heritage property
-
ఇది మన గౌరవం!.. కాపాడుకుందాం!!
పింగళే అనూరాధారెడ్డి... అంటే గుర్తు పట్టడం కష్టమే. ఇన్టాక్తో మూడున్నర దశాబ్దాల అనుబంధం ఆమెను ఇన్టాక్ అనూరాధారెడ్డిగా మార్చేసింది. మరాఠ్వాడా మూలాల నుంచి తెలంగాణలో స్థిరపడిన కుటుంబం. తెలంగాణ సంస్కృతి, దక్కన్ వారసత్వం మీద ఆమెకున్న మమకారమే... ఆమెను వారసత్వ పరిరక్షణ కోసం పని చేయడానికి పురికొల్పింది. ‘హైదరాబాద్ నగరం అనేక గ్రంథాలకు సమానం’ అంటారు అనూరాధ. ‘‘చిన్నప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రదేశాలను, పెద్దయిన తర్వాత వివిధ దేశాల్లోనూ విస్తృతంగా పర్యటించడంతో మనదేశంలో ఉన్న వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలు, భవన నిర్మాణ వైవిధ్యతను తెలుసుకోగలిగాను. దక్కన్ ప్రాంతం శతాబ్దాల కాలంలో అనేక రకాల పాలకులను చూసింది. ప్రతి పాలకులూ తర్వాతి తరాలకు తమ పాదముద్రలను వదిలి వెళ్లారు. వాళ్ల పాలనకాలాల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి రకరకాల వృత్తుల వాళ్లు వచ్చి స్థిరపడ్డారు. అలా రకరకాల ఆహారవిహారాలు, రకరకాల నిర్మాణ వైశిష్ట్యాలు పరిచయమయ్యాయి. అంత గొప్ప వారసత్వం ఉన్న నేల మనది. అలాంటి విలువైన నేపథ్యాన్ని మన చేతులతో మనమే కాలరాసుకుంటూ పోతే భవిష్యత్తు తరాలకు ‘ఇదీ మన చరిత్ర’ అని చెప్పుకోవడానికి ఏం మిగులుతుంది? ఇందుకోసం ఎవరో ఒకరు ముందుకు రాకపోతే మన వారసత్వం ఆనవాళ్లకు కూడా మిగలకుండా కాలగర్భంలో కలిసిపోతుంది. ఆ విపత్తును అరికట్టాలన్నదే మా ఇన్టాక్ ప్రయత్నం’’ అన్నారామె. కూల్చకండి! కాపాడండి!! క్రమం తప్పకుండా వారసత్వ నిర్మాణాల నిర్వహణ తీరును పరిశీలించడం, శిథిలావస్థలో ఉన్న వాటిని గుర్తించడం, వాటి నిర్మాణంలో ఉపయోగించిన సున్నం, రాళ్లు, ఇతర మెటీరియల్‌ను స్టడీ చేసి ఆ మెటీరియల్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో అన్వేషించడం, ఇంజనీర్ల సహాయంతో నిర్మాణాలను పునరుద్ధరించడం... వంటివి ఇన్టాక్ చేస్తుంటుంది. అలాంటప్పుడు లక్షణంగా ఉన్న వారసత్వ నిర్మాణాలను పనిగట్టుకుని కూల్చేస్తామంటే ఏం చేయాలి? ‘‘సున్నితంగా పని చేసుకుపోతుండే మాలాంటి వాళ్లం కూడా ఇప్పుడు మా గొంతును పెద్దగా వినిపించాల్సి వస్తోంది. ప్రభుత్వాలకు మేము చెప్పేదొక్కటే... ప్రభుత్వ కార్యాలయాల కోసం కొత్త భవనాలు కావాలంటే కట్టుకోండి. అందుకోసం వారసత్వ కట్టడాలను కూల్చి వేయవద్దు’’ అని అనూరాధ ఆవేదనగా అన్నారు. మంచి ఖర్చు! పురాతన భవనాలు, చారిత్రక నిర్మాణాలు, హెరిటేజ్ సైట్లలో సాధారణంగా మగవాళ్లే కనిపిస్తుంటారు. వృత్తిపరంగా కానీ ప్రవృత్తి పరంగా కానీ మహిళల ఎంపికలో లేని రంగం ఇది. అలాంటి అరుదైన రంగంలో పని చేయడం, అది కూడా డెబ్బై ఏళ్లు నిండిన ఈ వయసులో కూడా శక్తిమంతంగా, సమర్థంగా పని చేయడం గురించి చెబుతూ అనూరాధ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతి ఆదివారం పుస్తకాల దుకాణానికి తీసుకెళ్లి పుస్తకాలు కొనిచ్చేది మా అమ్మ. ఒక్కో పుస్తకం యాభై పైసలు, రూపాయి ఉండేది. అప్పుడు ఒక కెమెరా నా కంట పడింది. అది ఇరవై రూపాయలు. వద్దని ఇంటికి తీసుకొచ్చేసింది అమ్మ. మా తాతయ్య దగ్గర బుంగమూతి పెట్టాను. ఆయన ఆ కెమెరా కొనిచ్చి, ఎలా వాడా లో నేర్పించారు. అప్పుడు అమ్మతో తాత ‘నేర్చుకోవడానికి పెట్టే ఖర్చు ఎప్పుడూ వృథా కాదు’ అన్నారు. ఆయన ఆరోజు అన్న ఆ మాట ఏ కాలానికైనా వర్తిస్తుంది. నాకు నేర్చుకోవడానికి అంతటి స్వేచ్ఛనిచ్చారు. చిన్నప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద సైకిల్ తొక్కాను. ఆడపిల్ల కాబట్టి ఇవి మాత్రమే నేర్చుకోవాలనే ఆంక్షలేవీ లేవు. మంచి పని అంటే ముందుకు అడుగు వేయడం, మంచిది కాదు అనుకుంటే కట్టడి చేయడం... అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఇదే ఫార్ములా. ఇక నా ఆలోచనలకు ‘నేను మహిళను కాబట్టి’ అనే పరిధులు ఎందుకు అడ్డువస్తాయి’’ అని చిరునవ్వుతో ప్రశ్నించారామె. వారసత్వ పరిరక్షణ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఐఎన్టీఏసీహెచ్– ఇన్టాక్) ... ఇది మన వారసత్వం పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయడం, వారసత్వాన్ని పరిరక్షించడం’ అనే ఉద్దేశంతో 1984లో స్థాపితమైన సంస్థ. న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ ఈ ముప్పై ఆరేళ్లలో 190 విభాగాలతో విస్తరించింది. మీతో నడుస్తాం! ఒకసారి ఒక స్కూల్ వార్షికోత్సవానికి గెస్ట్‌గా వెళ్లాను. పిల్లలను వారాంతంలో ‘హెరిటేజ్ వాక్’కు తీసుకెళ్లడం గురించి ప్రస్తావించాను. హెరిటేజ్ వాక్‌లో పాల్గొనడానికి పిల్లలకంటే ముందుగా పిల్లల తల్లిదండ్రులు స్పందించారు. ఇప్పటి వరకు ఇలాంటి వేదికల గురించి తెలియలేదన్నారు. అప్పటి నుంచి స్కూలు పిల్లలతోపాటు పేరెంట్స్‌ని కూడా హెరిటేజ్ వాక్కు తీసుకెళ్తున్నాం. స్కూళ్లకు వెళ్లి ఇన్టాక్ క్విజ్లు నిర్వహిస్తున్నాం. ఈ కరోనా సమయంలో పిల్లలు ఆన్లైన్ క్లాసులు, గది నాలుగ్గోడల మధ్యనే ఇరవైనాలుగ్గంటలూ గడపాల్సి రావడంతో విసుగెత్తి పోతున్నారు. అందుకే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ హెరిటేజ్సైట్లకు తీసుకెళ్లాం. మావంతుగా కొన్ని తొలి అడుగులు వేశాం. మా ప్రయాణంలో మరికొంతమంది వచ్చి కలిశారు. – అనూరాధారెడ్డి, కన్వీనర్, ఇన్టాక్, హైదరాబాద్ చాప్టర్ కాలేజ్ పిల్లలతో కుతుబ్ షాహీ టూంబ్స్ వాక్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తరలనున్న బుద్ధుడి ధాతువు
ఇది బుద్ధుడి ఎముక, ఆయన చితాభస్మం. బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావించే ఆ మహనీయుడి ధాతువు. ప్రస్తుతం ఇది నాంపల్లిలోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్టేట్ మ్యూజియంలో ఉంది. ప్రత్యేక సందర్భాల్లో వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు వచ్చి దీని ముందు కూర్చుని ధ్యానం చేస్తారు. ఈ మ్యూజియం ప్రత్యేకతల్లో ఇది ముందు వరసలో ఉంటుంది. బుద్ధుడి శారీరక అవశేషం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోనుంది. అక్కడి మ్యూజియంలో కొలువుదీరనుంది. – సాక్షి, హైదరాబాద్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిక్కుముడిగా ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, చంద్రశేఖరరావులు నిర్ణయించిన నేపథ్యంలో, చారిత్రక సంపద పంపకం కూడా జరగనుంది. దీనికి సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో పురావస్తు చారిత్రక వస్తువులు ఏమేం ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాల్సినవి జాబితా రూపొందిస్తున్నారు. చరిత్రకారులు డాక్టర్ రాజారెడ్డి చైర్మన్‌గా ఏర్పడ్డ కమిటీ దీన్ని పర్యవేక్షిస్తోంది. ఎక్కడ లభించిన వస్తువులు అక్కడే పద్ధతిలో చారిత్రక సంపదను బట్వాడా చేసే దిశగా ఈ కసరత్తు జరుగుతోంది. గతంలో రెండు రాష్ట్రాలు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు సమావేశాలు జరగలేదు. ఎవరి వాదనతో వారు ఉండిపోయి పరిష్కారం చేసుకోకుండానే ఈ విషయాన్ని వదిలేశారు. ఇప్పుడు వివాదాలు లేకుండా స్నేహపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో త్వరలోనే రెండు కమిటీలు భేటీ అయ్యే అవకాశం ఉంది. భేటీ నాటికి జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించిన తెలంగాణ అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. చర్చల అనంతరం తీసుకునే నిర్ణయాల మేరకు వీటి పంపకాలుంటాయి. వేరే రాష్ట్రానివి అయినా ఉన్న వాటిల్లో కొన్నింటిని అలాగే ఉంచాలని నిర్ణయిస్తే ఇక్కడే ఉంచనున్నారు. బుద్ధుడి ధాతువే కీలకం... విశాఖపట్నం శివారులోని బావికొండగుట్టపై 1980లలో జరిపిన తవ్వకాల్లో బౌద్ధçస్తూపం వెలుగు చూసింది. చివరకు అది మహా చైత్యం, బౌద్ధ విహారంగా గుర్తించారు. స్తూపానికి నాలుగువైపులా ప్రత్యేక పాత్రలు వెలుగుచూశాయి. అందులో దక్షిణ దిక్కు చిన్నపాటి రాతి స్తూపం, దాని కింద లభించిన మట్టిపాత్రలో బుద్ధుడి ధాతువు వెలుగు చూసింది. పాత్రలో బంగారు, వెండి, ఇతర విలువైన చిన్నచిన్న వస్తువులతోపాటు మరో పాత్రలో బూడిద, బొగ్గు ముక్కలు, చిన్న ఎముక ఉన్నాయి. అది బుద్ధుడి చితాభస్మం, ఆయన శరీరంలోని ఎముకగా పరిశోధకులు పేర్కొన్నారు. దానిని అత్యంత విలువైన సంపదగా గుర్తించి, వెంటనే హైదరాబాద్ మ్యూజియంలో భద్రపరిచారు. 2004 ప్రాంతంలో దలైలామా సమక్షంలో వాటిని సందర్శనకు ఉంచారు. బుల్లెట్ ప్రూఫ్ తరహా గాజు ఫ్రేమ్‌లోపల వాటిని ఉంచారు. ఇప్పుడు బౌద్ధులకు అది పూజనీయ ప్రాంతం. బుద్ధుడి మహానిర్యాణం తర్వాత ఆయన ఆస్తికలు, చితా భస్మాన్ని ఎనిమిది భాగాలు చేసి వివిధ ప్రాంతాల్లో ఉంచి స్తూపాలు నిర్మించారు. అనంతరం అశోక చక్రవర్తి అస్థికలు, చితాభస్మాన్ని వెలికి తీయించి 84 వేల భాగాలు చేసి తన సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయించారని చరిత్ర చెబుతోంది. అలా వచ్చిన ఓ భాగమే ఈ ధాతువు కావటం విశేషం. ఆ నాణేల విషయంలో వివాదం.. బ్రిటిష్ మ్యూజియం తర్వాత ఎక్కువ నాణేలున్నది హైదరాబాద్ మ్యూజియంలోనే. గుప్తుల కాలం నుంచి నిజాం నవాబుల కాలం వరకు.. దాదాపు మూడు లక్షలకు పైచిలుకు నాణేలిక్కడున్నాయి. వీటిల్లో ఏపీ పరిధిలో లభించినవి తక్కువే. అయితే, ఇందులో 7,658 నాణేల విషయంలో వివాదం నెలకొంది. ఇవి 1953లో అమరావతిలో కృష్ణా తీరంలో కూలీలు మట్టి తవ్వుతుండగా బయటపడ్డాయి. ఇవి శాతవాహనులకంటే పూర్వం గుప్తు లు, మౌర్యుల కాలానికి చెందినవి. వారి పాలనకు సంబంధించిన ప్రత్యేకతలను గుర్తించే అధ్యయనంలో కీలకంగా ఉండేవి. వీటిని నాటి గుం టూరు కలెక్టర్ రమేశన్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పూర్వమే 1955లో హైదరాబాద్ మ్యూజియంకు తరలించారు. వాటి అధ్యయనం కోసం ఇక్కడి నుంచి ముంబైలోని ప్రముఖ చరిత్రకారులు పీఎల్ గుప్తాకు పంపగా, ఆయన మూడేళ్ల తర్వాత 1958లో తిరిగి హైదరాబాద్ మ్యూజియంకు పంపారు. ఇక్కడి రిజిస్టర్లో 1958లో వచ్చినట్టు రికార్డు చేశారు. వాటిని 1955లోనే హైదరాబాద్‌కు పంపినట్టు నాటి కలెక్టర్, తదనంతర పురావస్తు డైరెక్టర్ రమేశన్ 1961లో జరిగిన నుమిస్మాటిక్ సొసైటీ 60వ వార్షికోత్సవ సంచికలో పేర్కొనటం విశేషం. వెరసి 1956కు పూర్వమే హైదరాబాద్ మ్యూజియంకు వచ్చినందున వాటిని తెలంగాణకే కేటాయించాలని ఇక్కడి అధికారులు పేర్కొంటున్నారు. దీన్ని ఏపీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాలచక్ర ఉత్సవాలప్పుడు ఫణిగిరి బుద్ధ విగ్రహాలను ఏపీకి తరలించారు. అవి ఇప్పుడు తెలంగాణకు రావాల్సి ఉం ది. చీమకుర్తి, బాపట్ల, నెల్లూరు, గుంటూరు, అమరావతి తదితర ప్రాంతాల్లో లభించిన పంచలోహ విగ్రహాలు, బుద్ధుడి ప్రతిమలు హైదరాబాద్ మ్యూ జియంలో ఉన్నాయి. వీటిని ఏపీకి తరలించాలి. 1956కు ముందునాటి సంపద ఇక్కడే: తెలంగాణ అధికారుల మాట.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన 1956కు పూర్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న చారిత్రక, పురావస్తు సంపద తెలంగాణకే చెందుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 1956 తర్వాత ఎక్కడ లభించిన సంపద ఆ రాష్ట్రానికి చెందుతుందని, ఇదే వాదనను ఆంధ్రప్రదేశ్ అధికారులకు స్పష్టం చేస్తామని వారు పేర్కొంటున్నారు. రెండు రాష్ట్రాల పరిధిలో జరిపిన తవ్వకాల్లో లభించిన వస్తువులను ఇప్పుడు పంచుకోవాల్సి ఉంది. మద్రాసు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం పరిధిలో లభించిన సంపదలో కొన్ని వస్తువులు ఇప్పుడు తెలంగాణ పరిధిలో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో దొరికిన వస్తువులు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఉన్నాయి. ఇవి ఆయా ప్రాంతాల్లోని మ్యూజియంలలో ప్రదర్శనలో ఉన్నాయి. ఇప్పుడు వాటి జాబితాను రూపొందించి ఏపీలోని తెలంగాణ సంపద తెలంగాణకు, తెలంగాణలోని ఏపీ సంపద ఏపీకి తరలే అవకాశం ఉంది. -
నిజాం వారసత్వాన్ని కాపాడండి
సాక్షి, హైదరాబాద్ : నిజాం చారిత్రక కట్టడం గౌలిగూడ బస్ స్టేషన్ ఒక్క సారిగా కుప్పకూలడంపై న్యాయ విచారణ జరిపించాలని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నజాఫ్ అలీఖాన్ సీఎం కేసీఆర్‌ను కోరారు. బస్ స్టేషన్ కూలిపోవడంపై పలు అనూమానాలు వ్యక్త మవుతున్నాయి, దానిపై విచారణ జరిపించాలని కేసీఆర్‌కు ఆదివారం లేఖ రాశారు. హైదరాబాద్‌లోని నిజాం అస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పలు ఆస్తులు నగరం నుంచి అదృశ్యమవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రిను కూల్చీ వేయాలని ప్రభుత్వం భావిస్తోందని, చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో తెలిపారు. హైదరాబాద్ సందర్శనకు వచ్చిన వారికి హైటెక్ సిటీ లాంటివి కాదని, తెలంగాణ సంస్కృతి, చారిత్రక కట్టడాలే చూపించాలని పేర్కొన్నారు. గౌలిగూడ బస్ స్టేషన్ కూలీపోవడంపై పలు అనూమానాలు వ్యక్తమవుతున్నా విషయం తెలిసిందే. 90 ఏళ్ల క్రితం మూసీ నది ఒడ్డున నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గౌలిగూడ బస్ స్టేషన్ నిర్మించారు. 1994లో మహాత్మ గాంధీ బస్టాండ్ నిర్మించడంతో ప్రస్తుతం దానిని సిటీ బస్ స్టేషన్ (సీబీఎస్)గా ఉపయోగిస్తున్నారు. నిజాం స్మారక చిహ్నాలను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్ఐఎమ్ ఛీప్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. -
సోదరి వారసత్వ ఆస్తిపై హక్కులేదు
సుప్రీంకోర్టు తీర్పు న్యూఢిల్లీ: వివాహిత సోదరికి భర్త నుంచి వచ్చిన వారసత్వ ఆస్తిపై ఆమె సోదరుడికి ఎటువంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ మత వారసత్వ చట్టంలోని ఓ నిబంధనను సుప్రీం కోర్టు పరిగణనలోనికి తీసుకుని ఈ తీర్పును వెలువరించింది. మామ, లేదా భర్త నుంచి సదరు మహిళకు సంక్రమించిన వారసత్వ ఆస్తిపై ఆ మహిళ మరణానంతరం ఆమె సోదరుడికి ఎటువంటి హక్కులు ఉండవని సెక్షన్ 15లో చాలా స్పష్టంగా పేర్కొన్నట్లు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్. భానుమతిలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిం చింది. ఉత్తరాఖండ్ డెహ్రడూన్ కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్ ను విచారించిన ఆ రాష్ట్ర హైకోర్టు... సోదరి వారసత్వ ఆస్తిపై ఎటువంటి హక్కు ఉండదని తీర్పు నిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.