దర్యాప్తు ముగిసింది.. బెయిల్ ఇవ్వండి: మోపిదేవి వెంకటరమణారావు
సీబీఐ ప్రత్యేక కోర్టుకు మోపిదేవి నివేదన
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంపై దర్యాప్తు పూర్తి అయిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. మోపిదేవి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ రెండో అదనపు జడ్జి ఎంవీ రమేష్ శుక్రవారం విచారించారు. వాన్‌పిక్ ఒప్పందం విషయంలో మోపిదేవి తోటి మంత్రివర్గ సభ్యులను తప్పుదోవ పట్టించారని సీబీఐ ఆరోపిస్తోందని, అయితే ఏ మంత్రీ ఇప్పటివరకూ అటువంటి ఫిర్యాదు చేయలేదని మోపిదేవి తరఫున న్యాయవాది వి.సురేందర్‌రావు కోర్టుకు నివేదిం చారు.
కేబినెట్ సమష్టి నిర్ణయం మేరకే వాన్‌పిక్ ఒప్పందం జరిగిందన్నారు. వెన్నునొప్పి చికిత్సలో భాగంగా ఈ నెలాఖరుకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉందని, ఆ తర్వాత వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉం టుందని నివేదించారు. ఇతర నిందితులకు బెయిల్ ఇచ్చారన్న కారణంతో మోపిదేవికి కూడా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని సీబీఐ స్పెషల్ పీపీ సురేంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును 28కి వాయిదా వేశారు.