ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం(ఫైల్)
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. పుష్కర కాలం తర్వాత టీమిండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ కావడంతో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టోర్నీ నిర్వహించేందుకు 12 స్టేడియాలను షార్ట్‌లిస్ట్ కూడా చేసింది.
అహ్మదాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, హైదరాబాద్, ముంబైలు ఈ లిస్టులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని అభిమానులు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే ఈ మెగా టోర్నీకి ముందే దేశంలోని స్టేడియాలను పూర్తిగా కొత్త లుక్ లో కనిపించేలా చేసేలా కసరత్తులు చేస్తోంది.దీని కోసం రూ.500 కోట్ల ఖర్చుతో ఐదు స్టేడియాలను రెనోవేట్ చేయనుంది. ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరున్నా దేశంలోని క్రికెట్ స్టేడియాలు మాత్రం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వరల్డ్ కప్ కూడా ఇలాంటి స్టేడియాలలో జరిగితే పోయేది బోర్డు పరువే. అందుకే భారీగా ఖర్చు చేసైనా సరే అర్జెంట్ స్టేడియాల రూపురేఖలు మార్చాలని బీసీసీఐ భావించింది.
ఆ ఐదు స్టేడియాలకు నిధులు..
ఈసారి వరల్డ్ కప్ కోసం దేశవ్యాప్తంగా 12 వేదికలను ఎంపిక చేసిన బీసీసీఐ అందులో ఐదు స్టేడియాల రూపురేఖలు మార్చేందుకు నిధులు కేటాయించింది. ఢిల్లీతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, మొహాలి, ముంబై స్టేడియాల్లో వసతులను మెరుగుపరచనున్నారు.
హైదరాబాద్ రాజీవ్‌గాంధీ స్టేడియానికి రూ.117 కోట్లు
వన్డే వరల్డ్‌కప్ వేదికల్లో ఈసారి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి బీసీసీఐ చోటు కల్పించింది. అయితే స్టేడియంలో వసతులు, సౌకర్యాలు మరి నాసిరకంగా ఉన్నాయని అభిమానుల నుంచి ఫిర్యాదులు అందాయి. తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో అభిమానుల నుంచి ఈ ఫిర్యాదులు మరింత ఎక్కువయ్యాయి.
దీంతో బీసీసీఐ ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియానికి కొత్త రూపు తీసుకురావడానికి బడ్డెట్‌లో నిధులు కేటాయించింది. స్టేడియంలో వసతులు మెరుగుపరచడానికి రూ.117.17 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. సీటింగ్ సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలను మెరుగుపరచనున్నారు.
ఇక హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కోసం రూ.127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, వాంఖడే కోసం రూ.78.82 కోట్లు ఖర్చు కానుంది. ఒకవేళ ఈ స్టేడియాల్లో రూఫ్ పనులు కూడా చేస్తే ఈ ఖర్చు మరింత పెరగనుంది. 2011 వరల్డ్ కప్ ఫైనల్ కు వేదికైన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో కనీస వసతులు లేవని ఓ అభిమాని ఫిర్యాదు చేయడంతో ఈ మధ్యే ఇండియా, ఆస్ట్రేలియా వన్డేకు ముందు ఆ స్టేడియాన్ని రెనోవేట్ చేశారు.
వరల్డ్ కప్ లో భాగంగా మొత్తం 48 మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమిచ్చే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. ఇక 2011లో భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను ధోని సేన ఎగరేసుకుపోయింది. ఫైనల్లో శ్రీలంకను ఓడించి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించి రెండోసారి వన్డే ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవించింది.
చదవండి: నాన్ స్ట్రయికర్ ముందుగా క్రీజ్ వదిలితే 6 పరుగులు పెనాల్టి..!
Comments
Please login to add a commentAdd a comment