Hyderabad Fans Fires BCCI Only 3 Matches Scheduled Uppal ODI WC 2023 - Sakshi
Sakshi News home page

#ICCWorldCup2023: ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం

Published Tue, Jun 27 2023 7:04 PM | Last Updated on Tue, Jun 27 2023 8:27 PM

Hyderabad-Fans Fires-BCCI-Only-3-Matches Scheduled Uppal ODI-WC-2023 - Sakshi

బీసీసీఐపై హైదరాబాద్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకనేది మీకు ఈ పాటికే అర్థమయి ఉండాలి. ఇవాళ(జూన్‌ 27న) ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ 2023కి సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్‌ను విడుదల చేసింది. పది ప్రధాన వేదికల్లో మ్యాచ్‌లన్నీ జరగనున్నాయి. ఇందులో హైదరాబాద్‌కు కూడా చోటు దక్కింది. అయితే పేరుకు హైదరాబాద్‌ ఉన్నా పెద్దగా ఆసక్తి చూపించే మ్యాచ్‌లు మాత్రం లేవు.

అందునా టీమిండియాకు సంబంధించి ఒక్క మ్యాచ్‌కు కూడా ఉప్పల్‌ స్టేడియం వేదికగా కాలేదు. కనీసం పెద్ద జట్ల మ్యాచ్‌ అయినా ఇస్తారేమో అని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. పాకిస్తాన్‌ ఆడే రెండు మ్యాచ్‌లతో పాటు న్యూజిలాండ్‌ ఒక మ్యాచ్‌ ఇక్కడ ఆడనున్నాయి. అయితే ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మూడు మ్యాచ్‌లు క్వాలిఫయర్స్‌తోనే షెడ్యూల్‌ చేయడం అభిమానులకు కోపం తెప్పించింది. షెడ్యూల్ విడుదలైన నిమిషాల్లోనే హైదరాబాద్‌కు అన్యాయం జరిగిందన్న మాట తెరమీదకు వస్తోంది. తెలుగు గడ్డపై బీసీసీఐ వివక్ష చూపుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వరల్డ్ కప్ 2023 టోర్నీకి 8 జట్లు నేరుగా అర్హత సాధించగా, మరో రెండు జట్లు జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా అర్హత సాధించనున్నాయి. ఆ రెండు జట్ల మ్యాచులే ఉప్పల్ వేదికగా జరగనున్నాయి. రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా అక్టోబర్ 6న పాకిస్తాన్ - క్వాలిఫైయర్ 1జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా.. అక్టోబర్ 9న న్యూజిల్యాండ్- క్వాలిఫైయర్-1 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 12న పాకిస్తాన్ - క్వాలిఫైయర్-2 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. 

పేరుకే హైదరాబాద్.. ఇంతదానికి ఎందుకీ మ్యాచ్‌లు?
జరిగేదే మూడు మ్యాచులు అంటే.. వాటిని టోర్నీ ప్రారంభమైన వారం రోజుల్లోనే ముగిసేలా షెడ్యూల్ చేశారు. పోనీ వీటిలో ఏమైనా చూడగలిగే మ్యాచ్ ఉందా? అంటే.. అదీ కనిపించడం లేదు. ఒకవేళ జింబాబ్వే కనుక క్వాలిఫైయర్-1 లేదా క్వాలిఫైయర్-2గా వస్తే.. పాకిస్తాన్‌తో వారి మ్యాచ్ చూడొచ్చు. అనంతరం పసికూన జట్టుతో తలపడనున్న కివీస్ మ్యాచ్‌పై ఎవరూ ఆసక్తి చూపకపోవచ్చు. ఇలాంటి మ్యాచులు హైదరాబాద్‌లో నిర్వహించడం పట్ల తెలుగు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.''ఇంతదానికి హైదరాబాద్‌లో మ్యాచ్‌లు పెట్టడం ఎందుకు''.. ''ఏదో ముష్టి పడేసినట్లు మూడు మ్యాచ్‌లు మా ముఖానా పడేశారు''.. ''హైదరాబాద్‌పై బీసీసీఐకి ఎందుకింత వివక్ష'' అంటూ కామెంట్స్‌ చేశారు.

హెచ్‌సీఏలో అవినీతి
హైదరాబాద్‌లో కీలక మ్యాచులు లేకపోవడానికి హెచ్‌సీఏ తీరు కూడా ఒక కారణమన్నది క్రికెట్ విశ్లేషకుల మాట. హెచ్‌సీఏలో అవినీతి పేరుకుపోయిందని.. ఆధిపత్య పోరు కోసం బోర్డు సభ్యులు రెండు వర్గాలుగా విడిపియి పట్టించుకోవడం లేదనే మాటలు వినపడుతున్నాయి. ఐపీఎల్ మ్యాచుల సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలు, టికెట్ల కుంభకోణం వంటి విషయాలను అందుకు కారణాలుగా ప్రస్తావిస్తున్నారు. 

చదవండి: విస్తుపోయే నిజాలు.. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు క్షమాపణ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement