Motorists
-
ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందే
సాక్షి, అమరావతి : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాల అమలులో పురోగతి కనిపిస్తోందని హైకోర్టు తెలిపింది. హెల్మెట్ ధరించని వాహనదారులకు పోలీసు లు చలాన్లు వేయడం ఆశ్నింనించదగ్గ పరిణామమని పేర్కొంది. ఈ విధానాన్ని, అవగాహన కార్యక్రమాలను కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. గత 20 రోజుల్లోనే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు వాహనదారుల నుంచి రూ.95 లక్షలు చలాన్ల రూపంలో వసూలు చేయడం పట్ల కూడా హైకోర్టు సంతృప్తిని వ్యక్తం చేసింది. చట్ట నిబంధనలను అత్రికమించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని తేల్చి చెప్పింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే దుష్ప్ర భావాలు, చట్టాన్ని ఉల్లంఘిస్తే తీసుకునే చర్యల గురించి పత్రికలు, టీవీల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. చలాన్లు చెల్లించని వారి వివరాలు వెంటనే రవాణా శాఖ అధికారులకు చేరేలా ఓ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చలాన్ల వసూలు, హెల్మెట్ ధారణ విషయంలో చేపడుతున్న చర్యలు, చలాన్ల వసూళ్లు పెరిగాయా లేదా తదితర వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచా రణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధనలు పాటించడం లేదంటూ కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయడం లేదని, ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడంలేదని, దీంతో పెద్ద సంఖ్యలో ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ని సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. తమ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కొంత మేర చర్యలు చేపట్టారని ధర్మాసనం తెలిపింది.అయినప్పటికీ ప్రతి 10 మందిలో ఇద్దరు ముగ్గురే హెల్మెట్ ధరిస్తున్నారంది. తన సిబ్బందిలో ఒకరిని రోడ్డుపైకి పంపి ఈ విషయాన్ని రూఢీ చేసుకున్నానని సీజే తెలిపారు. ఈ చర్యలు కొనసాగిస్తారా లేక ఆపేస్తారా అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. పిటిషనర్ తాండవ యోగేష్ జోక్యం చేసుకుంటూ.. విజయవాడలోనే తనిఖీలు చేస్తున్నారని, చాలా జిల్లాల్లో తనిఖీలు చేయడం లేదని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. చలాన్లు ఎలా వసూలు చేస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పటి వరకు భౌతికంగానే వసూలు చేస్తున్నామని, యూపీఐ ద్వారా కూడా వసూలు చేస్తామని ప్రణతి చెప్పారు. గత 20 రోజుల్లో చలాన్ల రూపంలో రూ.95 లక్షలు వసూలు చేశామన్నారు. గతంలో ఈ మొత్తం ఎంత ఉండేదని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ. 4 లక్షలు ఉండేదని చెప్పారు. కాగా వచ్చే విచారణలో చలాన్ల మొత్తం పెరిగిందా? తగ్గిందా? అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. చలాన్లు చెల్లించని వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని, చట్టం ఏం చెబుతోందని ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్ యోగేష్ చట్ట నిబంధనలను వివరించారు. నిర్ణీత కాల వ్యవధిలో చలాన్లు చెల్లించకుంటే అధికారులు సంబంధిత మేజి్రస్టేట్ ద్వారా ఆ వాహనాన్ని జప్తు చేయవచ్చన్నారు. -
రాష్ట్ర కోడ్ మార్చేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఒకే నంబర్‌తో రెండు, మూడు వాహనాలుంటే ఎలా ఉంటుంది? ఏదైనా నేరాలు, అక్రమాలకు పాల్పడే ఉద్దేశంతో కొంత మంది ఇలా చేస్తుంటారు. కానీ కొందరు వాహనదారుల అత్యుత్సాహం, అవగాహన లేమితో ఇప్పుడు భవిష్యత్తులో ఒకే నంబర్ రెండు వాహనాలకు కనిపించే పరిస్థితి ఎదురుకాబోతోంది. దీంతో ఒక వాహనానికి సంబంధించిన వారు ఏదైనా నేరం చేస్తే దానివల్ల అదే నంబర్ ఉన్న రెండో వాహన యజమాని ఇబ్బంది పడే అవకాశం ఉందని అధికారులంటున్నారు. ఇదీ సంగతి..: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్టేట్ కోడ్ ఏపీ నుంచి టీఎస్‌కు మారింది. దాదాపు పదేళ్లపాటు అదే కొనసాగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మార్చింది. టీఎస్‌కు బదులు టీజీని అమల్లోకి తెచ్చింది. అయితే పాత వాహనాలకు టీఎస్ కోడ్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కానీ కొందరు వాహనదారుల అత్యుత్సాహంతో ఇది సమస్యగా మారనుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ వాహనాలకు టీజీ కోడ్ ఉండాలని బలంగా కోరుకున్న కొందరు... ఇప్పుడు టీజీ కోడ్ అమల్లోకి రావడాన్ని స్వాగతిస్తూ తమ పాత వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ అక్షరాలను తొలగించి టీజీ అని పెట్టుకుంటున్నారు. సమస్య ఏమిటి? టీజీ కోడ్ కొత్తగా రావడంతో రవాణా శాఖ అధికారులు కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లను మళ్లీ ‘ఎ’ ఆల్ఫాబెట్ నుంచి కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ‘సి’ సిరీస్ కొనసాగుతోంది. రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో టీఎస్ కోడ్‌ను ప్రారంభించినప్పుడు ‘ఇ’ సిరీస్‌తో మొదలుపెట్టారు. ఇప్పుడు త్వరలోనే టీజీ కోడ్‌లో కూడా ‘ఇ’ సిరీస్ మొదలవుతుంది. దానికి 0001 నుంచి నంబరింగ్ మొదలవుతుంది. క్రమంగా గతంలో టీఎస్ కింద కేటాయించిన నంబరే ఇప్పుడు టీజీ సిరీస్‌లో కూడా అలాట్ అవుతుంది. స్టేట్ కోడ్ (టీఎస్, టీజీ) మాత్రమే తేడా ఉంటుంది. అయితే టీఎస్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనదారుడు సొంతంగా టీజీ ఏర్పాటు చేసుకుంటే... అధికారికంగా టీజీ కోడ్‌తో అదే నంబర్ ఉన్న వాహనంతో దాని నంబర్ క్లాష్ అవుతుంది. ఉదా: టీఎస్ ఎ 0001 నంబర్‌తో ఉన్న పాత వాహనదారుడు దాన్ని టీజీగా మారిస్తే.. ఇప్పుడు టీజీ ఏ 0001 అని ఏదైనా కొత్త వాహనానికి నంబర్ అలాట్ అయితే రెండు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు ఒకటిగా మారి సమస్య ఏర్పడుతుందన్నమాట. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు, నేరాలు జరిగినప్పుడు ఇలా నంబర్లు క్లాష్ అయితే కేసు దర్యాప్తులో చిక్కులు ఏర్పడతాయి. దీంతోపాటు అధికారికంగా సరైన నంబర్ కలిగి ఉన్న వాహనదారుడు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అలా మార్చడం నేరం టీజీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొందరు టీఎస్ కోడ్ వాహనదారులు వచ్చి తమ వాహనాలకు టీజీ కోడ్ అలాట్ చేయాలని కోరుతున్నారు. కానీ అది సాధ్యం కాదని... టీజీ సిరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్న వాహనాలకు మాత్రమే టీజీ కోడ్ వర్తిస్తుందని చెప్తున్నాం. ఎవరైనా సొంతంగా నంబర్ ప్లేట్‌పై స్టేట్ కోడ్ మారిస్తే దాన్ని ట్యాంపరింగ్గానే భావించి నేరంగా పరిగణించాల్సి ఉంటుంది. అలాంటి వారిపై చర్యలు కూడా ఉంటాయి. వాహనదారులు ఇది తెలుసుకోవాలి. – రమేశ్, జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ -
‘దారి’దోపిడీకి టీడీపీ కూటమి ముఖ్యనేత పన్నాగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ ‘దారి దోపిడీ’కి టీడీపీ కూటమి ముఖ్యనేత పన్నాగం పన్నారు. రాబోయే ఐదేళ్లలో ఏకంగా రూ. 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ గగ్గోలుపెట్టిన ఆయన అధికారంలోకి రాగానే రోడ్ల నిర్మాణం ముసుగులో అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. దోపిడీ కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) విధానాన్ని తెరపైకి తెచ్చారు. తొలుత 27 రాష్ట్ర ప్రధాన రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఆమోదించారు.తమ బినామీల నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టి.. రూ. 4 వేల కోట్లతో రోడ్లను నిర్మించి, ఆపై ఐదేళ్లలో రూ.12,500 కోట్లు టోల్ ఫీజుల వసూలు చేయనున్నారు. నికరంగా రూ. 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారు. రాష్ట్రంలో వాహనదారులపై భారీగా ఆర్థిక భారం మోపుతూ.. బినామీ కాంట్రాక్టర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు ముఖ్యనేత పన్నాగం ఇది.రోడ్ల నిర్మాణ బాధ్యత నుంచి తప్పుకున్న ప్రభుత్వంజాతీయ రహదారులను నిర్మించే కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇప్పటివరకు టోల్ ఫీజులను వసూలు చేస్తోంది. రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులను అన్ని రాష్ట్రాలు తమ ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నాయి. ఇప్పుడు ఈ విధానానికి టీడీపీ కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమేరకు నిర్ణయించారు. అందుకోసం రాష్ట్రంలోని 27 రహదారులను ఎంపిక చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలోనూ చంద్రబాబు ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. మొదటగా 14 రోడ్లను నిర్మిస్తామన్నారు. అనంతరం మిగిలిన రోడ్ల నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఆరోడ్లపై వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తామన్నారు. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని రహదారులను పీపీపీ విధానంలోనే నిర్మించాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ ఉద్దేశం. టోలుతో భారీ దోపిడీకి కుట్ర..పీపీపీ విధానంలో 1,778 కి.మీ. ఉన్న 27 రహదారులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నామమాత్రంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఆ రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులను ముఖ్య నేత బినామీ, సన్నిహిత సంస్థలకే కట్టబెడతారన్నది బహిరంగ రహస్యం. గతేడాది ఆర్ అండ్ బి శాఖ కి.మీ.కు గరిష్టంగా రూ. 2 కోట్లు చొప్పున టెండర్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆ రేట్ల ప్రకారం చూస్తే మొత్తం 1,778 కి.మీ.కు రూ. 3,556 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఏడాదిలో మెటీరియల్ ధరలు కాస్త పెరిగాయని భావించినా మొత్తం మీద రూ. 4 వేల కోట్లకు మించదు.జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) 2023–24లో వసూలు చేసిన టోల్ ఫీజుల నిష్పత్తిలో లెక్కిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న 1,778 కి.మీ. రోడ్ల నుంచి ఏడాదికి రూ. 2,500 కోట్ల వరకు టోల్ ఫీజుల రూపంలో వసూలు అవుతుంది. ఆ ప్రకారం ఐదేళ్లకు రూ. 12,500 కోట్లు టోల్ ఫీజుల రూపంలో వసూలు చేస్తారన్నది సుస్పష్టం. అంటే ముఖ్యనేత బినామీ సంస్థలు కేవలం రూ. 4 వేల కోట్లు వెచ్చించి.. ఐదేళ్ల పాటు టోల్ ద్వారా రూ. 12,500 కోట్లు వాహనదారుల నుంచి కొల్లగొట్టనున్నారు. నికరంగా ఐదేళ్లలో ముఖ్య నేత జేబులోకి రూ. 8,500 కోట్లు చేరనుంది. వాహనదారులపై భారీ ఆర్థికభారంపీపీపీ విధానంలో నిర్మించనున్న ఆ 27 రోడ్లపై ప్రయాణించే వాహనదారులపై భారీ ఆర్థికభారం పడనుంది. ఆ మార్గంలో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల నుంచి కూడా టోల్ ఫీజు వసూలు చేస్తారు. దాంతో ఆర్టీసీ చార్జీలు కూడా పెంచుతారు. వాహనదారులు ఆ విధంగా ఐదేళ్లలో ఏకంగా రూ.12,500 కోట్లు భరించాల్సి ఉంటుంది. అదే ఆ 27 రోడ్లను ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే ప్రజలపై టోల్ ఫీజుల భారం పడదు. నాబార్డ్ తదితర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రోడ్లు నిర్మించవచ్చు. ప్రభుత్వం దశలవారీగా బ్యాంకు రుణాలను తీర్చవచ్చు. అలా చేస్తే ముఖ్యనేతకు ఏం ప్రయోజనం..? పీపీపీ విధానంలో తమ బినామీ కాంట్రాక్టు సంస్థల ద్వారా రోడ్లను నిర్మిస్తేనే కదా ఆయన జేబులు నిండేది.పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించిన రోడ్లు1) కళింగపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా పార్వతీపురం2) గార నుంచి ఆమదాలవలస మీదుగా బత్తిలి3) చిలకపాలెం నుంచి రాజాం మీదుగా అంతర్రాష్ట్ర రాయగడ రోడ్4) భీమునిపట్నం నుంచి చోడవరం మీదుగా తుని 5) విశాఖపట్నం నుంచి ఎస్.కోట మీదుగా అరకు 6) కాకినాడ – జొన్నాడ7) రాజమహేంద్రవరం నుంచి మారేడుమిల్లి మీదుగా భద్రాచలం8) అమలాపురం – బొబ్బర్లంక 9) రాజవరం – పొదలాడ10) ఏలూరు – కైకలూరు11) ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా మేడిశెట్టివారిపాలెం12) భీమవరం నుంచి కైకలూరు మీదుగా గుడివాడ13) గుడివాడ – కంకిపాడు (విజయవాడ)14) విజయవాడ నుంచి ఆగిరిపల్లి మీదుగా నూజివీడు15) గుంటూరు – పర్చూరు, 16) నరసరావుపేట – సత్తెనపల్లి17) వాడరేవు నుంచి నరసరావుపేట మీదుగా పిడుగురాళ్ల రోడ్18) కావలి నుంచి ఉదయగిరి మీదుగా సీతారాంపురం రోడ్19) నెల్లూరు – సైదాపురం రోడ్20) గూడూరు నుంచి రాపూరు మీదుగా రాజంపేట రోడ్21) మైదుకూరు – తాటిచెర్ల రోడ్22) పులివెందుల నుంచి ధర్మవరం మీదుగా దమజిపల్లి రోడ్23) చాగలమర్రి నుంచి వేంపల్లి మీదుగా రాయచోటి రోడ్ 24) అనంతపురం నగరంలో రింగ్ రోడ్25) సోమందేపల్లి నుంచి హిందూపూర్ బైపాస్ మీదుగా తుమకుంట 26) అనంతపురం – చెన్నై రహదారిలో కదిరి రింగ్ రోడ్27) కాలవగుంట – పెనుమూరు నెండ్రగుంట రోడ్ -
అవగాహన లేమితోనే రోడ్డు ప్రమాదాలు
సాక్షి, హైదరాబాద్: వాహనదారుల్లో అవగాహన లేమితోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగు తున్నాయని, అవగాహన పెంచే కార్యక్రమా లపై అధికారులు దృష్టి పెట్టాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యువత చనిపోతున్నందున ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ, రోడ్ ఇంజనీరింగ్ వ్యూహాలతో రోడ్డు ప్రమాదాలను నియంత్రించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. జనవరి 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు రోడ్డు భద్రత మాసంగా కేంద్ర రోడ్డు రవా ణా, జాతీయ రహదారుల శాఖ ప్రకటించిన నేపథ్యంలో రోడ్డు భద్రత మాసం నిర్వహణపై రవిగుప్తా మంగళవారం డీజీపీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు ఇచ్చారు. ఈ కాన్ఫరెన్స్‌లో రవాణాశాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్, రోడ్డు భద్రత, రైల్వేల విభాగపు అడిష నల్ డీజీపీ మహేష్‌భగవత్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఐజీ రంగనాథ్, రోడ్ సేఫ్టీ ఎస్పీ సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లా డుతూ 2022లో తెలంగాణలో 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా, దేశవ్యాప్తంగా 1,68,000 మంది మృత్యువాత పడినట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లా డుతూ డ్రైవింగ్ చేయడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా యన్నారు. ఈ ఉల్లంఘనలపై పోలీస్ ఉన్నతాధి కారులు దృష్టి పెట్టాలని సూచించారు. రహదా రులు ఉండే ప్రాంతాల్లో రోడ్ సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని, పోలీస్ కార్యాలయంలో డిస్ట్రిక్ రోడ్ సేఫ్టీ బ్యూరో, కమిషనరేట్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అవస రమైతే ఈ–చలాన్ నిధుల ద్వారా స్పీడ్ గన్స్ బ్రీత్ అనలైజర్స్ కొనుగోలు చేసే అవకాశాలను పరిశీ లించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడే వారికి ‘గుడ్ సమారిటన్’ పేరిట సన్మా నం చేయాలని డీజీపీ అన్నారు. ఈ చర్యలు ఈ నెలకే పరిమితం కాకుండా దీర్ఘకాలంలోనూ అనుసరించాలని పోలీసు అధికారులకు డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. -
విజయవాడలో రేపు ట్రాఫిక్ మళ్లింపు
విజయవాడ స్పోర్ట్స్: సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 19వ తేదీన విజయవాడ నగర పరిసరాల్లో వాహనాల రాకపోకలు దారి మళ్లిస్తున్నట్టు ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) కె.చక్రవర్తి తెలిపారు. వాహన చోదకుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు బుధవారం వెల్లడించారు. 19న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద 1.35 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో బెంజి సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు బందరు రోడ్డుపై, ఐదో నెంబర్ రూట్‌పై, ఏలూరు రోడ్డు సీతారామపురం జంక్షన్ నుంచి రెడ్ సర్కిల్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి వాటర్ ట్యాంక్ రోడ్డు వరకు అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, ఇతర వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. -
పొద్దుపొద్దునే ప్రయాణాలొద్దు!
సాక్షి, హైదరాబాద్: ఈ చలికాలంలో పొగ మంచు ముప్పు పొంచి ఉంటోంది. దట్టమైన పొగమంచు ఎదుటి వాహనాలను కానరాకుండా చేసి వాహనదారులను కాటికి పంపుతోంది. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము సమయంలో పొగ మంచు తీవ్రంగా కురియడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. దాంతో వీలైనంత వరకు తెల్లవారుజాము నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమమని రోడ్డు భద్రత నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వస్తే.. తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు, జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు. పొగ మంచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు ♦ ఈనెల 5న(శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుద్బుల్లాపూర్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు కుతాడి కుమార్, ప్రదీప్ బైక్‌పై వస్తుండగా పాపయ్యగూడ చౌరస్తా వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మృతి చెందారు. పొగమంచు కారణంగా రోడ్డు మసకబారడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ♦ 25 డిసెంబర్, 2023న నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు వద్ద రాత్రి 10 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 ఏండ్ల యువకుడు రమావత్ శివనాయక్ ద్విచక్రవాహనంతో 55 ఏండ్ల బల్లూరి సైదులు అనే వ్యక్తిని ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న మృతుడు శివ నాయక్ బంధువులు టాటాఏస్ వాహనంలో ప్ర మాద ఘటన స్థలానికి బయలుదేరారు. తెల్లవా రుజామున 3 గంటల సమయంలో వారు ప్ర యాణిస్తున్న టాటాఏస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ నిడమనూరు మండలం 3వ నంబర్ కెనాల్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. దట్టమైన పొగమంచు కారణంగానే ఈ వరుస ప్ర మాదాలు జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ♦ డిసెంబర్ 31న తెల్లవారుజామున జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు, డీసీఎం ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ చనిపోగా, ఆర్టీసీ బస్ డ్రైవర్‌తోపాటు ఆ బస్సులోని మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచుతో రోడ్డు సరిగా కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ♦ డిసెంబర్ 25న హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరి ఔటింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న మిత్రుల బృందం కారు పొగమంచు కారణంగా రోడ్డు పక్కన ఉన్న శివారెడ్డిపేట్ చెరువులోకి దూ సుకెళ్లింది. కారులో ఉన్న ఒకరు గల్లంతు కాగా, మిగిలిన నలుగురిని స్థానికులు కాపాడారు. ప్రయాణం తప్పనిసరైతే ఇవి మరవొద్దు ♦ పొగమంచు కురుస్తున్నప్పుడు మీకు కేటాయించిన లేన్‌లోనే వాహనం నడపాలి. వీలైనంత వరకు ఓవర్టేక్ చేయకపోవడమే ఉత్తమం. ♦ సింగిల్ రోడ్డులో వాహనం నడపాల్సి వస్తే.. వీలైనంత వరకు మీ వాహనం ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. ♦ డ్రైవింగ్ సమయంలో ఏ సంశయం ఉన్నా..రోడ్డు పూర్తిగా కనిపించకపోయినా మీ వాహనాన్ని రోడ్డు పక్కకు నిలపడమే ఉత్తమం. మీరు వాహనాన్ని పార్క్ చేసినట్టుగా సూచిస్తూ పార్కింగ్ లైట్లు వేయాలి. ♦ పొగమంచు వాతావరణం ఉన్నప్పుడు వాహన వేగాన్ని వీలైనంత వరకు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎదుటి వాహనం కనిపించని పరిస్థితుల్లో వేగంగా వెళితే వాహనాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అదేవిధంగా ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ♦ పొగమంచు కురుస్తున్నప్పడు డ్రైవర్లు సాధారణంగా హైబీంలో లైట్లు పెడతారు. ఇలా చేయడం వల్ల రిప్లెక్షన్ వల్ల డ్రైవర్‌కు సరిగా కనిపించదు. విజిబిలిటి 100 మీటర్లలోపు ఉన్నట్లయితే హెడ్లైట్లు లోబీంలో ఉంచాలి. మీ వాహనానికి ఫాగ్ ల్యాంప్‌లు ఉంటే వాటిని తప్పక ఆన్ చేయాలి. ఎదుటి వాహనదారుడిని అప్రమత్తం చేసేలా మీ వాహనానికి ఇండికేటర్లు వేసు కుని వెళ్లడం ఉత్తమం. మీ వాహన అద్దాలు వీలైనంత వరకు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మీ కారులోని డీఫాగర్‌ను ఆన్ చేసుకోవాలి. ♦ వీలైనంత వరకు ఎదురుగా ఉన్న రోడ్డు స్పష్టంగా కనిపించేలా అవసరం మేరకు డ్రైవింగ్ సీట్‌ను సర్దుబాటు చేసుకోవాలి. ♦ పొగమంచు ఉన్నప్పుడు వాహనం ఒక్క క్షణం అదుపు తప్పి పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రైవింగ్‌పైనే దృష్టి పెట్టాలి. నిద్రమత్తు లేకుండా జాగ్రత్త పడాలి. ♦ వాహనం పూర్తి కండీషన్లో ఉండేలా చూసుకోవాలి. టైర్లు, బ్రేక్‌లు ముందుగానే చెక్ చేసుకోవాలి. మీ కారులోని హీటర్ ఆన్ చేయాలి. దీనివల్ల బయటి పొగమంచుతో అద్దంపై ప్రభావం లేకుండా ఉంటుంది. ♦ లేన్ మారుతున్నప్పుడు, మూల మలుపుల వద్ద తప్పకుండా హారన్ మోగించాలి. ♦ మొబైల్ ఫోన్ వాడడం, రేడియోలో ఎఫ్ఎం వినడం, పాటలు వింటూ డ్రైవింగ్ చేయవద్దు. -
పెట్రోల్ బంక్‌ల ముందు భారీ క్యూలైన్లు.. రెండో రోజు కొనసాగుతున్న రద్దీ
సాక్షి, హైదరాబాద్: రెండో రోజు కూడా ప్రెటోల్ బంక్‌ల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒకసారిగా వాహనదారులు బంకుల వద్దకు చేరుకోవడంతో బంకులో పెట్రోల్ నిల్వలు అయిపోయాయి. రాత్రి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు చేరుకోవడంతో యథావిధిగా బంకుల వద్ద పెట్రోల్ సరఫరా కొనసాగుతుంది. హైదరాబాద్ పలు పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని ముందు జాగ్రత్త చర్యగా బుధవారం తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు చేరుకుంటున్నారు. బంక్‌లు ఇంకా ఓపెన్ కాకముందే వాహనాలను వరుసగా కిలోమీటర్ల మేర లైన్లలో ఉంచారు. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. సోమవారం( జనవరి 1) నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు మూసివేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు హైదరాబాద్‌లో వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లతో బారులు తీరడం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లకు దారి తీసింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: అశ్వమెక్కి.. ఆర్డర్ అందించి -
హైవే పెట్రోలింగ్‌పై అవగాహన లేక ప్రాణాలు పోతున్నాయ్!
గత శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు రాజధాని ఏసీ బస్సు బయలు దేరింది. రాత్రి 2.20కి నార్కెట్ పల్లి సమీపంలోని ఏపీ లింగోటం వద్ద ఫ్లైఓవర్ పైకి చేరింది. అంతకు 40 నిమిషాల ముందు ఆ వంతెన దిగే సమయంలో ఓ లారీ ఇంజిన్ ఫెయిల్ అయి సెంట్రల్ మీడియన్ పక్కన నిలిచిపోయింది. ఎలక్ట్రికల్ సిస్టం పనిచేయకపోవటంతో లారీ వెనక రెడ్, బ్లింకర్ లైట్లు వెలగలేదు.. డ్రైవర్ దిగిపోయి విషయాన్ని యాజమానికి చెప్పి పక్కన కూర్చుండిపోయాడు.. ఆ సమయంలో వంతెనపై లైట్లు కూడా వెలగటం లేదు. 80 కి.మీ.వేగంతో వచ్చిన రాజధాని బస్సు ఆ లారీని బలంగా ఢీకొంది. బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా, 8 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై వాహనదారులకు అవగాహన లేకపోవటంతో భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దానికి ఈ బస్సు ప్రమాదమే తాజా ఉదాహరణ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను విస్తరిస్తుండటంతో రోడ్లు విశాలంగా మారుతున్నాయి. ఊళ్లుండే చోట ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా వంతెనలు నిర్మిస్తున్నారు.. పట్టణాలుంటే బైపాస్ రూట్లు ఏర్పాటు చేస్తున్నారు.. దీంతో వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఏదైనా పెద్ద వాహనం హైవే మీద చెడిపోయి నిలిచిపోయిన సందర్భాల్లో మాత్రం పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళ, మలుపుల వద్ద వాహనాలు నిలిచిపోయి ఉంటే, వెనక వచ్చే వాహనాలు వాటిని ఢీకొంటున్నాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు హైవే పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినా, దానిపై అవగాహన లేకపోవటమే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. జాతీయ రహదారి హెల్ప్‌లైన్ నెంబరుకు ఫోన్ చేసి ఉంటే, సిబ్బంది వచ్చి లారీని తొలగించి ఉండేవారు. కనీసం, అక్కడ లారీ నిలిచిపోయి ఉందని తెలిసే ఏర్పాటయినా చేసి ఉండేవారు. అదే జరిగితే ఈ ప్రమాదం తప్పి ఉండేది. ఏంటా హెల్ప్‌లైన్ వ్యవస్థ? 1033.. ఇది జాతీయ రహదారులపై కేంద్రం కేటాయించిన హెల్ప్‌లైన్ నెంబర్. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదం జరిగినా, ఏదైనా భారీ వాహనం నిలిచిపోయినా.. ఈ నెంబరుకు ఫోన్ చేసి సహాయాన్ని పొందొచ్చు. కానీ, దీనిపై ప్రజల్లో అవగాహనే లేకుండా పోయింది. ఏం సాయం అందుతుందంటే.. ప్రతి 50–60 కి.మీ.కు ఓ సహాయక బృందం అందుబాటులో ఉంటుంది. స్థానిక టోల్ బూత్ కు అనుబంధంగా ఇది వ్యవహరిస్తుంది. ఈ బృందంలో మూడు వాహనాలుంటాయి. అంబులె న్సు, పెట్రోలింగ్ వాహనం, క్రేన్ ఉండే టోయింగ్ వెహికిల్. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయగానే ఘటనా స్థలికి హైవే అంబులెన్సు, పెట్రోలింగ్ వాహనాలు చేరుకుంటాయి. గ్రాయపడ్డవారికి ప్రాథమిక చికిత్స అందించి, అంబులెన్సులో స్థానిక ఆసుపత్రికి వెంటనే తరలిస్తారు. ఆసుపత్రికి వెళ్లేలోపు కావాల్సిన సాధారణ వైద్యాన్ని అందించే ఏర్పాటు అంబులెన్సులో ఉంటుంది. ప్రమాద స్థలిలో వాహనాల చుట్టూ బారికేడింగ్ చేస్తారు. ఏదైనా భారీ వాహనం ఫెయిలై రోడ్డుమీద ఆగిపోతే టోయింగ్ వాహనాన్ని తెచ్చి వెంటనే ఆ వాహనాన్ని రోడ్డు పక్కకు తరలిస్తారు. దీనివల్ల వేరే వాహనాలు ఆ చెడిపోయిన వాహనాన్ని ఢీకొనే ప్రమాదం తప్పుతుంది. హెల్ప్‌లైన్ ఎలా పనిచేస్తుంది..: అవసరమైన వారు 1033 హెల్ప్‌లైన్‌కు (ఉచితం) ఫోన్ చేయాలి. ఢిల్లీలో ఉండే సెంటర్ సిబ్బంది వెంటనే స్పందిస్తారు. అవసరమైన భాషల్లో మాట్లాడే సిబ్బంది అక్కడ అందుబాటులో ఉంటారు. ఆ వెంటనే ఫిర్యాదు దారు మొబైల్ ఫోన్‌కు ఓ లింక్ అందుతుంది. దానిపై క్లిక్ చేయగానే, అక్షాంశరేఖాంశాలతో సహా లొకేషన్ వివరాలు ఢిల్లీ కేంద్రానికి అందుతాయి. వాటి ఆధారంగా ఆ ప్రాంతానికి చెందిన సిబ్బందిని వారు వెంటనే అప్రమత్తం చేస్తారు. ఇవన్నీ నిమిషాల వ్యవధిలో జరుగుతాయి. సమాచారం అందిన వెంటనే అవసరమైన సిబ్బంది ఘటనా స్థలికి బయలుదేరి సహాయ చర్యల్లో పాల్గొంటారు. అవగాహనే లేదు.. జాతీయ రహదారులపై నిర్ధారిత ప్రాంతాల్లో ఈ హెల్ప్‌లైన్ నెంబరును జనం గుర్తించేలా పెద్ద అంకెలను రాసిన బోర్డులను ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతావారోత్సవాలప్పుడు రవాణాశాఖ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ ఎక్కువ మందిలో దానిపై అవగాహనే లేకుండా పోయింది. జాతీయ రహదారులపై ఏదైనా అవసరం ఏర్పడితే 1033కి ఫోన్ చేయాలన్న సమాచారం ప్రజల్లో ఉండటం లేదు. ఎక్కు వ మంది పోలీసు ఎమర్జెన్సీ (100)కే ఫోన్ చేస్తు న్నారు. 1033కి ఫోన్ చేస్తే, సమాచారం స్థానిక హైవే పెట్రోలింగ్ సిబ్బందితోపాటు లోకల్ పోలీసు స్టేషన్‌కు కూడా చేరుతుంది. మొక్కుబడి అవగాహన కార్యక్రమాలు కాకుండా, జనానికి బోధపడేలా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. -
తిరుమల ఘాట్ రోడ్లో జాగ్రత్త..! వాహనదారులకు కీలక సూచనలు..
వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి అధిక మొత్తంలో వాహనాలు వస్తున్నాయి. రెండవ ఘాట్ రోడ్డు ద్వారా పది వేల వాహనాలు, మొదటి ఘాట్ రోడ్డులో ఎనిమిది వేల వాహనాలు వస్తున్నాయి. ఘాట్ రోడ్డుపై అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే తిరుమలకు రావాలని తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య సూచించారు. ఫిట్నెస్ ఉండే వాహనాలను మాత్రమే ఘాట్ రోడ్డులో ఉపయోగించాలని ఎస్పీ మునిరామయ్య కోరారు. అవగాహన లేని డ్రైవర్లు ఘాట్ రోడ్లో ముందు వెళ్లే వాహనాలను అధికమించే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఘాట్ రోడ్లో వాహనాలు పక్కన పెట్టి సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయొద్దని కోరారు. దివ్య రామం వద్ద వాహనాలను ఆపి ఉండడం చేత ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. తిరుమలలో టైం లిమిటేషన్ కూడా తిరిగి పునరుద్ధరిస్తున్నామని ఎస్పీ మునిరామయ్య చెప్పారు. రెండవ ఘాట్ రోడ్డులో 28 నిమిషాలు, మొదటి ఘాట్ రోడ్డులో 48 నిమిషాలు నియమించామని తెలిపారు. మొదటి ఘాట్ రోడ్డులో ఒకటో కిలోమీటరు వద్ద వాహనాలు ఆపుతున్నారని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్పెషల్ టీంగా ఏర్పడి బ్లాక్ స్పాట్స్ వద్ద వాహనాల డ్రైవర్లకు, భక్తులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అలిపిరి వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలను ఘాట్ రోడ్డులో నిషేధించడంపై ప్రతిపాదన పంపాం కానీ ఇంకా వాటిపై ఎలాంటి నిర్ణయం రాలేదని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డులో నిబంధనలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇదీ చదవండి: తిరుపతి: టపాసుల నిల్వ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి -
15 రోజులు.. 1.88కోట్లు.. 30 వేల కేసులు!
సాక్షి, చెన్నై: అమల్లోకి వచ్చిన కొత్త చట్టం మేరకు చెన్నైలో 15 రోజుల్లో రూ.1.88 కోట్లను జరిమానా విధించి, వసూలు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు 30 వేల కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వివరాలు.. చెన్నై నగరంలో ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేసిన విషయం తెలిసిందే. గత నెల ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపేవారు, ట్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు, సిగ్నల్స్‌లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్రకారు, రాత్రుల్లో మద్యం తాగి వాహనం నడిపే వారి భరతం పట్టే విధంగా పోలీసులు దూసుకెళ్లారు. హెల్మెట్ ధరించకుంటే, రూ. 1000, ఇన్సూరె న్స్ లేని వాహనాలకు రూ. 2 వేలు అంటూ భారీ జరిమానాలు విధించారు. దీంతో గత పక్షం రోజుల్లోనే చెన్నైలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి 30,699 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి జరిమానా రూపంలో రూ. 1.88 కోట్లు వసూలు చేశారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అతివేVýæం ప్రమాదకరమని, కుటుంబాన్ని గుర్తెరిగి వాహ నాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. చదవండి: Bear Attack Video: రెచ్చిపోయిన ఎలుగుబంటి.. బైక్‌పై వెళ్తున్న వారిపై దాడిచేసి.. -
వాహనాదారులకు బిగ్ షాక్.. అమల్లోకి కొత్త యాక్ట్!
సాక్షి, చెన్నై: కొత్త మోటారు వెహికల్ యాక్ట్ అమల్లోకి రావడంతో ట్రాఫిక్ పోలీసులు బుధవారం నుంచి కొరడా ఝులిపించారు. కొన్ని చోట్ల జరిమానాల మోత మోగించగా, మరికొన్ని చోట్ల వాహన చోదకులకు అవగాహన కల్పించి, హెచ్చరించి పంపివేశారు. రాజధాని నగరం చెన్నై తో పాటుగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి భరతం పట్టేలా కొత్త మోటారు వెహికల్ యాక్ట్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపేవారు, ట్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు, సిగ్నల్స్‌లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్ర కారుకు ఇకపై భారీ జరిమానా విధించనున్నారు. అలాగే, రాత్రుల్లో మద్యం తాగి వాహనాలు నడిపే వారి మత్తు దిగేలా కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులే కాదు, లా అండ్ ఆర్డర్ విభాగంలోని ఎస్ఐ ఆపైస్థాయి అధికారులు సైతం బుధవారం నుంచి వాహన తనిఖీలపై దృష్టి పెట్టారు. పలు చోట్ల నిబంధనలు అతి క్రమించిన వారికి జరిమానాలు విధించారు. చదవండి: హనీట్రాప్: ఆమె ఎవరో తెలియదు.. కానీ, అంతా ఆమె వల్లే జరిగింది! -
హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షం.. ఫొటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం కూడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, మాదాపూర్, అమీర్‌పేట, బషీర్ బాగ్, అబిడ్స్, లకిడికాపుల్, నాంపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అల్వాల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వాన పడింది. హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అన్నారు. it's Raining 🌧 @Hyderabadrains #rains #HyderabadRains pic.twitter.com/opYupmA8e9 — Muhammed Dastagir (@Dastagir_Hyd) September 27, 2022 Durgam Cheruvu wants all of this water but the drains were never built only 👍🏾 Madhapur is a disaster every rain with our without city wines#HyderabadRains pic.twitter.com/qKrQwRxqF5 — Donita Jose (@DonitaJose) September 27, 2022 @KTRTRS hyderabad capital city #HyderabadRains #ghmc pic.twitter.com/uqW9MM0JU3 — BalaramRajdoot (@BRd175) September 27, 2022 Rain @hyd mind space#HyderabadRains pic.twitter.com/F5VNSbzf9p — sridhar reddy (@reshusri) September 27, 2022 Rains 🙈😓😓😓#HyderabadRains pic.twitter.com/PMqUrUlUj3 — Hemangi Gala🇮🇳 (@hemangigala) September 27, 2022 #HyderabadRains #Hyderabad #whether #rains pic.twitter.com/wZs3XRZoVs — Satish Shukla🇮🇳 (@Satish_shukla99) September 27, 2022 -
కస్టమర్ల కోసం ఎస్బీఐ సరికొత్త సేవ.. ఒక్క మెసేజ్ పెడితే చాలు..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) మరో సేవను తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక మెసేజ్‌తో ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునే సర్వీసును లాంచ్ చేసింది. దీని ద్వారా ఎస్బీఐ కస్టమర్లు ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్‌ను సెకన్లలో తెలుసుకోగలుగుతారు. అందులో.. ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించే ఎస్బీఐ కస్టమర్లు వారి రిజిస్టర్ అయిన నంబర్ నుంచి 7208820019కి ఎస్ఎంఎస్ (SMS) పంపడం ద్వారా వారి ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చని తెలిపింది. అయితే దీని కోసం ఎస్బీఐ కస్టమర్లు తమ మొబైల్ నెంబర్‌ను బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకుని ఉండాలి. టోల్ గేట్ల వద్ద వాహనదారుల సమయం వృథా కాకుండా.. వారి సేవింగ్స్ అకౌంట్ల నుంచే నేరుగా నగదు కట్టేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ సర్వీసులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా చేస్తే చాలు సెకనులో.. మీ వాహనంలో ఇన్స్టాల్ చేసిన ఫాస్టాగ్ బ్యాలెన్స్ వివరాలు.., మీరు FTBAL అని వ్రాసి 7208820019 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. అదే సమయంలో, మీకు చాలా వాహనాలు ఉంటే అప్పుడు మీరు FTBAL అని వ్రాసి 7208820019కి పంపాలి. Dear SBI FASTag Customer, send an SMS to 7208820019 from your registered mobile number to quickly know your SBI FASTag balance. #SBIFastag #SBI #AmritMahotsav pic.twitter.com/mDQQgDl7Mv — State Bank of India (@TheOfficialSBI) September 10, 2022 చదవండి: టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్! -
ఓ మై గాడ్, మళ్లీ పెరగనున్న ధరలు!
గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారితో పోరాడి, లాక్డౌన్లో ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇప్పుడిప్పుడు వాటి నుంచి బయటపడుతున్నారు. అయితే దేశంలో పెట్రోలు, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు భారం కావడంతో ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఈ తరుణంలో కార్ల ధరలు కూడా పెరుగుతున్నాయన్న వార్త వాహనదారులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే.. పండుగ సీజన్ లోపు మరోసారి వాహనాలు ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రూపాయి మారక విలువ బలహీనపడడం, పెరిగిన రవాణా వ్యయం, ఇక గతంలో కోల్పోయిన మార్జిన్లను తిరిగి పొందాలన్న ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి. వీటితో పాటు టైర్లు,ఇతర ఆటో పరికరాల ధరలను కూడా పెంచేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ రేట్లు పెరిగే అవకాశం ఉందని, దీని వల్ల వాహన ధరలు మరింత పైకి కదిలే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వీటన్నింటిని పరిశీలిస్తే పండుగ సీజన్ కంటే ముందే రేట్ల పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. చదవండి: Tata Power Group Q1 Results: టాటా పవర్ ఫలితాలు: డబుల్ ధమాకా! -
Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లో వెళ్లకపోవడం బెటర్!
సాక్షి,సనత్‌నగర్: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. మంగళవారం (అమ్మవారి కల్యాణం), బుధవారం (రథోత్సవం) సందర్భంగా ఆయా రోజుల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకుని ప్రయాణించాలని ఆయన కోరారు. ► గ్రీన్‌ల్యాండ్స్, దుర్గామాత టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహ నాలు ఎస్ఆర్నగర్ ‘టీ’ జంక్షన్ వద్ద మళ్లి ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ ఎక్స్‌రోడ్డు, శ్రీరామ్‌నగర్ ఎక్స్‌రోడ్డు, సనత్‌నగర్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ► ఫతేనగర్ వైపు నుంచి బల్కంపేట వైపు వచ్చే వాహనాలు బల్కంపేట ప్రధాన రహదారి గుండా అనుమతించరు. వాహనదారులు బల్కంపేట–బేగంపేట లింక్‌రోడ్డులోకి మళ్లించి కట్టమైసమ్మ టెంపుల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► గ్రీన్‌ల్యాండ్స్ బకుల్ అపార్ట్మెంట్స్, ఫుడ్‌వరల్డ్ వైపు నుంచి వచ్చే వాహనాలను బల్కంపేట వైపు అనుమతించరు. వాహనదారులు ఫుడ్‌వరల్డ్ ఎక్స్‌రోడ్డు వద్ద మళ్లి సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రివనం, ఎస్ఆర్నగర్ ‘టీ’జంక్షన్ వైపు వెళ్లాల్సి ఉంటంది. ► ఎస్ఆర్నగర్ ‘టీ’జంక్షన్ నుంచి ఫతేగర్ వైపు వెళ్లే బై–లేన్స్, లింక్‌రోడ్లను మూసివేయడం జరిగిందని, వాహనదారులు గమనించి ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలన్నారు. పార్కింగ్ ఏరియాలు ఇవే.. ఎల్లమ్మ కల్యాణం వీక్షించేందుకు వచ్చే వారి వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆర్ అండ్ బీ కార్యాలయం, అమీర్‌పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్, నేచర్‌క్యూర్ హాస్పిటల్ రోడ్డు వైపు పార్కింగ్ ప్రాంతం, పద్మశ్రీ, ఫతేనగర్ ఆర్యూబీ ప్రాంతాల్లో భక్తులు పార్కింగ్ చేసుకోవచ్చని జాయింట్ కమిషనర్ తెలిపారు. చదవండి: JEE Mains 2022 Answer Key: ఆన్సర్ చేసినా ఆనవాలే లేదట.. జేఈఈ అభ్యర్థులకు చేదు అనుభవం -
హైదరాబాద్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి
బంజారాహిల్స్‌కు చెందిన ఓ వాహనదారు అబిడ్స్ వెళ్లడానికి బయలుదేరారు. లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద హఠాత్తుగా నిరసనకారులు రోడ్డు దిగ్బధించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం ఆయనకు నిరంకారి దాటే వరకు తెలియలేదు. దీంతో ప్రత్యామ్నాయం ఎంచుకోలేక ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు సాక్షి, హైదరాబాద్: నగరంలో అనేక మంది వాహనచోదకుల పరిస్థితి ఇలాగే ఉంటోంది. ప్రధానంగా పీక్ అవర్స్‌లో కార్యాలయాలకు వెళ్లడానికి, అత్యవసరమైన పనులపై బయటకు వస్తున్న వాళ్లు హఠాత్తుగా తలెత్తే అవాంతరాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఇలాంటి హఠాత్పరిణామాలపై వాహన చోదకులను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ఆ మళ్లింపులపై భారీ కసరత్తు... నగరంలో రహదారి, డ్రైనేజీ, ఫ్లైఓవర్.. ఇలా ఏదో ఒక నిర్మాణం, మరమ్మతులు జరుగుతూనే ఉంటాయి. ఆయా సందర్భాల్లో ఆ దారిలో వెళ్లాల్సిన వాహనాలను నిర్ణీత కాలం వరకు మళ్లిస్తుంటారు. దీనికోసం ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు చేసి ప్రత్యామ్నాయ మార్గాలు గుర్తించడంతో పాటు అవసరమైతే మరమ్మతులు చేయిస్తారు. ఈ మళ్లింపులపై మీడియా, సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడంతో పాటు ఆయా మార్గాల్లో ఫెక్సీలు సైతం ఏర్పాటు చేస్తారు. వాహనచోదకులు అడ్డంకులు ఉన్న మార్గంలో వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోకూడదన్నదే వీటి వెనుక ఉన్న ఉద్దేశం. హఠాత్తుగా వస్తే ఆగిపోవాల్సిందే... నగరం రాష్ట్ర రాజధాని కూడా కావడంతో అనేక శాఖలు, సంస్థల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. ఎక్కడి వాళ్లు నిరసనలు తెలపాలన్నా తమ ‘గొంతు అందరికీ వినిపించాలనే’ ఉద్దేశంతో దానికి ఇక్కడి కార్యాలయాలు, ప్రాంతాలనే ఎంచుకుంటారు. నిరసనల్లో కొన్ని అనుమతులు తీసుకుని జరిగితే, మరికొన్ని హఠాత్తుగా తెరపైకి వస్తాయి. మొదటి కేటగిరీకి చెందిన వాటితో ఇబ్బంది లేకున్నా రెండో రకమైన వాటి వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు వస్తుంటాయి. భారీ ప్రమాదం లాంటివి జరిగినా పరిస్థితి ఇలానే ఉంటుంది. చదవండి: కలెక్టర్ అవుదామని కలలు కని.. రియల్ ఎస్టేట్‌ను నమ్ముకుని.. సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో.. ఈ తరహా ట్రాఫిక్ జామ్స్‌పై ఆయా మార్గాల్లో వచ్చే వాహనచోదకులను నిర్ణీత ప్రాంతాలకు చేరుకోవడానికి ముందే అప్రమత్తం చేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. దీనికోసం సెల్‌ఫోన్ సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ల సహాయం తీసుకోవాలని యోచిస్తున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న, ఆయా మార్గాల్లో ప్రయాణిస్తున్న వాహనచోదకుల ఫోన్ నెంబర్ల డేటా సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ఉంటుంది. ఈ సర్వీస్ ప్రొవైడర్లు ఓ ప్రాంతం పిన్‌కోడ్ నెంబర్ ఆధారంగా అక్కడ రిజిస్టర్ అయి ఉన్న, యాక్టివేషన్లో ఉన్న ఫోన్ నంబర్లను గుర్తించగలుగుతారు. దీని ఆధారంగా ఆ ప్రాంతంలో సెల్ఫోన్లను గుర్తిచడం ద్వారా వారికి ట్రాఫిక్ జామ్‌పై సమాచారం ఇప్పించడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు కసరత్తు చేస్తోంది. ఏ రూపంలో అనే అంశంపై సమాలోచన... ట్రాఫిక్ జామ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. వీరి ద్వారా ఈ వివరాలు ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు చేరతాయి. ఈ సమాచారాన్ని వాహన చోదకుడి ఏ రూపంలో పంపాలనే దానిపై అధికారులు సమాలోచన చేస్తున్నారు. సంక్షిప్త సందేశం, ఆడియో క్లిప్, ఐవీఆర్ఎస్ తరహా కాల్... తదితర మార్గాలను పరిశీలిస్తున్నారు. నగరంలోని అనేక కూడళ్లల్లో ఉన్న సైనేజ్ బోర్డుల ద్వారానూ ఈ అడ్డంకుల సమాచారాన్ని వాహనచోదకులకు తెలియజేయనున్నారు. ట్రాఫిక్ జామ్ ఉన్న ప్రాంతానికి దారి తీసే మార్గాల్లోనే ఈ సందేశం కనిపించేలా ఏర్పాటు చేయనున్నారు. బంజారాహిల్స్‌లో స్తంభించిన ట్రాఫిక్ బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని అగ్రసేన్ చౌరస్తాలో నీటి పైప్‌లైన్‌కు లీకేజీలు రావడంతో గత నాలుగు రోజుల నుంచి తవ్వకాలు చేపట్టి కొత్త పైపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇరుకైన చౌరస్తాలో తవ్వకాలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నెం.12 వైపు, తెలంగాణ భవన్ రోడ్డులో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్కూల్ బస్సులన్నీ ట్రాఫిక్‌లో గంటల తరబడిగా చిక్కుకుపోయాయి. -
డ్రైవింగ్ టెస్ట్.. ఇకపై అక్రమాలకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం
డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు ఆటోమేటెడ్‌గా జరగనున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనదారుల పనితీరును, వినియోగ అర్హతను ధృవీకరించేందుకు ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కోటి రూపాయల ఖర్చుతో పనులు పూర్తిచేశారు. అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. కొత్త ట్రాక్‌లను త్వరలో ప్రారంభించేందుకు ఆర్టీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి,చిత్తూరు రూరల్: చిత్తూరు ప్రశాంత్ నగర్ ప్రాంతంలో ఆర్టీఏ కార్యాలయం ఉంది. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం రోజుకు వందల సంఖ్యలో వస్తుంటారు. కానీ ఈ కార్యాలయంలో గతంలో అక్రమంగా లైసెన్స్‌లు జారీ అయ్యే అవకాశం ఉండేది. అయితే వీటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆరు నెలల క్రితం ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరిలో పనులను ప్రారంభించారు. ఇందుకు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. రెండు రోజుల క్రితమే పనులు పూర్తి చేసి ట్రయల్ నిర్వహిస్తున్నారు. ట్రాక్ నిర్మాణం ఇలా మొత్తం ఇక్కడ 13 ట్రాక్‌లు ఉన్నాయి. ఎంవీ(మోటార్ వెహికల్)కు సంబంధించి 5 ట్రాక్‌లు ఉండగా, అందులో 8 ట్రాక్, హెయిర్‌పిన్ ట్రాక్, బ్యాలన్స్ బ్రిడ్జి ట్రాక్, రఫ్ రోడ్డు ట్రాక్, గ్రేడియంట్ వంటి ట్రాక్‌లు ఉన్నాయి. ఎల్ఎంవీ(లైట్ మోటార్ వెహికల్)లో కూడా 5 ట్రాక్‌లు ఉంటాయి. 8 ట్రాక్, పార్కింగ్, హెచ్ ట్రాక్, టీ ట్రాక్, గ్రేడియంట్లు ఉంటాయి. హెచ్ఎంవీ (హెవీ మోటార్ వెహికల్)లో మూడు ట్రాక్‌లు మాత్రమే ఉండగా, హెచ్ ట్రాక్, గ్రేడియంట్, పార్కింగ్లు ఉన్నాయి. వీటిని కొత్త విధానంలో అమలులో భాగంగా రీ మోడలింగ్ చేశారు. ఈ ట్రాక్‌ల చుట్టూ 27 సీసీ కెమెరాలను బిగించారు. ప్రతి ట్రాక్‌లోను బొలెట్స్ (సెన్సర్‌ను అమర్చిన పోల్స్) అమర్చారు. దీంతో పాటు ఆర్ఎఫ్ రీడర్స్ 26 దాకా ఏర్పాటు చేశారు. డిస్ప్లే బోర్డులు –13, సిగ్నల్ స్తంభాలు 13, కంప్యూటర్ పరికరాలు 15, మానిటర్ 2, ఒక కియోస్క్‌లు ఉన్నాయి. ఇవి మొత్తం సర్వర్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఇక్కడ ఇన్స్పెక్టర్, నెట్ వర్కింగ్ ఇంజనీర్ పర్యవేక్షిస్తుంటారు. డ్రైవింగ్ ట్రయల్‌కు వెళ్లిన వ్యక్తిని ఈ కంట్రోల్ రూమ్ నుంచే చూస్తుంటారు. ఈ పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. డ్రైవింగ్ శిక్షణకు ఎలా వెళ్లాలంటే.. ఆటోమెటిక్ పద్ధతి ద్వారా ఎల్ఎల్ఆర్ పొందిన వ్యక్తులు డ్రైవింగ్ ట్రయల్‌కు ముందుగా కియోస్కీ ద్వారా ఎల్ఎల్ఆర్ నంబరు నమోదు చేసి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాత కంట్రోల్ రూమ్‌లో బయోమెట్రిక్ వేయాలి. అక్కడే శిక్షణకు వెళ్లేందుకు ట్యాగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రాక్‌లోకి వెళ్లేముందు ఆర్ఎఫ్ రీడర్‌కు ట్యాగ్‌ను మ్యాచింగ్కు చేసి గ్రీన్ సిగ్నల్ వచ్చాక ముందుకు వెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లోను రెడ్ సిగ్నల్‌ను దాటకూడదు. సూచిక బోర్డులో ఉన్న విధంగానే 8, ఇతర ట్రాక్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి సిగ్నల్ వద్ద ట్యాగ్‌ను మ్యాచింగ్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. వాహనాలను బట్టి 3 నుంచి 5 ట్రాక్‌లను పూర్తి చేయాలి. ఇలా శిక్షణ పూర్తి చేసి, వైట్ మార్క్ వద్దకు చేరుకున్న తరువాత స్టాప్ సిగ్నల్ ఇవ్వాలి. ఇక్కడ ఎలాంటి తప్పు జరిగిన సెన్సార్ రూపంలో కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్తోంది. ఆటోమెటిక్ ట్రయల్‌లో తప్పిదం జరిగినట్లు సమాచారం వస్తుంది. ఈ విధానం ద్వారా అక్రమాలకు, దళారుల వ్యవస్థకూ చెక్ పడనుంది. పనులు పూర్తయ్యాయి ట్రాక్ పనులు గత ఆరు నెలలుగా చేస్తున్నారు. పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభం అవుతుంది. ఆటోమెటిక్ విధానం ద్వారానే ట్రయల్ ఉంటుంది. సెన్సార్ సాయంతో ఈ పరీక్షలు జరుగుతాయి. దీనిపై డ్రైవింగ్ శిక్షణకు వచ్చే వారు అవగాహన కలిగి ఉండాలి. – బసిరెడ్డి, డీటీసీ, చిత్తూరు -
పంజగుట్ట ఫ్లై ఓవర్.. ప్రమాదం పైనే ఉంది జర జాగ్రత్త
సాక్షి,పంజగుట్ట(హైదరాబాద్): పంజగుట్ట ఫ్లై ఓవర్ కింద ప్రయాణిస్తున్న వారు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. పంజగుట్ట చౌరస్తాలో ఫ్లై ఓవర్ నుంచి కిందికి కేబుల్ వైర్ల ఎన్‌క్లోజర్ కట్టలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఇవి ఏ మాత్రం తెగిపడినా కింద ప్రయాణిస్తున్న వారికి సంకటమే.. సంబంధిత అధికారులు గుర్తించి వీటిని తొలగించడమో లేదా సరిచేయడమే చేయాల్సిన ఎంతైనా ఉంది. -
హలో చలో.. గ్రేటర్లో 71.7 శాతం మంది హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో డ్రైవింగ్
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): గ్రేటర్ వాహనదారులు సెల్‌ఫోన్ డ్రైవింగే కాదు.. ఇయర్ ఫోన్స్, బ్లూ టూత్లలో లేదా హెల్మెట్ లోపల మొబైల్లో మాట్లాడుతూ (హ్యాండ్స్ ఫ్రీ) వాహనాలను నడుపుతున్నారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్), కరుణ ట్రస్ట్, యాక్షన్ ఇన్ డిస్ట్రెస్ ఎన్జీఓలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. 11,787 డ్రైవర్లపై అధ్యయనం చేయగా.. 16.5 శాతం మంది సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారని, ఇందులో 71.7 శాతం మంది హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో డ్రైవింగ్ చేస్తున్నారని వెల్లడించింది. ♦మాదాపూర్ ఐటీ కారిడార్, అమీర్‌పేట బిజినెస్ ఏరియా, మేడ్చల్ హైవే ఇండ్రస్టియల్ ప్రాంతాలలో ఈ అధ్యయనం నిర్వహించాయి. 15 నిమిషాల పాటు వాహనాల రాకపోకలు, వాహనదారుల వీడియోను రికార్డ్ చేశారు. కరుణ ట్రస్ట్‌కు చెందిన సంధ్య, యాక్షన్ ఇన్ డిస్ట్రెస్కు చెందిన లక్ష్మి అర్చన, ఐఐపీహెచ్ నుంచి మెలిస్సా గ్లెండా లూయిస్, తేటాలి శైలజలు ఈ సర్వే నిర్వహించారు. ఈ అధ్యయాన్ని క్లినికల్ ఎపిడిమియాలజీ, గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. ♦రోజు, సమయంతో పాటూ రోడ్డు పరిస్థితిని బట్టి సెల్‌ఫోన్ డ్రైవింగ్‌లో తేడాలను అధ్యయన బృందం విశ్లేషించింది. సాధారణ రోజులలో కంటే వారాంతాలలో, రద్దీ ఉన్న రోడ్ల మీద కంటే లేని రహదారులలో హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో డ్రైవింగ్ ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంది. ♦డ్రైవింగ్‌లో హ్యాండ్స్ ఫ్రీ కమ్యూనికేషన్ పరికరాలను వినియోగించడం ప్రమాదకరని జాబితాలో ఉన్నప్పటికీ.. జరిమానాలు విధించడం లేదు. అందుకే ఈ తరహా డ్రైవింగ్‌లను కూడా ఎంవీ యాక్ట్‌లో చేర్చాలని పరిశోధకలు సూచించారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్–184 ప్రకారం ప్రమాదకరమైన రీతిలో వాహనాలను డ్రైవింగ్ చేసే వారికి రూ.5 వేల జరిమానా, 6– 12 నెలల పాటు జైలు శిక్ష విధిస్తారు. ♦గతేడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 35,425, అంతకు క్రితం ఏడాది 26,984 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. 2021లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5,788 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. -
హైదరాబాద్‌లో డీజిల్ కొట్టించగానే ఆగిపోతున్న కార్లు.. ప్రశ్నిస్తే..
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఇంధనం లేక ఆగిపోయిన వాహనాలకు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ పట్టిస్తే యధావిధిగా స్టార్ట్ అవుతాయి. కానీ ఈ పెట్రోల్ బంక్‌లో డీజిల్, పెట్రోల్ పట్టిస్తే మాత్రం ఈ డబ్బులు వృథాగా పోగొట్టుకోవడమే కాక.. వాహన మరమ్మత్తులకు కూడా జేబు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో భారీ మోసం వెలుగుచూసింది. నీళ్లతో కలిపిన డీజిల్‌ను వాహనదారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ డీజిల్ పోయించకున్న వెంటనే వాహనాలు ఆగిపోయినట్లు చెప్తున్నారు. ఇదేంటని డీజిల్‌ని పరీక్షిస్తే లీటర్‌కు మూడొంతుల నీళ్లు కలిపినట్లు తేలింది. ఈ విషయంపై పెట్రోల్ బంక్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వాహనదారులను మోసం చేస్తున్న ఈ బంక్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: (గుడ్‌న్యూస్: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్) -
శీతాకాలం వచ్చేసింది.. వాహనదారులు వీటిని తప్పక పాటించాలి.. లేదంటే..
సాక్షి,సీతంపేట(శ్రీకాకుళం): శీతాకాలం ప్రారంభంతోనే పొగమంచు దట్టంగా కరుస్తోంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచులో వాహ నం నడపడం సాహసంతో కూడుకున్నదే. ఎదురుగా వస్తున్న వాహనం దగ్గరకు వచ్చేవరకూ గుర్తించలేం. అలాంటి సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలా బారిన పడేందుకు అవకాశం ఉంది. వాతావరణ ఎలా ఉన్నా ప్రజలు తమ పనుల నిమిత్తం ప్రయాణించక తప్పదు. ఈ నేపథ్యంలో ఉదయాన్నే పొగమంచులో ప్రయాణించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాటించాల్సిన జాగ్రత్తలు ► పొగమంచు కురిసే సమయంలో వీలైనంత వరకు వాహనాలను నడపకపోడం మంచిది ► రహదారిపై మంచు తీవ్రత పెరిగితే సురక్షితమైన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలి ► కార్లు, ద్విచక్రవాహనాలపై సాధ్యమైనంత తక్కువ దూరం ప్రయాణం చేయాలి ► పొగమంచు కమ్ముకున్నపుడు వాహన వేగం తగ్గించాలి ► ఎదురెదురుగా వస్తున్న వారు గమనించేలా హెడ్‌లైట్స్ ఆన్‌చేసి ఉంచాలి. కొత్త వాహనాలకు ఆ సమస్య లేదు. ఎల్లపుడు హెడ్‌లైట్స్ వెలిగే ఉంటాయి ► వాహనాలకు వైపర్స్ పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి ► డ్రైవర్ పక్కన కూర్చునే వారు డ్రైవింగ్ తీరును ఎప్పటికపుడు పర్యవేక్షించాలి ► వాహనం వెనుక.. ముందు రేడియం స్టిక్కర్లు విధిగా అతికించాలి ► వాహనానికి అమర్చిన రెడ్‌సిగ్నల్స్, బ్రేక్ సిగ్నల్స్ పనితీరు సరిచూసుకోవాలి ► పొగమంచు ఉన్నపుడు ఎదురుగా వెళ్లున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నం మానుకోవాలి ప్రమాదాలకు ఆస్కారం.. ► రహదారుల పక్కనే వాహనాలు నిలపడం, మలుపులతో కూడిన రహదారులు ఉండడం ► పరిమితం కంటే అధికవేగంతో వాహనాలు నడపడం ► దట్టంగా ఉన్న మంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం ► రహదారి వెంబడి ఉన్న డివైడర్లను ఢీకోవడం వంటి కారణంగా ఈ సీజన్లో ప్రమాదాలకు ఆస్కారం ఉంది చదవండి: మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రేసులో సిక్కోలు మహిళ -
వాహనం ఒకరిది.. నంబర్ ఇంకొకరిది
పై ఫొటోలో కనిపిస్తున్న ఆటో టేకులపల్లిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు ఫొటో తీసి, నంబర్ ఆధారంగా ఈ–చలాన్ పంపారు. కానీ అది ఖమ్మంలోని ఓ కారు ఓనర్‌కు వెళ్లింది. కారు నంబర్ ఆటోపై రాయడంతో ఈ మతలబు జరిగింది. భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి స్కూటీ ఎప్పుడూ ఇతర ప్రాంతాలకు వెళ్లలేదు. అయితే చండ్రుగొండలో హెల్మెట్ పెట్టుకోలేదంటూ ఈ–చలాన్ వచ్చింది. ఫొటోలో మాత్రం ప్యాషన్ బైక్ ఉంది. జరిమానా స్కూటీ ఓనర్‌కు వచ్చింది. ట్రాఫిక్ జరిమానాలు తప్పించుకునేందుకు కొందరు తమ వాహనాలపై ఇతరుల వాహనాల నంబర్లు రాసుకుంటున్నారు. సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పోలీసులు నిబంధనలు ఉల్లంఘించేవారి వాహనాల ఫొటోలు తీస్తున్నారు. వాటి ఆధారంగా వాహనం నంబర్ గుర్తించి జరిమానా విధిస్తున్నారు. అయితే కొందరు ఉల్లంఘనులు ఇతరుల వాహనాల నంబర్లను తమ వాహనాలపై రాయించుకుంటున్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ–చలాన్లు మాత్రం ఇతరులకు వెళ్తున్నాయి. దీంతో వారు లబోదిబోమంటున్నారు. ఒక వాహనం నంబరును మరో వాహనానికి చెందిన వ్యక్తులు ఉపయోగిస్తుండటంతో నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వేరేవాళ్లు చేస్తున్న తప్పులకు తాము జరిమానా కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. తమ వాహనాల నంబర్లు పెట్టుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం పోలీసులకు భారీ లక్ష్యాలు విధించి ఒత్తిడి చేస్తోంది. దీంతో రోజూ అన్ని ఠాణాల పరిధిలోని కానిస్టేబుళ్లు వివిధ కూడళ్లలో నిలబడి ఫొటోలు తీయడమే పనిగా ఉంటున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ సైతం గాలికి వదలాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాలు తనిఖీలు చేస్తేనే ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు, వాహనం నడిపే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఏజెన్సీలోనే తనిఖీలు.. మావోయిస్టు పార్టీ కార్యకలాపాల నేపథ్యంలో జిల్లాలోని భద్రాచలం, పినపాక ఏజెన్సీల్లో మాత్రమే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణాదారులు పట్టుబడుతున్నారు. పోలీసులు పేలుడు పదార్థాలు, గంజాయి రవాణాపైనే దృష్టి పెడుతున్నారు తప్ప వాహనాలకు పత్రాలు ఉన్నాయా? లేవా? అనే విషయం పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక ఇతర ప్రాంతాల్లో తనిఖీలు అంతగా చేపట్టడం లేదు. దీంతో ఏ వాహనంలో ఏం తరలిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనుల ఫొటోలను తీసేందుకే కానిస్టేబుళ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ సమస్యలపై ఎస్పీ సునీల్‌దత్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు. -
తిరుమలలో చిరుత కలకలం..
సాక్షి, తిరుపతి: తిరుమల క్షేత్రంలో చిరుత భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఘాట్ రోడ్డులో వెళ్లే వాహనదారులపై దాడికి దిగుతుంది. ఒకే రోజు వరుసగా మూడు సార్లు పంజా విసిరింది. ద్విచక్ర వాహనదారులు తృటిలో చిరుత పంజా నుండి తప్పించుకున్నారు. తిరుమల క్షేత్రంలో ఎన్నడు లేని విధంగా చిరుత దాడికి దిగటంతో అటు టీటీడీ అధికారులకు, ఇటు భక్తులు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. శేషాచలం అటవీ ప్రాంతం అంటేనే ఎన్నో క్రూరమృగాలు ఉంటాయి. ముఖ్యంగా చిరుతలు, ఏనుగులు, మిగిలిన జంతువులన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే జనసంచారం పెద్దగా తిరుమలలో లేకపోవడంతో జంతువులన్నీ రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత తిరుమలలోని రెండవ ఘాట్ రోడ్డులో ప్రత్యక్షమైంది. మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుడిపై అలిపిరి టోల్ గేట్ నుంచి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో దాడి చేసింది. ఆ తరువాత అక్కడే కూర్చుండి పోయింది. మరో ఇద్దరు వేర్వేరు ద్విచక్రవాహనాల్లో వెళుతుండగా వారి మీద కూడా దాడి చేసింది. వీరిలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారు. ఎలాగోలా వారు తప్పించుకుని తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి టోల్గేట్ నుంచి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో చిరుత ఉందనే సమాచారం టీటీడీతో పాటు అటవీశాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో అటవీ శాఖాధికారులు రంగంలోకి దిగారు. చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వాహనాలను మాత్రం యథావిధిగా ఘాట్ రోడ్డులో పంపించేస్తున్నారు. ఐదు, ఆరు వాహనాలను ఒకేసారి తిరుమలకు అనుమతిస్తున్నారు. మరోసారి చిరుత సంచారం శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. చిరుత దాడి బాధితులు మాత్రం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తిరుమల కి చేరుకున్నారు. గతంలో అనేకమార్లు చిరుత జనావాసాల మధ్యకు వచ్చిన ఎవ్వుపై దాడికి పాల్పడలేదు. కుక్కలు,పందులు,జింకలు, దుప్పులు లాంటి జంతువుల పై దాడిచేసింది.. చాలా సంవత్సరాల క్రితం నడకదారిలో ఓ ఏడేళ్ల చిన్నారిపై దాడికి పాల్పడింది. మరి నేటి వరకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. మళ్లి నేడు ఒకే రోజు మూడుసార్లు వాహన దారులపై పంజా విసరటం కలకలం రేపుతుంది. -
లాక్డౌన్ ఉల్లంఘనులపై పోలీసుల కొరడా
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణకు కట్టుదిట్టంగా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారిపై నగర పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించిన నేపథ్యంలో నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఇళ్లకే పరిమితం కావాలనే ఆదేశాలను కొందరు బేఖాతరు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో నిబంధనలు పాటించకుండా బయటకు వచ్చిన వాహనదారులను అదుపు చేసేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెబుతున్నారు. లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే లాఠీఛార్జ్ చేసైనా సరే లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశాల నేపథ్యంలో పోలీసు సిబ్బంది మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. (వైరస్ ఉగ్రరూపాన్ని చూస్తారు : డబ్ల్యూహెచ్ఓ) రోడ్డెక్కిన వాహనాలు సీజ్.. తనిఖీలు చేస్తూ.. అనవసరంగా రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేస్తూ వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో నివారణ కోసం రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. మాస్క్‌లు లేకుండా ఎవరూ బయట తిరగొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేకుండా బయట తిరిగినా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా కేసులు నమోదు చేయకతప్పదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. (వారంలోనే వీరంగం) పోలీసుల ఓవరాక్షన్ విధి నిర్వహణలో కొందరు పోలీసులు విచక్షణ కోల్పోయి.. ఓవరాక్షన్ చేస్తున్నారు. నగరంలోని చార్మినార్ మదీనా చౌరసా వద్ద జడ్జ్ఖాన నుంచి డెలివరీ అయిన మహిళను ఇంటి వద్ద దింపేందుకు వెళ్తున్న ‘102’ వాహనాన్ని చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. వాహనంలో మహిళతో పాటు కుటుంబ సభ్యులు ఉండటంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. విషయం తెలిసి ఘటనాస్థలికి మీడియా ప్రతినిధులు చేరుకోవడంతో వెంటనే ‘102’ వాహనాన్ని అధికారులు పంపించివేశారు. -
పోలీసులకు వాహనదారుల ఝలక్
పోలీసులను ద్విచక్రవాహనదారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ట్రాఫిక్ చలానా నుంచి తప్పించుకునేందుకు కొందరు నంబర్లు మార్చి రోడ్డుపై తిరుగుతున్నారు. దీంతో ఫొటోలు తీసి చలానా వేస్తుండగా అసలైన యజమాని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. సాక్షి, పాలకుర్తి(రామగుండం): రహదారిపై భద్రతా నియమాలు పాటించకుండా ట్రాఫిక్‌రూల్స్ అతిక్రమిస్తున్న వాహనదారులపై ప్రస్తుతం పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. పోలీసులు విధించే ఆన్లైన్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. వాహనాలకు ఇతరుల వాహన నంబర్లు రాయించుకొని తిరుగుతున్నారు. పోలీసులకు పట్టుబడినపుడు వారు విధించే జరిమానాకు సంబంధించిన సమాచారం అదేనెంబర్ కలిగిన అసలు వాహనదారులకు వెళ్తుండడంతో వారు ఖంగుతింటున్నారు. దీంతో సంబంధిత వాహన యజమానులు తమ వాహనం ఆ స్టేషన్ పరిధిలో వెళ్లలేదని, తాము ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలాంటి ఘటన ఇటీవల బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల పోలీసుల వాహన తనిఖీల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ కుక్కలగూడుర్‌కు చెందిన వ్యక్తి చిక్కాడు. పోలీసులు అతడికి జరిమానా విధిస్తూ ఆన్లైన్ రసీదు అందించారు. అయితే పోలీసులు విధించిన జరిమానా సమాచారం హైదరాబాద్‌కు చెందిన మరోవ్యక్తికి సెల్ఫోన్లో మెసేజ్ వెళ్లింది. దీంతో ఖంగుతిన్న వాహన యజమాని సంబంధిత స్టేషన్‌కు కాల్చేసి వివరాలు అడిగాడు. తాను హైదరాబాద్‌లో ఉంటానని, నా వాహనం మీ స్టేషన్ పరిధిలో ఎక్కడికి రాలేదని, తనకు జరిమానా ఎలా విధిస్తారని వాగ్వాదానికి చేశాడు. దీంతో పోలీసులు సీరియస్‌గా తీసుకొని వాహన నెంబర్ ఎంట్రీ చేయడంలో ఏదైనా పొరపాటు దొర్లిందా అని పునరాలోచనలో పడి వివరాలు సరి చూసుకున్నారు. కానీ వాహన వివరాలు కరెక్ట్‌గా ఉండడంతో విస్తుపోయారు. వాహనదారుడు అంతటితో ఆగకుండా కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశాడు. కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు మరోసారి తాము ఎంట్రీ చేసిన వివరాలు పరిశీలించారు. జరిమానా విధించిన వాహనదారుడిని స్టేషన్‌కు పిలిపించి విచారణ జరపడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తన బైక్‌కు నంబర్‌లేదని, ఫ్యాన్సీగా ఉంటుందని ఒకనంబర్ తగిలించుకుని తిరుగుతున్నానని, ఇది గత మూడేళ్లుగా చేస్తున్నానని తెలుపడంతో పోలీసులు అవాక్కయ్యారు. అతడి వాహననంబర్ ప్లేటు తొలగించి సదరు వ్యక్తితో జరిమానా కట్టించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాణాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి జరిగింది. కరీంనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్‌రూల్స్ అతిక్రమించినందుకు జరిమానా విధించినట్లు అతడి సెల్‌కు మేసేజ్ వెళ్లింది. ఈవిధంగా నాలుగైదు సార్లు రావడంతో సంబంధిత వివరాలు పరిశీలించిన వ్యక్తికి అతడి వాహన నెంబర్‌తో కలిగిన మరో వాహనం ఫొటో కనిపించడంతో అవాక్కయ్యారు. ప్రస్తుతం ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఆకతాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం అటు పోలీసులను, అసలు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది.