
దివంగత సీఎం పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ పెద్దఎత్తున ఆందోళన
నల్ల రిబ్బన్లతో నేతల నిరసన
వైఎస్సార్‌సీపీ నిరసన నేపథ్యంలో పార్టీ నేతల ముందస్తు అరెస్టులు
వైఎస్సార్‌సీపీ నేత కేకే రాజును హౌస్‌అరెస్ట్ చేసిన పోలీసులు
స్టేడియం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రచేసి స్టేడియం ఆధునీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఎంట్రన్స్ ఆర్చ్‌పై, స్టేడియానికి చెందిన ఫసాట్‌లలో వైఎస్సార్ పేరు తొలగించినందుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.
మాజీమంత్రి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జెడ్పీ చైర్‌పర్సన్ జె. సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు తొలుత స్టేడియం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పాలతో ఆభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నల్ల రిబ్బన్లతో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. తొలగించిన వైఎస్సార్ పేరును యథావిధిగా పెట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది.
విశాఖ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు హౌస్ అరెస్ట్..
మరోవైపు.. ఈనెల 19న విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపడుతుందని పిలుపునిచ్చిన మరుక్షణం నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం కుయుక్తులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు, కార్పొరేటర్లకు పోలీసులు ఫోన్లుచేసి బెదిరించారు.
నిరసన కార్యక్రమానికి ఎవరినైనా తీసుకెళ్తే అరెస్టుచేస్తామని హెచ్చరించారు. విశాఖ నార్త్ నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతల ఇళ్లకు వెళ్లి మరీ వార్నింగ్‌లు ఇచ్చారు.
ఐపీఎల్ మ్యాచ్‌లవల్లే శాంతియుత నిరసన
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
ఈనెల 24, 30 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలన్న ఉద్దేశంతో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేశామని మాజీమంత్రి, విశాఖజిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. టీడీపీ కూటమి పార్టీల ఎంపీలు ఏసీఏలో సభ్యులుగా ఉండడంతోనే కుట్రపూరితంగా డాక్టర్ వైఎస్సార్ క్రికెట్ స్టేడియం ఆర్చ్‌పై వైఎస్సార్ పేరు తొలగించారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ మార్క్, ఆయన బ్రాండ్ కనబడకూడదనే వైఎస్సార్ పేరును తొలగించేందుకు కుట్ర చేశారని అమర్‌నాథ్ మండిపడ్డారు. గతంలో విశాఖ అభివృద్ధిలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సీతకొండ వ్యూ పాయింట్‌కు వైఎస్సార్ పేరు పెడితే దాన్ని తొలగించారని ఆక్షేపించారు.
అలాగే, విశాఖ ఫిలింనగర్ క్లబ్ లాన్‌కు వైఎస్సార్ పేరు తొలగించారని, ఇవేకాక.. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేకచోట్ల వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్ పేరును ఏసీఏ తొలగించిందా..? లేదంటే కూటమి ప్రభుత్వం ఒత్తిడితో తొలగించారా..? 48 గంటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్పాలని అమర్‌నాథ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment