CBI Special Court
-
ఆరోపణ రుజువైతే సందీప్ ఘోష్‌కు మరణశిక్ష!
కోల్‌కతా ఆర్జీ కర్ ఘటనలో.. కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు భారీ షాకిచ్చింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. బెయిల్ నిరాకరించడంతో పాటు నేరం గనుక రుజువైతే మరణశిక్ష తప్పదని స్పష్టం చేసింది. ఆగష్టు 9వ తేదీన ఆర్జీ కర్ ఆస్పత్రి సెమినార్ హాల్లో యువ వైద్యురాలిపై అత్యాచారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని సందీప్ ఘోష్‌పై ఆరోపణలు ఉన్నాయి. అలాగే.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని తలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మోందాల్పై అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. ఘటన వెలుగుచూసిన అనంతరం ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే ఉన్నారని, ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో మండల్‌కు సందీప్ సూచనలు చేసినట్లు కోర్టులో సీబీఐ వెల్లడించింది. ఇద్దరూ కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపడం, కప్పి పుచ్చేందుకు యత్నించడం వంటివి చేశారని ఆరోపిస్తూ.. అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరూ బెయిల్ కోసం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని(సీల్దా కోర్టు కాంప్లెక్స్) ఆశ్రయించారు. కేసులో తన క్లయింట్ ఎలాంటి నేరానికి పాల్పడలేదని.. తప్పుడు ఉద్దేశంతో ఈ కేసులో ఇరికించారని ఘోష్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే.. కోర్టు మాత్రం బెయిల్ అభ్యర్థతను తోసిపుచ్చింది. ‘‘సందీప్ ఘోష్‌పై ఉన్న నేరారోపణ తీవ్రమైంది. ఈ కేసులో ఆయన్ని బెయిల్‌పై విడుదల చేయడం న్యాయపరంగా వీలు కాదు. ఒకవేళ ఆయనపై ఆరోపణ రుజువైతే గనుక.. అత్యంత అరుదైన కేసుగా భావించి మరణశిక్ష విధించాల్సి వస్తుంది’’ అని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్ డే వ్యాఖ్యానించారు. అలాగే.. అభిజిత్ మోందాల్ బెయిల్ పిటిషన్‌ను సైతం కోర్టు తోసిపుచ్చింది. ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. నిందితుల కస్టడీ కోరింది. దీంతో సెప్టెంబర్ 30వ తేదీదాకా కస్టడీకి అనుమతించింది కోర్టు.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. ఆర్జీ కర్ వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్టయ్యాక మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. ఘోష్ అవినీతి వ్యవహారం బయటపడటంతో పాటు.. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. మరోపక్క, ఘోష్.. పాలిగ్రాఫ్ పరీక్ష, లేయర్డ్ వాయిస్ అనాలసిస్‌లో కీలక ప్రశ్నలకు మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్లు తేలింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL).. ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. ఇక..ఆయనపై నమోదైన నేరారోపణల దృష్ట్యా.. ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దయింది.కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థి విగత జీవిగా కనిపించి ఉండటాన్ని గుర్తించారు. తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ.. హత్యాచారమని దర్యాప్తులో తేలింది. వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌రాయ్‌ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు. -
జులై 3దాకా తీహార్ జైల్లోనే కవిత!
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది స్పెషల్ కోర్టు. ఈడీ కేసులో జులై 3వ తేదీదాకా కస్టడీ పొడిగిస్తున్నట్లు సోమవారం ఉదయం ఆదేశాలిచ్చింది. దీంతో బెయిల్ వచ్చేదాకా ఆమె తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.లిక్కర్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో ఈ ఉదయం స్పెషల్ కోర్టుకు తీసుకొచ్చారు తీహార్ జైలు అధికారులు. ఈ సందర్భంగా కవితపై దాఖలైన ఈడీ చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఆ అభియోగ పత్రాలను కవిత తరఫు న్యాయవాదికి అందజేసింది. ఆ వెంటనే ఈడీ కేసులో కస్టడీని మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు జడ్జి కావేరీ బవేజా వెల్లడించారు. ఇక.. కోర్టుకు వచ్చిన కవితను భర్త అనిల్, ఇద్దరు కొడుకులను కలిసేందుకు అనుమతిచ్చారు స్పెషల్ కోర్టు జడ్జి. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. కవితపై ఈడీ చార్జ్‌షీట్‌లో కీలక అంశాలులిక్కర్ కేసులో కవిత పై ఈడీ అభియోగాలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ కోర్టుఈడి మనీలాండరింగ్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చిన స్పెషల్ కోర్టురూ. 1100 కోట్ల నేరం జరిగిందని చార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఈడీరూ. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందింది100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారుకవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్న ఈడీసీబీఐ కేసులోనూ కస్టడీ పొడిగింపుమరొకవైపు సీబీఐ కేసులో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు. సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 7 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ క్రమంలో కవిత పై చార్జ్ షీట్‌ను జూన్ 7న సీబీఐ దాఖలు చేయనుంది. సీబీఐ కేసులో భాగంగా నేటి మధ్యాహ్నం కవితను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు జైలు అధికారులు. -
Delhi liquor scam: మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సీబీఐ ప్రత్యేక కోర్టు జ్యుడీíÙయల్ కస్టడీకి పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులు ఆయన్ను శనివారం ఢిల్లీ లోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. ఈనెల 18వ తేదీ వరకు జ్యుడీíÙయల్ కస్ట డినీ పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మనీశ్ సిసోడియా జైలులోనే ఉన్నారు. -
హత్య కేసులో చోటా రాజన్‌కు ఊరట
ముంబై: ట్రేడ్ యూనియన్ లీడర్ దత్తా సామంత్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌ను నిరపరాధిగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 1997లో జరిగిన ఈ హత్యకు చోటా రాజన్ కుట్ర పన్నాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు వెల్లడించింది. సామంత్ తన జీపులో పంత్ నగర్ నుంచి ఘట్కోపర్ వెళుతుండగా మోటార్‌బైక్‌పై వచి్చన దుండగులు ఆయనపై 17 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో సామంత్ అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య వెనుక చోటా రాజన్ హస్తం ఉందంటూ ప్రాసిక్యూషన్ కేసు నమోదు చేసింది. అయితే అందుకు గల సాక్ష్యాధారాలను సమరి్పంచడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ప్రత్యేక న్యాయమూర్తి బి.డి.షెల్కె రాజన్‌కు కేసు నుంచి విముక్తి కలి్పంచారు. అతనిపై మరిన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో విడుదలయ్యే అవకాశాల్లేవు. -
సీబీఐ కోర్టులో వివేకా కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. విచారణను జూన్ 2వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి కోర్టుకు హాజరు కాగా, కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విచారణను జూన్‌కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. ఇక వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని, లేని పక్షంలో అరెస్ట్ చేయొచ్చని సీబీఐకి తెలిపింది. అయితే.. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు గంగిరెడ్డి బెయిల్ రద్దు అమలులో ఉంటుందని, కావాలనుకుంటే సీబీఐ దర్యాప్తు గడువు తేదీ జూన్ 30 ముగిసిన తర్వాత గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వొచ్చని ట్రయల్ కోర్టుకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు గంగిరెడ్డి హాజరుకావడం గమనార్హం. ఇదీ చదవండి: ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అత్యుత్సాహం -
జియాఖాన్ కేసులో సంచలన తీర్పు
ముంబై: జియా ఖాన్ మృతి కేసులో ముంబై సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. సూరజ్ వల్లే జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాల లేనందునా.. అతన్ని నిర్దోషిగా తేలుస్తూ విడుదల చేస్తున్నట్లు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ పేర్కొన్నారు. దీంతో పదేళ్ల కిందటి నాటి ఈ కేసులో జియాఖాన్‌కు న్యాయం జరుగుతుందని భావించిన వాళ్లంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పును జియాఖాన్ తల్లి రబియా సవాల్ చేసే అవకాశం ఉంది. జియా ఖాన్ నేపథ్యం.. కేసు వివరాలు 👉 న్యూయార్క్‌లో పుట్టి పెరిగి.. ఇంగ్లీష్-అమెరికన్ నటిగా పేరు సంపాదించుకుంది నఫిసా రిజ్వి ఖాన్ అలియాస్ జియాఖాన్. 👉 బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘నిశబ్ద్’తో బాలీవుడ్లో లాంచ్ అయిన జియా.. చేసింది మూడు చిత్రాలే అయినా సెన్సేషన్‌గా మారింది. 👉 నిశబ్ద్తో పాటు అమీర్ ఖాన్ గజిని, హౌజ్‌ఫుల్ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది జియాఖాన్. అయితే.. 👉 2013, జూన్ 3వ తేదీన ముంబై జూహూలోని తన ఇంట్లో జియాఖాన్(25) విగతజీవిగా కనిపించింది. 👉 ఘటనా స్థలంలో దొరికిన ఆరు పేజీల లేఖ ఆధారంగా.. జూన్ 10వ తేదీన ముంబై పోలీసులు నటుడు సూరజ్ పంచోలిని ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగంతో(ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం) అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. 👉 ఆదిత్యా పంచోలీ తనయుడైన సూరజ్ పంచోలీ, జియాతో డేటింగ్ చేశాడనే ప్రచారం ఉంది. 2012 సెప్టెంబర్ నుంచి వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు. 👉 అయితే.. జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ మాత్రం తన కూతురిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని వాదిస్తోందామె. 👉 జియాను శారీరకంగా, మానసికంగా సూరజ్ హింసించాడని, ఫలితంగా నరకం అనుభవించిన తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తెలిపింది. 👉 2013 అక్టోబర్‌లో రబియా, జియాఖాన్ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన కోర్టు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 👉 2014 జులైలో.. మహరాష్ట్ర పోలీసుల నుంచి సీబీఐ కేసును టేకప్ చేసింది. 👉 సూరజ్ పాంచోలీ బలవంతంగా తన కూతురితో సంబంధం పెట్టుకున్నాడనేది రబియా ఆరోపణ. అంతేకాదు.. పోలీసులు, సీబీఐ ఈ కేసులో లీగల్ ఎవిడెన్స్‌ను సేకరించలేదన్నది ఆమె ఆరోపణ. 👉 సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేయడంతో.. విచారణ తమ పరిధిలోకి రాదని పేర్కొంటూ కేసును 2021లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానికి బదిలీ చేసింది ముంబై సెషన్స్ కోర్టు. 👉 అయితే సూరజ్ మాత్రం తాను అమాయకుడినని, జియా మరణంతో సంబంధం లేదని వాదిస్తున్నాడు. 👉 ఈ కేసులో 22 మంది సాక్ష్యులను ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టింది. గత వారం ముంబై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(శుక్రవారం, ఏప్రిల్ 28న) తీర్పు వెల్లడించనున్నట్లు సీబీఐ న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ స్పష్టం చేశారు. తీర్పు నేపథ్యంలో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చివరికి.. సాక్ష్యాధారాలు లేనందున కోర్టు పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. ఇదీ చదవండి: 26 రోజులు నరకం చూశా: నటి -
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ లభించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బుచ్చిబాబుకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచికత్తు, పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రామచంద్ర పిళ్లైకి చార్టెడ్ అకౌంటెంట్‌గా వ్యవహరించాడు గోరంట్ల బుచ్చిబాబు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీలో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారణ కాగా.. గతంలోనూ సీబీఐ కూడా అతని ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో, తద్వారా హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్, రిటైల్ లైసెన్సీలకు లాభం చేకూర్చడంలో పాత్ర పోషించినందుకు గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది సీబీఐ. మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. చదవండి: ఉప్పు-నిప్పు: ఔను..! వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!! సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి చేతులు మారడంలో బుచ్చిబాబు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా పనిచేసినట్లు ఆ మధ్య కొన్నికథనాలు కూడా తెరపైకి వచ్చాయి. -
Manish Sisodia: నేడు కోర్టుకు సిసోడియా
ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టులో నేడు విచారణ కొనసాగనుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీ ఇవాళ్టితో(సోమవారం) ముగియనుంది. దీంతో.. దర్యాప్తు సంస్థ ఆయన్ని ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. సిసోడియాను సీబీఐ విచారరించేందుకు తొలుత ఐదు రోజులు, ఆ తర్వాత రెండు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలు, ఆ టైంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాలు, కనపడకుండా పోయిన ఫైల్స్, ముడుపులు,మద్యం వ్యాపారులకు అనుకూలంగా పాలసీ రూపకల్పన, నిందితులతో ఉన్న సంబంధాలపై .. తదితర అంశాలపై వారంగా ఆయన్ని సీబీఐ ప్రశ్నించింది. అయితే.. ఆయన కస్టడీ పొడగింపును సీబీఐ మరోసారి కోరే అవకాశం కనిపించడం లేదు. బదులుగా ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని కోరవచ్చని సమాచారం. మరోవైపు సీబీఐ పదే పదే వేసిన ప్రశ్నలతోనే తనను మానసికంగా వేధిస్తోందని, బెయిల్ ఇప్పించాలని కోరుతూ 51 ఏళ్ల సిసోడియా కోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు సుప్రీం కోర్టులో బెయిల్ కోసం అభ్యర్థించగా.. పిటిషన్‌ను తోసిపుచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టును సంప్రదించాలని సిసోడియాకు సూచించింది. -
HYD: కంచే చేను మేసింది.. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో పదిమందికి జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: కంచే చేను మేసింది. ఎవరూ గమనించలేదనుకుంది. కానీ, ఎట్టకేలకు పాపం పండింది. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన ఓ బ్యాంక్ మేనేజర్‌తో పాటు పదిమంది దోషులకు న్యాయస్థానం కఠిన కారాగార శిక్షలు విధించింది. తొమ్మిదేళ్ల కిందటి నాటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫ్రాడ్ కేసులో బుధవారం ఎట్టకేలకు శిక్షలు ఖరారు చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మోసం కేసులో పదిమందికి జైలు శిక్షలు ఖరారు అయ్యాయి. మొత్తం పది మంది దోషుల్లో ఐదుగురికి ఏడేళ్ల శిక్ష, నలుగురికి మూడేళ్ల శిక్ష, మిగిలిన ఒకరికి ఏడాదిశిక్ష ఖరారు చేసింది. శిక్షతో పాటు దోషులకు జరిమానా సైతం విధించింది. ఇక ఈ కేసులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నష్టానికి కారణమైన ఆరు కంపెనీలకు జరిమానా సైతం విధించింది. ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కై దాదాపు అయిదు కోట్ల రూపాయలు(రూ.4.57 కోట్లు) నకిలీ ఖాతాలకు మళ్లించిన స్కామ్ ఇది. ఈ కేసులో సికింద్రాబాద్ బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీనియర్ మేనేజర్ శరత్ బాబు జెల్లీతో పాటు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుహాస్ కళ్యాణ్ రామ్‌దాసి కూడా దోషులుగా నిర్దారణ అయ్యారు. మొత్తం పది మంది దోషులతో పాటు ఆరు కంపెనీలకు సైతం జరిమానా విధించింది సీబీఐ కోర్టు. శరత్, సుహాస్‌లు ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై 2013 మార్చిలో.. సీబీఐ కేసు నమోదు చేసింది. 2012 -13 మధ్యకాలంలో.. దాదాపు రూ.5 కోట్లకు వర్కింగ్ క్యాపిటల్ లిమిట్లను మంజూరు చేయడం ద్వారా ఆ నిధులను మంజూరైన వాటి కోసం కాకుండా నకిలీ.. కల్పిత పత్రాలపై మళ్లించినట్లు తేలింది. తద్వారా బ్యాంక్‌కు నష్టం వాటిల్లింది. ఈ కేసులో 2014 ఆగష్టులో నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. విచారణలో నిందితులను దోషులుగా నిర్ధారించి ఇప్పుడు శిక్షలు ఖరారు చేసింది సీబీఐ కోర్టు. ఇదీ చదవండి: ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.100 కోట్ల నల్లధనం -
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు సీఐబీ కోర్టు కస్టడీ విధించింది. 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి సీబీఐ స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది. విచారణ సమయంలో కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలవడానికి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో మరో నిందితుడు చందన్‌ను ఈడీ అధికారులు కొట్టారంటూ శరత్ తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. బలవంతంగా చందన్ స్టేట్మెంట్ తీసుకున్నారన్నారు. ఈడీ అధికారులు కొట్టిన దెబ్బలకు చందన్ చెవి దెబ్బతిందని శరత్ తరపు లాయర్ అన్నారు. బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్టు చందన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈడీ సోదాల్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదని శరత్ తరఫు న్యాయవాది అన్నారు. చదవండి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ -
ఎంపీ రఘురామకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దుకు హైకోర్టు నిరాకరించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. వైఎస్ జగన్ బెయిల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. అయితే సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. జగన్‌పై ఉన్న చార్జిషీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, ఆయన బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరితగతిన జరిగేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం విచారణ చేపట్టారు. వైఎస్ జగన్ అధికార పదవిని దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఎలాంటి సాక్ష్యాలను పిటిషనర్ చూపలేదని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆయన బెయిల్ షరతులను ఉల్లంఘించిన ఒక్క సందర్భం కూడా లేదన్నారు. వాదనలు విన్న సీజే.. సీబీఐ న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ, బెయిల్ రద్దు చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించారు. రఘురామకృష్ణంరాజు పిటిషన్‌ను కొట్టివేశారు. -
Indrani Mukerjea: కూతురి హత్య కేసులో ఆరేళ్ల తర్వాత బయటకు..
చాలా చాలా సంతోషంగా ఉంది.. బెయిల్ మీద బయటకు వచ్చిన ఇంద్రాణి ముఖర్జీ చెప్పిన మొదటి మాట ఇది. సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ జైలు నుంచి బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయగా.. రెండు లక్షల రూపాయల షూరిటీ బాండ్ మీద అనుమతి ఇచ్చింది సీబీఐ ప్రత్యేక కోర్టు. శుక్రవారం సాయంత్రం దక్షిణ ముంబైలోని బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యింది ఆమె. సుమారు ఆరున్నరేళ్ల తర్వాత ఇంద్రాణి బయటి ప్రపంచాన్ని చూసింది. ముంబై: కన్న కుమార్తెనే హత్య చేసిందని ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీ(50)కి.. సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మరో పదేళ్లయినా ఈ కేసు విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని, కాబట్టి.. బెయిల్ మంజూరు చేయాలని ఇంద్రాణి తరపు న్యాయవాది ముకుల్ విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆరున్నరేళ్లు జైల్లో గడపడం అంటే చాలా సుదీర్ఘ కాలమని వ్యాఖ్యానించింది ఈ సందర్భంగా కోర్టు.. ఇప్పట్లో విచారణ పూర్తయ్యే అవకాశం లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఆపై సీబీఐ ప్రత్యేక కోర్టు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో.. శుక్రవారం సాయంత్రం ఆమె బైకుల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 1996లో ఐఎన్ఎక్స్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతాలో రిక్రూట్మెంట్ కంపెనీని ఏర్పాటు చేసిన ఇంద్రాణీని 2008లో ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘50 విమెన్ టు వాచ్’లో ఒకరిగా గుర్తించింది. కానీ ఐఎన్ఎక్స్ మీడియాలో అక్రమాలు, కూతురి హత్య కేసు కారణంగా ఆమె జీవితం తలకిందులై.. ఇలా నేరపూరిత స్వభావంతో వార్తల్లోకి ఎక్కింది. ముగ్గురు భర్తల ఇంద్రాణి.. ఇంద్రాణి ముఖర్జీకి మొదటి భర్తతో కలిగిన సంతానం షీనా బోరా. 2012లో ఆమె హత్య జరిగితే.. మూడేళ్ల వరకు ఆ విషయం బయటకు పొక్కలేదు. 2012లో షీనా బోరాను హత్య చేయగా.. మూడేళ్ల తర్వాత ఓ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ హత్య కేసు గురించి తెలిసింది. షీనా బోరాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపారని.. ఆమెను తన చెల్లెలిగా పరిచయం చేసుకున్నారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఇంద్రాణీ ముఖర్జీ మొత్తం ముగ్గుర్ని పెళ్లాడింది. ఆమెకు మొదటి భర్త ద్వారా షీనాతోపాటు మైఖేల్ అనే కుమారుడు జన్మించారు. అతడి నుంచి విడిపోయిన తర్వాత పిల్లలిద్దర్నీ గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచిన ఇంద్రాణీ.. సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లాడింది. కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. అనంతరం మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జియాను మూడో వివాహం చేసుకుంది. అప్పటికే పెద్దదయిన షీనా.. ముంబైకి వచ్చి ఇంద్రాణిని కలుసుకుంది. తన మొదటి పెళ్లి, పిల్లల గురించి పీటర్ దగ్గర దాచిపెట్టిన ఇంద్రాణి.. తన కూతుర్ని చెల్లెలిగా వారికి పరిచయం చేసింది. ఈ క్రమంలో పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనా సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. తన కూతురు వ్యవహరిస్తోన్న తీరు ఇంద్రాణికి నచ్చలేదు. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. ఆమె తీరుతో విసిగిపోయిన ఇంద్రాణీ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇందుకోసం ప్లాన్ చేసి.. తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో షీనాను హత్య చేసింది. ఈ కేసులో 2015 సెప్టెంబర్‌లో ఇంద్రాణీ, సంజీవ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు.. అనంతరం మూడో భర్త పీటర్ ముఖర్జియాను సైతం అదుపులోకి తీసుకున్నారు. బతికే ఉందని డ్రామాలు 2019లో జైల్లో ఉండగానే పీటర్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2020లో పీటర్‌కు బెయిల్ వచ్చింది. ఇంద్రాణీ జైల్లో శిక్ష పొందుతున్న సమయంలో.. తన కుమార్తె ప్రాణాలతోనే ఉందని సీబీఐకి లేఖ రాసింది. షీనా బోరాను జైలు అధికారి ఒకరు కశ్మీర్లో చూశానని చెప్పిందని ఆ లేఖలో పేర్కొన్న ఇంద్రాణి.. ఈ విషయమై దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. ఇంద్రాణి ముఖర్జీ బెయిల్ మీద బయటకు రావడం కోసం అనేక సార్లు ప్రయత్నించి విఫలమైంది. ఆరున్నరేళ్లపాటు శిక్ష అనుభవించాక ఎట్టకేలకు ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి 237 సాక్షుల్లో ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ 68 మందిని మాత్రమే విచారించింది. చదవండి: షీనా బతికే ఉందా? బయటకొచ్చిన ఇంద్రాణి ఏం చెప్పిందంటే.. -
బెయిల్ రద్దు చేయలేం
సాక్షి, హైదరాబాద్: ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వి.విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయలేమని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులను వారు ఉల్లంఘించలేదని, బెయిల్ రద్దు చేసేందుకు సహేతుకమైన కారణాలేమీ లేవని తేల్చి చెప్పింది. ఈ మేరకు రఘురామ దాఖలు చేసిన రెండు పిటిషన్లను బుధవారం కొట్టివేసింది. గత మూడు నెలలుగా సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు ఈ మేరకు తీర్పునిచ్చారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే.. ‘జగన్, సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ తన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. పిటిషన్ దాఖలు చేసిన తీరు, అందులో వాడిన బాష ఆయన దురుద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలు, అభూత కల్పనలతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రోజువారీ పద్ధతిలో కేసులను విచారిస్తోంది. నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వింటోంది. ఈ క్రమంలో విచారణను జాప్యం చేస్తున్నారంటూ రఘురామ పేర్కొనడం కోర్టు ధిక్కరణకు పాల్పడటమే అవుతుంది. అలాగే బెయిల్ మంజూరు సమయంలో ప్రత్యేక కోర్టు విధించిన షరతులను వారు ఎప్పుడూ ఉల్లంఘించలేదు. బెయిల్ షరతులు ఉల్లంఘించారని భావించినప్పుడు నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం ప్రాసిక్యూషన్ విభాగానికి మాత్రమే ఉంటుంది. థర్డ్‌పార్టీకి బెయిల్ రద్దు చేయాలని కోరే హక్కు లేదని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను కొట్టివేయండి..’ అని జగన్, సాయిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఇ.ఉమామహేశ్వరరావు కోర్టును కోరారు. మరో కోర్టుకు బదిలీకి కారణాల్లేవు హైకోర్టులోనూ రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బదిలీ చేయడానికి సహేతుకమైన కారణాలు లేవని స్పష్టం చేసింది. ఊహాగానాలతో రఘురామ ఈ పిటిషన్ దాఖలు చేశారని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చారు. అలా చేయాలంటే నిర్దిష్టమైన కారణాలుండాలి ‘ఏదైనా పిటిషన్‌పై విచారణను ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు బదిలీ చేయాలంటే నేర విచారణ చట్టంలో పేర్కొన్న మేరకు నిర్దిష్టమైన కారణాలు ఉండాలి. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో రెండో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారన్న కారణాన్ని చూపుతూ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదు. నిందితులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలు చేసినప్పుడు అనుమతిస్తూ ఉండటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. బెయిల్ రద్దు కోరుతూ ఏప్రిల్‌లో సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే సీబీఐ కోర్టుపై నమ్మకం లేదంటూ ఆ పిటిషన్లపై ఆదేశాలు ఇవ్వడానికి ఒక రోజు ముందు హైకోర్టును ఆశ్రయించడం సరికాదు..’ అని జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
Narada Sting Case: టీఎంసీ నేతలకు ఝలక్
కోల్‌కతా: నారద స్టింగ్ టేప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం ప్రత్యేక కోర్టుకు ఛార్జ్‌షీట్ సమర్పించింది. పశ్చిమ బెంగాల్ మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ప్రత్యేక కోర్టు ఛార్జ్షీట్లోని నలుగురు టీఎంసీ నేతలకు సమన్లు జారీచేసింది. సెప్టెంబర్ 16హాజరు కావాలని పేర్కొంది. టీఎంసీ నేతలతో పాటు సస్పెండ్ చేయబడిన ఐపీఎస్ అధికారి ఎస్ఎంహెచ్ మీర్జాకు కూడా కోర్టు నోటీసు పంపింది. చదవండి: అమరవీరులను అవమానించడమే ముఖర్జీ, హకీమ్, మిత్రాకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ద్వారా సమన్లు అందజేయాలని కోర్టు ఆదేశించింది. మిగిలిన ఇద్దరికి నేరుగా వారి చిరునామాలకు సమన్లు పంపిస్తున్నామని పేర్కొంది. ఇక ఈ ఏడాది సీబీఐ ముఖర్జీ, హకీమ్, మిత్రా, సోవన్ ఛటర్జీలను అరెస్ట్ చేయగా.. వారికి మే నెలలో కోల్‌కతా హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చదవండి: పనిచేస్తారా? తప్పుకుంటారా.. పార్టీ శ్రేణులకు కమల్ వార్నింగ్! తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అవినీతిని బయటపెట్టడం కోసం ‘నారద న్యూస్’ అనే న్యూస్ ఔట్లెట్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనినే నారద స్టింగ్ ఆపరేషన్ అంటారు. నారద న్యూస్ వ్యవస్థాపకుడు మాథ్యూ శామ్యూల్ 2014-2016 మధ్య కాలంలో దాదాపు 12 మంది టీఎంసీ నేతలపైనా, ఓ ఐపీఎస్ అధికారిపైనా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. 2014లో ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగినప్పటికీ, 2016లో ‘తెహల్కా’ ప్రచురించింది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలకు ముందు దీనిని వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
రాజకీయ దురుద్దేశాలతోనే పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ‘ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యక్తిగత ప్రయోజనాలతోను, రాజకీయ దురుద్దేశాలతోను నా బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇది చట్టప్రక్రియను దుర్వినియోగం చేయడమే..’ అని సీఎం వైఎస్ జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. పిటిషన్ దాఖలు చేసిన తీరు, అందులో వాడిన భాష ఆయన దురుద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలు, అభూత కల్పనలతో ఈ పిటిషన్ దాఖలు చేశారని, ప్రత్యేక కోర్టు విధించిన బెయిల్ షరతులను తాను ఎప్పుడూ ఉల్లంఘించలేదని జగన్ తెలిపారు. సీఎం జగన్‌బెయిల్‌ను రద్దుచేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఓ సాక్షిని జగతి పబ్లికేషన్స్ ఇంటర్వ్యూ చేసిందన్న కారణంగా 2017లో బెయిల్ రద్దుచేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టివేసిందని తెలిపారు. జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా సీఎం హోదాలో చర్యలు తీసుకోవాల్సి ఉన్నందునే కోర్టు విచారణకు హాజరుకాలేకపోతున్నానని, తాను హాజరుకాకపోయినా విచారణకు ఎక్కడా అంతరాయం కలగలేదని తెలిపారు. వ్యక్తిగత ద్వేషంతో రాజకీయంగా ప్రయోజనం పొందాలని దాఖలు చేసే ఈ తరహా పిటిషన్లు ఎంతమాత్రం విచారణార్హం కాదని పేర్కొన్నారు. అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. రఘురామ అనేక కేసుల్లో నిందితుడు బెయిల్ రద్దుచేయాలని కోరే హక్కు థర్డ్‌పార్టీకి లేదని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రోజువారీ పద్ధతిలో ఈ కేసులను విచారిస్తోందని, నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వింటోందని తెలిపారు. విచారణను జాప్యం చేస్తున్నారంటూ రఘురామ పేర్కొనడం కోర్టు ధిక్కరణకు పాల్పడమేనని పేర్కొన్నారు. రఘురామ వాస్తవాలను దాచి ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఆయనపై బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్న రూ.947.71 కోట్లకుపైగా ఎగ్గొట్టారనే తీవ్రమైన ఆరోపణలున్నాయని, సీబీఐ నమోదు చేసిన 2 కేసుల్లో నిందితుడని తెలిపారు. ఆయనపై 7 క్రిమినల్ కేసులున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించినందున ఎంపీగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ గతేడాది లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు కౌంటర్లో జగన్ వివరించారు. దీనిపై రిజాయిండర్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని రఘు న్యాయవాదులు కోరడంతో విచారణను న్యాయమూర్తి ఈనెల 14కు వాయిదా వేశారు. కాగా, ఈ పిటిషన్‌పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేసింది. -
ఏడాదైనా కౌంటర్ వేయరా?
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏడాది గడిచినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు ఏడాది గడువు సరిపోలేదా అని ప్రశ్నించింది. మూడు నెలల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బడంగ్‌పేట మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి జనవరి 4న ప్రకటించిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ అదే ప్రాంతానికి చెందిన బండారి కొమరేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఇప్పటికే ఎన్నికలు జరిగి ఏడాది గడిచిందని, రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల నాటికి మారుతాయని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణార్హం కాదని ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ సంజీవ్‌కుమార్ నివేదించారు. రెండు పర్యాయాలకు ఒకసారి రిజర్వేషన్లు మారుతాయని మున్సిపల్ శాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో ఉందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను విచారించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం...ప్రతివాదులు మూడు నెలల్లో కౌంటర్ దాఖలు చేయాలని, దానిపై రెండు నెలల్లో రిప్లై దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఓఎంసీ కేసు నుంచి నా పేరు తొలగించండి : శ్రీలక్ష్మి సాక్షి, హైదరాబాద్: అక్రమ మైనింగ్ ఆరోపణలపై ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)పై సీబీఐ నమోదు చేసిన కేసులో తనను అక్రమంగా ఇరికించారని, ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. మైనింగ్ లీజుల మంజూరులో నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని తెలిపారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 25కు వాయిదా వేసింది. -
బాబు అక్రమ ఆస్తులపై తీర్పు18కి..
సాక్షి, హైదరాబాద్ : అక్రమ ఆస్తులు కూడబెట్టాడంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్లో సోమవారం తీర్పు ఇవ్వాల్సి ఉన్నా.. న్యాయమూర్తి మరోసారి వాయిదా వేశారు. చంద్రబాబు అక్రమ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలంటూ లక్ష్మీపార్వతి 2006లో ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. అయితే ఆరు నెలలకు మించి స్టే ఉత్తర్వులు కొనసాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించిన నేపథ్యంలో... ఈ ఏడాది మొదట్లో ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. చంద్రబాబు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేసేలా ఏసీబీని ఆదేశించాలని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది నివేదించారు. (దేవుడు చేసిన మనుషుల్లారా మీపేరేమిటి?) దీంతో ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈ పిటిషన్‌పై ఆదేశాలు ఇవ్వాల్సి ఉన్నా... పలుమార్లు వాయిదాపడుతూ వస్తోంది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే అవినీతిపై దాఖలైన పిటిషన్లను రోజువారీ పద్ధతిలో విచారించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై వెంటనే తీర్పును వెలువరించాలని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది పలుమార్లు ఏసీబీ ప్ర త్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే సుప్రీం తీర్పు ఈ పిటిషన్‌కు వర్తించదని, కేసులు నమోదై న్యాయ స్థానాల్లో విచారణ పెండింగ్‌లో ఉన్న వాటికే ఆ తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసిన న్యాయమూర్తి... ఈ పిటిషన్‌పై తీర్పును 18కి వాయిదా వేశారు. -
కొండను తవ్వి...
బాబ్రీ మసీదు విధ్వంసం కుట్ర కేసు కథ ఎట్టకేలకు ముగిసిపోయింది. ఈ కేసులో నిందితులుగా వున్న 32మంది నిర్దోషులని బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. వాస్తవానికి ఇందులో మొత్తం 49మంది నిందితులుకాగా... బాల్ ఠాక్రే, మహంత్ అవైద్యనాథ్, అశోక్ సింఘాల్తోసహా 17మంది మరణించారు. 1992 డిసెంబర్ 6న జరిగిన మసీదు కూల్చివేతలో ముందస్తు పథకం లేదని, ఈ విషయంలో సీబీఐ సమర్పించిన సాక్ష్యాధారాలు నిందితులను శిక్షించడానికి సరిపోవని కోర్టు తేల్చింది. ఆశ్చర్యకరమేమంటే ఈ ఉదంతంలో కుట్ర దాగుందని అప్పట్లో పీవీ నరసింహారావు ప్రభుత్వం నియమించిన న్యాయవిచారణ కమిషన్‌కు నేతృత్వంవహించిన జస్టిస్ మన్మోహన్సింగ్ లిబర్హాన్ 2009లో అభిప్రాయపడ్డారు. అసలు ఈ కేసు న్యాయస్థానాల్లో నడిచిన తీరు గమనిస్తే ఎవ రైనా ఆశ్చర్యపోతారు. రామజన్మ భూమి–బాబ్రీ మసీదు వివాదం గత ఏడాది నవంబర్‌లో అయి దుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పుతో ముగిసింది. వివాదా స్పదమైన 2.77 ఎకరాల స్థలాన్ని ధర్మాసనం రామమందిర నిర్మాణానికే అప్పగించింది. మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల భూమి చూడాలని, దాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే ఆ సివిల్ తగాదాతోపాటు బాబ్రీ మసీదు కూల్చివేత ఉదంతంపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి ‘గుర్తు తెలియని’ కరసేవకు లపై పెట్టిన కేసు కాగా, రెండోది ఈ కుట్ర కేసు. జాతీయ సమగ్రతకు భంగం కలిగించారని, వదం తులు సృష్టించి శాంతిభద్రతలకు భంగం కలిగించారని, అందుకోసం కుట్రకు పాల్పడ్డారని ఈ కేసు లోని అభియోగం. ఇందులో మొదటి కేసు లక్నో సెషన్స్ కోర్టులో, రెండోది రాయ్‌బరేలీ కోర్టులో పాతికేళ్లపాటు కొనసాగాయి. మధ్యలో 2001లో కుట్ర కేసు అభియోగాలు చెల్లబోవని రాయ్‌బరేలీ కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని 2010లో అలహాబాద్ హైకోర్టు కూడా ధ్రువీకరించింది. కానీ సుప్రీంకోర్టు 2017లో దీన్ని అంగీకరించలేదు. అసలు ఒకే స్వభావం వున్న రెండు వేర్వేరు కేసులను ఇలా రెండు చోట్ల విచారించడంలో అర్థమేముందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించి, వాటిని విలీనం చేసి విచారించాలని చెప్పడంతో కుట్ర కేసు విచారణ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈ కేసును సీబీఐ ప్రత్యేక కోర్టులో రోజువారీ ప్రాతిపదికన విచారణ సాగించి రెండేళ్లలో తీర్పునివ్వాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలుగా సమర్పించిన డాక్యుమెంట్లు దాదాపు 800 కాగా, వందలసంఖ్యలో ఆడియో, వీడియోలు, వేర్వేరు ఫైళ్లు వున్నాయి. 351మంది సాక్షులున్నారు. వివిధ పక్షాల న్యాయవాదుల వాదనలు సరేసరి. కనుక ఇంత విస్తృతమైన, సంక్లిష్టమైన కేసు గనుకే సర్వో న్నత న్యాయస్థానం ఆదేశించిన గడువులోగా తీర్పునివ్వడం సాధ్యపడలేదని దీన్ని విచారించిన ఎస్కే యాదవ్ చెప్పడంలో వాస్తవం ఉండొచ్చు. ఈ కేసులో ఆనాటి ఐపీఎస్ అధికారిణి అంజూ గుప్తా, అప్పట్లో ఈ ఉదంతాన్ని మీడియా ప్రతి నిధిగా దగ్గరుండి చూసిన రాధికా రామశేషన్ ఇచ్చిన సాక్ష్యాధారాలు నిందితుల ప్రమేయాన్ని రుజువు చేస్తాయని భావించినవారున్నారు. ఆరోజు మసీదు వద్దకు వచ్చిన కరసేవకుల చేతుల్లో దాన్ని కూల్చ డానికి కావలసిన ఉపకరణాలున్నాయని, ముందస్తు ప్రణాళిక లేనప్పుడు అదెలా సాధ్యమని రాధికా రామశేషన్ ప్రశ్నించారు. వారు ఆ పని కానిస్తుండగా ఉమాభారతి వారిని ఉత్సాహపరచడం కళ్లారా చూశానని, ఆమె మాటలు ఇప్పటికీ తన చెవుల్లో మార్మోగుతున్నాయని చెప్పారు. కూల్చివేత పనులు సాగుతుండగా, అది పూర్తియ్యేవరకూ కదలొద్దని నాయకులు వారిని ఆదేశించారన్నది ఐపీఎస్ అధి కారి అంజూగుప్తా మాట. అయితే న్యాయస్థానాలు కేవలం వారి మౌఖిక సాక్ష్యాధారాలపైనే ఆధార పడటం సాధ్యం కాదు. వాటిని నిర్ధారించే ఇతరత్రా సాక్ష్యాలు కూడా వుండాలి. అప్పుడు మాత్రమే నిందితుల ప్రమేయాన్ని విశ్వసిస్తాయి. సీబీఐ ఆ విషయంలో ఎంతవరకూ కృతకృత్యమైందో, అది సమర్పించిన సాక్ష్యాధారాలేమిటో ప్రత్యేక కోర్టు వెలువరించిన 3,000 పేజీల తీర్పు పూర్తి పాఠం బయటికొస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. అలాగే లిబర్హాన్ కమిషన్ సేకరించిన సాక్ష్యాధారాలేమైనా ప్రత్యేక కోర్టు పరిశీలించిందా...ఆ విషయంలో సీబీఐని ఏమైనా నిలదీసిందా అన్నది కూడా చూడాలి. బాబ్రీ మసీదు కట్టడంపై వందేళ్లనుంచి వివాదం నడుస్తోంది. అయితే ఆ ప్రాంగణంలోకి ప్రైవేటు వ్యక్తులు చొరబడి, ఆ కట్టడాన్ని ధ్వంసం చేయడాన్ని ఏ చట్టమూ అంగీకరించదు. కనుక ఆ రోజున అక్కడ విధ్వంసానికి దిగినవారు చట్టం దృష్టిలో దోషులే. ఈ కేసు విచారణ జరపాల్సిందేనని 2017లో చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టిలో అయితే ఇలా కూల్చివేతకు పాల్పడటం ‘ఒక అసా ధారణమైన చట్ట ఉల్లంఘన’. ఇప్పుడు వెలువడిన తీర్పు గమనిస్తే సీబీఐ పకడ్బందీ సాక్ష్యాధారాలను సమర్పించలేకపోయిందన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. న్యాయస్థానాలు తమముందున్న సాక్ష్యాధారాలు గమనిస్తాయి తప్ప వాస్తవంగా ఏం జరిగి వుండొచ్చునన్న ఊహాగానాలపై ఆధారపడవు. అయితే ఒకటి మాత్రం వాస్తవం. బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు తన జీవితంలో అత్యంత విషాకరమైన దినమని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ, మాజీ ప్రధాని వాజపేయి అనంతరకాలంలో వ్యాఖ్యానించారు. బహుశా బాబ్రీ విధ్వంసం తర్వాత జరిగిన పరిణామాలు వారికి ఆ అభిప్రాయం కలిగించివుండొచ్చు. బాబ్రీ వివాదం మొదల య్యాక దేశంలో ఏర్పడ్డ వైషమ్య భావాలు ఆ కట్టడం కూల్చివేతతో పరాకాష్టకు చేరాయి. దేశ వ్యాప్తంగా జరిగిన మత కల్లోలాల్లో 2,000మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పతాక శీర్షికల కెక్కిన ఈ మాదిరి కేసుల్లో సైతం సీబీఐ సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోవడం, కేసు విచార ణకు ఇరవైఎనిమిది సంవత్సరాలు పట్టడం, వందలమంది పాల్గొన్న విధ్వంస ఉదంతంలో చివరకు ఒక్కరినైనా శిక్షించలేకపోవడం సాధారణ పౌరులకు ఆశ్చర్యం కలిగించకమానదు. -
బాబ్రీ కేసు : అద్వానీపై ప్రశ్నల వర్షం
లక్నో : భారత మాజీ ఉప ప్రధానమంత్రి, బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి.. సీబీఐ కోర్టు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అద్వానీ వాంగూల్మం నమోదు చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్యలో దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. ఈ క్రమంలో న్యాయమూర్తి అద్వానీని 100 ప్రశ్నలు అడిగినట్టు ఆయన తరఫున లాయర్ తెలిపారు. అయితే ఈ సందర్భంగా తనపై ఉన్న ఆరోపణలను అద్వానీ ఖండించినట్టు వెల్లడించారు. (జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు) ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం బీజేపీ సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి వాంగ్మూలం నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ సెక్షన్ 313 కింద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 32 మంది తమ వాదనలను వినిపించవచ్చని న్యాయమూర్తి ఇదివరకే పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసి, తీర్పు వెలువరించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది. (నదిలో మధ్యలో సెల్ఫీ దిగుదామనుకుంటే..) మరోవైపు కోర్టు ముందు వాంగ్మూలం వినిపించడానికి రెండు రోజుల ముందు అద్వానీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య భేటీ దాదాపు 30 నిమిషాల పాటు సాగింది. -
జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు
-
జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు
లక్నో : బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం బీజేపీ కురవృద్ధుడు మురళీ మనోహర్ జోషి వాంగ్మూలం నమోదు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి ఎస్కే యాదవ్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జోషి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి శుక్రవారం మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ వాంగ్మూలం కూడా రికార్డు చేయనున్నారు. కాగా, సీఆర్పీసీ సెక్షన్ 313 కింద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 32 మంది తమ వాదనలను వినిపించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్న సంగతి తెలిసిందే.(మధ్యప్రదేశ్ మంత్రికి సోకిన కరోనా) బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువు లోగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్నాయి. కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.(పిల్లల కోసం ఆ కాస్త ఆసరా వదిలేశాడు!) -
అద్వానీ వాంగ్మూలం తీసుకోనున్న సీబీఐ కోర్టు
లక్నో : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ కీలక నేతల వాంగ్మూలం నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిల స్టేట్మెంట్లను రికార్డు చేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేదీలు ఖరారు చేసింది. జూలై 23న మురళీ మనోహర్ జోషి, జూలై 24న అద్వానీల వాదనలు రికార్డు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు స్పెషల్ జడ్జ్ జస్టిస్ ఎస్కే యాదవ్ సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. సీఆర్పీసీ సెక్షన్ 313 కింద అద్వానీ, జోషిల వాంగ్మూలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డు చేయనున్నట్టు పేర్కొన్నారు. (బాబ్రీ మసీదు కేసులో కొత్త మలుపు) మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువు లోగా విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది. కాగా, బాబ్రీ మసీదు కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి.. వంటివారి పేర్లు ఉన్నాయి. కరసేవకులను రెచ్చగొట్టి మసీదును కూల్చివేశారని వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. -
చిదంబరానికి మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి సీబీఐ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కస్టడీనీ మరో నాలుగు రోజులు పొడగిస్తూ చిదంబరానికి మళ్లీ షాకిచ్చింది. దీంతో ఆయన ఈ నెల 30 వరకు కస్టడీలో ఉండనున్నారు. ఈ కేసులో చిదంబరంను అయిదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి తరలించగా నేటితో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదనలు విన్న ప్రత్యేక కోర్టు కస్టడీని పొగడిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన ఈ నెల 30 వరకు సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు. (చదవండి : చిదంబరానికి సుప్రీం షాక్) మరోవైపు సర్వోన్నత న్యాయస్ధానంలో కూడా చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. చిదంబరం బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు ..ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను సవాల్ చేస్తూ చిదంబరం న్యాయవాదులు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయనందున దీనిపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి పేర్కొన్నారు. (చదవండి : చిదంబరం అరెస్ట్) -
చిదంబరం కేసు: ఈడీ అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేసును తొలినుంచి విచారిస్తున్న ఈడీ అధికారి రాకేష్ అహుజాను బదిలీ చేసింది. ఆయనను ఢిల్లీ పోలీసు విభాగానికి అధికారిగా పంపిస్తున్నట్లు గురువారం అర్థరాత్రి ప్రకటన వెలువడింది. ఆయన ప్రస్తుతం ఈడీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. చిదంబరం అరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడంలో రాకేష్ కీలక పాత్ర పోషించారు. కాగా ఈడీ తాజా అనూహ్య నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత హఠాత్తుగా అహుజాను బదిలీ చేయాల్సిన అవసరమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలావుండగా.. అనేక నాటకీయ పరిణామాల అనంతరం బుధవారం అరెస్ట్ అయిన మాజీ కేంద్రమంత్రికి సీబీఐ కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. (చదవండి: సీబీఐ కస్టడీకి..చిదంబరం) -
సీబీఐ కస్టడీకి..చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి నాలుగు రోజుల (ఆగస్టు 26 వరకు) సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో.. గురువారం మధ్యాహ్నమే చిదంబరాన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ.. అది సాయంత్రం వరకు పొడిగించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనంతరం గంటన్నరసేపు న్యాయమూర్తి అజయ్ కుమార్ చౌహాన్ ఇరువర్గాల వాదనలు విన్నారు. పదే పదే అవే ప్రశ్నలతో విసిగిస్తున్నారని చిదంబరం తరపు న్యాయవాదులు కపిల్ సిబల్, సింఘ్వీలు పేర్కొనగా.. కీలకమైన ప్రశ్నలకు ఆయన ఉద్దేశపూర్వకంగానే సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ వాదించారు. వాదనల తర్వాత.. లోతైన దర్యాప్తు కోసం చిదంబరాన్ని నాలుగురోజుల కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అంతకుముందు చిదంబరాన్ని సీబీఐ అధికారులు నాలుగు గంటలపాటు విచారించారు. న్యూఢిల్లీ: నాటకీయ పరిణామాల మధ్య బుధవారం అరెస్టైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంకు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆయనను ఆగస్ట్ 26 వరకు(నాలుగు రోజులు) సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. ‘చిదంబరంపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. లోతైన దర్యాప్తు అవసరం. సంబంధిత పత్రాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అందువల్ల కస్టడీలో ఉంచి విచారణ జరపడం తప్పనిసరని విశ్వసిస్తున్నాం’ అని ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ స్పష్టం చేశారు. చిదంబరంను కొత్తగా అడిగేందుకు సీబీఐ వద్ద ప్రశ్నలేవీ లేవని, బుధవారం ఉదయం గతంలో విచారణ సందర్భంగా వేసిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని, అందువల్ల కస్టడీ అవసరం లేదని చిదంబరం తరఫు న్యాయవాదులు చేసిన వాదనను ఆయన పరిగణనలోకి తీసుకోలేదు. సీబీఐ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతీరోజు అరగంట పాటు చిదంబరంను ఆయన కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలుసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. కాగా, చిదంబరం అరెస్ట్‌పై రాజకీయం మరింత వేడెక్కింది. ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప మరేం కాదని, ఈ కేసులో చార్జిషీటు వేసేందుకు అవసరమైన ఆధారాలు సీబీఐ వద్ద లేవని కాంగ్రెస్ ఆరోపించింది. చట్టం తనపని తాను చేసుకుపోతోందని బీజేపీ పేర్కొంది. జవాబులను దాటవేస్తున్నారు.. ముందస్తు బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన, అరెస్ట్ నుంచి తక్షణ ఊరట కల్పించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో.. హైడ్రామా అనంతరం బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితుల నడుమ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సీబీఐ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సీబీఐ గెస్ట్‌హౌజ్‌లో ఆ రాత్రి ఉంచారు. గురువారం ఉదయం నుంచి నాలుగు గంటలపాటు పలు దఫాలుగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే, చాలా ప్రశ్నలను చిదంబరం దాటవేశారని, కొన్ని ప్రశ్నలకు ముక్తసరిగా జవాబిచ్చారని సీబీఐ వర్గాలు తెలిపాయి. చిదంబరం ఖండించిన కొన్ని అంశాలకు సంబంధించిన ఆధారాలను అధికారులు ఆయనకు చూపడంతో.. ఆయన మౌనం దాల్చారని వెల్లడించాయి. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో పటిష్ట భద్రత మధ్య చిదంబరంను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తి, చిదంబరం తరఫు న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ తదితరులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. కోర్టులో దాదాపు గంటన్నరకు పైగా వాడి వేడి వాదనలు కొనసాగాయి. చిదంబరం కస్టడీ అవసరం లేదని, ఆయన బెయిల్‌కు అర్హుడని సిబల్, సింఘ్వీ వాదించగా.. కేసుకు సంబంధించిన మరింత లోతైన కుట్ర మూలాలను వెలికి తీసేందుకు, చిదంబరం దగ్గరున్న రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు కనీసం 5 రోజుల కస్టడీ అవసరమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ వాదనలను తిప్పికొట్టారు. అనంతరం తీర్పు రిజర్వ్‌లో ఉంచిన న్యాయమూర్తి.. సాయంత్రం 7 గంటల సమయంలో చిదంబరంను 4 రోజులు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం చిదంబరంను మళ్లీ సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. వాదనలు ఇలా.. సిబల్, సింఘ్వీ (చిదంబరం తరఫున) ► ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన ఇతర నిందితులందరూ.. చిదంబరం కొడుకు కార్తి సహా బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్టైన వ్యక్తి కార్తికి చార్టర్డ్ అకౌంటెంట్ అయిన భాస్కర్ రామన్. ఆయన బెయిల్‌పై ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ వేరే కేసులో జైలులో ఉన్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి వారు బెయిల్‌పై ఉన్నట్లే భావించాలి. ► విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎఫ్ఐపీబీ)కి అనుమతులు ఇచ్చింది సీనియర్ అధికారులు. వారెవ్వరినీ అరెస్ట్ చేయలేదు. ► బెయిల్ మంజూరు అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమే. ► చిదంబరం విదేశాలకు పారిపోయే వ్యక్తి కాదు. ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని సీబీఐ కూడా చెప్పడం లేదు. ► ఈ కేసు అంతా అప్రూవర్ గా మారిన ఇంద్రాణి ముఖర్జీ చెప్పిన విషయాలపైనే ఆధారపడి ఉంది. ► తాను ఏం వినాలనుకుంటోందో.. అదే చిదంబరం చెప్పాలని సీబీఐ కోరుతోంది. అది సాధ్యం కాదు. ► జవాబులు దాటవేస్తున్నారనే కారణం చూపి కస్టడీ కోరడం సరికాదు. ► కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే కస్టడీ లోకి తీసుకోవాలి. ఈ కేసులో అలా అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన అంశాలేవీ లేవు. ► చిదంబరంను గతంలో విచారణ సందర్భంగా అడిగిన పాత ప్రశ్నలనే బుధవారం కూడా మళ్లీమళ్లీ అడిగారు. ► సీబీఐ చెప్పేవన్నీ వాస్తవాలే అని అనుకోకూడదు. ► ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నట్లయితే తమకు అందజేయాలని కోరుతూ చిదంబరంకు సీబీఐ లేఖ రాస్తే సరిపోయేది. సొలిసిటర్ జనరల్ తుషార్ (సీబీఐ తరఫున) ► చిదంబరం సరిగ్గా సమాధానాలివ్వలేదు. కొన్నింటికి డొంకతిరుగుడు సమాధానాలిచ్చారు. విచారణలో సీబీఐకి సహకరించలేదు కనుక కస్టడీ అవసరం. ► చిదంబరంతో సీబీఐ నేరాన్ని ఒప్పించడం లేదు.. కేసు మూలాలను తెలుసుకోవాలని మాత్రమే ప్రయత్నిస్తోంది. ► ఈ కుంభకోణంలో ఇతరులతో కలిసి నేరపూరిత కుట్రలో చిదంబరం భాగస్వామి. ► ఇది చాలా సీరియస్ కేసు. ఇందులో తెలివైన వాళ్లు చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేసు మూలాల్లోకి వెళ్లలేకపోతే మాకు వైఫల్యమే ఎదురవుతుంది. ► గతంలో కార్తిని కూడా కస్టడీలోకి తీసుకునే విచారణ జరిపాం. ► చిదంబరం చాలా తెలివైనవాడు. ఈ కేసు విచారణలో సహకరించకుండా ఉండేందుకు ఆయనకు చాలా మార్గాలున్నాయి. ► ఈ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ ఓపెన్ కోర్టులో బహిరంగంగా వెల్లడించలేం. ► చట్టం ముందు అంతా సమానమే. ► చిదంబరం తరఫున సమర్థులైన న్యాయవాదులున్నారు. కాబట్టి ఆయన సొంతంగా వాదించుకోవాల్సిన అవసరం లేదు. ► చిదంబరం ముందస్తు బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం. నగదు అక్రమ చలామణికి సంబంధించి ఈ కేసు గొప్ప ఉదాహరణ అని స్పష్టమవుతోంది అని ఢిల్లీ హైకోర్టు అభివర్ణించింది. చిదంబరం ప్రధాన నిందితుడనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయంది. ► ఈ కేసులో చోటు చేసుకున్న క్విడ్ ప్రోకొ విషయాలు, కుట్ర అంశాలు తేలాల్సి ఉంది. ఆధారాలను చిదంబరం ముందు ఉంచి ప్రశ్నించాల్సి ఉంది. అందువల్ల ఆయన కస్టడీ చాలా అవసరం. 4 గంటలు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గురువారం ఉదయం దాదాపు 4 గంటల పాటు చిదంబరంను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతులు, ఐఎన్ఎక్స్ మీడియా ప్రమోటర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలతో పరిచయం, వారితో జరిపిన సమావేశాలు, కార్తికి చెందిన చెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ సంస్థ.. తదితర విషయాలపై డెప్యూటీ ఎస్పీ ఆర్ పార్థసారథి నేతృత్వంలోని అధికారుల బృందం ఆయనను లోతుగా ప్రశ్నించింది. అయితే, వారి ప్రశ్నలకు చిదంబరం సూటిగా జవాబివ్వలేదని, చాలా ప్రశ్నలకు అసలు సమాధానమే ఇవ్వలేదని, కొన్ని ప్రశ్నలను దాటవేశారని, మరికొన్ని ప్రశ్నలకు డొంకతిరుగుడుగా జవాబిచ్చారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదే కేసుకు సంబంధించి చిదంబరంను గత సంవత్సరం కూడా ఒకసారి ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం చిదంబరంను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడి గెస్ట్‌హౌజ్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న సూట్ నంబర్ 5ను ఆయనకు కేటాయించారు. గురువారం ఉదయం అల్పాహారం అనంతరం 10.20 గంటల సమయంలో ఇంటరాగేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. భవనంలోకి మీడియాను కూడా పరిమితంగానే అనుమతించారు. వారి వాంగ్మూలంతో బిగిసిన ఉచ్చు కోర్టు ముందు భారీ బందోబస్తు కోర్టు విచారణ తర్వాత చిదంబరంను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తున్న అధికారులు చిదంబరంను కోర్టుకు తీసుకొస్తున్న కారు ట్రాఫిక్‌లో చిక్కుకున్న దృశ్యం -
ఐఎన్ఎక్స్ కేసు : చిదంబరానికి భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరంను ఆగస్ట్ 26 వరకూ ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. రోజుకు అరగంట పాటు కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆయనను కలిసేందుకు కోర్టు వెసులుబాటు కల్పించింది. సీబీఐ అధికారులు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరాన్ని హాజరు పరిచారు. ఐఎన్ఎక్స్ మీడియాకు చిదంబరం లాభం చేకూర్చారని న్యాయస్ధానం ఎదుట సీబీఐ వాదించింది. మనీల్యాండరింగ్‌కు ఈ కేసు ఉదాహరణని పేర్కొంది. చిదంబరాన్ని కనీసం ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. కాగా, బోన్లో కూర్చునేందుకు నిరాకరించిన చిదంబరం వాదనలు జరిగిన ఆసాంతం నిలబడే ఉన్నారు. వాడివేడి వాదనలు కేసు డైరీలో చిదంబరం పాత్ర ఉందని, మరింత లోతైన విచారణ అవసరమని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నందున చిదంబరాన్ని అరెస్ట్ చేశామని చెప్పారు. ఐఎన్ఎక్స్ కేసులో ఆధారాలతో చిదంబరాన్ని కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాము అడిగిన ఏ ప్రశ్నకూ చిదంబరం సమాధానం ఇవ్వలేదని, విచారణకు ఆయన సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చిదంబరం అన్నీ తెలిసే అధికార దుర్వినియోగం చేశారని, ఐఎన్ఎక్స్ మీడియాకు అనుకూలంగా వ్యవహరించారని కోర్టు ఎదుట సీబీఐ న్యాయవాది పేర్కొన్నారు. అరెస్ట్‌పై విస్మయం ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంను ఎందుకు అరెస్ట్ చేశారో అర్ధం కావడం లేదని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో కార్తీకి ఇప్పటికే బెయిల్ వచ్చిందని రాజకీయ దురుద్దేశంతోనే చిదంబరాన్ని అరెస్ట్ చేశారని సిబల్ వాదించారు. సీబీఐ విచారణకు చిదంబరం ఎప్పుడూ గైర్హాజరు కాలేదని అన్నారు. సీబీఐ వద్ద ప్రశ్నలు సిద్ధంగా లేవని, కేవలం 12 ప్రశ్నలే అడిగారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పదేళ్ల తర్వాత ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు. ఎఫ్ఐపీబీలో ఆరుగురు కార్యదర్శులు ఉంటారని, వారే ఐఎన్ఎక్స్లో విదేశీ నిధులకు ఆమోదం తెలిపినా వారిలో ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు. సీబీఐ ఏదో జరిగిందన్న మాత్రాన అది నిజం కాదని పేర్కొన్నారు.నేరాన్ని అంగీకరించకపోతే సహకరించలేదనడం సరైంది కాదని వాదించారు. సీబీఐ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఆయన సమాధానం ఇచ్చారని చెప్పారు. విదేశాల్లో బ్యాంకు ఖాతాల్లేవు : చిదంబరం ఐఎన్ఎక్స్ కేసులో తాను సీబీఐ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చానని, ఈ వ్యవహారంలో తాను ఎవరినీ లంచం అడగలేదని చిదంబరం కోర్టుకు తెలిపారు. తనతో పాటు తన తనయుడి ఖాతాల వివరాలను సీబీఐకి అందచేశానని కోర్టుకు నివేదించారు. తనకు విదేశాల్లో బ్యాంకు ఖాతాలు లేవని స్పష్టం చేశారు. ఇక అంతకుముందు సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి చిదంబరంను అధికారులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం చిదంబరంను భారీ భద్రత నడుమ కోర్టుకు తరలించారు. మరోవైపు చిదంబరానికి బెయిల్ కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. పార్టీ సీనియర్ నేతలు, న్యాయవాదులైన కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, సల్మాన్ ఖర్షీద్‌లు ఆయనకు బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చిదంబరం భార్య నళిని, కుటుంబ సభ్యులు కోర్టుకు తరలివచ్చారు. కాగా చిదంబరం బెయిల్ పిటిషన్ శుక్రవారం న్యాయస్ధానం ఎదుట విచారణకు రానుంది. -
ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో మాజీ ఎంపీకి జీవితఖైదు
అహ్మదాబాద్: ఆర్టీఐ కార్యకర్త అమిత్ జెత్వా హత్య కేసులో బీజేపీ మాజీ ఎంపీతోపాటు ఆరుమందికి సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. గిర్ అరణ్య ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యవహారాలను పిల్ ద్వారా వెలుగులోకి తేవడంతో జెత్వాను 2010లో నాటి జునాగఢ్ ఎంపీ దిను సోలంకి హత్య చేశారు. ఈ అక్రమ మైనింగ్‌లో సోలంకి ఉన్నాడని జెత్వా తన పిల్లో పేర్కొనడమే ఈ హత్యకు కారణం. దోషులు సోలంకి, అతడి మేనల్లుడు శివలకు జీవిత ఖైదుతోపాటు రూ. 15 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ సీబీఐ జడ్జి కేఎం దేవ్ గురువారం తీర్పునిచ్చారు. వీరితోపాటు శైలేష్ పాండ్య, బహదూర్‌సిన్హ్ వాధెర్, పంచన్ దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉడాజి ఠాకూర్లకు జీవిత ఖైదు విధించింది. 2010లో ఓ వైపు జెత్వా దాఖలు చేసిన పిల్‌పై వాదనలు జరుగుతుండగానే గుజరాత్ హైకోర్టు ప్రాంగణంలో అమిత్ జెత్వా దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును విచారించిన అహ్మదాబాద్ పోలీసులు బీజేపీ ఎంపీ దిను సోలంకికి క్లీన్చిట్ ఇచ్చారు. సంతృప్తి చెందని మృతుడు అమిత్ జెత్వా తండ్రి భిఖాభాయ్ జెత్వా కేసును సీబీఐకి అప్పగించాలంటూ కోర్టును కోరారు. కోర్టు అందుకు అంగీకరించడంతో సీబీఐ విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. కేసును పరిష్కరించడానికి న్యాయవ్యవస్థ ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, తమ కుటుంబానికి న్యాయం అందిందని తీర్పు అనంతరం భిఖాభాయ్ పేర్కొన్నారు. -
గుజరాత్ బీజేపీ మాజీ ఎంపీకి షాక్
అహ్మదాబాద్ : ఆర్టీఐ కార్యకర్త సంచలన హత్య కేసులో బీజేపీ మాజీ ఎంపీ, మైనింగ్ మాఫియా దిను బోఘా సోలంకికి అహ్మదాబాద్ సీబీఐ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. సోలంకితో పాటు ఈ కేసులో దోషులందరికీ జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. గత శనివారం సోలంకి తోపాటు మరో ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు గురువారం వీరికి శిక్షలను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. అలాగే వీరికి 59,25,000 రూపాయలు జరిమానా కూడా విధించింది. ఈ సొమ్ములో రూ.11 లక్షలు ఆర్టీఐ కార్యకర్త కుటుంబానికి అందజేయాలని ఆదేశించింది. ముఖ్యంగా భార్యకు రూ. 5 లక్షలు, ఇద్దరు పిల్లలకు రూ.3 లక్షల చొప్పున ఏదైనా జాతీయ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని చెప్పింది. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై ఆర్టీఐలో పిల్ దాఖలు చేసిన నెలరోజుల్లోనే ఆర్టీఐ కార్యకర్త అమిత్ జేత్వా హత్య గురయ్యారు. జూలై 20, 2010న గుజరాత్ హైకోర్టు ఆవరణలో సోలంకి, మరికొంతమందితో కలిసి అమిత్‌ను దారుణంగా హత్య గావించారన్న సీబీఐ వాదనలను కోర్టు విశ్వసించింది. దీంతో దిను సోలంకి మేనల్లుడు శివ సోలంకి, శైలేష్ పాండ్యా(షూటర్) తోపాటు బహదూర్‌సింగ్ వాధర్, పంచన్ జి దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉదాజీ ఠాకకూర్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక న్యాయమూర్తి కెఎం డేవ్ జీవిత ఖైదు శిక్షను విధించారు. మరోవైపు తన కుమారుడు అమిత్ జేత్వా హత్య పై సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న తండ్రి భిఖిభాయ్ జేత్వా ఈ తీర్పు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాజా తీర్పు భారత న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి లభించిన విజయమని పేర్కొన్నారు. ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందన్నారు. చదవండి : సంచలన హత్యకేసులో బీజేపీకి షాక్ -
సంచలన హత్యకేసులో బీజేపీకి షాక్
ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో బీజేపీకి గుజరాత్లో భారీ షాక్ తగిలింది. సంచలనాత్మక హత్య కేసులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ఎంపీ, మైనింగ్ మాఫియా దిను బోఘా సోలంకితో పాటు మరో ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. అనేక మలుపులు తరువాత ఈ కేసులో సంచలన తీర్పు వెలువడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక న్యాయమూర్తి కెఎం డేవ్ శనివారం ఈ తీర్పును వెలువరించారు. ఈ నెల (జూలై) 11న వీరికి శిక్షలను ఖరారు చేయనున్నారు. దోషుల్లో దిను సోలంకి మేనల్లుడు శివ సోలంకి, శైలేష్ పాండ్యా(షూటర్) తోపాటు బహదూర్‌సింగ్ వాధర్, పంచన్ జి దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉదాజీ ఠాకూర్ ఉన్నారు. పులుల సంరక్షణా కేంద్రం గిర్ అడవుల్లో అక్రమ తవ్వకాలపై ప్రశ్నించినందుకు ఆర్టీఐ కార్యకర్త అమిత్ జేత్వా హత్యకు గురయ్యారు. జూలై 20, 2010న గుజరాత్ హైకోర్టు ఆవరణలో ఇద్దరు దుండగులు అమిత్‌ను దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య కేసులో కీలక కుట్రదారుడిగా సోలంకిపై సీబీఐ అభియోగాలు మోపింది. గిర్ అడవిలోని నిషేధిత ప్రాంతాలలో సోలంకి అక్రమ మైనింగ్ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చినందున అమిత్‌ను కిరాయి గుండాలతో హత్య చేయించినట్టుగా సీబీఐ ఆరోపించింది. 2013లో సోలంకిని అరెస్ట్ చేసిన సీబీఐ అమిత్ హత్య కేసులో కీలక కుట్రదారుడిగా వాదించింది. ప్రధానంగా నిందితుల కాల్ డేటా రికార్డ్స్ (సిడిఆర్) ఆధారంగా వీరిని నేరస్తులుగా పేర్కొంటూ చార్జ్‌షీటు దాఖలు చేసింది. కాగా ఈ హత్య కేసును మొదట అహ్మదాబాద్ డిటెక్షన్ క్రైమ్ బ్రాంచ్ (డిసిబి) విచారించింది. కానీ నిందితులందరికీ డీసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే విచారణ సమయంలో 195మంది సాక్షుల్లో 105 మంది సోలంకి బెదిరింపులకు లొంగిపోయారనీ, సీబీఐ దర్యాప్తు కోరుతూ అమిత జెత్వా తండ్రి భిఖాభాయ్ జెత్వా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ తరువాత కేసు మరో మలుపు తిరిగింది. అనూహ్యంగా విచారణను నిలిపి వేసింది కోర్టు. కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అసాధారణ ఆదేశాలిచ్చింది. ఈ కేసును పునిర్విచారణ చేయాలని స్పెషల్ కోర్టును కోరింది. అంతేకాదు న్యాయమూర్తి దినేష్ ఎల్ పటేను మార్చాలని కూడా ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా తీర్పు వెలువడింది. -
బ్యాంకు కుంభకోణం : ఆరుగురికి జీవిత ఖైదు
సాక్షి, ముంబై: దాదాపు 20 ఏళ్ల నాటి కేసులో ముంబై స్పెషల్ కోర్టుసంచలన తీర్పును వెలువరించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మాజీ అధికారితోపాటు మరో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. అంతేకాదు ఈ కేసులో న్యాయవాదికి మూడేళ్ల జైలు శిక్షను విధించిందని గురువారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది. 2000 బీఓఐలో చోటు చేసుకున్న 2.91కోట్ల కుంభకోణానికి సంబంధించి కోర్టు ఈ తీర్పును వెలువరించింది. సీబీఐ అందించిన సమాచారం ప్రకారం, 2000లో స్విఫ్ట్ సేవల కింద బ్రాంచ్ అధికారులతో కుమ్మక్కై, నకిలీ పత్రాలతో ఆహుజా అతని భాగస్వాములు కలిసి 2.50 కోట్ల రూపాయల మేర లోన్ తీసుకున్నారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో 2004 ప్రారంభంలో ఎన్పీఏగా ప్రకటించబడింది. దీంతో బ్యాంకు నష్టం మొత్తం రూ. 2.91 కోట్లకు చేరింది. 2004లో కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ అనంతరం నవంబరు 2005లో చార్జిషీట్ దాఖలు చేసింది. బ్యాంకుకు చెందిన అప్పటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భగవాన్జీ డి.జోషి, బ్యాంకులో రుణం తీసుకున్న 5గురు వ్యాపారవేత్తలు - మనోహర్‌లాల్ ఆహుజా, అతని కుమారుడు అమిత్ ఆహుజా, మహేష్ బోరా, సందేష్ రామచంద్ర నాగే, జి.కె.శర్మ, శాంతిలాల్ చౌహాన్ తోపాటు న్యాయవాది యూనస్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసింది. దీనిపై ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో విచారణ అనంతరం ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పు చాలా అరుదైనది. ఒక మైలురాయిలాంటిదని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఆహుజా తండ్రీకొడుకులిద్దరికి చెరి రూ. 50 లక్షలు, బొహ్రా రూ. 3లక్షలు, నాగే రూ. 60వేల, చౌహాన్ రూ .50వేలు జోషి రూ. లక్ష, న్యాయవాదికి రూ .3 వేల జరిమానా విధించడం గమనార్హం. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన శర్మ ఆగస్టు ,2008 లో చనిపోయారు. -
డేరా బాబాకు యావజ్జీవ శిక్ష
పంచ్‌కుల: జర్నలిస్ట్ రామ్‌చందర్ చత్రపతి హత్య కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రాం రహీం సింగ్(డేరా బాబా)కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పంచ్‌కులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు డేరాబాబా, మరో ముగ్గురికి జీవిత కారాగారం విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. బాబా, అతని అనుయాయులు నిర్మల్ సింగ్, కుల్దీప్ సింగ్, కృష్ణలాల్ కలిసి హరియాణాలోని సిర్సా ఆశ్రమంలో 2002లో జర్నలిస్ట్ రామ్‌చందర్ చత్రపతిని చంపేశారు. డేరా బాబా ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ చత్రపతి తన పత్రికలో కథనం ప్రచురించడమే ఇందుకు కారణం. -
సోహ్రబుద్దిన్ హత్య కేసులో నిందితులందరూ నిర్దోషులే
-
‘నా చావుకి సీబీఐ బాధ్యత వహిస్తుందా..?’
ముంబై : ఒక వేళ నేను మరణిస్తే.. నా మరణానికి సీబీఐ బాధ్యత వహిస్తుందా అంటూ ప్రశ్నించారు ఇంద్రాణి ముఖర్జియా. ప్రస్తుతం ఇంద్రాణి, కన్నకూతురు షీనా బోరాను హత్య చేసిన ఆరోపణలతో జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యంగో బాధపడుతున్న తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బెయిల్ పిటిన్‌ను ఈ రోజు కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఆమె వాదిస్తూ, 'అనారోగ్యంతో ఉన్న నాకు బెయిల్ చాలా అవసరం. నేను మెదడులో నరాల సమస్యతో బాధపడుతున్నాను. బెయిల్ వచ్చిన వెంటనే స్పెషలిస్టుల చేత వైద్యం చేయించుకుంటాను. ఒక వేళ నేను చనిపోతే దానికి సీబీఐ బాధ్యత తీసుకుంటుందా?' అని ప్రశ్నించింది. అయితే కోర్టు ఆమె వాదనలను పట్టించుకోలేదు. ఇంద్రాణికి బెయిల్ మంజూరు చేయలేమంటూ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇంద్రాణి ముఖర్జియా ప్రస్తుతం ముంబైలోని భైకుల్లా జైల్లో శిక్షను అనుభవిస్తోంది. కూతరు శినా బోరాను హత్య చేసిని కేసులో 2015లో ఆమెను అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఆమె బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఆమె మంచి చెడ్డలు చూడటానికి కుటుంబసభ్యులు ఎవరూ లేరని కోర్టు తెలిపింది. -
‘మోదీ, షాలను అరెస్ట్ చేయాలనుకున్నారు’
అహ్మదాబాద్: సంచలనం సృష్టించిన ఇష్రాత్ జహాన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో సీబీఐ.. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షాను అరెస్టు చేయాలనుకుందని మాజీ డీఐజీ వంజారా కోర్టుకి తెలిపారు. అదృష్టం బాగుండి వారిద్దరూ తప్పించుకున్నారని వ్యాఖ్యానించారు. ఇష్రాత్ జహాన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సీబీఐ ప్రత్యేక స్థానంలో మంగళవారం విచారణకు హాజరయ్యారు. కాగా, సరైన ఆధారాలు చూపించడంలో సీబీఐ విఫలమైందంటూ 2014లో కోర్టు అమిత్ షా, మోదీలకు క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. విషయం.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ఇష్రాత్ జహాన్, ఆమె స్నేహితులు జావేద్ అలియాస్ ప్రాణేశ్, పాకిస్తానీ యువకులు జీషాన్ జొహార్, అంజాద్ రాణాలను తీవ్రవాద దళంగా పోలీసులు అనుమానించారు. ఈ నలుగురు మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నారని భావించి.. నాటి డీఐజీ వంజారా నేతృత్వంలో వారిని కాల్చి చంపారు. అయితే మృతులు తీవ్రవాదులు కాదనే విషయం సీబీఐ విచారణలో వెల్లడైంది. వంజారా కుట్ర పూరితంగా వ్యవహరించడం వల్లే నలుగురు అమాయకులు బలయ్యారని సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా, కేసు నుంచి తమను విముక్తం చేయాలని వంజారా, మరో పోలీసు ఉన్నతాధికారి ఎన్.కే.అమిన్ వేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు తిరస్కరించింది. -
లాలూకు మరో 14 ఏళ్ల జైలు
రాంచీ: దాణా కుంభకోణం కేసులు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. 1990ల్లో దుమ్కా ఖజానా నుంచి అక్రమంగా రూ.3.13 కోట్లు తీసుకున్న కేసులో శనివారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.60 లక్షల జరిమానా విధించింది. ఐపీసీతో పాటుగా అవినీతి నిరోధక చట్టం కింద 2 వేర్వేరు కేసుల్లో ఏడేళ్ల చొప్పున జైలు శిక్షను సీబీఐ జడ్జి శివ్‌పాల్ ప్రకటించారు. ఈ రెండు శిక్షలు ఒకదాని తర్వాత మరొకటి అమలు చేయాలని ఆదేశించారు. ఈ తీర్పును ఉన్నతన్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు లాలూ తరపు న్యాయవాది తెలిపారు. దియోగఢ్ ఖజానానుంచి అక్రమంగా డబ్బులు తీసుకున్నారనే కేసులో డిసెంబర్ నుంచి రాంచీలోని బిర్సాముండా జైలులో లాలూ శిక్షననుభవిస్తున్నారు. 420 సహా పలు సెక్షన్ల కింద.. ‘భారతీయ శిక్షాస్మృతిలోని 420 (మోసం), 409 (ప్రజాప్రతినిధిగా విశ్వాసద్రోహం), 467 (విలువైన పత్రాల ఫోర్జరీ), 471 (ఫోర్జరీ పత్రాలను వినియోగించటం), 477 (విలువైన పత్రాలను అక్రమంగా రద్దుచేయటం), 120బీ (నేరపూరిత కుట్రలకు శిక్ష) సెక్షన్ల కింద 7ఏళ్ల శిక్షతోపాటు రూ.30లక్షల జరిమానా విధించారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం మరో ఏడేళ్ల జైలు, రూ.30 లక్షల జరిమానా విధించారు’ అని సీబీఐ తరపు న్యాయవాది విష్ణుశర్మ పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో మరికొన్నేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందన్నారు. ఈ కేసులో మరో 18 మంది దోషులకూ న్యాయమూర్తి శిక్షలను ఖరారు చేశారు. పశుసంవర్ధక శాఖ మాజీ ప్రాంతీయ సంచాలకుడు ఓపీ దివాకర్‌కు కూడా లాలూతో సమానమైన శిక్షనే విధించారు. మాజీ ఐఏఎస్ అధికారి ఫూల్‌చంద్ సింగ్ సహా తొమ్మిది మంది అధికారులకు ఏడేళ్ల జైలు, రూ. 30 లక్షల జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏడుగురు దాణా సరఫరాదారులకు మూడున్నరేళ్ల జైలు, రూ.15లక్షల జరిమానాను ఖరారు చేశారు. దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదు కేసుల్లో లాలూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత వారం ఛాతీనొప్పి కారణంగా ప్రస్తుతం లాలూ రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆర్జేడీ, బీజేపీ మాటల యుద్ధం తాజా కోర్టు తీర్పు నేపథ్యంలో బీజేపీపై ఆర్జేడీ తీవ్రంగా మండిపడింది. బీజేపీ రాజకీయ కుట్ర కారణంగానే ఈ కేసులన్నీ నమోదయ్యాయని ఆరోపించింది. అటు బిహార్ అసెంబ్లీలో లాలూ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ ‘బీజేపీ నుంచి లాలూ ప్రసాద్ ప్రాణాలకు ముప్పు ఉంది. ఆయన అమాయకుడు. ఉన్నత న్యాయస్థానంలో మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా ఆర్జేడీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ‘చట్టం తనపని తాను చేసుకుపోతోంది. దాణా కుంభకోణంలో ఇదేమీ మొదటి కేసు కాదు. లాలూ ప్రాణాలకు ముప్పుందనటం అవాస్తవం. ఆయనకు జైల్లో సంపూర్ణమైన భద్రతను ఏర్పాటుచేశాం’ అని బిహార్ డిప్యూటీ సీఎం, దాణా స్కాం పిటిషనర్లలో ఒకరైన సుశీల్ మోదీ పేర్కొన్నారు. -
నాలుగో కేసులోనూ లాలూ దోషే
-
నాలుగో కేసులోనూ లాలూ దోషే
రాంచీ: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరో ఎదురుదెబ్బ. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులోనూ ఆయన దోషిగా తేలారు. డుమ్కా ఖజానా నుంచి రూ.3.13 కోట్లను అక్రమంగా ఉపసంహరించుకున్న కేసులో లాలూ పాత్ర ఉందని నిర్ధారిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి శివ్‌పాల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. లాలూతోపాటు మరో 18 మందిని దోషులుగా తేల్చారు. ఇక మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాతోపాటు 12 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. దోషులకు శిక్షలు ఖరారు చేసేందుకు ఈ నెల 21 నుంచి జడ్జి వాదనలు వింటారని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. -
బిగ్ బుల్‌కు షాక్: జైలు శిక్ష, జరిమానా
సాక్షి, ముంబై: మాజీ స్టాక్ బ్రోకర్లు కేతన్ పరేఖ్, కార్తీక్ పరేఖ్‌లకు సెబీ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. స్టాక్ ఎక్స్చేంజ్లో భారీ అక్రమ లావాదేవీలు లాంటి పలు కేసుల్లో నేరస్తుడిగా తేలిన పరేఖ్బ్రదర్స్కు మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు సెబీ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. కేతన్, కార్తీక్ డైరెక్టర్లుగా ఉన్న పాంథర్ ఫిన్‌కార్ప్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సెబీ నిబంధనలను వ్యతిరేకంగా షాంక్ టెక్నాలజీస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి పరిమితికి మించి షేర్లను అక్రమంగా కొనుగోలు చేసింది. ఈ ఉల్లంఘనల పై విచారణను 2003 లో పూర్తి చేసిన సెబీ రూ.6.5 లక్షల జరిమానా విధించింది. దీనిపై నిందితులు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (సాట్)ను ఆశ్రయించారు. అయితే దీన్ని(2007) తోసి పుచ్చడంతో పాటు 45రోజులలోపు ఈ జరిమానాను చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే సాట్ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేయక పోవడంతో ఈ కేసు ముగిసిందని సెబీ కోర్టు ప్రకటించింది. అలాగే జరిమానాను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని సెబీని పరేఖ్ బ్రదర్స్‌కు వేడుకున్నారు. ఇది సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ ఈ ప్రతిపాదను తోసి పుచ్చింది. పెనాల్టీని చెల్లించకపోవడంతో తదుపరి చర్యలకు సెబీ ఉపక్రమించింది. పలుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేయడంతో కోర్టుముందు హాజరుకావల్సిందిగా కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గత నవంబరులో కోర్టుకు హాజరైన కేతన్ పరేఖ్‌ను కస్టడీకి తరిలించగా అప్పటినుంచి జైల్లోనే ఉన్నాడు. దీనిపై విచారించిన సెబీ ప్రత్యేక కోర్టు తాజా తీర్పునిచ్చింది. -
దాణా కేసులో లాలూ దోషే
రాంచీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 21 ఏళ్లనాటి దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఒక కేసులో ఆయన జైలు శిక్ష ఎదుర్కొంటూ ఉండగా.. శనివారం మరో కేసులో రాంచీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. కిక్కిరిసిన కోర్టు గదిలో ప్రత్యేక న్యాయమూర్తి శివ్‌పాల్ సింగ్ తీర్పును వెలువరిస్తూ.. బిహార్ మాజీ సీఎం లాలూ యాదవ్(69) సహా 16 మందిని దోషులుగా ప్రకటించారు. అదే సమయంలో మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా(80)తో పాటు ఆరుగురిని నిర్దోషులుగా పేర్కొన్నారు. జనవరి 3న దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 1991–94 మధ్య కాలంలో దేవ్‌గఢ్ ఖజానా నుంచి రూ. 89.27 లక్షల్ని అక్రమంగా విత్‌డ్రా చేసిన దాణా కేసులో ఈ తీర్పు వెలువడింది. తీర్పు అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఇతర నిందితుల్ని సీబీఐ కస్టడీలోకి తీసుకుని రాంచీలోని బిర్సా ముండా జైలుకు తరలించింది. తీర్పుపై లాలూ స్పందిస్తూ తనను మండేలా, అంబేడ్కర్‌లతో పోల్చుకునే ప్రయత్నం చేశారు. చివరకు సత్యమే గెలుస్తుందని ట్వీట్ చేశారు. ఉదయం నుంచి ఉత్కంఠ.. తీర్పు నేపథ్యంలో ఉదయం నుంచి సీబీఐ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగింది. శనివారం తీర్పు వెలువరిస్తామని డిసెంబర్ 13నే కోర్టు చెప్పడంతో.. పెద్ద ఎత్తున లాలూ మద్దతుదారులు గుమిగూడడంతో భారీగా భద్రతా బలగాల్ని మోహరించారు. లాలూతో పాటు బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి తీర్పును ప్రకటిస్తూ.. లాలూతో పాటు రాజకీయ నాయకులైన జగదీశ్ శర్మ, ఆర్కే రానా, ఐఏఎస్ అధికారులు బెక్ జూలియస్, పూల్‌చంద్ సింగ్, మహేశ్ ప్రసాద్, ప్రభుత్వాధికారులు కృష్ణ కుమార్, సుబిర్ భట్టాచార్యల్ని దోషులుగా ప్రకటించారు. దాణా సరఫరా, రవాణాదారులు మోహన్ ప్రసాద్, సుశీల్ కుమార్ సిన్హ్, సునీల్ కుమార్ సిన్హ్, రాజా రాం జోషి, గోపీనాథ్ దాస్, సంజయ్ అగర్వాల్, జ్యోతీ కుమార్ ఝా, సునీల్ గాంధీల్ని కూడా దోషులుగా తేల్చారు. జగన్నాథ్ మిశ్రా , ప్రజా పద్దుల కమిటీ మాజీ చైర్మన్ ద్రువ్ భగత్, మాజీ ఐఆర్ఎస్ అధికారి ఏసీ చౌదరీ, దాణా సరఫరాదారులు సరస్వతీ చంద్ర, సాధనా సింగ్, మాజీ మంత్రి విద్యాసాగర్ నిషాద్లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ చెప్పారు. న్యాయ పోరాటంతో పాటు.. రాజకీయంగానూ పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘ఒకే కేసులో కొందరిని విముక్తుల్ని చేయడం, మరికొందరికి జైలు శిక్ష విధించడం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు’ అని మరో సీనియర్ నేత అబ్దుల్ సిద్దిఖీ వ్యాఖ్యానించారు. శిక్షాకాలం ప్రకటించాక పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఓట్ల కోసం ప్రతిపక్షాలపై బీజేపీ దుష్ప్రచారం: లాలూ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ఓట్ల కోసం.. ప్రతిపక్షాలపై ప్రజల అభిప్రాయాల్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ట్వీటర్లో లాలూ ఆరోపించారు. తీర్పు వెలువడిన తర్వాత ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘బలవంతులైన వ్యక్తులు, వర్గాలు ఎప్పడూ సమాజాన్ని పాలిత, పీడిత వర్గాలుగా విభజిస్తూనే ఉన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కింది స్థాయి వ్యక్తులు శిక్షకు గురవుతున్నారు. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, బాబా సాహెబ్ అంబేడ్కర్ వంటి నేతలు.. వారి ప్రయత్నాల్లో విఫలమైతే చరిత్ర వారిని ప్రతినాయకులుగా పరిగణించి ఉండేది. పక్షపాతం, జాతివివక్ష, కులతత్వంతో నిండిన వ్యక్తులకు నేటికీ వారు ప్రతినాయకులే. వేరే విధంగా ఎవరూ ఆశించలేరు. పక్షపాతంతో కూడిన అసత్య ప్రచారంతో.. సత్యాన్ని అబద్ధంగా, అర్ధ సత్యంగా అనిపించేలా చేయవచ్చు. అయితే అంతిమంగా సత్యం గెలుస్తుంది. సత్యం చెప్పులు తొడుక్కునేలోపే అబద్ధం ప్రపంచాన్ని సగం చుట్టి రాగలదు.. చివరికి సత్యమే నిలుస్తుంది’ అని ట్వీట్లలో పేర్కొన్నారు. 1997లో 38 మందిపై చార్జిషీటు దాణా కుంభకోణం కేసులు వెలుగులోకి వచ్చాక 1996లో పట్నా హైకోర్టు విచారణకు ఆదేశించింది. 1997, అక్టోబర్ 27న దేవ్‌గఢ్ ఖజానా కేసులో 38 మందిపై చార్జిషీటు దాఖలైంది. ఈ కేసులో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి. కేసు విచారణలో ఉండగా 11 మంది మరణించగా.. ఇద్దరు తప్పు ఒప్పుకోవడంతో 2006–07లో కోర్టు వారికి జైలు శిక్ష విధించింది. పశువుల పేరిట నిధులు స్వాహా దాణా కుంభకోణం...1980, 90 దశకాల్లో ఉమ్మడి బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మొత్తం రూ.950 కోట్ల మేర అవినీతి జరిగినట్లు అంచనా. రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, దాణా సరఫరాదారులు కుమ్మక్కై.. ఉనికిలో లేని కంపెనీల నుంచి దాణా కొనుగోలు పేరిట వందల కోట్లు స్వాహా చేశారనేది ప్రధాన అభియోగం. దాణా కుంభకోణం, దానితో ముడిపడ్డ ఇతర ఆరోపణలపై మొత్తం 64 కేసులు నమోదు కాగా, ఐదు కేసుల్లో లాలూప్రసాద్ నిందితుడిగా ఉన్నారు. దేవ్‌గఢ్ ఖజానా నుంచి నిధుల స్వాహా కేసులో తాజా తీర్పు వెలువడింది. కుంభకోణంలోని మిగతా కేసులు ఉమ్మడి బిహార్ రాష్ట్రంలోని చాయిబాసా జిల్లా ఖజానా నుంచి రూ.37.70 కోట్ల మొత్తాన్ని కాజేశారని ఒక కేసులో సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో సెప్టెంబర్ 30, 2013న కోర్టు లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ శిక్షతో లాలూ లోక్‌సభ సభ్యత్వం రద్దవడంతో పాటు.. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో.. లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు నెలలు జైలులో ఉన్న లాలూకు 2013, డిసెంబర్ 13న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణంలో దుమ్కా ఖజానా నుంచి రూ. 3.97 కోట్లు, చాయ్‌బసా ఖజానా నుంచి రూ. 36 కోట్లు, దోరండ ఖజానా నుంచి రూ. 184 కోట్లు అక్రమంగా విత్ డ్రా చేసిన కేసుల్ని కూడా లాలూ యాదవ్ ఎదుర్కొంటున్నారు. కుంభకోణం ఎలా బయటకొచ్చింది పెద్ద సంఖ్యలో పశువులున్నట్లుగా తప్పుడు రికార్డులు చూపి వాటి కోసం దాణా, మందులు, ఇతర పరికరాలను కొనుగోలు చేసినట్లు చూపారు. ఈ కుంభకోణం 1996లో వెలుగు చూసినా, 1980 దశకం, ఆ తర్వాత కూడా అక్రమాలు కొనసాగినట్లు గుర్తించారు. 1996లో ఆర్థికశాఖ కార్యదర్శి వీఎస్ దూబే ఆదేశాలతో జిల్లా కేంద్రాల్లో తనిఖీల్లో అవకతవకలు వెలుగులోకివచ్చాయి. 1993–96 మధ్య 40,500 కోళ్లు, 5,664 పందులు, 1,577 మేకలు, 995 గొర్రెల కొనుగోలుకు పశుసంవర్ధకశాఖకు రూ.10.5 కోట్లు కేటాయించారు. ఆ శాఖ మాత్రం ఖజానా నుంచి రూ.255.33 కోట్లు తీసుకుంది. వీటికి ఇతర ఖర్చులు కలిపి రూ.409.62 కోట్లు విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ఈ లెక్కల్ని బిహార్ ఆడిటర్ జనరల్ పరిశీలించి అవినీతి ఉన్నట్లు తేల్చారు. ఈ కుంభకోణంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో.. 1996లో పట్నా హైకోర్టు ఈ కేసును సీబీఐకు అప్పగించింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
2జీ స్కామ్ తీర్పు.. హజారే ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : గాంధేయవాది, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహజారే 2జీ స్పెక్ట్రమ్ కేసు తీర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తీర్పుపై మీడియా ఆయన్ని సంప్రదించగా.. కోర్టు తీర్పు సరైందని ఆయన వ్యాఖ్యానించారు. తొలుత అంశంపై స్పందించేందుకు నిరాకరించిన ఆయన తర్వాత మీడియా ఒత్తిడి చేయటంతో మాట్లాడారు. ‘‘కోర్టు తీర్పులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేం. అవి ఖచ్ఛితంగా.. సహేతుకంగా ఉన్నాయనే భావిస్తున్నాం. న్యాయస్థానాలు కేవలం సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని.. విచారణ చేపట్టాకే తీర్పులు ప్రకటిస్తాయి. వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకపోతే నిరపరాధిగానే తేలుస్తాయి. వాటిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సుమారు ఏడేళ్ల తర్వాత సీబీఐ కోర్టు కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించటం తెలిసిందే. డీఎంకే నేతలు కనిమొళి, రాజాలు ఇందులో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కున్నారు. యూపీఏ రెండో దఫా అధికారం చేపట్టాక సుమారు 1.76 లక్షల కోట్ల అవినీతి స్కాంగా 2జీ స్పెక్ట్రమ్ వార్తల్లో నిలిచింది. -
బొగ్గు స్కాంలో మధు కోడాకు మూడేళ్లు జైలు
-
మధుకోడాకు మూడేళ్ల జైలు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసు, కోడా సన్నిహితుడు విజయ్ జోషిలకు మూడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. విసుల్ సంస్థకు రూ.50 లక్షలు, జోషికి రూ.25 లక్షలు; బసు, గుప్తాలకు రూ.లక్ష జరిమానావేసింది. జార్ఖండ్‌లోని రాజారా ఉత్తర బొగ్గు గనులను విసుల్ సంస్థకు కేటాయించడంలో వీరు అవినీతి, నేరపూరిత కుట్రలకు పాల్పడటంతో ఈ శిక్షలు వేశామని కోర్టు వ్యాఖ్యానించింది. ‘మామూలు నేరాల కంటే వైట్ కాలర్ నేరాలే సమాజానికి అత్యంత ప్రమాదకరం. వీటి వల్ల దేశం భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టపోతోంది’ అని సీబీఐ కోర్టు జడ్జి భరత్ పరాశర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుతో మధుకోడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోనున్నారు. ఇదిలాఉండగా మొత్తం 30 బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇప్పటివరకు నాలుగింటిలో 12 మంది వ్యక్తులకు, నాలుగు సంస్థలకు శిక్షలు పడ్డాయి. కాగా తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని మధుకోడా చెప్పారు. -
నకిలీ ధృవపత్రాల కేసు.. సీబీఐ కోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్ : నకిలీ ధృవపత్రాల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ న్యాయస్థానం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. నారాయణగూడ విజయ బ్యాంక్‌ను మోసం చేసిన ఐదుగురు దోషులకు ఐదేళ్ల చొప్పున శిక్షలను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించింది. విజయ బ్యాంక్ మేనేజర్ రాజగోపాల్‌రెడ్డితోపాటు ఉదయ్ శంకర్, రామంజిరావు, సాయి సీతారాం, అబ్బరాజు వెంకటసుబ్బారావులు నకిలీ పత్రాలతో బ్యాంకుకు కోటి రూపాయలు టోకరా వేసినట్లు ఆరోపణలు ఎదుర్కున్నారు. అవి రుజువైనందున సీబీఐ కోర్టు ఈ తీర్పును ఖరారు చేసింది. -
వ్యాపం స్కామ్... ఉచ్చు బిగుస్తోందా?
భోపాల్ : సంచలనం సృష్టించిన వ్యాపం నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. నిందితుల బెయిల్ పిటిషన్లను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో వాదనలు గురువారం మధ్యాహ్నాం 3గం. నుంచి శుక్రవారం వేకువ ఝామున (2గం.41ని.) దాకా కొనసాగాయి. మధ్యప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి ఇలా జరగటం విశేషం. ఈ సందర్భంగా దాఖలైన 30 ఇంటీరియమ్ బెయిల్ దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. చిరయూ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ అజయ్ గోయెంకతోపాటు డీకే సప్తపతి, డాక్టర్ రవి సక్సేనా, ఎస్ ఎన్ సక్సేనా, డాక్టర్ వినాయక్ భవసర్, డాక్టర్ అశోక్ జైన్ తదితరుల అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. వీరితోపాటు పీపుల్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ విజయ్వార్గియా, డైరెక్టర్ అశోక్ నంగ్నాథ్, వైస్ ఛాన్స్లర్ విజయ్ కుమార్ల పిటిషన్లను కూడా తిరస్కరించింది. అంతకు ముందు వాదనలకు హాజరుకానీవారికి న్యాయస్థానం అరెస్ట్ వారెంట్లు జారీ చేయగా, ఒక లక్ష రూపాయల పూచీకత్తు మీద 15 మంది నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. మొత్తం 592 మందిలో నలుగురు వ్యాపమ్ అధికారులు, ముగ్గురు దళారులు, 22 మధ్యవర్తిత్వం వహించనవారు, 334 విద్యార్థులు, 155 మంది విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయని సీబీఐ తరపు న్యాయవాది సతీశ్ దినకర్ తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు(ఎమ్పీపీఈబీ) నిర్వహించే పరీక్షలో అక్రమాలకు పాల్పడటంతో వ్యాపం స్కామ్ వెలుగులోకి వచ్చింది. 1995 నుంచి ప్రవేశ పరీక్షల్లో అక్రమాల ద్వారా దాదాపు రూ.2 వేల కోట్ల రూపాయలు అధికారులకు చేరాయి. చిరయూ, పీపుల్స్, ఎల్ ఎన్ మెడికల్ కాలేజీలతోపాటు మరో మెడికల్ కాలేజీ యాజమాన్యాల పాత్రలపై ప్రధాన ఆరోపణలు వినిపించగా.. ఆయా కాలేజీ ఛైర్మన్లకు అరెస్ట్ కూడా చేశారు. గడిచిన పదేళ్లుగా ఈ కేసులో ఏదో ఒక కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. ఇందులో కీలక నేతల పేర్లు తెర మీదకు రావటం.. కేసులో నిందితులు ఆత్మహత్య చేసుకోవడమో లేదా విద్యార్థులకు సాయం చేసిన వ్యక్తులు హత్యకు గురికావడం వంటివి ఇప్పటికీ వ్యాపం స్కామ్ ఓ పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. -
కోల్ స్కాం.. జిందాల్‌కు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఊరటనిచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ సహా మరో ముగ్గురికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఉర్తన్ నార్త్ కోల్ బ్లాక్ కేటాయింపులో అవకవతవకల ఆరోపణలు రావటంతో విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ జిందాల్ సహా పలువురి పాత్రను వెలుగులోకి తీసుకొచ్చింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లు కూడా ఛార్జిషీటులో చేర్చింది. జిందాల్‌స్టీల్ పవర్ లిమిటెడ్ మాజీ డైరక్టర్ సుశీల్ మర్రూ, మాజీ మేనేజింగ్ డైరక్టర్ ఆనంద్ గోయల్, సీఈవో విక్రాంత్ గుజ్రాల్ లను కూడా నిందితులుగా సీబీఐ పేర్కొంది. ఉర్తన్ నార్త్ కోల్ బ్లాకు కేటాయింపులో వీరు మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్ర జరిపారని సీబీఐ ఆరోపించింది. అయితే బెయిల్ కోరుతూ వాళ్లు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం లక్ష రూపాయల పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. మరోవైపు జార్ఖండ్ అమరకొండ ముర్గదంగల్ కోల్ బ్లాక్ కేటాయింపుల్లో కూడా జిందాల్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
‘ఇంద్రాణిని ఒకసారి తీసుకురండి’
ముంబయి: కూతురుని హత్య చేయించిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియాను తమ ముందు హాజరుపరచాలని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం బైకుల్లా జైలు అధికారులను ఆదేశించింది. బుధవారం ఆమెను కోర్టుకు తీసుకురావాలని చెప్పింది. బైకుల్లా జైలులో జరిగిన అల్లర్లలో ఇంద్రాణిని జైలు సిబ్బంది వేధించారని, ఆమె ఒంటిపై, తలకు గాయాలు కూడా అయ్యాయని పేర్కొంటూ ఆమె తరుపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైలులో తాజాగా లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకొని తోటి ఖైదీ మరణించడంతో తానిప్పుడు భయపడుతున్నానని, జైలులో తీవ్ర హింస జరుగుతుందని కూడా కోర్టుకు సమర్పించిన పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. మెదడుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న ఇంద్రాణికి ఏదైనా జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని కూడా అందులో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారు చేస్తున్న ఆరోపణలు నిజమోకాదో తెలుసుకునేందుకు కోర్టుకు తీసుకురావాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. -
యడ్యూరప్పకు ఊరట
అవినీతి కేసులో సీబీఐ కోర్టు క్లీన్చిట్ సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు సీబీఐ ప్రత్యేకకోర్టులో పెద్ద ఊరట లభించింది. అవినీతి కేసులో ఆయనతోపాటు ఇద్దరు కుమారులు, అల్లుడు, మరో 9 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు రూ.40 కోట్ల ముడుపులు తీసుకొని బళ్లారిలో అక్రమ మైనింగ్‌కు అనుమతులిచ్చినట్లు కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలను చూపడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ కోర్టు జడ్జి ఆర్బీ ధర్మేగౌడ బుధవారం తీర్పు చెప్పారు. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఈ కేసులో 13 మందిపై దాఖలైన అభియోగాలను జడ్జి కొట్టివేశారు. వీరందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని 400 పేజీల తీర్పులో పేర్కొన్నారు. తీర్పు సమయంలో కోర్టు హాల్లో ఉన్న యడ్యూరప్ప ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. ఈ కేసులో యడ్యూరప్ప ప్రధాన నిందితుడిగా ఉండగా, ఆయన కుమారులు రాఘవేంద్ర(ఎమ్మెల్యే),విజయేంద్ర, అల్లుడు సోహన్ కుమార్ మరో 9మందిపైనా సీబీఐ 2012లో చార్జిషీటు వేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న యడ్యూరప్పకు ఈ తీర్పుతో ఊరట లభించింది. ‘సత్యమేవ జయతే’ అని తన సంతోషాన్ని ట్విటర్లో పంచుకున్నారు. కేసు పూర్వాపరాలు... 2008-11లో యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు జిందాల్ కంపెనీకి చెందిన సౌత్‌వెస్ట్ మైనింగ్ సంస్థకు కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా తనకు సంబంధించిన ‘ప్రేరణ’ ఎన్జీవోకు రూ.20 కోట్లు విరాళాలుగా పొందినట్లు సీబీఐ అభియోగం. బెంగళూరు జిల్లా రాచేనహళ్లి వద్ద ఎకరా స్థలాన్ని డీనోటిఫై చేయడం వల్ల యడ్యూరప్ప కుమారులైన రాఘవేంద్ర, విజయేంద్ర, అల్లుడు సోహన్ రూ.18.78 కోట్లు లాభపడ్డారనీ ఆరోపించింది. రూ.40 కోట్ల ముడుపులు పొంది రాష్ట్ర ఖజానాకు రూ.800 కోట్ల నష్టం తెచ్చారని ‘సమాజ పరివర్తన’ నేత హీరేమఠ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఆరోపణలు నిజమంటూ లోకాయుక్త సంతోష్ హెగ్డే ప్రభుత్వానికి నివేదికివ్వడంతో 2011లో యడ్యూరప్ప సీఎం పీఠం నుంచి తప్పుకున్నారు. -
'నాపై కుట్ర పన్నినా...న్యాయమే గెలిచింది'
బెంగళూరు : ఎట్టకేలకు న్యాయం గెలిచిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. లంచం ఆరోపణల కేసులో ఆయనను నిర్దోషిగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. న్యాయస్థానం తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప స్పందిస్తూ తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అప్పట్లో కుట్ర పన్నారని ఆరోపించారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ 'సత్యమేవ జయతే' అంటూ ట్విట్ చేశారు. తనకు దేవుడిపై, న్యాయస్థానంపై నమ్మకం ఉందని యడ్యూరప్ప పేర్కొన్నారు. కాగా 2011లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి జిందాల్ సంస్థకు లబ్ధి చేకూర్చారని, దీని వల్ల దాదాపు రూ.40 కోట్లు ముడుపులు అందాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి యడ్యూరప్ప సహా నలుగురికి సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. Justice is done, I stand vindicated... Thanks to all well wishers,friends & supporters who stood with me in my tough times... — B.S. Yeddyurappa (@BSYBJP) October 26, 2016 -
యడ్యూరప్పకు సీబీఐ కోర్టులో ఊరట
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు బళ్లారి మైనింగ్ కేసులో ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది. కాగా యడ్డీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి జిందాల్ సంస్థకు లబ్ధి చేకూర్చారని, దీని వల్ల దాదాపు రూ.40 కోట్లు ముడుపులు అందాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయమై నమోదైన కేసులో ఇప్పటికీ ఆయన బెయిల్ పైనే ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తి కాగా యడ్యూరప్ప సహా నలుగురిని నిర్దోషులుగా సీబీఐ కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. -
బ్యాంకు మేనేజర్‌కు మూడేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: ‘స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్’ సికింద్రాబాద్ బ్రాంచ్ మేనేజర్ ఎన్ఎంఆర్ దీక్షితులుకు సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించింది. మరో నిందితురాలు జయశ్రీకి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1.75 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. కేసులో నిందితుడు చక్కిలం రఘురామ్ తీర్పు సందర్భంగా కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయన్ను అరెస్టు చేయాలని నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. చక్కిలం ఎస్టేట్స్ సంస్థను నిర్వహించే చక్కిలం రఘురామ్.. తప్పుడు పత్రాలతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ శివాజీనగర్ సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి రూ.2.5 కోట్లు రుణంగా తీసుకున్నారు. బ్యాంకు మేనేజర్లు ఎన్ఎంఆర్ దీక్షితులు, ఉదయ్‌కుమార్ (కేసు విచారణ సమయంలో చనిపోయారు)లు నిందితులు రఘురామ్, చక్కిలం ఎస్టేట్స్ ఉద్యోగి జయశ్రీలతో కుమ్మక్కైనట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. -
‘అరబిందో’ నిత్యానందరెడ్డికి మినహాయింపు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి అరబిందో ఎండీ కె.నిత్యానందరెడ్డికి హైకోర్టు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. జడ్చర్ల సెజ్‌లో భూకేటాయింపులకు సంబంధించి అరబిందో కంపెనీలు, ఆ సంస్థ ఎండీ నిత్యానందరెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేయడం తెలిసిందే. దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ప్రతీ శుక్రవారం జరిగే విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరవ్వాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ అరబిందో కంపెనీలు, నిత్యానందరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం విచారణ సందర్భంగా న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం దేశవిదేశాలు తిరిగాల్సి వస్తోందని, ప్రతీ శుక్రవారం విచారణకు హాజరవ్వాల్సి ఉన్న నేపథ్యంలో కీలక సమావేశాల్ని అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో.. వ్యక్తిగత హాజరు నుంచి నిత్యానందరెడ్డికి మినహాయింపునిచ్చారు. కోటేశ్వరరావు, రాజగోపాల్‌లకు కూడా... ఇందూటెక్ జోన్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితునిగా ఉన్న ఆడిటర్ సి.వి.కోటేశ్వరరావుకూ సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న కోటేశ్వరరావు పిటిషన్‌పై శుక్రవారం వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో.. వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. మరోవైపు జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో దాల్మియా సిమెంట్స్‌కు చేసిన భూకేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితునిగా ఉన్న అప్పటి గనులశాఖ అధికారి వి.డి.రాజగోపాల్‌కు సైతం సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి వ్యక్తిగత హాజరు నుంచి న్యాయమూర్తి మినహాయింపునిచ్చారు. -
మన్మోహన్‌కు సమన్లు జారీ చేయాల్సిందే
బొగ్గు స్కామ్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో దాసరి పిటిషన్ న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపు స్కామ్‌లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. స్కామ్‌కు సంబంధించిన ఓ కేసులో మన్మోహన్‌కు సమన్లు జారీ చేయాలని అదే కేసులో నిందితుడైన కేంద్ర బొగ్గుశాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు చెందిన కంపెనీలకు జార్ఖండ్‌లోని అమర్‌కొండా ముర్గాదంగల్ గనిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారన్న కేసులో మన్మోహన్‌ను అదనపు నిందితుడిగా చేర్చి సమన్లు జారీ చేయాలంటూ జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా వేసిన పిటిషన్‌ను దాసరి సమర్థించారు. అప్పటి బొగ్గు మంత్రి కూడా అయిన మన్మోహన్ రెండు పర్యాయాలు పరిశీలించాకే జిందాల్ సంస్థలకు బొగ్గు క్షేత్రాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు దాసరి న్యాయవాది సతీశ్ మనేషిండే.. జడ్జి భరత్ పరాశర్ ఎదుట వాదనలు వినిపించారు. కాగా, కోడా పిటిషన్‌ను తాము సమర్థించట్లేదని అదే సమయంలో దానికి వ్యతిరేకమూ కాదని నవీన్ జిందాల్ న్యాయవాది ఎస్.వి. రాజు చెప్పారు. అయితే కోడా పిటిషన్‌పై వెలువరించే తీర్పు ఈ కేసులో జిందాల్ డిశ్చార్జ్ పిటిషన్ హక్కు సహా ఇతర హక్కులకు విఘాతం కలిగించేలా ఉండరాదన్నారు. సహ నిందితుల్లో చాలా మంది ఇదే వాదన వినిపించారు. కాగా, ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి శాశ్వతంగా మినహాయింపు ఇవ్వాలన్న జిందాల్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు కోడా పిటిషన్‌పై మంగళవారం వాదనలు వినిపిస్తానని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.ఎస్. చీమా కోర్టుకు తెలిపారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, గగన్ స్పాంజ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అక్రమంగా గనిని కేటాయించారని ఆరోపిస్తూ దాసరి, మధుకోడా, జిందాల్ సహా 15 మందిని సీబీఐ ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ వేసింది. అయితే మన్మోహన్తోపాటు అప్పటి ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ స్వరూప్, నాటి గనులు, భూగర్భశాఖ కార్యదర్శి జైశంకర్ తివారీలను ఈ కేసులో అదనపు నిందితులుగా చేర్చాలని మధుకోడా పిటిషన్ వేశారు. దీనిపై అభిప్రాయం తెలపాల్సిందిగా కోర్టు నిందితులకు సూచించింది. -
బొగ్గు స్కాంలో దాసరికి కోర్టు సమన్లు
-
బొగ్గు స్కాంలో దాసరి, జిందాల్, మధుకోడాకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: కోల్ గేట్ కుంభకోణానికి సంబంధించి బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా సహా 14 మందికి సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. వారిని ఈ నెల 22వ తేదీన కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా న్యాయమూర్తి భారత్ పరాశర్ ఆదేశించారు. బొగ్గు గనుల కేటాయింపులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జార్ఖండ్‌లోని అమర్‌కొండ ముర్గదంగల్ బొగ్గు బ్లాకు కేటాయింపునకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసిన సీబీఐ... కేంద్ర మాజీ మంత్రి దాసరితో పాటు 15 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా పేర్కొంటూ ఏప్రిల్ 29న చార్జిషీటు దాఖలు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 120(బీ), 420, 409 కింద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
