
కామెంట్
ఊహించినట్లే జరుగుతోంది. ‘డీలిమిటేషన్’ భూతం మనల్ని వెంటాడుతోంది. జనాభా లెక్కలు దగ్గర పడిన కొద్దీ అది మనకు ఇంకా చేరువ అవుతోంది. అయినా మోదీ ప్రభుత్వం ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటోంది. కానీ ‘నియోజక వర్గాల పునర్విభజన’ భయాలు అలా కొట్టేయదగినవి కావు. ఎందుకని?
కారణం వెరీ సింపుల్. ఇందులో బుర్ర బద్దలు కొట్టుకోవల్సిందేమీ లేదు. నియోజక వర్గాలు జనాభాపరంగా సైజులో సమానంగా ఉండాలి. ఇప్పుడలా లేవు. కాబట్టి దేశవ్యాప్తంగా నియోజక వర్గాలు ఒకే సైజులో ఉండేట్లు వాటిని పునర్ విభజించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో, జనసంఖ్య వేగంగా పెరిగిన రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కంటే ఎక్కువ నియోజక వర్గాలు ఏర్పడతాయి.
మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 వద్దే స్థిరంగా ఉంచేట్లయితే, జనాభా నియంత్రణ పటిష్ఠంగా అమలు చేసిన రాష్ట్రాల్లో సహజంగానే నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుంది. ఆ మేరకు ఇతర రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. ఒకరి నష్టం మరొకరికి లాభం అవుతుంది.
సంఖ్య పెరిగినా ఒరిగేదేంటి?
మిలన్ వైష్ణవ్, జేమీ హింట్సన్‌ల అధ్యయనం సూచించిందిదే! అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ పార్లమెంటు నియోజకవర్గాలు తగ్గు తాయి. ఉదాహరణకు కేరళ, తమిళనాడు చెరో 8 సీట్లు కోల్పోతాయి. ఆంధ్ర, తెలంగాణలు రెంటికీ కలిపి చూస్తే అవీ ఇన్ని స్థానాలు నష్ట పోతాయి. కర్ణాటక నుంచి 2 స్థానాలు ఎగిరిపోతాయి. జనాభాను నియంత్రించిన ఇతర రాష్ట్రాలూ ఇలాగే దెబ్బతింటాయి. పశ్చిమ బెంగాల్ నాలుగు, ఒడిషా మూడు, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమా చల్ ప్రదేశ్ ఒక్కో నియోజకవర్గం పోగొట్టుకుంటాయి.
ఇక అనేక ఉత్తరాది రాష్ట్రాల స్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ జాబితాకు 11 స్థానాలు అదనంగా కలుస్తాయి. బిహార్ 10, రాజస్థాన్ 6, మధ్యప్రదేశ్ 4 సీట్లు పెంచుకుంటాయి. ఫలితంగా, 543లో 226 సీట్లతో ఇప్పటికే ఆధిపత్యం చలాయిస్తున్న ‘హిందీ హార్ట్‌ల్యాండ్’ డీలిమిటేషన్ అనంతరం తన ప్రాబల్యాన్ని విశేషంగా 259కి పెంచుకుంటుందని యోగేంద్ర యాదవ్ తేల్చారు.
దక్షిణాది రాష్ట్రాలు అన్నిటికీ కలిపి ప్రస్తుతం 129 సీట్లు ఉన్నాయి. పునర్విభ జన అనంతరం ఇవి 26 సీట్లు కోల్పోతాయని యోగేంద్ర యాదవ్ లెక్క గట్టారు. దీంతో పార్లమెంటులో వాటి ప్రాతినిధ్యం, పలుకుబడి గణనీయంగా క్షీణిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు.
డీలిమిటేషన్ సమయంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని లోక్ సభ సీట్ల సంఖ్య పెంచే వీలుందని అంటున్నారు. ఇది కొంచెం నయం. కానీ అలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుందా? మొత్తం స్థానాల సంఖ్య పెంచినా, ప్రతి రాష్ట్ర నియోజకవర్గాలూ అదే నిష్పత్తిలో పెరుగుతాయి. అదీ ఉత్తరాదికే అనుకూలిస్తుంది.
ఉత్తరాది–దక్షిణాది నిష్పత్తి ప్రకారం చూస్తే, దక్షిణాది రాష్ట్రాలకు ఒరిగేదే ఉండదు. వాటి సీట్ల సంఖ్య పెరిగినా ప్రయోజనం ఉండదు. వాటి ప్రాతినిధ్యం, పలుకు బడి పూర్వస్థితికి అంటే ఇప్పటి స్థాయికి చేరుకోవు. కాబట్టి, ఈ చర్య కూడా దక్షిణాది భయాలను తొలగించేది కాదు. పరిస్థితి ఏమీ మారదు.
ఆ మధ్య ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ లెక్క వేసింది. సమస్యను ఈ గణాంక విశ్లేషణ తేటతెల్లం చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఐదు దక్షి ణాది రాష్ట్రాలకు కలిపి మొత్తం 543లో 129 సీట్లు ఉన్నాయి. అంటే 24 శాతం. ప్రస్తుత లోక్ సభ సీట్ల సంఖ్యను 790కి పెంచారే అనుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాల నియోజకవర్గాలు 152కి పెరుగుతాయి.
నిజమే. కానీ మొత్తంలో వాటి వాటా కేవలం 19 శాతానికి కుదించుకు పోతుంది. తమిళనాడు విషయం చూస్తే, దాని వాటా ఇప్పుడున్న 7.2 నుంచి 5.4 శాతానికి పడిపోతుంది.ఏ విధంగా చూసినా దక్షిణాది రాష్ట్రాల క్షోభ అర్థం చేసుకో దగినదే!
ఉత్తరాది బాధ
కానీ రెండో వైపు నుంచి చూస్తే, ఉత్తరాదిదీ సంకట స్థితే! ఆర్. జగన్నాథన్ గణాంక విశ్లేషణ ప్రకారం, మారిన జనాభా నేపథ్యంలో కేరళ పార్లమెంటు సభ్యుడు సగటున 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదే రాజస్థాన్ ఎంపీ సగటున 33 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ రకంగా చూసుకుంటే తమకు ఉండవలసిన వారి కంటే చాలా తక్కువ మంది ఎంపీలు ఉన్నారని, ఇది అన్యాయమని హిందీ బెల్టు కూడా వాదించగలదని జగన్నాథన్ అభిప్రాయపడుతున్నారు. ఇది నిజంగా భారత ప్రజాస్వామ్యానికే డైలమా!
అసలు సమస్య ఇది: నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఉత్తరాది ఆందోళన పరిష్కారం అవుతుంది. అయితే, ఈ చర్య దక్షిణా దికి క్షోభ కలిగిస్తుంది. యోగేంద్ర యాదవ్ వాదిస్తున్నట్లు డీలిమి టేషన్‌ను వాయిదా వేయడం – లేదా శాశ్వతంగా రద్దు చేయడం ద్వారా యథాతథ స్థితి కొనసాగించవచ్చు. దక్షిణాది భయాలు తొలగి పోతాయి. మరి ఉత్తరాది వారు తమకు జరుగుతుందని భావిస్తున్న అన్యాయం మాటేమిటి? అది అలాగే మిగిలిపోతుంది. కాబట్టి, ఎలా చేసినా ఏదో ఒక పక్షం నష్టపోవడం తప్పదు.
మరి దీనికి పరిష్కారం లేదా? ఇది చిటికేసినంత సులభంగా పరిష్కరించే సమస్య అయితే కాదు. నిజం చెప్పాలంటే, మన ప్రజా స్వామ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో కచ్చితంగా ఇదొకటి. వాస్తవానికి వ్యవస్థలో పెను ఉపద్రవానికి దారి తీయగల ఒక నిర్మాణలోపం ఇది. దీన్ని తేలిగ్గా తీసిపారేయడమో, దాటవేయడమో సరైన వైఖరి కాదు. సవాలును సవాలుగా స్వీకరించి అమీతుమీ తేల్చుకోవాల్సిందే. ఇదంత సులభం కాకపోవచ్చు. పోనీ మరొక ప్రత్యామ్నాయం ఉందా?
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment