
కంచ గచ్చిబౌలి భూములపై సర్కార్‌కు హైకోర్టు ఆదేశం..
తదుపరి విచారణ నేటికి వాయిదా వేసిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు నరకడాన్ని వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది. దీనిపై గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే వరకు అక్కడ ఎలాంటి పనులు చేయొద్దని ఏసీజే జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం తేల్చిచెప్పింది. సుదీర్ఘ వాదప్రతివాదనల వల్ల సమయం ముగియడంతో తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎక రాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి చదును చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలయ్యాయి. ‘ఐటీ, ఇతర అవసరాల కోసం ఎకరం రూ. 75 కోట్ల మేర సంస్థలకు కేటాయించేలా కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల అటవీ భూమిని టీజీఐఐసీకి సర్కార్ కేటాయించింది. ఈ మేరకు గతేడాది జూన్ 26న రెవెన్యూ శాఖ తీసుకొచ్చిన జీవో 54ను కొట్టేయాలి. అక్కడ 40 జేసీబీ తవ్వకాలతో సర్కార్ చెట్లను తొలగిస్తూ వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తోంది’ అని పిటిషనర్లు ఆరోపించారు.
పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి..
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎల్.రవిచందర్ వాదిస్తూ ‘ఆ 400 ఎకరాలు అటవీభూమి. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాలి. 40కిపైగా జేసీబీలతో చెట్లు కొట్టేసి భూమిని చదును చేస్తున్నారు. సుప్రీం తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని చదును చేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో నెలపాటు అధ్యయనం చేయాలి. ఈ అడవిలో బఫెలో, పీకాక్, ఎస్‌ఆర్ ప్రధాన సరస్సులు, ‘పుట్టగొడుగుల శిల’ వంటి ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలున్నాయి.
ఇది 237 జాతుల పక్షులు, నెమళ్లు, చుక్కల జింకలు, అడవి పందులు, నక్షత్ర తాబేళ్లు, ఇండియన్ రాక్ పైథాన్, బోయాస్ వంటి వివిధ పాము జాతులకు పర్యావరణ నివాసం. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ‘అడవి’ అనే పదాన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టపరమైన నోటిఫికేషన్లకే పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. దీనికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పర్యావరణ సమతౌల్యతను దెబ్బతీసే విధ్వంసాన్ని నిరోధించాలి’ అని నివేదించారు.
ఆదాయం కోసం ఆరాటమే తప్ప..
‘150 ఎకరాలకు మించి అటవీ ప్రాంతాన్ని చదును చేసేందుకు పర్యావరణ అధ్యయనం అవసరం. మీటర్ కంటే ఎక్కువ ఎత్తు కాండం పెరిగిన చెట్లును కొట్టాలంటే వాల్టా చట్ట ప్రకారం అనుమతి పొందాలి. లేకుంటే చట్టప్రకారం శిక్షార్హం. కానీ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదు. ఆదాయం కోసం ఆరాటమే తప్ప పర్యావరణ విధ్వంసం గురించి పట్టించుకోలేదు. హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల్లో దశాబ్దాలకుపైగా ఉన్న భారీ వృక్షాలను తొలగిస్తే పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది.
పక్కనే కాంక్రీట్ జంగిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఊపిరి కూడా అందడం కష్టమవుతుంది. భవిష్యత్ తరాలు ఆక్సిజన్‌కు అవస్థ పడాల్సి వస్తుంది. ఒకపక్క కేసు హైకోర్టులో విచారణ సాగుతుండగానే అధికారులు రాత్రీపగలు చెట్ల నరికివేత చేపడుతున్నారు. ఈ పనులను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.
క్రీడల పేరిట రూ. వేల కోట్ల భూములకు చంద్రబాబు..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘2003 ఆగస్టు 5న ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) ఏర్పాటైంది. ఆగస్టు 9న ఐఎంజీ భారతతో నాటి చంద్రబాబు ప్రభుత్వం (తాత్కాలిక ప్రభుత్వం) క్రీడల్లో ఇక్కడి యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దే పేరుతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. స్పోర్ట్స్ అకాడమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసమంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాలను ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి సర్వే నంబర్ 99/1లోని మరో 450 ఎకరాలను అప్పగిస్తామని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. ఐఎంజీ భారత అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. 2004 ఫ్రిబవరిలో రూ. వేల కోట్ల విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే రూ. 2 కోట్లకు ఐఎంజీ భారతకు సేల్‌డీడ్ చేసింది.
ఏమాత్రం అర్హతలేని, భూములు కొట్టేయడం కోసమే ఏర్పడిన కంపెనీ నుంచి ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం 2006లో నాటి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఐఎంజీ భారతకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన సేల్‌డీడ్‌తోపాటు ఎంఓయూ కూడా రద్దయ్యింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా రాజశేఖరరెడ్డి నిర్ణయాన్ని సమర్థించాయి.
నాడు వైఎస్సార్ రక్షించిన ఆ 400 ఎకరాలు ఇండస్ట్రియల్ భూములే. నాడు పిల్ దాఖలు చేసిన వారు అర్హతలేని కంపెనీ, తక్కువ ధరనే సవాల్ చేశారు. హెచ్‌సీయూ భూములనిగానీ, పర్యావరణం దెబ్బతింటుందని కానీ ఎక్కడా పేర్కొనలేదు. నాడు ఒక దొంగ నుంచి మేము ఈ భూములను రక్షించినప్పుడు ఈ పిల్ దాఖలు చేసిన వారెవరూ కలసి రాలేదు. ఇప్పుడు పిల్‌లు దాఖలు చేసి ప్రశ్నిస్తున్నారు’ అని ఏజీ పేర్కొన్నారు.
గూగుల్ ఫొటోలే ఆధారామా?
‘గూగుల్ ఫోటోల ఆధారంగా అక్కడ ఫారెస్ట్ ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. రెవెన్యూ, ఇతర ఏ రికార్డుల్లోనూ అది అటవీ భూమిగా లేదు. గూగుల్ చిత్రాలు వానాకాలం ఒకలా, ఎండాకాలంలో మరోలా ఉంటాయి. గూగుల్ చిత్రాలు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. నా స్నేహితుడొకరు సభ్యుడిగా ఉన్న ఓ గోల్ఫ్ క్లబ్‌లోనూ నెమళ్లు, జింకలు, పాములు ఉన్నాయి.
దాన్ని కూడా అటవీ ప్రాంతంగా డిక్లేర్ చేస్తారా? ఈ లెక్కన హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టొద్దు. గత పదేళ్లలో నాటి ప్రభుత్వం వేలాది ఎకరాలు విక్రయించినా నోరుమెదపని వారు ఇప్పుడు రూ.75 కోట్లకు ఎకరం విక్రయిస్తుంటే ప్రశ్నిస్తున్నారు. ఈ పిల్‌లు ప్రజాప్రయోజనం ఆశించి వేసినవి కావు. నిజాం కాలం నుంచి ఈ 400 ఎకరాలు గడ్డి భూములు.
ఈ భూములకు ఆనుకొని ఉన్న హెచ్‌సీయూ స్థలంలో భారీ భవనాలు నిర్మించారు. నాలుగు హెలీప్యాడ్‌లు కూడా ఉన్నాయి’ అని ఏజీ చెప్పారు. కాగా, ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ అని సర్కార్ వద్ద రికార్డులున్నాయా? అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సమయం ముగియడంతో తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది.