‘‘చట్టం తన పని తాను చేసుకు పోతూంటుంది’’.. రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు తరచూ చెప్ప మాటిది. అయితే ఇది అందరికీ సమానంగా వర్తిస్తుందా? అనే ప్రశ్న వస్తే..! జవాబు కోసం తడుముకోవాల్సి ఉంటుంది. ఉదాహరణ కావాలా?.. మీడియా సామ్రాజ్యం ముసుగులో రామోజీరావు అనే వ్యక్తి చేసిన చట్ట ఉల్లంఘనలు. తప్పు చేశాడో లేదో తెలియదు కానీ.. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఒక మహిళ మృతి ఘటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే చెప్పారు. రామోజీ గ్రూప్‌నకు సంబంధించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అవకతవకల విషయంలోనూ ఇదే రీతిన వ్యవహరించి ఉంటే బాగుండేది.
మార్గదర్శి ఫైనాన్స్ వేల కోట్ల రూపాలయను అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే ప్రభుత్వమే చట్టం తన పని తాను చేసుకుపోకుండా అడ్డుకున్నట్లు స్పష్టమవుతుంది. అఫిడవిట్ వేసేందుకే ఆసక్తి చూపని ప్రభుత్వం.. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో మొక్కుబడిగా ఒక పత్రాన్ని దాఖలు చేసి మమ అనిపించినట్లు కనిపిస్తోంది. వ్యవస్థల మేనేజ్మెంట్‌లో రామోజీరావు దిట్ట అంటారు. అందుకు తగ్గట్టే తన మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చాలామంది రాజకీయ నేతలను తన దారికి తెచ్చుకున్నారన్నది తెలిసిన విషయమే. తన పత్రిక కాంగ్రెస్ వ్యతిరేకమని ప్రమాణపూర్వకంగా కోర్టుకు తెలిపిన ఘనత రామోజీరావుది. అయినాసరే.. కాంగ్రెస్ నేతలు చాలామంది ఆయనకు జీ హుజూర్ అంటూంటారు. సన్నిహిత సంబంధాలు నెరిపేవారు కూడా.
ఈ జాబితాలో కేంద్ర మంత్రి దివంగత ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు తన దగ్గరి మనిషి అని రామోజీ భావించే వారట. ఇక టీడీపీ నేత చంద్రబాబు నాయుడి సంగతి సరేసరి. గతంలో వారం వారం హాజరీ వేయించుకుని మరీ చంద్రబాబు ఆయన వద్ద సలహా సూచనలు తీసుకునేవారు. తెలంగాణ ఉద్యమకాలంలో రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నేస్తానన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా తరువాతి కాలంలో చప్పబడిపోయారు.. రామోజీరావుతో సత్సంబంధాలు నెరిపారు. రామోజీకి ఎదురైన చట్టపరమైన ఇబ్బందులకు కేసీఆర్ కాపు కాసిన సందర్భాలూ ఉన్నాయి. వీరితోపాటు పలువురు ఇతర నేతలనూ మచ్చిక చేసుకున్న రామోజీరావు తన వ్యాపారాలకు ఇబ్బందిలేకుండా వ్యూహాత్మకంగా పనిచేసేవారు. అయితే సన్నిహితులందరిలోనూ చంద్రబాబుకే అగ్రతాంబూలం. బాబు ముఖ్యమంత్రి అయితే అధికారం తనదే అన్న ధీమా రామోజీరావుది. అందుకే చంద్రబాబుకు ప్రధాన పోటీదారులపై ఆయన నిత్యం అడ్డగోలు వార్తలు రాయించేవారు. తన పత్రిక ద్వారా విషం చిమ్మేవారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కావచ్చు... ఆయన తనయుడు వై.ఎస్. జగన్ కావచ్చు. ఎవరూ తన సన్నిహితుడు బాబు మాదిరిగా ముఖ్యమంత్రి గద్దెను ఎక్కకూడదన్నట్టుగా ఉండేది ఆయన తీరు. అయితే.. చంద్రబాబు పాలన ఎంత ఘోరంగా ఉన్నా, హామీలను తుంగలో తొక్కినా రామోజీకి చెందిన ఈనాడు మీడియా బాండ్ బాజా వాయించడం అలవాటు చేసుకుంది. అదే వైఎస్సార్ ఎంత మంచిగా పాలన చేసినా ఎదో ఒక తొండి పెట్టుకునేది. వైఎస్ ప్రభుత్వంలో జరిగే తప్పులను భూతద్దంలో చూపుతుండేది. ఆయన కుమారుడు జగన్ సాక్షి మీడియాను ఆరంబించడం అసలు నచ్చలేదు. సహజంగానే తన వ్యాపారాలకు పోటీ వచ్చే వారిని ఎలా అణచివేయాలన్న ధోరణి రామోజీది.
సీనియర్ నేత, అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి హైదరాబాద్ శివార్లలో రామోజీ ఫిలిం సిటీకి అవసరమైన సుమారు పదెకరాల భూమిని మరో పారిశ్రామికవేత్త సంఘీ నుంచి వెనక్కి తీసుకుని ఇచ్చారు. కోట్ల సీఎంగా ఉన్నప్పుడు పరోక్షంగా మద్దతు ఇచ్చినా, ఆ తర్వాత కాలంలో రామోజీ అనుసరించిన శైలిపై ఆయన బాధ పడేవారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో కొంతమేర సత్సంబంధాలు మెయిన్ టెయిన్ చేయడం ద్వారా తనపై ఏ అభియోగం వచ్చినా ఇబ్బంది లేకుండా రామోజీ చేసుకునేవారు. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డినే ఆయన మేనేజ్ చేయలేకపోయారు. వైఎస్సార్ కూడా తొలుత చూసి, చూడనట్లు వ్యవహరించినా, రామోజీ కొన్నిసార్లు రెచ్చిపోయి ఇష్టానుసారం వార్తలు, సంపాదకీయాలు రాయించేవారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు రామోజీ కుటుంబానికి చెందిన కొంత భూమి కూడా భూ సేకరణలో పోయిందని చెబుతారు. ఆ కోపం కూడా ఆయనకు ఉండేదట. ఒకసారి ఉల్టా చోర్, కొత్వాల్ కో డాంటే అంటూ వైఎస్ పై మొదటి పేజీలో సంపాదకీయం రాయించారు. అది తీవ్ర విమర్శలకు గురైంది. అదే కాలంలో మార్గదర్శి సంస్థ అక్రమంగా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు వసూలు చేస్తుందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ చేసిన ఫిర్యాదుతో మార్గదర్శి డొంక కదిలింది.
వైఎస్ ప్రభుత్వం దీనిపై రంగాచారి అనే ఐఎఎస్ అఫీసర్ తో ఒక కమిటీ వేసి విచారణ చేయించింది. ఆ తర్వాత కృష్ణరాజు అనే పోలీసు అధికారికి ఆ కేసును అప్పగించింది. అంతవరకు తనను ఏమీ చేయలేరన్న నమ్మకంతో ఉన్న రామోజీరావుకు షాక్ తగిలినట్లయింది. రిజర్వు బ్యాంక్ చట్టం లోని 45 ఎస్ ను అతిక్రమించి డిపాజిట్లు వసూలు చేశారన్న విషయం బహిర్గతం అయింది. రిజర్వు బ్యాంక్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దాంతో రామోజీ తనకు ఉన్న పరపతిని వినియోగించారు. తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ లోని వైఎస్ వ్యతిరేక వర్గం, బీజేపీ, వామపక్షాలలో తనకు అనుకూలమైన వారిని మేనేజ్ చేస్తుండేవారు. అయినప్పటికీ మార్గదర్శి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి చెల్లించడానికి గాను రిలయన్స్ సంస్థ సహకారం తీసుకుని బయటపడ్డారు. అందుకోసం ఆయన స్థాపించిన కొన్ని టీవీ చానళ్లను విక్రయించారు. ఇదంతా రామోజీకి మరింత కోప కారణం అయింది.
చట్టం ప్రకారం డిపాజిట్లు తిరిగి చెల్లించినా అక్రమ వసూళ్ల నేరాభియోగం పోదన్నది న్యాయ నిపుణుల అభిప్రాయం. అంతలో వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్ద నాయకులు కొందరిని, అలాగే ముఖ్యమంత్రులుగా బాధ్యత చేపట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను మేనేజ్ చేయగలిగారు. ఆ దశలో రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు. ఆయన టీడీపీకి, చంద్రబాబుకు థ్రెట్ అవుతారని భావించారు. కాంగ్రెస్ అధిష్టానం మాటకు అంగీకరించకుండా జగన్ ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా పార్టీని స్థాపించుకున్నారు. అప్పుడు ఆయనపై టీడీపీ,కాంగ్రెస్ లు కలిసి అక్రమ కేసులు పెట్టించాయి. వైఎస్ పై ఉన్న ద్వేషంతో రామోజీరావు ఆ రోజుల్లో జగన్ పై కూడా పెద్ద ఎత్తున వ్యతిరేక కథనాలు ప్రచారం చేసేవారు. జగన్ ను జైలులో అక్రమంగా నిర్భంధించినా ఈనాడు మీడియా దారుణమైన స్టోరీలు ఇచ్చేది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడంతో 2014 శాసనసభ ఎన్నికలలో జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబుకు పూర్తి కొమ్ముకాసింది.
తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రాగా, విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికే విచారణలో ఉన్న మార్గదర్శి డిపాజిట్ల కేసులో ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్ లు వేయలేదు. దానికి కారణం రామోజీకి ఉన్న పలుకుబడే అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఉమ్మడి హైకోర్టు 2018లో విభజన జరిగి, ఏపీకి తరలివెళుతున్న సమయంలో చివరి రోజున హైకోర్టులో తన కేసు కొట్టివేసేలా రామోజీ జాగ్రత్తపడ్డారని అంటారు. కేసు వేసిన ఉండవల్లి అరుణకుమార్ కు ఆరు నెలలు ఆలస్యంగా ఈ విషయం తెలియడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. రామోజీ డిపాజిట్లు అక్రమంగా వసూలు చేసినందుకు గాను చట్టం ప్రకారం డబుల్ మొత్తం పెనాల్టి చెల్లించవలసి ఉంటుంది. ఇతర శిక్షలు కూడా ఉంటాయి. రామోజీకి శిక్షపడడం తన లక్ష్యం కాదని, ఆయన తప్పు చేశారా? లేదా? అన్నది తేల్చాలన్నది తన పట్టుదల అని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతుంటారు.
దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అఫిడవిట్ లు దాఖలు చేయవలసి ఉన్నప్పటికి ఆ పని చేయలేదు. అప్పట్లో కేసీఆర్, చంద్రబాబులు సీఎం లుగా ఉండడంతో వారిని మేనేజ్ చేయడం కష్టం కాలేదు. 2019లో కూడా జగన్ పై పచ్చి అబద్దాలు ప్రచారం చేసినా, జనం వైసీపీకి పట్టం కట్టారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు అయినా ఈనాడు మీడియా తన పంథా మార్చుకోలేదు. ప్రభుత్వం ఏర్పడిన తొలి నుంచే వైఎస్సార్‌సీపీ వ్యతిరేక వైఖరితో సాగింది. జగన్ పై విపరీతమైన ద్వేషంతో వ్యవహరించింది. దారుణమైన అసత్య కథనాలు ఇవ్వడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఈ దశలో జగన్ ప్రభుత్వానికి మార్గదర్శి చిట్ ఫండ్స్ పై వచ్చిన ఫిర్యాదుల మీద విచారణకు ఆదేశాలు ఇచ్చారు. సీఐడీ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మొత్తం విచారణ చేసి మార్గదర్శి చిట్స్ ఫండ్స్ లో బ్లాక్ మనీ రొటేట్ అవుతున్నట్లు గుర్తించారు. చిట్స్ నిర్వహణలో జరిగిన అనేక అవకతవకలను కనిపెట్టారు. వాటిపై కేసులు పట్టారు. చివరికి రామోజీని సైతం సీఐడీ విచారణ చేయడం అప్పట్లో సంచలనమైంది. జగన్ ధైర్యాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు.
చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ కేసులన్నిటిని నీరుకార్చుతున్నారు. అది వేరే సంగతి. ఇక మార్గదర్శి డిపాజిట్ల కేసులో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. దాంతో కేసు విచారణ ముందుకు సాగింది.తదుపరి సుప్రీం కోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు తిరిగి విచారణ నిమిత్తం బదలాయించింది. ఉండవల్లి పోరాటం కొనసాగి ఉండకపోతే ఎప్పుడో ఈ కేసు హుష్ కాకి అయి ఉండేదని లాయర్లు చెబుతుంటారు. మామూలు గా అయితే మరొకరి విషయంలో ఉండవల్లి మాదిరి ఎవరైనా పోరాటం సాగిస్తే, ఈనాడుతో సహా మీడియా మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. ఉండవల్లిని పోరాట యోధుడుగా గుర్తించేవి. కాని మార్గదర్శి ఈనాడు మీడియాకు సంబంధించిన సంస్థ కావడంతో సాక్షి తప్ప ఇతర మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నాయి. అలాగే వైఎస్సార్‌సీపీ తప్ప ఇతర రాజకీయ పార్టీలు ఏవీ రామోజీపై విమర్శలు చేయడానికి భయపడుతుంటాయి.
కాగా రామోజీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ డిపాజిట్లు వసూలు చేసిన హెయుఎఫ్ కర్త మరణించినా, సంబంధిత సంస్థ కొనసాగుతోంది కనుక కేసు ముగియదు. పెనాల్టీ క్లాజ్ వర్తిస్తుందన్నది ఒక అభిప్రాయం. రామోజీకి వ్యక్తిగత శిక్ష గురించి విచారణ జరగదు తప్ప మిగిలిన కేసు యథాతథంగా ఉంటుదని ప్రముఖ లాయర్ ఒకరు చెప్పారు. రామోజీ తదుపరి ఆయన కుమారుడు కిరణ్ ఆ సంస్థ కర్తగా ఉన్నారు. కిరణ్ కూడా వైఎస్సార్‌సీపీ తప్ప మిగిలిన రాజకీయ పక్షాల వారితో అదే విధమైన సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి ఈ డిపాజిట్ల మీద వారి అభిప్రాయాలు తెలియచేయాలని కోరినా, చాలాకాలం ప్రభుత్వాలు స్పందించకపోవడం విశేషం. దాంతో మరోసారి హైకోర్టు అసంతృప్తి చెందింది.
గతంలో కేసీఆర్ మాదిరే ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. అంటే ఈనాడు మీడియా యాజమాన్యం రేవంత్ ప్రభుత్వాన్ని ఇంతకాలం సక్సెస్ ఫుల్ గా మేనేజ్ చేసింది. కాని తప్పనిసరి పరిస్థితిలో అఫిడవిట్ వేసినా, అందులో స్పష్టత ఇవ్వకుండా కోర్టు నిర్ణయానికే వదలి వేసినట్లు పేర్కొనడం ద్వారా మార్గదర్శికి మేలు చేయడానికి సన్నద్ధమైనట్లు కనబడుతోంది. రేవంత్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా అఫిడవిట్ వేసి ఉంటే ఆశ్చర్యపోవాలన్న వ్యాఖ్యానాలు వచ్చాయి. అల్లు అర్జున్ విషయంలో చట్టం పనిచేసిందని చెబుతున్న రేవంత్ మార్గదర్శి కేసులో మాత్రం చట్టం ముందుకు వెళ్లకుండా చూశారనుకోవాలి. 45 ఎస్ సెక్షన్ కింద డిపాజిట్లు వసూలు చేయడం నేరమా? కాదా?అన్నదానిపై అభిప్రాయం చెప్పలేదు. అది నేరమని అంగీకరిస్తే మార్గదర్శి భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుందా? ఉండదా? ఆ ఇబ్బంది నుంచి కాపాడే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం మొక్కుబడి అఫిడవిట్ వేసినట్లు కనబడుతోంది.
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణకు కమిషన్ నే నియమించిన రేవంత్ ప్రభుత్వం, కెటిఆర్ పై ఈ ఫార్ములా రేస్ కేసు పెట్టిన ప్రభుత్వం మార్గదర్శి కేసులో మాత్రం ఉదాసీనంగా ఎందుకు ఉందన్నది అందరికి తెలిసిన రహస్యమే. చంద్రబాబు, రేవంత్ లను గురు శిష్యులుగా భావిస్తారు. ఇప్పుడు వీరిద్దరూ ఈనాడు మీడియాను కాదనే పరిస్థితి లేదు. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం దారుణమైన కేసులు పెడుతోంది. వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని పై రేషన్ బియ్యం కేసు పెట్టి వేధిస్తోంది. ఆయన ఈ కేసులో రెండున్నర కోట్లు చెల్లించినా వదలి పెట్టడం లేదు. పేర్ని నాని మహాపరాధం చేసేసినట్లు, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఘోరమైన నేరాలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు ఇచ్చే ఈనాడు మీడియా గురివింద గింజ సామెత మాదిరి మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి మాత్రం నోరెత్తడం లేదు.
రామోజీ మరణించారు కనుక ఆ కేసు విచారణ అవసరమా అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. అల్లు అర్జున్ విషయంలో అతిగా వ్యవహరించడమే కాకుండా, శాసనసభలో సైతం రేవంత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ పేరుతో పలు చోట్ల అక్రమిత స్థలాలలో నిర్మాణాలను కూల్చుతున్నామంటూ హైడ్రా హడావుడి చేస్తుంటుంది. ఇలాంటి ఘటనలలో చట్టం తన పని చేసుకుని పోతుందని చెప్పే రేవంత్ ప్రభుత్వం మార్గదర్శి కేసు లో మాత్రం ఉదారంగా ఉందన్నమాట. అందుకే చట్టం కొందరికి చుట్టం అని,అందులో రామోజీ కుటుంబానికి మరింత దగ్గర చుట్టం అని భావించాలి.
:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment