ఎస్‌జేఎఫ్‌ఐ సమ్మిట్ మొదలు
సాక్షి, హైదరాబాద్: భారత స్పోర్ట్స్ జర్నలిస్టుల సమాఖ్య (ఎస్‌జేఎఫ్‌ఐ) జాతీయ సమ్మిట్ మంగళవారం ప్రారంభమైంది. ఏపీ స్పోర్ట్స్ జర్నలిస్టుల సంఘం (ఏపీఎస్‌జేఏ) ఆధ్వర్యంలో ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల, భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా, పలు లీగ్‌లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ముందుగా గుత్తాజ్వాల జ్యోతి ప్రజ్వళన చేసి సమ్మిట్‌ను లాంఛనంగా ప్రారంభించింది. దేశంలో జరుగుతున్న వివిధ క్రీడా లీగ్‌లపై తొలి రోజు (మంగళవారం) చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, ప్రో-కబడ్డీ లీగ్ నిర్వాహకులు చారుశర్మ, భారత బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ప్రతినిధి సంజీవ్ శర్మ, టెన్నిస్ లీగ్‌కు సంబంధించి ముస్తఫా గౌస్ చర్చలో తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు.
లీగ్‌లకు ఇటీవల పెరుగుతున్న ప్రాధాన్యత గురించి ఈ చర్చలో ప్రస్తావించారు. ఇందులో భారత స్నూకర్స్, బిలియర్డ్స్ సమాఖ్య అధ్యక్షుడు పీవీకే మోహన్, హాకీ ఇండియా నుంచి అనుపమ్ గోస్వామి, ఎస్‌జేఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు సబ నాయకన్, విశ్వనాథన్, పలువురు ఏపీఎస్‌జేఏ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌జేఎఫ్‌ఐ ప్రత్యేక బులెటిన్‌ను గుత్తాజ్వాల విడుదల చేసి క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజాకు అందజేసింది.