uppal Rajiv gandhi stadium
-
ఉప్పల్‌లో గెలుపెవరిదో!
ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం జరగనున్న భారత్– బంగ్లాదేశ్ టీ20 క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ సు«దీర్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2,600 మంది బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలతో నిఘా ఉంచినట్లు చెప్పారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం, పరిసర ప్రాంతాలను తమ అ«దీనంలోకి తీసుకున్నామన్నారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ గదికి అనుసంధానం చేసినట్లు తెలిపారు. 3 గంటల ముందే అనుమతి.. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు 3 గంటల ముందుగానే స్డేడియంలోకి అనుమతిస్తారు. ఈవ్‌టీజింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేకంగా షీ టీం బృందాలు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలోకి బయటి వస్తువులు, తినుబండారాలను తీసుకురావద్దు. కారు పాస్ ఉన్న వారు రామంతాపూర్ నుంచి వచ్చి గేట్ నంబర్ 1, 2 ద్వారా తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. దివ్యాంగులు రామంతాపూర్ గేట్– 3 ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. గేట్ నంబర్ –4 నుంచి 10కి వచ్చే వారు తమ వాహనాలను ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద, రామంతాపూర్ చర్చి గ్రౌండ్లో పార్క్ చేసుకోవాలి. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మెట్రో, ఆర్టీసీ సేవలను రాత్రి ఒంటి గంట వరకు పొడిగించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ నుంచి స్టేడియం వైపు, సికింద్రాబాద్ నుంచి స్టేడియం వైపు వచ్చే అన్ని దారులను మళ్లించనున్నారు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్ రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ నుంచి వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి చెంగిచర్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు సైతం నాచారం పారిశ్రామిక వాడ ద్వారా చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. -
#SRHVsMI: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి
క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భాగ్యనగరానికి మళ్లీ వచ్చేసింది. ఉప్పల్ స్టేడియంలో నేటి రాత్రి జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో హోం టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. తమ తొలి మ్యాచ్‌లు ఓడిన ఈ రెండు టీమ్‌లూ సీజన్లో బోణీపై గురి పెట్టాయి. వారాంతం కానీ, సెలవు దినం కానీ కాకపోయినా ముంబైలాంటి పెద్ద జట్టు ఆడుతుండటంతో మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. మంగళవారం ఇరు జట్ల ప్లేయర్లు గ్రౌండ్లో సుదీర్ఘ సమయం సాధన చేశాయి. ఇక అభిమానులు అసలు పోరును ఆస్వాదించడమే తరువాయి. ఉప్పల్/సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ట్రాఫిక్ డీసీపీ మనోహర్, ట్రాఫిక్ ఏసీపీ చక్రపాణిలతో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 3 గంటల ముందుగానే రావచ్చు.. ► 2,800కు పైగా వివిధ విభాగాల పోలీస్ బలగాలు 360 సీసీ కెమెరాలతో బందోబస్తును ఏర్పాటు చేశాం. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు 3 గంటల ముందే ప్రేక్షకులను స్డేడియంలోకి అనుమతిస్తాం. ► స్టేడియంలోకి ఎలాంటి వస్తువులను తీసుకురావద్దు. సిగరెట్, లైటర్, బ్యానర్స్, ల్యాప్ ట్యాప్‌లు, బ్యాటరీలు, ఫర్ఫ్యూమ్స్, హెల్మెట్లు, బైనాక్యూలర్లు, అగ్గిపెట్టె, కెమెరాలు, ఎల్రక్టానిక్ పరికరాలు, పెన్నులు, వాటర్ బాటిళ్లు, బయటి తిను భండారాలకు స్టేడియంలోకి తీసుకురావద్దు. కారు పాస్ ఉన్నవారు రామంతాపూర్ నుంచి రావాలి. ఫిజికల్ చాలెంజెస్ వ్యక్తులు గేట్–3 ద్వారా వెళ్లాలి. ► క్రికెట్ అభిమానులకు వెసులుబాటుగా మెట్రో రైల్, ఆర్టీసీ బస్సుల అదనపు ట్రిప్పులు. ట్రాఫిక్ దారి మళ్లింపు ఇలా.. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు, చర్లపల్లి ఐవోసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ నుంచి వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి చెంగిచర్ల మీదుగా వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు నాచారం పారిశ్రామిక వాడ ద్వారా చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాలి. టికెట్లకు తప్పని ఇక్కట్లు ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లను ఈసారి పేటీఎం ఇన్సైడర్ యాప్ లేదా వెబ్సైట్లో మాత్రమే విక్రయించారు. ప్రకటించిన కొద్ది సమయంలోనే ‘సోల్డ్ ఔట్’ అని చూపించడంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. ఇంత తక్కువ సమయంలో వేల టిక్కెట్లు ఎలా అమ్ముడుపోయాయని ఆందోళన చెందుతున్నారు. -
ODI WC 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. హైదరాబాద్ స్టేడియానికి మహర్దశ
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. పుష్కర కాలం తర్వాత టీమిండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ కావడంతో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టోర్నీ నిర్వహించేందుకు 12 స్టేడియాలను షార్ట్‌లిస్ట్ కూడా చేసింది. అహ్మదాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, హైదరాబాద్, ముంబైలు ఈ లిస్టులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని అభిమానులు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే ఈ మెగా టోర్నీకి ముందే దేశంలోని స్టేడియాలను పూర్తిగా కొత్త లుక్ లో కనిపించేలా చేసేలా కసరత్తులు చేస్తోంది.దీని కోసం రూ.500 కోట్ల ఖర్చుతో ఐదు స్టేడియాలను రెనోవేట్ చేయనుంది. ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరున్నా దేశంలోని క్రికెట్ స్టేడియాలు మాత్రం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వరల్డ్ కప్ కూడా ఇలాంటి స్టేడియాలలో జరిగితే పోయేది బోర్డు పరువే. అందుకే భారీగా ఖర్చు చేసైనా సరే అర్జెంట్ స్టేడియాల రూపురేఖలు మార్చాలని బీసీసీఐ భావించింది. ఆ ఐదు స్టేడియాలకు నిధులు.. ఈసారి వరల్డ్ కప్ కోసం దేశవ్యాప్తంగా 12 వేదికలను ఎంపిక చేసిన బీసీసీఐ అందులో ఐదు స్టేడియాల రూపురేఖలు మార్చేందుకు నిధులు కేటాయించింది. ఢిల్లీతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, మొహాలి, ముంబై స్టేడియాల్లో వసతులను మెరుగుపరచనున్నారు. హైదరాబాద్ రాజీవ్‌గాంధీ స్టేడియానికి రూ.117 కోట్లు వన్డే వరల్డ్‌కప్ వేదికల్లో ఈసారి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి బీసీసీఐ చోటు కల్పించింది. అయితే స్టేడియంలో వసతులు, సౌకర్యాలు మరి నాసిరకంగా ఉన్నాయని అభిమానుల నుంచి ఫిర్యాదులు అందాయి. తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో అభిమానుల నుంచి ఈ ఫిర్యాదులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో బీసీసీఐ ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియానికి కొత్త రూపు తీసుకురావడానికి బడ్డెట్లో నిధులు కేటాయించింది. స్టేడియంలో వసతులు మెరుగుపరచడానికి రూ.117.17 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. సీటింగ్ సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. ఇక హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కోసం రూ.127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, వాంఖడే కోసం రూ.78.82 కోట్లు ఖర్చు కానుంది. ఒకవేళ ఈ స్టేడియాల్లో రూఫ్ పనులు కూడా చేస్తే ఈ ఖర్చు మరింత పెరగనుంది. 2011 వరల్డ్ కప్ ఫైనల్ కు వేదికైన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో కనీస వసతులు లేవని ఓ అభిమాని ఫిర్యాదు చేయడంతో ఈ మధ్యే ఇండియా, ఆస్ట్రేలియా వన్డేకు ముందు ఆ స్టేడియాన్ని రెనోవేట్ చేశారు. వరల్డ్ కప్ లో భాగంగా మొత్తం 48 మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమిచ్చే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. ఇక 2011లో భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను ధోని సేన ఎగరేసుకుపోయింది. ఫైనల్లో శ్రీలంకను ఓడించి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించి రెండోసారి వన్డే ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవించింది. చదవండి: నాన్ స్ట్రయికర్ ముందుగా క్రీజ్ వదిలితే 6 పరుగులు పెనాల్టి..! -
ఐపీఎల్ ఫైనల్ టికెట్లపై అనుమానాలు?
హైదరాబాద్: స్థానిక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో రేపు జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న నిర్వాహకులు టికెట్లను హాంఫట్ అనేశారు. సాధారణంగా మ్యాచ్ టిక్కెట్ల గురించి పత్రికలు, టీవీ ఛానెళ్ల ద్వారా అభిమానులకు సమాచారం అందించడం ఆనవాయితీ. కానీ ఫైనల్ మ్యాచ్ కోసం ఆ ఆనవాయితీని నిర్వాహకులు పక్కకు పెట్టారు. ప్లేఆఫ్ మ్యాచ్‌ల టిక్కెట్లను పద్దతి ప్రకారమే అందుబాటులో పెట్టిన నిర్వాహకులు.. ఫైనల్ మ్యాచ్ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయకుండానే టికెట్లను అమ్మకానికి పెట్టారు. ఫైనల్ మ్యాచ్ టికెట్లను ఈవెంట్స్ .కామ్ సంస్థ ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయం ప్రారంభించింది. గుట్టుచప్పుడు కాకుండా టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టిన ఆ సంస్థ రెండు నిమిషాల్లోనే అన్నీ అమ్ముడైనట్లు చూపించింది. అయితే వెబ్సైట్లో కేవలం ఎక్కువ ధరల టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచారని కామన్ టికెట్ల సంగతేంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎన్ని టిక్కెట్లు అమ్మకానికి పెట్టారు....? ఎన్ని అమ్ముడయ్యాయి...? ఏ టిక్కెట్లు ఎవరు కొన్నారు....? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈ విషయంపై ఈవెంట్స్‌నౌ ప్రతినిధిలు నోరు మెదుపటం లేదు. ఇక హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఈ వివాదంపై స్పందించకపోవడం పట్ల అనేక అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ఆదరణ దృష్ట్యా మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. ఐతే ఈవెంట్స్‌నౌ.కామ్ గానీ.. హెచ్‌సీఏ గానీ మొదట్నుంచీ టిక్కెట్ల అమ్మకంపై గుట్టుగానే ఉన్నాయి. ఎవరికీ కనీస సమాచారం అందించలేదు. రోజువారీ టిక్కెట్ల అమ్మకాల గురించి బీసీసీఐ, హెచ్‌సీఏలకు సమాచారం ఇవ్వాలి. ఈవెంట్స్‌నౌ సంస్థ ఆ పని చేసిందో లేదో తెలియదు. కొన్ని నిమిషాల వ్యవధిలో అన్ని టిక్కెట్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యంగా ఉందని హెచ్‌సీఏ అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. -
ఇలా అయితే.. ఫైనల్ మ్యాచ్ చూసేదెలా?
హైదరాబాద్: ఐపీఎల్ ఫైనల్ చూడాలని ఉత్సాహంగా వచ్చే అభిమానులకు టికెట్ల గోల్మాల్ ఇబ్బందులుగా మారింది. ఎలాగైనా ఫైనల్ మ్యాచ్ చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. దీనిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కేటు గాళ్లు బ్లాక్ టికెట్ల దందాను బహిరంగంగా మొదలెట్టేశారు. ఇక వెబ్సైట్లలో ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండానే కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే టికెట్లను అందుబాటులో ఉంచారు. అనంతరం సర్వర్ డౌన్ అయిందని బుకాయించిన నిర్వాహకులు.. వెంటనే సోల్డ్ ఔట్ అని పెట్టేశారు. ఇక ఆ కొద్ది నిమిషాల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారు జింఖానా గ్రౌండ్స్‌కు వచ్చి టికెట్లు తీసుకోవడానికి దాదాపు ఐదు గంటలకు పైగా క్యూ లైన్లలో పడిగాపులు పడుతున్నారు. ఇక అన్ని సైట్లలలో టికెట్స్ సోల్డ్ ఔట్ దర్శనమిస్తున్నప్పటికీ బ్లాక్‌లో మాత్రం టికెట్ల దందా జోరుగా సాగుతోంది. టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్, ఉప్పల్ స్టేడియం చుట్టూ క్రికెట్ ఫ్యాన్స్ చక్కర్లు కొడుతున్నారు. స్టేడియం వెలుపల రూ. 2 వేల టికెట్లను బ్లాక్‌లో రూ.5 వేల నుంచి రూ. 6 వేల వరకు అమ్ముతున్నారని అభిమానులు పేర్కొంటున్నారు. దాదాపు 36 వేల సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో దాదాపు 15వేల టికెట్ల వరకు స్పాన్సర్లు, బీసీసీఐ, ఇతర రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు కేటాయిస్తారు. అయితే మిగిలిన 21వేల టికెట్ల అమ్మకంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) పారదర్శకత పాటించడం లేదని అభిమానులు మండిపడుతున్నారు. ఇందులో కూడా కామన్ టికెట్లనే బ్లాక్ చేశారని.. ఎక్కువ ధర టికెట్లను మాత్రమే అమ్మారని.. ప్రస్తుతం అవి కూడా దొరకని పరిస్థితికి అధికారులు తీసుకొచ్చారని ఫ్యాన్స్ వాపోయారు. అనుకోకుండా అందివచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని హెచ్‌సీఏ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగ రేపు ఐపీఎల్ ఫైనల్లో భాగంగా డిపెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో మాజా చాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. -
ఎస్జేఎఫ్ఐ సమ్మిట్ మొదలు
సాక్షి, హైదరాబాద్: భారత స్పోర్ట్స్ జర్నలిస్టుల సమాఖ్య (ఎస్జేఎఫ్ఐ) జాతీయ సమ్మిట్ మంగళవారం ప్రారంభమైంది. ఏపీ స్పోర్ట్స్ జర్నలిస్టుల సంఘం (ఏపీఎస్జేఏ) ఆధ్వర్యంలో ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల, భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా, పలు లీగ్‌లకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ముందుగా గుత్తాజ్వాల జ్యోతి ప్రజ్వళన చేసి సమ్మిట్‌ను లాంఛనంగా ప్రారంభించింది. దేశంలో జరుగుతున్న వివిధ క్రీడా లీగ్‌లపై తొలి రోజు (మంగళవారం) చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, ప్రో-కబడ్డీ లీగ్ నిర్వాహకులు చారుశర్మ, భారత బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ప్రతినిధి సంజీవ్ శర్మ, టెన్నిస్ లీగ్‌కు సంబంధించి ముస్తఫా గౌస్ చర్చలో తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. లీగ్‌లకు ఇటీవల పెరుగుతున్న ప్రాధాన్యత గురించి ఈ చర్చలో ప్రస్తావించారు. ఇందులో భారత స్నూకర్స్, బిలియర్డ్స్ సమాఖ్య అధ్యక్షుడు పీవీకే మోహన్, హాకీ ఇండియా నుంచి అనుపమ్ గోస్వామి, ఎస్జేఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు సబ నాయకన్, విశ్వనాథన్, పలువురు ఏపీఎస్జేఏ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్జేఎఫ్ఐ ప్రత్యేక బులెటిన్‌ను గుత్తాజ్వాల విడుదల చేసి క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజాకు అందజేసింది.