► జిల్లా ప్రజలపై రూ.10 కోట్లకు పైగా భారం
► ఖజానాకు ఆదాయం పెంపే లక్ష్యం
విశాఖపట్నం : వాహనదారులపై మరో భారం పడింది. రవాణా సేవలు పొందే వినియోగదారుల నుంచి సర్వీస్, యూజర్ ఛార్జీల ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్‌పోర్ట్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో ఆయా సేవలు బట్టి ధరలు అమాంతంగా పెంచారు. 50 నుంచి 100 శాతం వరకూ ఛార్జీల మోత మోగించారు. దీంతో ఏడాదికి జిల్లా ప్రజలపై రూ.10 కోట్లకు పైగా భారం పడనుంది. డ్రైవింగ్ లెసైన్స్‌లు, కొత్త వాహనాల రిజస్ట్రేషన్‌లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌లు, పర్మిట్‌లు, రోడ్ టాక్స్ చెల్లించే వారికి ధరల భారం ఉంటుంది.
2014-15 ఏడాదిలో ఫీజుల రూపంలో రూ.23.16 కోట్లకు గానూ రూ.20.17 కోట్లు రాబట్టారు. యూజర్ ఛార్జీలు రూ.8.04 కోట్లకు రూ.6.49 కోట్లు వసూలు చేశారు. పన్నులు, ఇతరత్రా సేవలుగా ఫీజులు, యూజర్ ఛార్జీల చెల్లింపులతో సర్వీసు ఛార్జీలు ముడిపడి ఉండగా వాటిని వసూలు చేస్తారు.
రవాణా ఆదాయ లక్ష్యం రూ.348 కోట్లు !
రాష్ట్ర ప్రభుత్వం 2015-16 ఏడాదికి సుమారు రూ.348 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్దేశించినట్టు సమాచారం. గతేడాదితో పోల్చితే దాదాపు 15 శాతం ఆదాయ లక్ష్యాన్ని పెంచినట్టు భోగట్టా. ఆయా జిల్లాలకు ఆదాయ లక్ష్యం 15 నుంచి 20 శాతం పెంచినట్టు తెలిసింది. అయితే సీఎం చైనా పర్యటనలో ఉండటంతో లక్ష్యం పూర్తిగా ఖరారు కాలేదు. సీఎం ఆమోదంతో ఒక్కో జిల్లాకు ఆదాయ లక్ష్యం అధికారికంగా ప్రకటించనున్నారు.
2014-15 ఏడాదికి రూ.302 కోట్ల ఆదాయం నిర్దేశించగా రూ.225.27 కోట్ల ఆదాయం సమకూరింది. ఏడాదిలో 75 శాతం ఫలితాలతో రాష్ట్రంలో విశాఖకు ఐదో స్థానం దక్కింది. ఆదాయం పెంచుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది లక్ష్యాన్ని గణనీయంగా పెంచింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాకు ఆదాయ వసూళ్లు తగ్గాయని, లక్ష్య సాధన కోసం అధికారులు శక్తి వంచన లేకుండా పనిచేయాలని రవాణశాఖ కమిషనర్ జిల్లాల అధికారులకు బోధించినట్టు సమాచారం. త్రైమాసిక పన్నుల వసూళ్లలో అలసత్వం ప్రదర్శించవద్దని కమిషనర్ ఆదేశించినట్టు తెలిసింది. తనిఖీలు విస్తృతం చేసి పన్నుల ద్వారా ఆదాయం రాబట్టాలని తెలియజేసినట్టు వినికిడి.
రవాణా సేవలకు ఛార్జీల మోత
Published Mon, Apr 20 2015 4:05 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement