కామెంట్
ఒక ప్రధానమంత్రితో ముఖాముఖి అన్నది ఆయన విమర్శకులపై దాడి చేయటానికి వేదికగా ఉండకూడదు. అంతేకాదు, సరైన విమర్శలకు ఆయన్ని స్పందింపజేసేలా ఉండాలి. స్పందింప ‘చేయటం’ అనే క్రియ ముఖ్యం. ప్రశ్నడిగి వదిలేస్తే ఏ ప్రధాని అయినా ఆ ప్రశ్నను తప్పించటానికి, సమాధానాన్ని దాటవేయటానికి చూడొచ్చు. అలా చేయకుండా, సమాధానం కోసం పదే పదే ఒత్తిడి తేవడం ఇంటర్వ్యూ చేసేవారి బాధ్యత. అంతేకాదు, వీక్షకుల తరఫున ప్రశ్నలు అడుగుతున్నామన్న స్పృహను వారు కలిగి ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ చేసేవారు బెరుకుగా, ప్రధానికీ తనకూ వ్యత్యాసం ఉందన్న గ్రహింపుతో ఉన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ప్రధానిని తను కఠినమైన ప్రశ్నలు కూడా అడగగలడు అనే భావన వీక్షకులలో కలిగించాలి.
ఇప్పటి బి.బి.సి. చైర్మన్ సమీర్ షా ఒకప్పుడు ‘లండన్ వీకెండ్ టెలివిజన్’ లో నా మొదటి బాస్. టెలివిజన్ ఇంటర్వ్యూలలో ప్రశ్నలు అడగటం గురించి నాకు తెలిసిన చాలా విషయాలు ఆయన నేర్పించినవే. వాటిలో ముఖ్యమైన పాఠం... వీక్షకుల తరఫున ప్రశ్నలు అడుగుతున్నామన్న స్పృహను మనం కలిగి ఉండటం. అందుకే మీ ప్రశ్నలు సందర్భోచితంగా ఉండాలి. సమాధానం వచ్చేవరకు మీరు పట్టుపట్టి ఉండాలి. లేదంటే మీరు సమాధానం రాబట్టలేక పోతున్నారని వీక్షకులకు స్పష్టమైపోతుంది.
కనుక టీవీలో ప్రధానమంత్రి ఇంటర్వ్యూలను చూస్తున్న ప్పుడు నేను ఏం వినాలని కోరుకుంటాను? ఏముందీ, వీక్షకుడిగా నా తరఫున ఆ ప్రశ్నలు అడుగుతున్నట్లుంటే కనుక, నా ప్రశ్నలు ఎలా ఉండి ఉండాలి అని ఆలోచిస్తుంటాను.
ముందుగా, ప్రధాని వేటిని తన విజయాలుగా భావిస్తున్నారో వాటి గురించి తెలుసుకోవాలనుకుంటాను. ఆయనకు ఎదురైన సవాళ్లకు, బహిర్గతమైన వాస్తవాలకు, చేసిన తప్పులకు, కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలకు ఆయన ఏ విధంగా స్పందిస్తారో కూడా తెలుసుకోవాలని అనుకుంటాను. సంభాషణ ఏకపక్షంగా కాకుండా రెండు వైపుల నుండీ ఉండాలని కోరుకుంటాను. కాబట్టి సంభాషణలో ప్రధానిని అంతరాయపరచటం ఉంటుంది. కొన్నిసార్లు అంతరాయాలు అవసరం కూడా!
రెండోది – ఒక ప్రధానమంత్రితో ముఖాముఖి అన్నది ఆయన విమర్శకులపై దాడి చేయటానికి వేదికగా ఉండకూడదు. అంతేకాదు, సరైన విమర్శలకు ఆయన్ని స్పందింపజేసేలా ఉండాలి. స్పందింపచేయటం అనే క్రియ ముఖ్యం. ప్రశ్నడిగి వదిలేస్తే ఏ ప్రధాని అయినా ఆ ప్రశ్నను తప్పించటానికి, సమాధానాన్ని దాటవేయటానికి చూస్తారు. అలా చేయకుండా, సమాధానం కోసం ఒత్తిడి తేవడం ఇంటర్వ్యూ చేసేవారి బాధ్యత.
మూడవది – ఇంటర్వ్యూ ఆసాంతం.. ఇంటర్వ్యూ చేసేవారు, ప్రధానీ ఇద్దరూ కూడా సమానమే. అలాంటప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ ప్రధానిని బాధ్యుడిని చేస్తుంది. కనుక ఇంటర్వ్యూ చేసేవాళ్లు ఆయన్ని ‘సర్’ అని పిలవకూడదు. అలా అనడం అంటే ఆయన్ని ఉన్నత పీఠం మీద ఉంచినట్లు! అలాగే ఇంటర్వ్యూ చేసేవారు బెరుకుగా, ఆయనకూ తనకూ వ్యత్యాసం ఉందన్న గ్రహింపుతో ఉన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ప్రధానిని తను కఠినమైన ప్రశ్నలు కూడా అడగగలడు అనే భావన వీక్షకులలో కలిగించాలి.
నాల్గవది – అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరిగా ఇంటర్వ్యూ చేసేవారు లేవనెత్తిన అంశాలకు సంబంధించినవై ఉండాలి. కొద్దిపాటి ఊకదంపుడును అర్థం చేసుకోవచ్చు కానీ, అడగని వాటికి జవాబు చెబుతూ, అడిగిన వాటికి విరుద్ధమైన సమాధానం ఇస్తూ పీఎం పూర్తిగా దారి మళ్లేందుకు అనుమతించకూడదు. అలా జరిగితే మర్యాదపూర్వకమైన బలవంతపు అంతరాయం అవసరం. పీఏం అదే పనిగా దారి మళ్లుతూ ఉంటే ఒకటి కంటే ఎక్కువసార్లు అంతరాయాలు ఉండొచ్చు.
ఐదవది – ఇంటర్వ్యూయర్‌కు వ్యూహం అవసరం. ఏదో అడగటానికి అన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఎప్పుడూ కూడా అడగకూడని ఒక ప్రశ్నకు ఉదాహరణ: ‘ఈసారి మీరు కచ్చితంగా గెలుస్తారు, అయితే 2029లో కూడా గెలుస్తారా?’
ఇప్పుడు, సంబంధిత పీఎం స్వభావం, వ్యక్తిత్వాలకు అనుగుణంగా స్పందించేందుకు తగిన సామర్థ్యాన్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఒక ప్రధాని తను చేసిన ప్రతి పనీ దేశం కోసమే చేశానని దేశభక్తి ఢంకాను బజాయిస్తుంటే... ప్రధాన మంత్రులందరి విషయంలోనూ అది సహజమే కదా అని అనండి. అలా అనడం ఆయన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపి ఉంచదు.
లేదా, అందరికీ తెలిసి ప్రధాని చెప్పిన ఒక విషయం గురించి, లేదా ఆయన చేసిన ఒక పని గురించి నిర్ద్వంద్వంగా ప్రధాని తాను అనలేదని, చేయలేదని వాదిస్తుంటే... అప్పుడు దానిని సమయ సందర్భ, స్థల కాలాలతో సహా గుర్తు చేసే స్థితిలో ఇంటర్వ్యూయర్ ఉండాలి. ఆ విషయంలో స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే అది ప్రధానమంత్రిని సవాలు చేయటం వంటిది. ఇంటర్వ్యూయర్ సిద్ధపడి ఉండాల్సిన వాటిలో ఇదొక సహేతుకత కలిగి ఉండాల్సిన భాగం.
కొన్నిసార్లు స్పష్టమైన ప్రశ్నలు లేవనెత్తాలి. ఎందుకంటే అవి ఆ ఇంటర్వ్యూ ఇస్తున్న ప్రధానికి సంబంధించినవై ఉంటాయి. వాటిని విస్మరించలేము. ఉదాహరణకు, ఆ ప్రధాని తను భగవంతుని వాహకమని విశ్వసిస్తుంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కొంతవరకైనా ఆయన్ని శంకిస్తున్నట్లుగా.. అది మీకెలా తెలుసు? మీరలా అనడం హేతుబద్ధమేనా? అని అడిగి తీరాలి.
లేదా, ప్రధానిని అనుకరిస్తూ జీవనం సాగించే హాస్యగాడికి ఆయనపై పోటీ చేసేందుకు అనుమతి లభించకపోతే మీరు అందుకు అనుమతిస్తారా అని ఆ ఇంటర్వ్యూయర్ అడగాలి. ఆయన చికాకు పడుతూ కోపగించుకుంటున్నా కూడా పట్టు వదలక అడిగి తీరాలి. అంతేకాదు, ప్రధాని ఎల్లప్పుడూ తనను తాను తృతీయ పురుషలోనే ఎందుకు చెప్పుకుంటారు? గొప్ప కోసమా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాలి.
చివరిగా – నేనిక్కడ రాసిన వాటిని ఒక స్వచ్ఛమైన మనసు గల, గౌరవనీయులైన ప్రధాని అంగీకరిస్తారన్న నమ్మకం నాకుంది. గుర్తుంచుకోండి! ప్రజలను ఆకట్టుకోవటానికి తన ఇంటర్వ్యూను ఉపయోగించుకోవాలని ఆయన అనుకుంటారు. వాళ్ళకు చీకాకు తెప్పించాలనుకోరు. ఆ సంగతి మర్చిపొవద్దు. సమీర్ నాతో చెప్పిన మరొక మాట ఇది.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment