లీటరు పెట్రోల్ ధర రూ.220
హైదరాబాద్ : తూనికలు, కొలతల శాఖ అధికారులు తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల యజమానులు నిన్న రాత్రి ఏడు గంటల నుంచి మెరుపు సమ్మెకు దిగారు. బంకులను మూసివేసి అమ్మకాలు నిలిపివేశారు. పెట్రోల్ పోసే పంపుల మోడల్ అప్రూవల్ విషయంలో చమురు కంపెనీలపై చర్యలు తీసుకోకుండా తమపై కేసులు బనాయించటం తగదని యజమానులు ఆందోళనకు దిగారు. దాంతో ముందస్తు సమాచారం లేకుండా పెట్రోల్ బంకులను మూసివేయటంతో వినియోగదారులు చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెట్రోల్, డీజిల్ కొట్టించుకునేందుకు బంకులకు వెళ్లిన వాహన యజమానులకు చుక్కెదురైంది. పెట్రోల్, డీజిల్ కోసం వేచి చూసినా బంకు యజమానులు స్పందించలేదు. తూనికలు, కొలతల శాఖ అధికారులు తమ సమస్యలను పరిష్కరించేవరకు బంకులు తెరిచేది లేదని బంకు యజమానులు చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో బంకులు మూతపడటంతో వినియోగదారులు ఇక్కట్ల ఎదుర్కొంటున్నారు.
కేవలం ప్రభుత్వ బంకులు మాత్రమే పెట్రోలు విక్రయిస్తుండటంతో రాత్రి నుంచి క్యూలైన్లలో నిల్చొని తీవ్ర ఇబ్బందులుపడుతున్నామని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సందట్లో సడేమియాలా బంక్ల బంద్తో ఆసరాగా తీసుకున్న ప్రయివేటు వ్యక్తులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో లీటరు పెట్రోల్ ధరను రూ.220కి అమ్ముతున్నారు. అవసరం కాబట్టి వాహనదారులు ఎంతకైనా వెచ్చించి కొనాల్సిన పరిస్థితి నెలకొంది.