సాక్షి, హైదరాబాద్: ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ వి.విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయలేమని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులను వారు ఉల్లంఘించలేదని, బెయిల్ రద్దు చేసేందుకు సహేతుకమైన కారణాలేమీ లేవని తేల్చి చెప్పింది. ఈ మేరకు రఘురామ దాఖలు చేసిన రెండు పిటిషన్లను బుధవారం కొట్టివేసింది. గత మూడు నెలలుగా సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు ఈ మేరకు తీర్పునిచ్చారు.
వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే..
‘జగన్, సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ తన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. పిటిషన్ దాఖలు చేసిన తీరు, అందులో వాడిన బాష ఆయన దురుద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలు, అభూత కల్పనలతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రోజువారీ పద్ధతిలో కేసులను విచారిస్తోంది. నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వింటోంది.
ఈ క్రమంలో విచారణను జాప్యం చేస్తున్నారంటూ రఘురామ పేర్కొనడం కోర్టు ధిక్కరణకు పాల్పడటమే అవుతుంది. అలాగే బెయిల్ మంజూరు సమయంలో ప్రత్యేక కోర్టు విధించిన షరతులను వారు ఎప్పుడూ ఉల్లంఘించలేదు. బెయిల్ షరతులు ఉల్లంఘించారని భావించినప్పుడు నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం ప్రాసిక్యూషన్ విభాగానికి మాత్రమే ఉంటుంది. థర్డ్‌పార్టీకి బెయిల్ రద్దు చేయాలని కోరే హక్కు లేదని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను కొట్టివేయండి..’ అని జగన్, సాయిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఇ.ఉమామహేశ్వరరావు కోర్టును కోరారు.
మరో కోర్టుకు బదిలీకి కారణాల్లేవు
హైకోర్టులోనూ రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బదిలీ చేయడానికి సహేతుకమైన కారణాలు లేవని స్పష్టం చేసింది. ఊహాగానాలతో రఘురామ ఈ పిటిషన్ దాఖలు చేశారని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చారు.
అలా చేయాలంటే నిర్దిష్టమైన కారణాలుండాలి
‘ఏదైనా పిటిషన్‌పై విచారణను ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు బదిలీ చేయాలంటే నేర విచారణ చట్టంలో పేర్కొన్న మేరకు నిర్దిష్టమైన కారణాలు ఉండాలి. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో రెండో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారన్న కారణాన్ని చూపుతూ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదు. నిందితులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలు చేసినప్పుడు అనుమతిస్తూ ఉండటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. బెయిల్ రద్దు కోరుతూ ఏప్రిల్‌లో సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే సీబీఐ కోర్టుపై నమ్మకం లేదంటూ ఆ పిటిషన్లపై ఆదేశాలు ఇవ్వడానికి ఒక రోజు ముందు హైకోర్టును ఆశ్రయించడం సరికాదు..’ అని జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment