కలకలం రేపిన రైతు సూసైడ్ నోట్
పుణే: మహారాష్ట్రలో రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో సోలాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య కలకలం రేపింది. ఆయన రాసిన సూసైడ్ నోట్ రైతు ఆగ్రహంపై మరింత అగ్గి రాజేసింది. రైతులకు రుణ మాఫీ తదితర డిమాండ్లను నెరవేర్చేవరకు తన శరీరం దహనం చేయరాదని ఆత్మహత్య చేసుకున్న రైతు నోట్ రాసి మరీ తన ప్రాణాలను తీసుకోవడం మరింత ఆందోళనకు తావిచ్చింది.
గురువారం ఉదయం సోలాపూర్ కలెక్టర్ రాజేంద్ర భోంస్లే రైతు ఆత్మహత్య ఉదంతాన్ని ధృవీకరించారు. బుధవారం రాత్రి కర్మాళి తాలూకాలోని వీట్ గ్రామంలో ధనజీ చంద్రకాంత్ జాధవ్ (45) అనే రైతు తన ఇంటికి సమీపంలో చెట్టు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముఖ‍్యమంత్రి సందర్శించేంతవరకు తన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించవద్దంటూ తన ఆత్మహత్య నోట్ లో పేర్కొన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతు సంఘాలు 'రాస్తా-రోకో' నిర్వహించి, బంద్‌కు పిలుపునిచ్చాయి.
నేను రైతును. నా పేరు ధనజీ చంద్రకాంత్ జాధవ్.ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దయచేసి నా మృతదేహాన్ని గ్రామానికి తరలించకండి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన గ్రామానికి వచ్చేంతవరకు అంత్యక్రియలు నిర్వహించవద్దంటూ . ధనజీ తన లేఖలో పేర్కొన్నారు. దీంతో రైతు రుణమాఫీ ప్రకటించేంతవరకు మృతదేహాన్ని తరలించేందిలేదని రైతులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు.
అయితే ఇప్పటికే ధనజీ గ్రామాన్ని సందర్శించినట్టు సోలాపూర్ కలెక్టర్ చెప్పారు. రాష్ట్ర మంత్రి విజరు దేశ్ముఖ్ గురువారం గ్రామానికి వెళ్లారు. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. కాగా మృతునికి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2.5 ఎకరాల సాగు భూమిపై రూ. 60,000 రుణం తీసుకున్నాట్టు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని దాదాపు 33 రైతు సంఘాలు జూన్ నెల 1వ తేదీ నుంచి వారు నిరవధిక సమ్మె చేస్తున్నాయి. రాష్ట్రంలోని ముంబై, పూణె నగరాలు సహా మొత్తం 20 జిల్లాలకు కూరగాయలు, పండ్లు, పాల రవాణాను రైతులు ఆపేసి సమ్మె చేపట్టారు ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున పాలను, ఉల్లిపాయలను రోడ్లపై పారబోసి మరీ తీవ్ర ఆందోళనకు దిగారు. స్వామి నాథన్ కమిషన్ సిఫారసు అమలు, కనీస మద్దతుధర, రుణాలు మాఫీ , ఫించన్ తదితర డిమాండ్లతో రైతులు పోరాటానికి దిగారు. ఈ ఉద‍్యమానికి ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.