
Photo Courtesy: BCCI
ఉచిత పాస్‌ల విషయంలో (ఐపీఎల్ 2025) సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు పతాకస్థాయికి చేరాయి. పాస్‌ల కోసం హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు ఓ ఘాటు లేఖ రాశారు.
ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు ఏ జగన్‌మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు కూడా వెనకాడము. వారి ప్రవర్తన చూస్తే మేము ఉప్పల్ స్టేడియంను హోం గ్రౌండ్‌గా ఎంచుకుని మ్యాచ్‌లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది.
ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాను. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం మరియు మా యాజమాన్యానికి తెలియజేయగలము. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదారబాద్ నుంచి తరలిపోతామని సన్‌రైజర్స్ ప్రతినిథి హెచ్‌సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.
సన్‌రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ ఈ విషయాలను కూడా తన ఈ-మెయిల్‌లో రాశారు. గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్‌లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.
అయినా పట్టించుకోకుండా హెచ్‌సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్ చేశారు. SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్ బాక్స్‌కు (F3) తాళం వేశారు. మేము అడిగిన అదనపు టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరవమని బెదిరించారు. గత రెండేళ్లలో హెచ్‌సీఏ నుంచి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్ తన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.
కాగా, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) హోం గ్రౌండ్‌గా ఉన్న విషయం తెలిసిందే.