![Navuluru International Cricket Stadium is ready - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/10/cric.jpg.webp?itok=XQpgLfOM)
మంగళగిరి: గుంటూరు జిల్లా నవులూరు అమరావతి టౌన్‌షి ప్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు రెడీ అయ్యింది. మూడేళ్ల కిందట నిర్మాణం పూర్తి చేసుకున్నా నిధుల కొరతతో ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు తదితర తుదిదశ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం బీసీసీఐ నుంచి నిధులు విడుదల కావడంతో తొలి విడతగా రూ.15 కోట్లతో స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు వేగంగా పూర్తి చేయించి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడుగులు వేస్తోంది.
ఈలోపు ఈ సీజన్‌లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు ట్రోఫీల నిర్వహణకు బీసీసీఐ అనుమతులు ఇవ్వగా, మ్యాచ్‌ల నిర్వహణకు అన్ని రకాల వసతులు కల్పించారు. ఈ నెల 12 నుంచి పురుషుల అండర్–19 వినూ మన్కడ్ ట్రోఫీ జరుగనుంది. ఇక్కడ 15 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్, ఉత్తరాఖండ్, మేఘాలయ జట్లు తలపడనున్నాయి. అలాగే ఈ ఏడాది డిసెంబర్‌లో విజయ్ మర్చంట్ ట్రోఫీ నిర్వహించనున్నారు.
15 మ్యాచ్‌ల ఈ ట్రోఫీలో ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్ జట్లు తలపడనున్నాయి. అలాగే 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో మహిళల అండర్–23 వన్ డే ట్రోఫీ కోసం 21 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఉత్తరాఖండ్, బరోడా, విదర్భ, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి జట్లు తలపడనున్నాయి. మూడు ట్రోఫీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి అనంతరం అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణకు ఏసీఏ సన్నాహాలు చేస్తోంది.
త్వరలో అంతర్జాతీయ మ్యాచ్
త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ నెల 12 నుంచి రానున్న ఆరు నెలల కాలంలో మూడు ట్రోఫీలకు సంబంధించిన 51 మ్యాచ్‌లు ఇక్కడ జరగనున్నాయి. త్వరలోనే బీసీసీఐ బృందం పర్యటించి అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణకు అవసరమైన సూచనలు చేసే అవకాశం ఉంది. – ఎస్‌ఆర్ గోపీనాథ్‌రెడ్డి, ఏసీఏ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment