
వాతావరణంలోని గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జులై 1, 2025 నుంచి ‘ఎండ్-ఆఫ్-లైఫ్(ఈఓఎల్-నిబంధనల ప్రకారం వాడకూడని వాహనాలు)’ వాహనాలకు ఇంధనం నింపడాన్ని నిషేధించాలని నిర్ణయించింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి ప్రధాన కారమవుతున్న వాహనాల ఉద్గారాలను నియంత్రించడమే లక్ష్యంగా 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఈ చర్యలను అమలు చేయడానికి ఢిల్లీలోని అన్ని ఇంధన స్టేషన్లలో జూన్ 30, 2025 నాటికి ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ అధునాతన వ్యవస్థ ఈఓఎల్ వాహనాలను గుర్తించి, వాటిలో ఇంధనం నింపకుండా నిరోధించేందుకు సాయం చేస్తుంది. ఈ ఆంక్షలు ఒక్క ఢిల్లీకే పరిమితం కావని కొందరు అధికారులు తెలుపుతున్నారు. నవంబర్ 1, 2025 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) పరిధిలోని ఐదు జిల్లాల్లో ఈ నిషేదాజ్ఞలు ఉండబోతున్నాయి. ఇందులో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్‌లు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2026 నాటికి ఈ విధానం మొత్తం ఎన్‌సీఆర్‌ను పరిధిలో విస్తరించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇదీ చదవండి: బీమా ప్రీమియం రేట్ల నోటిఫికేషన్‌లో జాప్యం
మరోవైపు 2025 నవంబర్ 1 నుంచి బీఎస్-6 కాని రవాణా, వాణిజ్య గూడ్స్ వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) నిషేధించింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో వాహన కాలుష్యం క్లిష్టమైన సమస్యగా ఉన్నందున ఈ విధానాలు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి, ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ఎంతో తోడ్పడుతాయని అధికారులు తెలిపారు.