మోపిదేవికి 31 వరకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. న్యాయమూర్తి మోపిదేవిని ఈనెల 31వరకు రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారు. అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. వెన్నునొప్పి శస్త్రచికిత్స కోసం మోపిదేవికి మంజూరు చేసిన 45 రోజుల తాత్కాలిక బెయిల్ ఈనెల 31తో ముగియనుంది. నవంబర్ 1న లొంగిపోవాలని కోర్టు షరతు విధించింది. అయితే, ఆయన ఆ లోపే కోర్టులో లొంగిపోయారు.
బెయిల్ మంజూరు చేయండి
ఈ కేసు దర్యాప్తు పూర్తయినందున బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోపిదేవి తరఫు న్యాయవాది వి.సురేందర్‌రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మోపిదేవి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, కోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి కౌంటర్ దాఖలుకు సీబీఐకి గడువునిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.