కాఫీల్లో ఈ కాఫీ వేరయా..!
నగర యువతలో మారుతున్న అభిరుచి
వియత్నాం కాఫీపై పెరుగుతున్న మక్కువ
డిఫరెంట్ ప్లేవర్స్‌తో ఆకట్టుకుంటున్న కాఫీ
కోల్డ్ కాఫీతో ఆరోగ్యానికీ మేలంటున్న నిపుణులు
పొద్దున లేవగానే కాఫీ తాగనిదే చాలామందికి తెల్లారదు. కప్పులో అలా వేడి వేడి కాఫీ మన ముందుంటే ఆ పొగలతో వచ్చే ఆ వాసన చూస్తుంటే మనల్ని మనమే మైమరిచి పోతాం. పొట్టలో ఓ కప్పు కాఫీ పడితే ఉంటుంది గురూ.. ఆ లెవలే వేరు. మెదడు కూడా అంత వేగంగా పనిచేస్తుంది. చకచకా పనులు అయిపోతాయంతే.. ఇంక వేరే మాటే ఉండదు. కొందరికేమో ఇన్‌స్టంట్ కాఫీ అంటే ప్రాణం. మరికొందరు ఫిల్టర్ కాఫీ అంటే పడి చచి్చపోతారు. ఇంకొందరికేమో కోల్డ్ కాఫీ అంటే పిచ్చి. ఇలా జిహ్వకో రుచి అన్నట్టు.. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన టేస్ట్.
భాగ్యనగరం అంటేనే పలు రుచులకు కేరాఫ్ అడ్రస్. ప్రపంచ దేశాల్లో దొరికే అనేక రుచులు మన నగరవాసులకు దొరుకుతాయనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఇటీవల మన నగరంలో ఓ కొత్త రుచి క్రేజ్‌ను సంతరించుకుంటోంది.. దీంతో పాటు నగర ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటోంది.. దాని గురించి తెలుసుకుందాం..
వరల్డ్ ఫేమస్ హైదరాబాద్..
కోల్డ్ కాఫీ నగరంలో ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. అందులోనూ వియత్నాం కాఫీ నగరంలో మరింత ఫేమస్ అయిపోతోంది. నగర యువత ఈ కాఫీని లొట్టలేసుకుంటూ తాగేస్తోంది. ఒకప్పుడు ఇరానీ చాయ్.. ఇప్పుడు కోల్డ్ కాఫీ.. అప్పటికీ.. ఇప్పటికీ ప్రియమైన పానీయం టీ, కాఫీలే అయినా.. వైవిధ్యమైన రుచి ఆస్వాదించాలి అనుకునే వారికి మాత్రం ఇది పర్‌ఫెక్ట్ టేస్టీ చాయిస్ అని చెప్పొచ్చు.
విభిన్న రుచులు..
వియత్నాం కాఫీలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఎగ్ కాఫీ, యోగర్ట్ కాఫీ, కోకోనట్ వియత్నమీస్ కాఫీ, వైట్ కాఫీ, కాఫెసురా, ఐస్‌డ్ బ్లాక్ కాఫీ, వియెట్ కాఫీ, లైబేరికా కాఫీ, కులీ కాఫీ, చెర్రీ కాఫీ ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. కోల్డ్ కాఫీల్లో కూడా కుకుంబర్ టానిక్, యాపిల్ కాఫీ యేల్, కివీ టానిక్ కాఫీ, స్పానిష్ లాటే ఇలా విభిన్నమైన రుచులు అందుబాటులోకి తెచ్చారు. ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవ్వాలనుకున్నా.. గర్ల్ ఫ్రెండ్‌తో జాలీగా గడపాలనుకున్నా ఎంచక్కా మాంచి కాఫీ షాప్‌కి వెళ్లి రెండు వియత్నాం కాఫీలు ఆర్డర్ చేసి లాగించేయండి.
అథ్లెట్స్, జిమ్ చేసే వారికి తక్షణ శక్తిని అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి చిటికెలో ఉపశమనం కలిగిస్తుంది.
అయితే ఏదైనా సరే రోజుకు ఓ మోతాదులో తీసుకుంటేనే మంచిదని, అతి ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వియత్నాం కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. శక్తిని పెంచడమే కాకుండా రన్నింగ్, జాగింగ్, వ్యాయామాలు మరింత ఎక్కువగా చేసేందుకు దోహదపడుతుంది. గుండెకు మేలు చేస్తుంది. యాంగ్జయిటీని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతతో పాటు మెదడుకు మంచి చేస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగితే సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ జ్ఞాపక శక్తి పెంచుతుంది. దీంతోపాటు ఎక్కువ విషయాలు నేర్చుకునేలా చేయడం, మానసిక సంతోషాన్ని ఇవ్వడంతో పాటు డిప్రెషన్ తగ్గించడం, శారీరక ఉష్ణోగ్రతను నియంత్రించడంతో, నిద్ర సరిగ్గా పట్టడంలో
తోడ్పడుతుంది.
నా సోల్‌మేట్..
కాఫీ అంటేనే అద్భుతం. ఇక కోల్డ్ కాఫీ అంటే మహా అద్భుతం. ఒంటరిగా ఉన్నప్పుడు కాఫీ తాగితే నన్ను నేనే మైమరిచిపోతాను. కాఫీ తాగిన తర్వాత అరగంట వరకూ ఏమీ తినను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఆస్వాదించాలనేది నా భావన. చల్లచల్లటి కాఫీ తాగుతుంటే మస్తు మజా వస్తుంది. మంచి లొకేషన్‌లో కాఫీ తాగుతుంటే ఆ ఫీలింగే వేరు. స్నేహితులు తోడైతే అనుభూతి వేరే లెవల్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కాఫీ నా సోల్‌మేట్. బేగంపేటలోని పంచతంత్ర కాఫీ షాప్‌కి వారానికోసారి వెళ్లి కాసేపు కూర్చుని కాఫీ తాగుతుంటే భలే సరదాగా ఉంటుంది.
:::మంజీర ఆరెట్టి, ప్రకాశ్‌నగర్, బేగంపేట
స్వచ్ఛమైన కాఫీ అందించాలని..
కాఫీ ప్రియులకు అచ్చమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వచ్ఛమైన కాఫీ అందించాలనే ఆలోచనతో పంచతంత్ర కేఫ్ ఏర్పాటు చేశాం. కాఫీతో పాటు యాంబియెన్స్ కూడా బాగా ఉండేలా ప్రయత్నించాం. కస్టమర్లకు అద్భుతమైన అనుభూతి ఇవ్వడమే మా ప్రాధాన్యం.
::: విక్రమ్, పంచతంత్ర కేఫ్
Comments
Please login to add a commentAdd a comment