వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేశారని..
కేసులో జగన్ పాత్ర ఏమిటో సీబీఐ ఎక్కడా చెప్పలేదు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేశారని, అయితే ఈ కేసులో జగన్ పాత్ర ఏమిటో సీబీఐ ఎక్కడా చెప్పలేదని హైకోర్టు న్యాయవాది పట్టాభి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. కేసు నుంచి తమ పేరును తొలగించాలని కోరుతూ హెటెరో డ్రగ్స్ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి మంగళవారం మరోసారి విచారించారు. క్విడ్‌ప్రోకో అంటే... ఎక్కువ లబ్ధి పొంది తక్కువ పెట్టుబడి పెట్టడమని...అయితే తాము ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపిస్తోందన్నారు. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది.
జగన్ కేసు విచారణ.. నవంబర్ 20కి వాయిదా
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసు విచారణ నవంబర్ 20కి వాయిదాపడింది. ఈ కేసులో పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాపరెడ్డి, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, ఆడిటర్ విజయసాయిరెడ్డి, మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి సహా ఇతర నిందితులు మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి ఎన్.బాలయోగి తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ఈ కేసు విచారణకు జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తీసుకున్న విషయం తెలిసిందే.