International cricket stadium
-
#SRHVsMI: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి
క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భాగ్యనగరానికి మళ్లీ వచ్చేసింది. ఉప్పల్ స్టేడియంలో నేటి రాత్రి జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో హోం టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. తమ తొలి మ్యాచ్‌లు ఓడిన ఈ రెండు టీమ్‌లూ సీజన్లో బోణీపై గురి పెట్టాయి. వారాంతం కానీ, సెలవు దినం కానీ కాకపోయినా ముంబైలాంటి పెద్ద జట్టు ఆడుతుండటంతో మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. మంగళవారం ఇరు జట్ల ప్లేయర్లు గ్రౌండ్లో సుదీర్ఘ సమయం సాధన చేశాయి. ఇక అభిమానులు అసలు పోరును ఆస్వాదించడమే తరువాయి. ఉప్పల్/సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ట్రాఫిక్ డీసీపీ మనోహర్, ట్రాఫిక్ ఏసీపీ చక్రపాణిలతో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 3 గంటల ముందుగానే రావచ్చు.. ► 2,800కు పైగా వివిధ విభాగాల పోలీస్ బలగాలు 360 సీసీ కెమెరాలతో బందోబస్తును ఏర్పాటు చేశాం. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు 3 గంటల ముందే ప్రేక్షకులను స్డేడియంలోకి అనుమతిస్తాం. ► స్టేడియంలోకి ఎలాంటి వస్తువులను తీసుకురావద్దు. సిగరెట్, లైటర్, బ్యానర్స్, ల్యాప్ ట్యాప్‌లు, బ్యాటరీలు, ఫర్ఫ్యూమ్స్, హెల్మెట్లు, బైనాక్యూలర్లు, అగ్గిపెట్టె, కెమెరాలు, ఎల్రక్టానిక్ పరికరాలు, పెన్నులు, వాటర్ బాటిళ్లు, బయటి తిను భండారాలకు స్టేడియంలోకి తీసుకురావద్దు. కారు పాస్ ఉన్నవారు రామంతాపూర్ నుంచి రావాలి. ఫిజికల్ చాలెంజెస్ వ్యక్తులు గేట్–3 ద్వారా వెళ్లాలి. ► క్రికెట్ అభిమానులకు వెసులుబాటుగా మెట్రో రైల్, ఆర్టీసీ బస్సుల అదనపు ట్రిప్పులు. ట్రాఫిక్ దారి మళ్లింపు ఇలా.. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు, చర్లపల్లి ఐవోసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ నుంచి వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి చెంగిచర్ల మీదుగా వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు నాచారం పారిశ్రామిక వాడ ద్వారా చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాలి. టికెట్లకు తప్పని ఇక్కట్లు ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లను ఈసారి పేటీఎం ఇన్సైడర్ యాప్ లేదా వెబ్సైట్లో మాత్రమే విక్రయించారు. ప్రకటించిన కొద్ది సమయంలోనే ‘సోల్డ్ ఔట్’ అని చూపించడంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. ఇంత తక్కువ సమయంలో వేల టిక్కెట్లు ఎలా అమ్ముడుపోయాయని ఆందోళన చెందుతున్నారు. -
నవులూరు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రెడీ
మంగళగిరి: గుంటూరు జిల్లా నవులూరు అమరావతి టౌన్షి ప్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు రెడీ అయ్యింది. మూడేళ్ల కిందట నిర్మాణం పూర్తి చేసుకున్నా నిధుల కొరతతో ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు తదితర తుదిదశ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బీసీసీఐ నుంచి నిధులు విడుదల కావడంతో తొలి విడతగా రూ.15 కోట్లతో స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు వేగంగా పూర్తి చేయించి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడుగులు వేస్తోంది. ఈలోపు ఈ సీజన్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు ట్రోఫీల నిర్వహణకు బీసీసీఐ అనుమతులు ఇవ్వగా, మ్యాచ్‌ల నిర్వహణకు అన్ని రకాల వసతులు కల్పించారు. ఈ నెల 12 నుంచి పురుషుల అండర్–19 వినూ మన్కడ్ ట్రోఫీ జరుగనుంది. ఇక్కడ 15 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, ఉత్తరాఖండ్, మేఘాలయ జట్లు తలపడనున్నాయి. అలాగే ఈ ఏడాది డిసెంబర్లో విజయ్ మర్చంట్ ట్రోఫీ నిర్వహించనున్నారు. 15 మ్యాచ్‌ల ఈ ట్రోఫీలో ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్ జట్లు తలపడనున్నాయి. అలాగే 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో మహిళల అండర్–23 వన్ డే ట్రోఫీ కోసం 21 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఉత్తరాఖండ్, బరోడా, విదర్భ, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి జట్లు తలపడనున్నాయి. మూడు ట్రోఫీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి అనంతరం అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణకు ఏసీఏ సన్నాహాలు చేస్తోంది. త్వరలో అంతర్జాతీయ మ్యాచ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ నెల 12 నుంచి రానున్న ఆరు నెలల కాలంలో మూడు ట్రోఫీలకు సంబంధించిన 51 మ్యాచ్‌లు ఇక్కడ జరగనున్నాయి. త్వరలోనే బీసీసీఐ బృందం పర్యటించి అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణకు అవసరమైన సూచనలు చేసే అవకాశం ఉంది. – ఎస్ఆర్ గోపీనాథ్‌రెడ్డి, ఏసీఏ కార్యదర్శి -
వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. శంకుస్ధాపన చేయనున్న మోదీ
పవిత్ర పుణ్యక్షేత్రం అయిన వారణాసిలో సరికొత్త క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోబోతోంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(సెప్టెంబర్ 23) శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వారణాసికి మోదీ చేరుకోనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి మోదీతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్ హాజరుకానున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జైషా సహా కీలక వ్యక్తులు కూడా పాల్గొనున్నారు. ఈ స్టేడియాన్ని సుమారు రూ. 450 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ కోసం రూ. 121 కోట్లు వెచ్చించగా.. స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ రూ. 330 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ వారణాసి స్టేడియంలో అడుగడుగునా శివతత్వం ప్రతిబింబించేలా రూపుదిద్దనున్నారు. స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే సీటింగ్ మొత్తాన్ని అర్థం చంద్రాకారంలో నిర్మించనున్నారు. అదే విధంగా స్టేడియం ఫ్లెడ్ లైట్లు త్రిశూలం ఆకారంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. స్టేడియం ఎంట్రీని ఢమరుకం ఆకారంలో తయారు చేయనున్నారు. అంతేకాకుండా మొత్తం 31 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేబోయే ఈ స్టేడియంలో.. ఏడు పిచ్‌లను సిద్దం చేయనున్నారు. 30 వేల మంది ప్రేక్షకులు కూర్చోని వీక్షించేలా ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. 2025 డిసెంబర్ నాటికి ఈ స్టేడియం పూర్తి కానుంది. ఇక ఈ స్టేడియం నమూనాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: #Suryakumar Yadav: "సూర్య" గ్రహణం వీడింది.. 590 రోజుల తర్వాత తొలి హాఫ్ సెంచరీ Renders of the upcoming Cricket Stadium in Varanasi, Uttar Pradesh. PM Narendra Modi will lay the foundation on 23rd September. pic.twitter.com/GLTTM6kgZw — Mufaddal Vohra (@mufaddal_vohra) September 19, 2023 -
గజ్వేల్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం!
గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు వేదిక కానుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించే అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే అన్ని హంగులతో స్టేడి యం అందుబాటులో ఉన్నా, ట్రాఫిక్ సమస్యల కారణంగా ఇబ్బందులు తలెత్తుతుండడంతో హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న గజ్వేల్‌లో మరో స్టేడి యం నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచనకు ప్రభు త్వం వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాంతంలో ‘రీజనల్ రింగు’రోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధమవుతుండగా, ఈ రోడ్డుకు అనుసంధానమయ్యేలా స్టేడియం నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ అంశంపై గతనెల 30న క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ చొరవతో ఇక్కడ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ కళాశాలలు ఏర్పడ్డాయి. 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మసాగర్ రిజ ర్వాయర్‌తోపాటు వేలాది కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాంతం పేరు మారు మోగేలా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం విషయాన్ని పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ చిక్కులు తప్పించడానికే.. గజ్వేల్ పట్టణంలో రీజినల్ రింగు రోడ్డుకు సమీపంలో స్టేడియం నిర్మిస్తే హైదరాబాద్ నుంచి కొద్దిసేపట్లోనే చేరుకునే అవకాశం ఉండటం, ట్రాఫిక్ చిక్కులు లేకపోవడం వల్లే ఈ ప్రాంతంపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో జరిగిన సమీక్షలో గజ్వేల్‌లో 50–100 ఎకరాల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కోసం భూసేకరణ, ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ క్రికెట్ స్టేడియం కోసం స్థల సేకరణకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీనిని బట్టి ఇక్కడ క్రికెట్ స్టేడియం నిర్మా ణం త్వరలోనే ఖరారు కాబోతుందనే విషయం స్పష్టమవుతోంది. సమీక్షలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో క్రికెట్ స్టేడియం నిర్మించే విషయాన్ని సీఎం కేసీఆర్ సీరియస్‌గా పరిశీలిస్తున్న మాట వాస్తవమేనని చెప్పారు. -
వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
సాక్షి, హన్మకొండ: వరంగల్ నగరంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా నగర విశిష్టతను ప్రపంచం నలుమూలలకు తెలియజేసేం దుకు ఆస్కారం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్. చారిత్రక విశిష్టత, కట్టడాలను మినహాయిస్తే.. అభివృద్ధి, ఉపాధి, పారిశ్రామిక పురోగతి వంటి అంశాల్లో ఏ విధంగానూ హైదరాబాద్‌తో పోటీపడలేకపోతోంది. ఓవైపు ప్రభుత్వం తరఫున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు బ్రాండ్ ఇమేజ్ను తీసుకురావడంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్‌లో క్రికెట్ స్టేడియం నిర్మించాలని సంకల్పించారు. గతేడాది సీఎం కేసీఆర్ నగరంలో పర్యటించిన సందర్భంగా నగరంలో చేపట్టాల్సిన అనేక అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు గల అవకాశాలు పరిశీలించాలంటూ జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అందుకు నిధుల మంజూరు, పాలనాపరమైన అనుమతులు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. మామునూరు వద్ద: స్టేడియ నిర్మాణా నికి శివారు మామునూరు సమీపంలో తిమ్మాపూర్ వద్ద 16ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. మామునూరు పాత ఎయిర్‌పోర్టు, 4వ పోలీస్ బెటాలియన్లకు సమీపంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయడంలో అధికారులు ముందు చూపుతో వ్యవహరించారు. రవాణా, భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండబోవనే హామీ ఇచ్చారు. ఈ మేరకు నివేదికను సిద్ధం చేసి, ఇటీవలే ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి కోసం వరంగల్ అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసి ప్రతీఏడు రూ.300 కోట్లు కేటాయిస్తుంది. ఈ అథారిటీతో పాటు బీసీసీఐ నుంచి కూడా నిధులు సేకరించే అవకాశం ఉంది. దాదాపు 60 వేల మంది సామర్థ్యంతో ఈ క్రికెట్ స్టేడియం నిర్మించేలా ప్రణాళిక రూపొందించనున్నారు. -
తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
తిరుమల పుణ్యక్షేత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తిరుపతికి క్రీడారంగంలోనూ మహర్దశ పట్టనుంది. తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బుధవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శుంకుస్థాపన చేశారు. శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ సమీపంలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతిలో మహిళల మెడికల్ కాలేజీ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు.