క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భాగ్యనగరానికి మళ్లీ వచ్చేసింది. ఉప్పల్ స్టేడియంలో నేటి రాత్రి జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో హోం టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. తమ తొలి మ్యాచ్‌లు ఓడిన ఈ రెండు టీమ్‌లూ సీజన్‌లో బోణీపై గురి పెట్టాయి.
వారాంతం కానీ, సెలవు దినం కానీ కాకపోయినా ముంబైలాంటి పెద్ద జట్టు ఆడుతుండటంతో మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. మంగళవారం ఇరు జట్ల ప్లేయర్లు గ్రౌండ్‌లో సుదీర్ఘ సమయం సాధన చేశాయి. ఇక అభిమానులు అసలు పోరును ఆస్వాదించడమే తరువాయి.
ఉప్పల్/సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ట్రాఫిక్ డీసీపీ మనోహర్, ట్రాఫిక్ ఏసీపీ చక్రపాణిలతో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
3 గంటల ముందుగానే రావచ్చు..
► 2,800కు పైగా వివిధ విభాగాల పోలీస్ బలగాలు 360 సీసీ కెమెరాలతో బందోబస్తును ఏర్పాటు చేశాం. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు 3 గంటల ముందే ప్రేక్షకులను స్డేడియంలోకి అనుమతిస్తాం.
► స్టేడియంలోకి ఎలాంటి వస్తువులను తీసుకురావద్దు. సిగరెట్, లైటర్, బ్యానర్స్, ల్యాప్ ట్యాప్‌లు, బ్యాటరీలు, ఫర్‌ఫ్యూమ్స్, హెల్మెట్లు, బైనాక్యూలర్లు, అగ్గిపెట్టె, కెమెరాలు, ఎల్రక్టానిక్ పరికరాలు, పెన్నులు, వాటర్ బాటిళ్లు, బయటి తిను భండారాలకు స్టేడియంలోకి తీసుకురావద్దు. కారు పాస్ ఉన్నవారు రామంతాపూర్ నుంచి రావాలి. ఫిజికల్ చాలెంజెస్ వ్యక్తులు గేట్–3 ద్వారా వెళ్లాలి.
► క్రికెట్ అభిమానులకు వెసులుబాటుగా మెట్రో రైల్, ఆర్టీసీ బస్సుల అదనపు ట్రిప్పులు.
ట్రాఫిక్ దారి మళ్లింపు ఇలా..
వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు, చర్లపల్లి ఐవోసీ కేంద్రం, ఎన్‌ఎఫ్‌సీ నుంచి వెళ్లాలి. ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి చెంగిచర్ల మీదుగా వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు నాచారం పారిశ్రామిక వాడ ద్వారా చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాలి.
టికెట్లకు తప్పని ఇక్కట్లు
ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లను ఈసారి పేటీఎం ఇన్‌సైడర్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో మాత్రమే విక్రయించారు. ప్రకటించిన కొద్ది సమయంలోనే ‘సోల్డ్ ఔట్’ అని చూపించడంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. ఇంత తక్కువ సమయంలో వేల టిక్కెట్లు ఎలా అమ్ముడుపోయాయని ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment