జగన్ బెయిల్ షరతులు సడలింపు
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు, ఢిల్లీ వెళ్లేందుకు కోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. అలాగే ఢిల్లీ వెళ్లేందుకు అనుమతిస్తూ సీబీఐ రెండో అదనపు ప్రత్యేక కోర్టు జడ్జి ఎంవీ రమేశ్ బుధవారం తీర్పునిచ్చారు. హైదరాబాద్ విడిచి వెళ్లే రెండు రోజుల ముందు సీబీఐకి సమాచారం ఇవ్వాలని, అలాగే ఫోన్ నంబర్ ఇవ్వాలని, నగరం వెలుపల ఉన్న సమయంలో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్‌లో అందుబాటులో ఉండాలని న్యాయమూర్తి షరతు విధించారు. ‘‘పార్లమెంట్ సభ్యునిగా ఆయన నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అధ్యక్షునిగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించవచ్చు’’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అవకాశమివ్వండి..
జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. ‘‘రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీ అధ్యక్షునిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సి ఉంది. వారి బాధలు తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంది. సీఆర్‌పీసీ 437 (3) ప్రకారం సమంజసమైన కారణం (రీజనబుల్) అనిపిస్తే బెయిల్ షరతులను సడలించవచ్చు. జగన్ తండ్రి దివంగత డాక్టర్ రాజశేఖరరెడ్డి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. సుదీర్ఘ కాలంగా వీరి కుటుంబం రాజకీయాల్లో ఉంటూ ప్రజలతో మమేకమై ఉంది. జగన్ జెడ్ కేటగిరీ భద్రత మధ్య ఉంటారు. 24 గంటలూ ఆయనకు రక్షణ ఉంటుంది. ఆయన కనిపించకుండా పోయే అవకాశం లేరు. కోర్టు విచారణకు క్రమం తప్పకుండా హాజరవుతారు’’ అని సుశీల్‌కుమార్ తెలిపారు.
జగన్‌పై కేసులు నిరూపణ కాలేదు..
‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జగన్ ఇప్పటికే రెండు పర్యాయాలు నిరాహార దీక్ష కూడా చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీకి వెళ్లి జాతీయ పార్టీ నేతలను కలవాల్సి ఉంది. సాధారణ ఎన్నికలకు ఆరు నెలల గడువే ఉంది. ఈ తరుణంలో బలమైన రాజకీయ పార్టీ అధ్యక్షునిగా జగన్ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకెళ్లాల్సి ఉంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది.
ఈ కేసులో సీబీఐ మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసింది. దర్యాప్తును ప్రభావితం చేశారనే ఆరోపణగానీ, సాక్షులను బెదిరించారని కానీ సీబీఐ ఎప్పుడూ చెప్పలేదు. జగన్‌పై సీబీఐ మోపిన అభియోగాలు విచారణ దశలోనే ఉన్నాయి. అవి ఇంకా నిరూపణ కాలేదు. కోర్టు విధించే షరతులను పాటించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ షరతులు సడలించండి. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు, ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించండి’’ అని సుశీల్‌కుమార్ వివరించారు. ఆయన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుని షరతులను సడలించింది.