రేపటి నుంచి రోజువారీ పెట్రోల్ ధరలు
బంద్‌పై వెనక్కు తగ్గిన పెట్రో డీలర్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం నుంచి రోజువారీగా సవరించనున్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన పెట్రో డీలర్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ధరలను ప్రతిరోజూ అర్ధరాత్రి కాకుండా ఉదయం ఆరు గంటలకు సవరించాలన్న తమ డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకోవడంతో బంద్ చేయకూడదని నిర్ణయించామని పెట్రో డీలర్లు చెప్పారు.
జూన్ 16 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ సవరించాలని గతంలో చమురు సంస్థలు నిర్ణయించగా, దీనిని వ్యతిరేకిస్తూ బంద్ చేస్తామని డీలర్లు గతంలో ప్రకటించారు. ఈ అంశంపై పెట్రో డీలర్లు బుధవారం పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రతో భేటీ అయ్యారు. ధరలను ఉదయం నుంచి మార్చేందుకు అవకాశం ఇవ్వాలని డీలర్లు కోరారు. మంత్రి ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. డీలర్లు బంద్‌ను ఉపసంహరించడంతో ముందుగా నిర్ణయించినట్లుగానే శుక్రవారం నుంచి ధరలను రోజువారీ సమీక్షిస్తామని ధర్మేంద్ర చెప్పారు.