వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
సాక్షి, హన్మకొండ: వరంగల్ నగరంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా నగర విశిష్టతను ప్రపంచం నలుమూలలకు తెలియజేసేం దుకు ఆస్కారం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్. చారిత్రక విశిష్టత, కట్టడాలను మినహాయిస్తే.. అభివృద్ధి, ఉపాధి, పారిశ్రామిక పురోగతి వంటి అంశాల్లో ఏ విధంగానూ హైదరాబాద్‌తో పోటీపడలేకపోతోంది. ఓవైపు ప్రభుత్వం తరఫున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకురావడంలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్‌లో క్రికెట్ స్టేడియం నిర్మించాలని సంకల్పించారు. గతేడాది సీఎం కేసీఆర్ నగరంలో పర్యటించిన సందర్భంగా నగరంలో చేపట్టాల్సిన అనేక అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు గల అవకాశాలు పరిశీలించాలంటూ జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అందుకు నిధుల మంజూరు, పాలనాపరమైన అనుమతులు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.
మామునూరు వద్ద: స్టేడియ నిర్మాణా నికి శివారు మామునూరు సమీపంలో తిమ్మాపూర్ వద్ద 16ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. మామునూరు పాత ఎయిర్‌పోర్టు, 4వ పోలీస్ బెటాలియన్‌లకు సమీపంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయడంలో అధికారులు ముందు చూపుతో వ్యవహరించారు. రవాణా, భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండబోవనే హామీ ఇచ్చారు. ఈ మేరకు నివేదికను సిద్ధం చేసి, ఇటీవలే ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి కోసం వరంగల్ అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసి ప్రతీఏడు రూ.300 కోట్లు కేటాయిస్తుంది. ఈ అథారిటీతో పాటు బీసీసీఐ నుంచి కూడా నిధులు సేకరించే అవకాశం ఉంది. దాదాపు 60 వేల మంది సామర్థ్యంతో ఈ క్రికెట్ స్టేడియం నిర్మించేలా ప్రణాళిక రూపొందించనున్నారు.