్వాభిమాని పక్ష పార్టీతో పాటు రాష్ట్రీయ సమాజ్ పార్టీకి చోటు దక్కింది. కాగా అవినీతి ఆరోపణలతో సీనియర్ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే గత నెల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఖడ్సే నిర్వహించిన 10 శాఖలను అప్పటి నుంచి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటివరకూ తన వద్దే ఉంచుకున్నారు. కేబినెట్ మంత్రులు 1.పాండురంగ్ పుండ్కర్ (బీజేపీ) 2. రామ్ షిండే, (బీజేపీ) కేబినెట్ హోదా 3.జయకుమార్ రావల్ (బీజేపీ) 4. సంభాజీ పాటిల్-నిలంబగేకర్ (బీజేపీ) 5.సుభాష్ దేశ్‌ముఖ్ (బీజేపీ) 6.మహదేవ్ జాన్కర్ (ఆర్ఎస్పీ) సహాయమంత్రులు 1. అర్జున్ ఖోత్కర్ (శివసేన) 2. రవీంద్ర చవాన్ (బీజేపీ) 3. మదన్ యారవాల్ (బీజేపీ) 4. గులాబ్ రావ్ పాటిల్ (శివసేన) 5. సదాభావు ఖోత్, (ఎస్ఎస్ఎస్) -
రేపు 'మహా' కేబినెట్ విస్తరణ
ముంబయి: అవినీతి ఆరోపణలతో వైదొలగిన సీనియర్ మంత్రి, మిత్రపక్షంతో విబేధాలు, కీలక శాఖలన్నీ తన వద్దే ఉండటంతో ముఖ్యమంత్రిపై పెరిగిన ఒత్తిడి.. ఇన్ని అంశాల నేపథ్యంలో బీజేపీ పాలిత మహారాష్ట్ర లో రేపు(శుక్రవారం) కేబినెట్ విస్తరణ జరగనుంది. అధికారం చేపట్టి 20 నెలలు పూర్తయిన తర్వాత జరగబోతున్న తొలి విస్తరణ కావడంతో ఇటు బీజేపీతోపాటు మిత్రపక్షాలైన శివసేన, ఇతర పార్టీ ఎమ్మెల్యేల్లో ఆశలు గుబాళిస్తున్నాయి. ప్రస్తుతం మహా కేబినెట్ లో 14 ఖాళీలున్నాయి. జులై 18 నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 10న సీఎం ఫడ్నవిస్ నాలుగు రోజుల రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారమే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నిర్వహిస్తోన్న 10 శాఖల్లో కొన్ని, భూ అక్రమాల ఆరోపణలతో రాజీనామా చేసిన రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే స్థానాన్ని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు మహా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొత్త మంత్రి వర్గంలో బీజేపీకి కీలక మిత్రపక్షమైన శివసేనకు చెందిన ముగ్గురికి మంత్రి పదవులు దక్కనున్నాయి. స్వాభిమాని పక్ష పార్టీ రాష్ట్రీయ సమాజ్ ప్రకాశ పార్టీలకు తలో పదవి లభించనున్నట్లు సమాచారం. మిగిలిన పదవులను దక్కించుకునే బీజేపీ ఎమ్మెల్యేల్లో అదృష్టవంతులెవరో రేపు తేలిపోనుంది. -
మహా దుర్భిక్షం: రైళ్ల ద్వారా మంచినీటి సరఫరా
తినడానికి గింజలులేవు.. కనీసం తాగటానికి మంచినీళ్లు కూడా దొరకటంలేదు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో ఇళ్లకు వచ్చిన పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. పరిస్థితి విషమించి ఆసుపత్రులకు తీసుకెళితే డాక్టర్లు సైతం చేతులెత్తేసే పరిస్థితి. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క ఆసుపత్రిలోనూ నీళ్లు లేవు. అత్యవసర ఆపరేషన్లను సైతం వైద్యులు వాయిదావేస్తున్నారు. గడిచిన 100 ఏళ్లలో తీవ్ర దుర్భిక్షంగా భావిస్తోన్న మహారాష్ట్ర కరువుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవి. వాస్తవ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలకు మంచినీరు అందించేందుకు బృహత్ కార్యక్రమం చేపట్టింది మహారాష్ట్ర సర్కారు. రాజస్థాన్ లోని ఒక డ్యామ్ నుంచి రైలుద్వారా నీళ్లను తరలించేందుకు భారీ సన్నాహాలు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా నీటి రవాణాకు వినియోగించే 60 బోగీల(ట్యాంకుల) రైలును ఏర్పాటుచేశారు రైల్వే అధికారులు. రాజస్థాన్ లోని మిరాజ్ డ్యామ్ నీళ్లను మోటార్ల ద్వారా ట్యాంకుల్లో నింపి కరువు కేంద్రం లాతూర్ పట్టణానికి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే డ్యామ్ నుంచి నీళ్లను నింపటం ఆసత్యమవుతున్నందున తొలి విడతగా 10 బోగీ(ట్యాంకు)లతో కూడిన రైలు ఆదివారం సాయంత్రం లాతూర్ కు బయలుదేరింది. శుక్రవారంలోగా మిగిలిన 50 బోగీల నీటిని కూడా తరలిస్తామని అధికారులు చెప్పారు. రైలు ద్వారా మొత్తం 5 లక్షల లీటర్ల నీటిని కరువు ప్రాంతానికి చేరవేయనున్నారు. మరాఠ్వాడాలోని అన్ని జిల్లాలతోపాటు విదర్భలోని కొన్ని జిల్లాలు తీవ్రదుర్భిక్షాన్ని ఎదుర్కుంటున్నాయి. ఆ ప్రాంతంలోని 11 భారీ జలాశయాలన్నీ ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. ఇటు ముంబైలోనూ నీటి ఎద్దడి కొనసాగుతోంది. ఏప్రిల్ మొదటివారానికే పరిస్థితి ఇలా ఉంటే ఇక మే నెలలో అధికం కానున్న ఎండలకు ఎలా తట్టుకోవాలా? అని జనం బెంబేలెత్తిపోతున్నారు. -
ఐపీఎల్ మ్యాచ్ లకు నీళ్లివ్వం: సీఎం ఫడ్నవిస్
ముంబై: ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న తీవ్ర కరువు.. గడిచిన వందేళ్లలో కనీవినీ ఎరుగనిది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్ లకు నీటి సరఫరా విషయమై కొద్ది కాలంగా నెలకొన్న సందిగ్ధతకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం తరఫును ముక్తాయింపునిచ్చారు. శుక్రవారం ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన ఐపీఎల్ మ్యాచ్ లకు చుక్కనీరు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. 'ఐపీఎల్ మ్యాచ్ లకు మా ప్రభుత్వం నీళ్లిచ్చేదిలేదు. ఇదే వాదనను హైకోర్టులోనూ బలంగా వినిపించాం. నీళ్లివ్వని కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లు మహారాష్ట్ర నుంచి తరలిపోతే మాకేమీ అభ్యంతరం లేదు' అని సీఎం ఫడ్నవిస్ పేర్కొన్నారు. తీవ్రదుర్భిక్షంలో ఐపీఎల్ మ్యాచ్ ల కోసం నీటిని వృధా చేయరాదని, మ్యాచ్ లను తరలించేలా ఆదేశాలు జారీచేయాలని బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. పిల్ ను విచారించిన కోర్టు.. శనివారం ముంబైలో జరగాల్సిన మొదటి మ్యాచ్ కు మాత్రం అనుమతి మంజూరుచేస్తూ మిగతా మ్యాచ్ ల వ్యవహారంపై వాదనలను ఈ నెల 12కు వాయిదావేసింది.ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ముంబై, పుణె, నాగ్పూర్ల్లో 19 మ్యాచ్‌లు జరగాల్సివుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు ఈ నెల 9న ఆరంభమవుతాయి. -
ఆత్మహత్యలకు పాల్పడొద్దు
సాక్షి, ముంబై : కరువు ప్రాంతాల్లో పర్యటనలో భాగం గా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరఠ్వాడలోని లాతూర్ జిల్లాలో పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం ఉస్మానాబాద్ జిల్లాకు చేరుకున్నా రు. అక్కడ రైతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లాలోని కరువు పరిస్థితులు, పంటల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్థికంగా రైతులను ప్రభుత్వం ఆదుకుం టుందని ఆయన హామీ ఇచ్చారు. ఆయన పర్యటన నేపథ్యంలో అక్కడక్కడా కరువును ఎలా ఎదుర్కోవాలో తెలియజేసే స్టాళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే సీఎం పర్యటన ముగిసిన తర్వాత స్టాళ్లను ఎత్తివేయడం గమనార్హం. దీంతో రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు ప్రాంతాలా.. పర్యాటక స్థలాలా..? మరఠ్వాడాలోని కరువు ప్రాంతాలు రాజకీయ నాయకులకు పర్యాటక ప్రాంతాలుగా మారినట్లుగా కన్పిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడి కరువు ప్రాంతాలను ఎన్సీపీ అధినేత శరత్ పవార్ పర్యటించారు. అప్పటి నుంచి ఇక్కడి కరువు ప్రాంతాలను మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు క్యూ కట్టారు. వీరి పర్యటనల వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో కూడా ఎటువంటి మేలు జరగకపోతే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని మాజల్గావ్ పరిధిలోని కొందరు రైతుల నిర్ణయించుకున్నారు. సీఎం రాకతో తమకు ఏదైనా మేలు జరుగుతుందనే గంపెడు ఆశలో ఇక్కడి రైతులు ఎదురుచూస్తున్నారు. -
పీడబ్ల్యూడీ అధికారులపై కొరడా!
22 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం సాక్షి, ముంబై : ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ)లో కాంట్రాక్టర్లలో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసకుంది. క్వాలిటీ కంట్రోల్ బోర్డు (నాణ్యత నియంత్రణ మండలి)కి తప్పుడు పత్రాలు సమర్పించి ఉత్తర ముంబై ప్రజా పనులు శాఖ (పీడబ్ల్యూడీ)లో అక్రమాలకు పాల్పడిన 22 మంది ఇంజనీర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులను ఆదేశించారు. కాగా, 19 మంది కాంట్రాక్టర్లను కూడా బ్లాక్ లిస్ట్‌లో చేర్చి వారికి ప్రభుత్వ సంబంధిత పనులు అప్పగించరాదని సూచించారు. ఒకేసారి 22 మంది ఇంజనీర్లపై వేటు వేయడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. ఇదీ జరిగింది... అంధేరీ వార్డు పరిధిలోని సంబంధిత ఇంజనీర్లు మాత్రం ఎలాంటి తనిఖీలు చేయకుండానే పనులు నాణ్యంగా జరుగుతున్నట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి సదరు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయించారు. కాగా, ఉత్తర ముంబై కార్యాలయంలో మంజూరు చేసిన బిల్లుల్లో అవకతవకలున్నాయని, వీటిని తిరిగి పరిశీలించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో నాగ్‌పూర్‌లోని కాగ్ కార్యాలయం అధికారులను ఆదేశించింది. దీంతో తనిఖీలు చేపట్టిన అధికార బృందానికి ఆశ్చర్యకరమైన నిజాలు తెలిశాయి. దాదాపు 22 మంది ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బిల్లులు మంజూరు చేయించారని వెల్లడైంది. ఈ తతంగంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు బయటపడింది. -
దబోల్కర్ హత్యకు రెండేళ్లు
♦ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కేసు పరిస్థితి ♦ నిరసనగా ర్యాలీ చేపట్టిన దబోల్కర్ కుమార్తె ♦ దర్యాప్తు వేగవంతం చేసేందుకు మరో బృందాన్ని ఏర్పాటు చేసిన సీఎం పింప్రి : అంధశ్రద్ధ నిర్మూలన సమితి సంస్థాపక కార్యాధ్యక్షులు డాక్టర్ నరేంద్ర దబోల్కర్ హత్య జరిగి రెండు ఏళ్లు పూర్తయ్యాయి. 2013 ఆగస్ట్ 20న ఆగంతకుల చేతిలో దాబోల్కర్ హత్యకు గురయ్యారు. ఇప్పటికీ హంతకులను పట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ గురువారం సతారా జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. దబోల్కర్ హత్యకు గురైన ప్రాంతంలో సరిగ్గా అదే సమయంలో ఉదయం 7.55 నిమిషాలకు దబోల్కర్ కూతురు ముక్తా దబోల్కర్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభమైంది. హంతకులను వెంటనే పట్టుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అమాయక ప్రజలను మోసగిస్తున్న బ్లాక్ మాజిక్కు వ్యతిరేకంగా నరేంద్ర దబోల్కర్ ఉద్యమం లేవనెత్తారు. బ్లాక్ మ్యాజిక్ ద్వారా మోసం చేస్తున్న వారి నుంచి ప్రజలను రక్షించేందుకు సమితి కార్యకర్తలను 17 బృందాలుగా చేసి దేశ వ్యాప్తంగా 335 గ్రామాల్లో అంధశ్రద్ధ నిర్మూలనకు కోసం జనజాగృతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారో ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో పుణేలోని ఓంకారేశ్వర్ దేవాలయం వద్ద మహర్షి ఖండే బ్రిడ్జిపై మార్నింగ్ వాకింగ్ చేసి వస్తుండగా మోటార్ సైకిల్‌పై వచ్చిన ఆగంతకులు దబోల్కర్పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన మరణానంతరం ఈ రెండేళ్ల కాలంలో దబోల్కర్ ఆలోచనలు రాష్ర్టవ్యాప్తంగా కార్యరూపం దాల్చాయి. రాష్ట్రంలో అంధశ్రద్ధ నిర్మూలన శాఖలు సుమారు 300లకు పైగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో బ్లాక్ మాజిక్కు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం రూపొందించడంతో దేశ వ్యాప్తంగా ఇదే చట్టాన్ని అమలు చేయాలని అనేక రాష్ట్రాలు ముందుకొచ్చాయి. కర్నాటక, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో ఇప్పటికే చట్టం అమలులోకి వచ్చింది. దర్యాప్తునకు ఏడుగురు సభ్యులతో బృందం ఏర్పాటు దబోల్కర్ హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సీబీఐకి తోడుగా ఏడుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం వెల్లడించారు. దబోల్కర్ హత్యకు గురై గురువారంతో రెండేళ్లు పూర్తికావస్తోంది. దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. దీంతో వీరికి సాయంగా ఏర్పాటు చేసిన బృందంలో ఒక అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్, నలుగురు పోలీసు అధికారులు, ఇద్దరు సహాయక అధికారులు ఉంటారు. ఇందులో పుణేకి చెందిన అసిస్టెంట్ పోలీసు కమిషనర్ జీ.ఎస్.మడ్గుల్కర్, పోలీసు ఇన్స్పెక్టర్ దిన్కర్ కదం, అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్ సుభాష్ చవాన్, నాగపూర్‌కు చెందిన పోలీసు ఇన్స్పెక్టర్ సతీశ్ దేవరే, యవత్మాల్కు చెందిన పోలీసు ఇన్స్పెక్టర్ చంద్రకాంత్ ఘోడ్కే తదితరులు ఉన్నారు. తమకు తగినంత మానవ వనరులు లేవని, కొంతమంది అధికారులను తమకు సాయంగా అందజేయాలని సీబీఐ కోరడంతో ఫడ్నవీస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి
ముంబై : మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా జరుపుకునే సద్భావానా దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సద్భావానా ప్రతిజ్ఞ చేయించగా, గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు.. రాజ్‌భవన్ కార్యాలయ సిబ్బంది, పోలీసు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కూపరాగే గ్రౌండ్లో ప్రతిఏటా జరిగే కార్యక్రమానికి ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ గురుదాస్ కామత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు, మహిళా శాఖ కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు భారీ సంఖ్యలో చేరుకుని రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విధాన సభలో ప్రతిపక్షనేత రాధాకృష్ణ విఖే పాటిల్ తన కార్యాలయంలో, పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం తిలక్ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సద్భావనా దివాస్ జరుపుకున్నారు. కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు రాజీవ్ జయంతి సందర్బంగా కాంగ్రెస్ వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముంబై కాంగ్రెస్ (ఎంఆర్సీసీ) అధ్యక్షుడు సంజయ్ బలప్రదర్శన చేయడం శోచనీయమంటూ కొందరు నేతలు బాహాటంగానే విమర్శించగా, వీధుల్లో తిరిగే వాళ్లను వెల్లగొట్టాలంటూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కామత్ ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ 71 జయంతి సందర్భంగా కూపరాగే గ్రౌండ్‌లోని రాజీవ్ విగ్రహం వద్దకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ గురుదాస్ కామత్, నేతలు, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు, మహిళా శాఖ కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అయితే ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు (ఎంఆర్సీసీ) సంజయ్ నిరుపమ్ మాత్రం మహాలక్ష్మి రేస్‌కోర్స్ నుంచి కూపరాగే గ్రౌండ్ వరకు సద్భావనా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ సీనియర్ నేతలు కృపాశంకర్ సింగ్, భాయ్ జగ్తాప్, అమిన్ పటేల్, వర్షా గైక్వాడ్, మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్ పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై మండిపడ్డ నగరానికి చెందిన ఓ నేత మాట్లాడుతూ, ‘రాజీవ్ జయంతి రోజు సంజయ్ నిరుపమ్ బలప్రదర్శన చేయడం శోచనీయం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలంతా ఉదయం 9 గంటలకే కూపరాగే గౌండ్‌కు చేరుకోవడం గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ. కానీ ఈ సందర్భాన్ని బలప్రదర్శన చేయడానికి నిరు పం ఉపయోగించుకున్నారు’ అని విమర్శించా రు. కార్యక్రమానికి మాజీ ఎంపీలు మిలింద్ డియోరా, ప్రియా దత్ గైర్హాజరయ్యారు. అంతకుముందు మాట్లాడిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గురుదాస్ కామత్ , ముంబై నుంచి హ్యాకర్ల (వీధుల వెంట తిరిగే అమ్ముకునే వాళ్లు)ను తరిమికొట్టాలని పరోక్షంగా సంజయ్ నిరుపమ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. నిరుపం కూపరాగే వద్దకు రాకపోవడంపై స్పందించిన కామత్, ఎవరో రాకపోతే కాంగ్రెస్‌కు వచ్చిన ముప్పేమీ లేదని, కాంగ్రెస్ విలువలు, మనోభావాలకు వచ్చిన నష్టం లేదని పేర్కొన్నారు. ఇటీవల బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ అజోయ్ మెహతాను కలసిన సంజయ్ నిరుపం, వీధుల వెంట తిరిగి అమ్ముకునే వాళ్లను ముంబై నుంచి పంపేయాలని ఆదేశిస్తూ కార్పొరేషన్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన గవర్నర్ దేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు రాజ్‌భవన్ సిబ్బంది, అధికారులతో సద్భావనా దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్‌భవన్ సిబ్బంది, ప్రజాపనుల శాఖ సిబ్బంది, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు, ముంబై పోలీసులతో గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిం చారు. ‘కుల, మత, భాష, ప్రాంతాలతో సం బంధం లేకుండా దేశ ప్రజలందరి కోసం సహభావంతో పని చేస్తాం’ అని ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి బీ వేణుగోపాల్ రెడ్డి, ఉప కార్యదర్శి పరిమళ్ సింగ్ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని (ఆగస్టు 20) ‘సద్భాభావన దివాస్’గా ప్రతి ఏడు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. -
రాష్ట్రానికి రూ.20 వేల కోట్లు నష్టం
జీఎస్టీ బిల్లు పాసవకపోతే నష్టమొస్తుందన్న సీఎం కాంగ్రెస్ కారణంగానే బిల్లు పాస్ కాలేదు ఆ పార్టీ తీరుకు నిరసనగా ఈ నెల 16న ఆందోళనలు ముంబై : వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా జీఎస్టీ అమలులోకి రాకపోతే రాష్ట్రం రూ.20 వేల కోట్లకుపైగా నష్టపోవాల్సి వస్తుందని సీఎం దేవేంద్ర పడ్నవీస్ వెల్లడించారు. పార్లమెంటులో జీఎస్టీ బిల్లుపై చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుండటంపై మండిపడ్డారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటూ జాతి ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ తీరుకు నిరసనగా ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల ఘోరపరాజయం నుంచి ఇంకా ఆ పార్టీ కోలుకోలేదని, గాంధీ కుటుంబ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. జీఎస్టీ బిల్లును అడ్డుకోవడం ద్వారా దేశ ప్రజల దృష్టిని కాంగ్రెస్ ఆకర్షించగలదా అని ప్రశ్నించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని తీసుకొచ్చిందని, ఆర్థిక పురోగతికి బీజం వేసిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి ఆ ఘనత దక్కకూడదనే కాంగ్రెస్ ఇలా ప్రతి విషయంలోనూ అడ్డుతగులుతోందని అన్నారు. 2016 ఏప్రిల్ 1 నాటికి జీఎస్టీ బిల్లు అమలు కాకుండా పార్లమెంటు సమావేశాలు సాగనీయడం లేదని ఆరోపించారు. దేశం మెత్తం మీద రూ. 2 లక్షల కోట్లు, రాష్ట్రంలో రూ. 20 వేల కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఒక్క కారణం కూడా లేకుండానే కాంగ్రెస్ సమావేశాలను అడ్డుకుందని మండిపడ్డారు. -
సూచన ఇవ్వండి.. బహుమతి పట్టండి
సాక్షి, ముంబై : ప్రభుత్వ ఖజానా ఆదాయాన్ని పెంచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను ఆర్థిక శాఖ కోరింది. అత్యుత్తమ సలహాలు, సూచనలు ఇచ్చిన వారిక మొదటి బహుమతిగా రూ. 10 లక్షలు, రెండో బహుమతిగా రూ.6.50 లక్షలు నగదు పారితోషకం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఒక్కో మంచి సలహాకు రూ.లక్ష చొప్పున 25 మందికి పారితోషికాలు అందజేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన రూపొందించిన ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపించింది. ఆయన నుంచి ఆమోదం లభించగానే దీనిపై అధికారకంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కరవు తాండవించడం, మరికొన్ని చోట్ల భారీ వర్షాల వల్ల వరదలు రావడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం, రూ.3 లక్షల కోట్ల వరకు ఉన్న రైతుల రుణాలు, వాటి వడ్డీ మాఫీ వంటివి రూ. లక్షల కోట్లలో చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై భారీ స్థాయిలో అదనపు భారం పడుతోంది. వివిధ శాఖల నుంచి పన్ను రూపంలో సమకూరుతున్న ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంది. అది ఏ మూలకూ సరిపోవడం లేదు. అలాగే పెరుగుతున్న పరిపాలన విభాగం ఖర్చుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతింటోంది. దీంతో ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఉన్నతస్థాయి సమితిని నియమించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అయతే అంతకు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల నుంచి సలహాలు, సూచనలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.3,85,000 కోట్లకు ైపైగా అప్పు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే ఆదాయం తగ్గిపోతుండటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. ఫలితంగా చాలా వరకు అభివృద్ధి పనులకు కత్తెరేయాల్సిన దుస్థితి నెలకొంది. -
రుణమాఫీ చేయాల్సిందే
♦ అప్పటి వరకూ ఆందోళనే: కాంగ్రెస్ ♦ సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపాటు ముంబై : రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసేవరకు సభ లోపల, బయట ఆందోళన కొనసాగుతుందని శాసనమండలిలో కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. విదర్భ, మరాఠ్వాడా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సభలో సీఎం ప్రసంగం ఉందని నిప్పులు చెరిగింది. అనంతరం సీఎం మాట్లాడుతూ, రైతులు రుణాల నుంచి విముక్తి కలిగించాలంటే కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇందుకోసం తీసుకున్న ప్రమాణాలు చదివి వినిపించారు. గత 15 ఏళ్లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీలు కో ఆపరేటివ్ బ్యాంకులను అవినీతి మయం చేశాయని, నిధుల్ని పందికొక్కుల్లా తినేశాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీఎం వ్యాఖ్యలపై మండలిలో దుమారం రేగింది. సభ్యులంతా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో చైర్మన్ రామ్‌రాజే నింబకర్ సభను బుధవారానికి వాయిదావేశారు. రైతు సమస్యలను సీఎం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మాణిక్ రావ్ ఠాక్రే ఆరోపించారు. ప్రమాద బాధితులకు రూ. 10 లక్షల పరిహారం ప్రభుత్వ బస్సు ప్రమాద బాధితులకు నష్ట పరిహారాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రావుతే మంగళవారం వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంఎస్ఆర్టీసీకి చెందిన ప్రమాదాల్లో మృతిచెందిన వారి కుటుంబీకులకు రూ. 3 లక్షల పరిహారం ఇస్తున్నామని చెప్పారు. కాగా, గత నెల ధూలే-చాలిస్గావ్ రోడ్డుపై చాలిస్గావ్-సూరత్ బస్సు, కంటైనర్ ఢీ కొన్న ఘటనలో 22 మంది మృతి చెందగా, 35 మంది గాయపడ్డారని కాంగ్రెస్ నేత కునాల్ పాటిల్ పేర్కొన్నారు. ధూలే-చాలిస్గావ్ రహదారిపై డివైడర్లు ఏర్పాటు చేయలేదని మంత్రి చెప్పారు. స్థానికులు ఈ విషయమై పోరాడుతున్నారని అన్నారు. దీనిపై రావుతే స్పందిస్తూ.. దూలే-చాలిస్గావ్ రోడ్డు ఎన్‌హెచ్-11లో భాగమని, రోడ్డు విషయమై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ‘మైనార్టీ’ ఉపకార వేతనాల ఆదాయ పరిమితి పెంపు మైనార్టీ విద్యార్థుల ఉపకారవేతనానికి సంబంధించి ఆదాయ పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న రూ. రెండున్నర లక్షల పరిమితిని రూ. 5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మైనార్టీ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే మంగళవారం అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం 40,000 మంది విద్యార్థులు ఏడాదికి రూ. 25,000 ఉపకారవేతనాలు పొందుతున్నారని, ప్రభుత్వ ప్రస్తుత నిర్ణయంతో ఎక్కుమ మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని మంత్రి చెప్పారు. -
స్వైన్‌ఫ్లూ చికిత్స ఖర్చునుపభుత్వమే భరిస్తుంది: సీఎం
- ఆదివారం ఒక్కరోజే 12 మంది మృతి - ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామన్న సీఎం ఫడ్నవీస్ ముంబై: స్వైన్‌ఫ్లూకు ఉచితంగా చికిత్స అందించాలని రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. వ్యాధి బారిన పడి ఆదివారం ఒక్కరోజే 12 మంది మృతి చెందారు. దీంతో ఫ్లూతో మృతి చెందిన వారి సంఖ్య 143కు చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ రోజరోజుకీ తీవ్రమవుతుండటంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని, ఫ్లూ లక్షణాలున్న వారిని వెంటనే ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశామని సీఎం తెలిపారు. చికిత్స నుంచి పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందన్నారు. నాగ్‌పూర్, పుణే ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత తగ్గుతోందని, లాథూర్ ప్రాంతంలో ఎక్కువవుతోందని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఫ్లూ విజృంభనపై ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న పదిహేను రోజులు తమకు చాలెంజ్‌తో కూడుకున్నవని, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి స్వతహాగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలకు స్పందించిన సీఎం ప్రభుత్వంపై విమర్శలు మానుకుని సహాయ సహకారాలు అందించాలని, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ‘స్వైన్‌ఫ్లూ మహారాష్ట్రకే పరిమితం కాలేదు. మొత్తం దేశ వ్యాప్తంగా ప్రజలు ఆ వైరస్ వల్ల బాధలు పడుతున్నారు. అన్ని చోట్ల ఇది తీవ్రంగా ఉంది. ఆరోగ్య శాఖ మంత్రి నేను సాధ్యమైనంత మేర పనిచేస్తున్నాం. ఇలాంటి సమయంలోనే ప్రతిపక్షం సహాయం కావాలి. పొరపాట్లు ఎక్కడున్నాయో చెబితే వాటిని సరిదిద్దుకుంటాం’ అని ఆయన అన్నారు. ఆరోగ్య మంత్రి రాజీనామా చేయాలి: పాటిల్ ‘స్వైన్‌ఫ్లూ బారిన పడి ప్రజలు మృత్యువాత పడుతుంటే ఆరోగ్య శాఖ మంత్రి ముంబైలో కూర్చున్నాడు. అధికారులు కార్యాలయాల్లో ఈగలు జోపుకుంటున్నారు. ఫ్లూ మందుల ధరలు సామాన్యుడికి అందనంత స్థాయికి చేరిపోయాయి. ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పత్రికల్లో కానీ, టీవీల్లో కానీ ప్రభుత్వం ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. విపత్తు నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని ప్రతిపక్ష నేత పాటిల్ విమర్శించారు. ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకోవాలంటే ఇంకా ఎన్ని చావులు చూడాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు.