ఇద్దరు సైక్లిస్టులకు కేబినెట్లో చోటు
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ కేబినెట్లో ఇద్దరు సైక్లిస్టులకు చోటు దక్కింది. కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న బీజేపీ ఎంపీలు మన్‌సుఖ్‌భాయ్ మాండవీయ, అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రపతి భవన్లోని అశోకా హాల్లో వీరిరువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు మన్‌సుఖ్‌భాయ్ మాండవీయ, అర్జున్ రామ్ మేఘవాల్...సైకిళ్లపై రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు.
కాగా రాజస్థాన్‌లోని బికనీర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ రామ్ మేఘవాల్ మొదటి నుంచి ఆడంబరాలకు దూరం. గతంలో కాలుష్యం తగ్గించేందుకు వారంలో ఎంపీలు కనీసం ఒక్కసారయినా పార్లమెంట్కు సైకిల్ మీద రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడంతో ఆయన అప్పటి నుంచే సైకిల్పైనే పార్లమెంట్ సమావేశాలకు హాజరు అవుతున్నారు. ఇక గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన్‌సుఖ్‌భాయ్ మాండవీయ కూడా పార్లమెంట్ సమావేశాలకు సైకిల్లో హాజరయ్యేవారు. అలాగే వ్యవసాయ రంగంలో మాండవీయ విశేష కృషి చేశారు.