జూలై 15న బొగ్గు స్కాం కేసు విచారణ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సమన్లు జారీ అయిన బొగ్గు స్కాం కేసు విచారణ జూలై 15న జరగనుంది. ఈ మేరకు విచారణ తేదీని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నిర్ణయించింది. మార్చి 11న మన్మోహన్‌కు జారీ అయిన సమన్లపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు విచారణను సీబీఐ కోర్టు గతంలో వాయిదా వేసింది. తాజాగా ఈ కేసు తదుపరి విచారణకు తేదీని నిర్ణయించింది. నిజానికి ఈ కేసు మూసివేతకు గత డిసెంబర్ 16న సీబీఐ నివేదిక సమర్పించింది. అయితే దీన్ని తిరస్కరించిన కోర్టు.. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని, అప్పట్లో బొగ్గు శాఖ బాధ్యతలను కూడా చూసుకున్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను, పీఎంవో అధికారులను విచారించాలని ఆదేశించింది. ఒడిశాలోని తాలాబిరా-2 బొగ్గు బ్లాకును హిందాల్కో కంపెనీకి 2005లో కేంద్రం కేటాయించింది. ఇందులో అక్రమాలు చోటుచేసుకున్నట్లు నమోదైన కేసులో మన్మోహన్‌ను కూడా నిందితుడిగా సీబీఐ పేర్కొంది. కోర్టు ఆదేశాలతో మాజీ ప్రధానితోపాటు హిందాల్కో కంపెనీకి, దాని యాజమాన్యానికి, ఇద్దరు ఉన్నతాధికారులకు సమన్లు జారీ అయ్యాయి. దీనిపై నిందితులు సుప్రీంను ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. -
ఎస్ఎన్ మహంతికి హైకోర్టులో ఊరట
సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితునిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్.మహంతికి హైకోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిచ్చింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ ఇది అమలులో ఉంటుందని బుధవారం స్పష్టం చేసింది. మహంతి కేంద్ర మానవ వనరులశాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా డిప్యుటేషన్‌పై ఉన్నారు. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ఈ కేసు తేలే వరకూ తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మహంతి హైకోర్టులో పిటిషన్ వేశారు. -
గాలి విడుదలకు ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో బెయిల్ లభించిన గాలి జనార్దన్‌రెడ్డి విడుదలకు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.10 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను ఆయన తరఫు న్యాయవాదులు ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. బెయిల్ ఉత్తర్వులను సీబీఐ కోర్టు సిబ్బంది గురువారం సాయంత్రం చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేశారు. వాటిని ఫ్యాక్స్ ద్వారా కర్ణాటక జైలు అధికారులకు పంపినట్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ బి. సైదయ్య తెలిపారు. కర్ణాటక జై ల్లో గాలి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. -
ఐదు చార్జిషీట్లలో ఒకేసారి వాదనలు
జగన్ పిటిషన్‌ను అనుమతించిన కోర్టు సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఐదు చార్జిషీట్లలో దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్లను, అభియోగాల నమోదు ప్రక్రియను ఒకేసారి చేపట్టాలన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థనను సీబీఐ ప్రత్యేకకోర్టు అనుమతించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఉత్తర్వులు జారీచేశారు. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులతోపాటు అరబిందో, హెటిరో, రాంకీ, వాన్‌పిక్, దాల్మియా సంస్థల పెట్టుబడులకు సంబంధించి దాఖలు చేసిన ఐదు చార్జిషీట్లను కలిపి విచారించాలని కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అన్ని చార్జిషీట్లలో నిందితునిగా ఉన్నందున డిశ్చార్జ్ పిటిషన్లపై ఒకేసారి విచారించాలని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఒక్కో చార్జిషీట్లో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై వేర్వేరుగా తమ వాదన వినిపించాలనడం సరికాదన్నారు. ఈ వ్యవహారంలో తామెలాంటి తప్పుచేయలేదని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను వెల్లడిస్తే, సీబీఐ ఆ లోపాలను సరిచేసుకొని ఇతర చార్జిషీట్లలో తమకు వ్యతిరేకమైన వాదనను వినిపించే అవకాశం ఉందన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఐదు చార్జిషీట్లలో డిశ్చార్జ్, అభియోగాల నమోదుకు సంబంధించిన వాదనలు వినేందుకు అనుమతించారు. అయితే అన్ని చార్జిషీట్లను కలిపి తుది విచారణ (ట్రయల్)ను చేపట్టాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఇదిలాఉండగా ఇదే కేసులో నిందితునిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఈ నెల 25 నుంచి జూన్ 30 వరకు హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. -
'సత్యం' కేసు తుది తీర్పు మార్చి 9కి వాయిదా
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు మరోసారి వాయిదా పడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు... 216 మంది సాక్షులను విచారించి, సీబీఐ సమర్పిం చిన 3,038 డాక్యుమెంట్లను పరిశీలించింది.కాగా సెబీ కేసులో ఆర్థిక నేరాల కోర్టుకు నిందితులు హాజరయ్యారు. అలాగే ఇదే కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో శిక్షను మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నిలిపివేసింది. 2009 జనవరి 7న సత్యం కంప్యూటర్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ ఆయన వాటాదారులకు లేఖలు కూడా రాశారు. దీంతో రామలింగరాజు తనను మోసం చేశాడంటూ హైదరాబాద్‌కు చెందిన షేర్ హోల్డర్ లీలామంగత్ చేసిన ఫిర్యాదు మేరకు ఆ ఏడాది జనవరి 9న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత దీనిని సీబీఐకి బదలాయించారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ...ఈ వ్యవహారం లో 14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా పేర్కొంది. -
నేడు ‘సత్యం’ కేసులో తీర్పు
216 మంది సాక్షులను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు 3,038 డాక్యుమెంట్ల పరిశీలన సెబీ కేసులో సోమవారం ‘ఆర్థిక నేరాల’ కోర్టుకు హాజరైన నిందితులు ఈడీ కేసులో శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేసిన మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. 2009 జనవరి 7న సత్యం కంప్యూటర్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ ఆయన వాటాదారులకు లేఖలు కూడా రాశారు. దీంతో రామలింగరాజు తనను మోసం చేశాడంటూ హైదరాబాద్‌కు చెందిన షేర్ హోల్డర్ లీలామంగత్ చేసిన ఫిర్యాదు మేరకు ఆ ఏడాది జనవరి 9న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత దీనిని సీబీఐకి బదలాయించారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ...ఈ వ్యవహారం లో 14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా పేర్కొంది. రామలింగరాజు సహా ఇతర నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120(బి) (నేరపూరిత కుట్ర), 409(నమ్మకద్రోహం), 419, 420 (మోసం), 467 (నకిలీ పత్రాలను సృష్టించ డం), 468 (ఫోర్జరీ), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం), 477 (ఏ) (అకౌంట్లను తారుమారు చేయడం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) కింద అభియోగాలు మోపింది. నిందితులుగా బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణన్, తళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు, రామకృష్ణ, వీఎస్.ప్రభాకర్‌గుప్తా, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్.శ్రీశైలం ఉన్నారు. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు... 216 మంది సాక్షులను విచారించి, సీబీఐ సమర్పిం చిన 3,038 డాక్యుమెంట్లను పరిశీలించింది. విచారణ పూర్తికావడంతో మంగళవారం తీర్పు వెలువరించనుంది. కాగా.. ఇదే కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును కూడా ఇదే కోర్టు విచారిస్తోంది. సెబీ కేసులో కోర్టుకు హాజరు.. మదుపుదారులను మోసం చేశారంటూ సెబీ దాఖలు చేసిన కేసులో సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజు సోమవారం ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆయన భార్య నందిని, కుమారుడు తేజరాజు, సోదరులు రామరాజు, సూర్యనారాయణరాజు, కుటుంబసభ్యులు రామరాజు, ఝాన్సీరాణితో పాటు వడ్లమాని శ్రీనివాస్, రామకృష్ణ, వీఎస్ ప్రభాకర్‌గుప్తా, చింతలపాటి శ్రీనివాసరాజు తదితరులు కూడా హాజరయ్యారు. హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి లక్ష్మణ్.. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేశారు. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న రామలింగరాజు తల్లి అప్పల నర్సమ్మకు కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. కాగా ‘సత్యం’ మాజీ డెరైక్టర్లకు ఈడీ కేసులో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ఇటీవల విధించిన ఆరు నెలల జైలు శిక్షను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) తాత్కాలికంగా నిలుపుదల చేశారు. -
జగన్ కేసు విచారణ జనవరి 29కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు జనవరి 29కి వాయిదా వేసింది. ఈ కేసు విచారణలో భాగంగా నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకట రమణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్‌రెడ్డి, నిత్యానందరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి, ఐఏఎస్‌లు శ్యామ్యూల్, మన్మోహన్సింగ్, ఆదిత్యనాథ్‌దాస్, శ్యాంబాబు తదితరులు శుక్రవారం కోర్టు ముందు హాజరయ్యారు. అలాగే సీబీఐ ఇటీవల దాఖలు చేసిన 11వ చార్జిషీట్లో నిందితులుగా ఉన్న పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్.మహంతి, ఇందూ సంస్థల అధినేత ఐ.శ్యాంప్రసాద్‌రెడ్డి, వసంత ప్రాజెక్ట్ అధినేత వి.వి.కృష్ణప్రసాద్, జితేంద్ర విర్వానీ తదితరులు హాజరై పూచీకత్తులు సమర్పించారు. ఇదే చార్జిషీట్లో నిందితుల జాబితాలో ఉన్న పలు కంపెనీల ప్రతినిధులు హాజరై పూచీకత్తు బాండ్లను సమర్పించారు. -
వైఎస్ మరణంతోనే జగన్‌పై కేసు
కేసులో జగన్ పాత్ర ఏమిటో సీబీఐ ఎక్కడా చెప్పలేదు సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేశారని, అయితే ఈ కేసులో జగన్ పాత్ర ఏమిటో సీబీఐ ఎక్కడా చెప్పలేదని హైకోర్టు న్యాయవాది పట్టాభి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. కేసు నుంచి తమ పేరును తొలగించాలని కోరుతూ హెటెరో డ్రగ్స్ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి మంగళవారం మరోసారి విచారించారు. క్విడ్‌ప్రోకో అంటే... ఎక్కువ లబ్ధి పొంది తక్కువ పెట్టుబడి పెట్టడమని...అయితే తాము ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపిస్తోందన్నారు. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. జగన్ కేసు విచారణ.. నవంబర్ 20కి వాయిదా వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసు విచారణ నవంబర్ 20కి వాయిదాపడింది. ఈ కేసులో పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాపరెడ్డి, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, ఆడిటర్ విజయసాయిరెడ్డి, మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి సహా ఇతర నిందితులు మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి ఎన్.బాలయోగి తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ఈ కేసు విచారణకు జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకున్న విషయం తెలిసిందే. -
జగన్ హాజరుకు ప్రత్యేక కోర్టు మినహాయింపు
హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత హాజరు మినహారుుంపునకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వారం రోజులుగా జగన్ హుదూద్ తుపాను బాధితులను పరామర్శిస్తున్నారని, మరికొన్ని రోజులు అక్కడే ఉంటారని, ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టు విచారణకు జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నివ్వాలని ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి ఈ ఉత్తర్వులిచ్చారు. -
జయలలిత కేసు తీర్పులోని ముఖ్యాంశాలు
బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత 1991-1996 సంవత్సరాల మధ్య కాలంలో స్థిరాస్తులు, నగదుపై సమర్పించిన లెక్కలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవని బెంగళూరు సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న ఆ కాలంలో ఆదాయం రూ. 9.91 కోట్లు, వ్యయం రూ. 8.49 కోట్లు ఉంది. అయితే, జయలలిత పేరున, ఆమెతోపాటుగా మరో ముగ్గురు నిందితుల పేరిట, వారి పేరున ఉన్న వాణిజ్య సంస్థల పేరిట ఉన్న స్థిరాస్తులు, నగదు విలువ మాత్రం మొత్తం రూ. 53.6 కోట్లుగా ఉంది. దీనిపై జయలలిత పేర్కొన్న లెక్కలు సంతృప్తికరంగా లేవనే అంశాన్ని ఎలాంటి సందేహాలకు తావులేని రీతిలో ప్రాసిక్యూషన్ నిర్ధారించిందని ప్రత్యేక కోర్టు తన తీర్పులో స్పష్టంచేసింది. ఈ కేసుకు సంబంధించి జయలలితను, మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా గత శనివారం ఇచ్చిన తీర్పులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. * ఆదాయ వనరులకు మించి జయలలిత ఆస్తులను కూడబెట్టేందుకు, ఆమె స్నేహితురాలు, శశికళ, సమీప బంధువు ఇళవరసి, పెంపుడు కొడుకు వీఎన్ సుధాకరన్, ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలతో రుజువు చేసింది. అందువల్ల భారతీయ శిక్షాస్మతి (ఐపీసీ), అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద జయలలితతో పాటుగా మిగిలిన ముగ్గురూ శిక్షార్హులే. * కోర్టు విధించిన రూ. 100 కోట్ల జరిమానా జయలలిత చెల్లించని పక్షంలో ఆమె మరో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. * దోషులు చెల్లించవలసిన జరిమానా వసూలు కోసం తగిన చర్యలను కూడా ప్రత్యేక కోర్టు ప్రకటించింది. వారిపేరున ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లను, ఖాతాల్లోని నగదు నిల్వలను జరిమానా మొత్తానికి సర్దుబాటు చేసేలా సంబంధిత బ్యాంకులకు తగిన ఆదేశాలు ఇవ్వాలి. సర్దుబాటు చేసిన మొత్తం జరిమానాకంటే తక్కువగా ఉన్నపక్షంలో,. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని, వజ్రాభరణాలను రిజర్వ్ బ్యాంకుకు, స్టేట్ బ్యాంకుకు అమ్మడం లేదా వేలం వేయడం ద్వారా నగదును సమీకరించి జరిమానా మొత్తానికి సర్దుబాటు చేయాలి. * నిందితులకు సంబంధించిన ఆరు కంపెనీల పేరున ఉన్న స్థిరాస్తులను రాష్ట్రప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. నిందితుల నుంచి వసూలు చేసిన జరిమానా మొత్తంలో ఐదు కోట్ల రూపాయలను బెంగళూరులో జరిగిన ప్రత్యేక కోర్టు విచారణ ఖర్చు నిమిత్తం కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించాలి. ** -
దాణాకేసులో 23 మందికి జైలుశిక్ష
రాంచీ: కోట్లాది రూపాయల దాణా కుంభకోణంలో నిందితులైన 23 మందిని సీబీఐ ప్రత్యేకకోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది. సంశయలాభం కింద మరో పదిమందిని నిర్దోషులుగా పేర్కొంది. 1981-1990 సంవత్సరాల మధ్య బీహార్‌లో పశుదాణా కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే.7.6 కోట్ల రూపాయలను స్వాహా చేసిన ఆర్సీ54 ఏ96 కేసులో విచారణ పూర్తి చేసిన సీబీఐకోర్టు న్యాయమూర్తి బీకే గౌతం శనివారం తీర్పు వెలువరించారు. నలుగురు అధికారులు, 19 మంది దాణా సరఫరాదారులు ఈ కేసులో దోషులని ఆయన పేర్కొన్నారు.వారిలో కొందరికి మూడేళ్లు, మరికొందరికి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. -
మాజీ బ్యాంక్ మేనేజర్ కు కారాగార శిక్ష
న్యూఢిల్లీ: రూ. కోటి మేర వంచనకు పాల్పడిన కే సుకు సంబంధించి ఆంధ్రా బ్యాంక్ మాజీ మేనేజర్‌తోపాటు మరొకరికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంప్రకాశ్ పాండే తీర్పు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి బ్యాంకు సొమ్మును వక్ర మార్గం పట్టించిన బ్యాంక్ మేనేజర్గావిధులు నిర్వర్తించిన 61 ఏళ్ల కృష్ణమూర్తితోపాటు ఓ ప్రైవేటు సంస్థ యజమాని అయిన ఇందర్కపూర్ లను దోషులుగా న్యాయమూర్తి ప్రకటించారు. ఒక్కొక్కరికీ రూ. 20 వేల చొప్పున న్యాయమూర్తి జరిమానా కూడా విధించారు. ఇదే కేసులో దోషులైన పాపిందర్సింగ్ హండా ఒక సంవత్సరం, సంగీత్‌కుమార్‌కు మూడు సంవత్సరాల చొప్పున కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. మరో నిందితుడు రత్నాకర్ నామా, జితేంద్ర గుప్తాలను మాత్రం సంశ య లబ్ధి కింద విడిచిపెట్టారు.మరో నిందితుడు దిల్జీత్ కపూర్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. కాగా నకిలీ పత్రాలను సమర్పించిన దోషులు బ్యాంకునుంచి రూ. కోట మేర రుణం పొందారు. ఇందుకు బ్యాంక్ మేనేజర్ సహకరించాడు. అభియోగాలకు సంబంధించి తగిన ఆధారాలు ఉండడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు ఇచ్చారు. -
నేడు సీబీఐ కోర్టుకు రాజా, కనిమొళి!
కరుణానిధి భార్య దయాళు అమ్మాల్, మరో 16 మందికీ సమన్లు న్యూఢిల్లీ: 2జీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో టెలికాం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఆ పార్టీ అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాల్‌తో పాటు మరో 16 మంది నిందితులు సోమవారం ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యే అవకాశముంది. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు గత నెల 2న ఈ కేసు విచారణ ప్రారంభించింది. నిందుతులంతా సోమవారం విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది. నిందితుల జాబితాలో స్వాన్ టెలికాం, కుసెగావ్ రియాల్టీ, కళైంజర్ టీవీ, డీబీ రియాల్టీ వంటి 9 సంస్థలతో పాటు కళైంజర్ టీవీ ఎండీ శరత్‌కుమార్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరీం మొరానీ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. 2జీ స్కాంలో భాగంగా నిందితులు మనీ లాండరింగ్‌కు సంబంధించిన కుట్రలు, నేరాలకు పాల్పడ్డారని ఈడీ తన చార్జిషీట్లో ఆరోపించింది. వారిపై అక్రమ లావాదేవీల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. డీఎంకే ఆధ్వర్యంలోని కళైంజర్ టీవీకి చెల్లించినట్లు చెబుతున్న రూ. 200 కోట్లకు సంబంధించిన లావాదేవీలు సక్రమంగా లేవని, డీబీ గ్రూప్ కంపెనీలకు ప్రభుత్వం నుంచి టెలికాం లెసైన్సులు ఇప్పించినందుకు ప్రతిగానే ఆ సొమ్మును లం చంగా ఇచ్చిందని ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో అప్పటి టెలికాం మంత్రిగా ఉన్న రాజా ప్రధాన పాత్ర పోషించగా.. కళైంజర్ టీవీలో వాటాలున్న దయాళు అమ్మాల్, కనిమొళితో పాటు ఇతర నిందితులు మనీలాండరింగ్‌కు సహకరించారని ఈడీ పేర్కొంది. -
824 పేజీలు.. 1700 ప్రశ్నలు
టెలికం శాఖ మాజీ మంత్రి రాజాకు సీబీఐ ప్రత్యేక కోర్టు 1700 ప్రశ్నలు సంధించింది. 2జి స్పెక్ట్రం కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలాన్ని నమోదుచేసే ప్రక్రియను సీబీఐ కోర్టు ప్రారంభించింది. ఇందుకోసం మార్చి 27వ తేదీనే మొత్తం 824 పేజీలతో కూడిన ప్రశ్నలను అందజేసింది. వాటికి రాజా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ సైనీ రాజా వాంగ్మూలాన్ని సోమవారం ఉదయం నుంచి నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 2జీ స్పెక్ట్రం కేసులో 153 మందిని ప్రశ్నించి 4400 పేజీల వాంగ్మూలాన్ని కోర్టు నమోదుచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు గత సంవత్సరం ఏర్పడింది. 2జీ స్పెక్ట్రం కేటాయింపులో రాజా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వ ఆడిటర్లు తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాజా, కనిమొళి సహా నిందితులంతా ప్రస్తుతం బెయిల్ మీద బయటే ఉన్నారు. -
ఓఎంసీ కేసులో సబితకు సమన్లు
- మాజీ ఐఏఎస్ కృపానందానికి కూడా.. - జూన్ 4న ప్రత్యక్షంగా హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ మేరకు జూన్ 4వ తేదీన ప్రత్యక్షంగా హాజరుకావాల్సిందిగా వారిని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఆదేశించారు. రూ.25వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను సమర్పించి బెయిల్ పొందాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ కేసులో కృపానందంను ఎనిమిదో, సబితా ఇంద్రారెడ్డిని తొమ్మిదో నిందితులుగా చేరుస్తూ ఈ నెల 9 న సీబీఐ అధికారులు దాఖలు చేసిన మరో అనుబంధ చార్జిషీట్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ఐపీసీ 120 (బీ) రెడ్‌విత్ 409, అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1)(డీ) సెక్షన్ల కింద వారిపై అభియోగాలను విచారణకు స్వీకరించారు. సబితా ఇంద్రారెడ్డిని ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లో సాక్షిగా పేర్కొన్నామని.. అయితే ఈ కేసులో ఆమె పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో నిందితురాలిగా చేర్చేందుకు అనుమతించాలంటూ సీబీఐ దాఖలు చేసిన మెమోను కోర్టు అనుమతించింది. కాగా, 65పేజీల అనుబంధ చార్జిషీట్‌తో పాటు 104 అనుబంధ పత్రాలు, 36 మందిని సాక్షులుగా అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో 2011 డిసెంబర్లో సీబీఐ దాఖలు చేసిన ప్రధాన చార్జిషీట్లో సబితను 53వ సాక్షిగా.. మొదటి, రెండో అనుబంధ చార్జిషీట్లలో 8వ సాక్షిగా పేర్కొన్నారు. ప్రధాన చార్జిషీట్ దాఖలు చేసిన దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత సబిత, కృపానందంలను నిందితులుగా పేర్కొంటూ సీబీఐ మరో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. -
జగన్ హాజరుకు మినహాయింపు
సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఉన్న దృష్ట్యా ఈనెల 21న కోర్టులో తన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక కోర్టు అంగీకరించింది. తన కంపెనీల్లో పెట్టుబడుల కేసులో ఈనెల 21న జగన్ సీబీఐ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో హాజరు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అనుమతిస్తూ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. -
జగన్ హాజరు మినహాయింపునకు కోర్టు నో
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల కేసులో వ్యక్తిగత హాజరుకు మినహాయింపునిస్తూ తన తరఫున న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టులో హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసుకున్న స్పెషల్ వకాలత్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ కేసులో జగన్ హాజరు తప్పనిసరని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. త్వరలోనే సాధారణ ఎన్నికల దృష్ట్యా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉందని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఈ తరుణంలో తన హాజరుకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్టును ఈ పిటిషన్లో అభ్యర్థించారు. -
బీహార్ సీఎంతో భేటీకి అనుమతివ్వండి
సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా బీహార్ సీఎం, జేడీ(యూ) నేత నితీష్‌కుమార్‌ను ఈనెల 13న పాట్నాలో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరఫున న్యాయవాది అశోక్‌రెడ్డి బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నితీష్‌కుమార్ 13న అపాయింట్మెంట్ ఇచ్చారని తెలి పారు. పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టుల ఇన్చార్జ్ న్యాయమూర్తి ఎంవీ రమేష్... దానిపై సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
లక్నో వెళ్లేందుకు అనుమతించండి: వైఎస్ జగన్మోహన్రెడ్డి
సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్.. విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలిసేందుకు వీలుగా లక్నోకు వెళ్లడానికి అనుమతించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీ మద్దతు కూడగట్టాల్సి ఉందని తెలిపారు. హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న తన బెయిల్ షరతును సడలించి అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి బాలయోగి... సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. గతంలో లక్నో వెళ్లేందుకు జగన్‌కు కోర్టు అనుమతి మంజూరు చేసినా... అఖిలేష్ ఉపఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండడంతో ప్రయాణం రద్దయిన విషయం తెలిసిందే. -
ఆరుషిని.. కన్నవారే కడతేర్చారు
ఆరుషి, హేమరాజ్‌ల హత్య కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు రాజేశ్, నూపుర్లు సాక్ష్యాలను కూడా నాశనం చేసినట్లు నిర్ధారణ నేడు వాదనల అనంతరం శిక్షల ఖరారు హైకోర్టులో అప్పీల్ చేస్తామన్న నిందితులు ఘజియాబాద్: పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో దంతవైద్య నిపుణులు రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులను స్థానిక సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో శిక్షల ఖరారుపై మంగళవారం వాదనలు జరగనున్నాయి. నోయిడాలోని వారి ఇంట్లో 2008 మే 15 రాత్రి జరిగిన ఈ జంట హత్యలకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయడానికి సంబంధించి కూడా అదనపు సెషన్స్ జడ్జి శ్యామ్‌లాల్ వారిని దోషులుగా పేర్కొన్నారు. దర్యాప్తు సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరిగిన ఈ కేసులో ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు సోమవారం తీర్పు వెలువడింది. హత్యలపై నోయిడా పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఐపీసీ సెక్షన్ 203 కింద ఆరుషి తండ్రి రాజేశ్ తల్వార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఉదయం కోర్టు రెండుసార్లు వాయిదా పడిన తర్వాత.. ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్న జడ్జి శ్యామ్‌లాల్ మధ్యాహ్నం 3.25 ప్రాంతంలో కోర్టు హాలులోకి ప్రవేశించారు. సంచలనం కలిగించిన ఆరుషి, హేమరాజ్‌ల హత్య కేసులో తీర్పు వెలువడనున్నందున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను కోర్టు హాలులోకి పిలిపించిన న్యాయమూర్తి తీర్పును చదివి వినిపించారు. నిందితులిద్దరూ ఒకే లక్ష్యంతో హత్యలకు పాల్పడ్డారని జడ్జి తెలిపారు. ఐపీసీ సెక్షన్ 302 రెడ్ విత్ 34, 201 రెడ్ విత్ 34 కింద వారిని దోషులుగా నిర్ధారిస్తున్నట్టు వెల్లడించారు. మంగళవారం వాదనలు ముగిసిన తర్వాత జడ్జి శిక్షలు ఖరారు చేస్తారు. నోయిడాలో ప్రముఖులైన ఈ డాక్టర్ దంపతులు సోమవారం జడ్జి తీర్పు వెలువరించగానే కన్నీటితో కుప్పకూలిపోయారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. తీర్పు ప్రకటించిన వెంటనే తల్వార్ దంపతుల తరఫున ఓ ప్రకటన వెలువడింది. తామెంతో నిరాశకు గురయ్యామని, చేయని నేరానికి దోషులుగా నిర్ధారించబడినందుకు తమ హృదయం గాయపడిందని వారు పేర్కొన్నారు. ఓడిపోయినట్టుగా భావించేం దుకు నిరాకరిస్తున్నామని, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. చట్ట ప్రకారం ఈ తీర్పు తప్పని, దీనిపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేస్తామని వారి తరఫు న్యాయవాది సత్యకేతు సింగ్ చెప్పారు. పనిమనుషులపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని ఈ తీర్పుతో స్పష్టమై పోయిందని వారిలో ఒకరి తరఫు న్యాయవాది చెప్పారు. తొలుత క్లీన్చిట్ ఇచ్చిన సీబీఐ ఇవి పరువు హత్యలనే వార్తల నేపథ్యంలో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. తొమ్మిదో తరగతి విద్యార్థి అయిన తమ కుమార్తె నేపాల్‌కు చెందిన 45 ఏళ్ల హేమరాజ్తో సంబంధం పెట్టుకుందనే ఆగ్రహంతో ఆమె తల్లిదండ్రులే ఈ హత్యలకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆరుషిని ఆమె తండ్రే హత్య చేశాడని అప్పటి ఇన్స్పెక్టర్ జనరల్ గురుదర్శన్ సింగ్ ఆరోపించడంతో నోయిడా పోలీసులు రాజేశ్ తల్వార్‌ను అరెస్టు చేశారు. కేసును సీబీఐకి అప్పగించిన కొంత కాలానికి ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. విచిత్రంగా సీబీఐ తొలుత తల్వార్ దంపతులకు క్లీన్చిట్ ఇచ్చింది. ముగ్గురు పనిమనుషులు కృష్ణ, రాజ్‌కుమార్, విజయ్‌లపై నింద మోపింది. పోలీసులు వారిని అరెస్టు చేశారు. అయితే మూడు నెలల గడువులోగా చార్జిషీటు దాఖలు చేయడంలో సీబీఐ విఫలమైంది. దాంతో వారు బెయిల్‌పై విడుదలయ్యారు. తర్వాత అప్పటి సీబీఐ డెరైక్టర్ కేసును తాజాగా దర్యాప్తు చేసేందుకు కొత్త బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆరుషి హత్య కేసులో తల్లిదండ్రుల పాత్రపై అనుమానాలు ఉన్నప్పటికీ వాటిని నిరూపించే ప్రత్యక్ష ఆధారాలేవీ లేవని పేర్కొంటూ సీబీఐ కేసు ముగింపు నివేదికను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సీబీఐ జడ్జి తల్వార్ దంపతులపై హత్యాభియోగాలు మోపాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే నూపుర్ తల్వార్ కూడా అరెస్టు అయ్యారు. ఆ తర్వాత సుప్రీం ఆదేశాలతో ఆమె బెయిల్‌పై విడుదలయ్యా రు. 15 నెలల విచారణ అనంతరం ఎట్టకేలకు సోమవారం 204 పేజీలతో తీర్పు వెలువడింది. ఈ కేసులో సీబీఐ వైఖరిపై అడిగిన ప్రశ్నకు ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది ఆర్.కె.సైని సమాధానమిస్తూ.. దర్యాప్తు అనేది నిరంతర ప్రక్రియ అని, చివరకు కోర్టులో దాఖలు చేసిన నివేదికనే తుది నిర్ణయంగా భావించాలని చెప్పారు. ఈ కేసులో గరిష్టంగా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే హత్యానేరానికి మరణశిక్ష విధించడం జరుగుతుంది. తీర్పుపై అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు రాజేశ్ తల్వార్ సోదరుడు దినేశ్ విలేకరులకు చెప్పారు. కోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. చట్టానికి ఎవరూ అతీతులు కారనే ందుకు ఇది నిదర్శనమని మహిళా కాంగ్రెస్ నేత శోభా ఓఝా వ్యాఖ్యానించారు. ‘‘తమ పిల్లలకు ఉత్తమ సంరక్షకులు వారి తల్లిదండ్రులే. మానవ నైజ క్రమం ఇదే. కానీ మానవాళి చరిత్రలో తల్లీ, తండ్రే తమ పిల్లల హంతకులైనటువంటి అసహజ, విచిత్ర సంఘటనలు కూడా ఉన్నాయి. జీవితంలో కేవలం 14 వసంతాలు మాత్రమే చూసిన తమ కుమార్తెను వారు నాశనం చేశారు’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బైబిల్లోని 10 ఆజ్ఞల్లో ఒక దానిని (‘నరహత్య చేయరాదు’ (దొ షల్ నాట్ కిల్), ఖురాన్‌లోని ఓ నిషేధాజ్ఞ (‘దేవుడు పవిత్రంగా చేసినవాటి ప్రాణాలు తీయరాదు’ (టేక్ నాట్ లైఫ్ విచ్ గాడ్ హాజ్ మేడ్ సేక్రెడ్)ను గుర్తు చేశారు. ఎప్పుడేం జరిగింది... 2008 మే 16: గొంతు కోయడంతో ఆరుషి తన పడకగదిలో ప్రాణాలు కోల్పోయి కన్పించింది. మే 17: తల్వార్ ఇంటి టైపై హేమరాజ్ మృతదేహం కన్పించింది. మే 23: జంట హత్యల ఆరోపణలతో రాజేశ్ తల్వార్ అరెస్టు మే 31: సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టింది. జూలై 12: రాజేశ్ తల్వార్‌కు బెయిలు. 2010 డిసెంబర్ 29: సీబీఐ క్లోజర్ రిపోర్ట్ దాఖలు 2011 ఫిబ్రవరి 9: సీబీఐ క్లోజర్ రిపోర్టును తిరస్కరించిన ప్రత్యేక కోర్టు. రాజేశ్, నూపుర్ తల్వార్ల విచారణకు ఆదేశం. రాజేశ్, నూపుర్ తల్వార్లకు బెయిలబుల్ వారంట్ల జారీ 2012 ఏప్రిల్ 30: నూపుర్ తల్వార్ అరెస్టు సెప్టెంబర్ 25: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌పై నూపుర్ విడుదల 2013 ఏప్రిల్: తల్వార్ దంపతులు ఆరుషి, హేమరాజ్‌లను చంపినట్టుగా కోర్టుకు సీబీఐ నివేదన. నవంబర్ 12: కోర్టు తీర్పు రిజర్వ్ నవంబర్ 25: రాజేశ్, నూపుర్ తల్వార్లు దోషులుగా నిర్ధారణ -
సీబీఐ కోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా బాలయోగి
సాక్షి, హైదరాబాద్: సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.బాలయోగి నియమితులయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ ఎస్.జగన్నాథం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్-1 చైర్మన్‌గా ప్రస్తుతం బాలయోగి విధులు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాలయోగి 1985లో మేజిస్ట్రేట్‌గా ఎంపికయ్యారు. 2001లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. కర్నూలు జిల్లా జడ్జిగా విధులు నిర్వహించారు. అలాగే సీబీఐ రెండో అదనపు ప్రత్యేక కోర్టు జడ్జి ఎంవీ రమేష్‌ను మొదటి అదనపు ప్రత్యేక కోర్టు జడ్జిగా బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. -
18న జగన్ హాజరుకు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: లేపాక్షి నాలెడ్జి హబ్‌పై చార్జిషీట్లో ఈనెల 18న కోర్టులో తన హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థనకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. హాజరుకు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సీబీఐ మూడో అదనపు ప్రత్యేక కోర్టు జడ్జి ఎంవీ రమణనాయుడు గురువారం విచారించారు. కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో లేపాక్షి నాలెడ్జి హబ్‌పై సెప్టెంబర్ 17న సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లో జగన్ సహా ఇతర నిందితులను నవంబర్ 15న హాజరుకావాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ 15న కోర్టు ముందు హాజరై, 16న ఢిల్లీ వెళ్లి 19వ తేదీ వరకు జాతీయ పార్టీల ముఖ్య నేతలను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టుకు నివేదించారు. మొహర్రం సెలవును 14 నుంచి 15వ తేదీకి మార్పు చేసిన నేపథ్యంలో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వాలని విన్నవించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. 18న జరిగే విచారణకు జగన్ హాజరుకు మినహాయింపునిచ్చారు. అయితే ఈ కేసు తదుపరి విచారణ రోజున పూచీకత్తు బాండ్లు సమర్పించాలని షరతు విధించారు. కాగా, జగన్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లి, ఈనెల 19న తిరిగి హైదరాబాద్‌కు వస్తారని ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు సమాచారమిచ్చారు. లేపాక్షి కేసు విచారణ 18కి వాయిదా లేపాక్షి నాలెడ్జి హబ్ చార్జిషీట్‌పై కోర్టు విచారణ ఈనెల 18కి వాయిదా పడింది. ఈ విచారణకు తొలుత 15న హాజరు కావాలంటూ నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే మొహర్రం సెలవును ప్రభుత్వం 14 నుంచి 15వ తేదీకి మార్పు చేసిన నేపథ్యంలో నిందితుల హాజరును 18కి మార్పుచేస్తూ సీబీఐ రెండో అదనపు జడ్జి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పర్యటనకు అనుమతించాలన్న జగన్ పిటిషన్ 12కు వాయిదా
సమైక్యాంద్రకు మద్దతు కూడగట్టేందుకు తాను పశ్చిమబెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని, అందువల్ల బెయిల్ షరతులను ఆ మేరకు సడలించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. తన బెయిల్ షరతులను సడలించిన సీబీఐ ప్రత్యేక కోర్టు... రాష్ట్రవ్యాప్తంగాను, ఢిల్లీ వెళ్లేందుకు మాత్రం అనుమతిస్తూ గతనెల 30న ఉత్తర్వులు జారీచేసిందని జగన్ తన పిటిషన్లో తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా జాతీయ పార్టీల నేతలను, పార్లమెంట్ సభ్యులను కలిసి మద్దతు కూడగట్టాల్సి ఉందని వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా నియోజకవర్గంతో పాటు పార్టీ అధ్యక్షునిగా ప్రజలకు సేవలు అందించే హక్కును కాలరాయకూడదన్నారు. తనపై సీబీఐ మోపినవన్నీ ఆరోపణలేనని, నేరం రుజువు కాలేదని తెలిపారు. కోర్టు విధించిన షరతులను పాటిస్తానని, రాజకీయ కారణాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా బెయిల్ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. -
జాతీయ పార్టీల మద్దతు కూడగట్టాలి: వైఎస్ జగన్
-
జాతీయ పార్టీల మద్దతు కూడగట్టాలి: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జాతీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టాల్సి ఉందని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సహా ఇతర నేతలను కలిసేందుకు వీలుగా ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు అనుమతించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన బెయిల్ షరతులను సడలించిన సీబీఐ ప్రత్యేక కోర్టు... రాష్ట్రవ్యాప్తంగా, ఢిల్లీ వెళ్లేందుకు అనుమతిస్తూ గతనెల 30న ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా జాతీయ పార్టీల నేతలను, పార్లమెంట్ సభ్యులను కలిసి మద్దతు కూడగట్టాల్సి ఉందని వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా నియోజకవర్గంతోపాటు పార్టీ అధ్యక్షునిగా ముఖ్యంగా ప్రజలకు సేవలు అందించే హక్కును కాలరాయకూడదని పేర్కొన్నారు. తనపై సీబీఐ మోపినవన్నీ ఆరోపణలేనని, నేరం రుజువు కాలేదని తెలిపారు. కోర్టు విధించిన షరతులను పాటిస్తానని, రాజకీయ కారణాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో పర్యటించేందుకు వీలుగా బెయిల్ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు... సీబీఐకి నోటీసులు జారీచేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. పాలెం వెళ్లలేకపోయా... షరతు సడలించండి కోర్టు విధించిన షరతు కారణంగా ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఓల్వో బస్సు దగ్ధమైన సంఘటన ప్రాంతానికి వెళ్లలేకపోయానని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ విడిచి వెళ్లే రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాలన్న షరతును సడలించాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించలేకపోయానని, ఆకస్మికంగా జరిగే సంఘటనలపై స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లేందుకు ఈ షరతు ఇబ్బందిగా ఉందని తెలిపారు. కొన్ని పరిస్థితుల్లో అత్యవసరంగా వెళ్లాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో నగరం విడిచి వెళ్లే రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాలన్న షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు. 9, 10న కడప పర్యటన... ఈనెల 9, 10న వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనకు వెళ్తున్నట్లు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టుకు నివేదించారు. 8వ తేదీన రాత్రి బయలుదేరి వెళ్లి... 11వ తేదీ ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకుంటానని తెలిపారు. ఇదే కేసులో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డి ఈనెల 8న బెంగుళూరు వెళ్తున్నట్లు సీబీఐ కోర్టుకు సమాచారం ఇచ్చారు. -
నేడు కోర్టుకు శ్రీనివాసన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితునిగా ఉన్న ఇండియా సిమెంట్స్ అధినేత, బీసీసీఐ చైర్మన్ శ్రీనివాసన్ శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారులు శామ్యూల్, ఆదిత్యానాథ్‌దాస్, రఘురామ్ సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా కంపెనీల ప్రతినిధులు కూడా హాజరుకావాల్సి ఉంటుంది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... నవంబర్ 1న నిందితులను ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే.