లక్నో వెళ్లేందుకు అనుమతించండి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్.. విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలిసేందుకు వీలుగా లక్నోకు వెళ్లడానికి అనుమతించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీ మద్దతు కూడగట్టాల్సి ఉందని తెలిపారు.
హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న తన బెయిల్ షరతును సడలించి అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి బాలయోగి... సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. గతంలో లక్నో వెళ్లేందుకు జగన్‌కు కోర్టు అనుమతి మంజూరు చేసినా... అఖిలేష్ ఉపఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండడంతో ప్రయాణం రద్దయిన విషయం తెలిసిందే.