సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు కూడా హాజరయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, శామ్యూల్, వెంకట్‌రామిరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, నిమ్మగడ్డ ప్రకాష్, ఈశ్వర్ సిమెంట్స్ పూర్వ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా, ఉద్యోగులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్‌కమల్‌బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు హాజరుకాగా, ఐఏఎస్ అధికారులు మన్మోహన్‌సింగ్, శ్రీలక్ష్మిలతో పాటు రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, ఫార్మా కంపెనీల ప్రతినిధులు హాజరు మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్‌లను కోర్టు అనుమతించింది.
అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హాజరు మినహాయింపునకూ సమ్మతి తెలిపింది. తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 17కు వాయిదా వేశారు. ఇదే కేసులో నిందితులు ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల రిమాండ్ ముగియడంతో చెంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. అనంతరం వారి రిమాండ్‌ను న్యాయమూర్తి ఈనెల 17 వరకు పొడిగించారు. ఇదిలా ఉండగా సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకోవాలని తెలంగాణ న్యాయవాదులు యోచిస్తున్నారనే సమాచారంతో నాంపల్లి కోర్టు ఆవరణలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో రిమాండ్ పొడిగింపు: ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో నిందితులుగా ఉన్న సునీల్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్ధన్‌రెడ్డి, అలీఖాన్‌ల రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 17 వరకు పొడిగించింది. ఎమ్మార్ కేసులో నిందితులు బీపీ ఆచార్య, కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ హాజరుకాగా, ఐఏఎస్ అధికారి ఎల్‌వీ సుబ్రమణ్యం సహా ఇతర నిందితులు హాజరు మినహాయింపునకు కోర్టు అనుమతించింది. ఓఎంసీ కేసులో గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్ హాజరుకాగా, అనారోగ్యం కారణంగా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 17కు వాయిదా వేసింది.
కోర్టుకు హాజరైన జగన్
Published Fri, Oct 4 2013 4:05 AM | Last Updated on Sat, Jul 6 2019 12:52 PM
Advertisement
Advertisement