సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తెగిపోయిన విద్యుత్ బంధం బలపడబోతోంది. చంద్రబాబు వైఖరితో జఠిలంగా మారిన సమస్యకు పరిష్కారం లభిస్తోంది. ఆస్తులు, ఉద్యోగుల విభజన వంటి అంశాలు కొలిక్కి వస్తాయన్న విశ్వాసం రెండు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల్లో నెలకొంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడం, రెండు రాష్ట్రాల సీఎంల సానుకూల ధోరణితో ఏపీ, తెలంగాణ మధ్య సుహృద్భావ వాతావరణం కన్పిస్తోంది. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ సంస్థల మధ్య వివాదాస్పదంగా మారిన అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టే వీలుందని అధికారులు కూడా చెబుతున్నారు. ఇదే జరిగితే విద్యుత్ వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు.
పెండింగ్ బకాయిల వసూళ్లకు మార్గం సుగమం...
ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిల సమస్య వివాదంగా మారింది. జనాభా నిష్పత్తి ప్రకారం విద్యుత్ సంస్థల విభజన జరగాల్సి ఉంది. అయితే అప్పులు, ఆస్తుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కొరవడింది. దీంతో ఐదేళ్లుగా నిప్పు, ఉప్పు అనే పరిస్థితి నెలకొంది. సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం షిలాబిడే కమిటీని నియమించింది. అయితే ఎవరికి వారు వారి వాదనల్లో ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ స్థానికత గల 1,152 మంది ఉద్యోగులను బలవంతంగా రిలీవ్ చేసింది. వీళ్లను ఏపీ తీసుకోలేదు. వివాదం కోర్టుకెళ్లింది. ఆ తర్వాత ఏపీలోని తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు స్వచ్ఛందంగా రిలీవ్ అయ్యారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ సరఫరా వ్యవహారం మరో వివాదమైంది.
ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలు నిలిపివేసింది. సింగరేణి ద్వారా ఏపీ థర్మల్ ప్లాంట్లకు వచ్చే బొగ్గుకు చెందిన బకాయిలను ఏపీ చెల్లించకపోవడాన్ని తెలంగాణ తప్పుబట్టింది. ప్రతిగా ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు ఇవ్వలేదు. తెలంగాణ నుంచి తమకు రూ.5,127 కోట్ల విద్యుత్ బకాయిలు రావాలని, ఆగస్టు 16, 2017న ఏపీ విద్యుత్ సంస్థలు తెలిపాయి. దీనికి మరో రూ. 604.6 కోట్ల వడ్డీ అదనంగా అవుతుందని వెల్లడించాయి. కానీ ఆస్తుల్లో మాకు రావాల్సిన వాటాను తీసేస్తే తాము కేవలం రూ.3,138 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని తెలంగాణ వాదిస్తోంది. సమస్య పరిష్కారం దిశగా అధికారులు చర్చలకు సిద్ధమైనప్పటికీ గతంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపడటంతో అధికారులూ ఏమీ చేయలేకపోయారు.
ఐదేళ్లుగా కొలిక్కిరాని ఉద్యోగుల సమస్య...
గడచిన ఐదేళ్లుగా విద్యుత్ ఉద్యోగుల విభజన డోలాయమానంగా ఉంది. తెలంగాణ రిలీవ్ చేసిన 1,152 మంది ఉద్యోగులు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు. సమస్య పరిష్కారానికి అన్ని మార్గాలు ఉన్నప్పటికీ ఏపీలో గతంలో ఉన్న ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా అడుగులు ముందుకు పడలేదు. ఏళ్ల తరబడి వ్యవహారం కోర్టు మెట్లు దాటడం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే వెంటనే పరిష్కారమయ్యే వేలాది మంది జీవితాలకు చెందిన సమస్యను ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుత అధికార మార్పిడివల్ల ఈ అంశానికి పరిష్కారం లభిస్తుందని వారంతా ఆశిస్తున్నారు.
శాశ్వత పరిష్కారం దిశగా...
రెండు రాష్ట్రాల విద్యుత్ సమస్యల పరిష్కారంపై సానుకూల వాతావరణం కన్పిస్తోందని ఉద్యోగులు అంటున్నారు. పరిష్కార మార్గాలతో అధికారులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. నిజానికి సమస్య కొలిక్కి వచ్చే దశలో చంద్రబాబు ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణకు ఏపీ నుంచి వెళ్లే విద్యుత్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. ఫలితంగా వివాదం మరింత జఠిలమైందని అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు. ఉద్యోగుల్లో కొంతమందిని తెలంగాణకు అప్పగించి, మరికొంత మందిని ఏపీలోకి తీసుకునే వీలుందని ఓ అధికారి తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గడువు ముగిసింది. కాబట్టి బకాయిల విషయంలో పట్టు విడుపు ఉంటుందని, శాశ్వత పరిష్కారం సాధ్యమని చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఏపీ స్థానికత గల ఉద్యోగులు 1,152 మంది
ఏపీ ప్రభుత్వం చెబుతున్న విధంగా తెలంగాణ నుంచి రావలసిన విద్యుత్ బకాయిలు రూ.5,127 కోట్లు
దీనిపై వడ్డీ రూ. 604.6 కోట్లు
తెలంగాణ వాదన ప్రకారం ఆస్తుల్లో తమ వాటా పోనూ ఏపీకి చెల్లించాల్సిన మొత్తం రూ.3,138 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment