ఆహారం విషయంలో శ్రద్ధ పెడుతున్నాం.. తాగే నీటి విషయంలో జాగ్రత్త వహిస్తున్నాం. పీల్చే గాలి విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం. ఫలితం వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. నీడలా వెంటాడి మనిషిపై విషం చిమ్ముతోంది. మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా చేస్తోంది. పట్టణాలను విషతుల్య ప్రాంతాలుగా మారుస్తోంది. పెరుగుతున్న వాహనాలు వెదజల్లుతున్న పొగమాటున ప్రజారోగ్యం పరిహాసమవుతోంది. కొరవడుతున్న అవగాహన.. పత్తాలేని ప్రత్యామ్నాయ విధానాలతో సమస్య నానాటికీ జఠిలమవుతోంది. ఇప్పటికైనా నివారణ చర్యలు తీసుకోకపోతే చివరకు మిగిలేది.. పొగే.!
మర్రిపాలెం: జిల్లా వ్యాప్తంగా సుమారుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో నడిచే 10.50 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటిలో 8.75 లక్షల ద్విచక్రవాహనాలు, 1.25 లక్షల లగ్జరీ కార్లు, 65 వేల ఆటోలు, 25 వేల రవాణా తరహా వాహనాలను రిజిస్ట్రేషన్ చేశారు. 15 ఏళ్లు నిం డిన ఆయా తరహా వాహనాలు లక్షకు పైగా ఉండవచ్చని గణాంకాలు చెబుతున్నా యి. కాలం చెల్లిన వాహనాలతో కాలుష్యం ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తనిఖీ కేంద్రాల్లో అవకతవకలు
వాహనాల కాలుష్య పరిమాణం గుర్తించడానికి పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) తరహా కేంద్రాలు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. తనిఖీ కేంద్రాలు తొలుత ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడంతో వాహనాల కాలుష్యం తనిఖీల్లో అవకతవకలు జరుగుతున్నాయి. డబ్బు చెల్లించడంతో పొల్యూషన్ సర్టిఫికెట్లు అందుతున్నాయి. ఇదిలా ఉండగా.. కాలం చెల్లిన వాహనాలు రోడ్డెక్కకుండా చూడాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారు.
కాలుష్యంతో ప్రాణాలకు ముప్పు
కాలుష్య నియంత్రణలో పాలకుల నిర్లక్ష్యంతో నగర జీవికి అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వాహనాలు విడుదల చేసే వాయువుల్లో ఉండే ప్రమాదకర రసాయనాలను పీల్చడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ, ఛాతి సంబంధ, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాలుష్య ప్రభావం కంటి చూపుపైన ఉంటుందంటున్నారు. సకాలంలో వైద్యం చేయించకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
మరి ఏం చేద్దాం
వాహనం కండీషన్ విషయంలో జాగ్రత్తలు పాటించడంతో కాలుష్యం తగ్గుముఖం పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. సకాలంలో గుర్తింపు కలిగిన షోరూంలలో వాహనం సర్వీసింగ్, నాణ్యత గల విడి పరికరాలు, కల్తీ లేని ఇంధనంతో కాలుష్యం తగ్గుతుందని అంటున్నారు. కాలుష్యం నియంత్రించే స్వభావం గల పచ్చని మొక్కలు పెంచడంతో సత్ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కాలుష్యం ఎంత పరిమాణంలో ఉందో తెలియజేసే బోర్డులు ఉంచాలని, వాహనాల కాలుష్యంతో అప్రమత్తం కావచ్చని చెబుతున్నారు. కాగా.. పాత వాహనాలతో కాలుష్య ముప్పు ఏర్పడుతోంది. కాలం చెల్లిన వాహనాలను స్వస్తి చెప్పాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు చేసింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే కాలం చెల్లిన వాహనాలు నిషేధించారు. పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలు వచ్చేలా చట్టం తీసుకురావడంతో కాలుష్యానికి అడ్డుకట్ట వేయవచ్చనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి.
పాత వాహనాలతో కాలుష్య ప్రభావం
వాహనాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలు కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్లతో కాలుష్యం వ్యాపిస్తోంది. వాహనాల తయారీ పరిజ్ఞానంతో బీఎస్ ప్రమాణాలు ముడిపడి ఉన్నాయి. అత్యాధునిక పరిజ్ఞానంతో బీఎస్–4 వాహనాలు మార్కెట్‌లో ఉన్నాయి. వాహనాలు సకాలంలో సర్వీసింగ్ చేయకపోవడం, కల్తీ ఇంధనం, సెకండ్ హ్యాండ్ విడి పరికరాల వినియోగంతో కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గతేడాది నుంచి బీఎస్–3 వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. – డాక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు, డీటీసీ
Comments
Please login to add a commentAdd a comment