ముంబై: జియా ఖాన్ మృతి కేసులో ముంబై సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. సూరజ్ వల్లే జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాల లేనందునా.. అతన్ని నిర్దోషిగా తేలుస్తూ విడుదల చేస్తున్నట్లు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ పేర్కొన్నారు.
దీంతో పదేళ్ల కిందటి నాటి ఈ కేసులో జియాఖాన్‌కు న్యాయం జరుగుతుందని భావించిన వాళ్లంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పును జియాఖాన్ తల్లి రబియా సవాల్ చేసే అవకాశం ఉంది.
జియా ఖాన్ నేపథ్యం.. కేసు వివరాలు
👉 న్యూయార్క్‌లో పుట్టి పెరిగి.. ఇంగ్లీష్-అమెరికన్ నటిగా పేరు సంపాదించుకుంది నఫిసా రిజ్వి ఖాన్ అలియాస్ జియాఖాన్.
👉 బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘నిశబ్ద్’తో బాలీవుడ్‌లో లాంచ్ అయిన జియా.. చేసింది మూడు చిత్రాలే అయినా సెన్సేషన్‌గా మారింది.
👉 నిశబ్ద్‌తో పాటు అమీర్ ఖాన్ గజిని, హౌజ్‌ఫుల్ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించింది జియాఖాన్. అయితే..
👉 2013, జూన్ 3వ తేదీన ముంబై జూహూలోని తన ఇంట్లో జియాఖాన్(25) విగతజీవిగా కనిపించింది.
👉 ఘటనా స్థలంలో దొరికిన ఆరు పేజీల లేఖ ఆధారంగా.. జూన్ 10వ తేదీన ముంబై పోలీసులు నటుడు సూరజ్ పంచోలిని ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగంతో(ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం) అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు.
👉 ఆదిత్యా పంచోలీ తనయుడైన సూరజ్ పంచోలీ, జియాతో డేటింగ్ చేశాడనే ప్రచారం ఉంది. 2012 సెప్టెంబర్ నుంచి వాళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు.
👉 అయితే.. జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ మాత్రం తన కూతురిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని వాదిస్తోందామె.
👉 జియాను శారీరకంగా, మానసికంగా సూరజ్ హింసించాడని, ఫలితంగా నరకం అనుభవించిన తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిపింది.
👉 2013 అక్టోబర్‌లో రబియా, జియాఖాన్ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన కోర్టు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
👉 2014 జులైలో.. మహరాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐ కేసును టేకప్ చేసింది.
👉 సూరజ్ పాంచోలీ బలవంతంగా తన కూతురితో సంబంధం పెట్టుకున్నాడనేది రబియా ఆరోపణ. అంతేకాదు.. పోలీసులు, సీబీఐ ఈ కేసులో లీగల్ ఎవిడెన్స్‌ను సేకరించలేదన్నది ఆమె ఆరోపణ.
👉 సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేయడంతో.. విచారణ తమ పరిధిలోకి రాదని పేర్కొంటూ కేసును 2021లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానికి బదిలీ చేసింది ముంబై సెషన్స్ కోర్టు.
👉 అయితే సూరజ్ మాత్రం తాను అమాయకుడినని, జియా మరణంతో సంబంధం లేదని వాదిస్తున్నాడు.
👉 ఈ కేసులో 22 మంది సాక్ష్యులను ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టింది.
గత వారం ముంబై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(శుక్రవారం, ఏప్రిల్ 28న) తీర్పు వెల్లడించనున్నట్లు సీబీఐ న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ స్పష్టం చేశారు. తీర్పు నేపథ్యంలో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చివరికి.. సాక్ష్యాధారాలు లేనందున కోర్టు పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది.
ఇదీ చదవండి: 26 రోజులు నరకం చూశా: నటి
Comments
Please login to add a commentAdd a comment