
ప్రత్యేకతను చాటుకుంటున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
దేశ, విదేశాలు ఎక్కడికి వెళ్లినా అదే స్టైల్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి రికార్డు సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎప్పుడు చూసినా పంచెకట్టులోనే కనిపిస్తారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో ఆయన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. దేశ విదేశాలు ఎక్కడికి వెళ్లినా పంచెకట్టులోనే వెళ్తారు. ఆయన ఆహార్యం అందరినీ ఆకట్టుకుంటుంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఆయన పంచెకట్టులోనే తిరగడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అదే పంచెకట్టుతో ఉంటున్నారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా పంచెకట్టు మూలంగా సులువుగా గుర్తు పట్టేస్తుంటారు. ఈసందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ అభిమానిగా ఆయన పంచెకట్టు నన్నెంతో ఆకట్టుకునేది. ఆయన అడుగుజాడల్లో నడిచిన నేను కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అయ్యాను.
అప్పుడే కేసీఆర్ పోటీ చేస్తున్నాడని తెలియడంతో నా ఆహార్యంలో మార్పు ఉండాలనుకున్నాను. దీంతో వైఎస్సార్‌లా పంచె కట్టాలని నిర్ణయానికి వచ్చాను. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా పంచెకట్టులోనే వెళతాను’ అని అన్నారు. విదేశాలకు వెళ్లినపుడు కూడా చాలా మంది దగ్గరకు వచ్చి కలిశారని, ఆంధ్ర ప్రాంతానికి వెళ్లినపుడు తనను గుర్తుపట్టి, పలకరించి సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారన్నారు.