కోఠీ ఉమెన్స్ కాలేజ్ భవన నిర్మాణ కౌశలాన్ని వివరిస్తున్న అనూరా«ధ
పింగళే అనూరాధారెడ్డి... అంటే గుర్తు పట్టడం కష్టమే. ఇన్‌టాక్‌తో మూడున్నర దశాబ్దాల అనుబంధం ఆమెను ఇన్‌టాక్ అనూరాధారెడ్డిగా మార్చేసింది. మరాఠ్వాడా మూలాల నుంచి తెలంగాణలో స్థిరపడిన కుటుంబం. తెలంగాణ సంస్కృతి, దక్కన్ వారసత్వం మీద ఆమెకున్న మమకారమే... ఆమెను వారసత్వ పరిరక్షణ కోసం పని చేయడానికి పురికొల్పింది.
‘హైదరాబాద్ నగరం అనేక గ్రంథాలకు సమానం’ అంటారు అనూరాధ. ‘‘చిన్నప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రదేశాలను, పెద్దయిన తర్వాత వివిధ దేశాల్లోనూ విస్తృతంగా పర్యటించడంతో మనదేశంలో ఉన్న వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలు, భవన నిర్మాణ వైవిధ్యతను తెలుసుకోగలిగాను. దక్కన్ ప్రాంతం శతాబ్దాల కాలంలో అనేక రకాల పాలకులను చూసింది. ప్రతి పాలకులూ తర్వాతి తరాలకు తమ పాదముద్రలను వదిలి వెళ్లారు. వాళ్ల పాలనకాలాల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి రకరకాల వృత్తుల వాళ్లు వచ్చి స్థిరపడ్డారు. అలా రకరకాల ఆహారవిహారాలు, రకరకాల నిర్మాణ వైశిష్ట్యాలు పరిచయమయ్యాయి. అంత గొప్ప వారసత్వం ఉన్న నేల మనది. అలాంటి విలువైన నేపథ్యాన్ని మన చేతులతో మనమే కాలరాసుకుంటూ పోతే భవిష్యత్తు తరాలకు ‘ఇదీ మన చరిత్ర’ అని చెప్పుకోవడానికి ఏం మిగులుతుంది? ఇందుకోసం ఎవరో ఒకరు ముందుకు రాకపోతే మన వారసత్వం ఆనవాళ్లకు కూడా మిగలకుండా కాలగర్భంలో కలిసిపోతుంది. ఆ విపత్తును అరికట్టాలన్నదే మా ఇన్‌టాక్ ప్రయత్నం’’ అన్నారామె.
కూల్చకండి! కాపాడండి!!
క్రమం తప్పకుండా వారసత్వ నిర్మాణాల నిర్వహణ తీరును పరిశీలించడం, శిథిలావస్థలో ఉన్న వాటిని గుర్తించడం, వాటి నిర్మాణంలో ఉపయోగించిన సున్నం, రాళ్లు, ఇతర మెటీరియల్‌ను స్టడీ చేసి ఆ మెటీరియల్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో అన్వేషించడం, ఇంజనీర్ల సహాయంతో నిర్మాణాలను పునరుద్ధరించడం... వంటివి ఇన్‌టాక్ చేస్తుంటుంది. అలాంటప్పుడు లక్షణంగా ఉన్న వారసత్వ నిర్మాణాలను పనిగట్టుకుని కూల్చేస్తామంటే ఏం చేయాలి? ‘‘సున్నితంగా పని చేసుకుపోతుండే మాలాంటి వాళ్లం కూడా ఇప్పుడు మా గొంతును పెద్దగా వినిపించాల్సి వస్తోంది. ప్రభుత్వాలకు మేము చెప్పేదొక్కటే... ప్రభుత్వ కార్యాలయాల కోసం కొత్త భవనాలు కావాలంటే కట్టుకోండి. అందుకోసం వారసత్వ కట్టడాలను కూల్చి వేయవద్దు’’ అని అనూరాధ ఆవేదనగా అన్నారు.
మంచి ఖర్చు!
పురాతన భవనాలు, చారిత్రక నిర్మాణాలు, హెరిటేజ్ సైట్‌లలో సాధారణంగా మగవాళ్లే కనిపిస్తుంటారు. వృత్తిపరంగా కానీ ప్రవృత్తి పరంగా కానీ మహిళల ఎంపికలో లేని రంగం ఇది. అలాంటి అరుదైన రంగంలో పని చేయడం, అది కూడా డెబ్బై ఏళ్లు నిండిన ఈ వయసులో కూడా శక్తిమంతంగా, సమర్థంగా పని చేయడం గురించి చెబుతూ అనూరాధ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతి ఆదివారం పుస్తకాల దుకాణానికి తీసుకెళ్లి పుస్తకాలు కొనిచ్చేది మా అమ్మ. ఒక్కో పుస్తకం యాభై పైసలు, రూపాయి ఉండేది. అప్పుడు ఒక కెమెరా నా కంట పడింది. అది ఇరవై రూపాయలు. వద్దని ఇంటికి తీసుకొచ్చేసింది అమ్మ. మా తాతయ్య దగ్గర బుంగమూతి పెట్టాను. ఆయన ఆ కెమెరా కొనిచ్చి, ఎలా వాడా లో నేర్పించారు. అప్పుడు అమ్మతో తాత ‘నేర్చుకోవడానికి పెట్టే ఖర్చు ఎప్పుడూ వృథా కాదు’ అన్నారు. ఆయన ఆరోజు అన్న ఆ మాట ఏ కాలానికైనా వర్తిస్తుంది. నాకు నేర్చుకోవడానికి అంతటి స్వేచ్ఛనిచ్చారు. చిన్నప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద సైకిల్ తొక్కాను. ఆడపిల్ల కాబట్టి ఇవి మాత్రమే నేర్చుకోవాలనే ఆంక్షలేవీ లేవు. మంచి పని అంటే ముందుకు అడుగు వేయడం, మంచిది కాదు అనుకుంటే కట్టడి చేయడం... అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఇదే ఫార్ములా. ఇక నా ఆలోచనలకు ‘నేను మహిళను కాబట్టి’ అనే పరిధులు ఎందుకు అడ్డువస్తాయి’’ అని చిరునవ్వుతో ప్రశ్నించారామె.
వారసత్వ పరిరక్షణ
ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఐఎన్‌టీఏసీహెచ్– ఇన్‌టాక్) ... ఇది మన వారసత్వం పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయడం, వారసత్వాన్ని పరిరక్షించడం’ అనే ఉద్దేశంతో 1984లో స్థాపితమైన సంస్థ. న్యూ ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ ఈ ముప్పై ఆరేళ్లలో 190 విభాగాలతో విస్తరించింది.
మీతో నడుస్తాం!
ఒకసారి ఒక స్కూల్ వార్షికోత్సవానికి గెస్ట్‌గా వెళ్లాను. పిల్లలను వారాంతంలో ‘హెరిటేజ్ వాక్’కు తీసుకెళ్లడం గురించి ప్రస్తావించాను. హెరిటేజ్ వాక్‌లో పాల్గొనడానికి పిల్లలకంటే ముందుగా పిల్లల తల్లిదండ్రులు స్పందించారు. ఇప్పటి వరకు ఇలాంటి వేదికల గురించి తెలియలేదన్నారు. అప్పటి నుంచి స్కూలు పిల్లలతోపాటు పేరెంట్స్‌ని కూడా హెరిటేజ్ వాక్‌కు తీసుకెళ్తున్నాం. స్కూళ్లకు వెళ్లి ఇన్‌టాక్ క్విజ్‌లు నిర్వహిస్తున్నాం. ఈ కరోనా సమయంలో పిల్లలు ఆన్‌లైన్ క్లాసులు, గది నాలుగ్గోడల మధ్యనే ఇరవైనాలుగ్గంటలూ గడపాల్సి రావడంతో విసుగెత్తి పోతున్నారు. అందుకే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ హెరిటేజ్‌సైట్‌లకు తీసుకెళ్లాం. మావంతుగా కొన్ని తొలి అడుగులు వేశాం. మా ప్రయాణంలో మరికొంతమంది వచ్చి కలిశారు.
– అనూరాధారెడ్డి, కన్వీనర్, ఇన్‌టాక్, హైదరాబాద్ చాప్టర్
కాలేజ్ పిల్లలతో కుతుబ్ షాహీ టూంబ్స్ వాక్
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment