ఇది బుద్ధుడి ఎముక, ఆయన చితాభస్మం. బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావించే ఆ మహనీయుడి ధాతువు. ప్రస్తుతం ఇది నాంపల్లిలోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్టేట్ మ్యూజియంలో ఉంది. ప్రత్యేక సందర్భాల్లో వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు వచ్చి దీని ముందు కూర్చుని ధ్యానం చేస్తారు. ఈ మ్యూజియం ప్రత్యేకతల్లో ఇది ముందు వరసలో ఉంటుంది. బుద్ధుడి శారీరక
అవశేషం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోనుంది. అక్కడి మ్యూజియంలో కొలువుదీరనుంది. – సాక్షి, హైదరాబాద్.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిక్కుముడిగా ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రశేఖరరావులు నిర్ణయించిన నేపథ్యంలో, చారిత్రక సంపద పంపకం కూడా జరగనుంది. దీనికి సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో పురావస్తు చారిత్రక వస్తువులు ఏమేం ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాల్సినవి జాబితా రూపొందిస్తున్నారు. చరిత్రకారులు డాక్టర్ రాజారెడ్డి చైర్మన్‌గా ఏర్పడ్డ కమిటీ దీన్ని పర్యవేక్షిస్తోంది. ఎక్కడ లభించిన వస్తువులు అక్కడే పద్ధతిలో చారిత్రక సంపదను బట్వాడా చేసే దిశగా ఈ కసరత్తు జరుగుతోంది. గతంలో రెండు రాష్ట్రాలు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు సమావేశాలు జరగలేదు. ఎవరి వాదనతో వారు ఉండిపోయి పరిష్కారం చేసుకోకుండానే ఈ విషయాన్ని వదిలేశారు. ఇప్పుడు వివాదాలు లేకుండా స్నేహపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో త్వరలోనే రెండు కమిటీలు భేటీ అయ్యే అవకాశం ఉంది. భేటీ నాటికి జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించిన తెలంగాణ అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. చర్చల అనంతరం తీసుకునే నిర్ణయాల మేరకు వీటి పంపకాలుంటాయి. వేరే రాష్ట్రానివి అయినా ఉన్న వాటిల్లో కొన్నింటిని అలాగే ఉంచాలని నిర్ణయిస్తే ఇక్కడే ఉంచనున్నారు.
బుద్ధుడి ధాతువే కీలకం...
విశాఖపట్నం శివారులోని బావికొండగుట్టపై 1980లలో జరిపిన తవ్వకాల్లో బౌద్ధçస్తూపం వెలుగు చూసింది. చివరకు అది మహా చైత్యం, బౌద్ధ విహారంగా గుర్తించారు. స్తూపానికి నాలుగువైపులా ప్రత్యేక పాత్రలు వెలుగుచూశాయి. అందులో దక్షిణ దిక్కు చిన్నపాటి రాతి స్తూపం, దాని కింద లభించిన మట్టిపాత్రలో బుద్ధుడి ధాతువు వెలుగు చూసింది. పాత్రలో బంగారు, వెండి, ఇతర విలువైన చిన్నచిన్న వస్తువులతోపాటు మరో పాత్రలో బూడిద, బొగ్గు ముక్కలు, చిన్న ఎముక ఉన్నాయి. అది బుద్ధుడి చితాభస్మం, ఆయన శరీరంలోని ఎముకగా పరిశోధకులు పేర్కొన్నారు. దానిని అత్యంత విలువైన సంపదగా గుర్తించి, వెంటనే హైదరాబాద్ మ్యూజియంలో భద్రపరిచారు. 2004 ప్రాంతంలో దలైలామా సమక్షంలో వాటిని సందర్శనకు ఉంచారు. బుల్లెట్ ప్రూఫ్ తరహా గాజు ఫ్రేమ్‌లోపల వాటిని ఉంచారు. ఇప్పుడు బౌద్ధులకు అది పూజనీయ ప్రాంతం. బుద్ధుడి మహానిర్యాణం తర్వాత ఆయన ఆస్తికలు, చితా భస్మాన్ని ఎనిమిది భాగాలు చేసి వివిధ ప్రాంతాల్లో ఉంచి స్తూపాలు నిర్మించారు. అనంతరం అశోక చక్రవర్తి అస్థికలు, చితాభస్మాన్ని వెలికి తీయించి 84 వేల భాగాలు చేసి తన సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయించారని చరిత్ర చెబుతోంది. అలా వచ్చిన ఓ భాగమే ఈ ధాతువు కావటం విశేషం.
ఆ నాణేల విషయంలో వివాదం..
బ్రిటిష్ మ్యూజియం తర్వాత ఎక్కువ నాణేలున్నది హైదరాబాద్ మ్యూజియంలోనే. గుప్తుల కాలం నుంచి నిజాం నవాబుల కాలం వరకు.. దాదాపు మూడు లక్షలకు పైచిలుకు నాణేలిక్కడున్నాయి. వీటిల్లో ఏపీ పరిధిలో లభించినవి తక్కువే. అయితే, ఇందులో 7,658 నాణేల విషయంలో వివాదం నెలకొంది. ఇవి 1953లో అమరావతిలో కృష్ణా తీరంలో కూలీలు మట్టి తవ్వుతుండగా బయటపడ్డాయి. ఇవి శాతవాహనులకంటే పూర్వం గుప్తు లు, మౌర్యుల కాలానికి చెందినవి. వారి పాలనకు సంబంధించిన ప్రత్యేకతలను గుర్తించే అధ్యయనంలో కీలకంగా ఉండేవి. వీటిని నాటి గుం టూరు కలెక్టర్ రమేశన్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పూర్వమే 1955లో హైదరాబాద్ మ్యూజియంకు తరలించారు. వాటి అధ్యయనం కోసం ఇక్కడి నుంచి ముంబైలోని ప్రముఖ చరిత్రకారులు పీఎల్ గుప్తాకు పంపగా, ఆయన మూడేళ్ల తర్వాత 1958లో తిరిగి హైదరాబాద్ మ్యూజియంకు పంపారు. ఇక్కడి రిజిస్టర్‌లో 1958లో వచ్చినట్టు రికార్డు చేశారు. వాటిని 1955లోనే హైదరాబాద్‌కు పంపినట్టు నాటి కలెక్టర్, తదనంతర పురావస్తు డైరెక్టర్ రమేశన్ 1961లో జరిగిన నుమిస్‌మాటిక్ సొసైటీ 60వ వార్షికోత్సవ సంచికలో పేర్కొనటం విశేషం. వెరసి 1956కు పూర్వమే హైదరాబాద్ మ్యూజియంకు వచ్చినందున వాటిని తెలంగాణకే కేటాయించాలని ఇక్కడి అధికారులు పేర్కొంటున్నారు. దీన్ని ఏపీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాలచక్ర ఉత్సవాలప్పుడు ఫణిగిరి బుద్ధ విగ్రహాలను ఏపీకి తరలించారు. అవి ఇప్పుడు తెలంగాణకు రావాల్సి ఉం ది. చీమకుర్తి, బాపట్ల, నెల్లూరు, గుంటూరు, అమరావతి తదితర ప్రాంతాల్లో లభించిన పంచలోహ విగ్రహాలు, బుద్ధుడి ప్రతిమలు హైదరాబాద్ మ్యూ జియంలో ఉన్నాయి. వీటిని ఏపీకి తరలించాలి.
1956కు ముందునాటి సంపద ఇక్కడే: తెలంగాణ
అధికారుల మాట..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన 1956కు పూర్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న చారిత్రక, పురావస్తు సంపద తెలంగాణకే చెందుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 1956 తర్వాత ఎక్కడ లభించిన సంపద ఆ రాష్ట్రానికి చెందుతుందని, ఇదే వాదనను ఆంధ్రప్రదేశ్ అధికారులకు స్పష్టం చేస్తామని వారు పేర్కొంటున్నారు. రెండు రాష్ట్రాల పరిధిలో జరిపిన తవ్వకాల్లో లభించిన వస్తువులను ఇప్పుడు పంచుకోవాల్సి ఉంది. మద్రాసు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం పరిధిలో లభించిన సంపదలో కొన్ని వస్తువులు ఇప్పుడు తెలంగాణ పరిధిలో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో దొరికిన వస్తువులు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఉన్నాయి. ఇవి ఆయా ప్రాంతాల్లోని మ్యూజియంలలో ప్రదర్శనలో ఉన్నాయి. ఇప్పుడు వాటి జాబితాను రూపొందించి ఏపీలోని తెలంగాణ సంపద తెలంగాణకు, తెలంగాణలోని ఏపీ సంపద ఏపీకి తరలే అవకాశం ఉంది.
తరలనున్న బుద్ధుడి ధాతువు
Published Fri, Jul 5 2019 3:21 AM | Last Updated on Fri, Jul 5 2019 9:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment