
ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తాం
కేంద్ర మంత్రి మాండవియా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా అన్నారు. ఇందు కోసం భిన్నమైన పలు కార్యక్రమాలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. మాండవియా అధ్యక్షతన భారత క్రీడా రంగం మెరుగుదల, భవిష్యత్తుకు సంబంధించి శుక్రవారం ప్రత్యేక ‘చింతన్ శిబిర్’ ప్రారంభమైంది. నగర శివార్లలో కన్హా శాంతి వనంలో జరుగుతున్న రెండు రోజుల ఈ శిబిరం శనివారం ముగుస్తుంది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన క్రీడా శాఖల మంత్రులు, క్రీడా పరిపాలకులు, సీనియర్ ప్రభుత్వాధికారులతో పాటు కేంద్ర క్రీడాశాఖ సహాయ మంత్రి రక్ష ఖడ్సే కూడా దీనికి హాజరయ్యారు. ప్రపంచ క్రీడల్లో భారత్ స్థాయిని మరింత పెంచే దిశగా పలు ఆలోచనలను పంచుకున్న వీరంతా అందుకు తగిన విధంగా రూట్ మ్యాప్ కోసం తమ వంతు సూచనలు అందించారు.
ముఖ్యంగా 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో భారత్ పెద్ద సంఖ్యలో పతకాలు సాధించే లక్ష్యంతోపాటు 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చే అంశంపై ఈ కార్యక్రమంలో చర్చ జరిగింది. ఒలింపిక్స్‌ను మన దేశం నిర్వహించాలనే కలకు ఈ చింతన్ శిబిర్ నుంచి తొలి అడుగు పడాలని మాండవియా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న క్రీడా ప్రతిభ వృథా కాకుండా ఉండేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
‘ప్రతిభాన్వేషణలో ఖేలో ఇండియా వంటి పథకాలు కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 937 ఖేలో ఇండియా కేంద్రాలు సమర్థంగా పని చేస్తున్నాయి. 9–14 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆటగాళ్లను గుర్తించి తీర్చిదిద్దితే ఒలింపిక్స్‌లో మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు సాంకేతికతను వాడుకోవడం కూడా కీలకాంశం. దీని కోసం ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆటగాళ్ల వివరాలను ఒకే చోట నమోదు చేసి ప్రత్యేక ఐడీలు ఇవ్వబోతున్నాం. అలా చేస్తే వారిని తగిన రీతిలో ప్రోత్సహిస్తూ పురోగతిని పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది’ అని మాండవియా వెల్లడించారు.
ఒలింపిక్ మిషన్ కోసం జాతీయ క్రీడా సమాఖ్యలు మరింత సమర్థంగా పని చేయాల్సి ఉంటుందన్న కేంద్ర మంత్రి... ఆటగాళ్ల సెలక్షన్స్‌లో పారదర్శకత పాటిస్తే తల్లిదండ్రులు మరింత పెద్ద సంఖ్యలో తమ పిల్లలను క్రీడల వైపు తీసుకొస్తారని విశ్లేషించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారంతా క్రీడాభివృద్ధి కోసం తమ సలహాలు అందించారు. దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్‌లను ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న స్టేడియంలు తదితర మౌలిక సౌకర్యాలను సమర్థంగా వాడుకునేలా చూడాలని వారు సూచించారు.