Karan Thapar
-
సాంత్వననిచ్చే గొంతులు
అంతా నిన్ననే జరిగినట్లుంది. జ్ఞాపకం ఏమాత్రం మసకబారలేదు. ఫాదర్ టెర్రీని నేను మొదటిసారి కలిసి దాదాపు 45 ఏళ్ల య్యింది. అది 1982. వేసవి కాలం చివరి రోజులు. నిషా, నేను పెళ్లి చేసుకోబోతున్నాం. మా రెండు జీవితాలు ఒక్కటి కాబో తున్నాయి. తను క్యాథలిక్కు. అన్ని లాంఛ నాలతో చర్చిలో పెళ్లి జరగాలని ఆమె కోరిక. నాకూ అభ్యంతరం లేదు. కాకుంటే చర్చి మతాధికారిని మూడుసార్లు కలిసి పెళ్లి ట్యూషన్ చెప్పించుకోడం ఒక్కటే నాకు నచ్చలేదు. అలా చేస్తేనే నిషాకు నాన్–క్రిష్టియన్ అయిన నాతో పెళ్లి జరుగుతుంది. ఈశాన్య ఇంగ్లాండ్‌లోని నార్తంబర్లాండ్ ఎవెన్యూలోని సెయింట్ మేరీ మాగ్దలీన్ చర్చి నిబంధన అలా ఉంది. కాబట్టి ఒప్పుకోక తప్పలేదు. సెప్టెంబరు నెలలో ఒక శనివారం నేను, నిషా కలిసి ఫాదర్ టెర్రీ దగ్గరకు వెళ్లాం. అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం 6 గంటలు. ఆయన డెస్క్ వెనుక కూర్చుని ఉన్నారు. గది చివరన ఎదురుగా ఉన్న పాత లెదర్ సోఫా మీద మేం కూర్చున్నాం. ముక్కు మీదకు జారిన కళ్లజోడు పైనుంచి ఆయన మమ్మల్ని నిశితంగా గమనిస్తున్నారు. బయట వేడిగా ఉన్నా ఆ గదిలో వాతావరణం ఎందుకో బాగా చల్లగా ఉంది. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ ఫాదర్ చేసిన ఆఫర్ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘ మీ ఇద్దరి సంగతి నాకు తెలియదు. నాకు మాత్రం షెర్రీ వైన్ చాలా ఇష్టం’’ అన్నాడాయన. ఆయన ఇచ్చిన టియో పెపే నా ఫేవరైట్ బ్రాండ్. ఫాదర్ టెర్రీకి ఎన్నో విషయాల్లో మంచి పరి జ్ఞానం ఉంది. వివేచనశీలి. కాసేపట్లోనే మేం బాగా దగ్గరయ్యాం. యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, సల్మాన్ రష్దీ ‘మిడ్నైట్స్ చిల్డ్రెన్’ నవల... మా మధ్య చర్చకు వచ్చాయి. విశేష మేమిటంటే... మా పెళ్లి ఎలా జరగాలి, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతం స్వీకరించాల్సి ఉంటుంది వంటి అసలు విషయాలు మినహా అన్నీ చర్చించాం. ఫాదర్ టెర్రీ జారిపోతున్న కళ్ల జోడును వెనక్కు ఎగదోసుకుంటూ సంభాషణను చక్కగా ఎంజాయ్ చేశారు. గంట సేపు ఇట్టే గడచిపోయింది. వచ్చే వారం మళ్లీ కలవాలనుకున్నాం. ఇక మేము సెలవు తీసుకుని అలా తలుపు వద్దకు వెళ్లామో లేదో ఫాదర్ మమ్మల్ని ఆపేశారు. ‘మీరు విడివిడిగా ఎందుకు ఉంటున్నారు?’ అంటూ బాంబు లాంటి ఒక ప్రశ్న కూల్‌గా అడిగారు. అలా అడుగుతున్నప్పుడు, ఆయన గుండ్రటి ముఖం మీద చిరుదరహాసం మెరిసింది. దాంతో మా ముఖాలు లిప్తపాటు రక్తవిహీనం అయ్యాయి. నోట మాట రాలేదు. వాస్తవం ఏమిటంటే, మేం అప్పటికే సహజీవనం చేస్తున్నాం. కానీ ఆ విషయం దాచిపెట్టి, ఫాదర్ టెర్రీకి మేము వేరు వేరు చోట్ల ఉంటు న్నట్లు అడ్రస్‌లు ఇచ్చాం. ఆయన ఆ విషయం పసిగట్టారు. అయినా అదేమంత పెద్ద విషయం కాదులే అంటూ మమ్మల్ని ఆ ఇరకాటం నుంచి బయట పడేశారు. అలా ఉండేది ఆయన సరళి. ఫాదర్ టెర్రీ మాకు త్వరలోనే ఆప్తమిత్రుడయ్యారు. మా పెళ్లికి రెండు రోజుల ముందు ఒక రిహార్సల్ జరిగింది. పెళ్లిలో భగవద్గీత నుంచి ఏవైనా రెండు మంచి మాటలు చదవాలని ఆ సందర్భంగా ఆయన సూచించారు. ఆ ఎంపిక బాధ్యత నా మీదే పెట్టారు. తీరా ఆ సమయం వచ్చేసరికి నేను చేతులెత్తేశాను. ‘మరేం ఫర్లేదులే, ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించి వేరొకటి రెడీగా పెట్టుకున్నా’ అంటూ నవ్వి మృదువుగా నా వీపు చరిచారు. ఆయన ఎంపిక చేసుకున్న పేరా ఖలీల్ జిబ్రాన్ ‘ప్రాఫెట్’ లోనిది.పెళ్లి సందర్భంగా ఫాదర్ టెర్రీ చేసిన ఉపదేశం అందరినీ ఆకట్టుకుంది. నరకం, దేవుడు, దేవుడి మంచితనం... వంటి పెద్ద మాటలను పక్కన పెట్టారు. ఐ లవ్ యూ అనే ‘మూడే మూడు చిన్న మాటలు’ చెప్పారు.‘నేను, నువ్వు అనే భేదాన్ని ప్రేమ చెరిపేస్తుంది... అలాగే అది ఆ రెంటినీ విడదీస్తుంది కూడా! కరణ్, నిషా... మీరు ఈ సత్యం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇద్దరు విభిన్న వ్యక్తులు అనే వాస్తవాన్ని మర్చి పోయిన రోజు ఆ బంధం కూడా వేర్పడిపోతుంది.’’ఈ ప్రవచనం ఆర్భాటం లేకుండా ఇష్టాగోష్ఠిలా సాగింది. స్నేహ పూర్వకమైన ఆయన సందేశం మర్చిపోలేనిది. పాతికేళ్లుగా అది నా జ్ఞాపకాల్లో మసకబారకుండా నిలిచిపోయింది.ఆరేళ్ల తర్వాత... నిషా తన ఆఖరు ఘడియల్లో లైఫ్ సపోర్ట్ మీద ఉన్నప్పుడు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు మత కర్మలు నిర్వహించారు. అంతే కాకుండా, మా అమ్మను కూడా నిషా చెవిలో హిందూ పుణ్యవచనాలు వినిపించవల్సిందిగా కోరారు. చివరకు నిషా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్న క్షణాల్లో కూడా ఫాదర్ టెర్రీ నా పక్కనే ఉన్నారు. నాకు తెలిసిన ఒకే ఒక క్రైస్తవ మతాచార్యుడు టెర్రీ గిల్ఫెడర్! ఆయన అసాధారణమైన గొప్ప వ్యక్తి. క్రైస్తవుల మీద, ముస్లిముల మీద దాడులు జరిగాయన్న వార్తలు చదివిన ప్రతిసారీ నేను ఆయనను తలచుకుంటాను. గాయపడిన హృదయాలకు సాంత్వన చేకూర్చేందుకు ఫాదర్ టెర్రీ వద్ద ఎప్పుడూ కొన్ని మాటల దివ్యౌ షధాలు ఉండి తీరుతాయి. ఆయన ఆఫర్ చేసే షెర్రీ వారికి ఉపక రిస్తుంది.ఫాదర్ టెర్రీలు ప్రతి మతంలోనూ ఉంటారు. దైవమే పరమావధిగా భావించేవారు సాటి మానవులను ప్రేమపూర్వకంగా అర్థం చేసుకోగలరు. మనకు అలాంటి వారి అవసరం నేడుఎంతగానో ఉంది. అయినా వారెవరూ ఎందుకు నోరు మెదపడం లేదు?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
హిట్లర్‌ను మానవుడన్న మహాత్ముడు!
ఇప్పుడు రాస్తున్న దానిని గతవారమే నేను ఈ కాల మ్లో రాసి ఉంటే, అప్పు డది మహాత్మాగాంధీ వర్ధంతి రోజుకు మరింత సంద ర్భోచితంగా ఉండి ఉండే దని అనిపించవచ్చు. అదే కారణంతో అలా నేను రాసి ఉంటే సమయం,సందర్భం చూసి, రెచ్చకొట్టడానికి నేను రాసిన ట్లుగా ఉండేది. లేదంటే, మనోభావాలను దెబ్బ తీసినట్లయ్యేది. కాబట్టి, ఈరోజు నేను లేవనెత్తు తున్న విషయాలపై మీ ప్రతిస్పందన భావావేశా లకు లోను కాని విధంగా ఉంటుందని ఆశిస్తాను. గాంధీ మరణించిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడైనా – ఆయనకున్నటువంటి కొన్ని వివాదాస్పద, లేదా విరుద్ధమైన, అదీ కాకుంటే ఆమోదయోగ్యం కానివైన అభిప్రాయాలను మనం ఎలా పరిగణించాలన్న దానిని పరిశీలించవలసిన అవసరం ఉంది. 2024లో అవి మనకు దిగ్భ్రాంతిని గొల్పవచ్చు. 1940ల లోనైనా వాటికి ఇప్పటి కన్నా ఎక్కువగానే సమ్మతి లభించి ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. భారత స్వాతంత్య్రం, దేశ విభజనలపై అలెక్స్ వాన్ తంజల్మాన్ (బ్రిటిష్ చరిత్రకారిణి) పుస్తకం ‘ఇండియన్ సమ్మర్’ (2007)ను జాగ్ర త్తగా చదివినప్పుడు–రెండో ప్రపంచ యుద్ధం, హిట్లర్, ఆనాటి మారణహోమం పైన గాంధీజీ దృష్టికోణం ఏమిటో తెలిసి నిర్ఘాంతపోయాను. గాంధీ శాంతి కాముకులని, అహింస పట్ల ఆయన నిబద్ధత తిరుగులేనిది, కొదవలేనిదని మనకు తెలిసిందే. ఆ నిబద్ధతే ఆయనను... హిట్లర్, ముస్సోలినీల దురాక్రమణ ప్రయత్నాలను అడ్డుకోవద్దని బ్రిటన్‌కు సలహా ఇచ్చేంతవరకు తీసుకెళ్లిందా! ‘‘వారిని మీ అందమైన దీవిని జయించనివ్వండి. పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని చంపేయటానికి మీకై మీరు వారిని అనుమతించండి. అయితే వారికి విధేయంగా ఉండటానికి మాత్రం నిరాకరించండి’’ అని చెప్పారాయన. 1962లో ఇండియాపై చైనా దాడి, లేదా ఇండి యాపై పాకిస్తాన్ పదే పదే చేస్తుండే దాడుల విషయంలో కూడా గాంధీ అలాగే స్పందించే వారా? ఏమైనా మహాత్ముడు భీతికొల్పేంత స్థిర చిత్తుడు అయుండాలి కానీ కపటి మాత్రం కాదు. మరీ అధ్వాన్నం... హిట్లర్ దుష్టుడు అంటే గాంధీకి నమ్మబుద్ధి కాకపోవటం! ‘‘గౌరవనీయు లైన హిట్లర్‌ను – ఆయన్ని చిత్రీకరించినంత – చెడ్డ వారిగా నేను పరిగణించను’’ అని 1940లో గాంధీ రాశారు. ‘‘ఎక్కువ రక్తపాతం లేకుండా విజయాలు సాధించే అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న ట్లుగా ఆయన నాకు కనిపిస్తారు’’ అన్నారు. ‘‘భవి ష్యత్ జర్మన్లు శ్రీ హిట్లర్‌ను మేధావిగా, ధీశాలిగా, సాటిలేని కార్యాచరణశీలిగా, మరెన్నో విధాలుగా గౌరవిస్తారు’’ అని గాంధీ భావించారు. దీనికన్నా కూడా, మాటల్లో వివరించలేనిది ఏమిటంటే – యూదుల పట్ల నాజీల అమానవీయ ప్రవర్తనపై గాంధీ ప్రతిస్పందన. లూయీ ఫిషర్ (అమెరికన్ జర్నలిస్ట్) రాసిన మహాత్ముడి జీవిత కథను ఉటంకిస్తూ, వాన్ తంజల్ మాన్... యూదులు సానుకూలమైన ప్రతిఘటనను మాత్రమే నాజీలకు అందించాలనీ, అవసరం అయితే తమ జీవితాలను సైతం త్యాగం చేయాలనీ గాంధీ సలహా ఇచ్చారని వెల్లడించారు. అడాల్ఫ్ హిట్లర్ కోసం ప్రార్థించమని కూడా ఆయన వారిని కోరారట. ‘‘కనీసం ఒక యూదుడు ఇలా చేసినా అతడు తన ఆత్మగౌరవాన్ని కాపాడు కున్నట్లేనని, అందువల్ల ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాడని, ఆ మంచితనం అంటువ్యాధిలా విస్త రించి మొత్తం యూదు జాతినే కాపాడుతుందని, మానవాళికి సుసంపన్నమైన ఒక గొప్ప వారస త్వాన్ని వదిలివెళుతుందని గాంధీ అన్నారు’’ అని లూయీ ఫిషర్ రాసినట్లు వాన్ పేర్కొన్నారు. యూదుల నిర్బంధ శిబిరాలను కనుగొన్నాక కూడా, వాటిల్లో జరుగుతున్న అతి భయానక దారుణాలు ప్రపంచం దృష్టికి వచ్చాక కూడా లూయీ ఫిషర్‌తో గాంధీ ఇలా అన్నారు: ‘‘హిట్లర్ 50 లక్షల మంది యూదులను చంపాడు. ఇది మనకాలపు అతి పెద్ద నేరం. కానీ యూదులు తమకై తాము కసాయి కత్తికి తమను సమర్పించుకుని ఉండాల్సింది. తమను తాము శిఖరం అంచులపై నుండి సముద్రంలోకి తోసుకుని ఉండాల్సింది...’’హింసపై పూర్తి వ్యతిరేకత, అహింస పట్ల అచంచలమైన నిబద్ధత కలిగి ఉన్న కారణంగానే గాంధీ అలా అని ఉంటారనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే అంతవరకే అది ఏకైక ఆమోదయోగ్యమైన ప్రతిస్పందన. హిట్లర్‌ను ఎది రించవద్దని, హిట్లర్ కోసం ప్రార్థించమని, తమకు తాము ఆత్మార్పణం చేసుకోవాలని ఆయన యూదులకు చెప్పటం మాత్రం విడ్డూరం. కనికరం లేకపోవటం, కించపరచటం, క్రూరత్వం.1984లో సిక్కులకు, 2002లో ముస్లింలకు, నేటి ఆదివాసీలకు గాంధీ ఇచ్చే సలహా కూడా అదే విధంగా ఉండేదా? బహుశా... ఉండేది! మళ్లీ అడి గినా ఇదే సమాధానం. బ్రహ్మచర్యంతో గాంధీ చేసిన ప్రయోగాల మాదిరిగా కాకుండా... యుద్ధం మీద, హిట్లర్ మీద, మారణహోమం మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు వ్యక్తిగత వ్యామోహాలు, బలహీనతల స్థాయికి మించినవి. ఆయన ఒకవేళ దేశాన్ని పరిపాలించి ఉంటే అవి విధానాలుగా మారిఉండేవి. అందుకే వాటిని చర్చించి, పరిష్కరించాల్సి ఉంది. అంతిమంగా, వాటికి ఆమోదయోగ్యమైన వివరణ లభించకపోతే వాటిని విమర్శించాలి. తిప్పికొట్టాలి. ఇలా అంటున్నందుకు నేను చిక్కుల్లో పడతాననే మాటనైతే నేను కాదనను.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మన రాజ్యాంగం బలమైనదేనా?
మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నింటి రాజ్యాంగాల సగటు ఆయుష్షు 19 ఏళ్లు మాత్రమేనని! భారతదేశం మాత్రం 75 ఏళ్ల పాటు తన రాజ్యాంగాన్ని కాపాడుకుంది. దీనికి సంతోషపడదాం. గర్వంగా ఫీల్ అవుదాం. దేశ చరిత్రలోనే కీలకమైన ఈ ఘట్టాన్ని గత వారమే చూశాం. అయితే, సమీక్షకు తగిన సమయం కూడా ఇదే! డెబ్ఫై ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత రాజ్యాంగం ఎదుర్కొన్న సవాళ్లు, ప్రశ్నలేమిటన్నది చూద్దాం.మన రాజ్యాంగం వలసవాదులదని చాలామంది మేధావులు విమర్శిస్తూంటారు. భారతీయ మూలాలు ఉన్నది కాదని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానిస్తూ ఉండేది. అలాంటప్పుడు ఇది ఏ విధంగా మనకు మంచిది?ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించిందనేది ఒక సమాధానం. అలాగే ఏకకాలంలో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించిన రాజ్యాంగం కూడా మనదే. కానీ దీనివల్ల అందరూ సమానంగా లాభ పడ్డారా? లేక... ముస్లింలు, ఆదివాసీలు, దళిత మహిళలు లాభ పడలేదా? డెబ్భై ఏళ్ల ప్రయాణంలో మన రాజ్యాంగం ఇప్పటివరకూ 106 సార్లు మార్పులకు గురైంది. ఇది మన శక్తికి ప్రతీకా? ఎందుకంటే, అవసరమైనప్పుడు తగు విధంగా మార్పులు, చేర్పులు చేసుకునే వీలుతో రాజ్యాంగం ఉంది. లేదా ఇది బలహీనతా? అగ్రరాజ్యం అమెరికాలో 1789 నుంచి జరిగిన సవరణలు కేవలం 27 మాత్రమే.శాసనాలు చేసే ప్రజా ప్రతినిధుల వ్యవస్థ కంటే కార్యనిర్వాహక వర్గాన్ని రాజ్యాంగం ఎక్కువ బలోపేతం చేసిందని చెబుతారు. అసెంబ్లీ స్పీకర్ల పనితీరు, రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఈ పరి స్థితిని మరింత దిగజార్చాయి. ఫలితంగా ఎంపీలు పార్టీ నాయకత్వా నికి సబార్డినేట్లుగా మారిపోయారు. స్పీకర్లకు హౌస్ ఆఫ్ కామన్ ్స (యూకే) మాదిరిగా వారిపై అధికారం ఏదీ ఉండదు. ఈ విమర్శను ఇప్పటివరకూ ఎవరూ సవాలు చేయలేదు కూడా! అయితే దీని వెనుక ఏముందన్నది నిశితంగా పరిశీలించాల్సిన అంశం. ‘‘భారతీయ రాజ్యాంగం అడ్డుగోడలు నిర్మించకుండా... కార్యనిర్వాహక వర్గానికి ఎక్కువ అధికారాలు ఇచ్చింది. అంతేకాకుండా ఈ వర్గం తన అధికారాన్ని పూర్తిస్థాయిలో చలాయిస్తుందని విశ్వసించింది’’ అంటారు గౌతమ్ భాటియా. పాలకులందరూ మంచివారనీ, రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారా? ఊహూ, అలా అనుకోలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఒక ఉదాహరణ – ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి. ఇది రాజ్యాంగాన్ని సుప్తచేతనావస్థలో పెట్టడం వల్లనో, రాజ్యాంగా నికి అతీతంగా పోవడం వల్లనో అమలు కాలేదు. దాంట్లో భాగమైన వ్యవస్థలతోనే జరిగింది. ఇది మన రాజ్యాంగం బలహీనత లేదా లోపాన్ని ఎత్తిచూపింది. రాజ్యాంగ పరమైన నైతికత లేని విషయాన్ని ఎమర్జెన్సీ పరిస్థితి ఎత్తి చూపిందని చెప్పవచ్చు. ఈ నైతికత అనేది రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు పనిచేస్తాయా, లేదా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు తరచూ ఈ రాజ్యాంగ నైతికతను తప్పుతుంటారని మనకు తెలుసు. కానీ వాటిపై వ్యాఖ్యా నించడం కంటే ఎక్కువేమీ చేయలేము – ఈ అంశాలపై మనఆందోళన, విమర్శ ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ! రాజ్యాంగంలో ఉన్న మరో లోటు ఇదేనా?రాజ్యాంగం సమాఖ్య నిర్మాణానికి ఏర్పాటు చేసింది. కానీ ఆర్థికాంశాలతో పాటు పరిపాలనకు సంబంధించిన విషయాల్లోనూ రాష్ట్రాలపై పెత్తనం చలాయించే అధికారం కేంద్రానికి కట్టబెట్టింది. సమాఖ్య స్వరూపాన్ని మార్చే అధికారం, శక్తి కూడా కేంద్రానిదే. స్వాతంత్య్రం లభించిన సమయంలో దేశం బలహీనంగా, ముక్కలు ముక్కలుగా విడిపోయింది కాబట్టి... ఆ పరిస్థితుల్లో ఇలాంటి ఏర్పాట్లు చేశారని అనుకున్నా మూడు సిల్వర్ జూబ్లీల కాలం గడచిన ఈ తరుణంలోనైనా మార్పులు చేయడం అనవసరమా? భారతీయ పౌరులకు రాజ్యాంగం బోలెడన్ని ప్రాథమిక హక్కు లను కల్పించింది. అయితే భావ ప్రకటన, వ్యక్తీకరణపై పూర్తిస్థాయి స్వాతంత్య్రం మాత్రం లేకుండా పోయింది. నిజానికి ఈ ‘ఫ్రీ స్పీచ్’ను నైతికత, పరువునష్టం వంటి రెండు సందర్భాల్లో మాత్రమే నియంత్రించాల్సి ఉంటుంది. మహా అయితే... విదేశాలతో మన సంబంధాలు దెబ్బతినే పరిస్థితులకూ పొడిగించవచ్చు. కానీ... మనకున్న నియంత్రణలు చాలా ఎక్కువగా లేవూ?1973లో రాజ్యాంగంపు మౌలిక స్వరూపాన్ని కాపాడే లక్ష్యంతో సుప్రీంకోర్టు కొన్ని విధి విధానాలను సిద్ధం చేసింది. ఇదో చారిత్రక నిర్ణయం. అయితే దాదాపుగా అదే సమయంలో జబల్పూర్ అడిష నల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎమర్జెన్సీ విషయంలో శాసనకర్తల ఒత్తిడికి లొంగిపోయారు. అయోధ్య విషయంలోనూ ఇదే జరిగిందన్నది చాలామంది అభిప్రాయం. అలాగే జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న రాష్ట్ర హోదాను కూడా రాజ్యాంగం కాపాడలేకపోయింది. కాబట్టి... రాజ్యాంగ సంరక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు తమ నిర్ణయాల్లో అసందిగ్ధతతో వ్యవహరిస్తున్నాయి. లేదంటే అవసరమైనంత చేయడం లేదు. రాజ్యాంగం మనకు ఎన్నికల కమిషన్ , కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్), ఇన్ఫర్మేషన్ కమిషన్ వంటి ఎన్నో వ్యవస్థలను కల్పించింది. కానీ... ఇవి పాలకవర్గానికి అతీతంగా స్వతంత్రంగా పని చేసేలా మాత్రం చేయలేకపోయింది. ఆ యా సంస్థల ఉన్నతాధి కారుల నియామకాల విషయంలో ఇది మరింత సత్యమని చాలా మంది చెబుతారు. చివరగా... రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన రాజకీయ నేతలు, సంస్థల అధినేతలు ఆ పని ఎంత వరకూ సక్రమంగా నిర్వర్తించారు? అలాగే రాజ్యాంగ సంరక్షణ బాధ్యతను న్యాయమూర్తులు ఎంత సమర్థంగా నిర్వహించారు? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్‌ను ఇదే ప్రశ్న అడిగితే... ‘‘భారత్‌కు మంచి రాజ్యాంగం ఉంది. కీలక సందర్భాల్లో రాజకీయ నేతలు, న్యాయమూర్తులు దీని ప్రతిష్ఠను దిగజార్చారు. పాలకవర్గం మాత్రమే కాదు... పార్లమెంటు కూడా ఇందులో భాగస్వామే’’ అన్నారు. ఇందులో అంగీకరించక పోయేందుకు ఏమీ లేదన్నది నా అభిప్రాయం!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆత్మీయతను పంచిన బర్మా హౌజ్!
దేశ రాజకీయాలను అనుసరించేవాళ్లకు న్యూఢిల్లీలోని ‘24, అక్బర్ రోడ్’ అనగానే అది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అని గుర్తొస్తుంది.అయితే దాదాపు ఐదు దశాబ్దాల పాటు అక్కడ కార్యకలాపాలు నెరిపిన అనంతరం ఆ పార్టీ అక్కడినుంచి కొత్త చిరునామాకు మారడంతో ఇది వార్తల్లో నిలిచింది. కానీ దానికంటే ముందు ఆ చిరునామాను ‘బర్మా హౌజ్’ అనేవారని చాలామందికి తెలియదు. అప్పుడు అది భారత్‌లో బర్మా (మయన్మార్) రాయబారి ఇల్లుగా ఉండేది. ఆమె భర్త సాక్షాత్తూ బర్మా జాతిపిత; ఆమె కూతురు తర్వాత్తర్వాత ఆ దేశ గొప్ప నాయకురాలిగా ఎదిగిన ఆంగ్ సూన్ సూ కీ. అందుకే ఆ ఇంట్లో బర్మా వాతావరణం, వాళ్ల ఆత్మీయతలు వెల్లివిరిసేవి.న్యూఢిల్లీలోని ‘24, అక్బర్ రోడ్’ చిరునామా గురించి మీకు తెలుసా? సుమారుగా యాభై ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉండేది. ఈ మధ్యే మారిపోయిందనుకోండి! అంతకంటే ముందు దీని పేరు ‘బర్మా హౌజ్’. బర్మా (తర్వాత మయన్మార్‌గా పేరు మారింది) దేశపు రాయబారి నివాస స్థానం అది. ‘24, అక్బర్ రోడ్’ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం కాక మునుపు ఈ ఇంట్లో ‘డా ఖిన్ కీ’ ఉండే వారు. ఆమె బర్మా స్వాతంత్య్ర సమర యోధుడు ఆంగ్ సాన్ (బర్మా జాతిపితగా పిలుస్తారు) పత్ని. భర్త హత్యకు గురైన తరువాత ఆ దేశపు మంత్రిగానూ ఆమె పనిచేశారు. 1960లో ఇండియాకు బర్మా రాయబారిగా నియమితులయ్యారు. ఢిల్లీకి వచ్చి, ఏడేళ్ల పాటు ‘24, అక్బర్ రోడ్’లో నివసించారు. డా ఖిన్ కీ నా తల్లిదండ్రులకు స్నేహితురాలైతే... ఆమె కూతురు ఆంగ్ సాన్ సూ కీ (మయన్మార్ ప్రతిపక్ష నేత; నోబెల్ శాంతి బహు మతి గ్రహీత) మా అక్క కిరణ్‌కు ఫ్రెండ్. లేడీ శ్రీరామ్ కాలేజీలో ఆంగ్ సాన్ సూ కీ, కిరణ్ కలిసి చదువుకున్నారు. 1964లో మా అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగ రీత్యా కాబూల్(అఫ్గానిస్తాన్ రాజధాని)కి వెళ్లాల్సి వచ్చినప్పుడు, తన చివరి ఏడాది చదువు ఇంకా మిగిలి ఉండటంతో కిరణ్ ఆరు నెలల పాటు ‘24, అక్బర్ రోడ్’లో ఉండింది. డా ఖిన్ కీ పెద్ద పొడగరి ఏమీ కాదు. పైగా కొంచెం లావుగా ఉండేది. బర్మీస్ మహిళల్లో అధికుల మాదిరి లుంగీ కట్టుకునేది. వెంట్రుకలన్నీ పూలతో అలంకరించిన బన్‌లో ఒద్దికగా ఇమిడి పోయేవి. ఆమె ముఖంలో ఒక రకమైన దయ వ్యక్తమయ్యేది. ఎల్ల ప్పుడూ చిరునవ్వుతో కళకళలాడే మోము. మృదుభాషి!మొదటిసారి ఆమెను కలిసినప్పుడు నాకు ఆరేళ్లు ఉంటా యేమో! కొడుకు దగ్గర లేని కారణంగా ఆమె నన్ను తల్లిలా చూసుకునేది. డైనింగ్ రూమ్‌లో బోలెడంత ‘ఖో సూయి’ (చికెన్ నూడుల్స్) తినడం ఇప్పటికీ గుర్తుంది. అయితే నా ఫేవరెట్ మాత్రం ‘బ్లాక్ రైస్ పుడ్డింగ్’. బర్మీస్ ఇళ్లల్లో దీన్ని బాగా చేస్తారు. మిగతావాళ్ల మాటేమో కానీ నాకు మాత్రం చాలా ఇష్టమీ వంటకం. పిసరంత వదలకుండా తినే వాడినేమో... మిగిలిన వాళ్లు రుచి చూసేందుకు కూడా ఉండేది కాదనుకుంటా! అప్పట్లో చాలా బొద్దుగా ఉండేవాడిని. అందుకే సూ కీ నన్ను ‘రోలీ – పోలీ’ అని ఆటపట్టిస్తూండేది. చాలామంది దౌత్యవేత్తల మాదిరిగానే బర్మా రాయబారికి మెర్సిడెస్ కారు ఉండేది. వాళ్ల డ్రైవర్ పేరు ‘విల్సన్ ’. వారాంతాల్లో కుతుబ్ మీనార్ దాటుకుని అవతల ఉండే బౌద్ధారామాలకు ఆమె వెళ్లేది. అక్కడి భిక్షువులకు ఆహారం అందించేది. చాలాసార్లు నేనూ ఆమెతో వెళ్లేవాడిని. ఎప్పుడు మళ్లీ ‘24, అక్బర్ రోడ్’కు వస్తామా అని ఎదురుచూసేవాడిని. ఎందుకంటే... తిరిగి వచ్చిన తరువాతే భోజ నాల వడ్డన జరిగేది.ఆంగ్ సాన్ సూ కీ సుమారు ఏడేళ్లు భారత్‌లో ఉంది. ముందు జీసస్ అండ్ మేరీ కాన్వెంట్లో, ఆ తరువాత లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో చదివింది. యుక్త వయసులో ఉండగానే రాజకీయాల్లో చేరాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఎప్పటికైనా ఉన్నత స్థానానికి చేరుకో గలనన్న నమ్మకం కూడా తనలో ఉండేది. సుమారు 18 ఏళ్ల వయసు ఉండేదేమో అప్పుడు. ఒకరోజు కిరణ్ పెన్సిల్ డ్రాయింగ్ గీసింది. దాని కింద, ‘కిరణ్ థాపర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బర్మా రావొచ్చు’అని రాసింది.దశాబ్దాల తరువాత నేను ‘డా ఖిన్ కీ’ని లండన్ లో కలిశాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూతురు ఆంగ్ సాన్ సూ కీతో కలిసి నివసిస్తూండేది. అప్పుడామె వయస్సు ఎనభైల్లో ఉంది. నేను ముప్ఫైలలో ఉన్నాను. నన్ను చూడగానే... అనారోగ్యం, తన వయసు ఏదీ గుర్తు రాలేదు. బోసినవ్వుతో భళ్లున నవ్వుతూ, ‘వీడు సన్న బడ్డాడు’ అంది. కళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. నవ్వుతో ముఖమంతా నిండిపోయింది. ‘‘ఇంత సన్నబడతాడని అనుకోనే లేదు’’ అంది. ‘‘ఖో–సూయి అంటే ఇప్పటికీ బాగా ఇష్టమట. వచ్చి నప్పుడల్లా కావాలని అడుగుతూంటాడు’’ అని చెప్పింది ఆంగ్ సాన్ సూ కీ. ఆక్స్‌ఫర్డ్‌లో ఉండగా సూ కీ ఎప్పుడూ బ్లాక్ రైస్ పుడ్డింగ్ చేసేది కాదు. అందుకేనేమో... నాకు అది ఎలా ఉంటుందో లీలగా గుర్తుంది కానీ, రుచి ఎలా ఉంటుందన్నది మాత్రం గుర్తు లేకుండా పోయింది. కొబ్బరి తురుముతో కప్పిన నల్ల బియ్యంతో చేసే తీపి పదార్థం అది.నేను మళ్లీ 2015లో రంగూన్ లో ఆంగ్ సాన్ సూ కీని కలిశాను. ‘24, అక్బర్ రోడ్’ నాటి ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదని చూడగానే అర్థమైంది. ‘‘నా మరో ఇంటికి స్వాగతం. 24, అక్బర్ రోడ్ గురించి నీకు తెలుసు కదా... ఇది అమ్మ మరో ఇల్లు’’ అంది. ఢిల్లీ ఇంట్లో ఓ భారీ పియానో ఉండేది. సూ కీ పియానో వాయించేది కూడా! గత వారం ‘24, అక్బర్ రోడ్’కు సంబంధించి పత్రికలు బోలెడన్ని వార్తలు రాశాయి. అప్పుడే నాకూ గుర్తుకొచ్చింది... ఆ ఇంటి గురించి నాకు ముందే తెలుసు అని! రాజకీయ పార్టీ కేంద్రం కాక మునుపు ఆ ఇంటి పొడవాటి నడవాలో ప్రేమ, ఆప్యాయతలు అల్లుకునిపోయి ఉండేవి. అది లూట్యెన్స్ ఢిల్లీలో భాగమని అస్సలు అనిపించేది కాదు. అది ‘డా ఖిన్ కీ’ ఇల్లు అన్నది మాత్రమే నాకు లెక్క. ఎప్పుడైనా వెళ్లగలిగే... ప్రేమ ఆప్యాయతలు అందుకోగల ఇల్లు!డా ఖిన్ కీ, ఆంగ్ సాన్ సూ కీ భారత్‌లో గడిపిన రోజులు చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనూ సూ కీ తరచూ ఆ రోజులను గుర్తు చేసుకునేది. దీన్ని బట్టే వాళ్లు ‘24, అక్బర్ రోడ్’లో చాలా సంతోషంగా ఉండేవారు అనిపించేది. ఆ భవనం గోడలిప్పుడు మాట్లాడగలిగితే ఆ రోజుల ఊసులు ఇంకెన్ని చెప్పేవో... ప్చ్!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రపంచానికి ఏం రాసి పెట్టి ఉంది?
ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయిననాటికీ, తిరిగి ఇప్పుడు నాలుగేళ్ల విరామంతో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నాటికీ ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి. సవాళ్లు, చిక్కుముడులు, అడ్డంకులు, అనివార్యతలు ఆయన ముందుకొచ్చి నిలబడ్డాయి. అధ్యక్షుడిగా గెలిచీ గెలవగానే ఆయన చేసిన వివాదాస్పద నియామకాలలో అవసరమైతే మార్పులు చేయాలి. యుద్ధాలు చేసుకుంటున్న దేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహించాలి. వందల మిలియన్ల డాలర్లను తన గెలుపు కోసం ఖర్చుపెట్టిన ఎలాన్ మస్క్‌ను సంతృప్తిపరచాలి. ఆయనే హామీ ఇచ్చిన విధంగా అమెరికాను ‘మళ్లీ గొప్ప దేశంగా’ నిలబెట్టాలి. ఇక భారత్‌తో ఆయన ఎలా ఉండబోతారన్నది మన వైపు నుండి ఉత్పన్నం అయ్యే ప్రశ్న.కొన్నిసార్లు భవిష్యత్తును అర్థం చేసుకోవటానికి ఉత్తమమైన మార్గం, దాని గురించిన ప్రశ్నలను లేవనెత్తటమే! ఆ ప్రశ్నలకు మీకు సమాధానాలు లభించక పోవచ్చు; కనీసం ఆందోళన కలిగించగల అవకాశం ఉన్న అంశాలనైనా మీరు గుర్తిస్తారు. అది మిమ్మల్ని, భవిష్యత్తు ముడి విప్పబోయే వాటికి సంసిద్ధం చేస్తుంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ – ఒక పదవీకాల విరామంతో – రెండోసారి పదవిని చేపడుతున్నారు. ఈ తరుణంలో... మున్ముందరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న సందేహాలు సహజం. ఆ దిశగా కొన్ని ప్రశ్నలను నా వైపు నుంచి వేయనివ్వండి. ట్రంప్‌తో సన్నిహితంగా పని చేసిన ఇద్దరు వ్యక్తులు... మాజీ ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’ జాన్ కెల్లీ, మాజీ ‘డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్’ ఆంథోనీ స్కారమూచీ ఆయన్ని ఫాసిస్ట్ (తీవ్రమైన నియంతృత్వ వైఖరి కలిగిన జాతీయవాద పాలకుడు) అనేవారు. ఆ మాట నిజమే నని భవిష్యత్తు రుజువు చేయబోతోందా?అధ్యక్షుడిగా గెలవగానే ట్రంప్ చేపట్టిన అనేక నియామకాలు వివాదాస్పదం అయ్యాయి. రక్షణ మంత్రిగా పీట్ హెగ్సేత్, ఆరోగ్య మంత్రిగా రాబర్డ్ కెన్నెడీ, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్ పటేల్ (కశ్యప్ పటేల్), ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా తులసీ గబ్బార్డ్ నియామకాలు యథాతథంగా కొనసాగుతాయా, లేక మార్పులు జరుగుతాయా?ఏమైనా, రెండు నియామకాలు మాత్రం ప్రశంసనీయార్హం అయ్యాయి. విదేశాంగ మంత్రిగా మార్కో రుబియో, జాతీయ భద్రతా సలహాదారుగా మైఖేల్ వాల్ట్జ్ – అయితే ఆ ఇద్దరూ నిజంగానే ట్రంప్ విదేశాంగ విధానాన్ని నిష్కర్షగా అమలు పరచ గలుగుతారా?ఇక పారిశ్రామికవేత్త, సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది బహుశా, మరింత ముఖ్యమైన ప్రశ్న. ట్రంప్‌కు ఆయన అత్యంత సన్నిహితులుగా ఉన్నారన్నది పైకే కనిపిస్తోంది. పైగా ట్రంప్‌ను అధ్యక్షుడిగా గెలిపించటం కోసం ఆయన 27 కోట్ల డాలర్లను ఖర్చు చేశారు. అది ఆయన్ను వైట్ హౌస్‌లో రాజ్యాంగేతర అధికార శక్తిగా నిలబెట్టే ప్రమాదం ఉంటుందా?బ్రిటన్ ప్రధాని పదవి నుంచి కీర్ స్టార్మర్ను తప్పించేందుకు ఎలాన్ మస్క్ చర్చలు జరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. స్టార్మర్ను ఆయన ‘ఏమాత్రం తగని మనిషి’ అన్నారు. జర్మనీ ఎన్నికల్లో కూడా వేలు పెట్టారు. జర్మనీ చాన్స్‌లర్ షోల్జ్‌ను ‘బుద్ధిహీనుడు’ అన్నారు. ట్రంప్ అశీస్సులతోనే ఇదంతా జరిగి ఉంటుందా?అన్ని దిగుమతులపై 20 శాతం సుంకాన్ని, చైనా ఎగుమతుల పైనైతే మరింత అత్యధిక సుంకాన్ని విధించే ఆలోచన ట్రంప్ మదిలో ఉన్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. కెనడా, మెక్సికోలపై 25 శాతం వరకు సుంకం ఉంటుందని కూడా ఆయన బెదిరించారు. ఇది మనల్ని ఇబ్బందికరమైన వాణిజ్య యుద్ధంలోకి మళ్లిస్తుందా?ఈ విషయంలో చైనా, దాని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో ట్రంప్ ఎలాంటి సంబంధాలను కొనసాగించే అవకాశం ఉంది? భారత్‌కు ఎలాంటి చిక్కులు ఎదురవుతాయి? ఇక ఇప్పుడు రెండు పెద్ద విదేశాంగ విధానాలు విసిరే సవాళ్ల దగ్గరకు వద్దాం. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేయ గలనని ట్రంప్ గొప్ప ధీమాతో చెప్పారు. అయితే అది వట్టి ప్రగల్భమేనా, లేక ఆయన మనసు లోపలి నిజమైన ఉద్దేశమా? ఏ విధంగా చూసినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అది మంచి వార్తేమీ కాదు. మళ్లీ ఇదే విషయానికి వస్తే, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ‘నాటో’ ఏ విధమైన భవిష్యత్తును ఎదుర్కోబోతోంది? ట్రంప్ ఆ సంస్థ సభ్య దేశాలను వాటి రక్షణ కోసం మరింత ఎక్కువగా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారా? లేకుంటే, నాటో ఐక్యతకు, ఉనికికి ఒక విపత్తులా పరిణమిస్తారా? ఇంకొక అంతర్జాతీయ సవాలు ఇజ్రాయెల్–గాజా! ట్రంప్ ఇజ్రాయెల్‌కు, ముఖ్యంగా నెతన్యాహూకు మద్దతు ఇస్తున్నారు. అధ్యక్షుడిగా తన మొదటి హయాంలో యూఎస్ రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చారు. ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న గోలన్ హైట్స్‌కు అధికార గుర్తింపునిచ్చారు. ఇప్పుడు నెతన్యాహూకు ఎలాంటి ధైర్యాన్నిస్తారు? ఇరాన్ మీద దాడి చేసేట్టుగానా? మధ్య ప్రాచ్యం గురించి కనుక మాట్లాడుకుంటే, సిరియా మాటే మిటన్నది ప్రశ్న. గత నెలలో బషర్ అల్–అస్సద్ పదవీచ్యుతుడు అయినప్పుడు అక్కడ మనం ఒక రాజకీయ భూకంపాన్నే చూశాం. బైడెన్ ప్రభుత్వం డమాస్కస్ చేరుకోటానికి ప్రయత్నమన్నా చేసింది. కానీ ట్రంప్ వల్ల ఈ దౌత్య విధానం తారుమారవుతుందా?మూడో అంతర్జాతీయ సమస్య కూడా ఉంది కానీ, ట్రంప్ దానిని ఎలా తీసుకుంటారనే దానిపై నేనేమీ చెప్పలేను. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఆయన చెబుతున్నారు. పనామా కాలువను వెనక్కు తీసుకుంటాననీ, కెనడాను యూఎస్‌లో కలుపుకొంటాననీ కూడా ఆయన మాట్లాడారు. ఇవన్నీ ఆయన నిజంగానే చేస్తారా, లేక నిస్పృహ నుంచి బయట పడే ప్రయత్నంగా మాత్రమే అలా అంటున్నారా? చివరిగా, భారతదేశంపై దృష్టి పెడదాం. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోదీకి, ట్రంప్‌కు మధ్య సన్నిహిత వ్యక్తిగత సంబంధం ఏర్పడింది. ఆ స్నేహం ఇప్పుడు కూడా వికసి స్తుందా? లేదా పారిశ్రామికవేత్త అదానీ, పన్నూ(ఖలిస్తానీ నాయ కుడు గుర్పథ్వత్ సింగ్ పన్నూను చంపడానికి ఇండియా ప్రయత్నించిందన్న కేసు) కేసుల విషయమై ట్రంప్ ఒత్తిడి చేస్తే అది వడలి పోతుందా?అత్యంత ఆందోళన కలిగించే విషయం – ట్రంప్ తరచూ ఇండియా విధించే సుంకాలు మితిమీరి ఉంటున్నాయని ఆరోపించే వారు. అందుకు ఆయన చూపించే నిదర్శనం హార్లీ–డేవిడ్సన్ మోటార్ బైక్ దిగుమతులపై భారత్ విధించే సుంకాలు. ఇప్పుడు మళ్లీ, భారతీయ సుంకాలు మరొకసారి ట్రంప్ దృష్టిలోకి వస్తాయా? ఎటూ కదలని ఇంకొక అంశం హెచ్–1బి వీసాలు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ వీసాల గురించి ‘దారుణం’, ‘అన్యాయం’ అన్నారు. కానీ ఈసారి ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి (రిపబ్లికన్ నాయకుడు), శ్రీరామ్ కృష్ణన్ (కృత్రిమ మేధలో సీనియర్ విధాన సలహాదారు) హెచ్–1బి వీసాలకు గట్టి మద్దతుగా మాట్లాడారు. మస్క్ అయితే ఈ విషయమై యుద్ధాని కైనా తెగబడతానని అన్నారు. కాబట్టి ఈ వీసాల విషయంలో ట్రంప్ రెండో హయాం, ట్రంప్ మొదటి హయానికి భిన్నంగా ఉండబోతోందా?ఈ ప్రశ్నలు ఏవీ సమగ్రమైనవి కావు. కానీ, ఆందోళన కలిగించే అంశాల విస్తృతిని సూచిస్తాయి. అధ్యక్షుడిగా ట్రంప్ రెండో హయాం ఎంత అస్థిరత్వంతో ఉండబోతున్నదో ఇవి వెల్లడిస్తాయి. కనుక మీరు ఎగుడు దిగుళ్ల రాళ్ల దారిలో ప్రయాణానికి సిద్ధంగా ఉండండి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఓ సిపాయీ... తెలుసుకొనవోయీ!
భాష తెలియని దేశంలో సైనికుడైనా సామాన్యుడే. కొత్త నేలపై కుదురుకోవటం యుద్ధం చేసినంత పని! భాష మాత్రమే కాదు, అక్కడి ఆహారాలకు అలవాటు పడాలి. సంస్కృతులకు సర్దుకుపోవాలి. సంప్రదాయాల కత్తుల వంతెనపై ఒద్దికగా నడవాలి. నడవడికను బుద్ధిగా ఉంచుకోవాలి. ముఖ్యంగా, కరెన్సీని అర్థం చేసుకోవాలి, బేరాలాడాలి. అత్యవసరంలో ప్రాథమిక చికిత్సా, అకాల పరిస్థితుల ముందుచూపూ ఉండాలి. ఇవన్నీ సైనికులకు ప్రభుత్వాలు చెప్పి పంపవు. ‘వెళ్లాక తెలుస్తుందిలే’ అని బదలీ పత్రాలు ఇచ్చేస్తాయి. అయితే, వెళ్లాక తెలుసుకోవటం కాదు, ‘తెలుసుకునే వెళ్లండి’ అంటూ నూటపాతికేళ్ల క్రితమే ఒక ప్రసిద్ధ బ్రిటిష్ సిగరెట్ కంపెనీ భారత్ వెళ్లే బ్రిటన్ సైనికుల కోసం హ్యాండ్‌బుక్‌ను ప్రచురించటం విశేషమే!‘వైల్డ్ ఉడ్బైన్’ బ్రాండు సిగరెట్లను ఉత్పత్తి చేస్తుండే 18వ శతాబ్దపు ప్రఖ్యాత బ్రిటన్ పొగాకు కంపెనీ ‘డబ్లు్య.డి. అండ్ హెచ్.వో. విల్స్’ తాత్కాలిక విధి నిర్వహణలపై భారతదేశానికి తరలివెళ్లే బ్రిటిష్ సైనికుల కోసం మార్గదర్శకాలతో కూడిన ఒక కరదీపికను ప్రచురించినట్లుంది! మన దేశంలో ఆ సైనికుల అపరిచిత స్థానిక వ్యవహారాలను సులభతరం చేయటానికి ఉద్దేశించిన ఆ పుస్తక ప్రతి ఒకటి గతవారం లండన్ , పోర్టోబెల్లో రోడ్డులోని పురాతన వస్తువుల దుకాణంలో నా కంట పడింది. చదువుతుంటే ఎంత సరదాగా అనిపించిందో! భారతదేశం ఎంత పెద్దదో చెప్పడంతో ఆ కర పుస్తకం మొదలౌతుంది. ‘‘ఇండియాలో ఇరవై గ్రేట్ బ్రిటన్లను పట్టించ వచ్చు’’ అని చెబుతూ, ఆనాటి మన కరెన్సీని, బ్రిటన్ కరెన్సీతో పోల్చి వాటి సమాన విలువలను తెలియబరిచింది. ఆ ప్రకారం:1 అణా 1 పెన్నీకి సమానం. 11 అణాలు 1 షిల్లింగ్కి సమానం (రూపాయికి 16 అణాలు అనే లెక్క ఆధారంగా). 1 రూపాయి 1 షిల్లింగు 5 పెన్నీలకు సమానం. 13 రూపాయల 6 అణాలు ఒక పౌండుకు సమానం. పుస్తకంలోని ఎక్కువ భాగంలో, సైనికుడు తెలుసుకోవలసిన అవసరం ఉన్న ముఖ్యమైన పదాలను, వాటి అర్థాలను, వాటిని ఉచ్చరించే విధానాన్ని పొందుపరచటం జరిగింది. ఉదాహరణకు, ఎలుక Chew-ha (చూహా), రోడ్ Rust-er (రస్తా), సముద్రం Some-under (సమందర్), చొక్కా Come-ease (కమీజ్), చక్కెర Chee-knee (చీనీ), నీళ్లు Par-knee (పానీ), మహిళ Awe-rut (ఔరత్) అని ఇచ్చారు. (ఈ హిందీ మాటలను పలికే విధానమంతా ఆంగ్ల పదాలకు దగ్గరగా ఉండేలా ఇచ్చారు.)సైనికుడు స్థానికులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు రోజువారీ వాడుక కోసం కొన్ని చిన్న చిన్న వాక్యాలు కూడా ఆ కర పుస్తకంలో ఉన్నాయి. మీరెక్కడికి వెళుతున్నారో తెలుసుకోవాలనుకున్న సైనికుడు "Kid-her jar-ta high?" (కిదర్ జాతా హై?) అంటాడు; అతనికేదైనా అర్థం కాకపోతే, "Tomb key-ah bowl-ta high?" (తుమ్ క్యా బోల్తా హై) అంటాడు. అతను పోస్టాఫీస్ కోసం వెదుకుతుంటే "Dark-car-ner kid-her high?" (డాక్ ఘర్ కిదర్ హై) అని అడుగుతాడు. దుకాణందారు ఎక్కువ రేటు చెప్పినట్లనిస్తే "Darm jars-tea high" (దర్ జాస్తి హై) అంటాడు. బ్రిటిష్ సైనికుల కోసం ముద్రించిన హ్యాండ్‌బుక్ కవరు పేజీ ఇప్పుడు బ్రిటన్ సైనికులు అనారోగ్యం పాలైనప్పుడు ఏం చేయాలని పుస్తకం చెప్పిందో చూద్దాం. జ్వరాలను తగ్గించుకోటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే కచ్చితమైన సూచనలు కొన్ని పుస్తకంలో ఉన్నాయి. ‘‘అనేక కారణాల ఫలితంగా జ్వరం అనేది వస్తుంది. లవణాలు, ఆముదపు నూనె మోతాదులను ఎప్ప టికప్పుడు తీసుకోవటం ద్వారా జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. అవి ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. వీలైనంత వరకు మాట్లాడకుండా, మౌనంగా ఉండండి. ముఖంపైన, తల పైన చల్లటి తడి గుడ్డను వేసుకుని పడుకోండి. ఒకవేళ మలేరియా సోకి, రోగికి చలిపుడుతూ, వణుకు వస్తున్నట్లయితే వేడి టీ చుక్కల్ని తాగిస్తే చమటలు పడతాయి. వణుకు తగ్గేవరకు రోగికి దుప్పటి కప్పి ఉంచాలి’’ అని ఆ కరదీపిక సూచించింది. పాము కాట్లకు బ్రిటిష్ వారు భయభ్రాంతులయ్యేవారని అని పిస్తోంది. అందుక్కూడా పుస్తకంలో ప్రాథమిక చికిత్సలు ఉన్నాయి. విషపూరితమైన సర్పం కాటేస్తే ‘‘తక్షణం, తీక్షణమైన చికిత్స’’ అవసరం అవుతుంది. అంటే, రక్త ప్రసరణను ఆపటానికి కాటుకు పైభాగాన వస్త్రపు నాడాతో గట్టిగా బిగించి కట్టాలన్న మాట. ఆ తర్వాత, పెదవులపై లేదా నోటిలో పుండ్లు, కోతలు, లేదా పొక్కులు లేని వ్యక్తి ఆ గాయాన్ని పీల్చి, విషాన్ని ఉమ్మేయాలి. ఆ తర్వాత, గాయంపై బలమైన పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణాన్ని, (లేదా, ముడి స్ఫటికాలను) అద్దాలి. ఒకవేళ ఆ ప్రదేశంలో సిర, లేదా ధమని ఉన్నందువల్ల కోత పెట్టటానికి వీలు లేకుంటే కాటు వేసిన చోట నిప్పు కణికను, మండుతున్న సిగరెట్‌ను, కాల్చిన తాడు కొసను తాకించాలి. ఇక్కడ నాకు ఆసక్తిగా అనిపించిన సంగతి: ‘‘ఇవన్నీ చేసేలోగా చేతిలో ఏదైనా బలమైన ఉద్దీపన ఉంటే (బ్రాందీ, విస్కీ మొదలు అమ్మోనియం కార్బోనేట్ కలిసిన శాల్ ఓలటైల్ వరకు ఏదైనా) కొంచెం తాగించాలి. అలా పదిహేను నిముషాలకొకసారి చేయాలి’’ అని ఉండటం! బహుశా, మద్యంతో నరాలను శాంతపరచటమే దీని ఉద్దేశం కావచ్చు. ఈ హ్యాండ్‌బుక్‌లో... ‘తగని పనులు – చిట్కాలు’ అనే ఒక కీలకమైన విభాగం కూడా ఉంది. ‘‘మండే సూర్యరశ్మిలో తలపై టోపీ లేకుండా బయటికి వెళ్లొద్దు – అది వేసవైనా, చలికాలమైనా’’. ‘‘సూర్యాస్తమయానికి ముందు వైన్, బీరు, ఆల్కహాల్ సేవించ వద్దు – (సేవించే అవకాశం వచ్చినప్పటికీ!). ‘‘కొన్ని ఆకులను,ముఖ్యంగా వేపాకులను మీరు అడవిలో ఉన్నప్పుడు మీ టోపీ కింద ఉంచుకోవటం మీ తలను చల్లగా ఉంచుతుంది’’. ‘‘ఫ్లానల్ షర్టును వేసుకోవటం మరచిపోవద్దు. శీతాకాలమైనా, వేసవి కాలమైనా అది మీకు సురక్షితమైన కవచం’’. ఫ్లానల్ వేడిమిని గ్రహించదు. (ఫ్లాన ల్లో చుట్టిన ఐసు ముక్కలు త్వరగా కరగకపోవటమే ఇందుకు రుజువు)’’ అని పుస్తకంలో రాసి ఉంది. బ్రిటిష్ సైనికుడు ఇండియాలో ఆడగలిగే అనేక ఆటల వివరాలు కూడా ఆ పుస్తకంలో ఉన్నాయి. ‘‘హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్, పోలో, గోల్ఫ్, స్విమ్మింగ్, రన్నింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, రోయింగ్, షూటింగ్, పిగ్–స్టిక్కింగ్, గేమ్ హంటింగ్ వంటివి... భారతదేశం అందించే ఆసక్తికరమైన ఆటలు, క్రీడల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇవన్నీ ఇండియాకు కొట్టిన పిండి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ముగింపులో ఆ పుస్తకం ఇచ్చిన సలహా నా పొట్టను చెక్కలు చేసింది. ‘‘చివరిగా ఒక మాట. ఎట్టి పరిస్థితిలోనూ ఇండి యాలో మీరు మీ ప్రశాంతతను, ఉత్సాహాన్ని, నిద్రను కోల్పోకండి. బ్రిటన్‌పై బెంగ పెట్టుకోకండి. సమయం త్వరగానే గడిచిపోతుంది. అంతేకాదు, సౌతాంప్టన్ హార్బరులో మీకు వీడ్కోలు పలుకుతూ ఊగిన చేతి రుమాలు గతించిపోయిన కాలంలా అనిపిస్తుంది. అన్ని టినీ మించి ఇండియా మంచి దేశం.’’ కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ద్వంద్వ పౌరసత్వం ఇవ్వకూడదా?
భారతీయ పౌరులకు ఒకటే పౌరసత్వం ఎందుకు ఉండాలి? పౌరసత్వం అనేది పుట్టుకతో మాత్రమే సంక్రమించే ప్రత్యేక హక్కు కాదు. అది పౌరుడి సొంత గుర్తింపును వెల్లడించడంతో పాటు బహుళజాతి పూర్వీకుల వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇండియా ప్రయోజనాలకు విఘాతం కలిగించే శత్రుదేశాల పౌరులను ఇండియా పౌరులుగా ఎలా గుర్తిస్తామన్నది ఒక వాదన. ఇది చాలా చిన్న సమస్య. ఈ సాకుతో మొత్తంగా ద్వంద్వ పౌరసత్వం మీద వేటు వేయడం సరికాదు. ఒక వ్యక్తి బ్రిటిష్ లేదా అమెరికా పౌరుడు కూడా అయినంత మాత్రాన అతడి భారతీయత ఎలా తగ్గిపోతుంది? నూతన సంవత్సరంలోనైనా ఈ సంకుచిత వైఖరి మీద పునరాలోచన చేయాలి.2025 వచ్చేసింది. కొత్త సంవత్సరం అనగానే విధిగా కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. నేను ఇది మానేస్తాను, అలా ఉంటాను అంటూ ప్రతిజ్ఞలు చేస్తాం. వాటితో పాటు... ఒక విష్ లిస్ట్ కూడా పెట్టుకుంటాం. నాకు అది కావాలి, ఇలా జరగాలి అని కోరుకుంటాం. నేనూ ఈ విషయంలో తక్కువేం కాదు. చాలా తీర్మానాలు తయారు చేసుకుంటా! కొద్ది రోజుల తర్వాత షరా మామూలు. ఒట్లన్నీ గట్టున పెట్టేస్తానేమో! అందుకే నా విష్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం.నాది చాలా సింపుల్ కోరికే. కానీ అది నెరవేరితే లబ్ధి పొందేది నేనొక్కడినే కాదు, కొన్ని లక్షల మంది ఉంటారు! భారతీయ పౌరులకు ఒకటే పౌరసత్వం ఎందుకు ఉండాలి? మరో దేశపు జాతీయత కూడా పొందే అవకాశం ఎందుకు కల్పించకూడదు? ప్రభుత్వం ఈ డ్యూయల్ నేషనాలిటీ హక్కును మన్నించాలి. తల్లి దండ్రుల మాతృదేశం పరంగా కావచ్చు, నివాసం రీత్యా అవ్వచ్చు... ఒక వ్యక్తి ఇలాంటి హక్కు పొందగలిగినప్పుడు దాన్నెందుకు నిరాకరించాలి? పౌరసత్వం అనేది పుట్టుకతో మాత్రమే సంక్రమించే ప్రత్యేక హక్కు కాదు. అది పౌరుడి సొంత గుర్తింపును వెల్లడించడంతో పాటు బహుళజాతి పూర్వీకుల వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. తల్లిదండ్రులు బ్రిటిష్, ఇండియా దేశాల వారు అనుకోండి. వారి పిల్లలకు ఏకకాలంలో అటు బ్రిటిషర్లు, ఇటు ఇండియన్లు అయ్యే హక్కు ఉంటుంది. అలా కాకుండా, ఇండియా పౌరసత్వం కావాలంటే బ్రిటిష్ పౌరసత్వం వదులుకోవాలని పట్టుపట్టడం న్యాయం కాదు. అదేమాదిరిగా విదేశాల్లో నివాసం ఉండేవారికి... స్వదేశంలో హక్కు కోల్పోకుండా నివాస దేశంలో పౌరసత్వం తీసుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు భారతీయ చట్టాల ప్రకారం, ఈ రెండూ నిషిద్ధం.ఉన్నత ప్రజాస్వామ్య దేశాలుగా మన్నన పొందిన చోట్లా ఈ ద్వంద్వ పౌరసత్వ హక్కు లేదు కదా అంటారు. నిజమే. ఆస్ట్రియా, జపాన్, నెదర్లాండ్స్, నార్వేలు ఈ కోవలోకి వస్తాయి. ద్వంద్వ పౌర సత్వ నిరాకరణను వారు అప్రజాస్వామిక విధానంగా పరిగణించరు. కాకపోతే అనుమతించే దేశాల గురించి చెబుతాను. ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, డెన్మార్క్ , ఫ్రాన్స్, ఐర్లాండ్, స్వీడన్, యుకే, యూఎస్ఏ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ అత్యంత గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశాలే! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకునే ఇండియా వీటి సరసన చేరాలని ఎందుకు అనుకోదు? వాస్తవానికి, మన పొరుగున ఉన్న అనేక దేశాలు ద్వంద్వ జాతీయతను అనుమతిస్తున్నాయి. బంగ్లాదేశ్‌కు సమ్మతమే. శ్రీలంకదీ అదే బాట. ఆఖరుకు పాకిస్తాన్ కూడా అనుమతిస్తోంది. ఎటొచ్చీ చైనా, బర్మా, నేపాల్ ససేమిరా అంటాయి. అయితే, ఈ దేశాలా మనకు ఆదర్శం?ద్వంద్వ పౌరసత్వం అనుమతించక పోవడానికి అడ్డు పడే కారణాలు ఏంటో చూద్దాం. ఇండియా ప్రయోజనాలకు విఘాతం కలిగించే శత్రుదేశాల పౌరులను ఇండియా పౌరులుగా ఎలా గుర్తిస్తామన్నది వీటిలో ఒకటి. ఇది చాలా చిన్న సమస్య. ఈ సాకుతో మొత్తంగా ద్వంద్వ పౌరసత్వం మీద వేటు వేయడం సరికాదు. పాకిస్తాన్ పదహారు దేశాలను గుర్తించి వాటికి మాత్రమే ద్వంద్వ పౌరసత్వ విధానం అమలు చేస్తోంది. ఇండియా ఈ జాబితాలో లేదు. ఇలాంటి వ్యతిరేక దేశాల జాబితా రూపొందించుకోవాలి. వాటిని పక్కన పెట్టాలి.ద్వంద్వ పౌరసత్వ నిషేధాన్ని సమర్థించుకునేందుకు చెప్పే మరో ప్రధాన కారణం ఏమిటంటే, అలా అనుమతిస్తే భారతీయ పౌరసత్వ ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇది అర్థం లేనిది. వేరేది తీసుకోగలిగిన వారు ఇండియా పౌరసత్వం అక్కర్లేదు అనుకుంటే, ఎప్పుడు కావా లంటే అప్పుడు వదిలేస్తారు. ఇతర దేశాల్లో పౌరసత్వం ఉండి కూడా భారత జాతీయతను కొనసాగించాలి అనుకునేవారూ ఉంటారు. వారికి ఈ ద్వంద్వ పౌరసత్వం ముఖ్యమైన అంశం అవుతుంది. ఒక వ్యక్తి బ్రిటిష్ లేదా అమెరికా పౌరుడు కూడా అయినంత మాత్రాన అతడి భారతీయత ఎలా తగ్గిపోతుంది? అలా అని చెప్పి ఈ హక్కు నిరాకరించడం ఎలా సబబు?ఇలా కోరుకునేవారు అతి కొద్ది మందే ఉంటారు, కేవలం వారి కోసం ప్రత్యేక చట్టం ఉండాలా అన్నది కొందరి వాదన. ఎందుకు ఉండకూడదన్నది నా సమాధానం. ప్రవాస భారతీయులను అన్ని ప్రభుత్వాలూ ఏదో విధంగా దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించాయి. వారికి ‘పర్సన్స్ ఆఫ్ ఇండి యన్ ఆరిజిన్’, ‘ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా’ కార్డులు ఇచ్చాయి. వ్యవసాయ భూమిపై యాజమాన్య హక్కు, ఓటు హక్కు, ప్రభుత్వ పదవులు మినహా ఇతరత్రా అన్నిటికీ వారు అర్హులు. అలాంటప్పుడు, ద్వంద్వ పౌరసత్వంతో అదనంగా లభించేది ఏమిటి?సింపుల్‌గా చెప్పాలంటే, విదేశీ ప్రయాణం అత్యంత సులభం అవుతుంది. ఉదాహరణకు, బ్రిటిష్ లేదా అమెరికా పౌరసత్వం ఉన్న పాకిస్తానీయులు యూరప్ అంతటా వీసాల్లేకుండా పర్యటించవచ్చు. ఇండియా పాస్‌పోర్ట్ దారుడికి ఈ సౌలభ్యం లేదు. భారత పౌరులు పర్యటన వీసాలు సంపాదించడానికి నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. చాలామందికి ఇది ప్రధానమైన అంశమే. కాబట్టి, 2025 నూతన సంవత్సరంలోనైనా నరేంద్ర మోదీ గానీ రాహుల్ గాంధీ గానీ ఈ ద్వంద్వ పౌరసత్వం విషయంలో తమ పార్టీల సంకుచిత వైఖరి మీద పునరాలోచన చేయాలి. అవకాశం ఉన్న భారత పౌరులు రెండో పౌరసత్వం పొందేందుకు అంగీకరించాలి. ఎవరికీ ఎలాంటి నష్టం లేకుండా వారికి ప్రయోజనం చేకూర్చవచ్చు. ఇది న్యాయం. అర్థవంతం. ఇదే నా న్యూ ఇయర్ విష్!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అరేబియా అద్భుతం
చాలామంది దుబాయికి వెళ్తారు. కానీ దాని పొరుగునే ఉండే అబూ ధాబీని ఎక్కువమంది పట్టించుకోరు. దుబాయిని న్యూయార్క్తోనూ, అబూ ధాబీని ప్యారిస్‌తోనూ పోల్చవచ్చు. రాజసం ఉట్టిపడే బంగళాలు, విశాలమైన రహదారులు, సజావుగా సాగిపోయే ట్రాఫిక్... ఒక్కమాటలో అబూ ధాబీకి వెళ్తే అరేబియా అద్భుత ప్రపంచంలో కాలు పెట్టినట్లే ఉంటుంది!మీకు దుబాయి తెలుసుగా? బంధుమిత్రుల్లో చాలామంది వెళ్లి ఉంటారు కూడా. అయితే దుబాయి నుంచి ఓ గంటన్నర ప్రయాణం దూరంలో ఉండే ఎమిరేట్స్ రాజధాని అబూ ధాబీ గురించి మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. వెళ్లి ఉండరు కూడా. ఇవ్వాళ మీతో కొన్ని దేదీప్యమానమైన విషయాలను పంచుకుంటాను. పోయిన వారం నేను అక్కడికి వెళ్లాను. చూడముచ్చటగా ఉందని చెప్పాలి. చూసి వచ్చినందుకు మనసులో ఓ సంతృప్తి మిగిలిపోయింది. దుబాయి మాదిరి తళుకుబెళుకుల్లేవు. గ్లామర్, హడావిడి అంతకంటే లేవు!అబూ ధాబీలో ప్రపంచం పరుగులు పెట్టదు. నెమ్మదిగా ఓ నదిలా హొయలు పోతూ సాగుతూంటుంది. పోలిక కావాలంటే... దుబాయ్‌ని న్యూయార్క్తోనూ, అబూ ధాబీని ప్యారిస్‌తోనూ పోల్చవచ్చు. రాజసం ఉట్టి పడే బంగళాలు, విశాలమైన రహదారులు, సజావుగా సాగిపోయే ట్రాఫిక్... వీటన్నింటి మధ్య అక్కడక్కడా లెక్కలేనన్ని ఆడంబ రాలు, హోటళ్లు, రెస్టా రెంట్లు! ఇదీ అబూ ధాబీ వర్ణన!ఎమిరాతీ జనాలు తమ నగరాన్ని బాగా ఆస్వాదిస్తూంటారు. షాపింగ్, డైనింగ్ ఏదైనా కానీ దుబాయి కంటే బాగా ఎంజాయ్ చేస్తూంటారు. విదేశీయులు ఎక్కువగానే ఉన్నా... వారు దుబాయిలో మాదిరిగా స్థానికులను బెదరగొట్టేంత స్థాయిలో లేరనే చెప్పాలి. అబూ ధాబీలో ఉన్న సాంస్కృతిక అద్భుతాల గురించి చెప్పాలంటే ‘ది లూవ్’, ‘షేక్ జాయెద్ మ్యూజియం’లను ప్రస్తావించాలి. ఈ రెండు ఉదాహరణలు కచ్చితంగా ఇచ్చి తీరాల్సినవే. షేక్ జాయెద్ సంగ్రహాలయంలో నేనుకొన్ని గంటల సమయం గడిపాను. అందులో ఉన్న వస్తువులు మాత్రమే కాదు... ఎంతో అద్భుతమైన ఊహతో వాటిని ప్రదర్శించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. చరిత్ర గర్భంలో కలిసిపోయిన ఒక్కో కాలానికి ప్రతిరూపంగా ఈ సంగ్రహాలయ గదులను తీర్చిదిద్దారు. అలాగే చాలా తెలివిగా వేర్వేరు నాగరికతలకు సంబంధించిన వస్తువు లను ప్రదర్శించారు. ఫలితంగా వీటిని వేర్వేరు వస్తువు లుగా కాకుండా... ఒకే కాలంలో మానవ నాగరికతలు సాధించిన విజయాలను చూసినట్టుగా ఉంటుంది. చైనా నుంచి మెసపటోమియా వరకూ... అలాగే మెక్సికో నుంచి ఫ్రాన్స్ వరకూ వేర్వేరు నాగరికతలకు సంబంధించిన చారిత్రక అవశేషాలను ఇక్కడ భద్రపరిచారు. ఇంకోలా చెప్పాలంటే చోళుల కాలం నాటి విగ్రహాలు మొదలుకొని పర్షియన్ల కుండలు, బెల్జియం నేతపనుల నుంచి టర్కీ విగ్రహాలను ఒకే గదిలో చూడవచ్చు! ఏ శతాబ్దంలోనైనా మనిషి ఊహ ఎంత అద్భుతంగా ఉందో చెప్పే ప్రతీకాత్మ కత అన్నమాట!షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్‌ను ఒక్క మాటలో వర్ణిస్తా. చాలా పెద్దది. చూడటం మొదలుపెడితే పూర్తయ్యేందుకు రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. కానీ ఇందులోని వైపరీత్యాలను మాత్రం కచ్చితంగా అధ్యయనం చేయా ల్సిందే. భూగర్భంలోని కారు పార్కింగ్ తరువాత స్టార్ బక్స్, కోస్టా కాఫీలతోపాటు చాక్లెట్లు, సుగంధ ద్రవ్యాల దుకాణాలున్న షాపింగ్ ప్రాంతానికి వెళతాం. ఆ తరువాత స్వచ్ఛమైన తెల్లటి పాలరాతి పరచుకున్న గోడలున్న భారీ హాల్లోకి ప్రవేశిస్తాం. హాల్లోని స్తంభాలపై అతి కౌశల మైన కళాకృతులు, అది కూడా విలువైన రంగురాళ్లు పొదిగి నవి ఉన్నాయి. పైకప్పు నుంచి జిలుగు వెలుగుల క్రిస్మస్ ట్రీల మాదిరిగా వేలాడే భారీ షాండ్లియర్లు... ఓహ్! అరే బియా అద్భుత ప్రపంచంలో కాలు పెట్టినట్లే ఉంటుంది!అతిథులను మనసారా ఆహ్వానించే రెస్టారెంట్లు దుబాయిలో మాత్రమే ఉంటాయని అనుకునేవాడిని. అబూ ధాబీ కూడా ఈ విషయంలో ఏమీ తీసిపోదు. ఫోర్ సీజన్స్‌లోని బర్గర్లు, స్టీక్స్ కానివ్వండి... సెయింట్ రెజిస్ లోని భారతీయ వంటకాలైనా కానివ్వండి... ఫాక్వెట్లోని ఫ్రెంచ్ మాధుర్యాలు, సముద్ర తీరంలోని ‘తాషా’లో తీరికగా చేసే భోజనం కానివ్వండి... ఒక్కోటి పొట్టకు స్వర్గాన్ని రుచి చూపించేవే. కాకపోతే, ఇక్కడికొస్తే అప్పటి వరకూ లేని తిండిపోతుతనం మనల్ని చుట్టేయడం మాత్రం గ్యారెంటీ!నేను ఇప్పటివరకూ చాలా దేశాల్లోని హోటళ్లలో బస చేశాను కానీ... ‘ది ఎమిరేట్స్ ప్యాలెస్’ ముందు అవన్నీ దిగదుడుపే! భారత్‌లోని ‘లేక్ ప్యాలెస్’, ‘తాజ్‌మహల్’లు కూడా దీనిముందు గల్లీ హోటళ్లలా చిన్న బోతాయి. పచ్చటి పచ్చికబయళ్లున్న రూమ్ టెర్రస్‌లో కూర్చుని సముద్రాన్ని చూస్తూ కాఫీ తాగడం... డిసెంబరు చలిలో సూర్యకిరణాలు నులి వెచ్చగా తాకడం... కవిత్వం చెప్పుకునేంత అద్భుతమైన అను భూతి. మొబైల్ ఫోన్ లేకుండా కూడా కాలం ఎంచక్కా గడచి పోతుందనేందుకు ఈ అనుభూతి ఒక ఉదాహరణంటే ఒట్టు!ఇంకో ముఖ్యమైన సంగతి. తప్పక చెప్పాల్సింది కూడా! ఎమిరాతీ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. అందుకే ఇక్కడ అంతా ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతూంటుంది. ఒకవేళ పొరబాటున ఎవరైనా నిబంధనలు మీరారో... జరిమానాలు వీపు విమానం మోత మోగిస్తాయి. రెడ్ లైట్ దాటారంటే ఐదు వేల దిర్హమ్ల చమురు వదులుతుంది. వచ్చే ఏడాది నుంచి దీన్ని ఏకంగా యాభై వేల దిర్హమ్లకు పెంచుతున్నారు. డాలర్లలో చెప్పాలంటే 15 వేలు. రూపాయల్లోనైతే రూ. 12.73 లక్షలు! రోడ్లపై అడ్డదిడ్డంగా నడిచే మనిషిని గానీ, ఒక్క హారన్ మోతగానీ వినలేదంటే నమ్మండి!అబూ ధాబీ ఓ అద్భుత ప్రపంచం అనేంతగా దాన్ని వర్ణించానా? వాస్తవం ఏమిటంటే, దుబాయిలా కాకుండా... అబూ ధాబీ నిశ్శబ్దంగానే మీ అభిమానాన్ని చూరగొంటుంది. మీకు తెలియను కూడా తెలియదు. దుబాయిదంతా చెమ్కీల అంగీలే! కళ్లూ, చెవులు మదిపై చెడామడా దాడులు చేసే టైపు! దుబాయిని చూడంగానే ఆహా ఓహో అనిపిస్తే... పొరుగునే ఉండే అబూ ధాబీ మాత్రం నెమ్మదిగా మీ మనసుల్లోకి చేరి మత్తెక్కిస్తుంది. చిరకాలం ఒక జ్ఞాపకంలా నిలిచిపోతుంది. ఎప్పుడైనా అరబ్ దేశాల వైపు వెళ్లే పని పడిందనుకోండి... అబూ ధాబీని చూసి రావడం మరచి పోకండే! మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. అందుకే, నేనూ ఇంకోసారి అక్కడకు వెళ్లాలని ఇప్పటికే తీర్మానించుకున్నా!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎవరిని ఎలా పిలవాలి?
టేబుల్‌కు ఎదురుగా ఉన్న వ్యక్తులు ఇద్దరూ సమానమే అన్న అంచనాతో (భ్రమతో?) ఇంటర్వ్యూ మొదలవుతుంది. అప్పుడు మాత్రమే, ఇంటర్వ్యూ చేసేవాళ్లకు శోధించేందుకు, అవసరమైతే వ్యతిరేకించేందుకు ఇరువురి సమానత్వం ఒక హక్కును కల్పిస్తుంది. అవతలి వ్యక్తి నీ కంటే పెద్ద స్థాయివాడు కాదని అనుకున్నప్పుడే, అవసరమైనప్పుడు వారి మాటలను అడ్డుకునేందుకు సందేహించాల్సిన అవసరం ఉండదు. అందుకే ఎంపీలు, మంత్రులు, అధికారులను... మిస్టర్, మిసెస్, మిస్ అనో... ప్రభుత్వంలో ఉంటే మినిస్టర్ అనో సంబోధించడం ఉచితంగా ఉంటుంది. అదే సెలబ్రిటీలను చేసే ఛాట్ షో ఇంటర్వ్యూల విషయానికి వస్తే ఇవన్నీ మారిపోతాయి. వాళ్లను ‘మిస్టర్’ అంటే దూరం జరిగినట్టు అవుతుంది. అప్పుడు పేరు పెట్టి పిలవడం ఉత్తమం.ఆ మధ్య నాకు ఒక లేఖ అందింది.అందులో చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఒకటుంది. సమాధానం ఇలా బహిరంగంగానే ఇస్తే మేలు అనిపించింది. ‘‘ఇంటర్వ్యూ చేసే వారిని మీరు రకరకాలుగా సంబోధించడాన్ని గమనించాను’’ అంటూ మొదలైంది ఈ లేఖ. ‘‘కొంతమందిని మిస్టర్ ఎక్స్ అంటారు.. ఇంకొంతమందిని ‘మినిస్టర్’ అంటూ వారి పదవితో సంబోధించారు. మరికొన్ని సందర్భాల్లో వాళ్ల పేరుతో పిలిచారు. కానీ ఎప్పుడూ ‘సర్’ అని పిలవడం మాత్రం చూడలేదు. ఎందుకలా? అసలు ఎవరిని ఎలా పిలవాలో మీరు ఎలా నిర్ణయిస్తారు?’’సర్ అంటే వేరే!ఈ ప్రశ్నలు చూసిన వెంటనే నా ఆలోచనలు రెండు దశాబ్దాల వెనక్కు వెళ్లాయి. ఆ రోజు జీవితంలో మొట్టమొదటిసారి ఓ ప్రము ఖుడిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తర్వాత బ్రిటన్ హోమ్ శాఖ మంత్రి అయిన డేవిడ్ వాడింగ్టన్ ఇంటర్వ్యూ అది. 1983లో మార్గరెట్ థాచర్ మంత్రివర్గంలో ఇమ్మిగ్రేషన్ శాఖల మంత్రిగా ఆయన పని చేశారు. ప్రస్తుత ‘బీబీసీ’ ఛైర్మన్ సమీర్ షా అప్పట్లో నా బాస్. బీబీసీ కార్యక్రమం ‘ఐ విట్నెస్’ ప్రొడ్యూసర్ ఆయన.ఇంటర్వ్యూ కోసం స్టూడియోలోకి వెళుతూండగా సమీర్ మాట్లా డుతూ, ‘‘ఒక్క విషయం గుర్తుంచుకో కరణ్’’ అన్నారు. ‘‘ఆయన్ని మిస్టర్ వాడింగ్టన్ అనైనా పిలువు. లేదా మినిస్టర్ అను. సర్ అని మాత్రం పిలవొద్దు’’ అని సలహా ఇచ్చారు. బ్రిటిష్ ఇంగ్లీషులో ‘సర్’కు ఉన్న అర్థం వేరు కావడమే దీనికి కారణం. దానివల్ల ఇంటర్వ్యూలో వాడింగ్టన్ హోదాను ఇంటర్వ్యూ చేసేవాడికన్నా ఎక్కువ అనుకునేలా చేస్తుంది. ఇంటర్వ్యూ చేసేవాడు, ఇచ్చే మనిషి ఇద్దరూ సమానమే అన్న అంచనాతో(లేదా భ్రమ?) ఈ ఏర్పాటు అన్నమాట. ఇంటర్వ్యూ చేసేవాళ్లకు శోధించేందుకు, అవసరమైతే వ్యతిరేకించేందుకు ఇరువురి సమానత్వం ఒక హక్కును కల్పిస్తుంది. అలాగే అవతలి వ్యక్తి నీ కంటే పెద్ద స్థాయివాడు కాదని తెలిస్తే అవసరమైనప్పుడు వారి మాటలను అడ్డుకునేందుకూ సందేహించాల్సిన అవసరం ఉండదు.వాస్తవానికి ఆ ఇంటర్వ్యూ బ్రిటిష్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల అంశంపై సాగింది. ఆనాటి నిబంధలు ఆసియా ప్రాంత వాసులకు ఇబ్బందికరంగా ఉండేవి. హాట్ టాపిక్ కాబట్టి ఇంటర్వ్యూ కూడా అదే స్థాయిలో ఉండటం సహజం. వాడింగ్టన్ సమాధానాలు నాకు సంతృప్తి కలిగించే అవకాశమే లేదు. అందుకే సమీర్ నన్ను పరోక్షంగా హెచ్చ రిస్తూ ఆ మాటలు అన్నారు. ఆయన్ని నేను సంబోధించే విధానం నా స్థితిని బలహీనం చేయకూడదన్నది సమీర్ ఉద్దేశం. కాబట్టి... సర్ అన్న సంబోధన లేకుండా పోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ నాకు సమీర్ మాటలే పరమ ధర్మంలా మిగిలాయి. అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నా... ఎంపీలు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ప్రముఖులు ఎవరైనా సరే... మిస్టర్, మిసెస్, మిస్ అని కానీ... ప్రభుత్వంలో ఉంటే మినిస్టర్ అని కానీ సంబోధించడాన్ని ఒక నియమంగా పెట్టుకున్నాను. ఇలా ఎందుకో చెబుతాను.‘‘సర్... మీరు చెబుతున్నది కరెక్ట్ కాదు’’ అని ప్రతిసారీ చెప్ప లేం. ‘సర్’ అని సంబోధిస్తూంటే... ఇలా చెప్పే అవకాశం గట్టిగా చెప్పలేకపోవచ్చు. అదే ‘మినిస్టర్’ అని సంబోధిస్తున్నాం అనుకోండి... ఎప్పుడు కావాలంటే అప్పుడు ‘‘సారీ, మీరు తప్పు చెబుతున్నారు’’ అనేయవచ్చు. ‘సర్’ అంటే ఒకపక్క ఉన్నత స్థానం కల్పిస్తూ... ఇంకో పక్క తప్పు అంటున్నాం. పరస్పర విరుద్ధం ఇవి. ‘మినిస్టర్’అంటున్నప్పుడు మీరు చెబుతున్నది తప్పు అనేందుకు పెద్దగా ఇబ్బంది పడనక్కరలేదు. సన్నిహిత సంభాషణల్లో... పేరుతో!అయితే... ఛాట్ షో ఇంటర్వ్యూల విషయానికి వస్తే ఇవన్నీ మారి పోతాయి. అవతలి వ్యక్తి గ్లామర్, సెలిబ్రిటీ స్థాయిని బట్టి కదా ఇంటర్వ్యూకు ఎంచుకున్నాను. అది వర్తమాన అంశాలకు సంబంధించిన ఇంటర్వ్యూ కాదు. విధాన నిర్ణయాల గురించి గుచ్చిగుచ్చి అడిగేది కాదు. వారి జీవిత ఘట్టాలు, జ్ఞాపకాలకు సంబంధించినది కాబట్టి, వారి వ్యక్తిత్వాన్ని పరిచయం చేసే షో కాబట్టి... ‘మిస్టర్’, ‘మిస్’ అంటే వారికి దూరం జరిగినట్టు అవుతుంది. ఇది చర్చను ముందుకు పోనీయదు. అలాంటి సందర్భాల్లో వారిని పేరుతో పిలుస్తూంటాను. అందుకే జావేద్(అఖ్తర్), షారుఖ్(ఖాన్ ), మాధురీ (దీక్షిత్), షర్మిలా (ఠాగూర్), విక్రమ్(సేథ్), సచిన్ (టెండూల్కర్) అన్న పేర్లతో సంబోధన ఉంటుంది.ఒక్కోసారి పరిస్థితి వికటించే అవకాశం కూడా ఉంది. నేను ఇంటర్వ్యూ చేసేవాళ్లలో కొంతమంది నాకు బాగా పరిచయమైన రాజకీయ నేతలు కూడా ఉంటూంటారు. ఉదాహరణగా చెబు తున్నా... అలాంటి వారిని ‘మిస్టర్ థరూర్’ అని సంబోధించాల్సి వస్తుంది. నాకు వ్యక్తిగతంగా ఆయన శశిగానే తెలిసినప్పుడు ‘మిస్టర్ థరూర్’ అని పిలవడం ఎబ్బెట్టుగా ఉంటుంది. వీలైనంత వరకూ పేరు పెట్టి పిలవకుండా, ఇంటిపేరుతో కలిపి పిలవడం ద్వారా బ్యాలెన్ ్స చేస్తూంటాను. ఇది ఫార్మల్‌గానూ ఉంటుంది, అలాగే వ్యక్తిగత సాన్ని హిత్యాన్ని సూచించేందుకూ ఇబ్బందిగా ఉండదు.నేను చేయని పనల్లా ఒక్కటే! మంత్రిని పేరు పెట్టి పిలవను. వాళ్లు నాకు తెలిసినప్పటికీ పీయూశ్, కపిల్ అంటూ పేర్లతో పిలవను. ఫార్మల్ ఇంటర్వ్యూలో ఇలా పిలవడం అంత మంచిది కాదు. వీక్షకులు వెంటనే సాన్నిహిత్యాన్ని పసిగట్టేస్తారు. నాకు వచ్చిన ప్రశ్నకు సమాధానం దక్కిందనే అనుకుంటున్నాను. ఇదెంత అర్థవంతంగా ఉందో నిర్ణయించుకోవాల్సింది మాత్రం మీరే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత -
ఒక అపరిచితుడి దయ
ఒక మనిషి సాటి మనిషికి సాయానికి రాడని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ముక్కూ ముఖం తెలియని మనుషులు చేయందిస్తారు. అడక్కుండానే మనల్ని సమస్య నుంచి గట్టెక్కిస్తారు. అది ఎంత చిన్నదైనా సరే, ఆ సమయానికి పెద్ద సాయమే అవుతుంది. అయితే, అలాంటి మనుషులను మనం ఎంత నమ్ముతాం? చాలాసార్లు మనుషుల రూపాలను చూసి వాళ్ల గుణాలను అంచనా వేస్తుంటాం. కానీ మనుషులను చూపులతో అంచనా వేయలేం. అలాంటి సందర్భాలు మనకు చాలాసార్లు ఎదురవుతూనే ఉంటాయి. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇతరులకు సాయపడటం, ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలు ఎదురైనా అవి గుర్తుంచుకోవాల్సినవి కావు.అధికారికంగా దాని పేరు ‘లండన్ అండర్‌గ్రౌండ్’. కానీ అందరూ పిలిచేది ‘ట్యూబ్’ అని! అది నిజంగానే గొట్టం ఆకారంలోనే ఉంటుంది మరి! కానీ, సొరంగం నుంచి రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వస్తూండటాన్ని చూసినప్పుడు మాత్రం దాన్ని టూత్‌పేస్ట్‌తో పోల్చడం మేలని నాకు అనిపిస్తుంది. పదహారేళ్ల వయసులో మొట్టమొదటిసారి ట్యూబ్‌ను చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన కూడా ఇదే. విక్టోరియా స్టేషన్లో ఉన్నాను అప్పుడు నేను. అప్పుడే ఎయిర్పోర్ట్ వాహనం నుంచి కిందకు దిగాను. రెండు చేతుల్లో భారీ ట్రంకు పెట్టెలు. మీరు నమ్మినా నమ్మకపోయినా... ఆరోజు ఎయిరిండియా విమానం రెండు గంటలు ముందుగానే ల్యాండ్ అయ్యింది. నేను ఉండటానికి వెళ్తున్న నా సోదరి కిరణ్ కూడా దానికి ఆశ్చర్యపోయింది.తమ్ముడు సెలవుల కోసం అనుకోకుండా ప్రత్యక్షమవుతున్నాడన్న ఆనందం, షాక్ నుంచి కోలుకుంటూ ‘‘హీత్రూ నుంచి బస్సు పట్టుకో... బాండ్ స్ట్రీట్‌లో ట్యూబ్’’ అంటూ కిరణ్ తన ఇంటికి దారి చెప్పింది. ‘‘నేను ఆ పక్కన ఉంటా’’ అని ముగించింది.బాండ్ స్ట్రీట్ స్టేషన్ కిరణ్ ఆఫీసుకు దగ్గరలోనే ఉంటుంది. నాకైతే అప్పటికి లండన్ కొత్త. ఒకపక్క ఉత్సాహంగా ఉంది. ఇంకోపక్క కొంచెం ఉద్వేగంగానూ అనిపిస్తోంది. బాండ్ స్ట్రీట్ అన్నది మోనోపలి గేమ్‌లో కనిపించే పేరు. అక్కడున్న జనాలను చూస్తే మాత్రం అమ్మో ఇంతమందా? అనిపించక తప్పదు. అందరూ ఎవరి హడావుడిలో వారున్నారు. చాలామంది వ్యాపారాలు చేసుకునేవాళ్లనుకుంటా. ఒకరిద్దరు మాత్రం అక్కడక్కడా తచ్చాడుతూ కనిపించారు. బెల్‌బాటమ్ ప్యాంట్లు, పొడుచుకువచ్చినట్లు ఉన్న జుత్తుతో ఉన్న వాళ్లకు బూడిద రంగు ఫ్లానెల్స్, సరిగ్గా అమరని స్కూల్ బ్లేజర్‌తో ఉన్న నేను పరాయివాడినన్న విషయం ఇట్టే తెలిసిపోయేలానే ఉంది. వాతావరణం ఇలా ఉన్న సందర్భంలోనే... సొరంగం నుంచి ట్యూబ్ బయటకొస్తూ కనిపించింది. సొరంగంలో ఉండగానే వచ్చిన రణగొణ ధ్వని ట్యూబ్ వస్తున్న విషయాన్ని అందరికీ ఎలుగెత్తి చెప్పింది. శబ్దం వింటూనే చాలామంది ట్యూబ్ రాకను గుర్తించారు. సామన్లు సర్దుకుంటూ రైలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. నాకైతే అంతా కొత్త. పరిసరాలతో పరిచయమూ తక్కువే. ఏం చేయాలో తెలియకుండా అలా... చూస్తూనే ఉండిపోయా కొంత సమయం!ఎవరో గట్టిగా అరిచారు. ‘‘మిత్రమా... రా’’ అని! అప్పటికే రైలు తలుపులు తెరుచుకుని ఉన్నాయి. జనాలు లోపలికి చొరబడుతున్నారు. నేను మాత్రం నా రెండు ట్రంకు పెట్టెలతో ముందుకెళ్లేందుకు తంటాలు పడుతున్నాను. రెండింటినీ ఒక్కో చేత్తో పట్టుకున్నానా... హ్యాండ్‌బ్యాగ్ పట్టుకునేందుకు ఇంకో చేయి లేకుండా పోయింది. సర్దుదామనుకుంటే పెట్టెలు ఎత్తలేనంత బరువైపోతున్నాయి. ఈ లోపు పక్క నుంచి ఏదో గొంతు వినిపించింది... ‘‘ఒంటిచేత్తోనే చేయగలవు.’’ అంటూ. ‘‘రెండు, మూడు కావాలేమో’’ అని కూడా అనేసిందా గొంతు! యాభై ఏళ్లు పైబడ్డ వ్యక్తి మాటలు కావచ్చు అవి. చిందరవందర బట్టలేసుకుని ఉన్నాడు. తలపై టోపీ ఒకటి. గడ్డం కూడా సరిగ్గా గీసుకోలేదు. బహుశా కంపు కూడా కొడుతున్నాడేమో. మామాలుగానైతే ఆ వ్యక్తితో మాట్లాడేవాడిని కాదేమో. భవిష్యత్తులోనైతే అలాంటి వాళ్లకు దూరంగా జరిగిపోయేవాడినేమో. దిమ్మరి అనుకుని వారిని దూరం నుంచే కొనచూపుతో చూస్తూ ఉండేవాడిని. ఎందుకంటే అలాంటివాళ్లపై నాకున్న అయిష్టం ఇట్టే తెలిసిపోతుంది మరి. అయితే ఆ రోజు నేను ట్యూబ్ ఎక్కేనాటి పరిస్థితి వేరు. కుర్రాడిని. సాయం అవసరం ఉంది. పొగరు ఇంకా తలకెక్కి లేదు. మరీ ముఖ్యంగా... ఆ మనిషి నా ట్రంకు పెట్టెలతోపాటు హ్యాండ్ లగేజీ కూడా లాక్కున్నాడు. ట్యూబ్‌లోకి చేర్చాడు. ఆ వెంటనే రైలు తలుపులు మూసుకున్నాయి. ఆ వ్యక్తి నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నోట్లో కొన్ని పండ్లు ఊడిపోయి ఉంటే... ఉన్నవి కూడా గారమరకలతో కనిపించాయి. ‘‘హమ్మయ్యా... ఎక్కేశాం’’ అన్నాడా వ్యక్తి! సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు నాకు. ఓ నీరసపు నవ్వు నవ్వి ఊరుకున్నాను. ‘‘చిటికెలో రైలు తప్పిపోయేది తెలుసా?’’ అన్నాడు. నాకేమో కొత్తవాళ్లతో మాట్లాడటమంటే భయం. అతడేమో ఒకట్రెండు మాటలతో సరిపెట్టేలా లేడు. మొత్తమ్మీద ఇద్దరి మధ్య కాసేపు మౌనమే రాజ్యమేలింది. రెండు స్టేషన్లు దాటిన తరువాత ఆ వ్యక్తి నా వైపు చూసి, ‘‘ఎక్కడికి మిత్రమా?’’ అన్నాడు. తలూపుతూ నా సమాధానం విన్నాడు. కిటికీల్లోంచి బయటకు చూడటం మొదలుపెట్టాడు. సొరంగం నల్లటి గోడలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు బయట! ఆ వ్యక్తి ఆ నల్లగోడలనే కళ్లప్పగించి మరీ చూస్తూ ఉండిపోయాడు.ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందా? అని నేను ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. లగేజీ ఎలా దింపుకోవాలన్న ఆలోచన మెదడును తొలిచేస్తోంది. ఇంతలో బాండ్స్ట్రీట్ రానేవచ్చింది. పెట్టెలు సర్దుకుందామని అనుకునే లోపే ఆ వ్యక్తి వాటిని తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. ‘‘చిన్న లగేజీలు నువ్వు తీసుకో’’ అన్నాడు. ‘‘నీ సైజుకు తగ్గవి’’ అని చతుర్లాడాడు కూడా. ప్లాట్‌ఫామ్ చివరి వరకూ నాకు తోడుగా వచ్చాడు. ‘‘వచ్చేశాం’’ అన్నాడు. ‘‘గుడ్ లక్’’ చెప్పాడు. వచ్చినంత వేగంగా వెనక్కు వెళ్లిపోయాడు. మేమొచ్చిన వైపే వెళ్లాల్సిన ట్యూబ్ కోసం వేచి చూడటం మొదలుపెట్టాడు.ఈ సంఘటన తరువాత నేను ఆ వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు. అతడు చేసిన సాయానికి థ్యాంక్స్ అయినా సరిగ్గా చెప్పానో లేదో గుర్తు లేదు. కానీ లండన్ అండర్‌గ్రౌండ్‌లో నాకు ఎదురైనా మధురమైన అనుభూతుల్లో ఇదీ ఒకటిగా నిలిచిపోయింది. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇలా ఇతరులకు సాయపడటం ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలూ ఎదురవుతూంటాయి కానీ, వాటిని నేను గుర్తుంచుకోను. ఢిల్లీలోనూ మెట్రో భూగర్భ మార్గం పడుతున్న నేపథ్యంలో మనకూ ఇలాంటి అనుభవాలు బోలెడన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు చూసిన వెంటనే మనకు కలిగే ఇంప్రెషన్ తప్పు కావచ్చు అని చెప్పేందుకు ఉపయోగపడుతూంటాయి. చూపులతోనే మనిషిని అంచనా వేయలేమని చెబుతూంటాయి!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మాటలకు అడ్డు తగలకూడదా?
ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడానికి రకరకాల కారణాలుండొచ్చు. ఒక విషయం మీద వారి దృక్పథం ఏమిటి, వివరణ ఏమిటి, వారి పాత్ర ఏమిటి... ఇలా ఏదో స్పష్టత కోసమే ఆ సంభాషణ జరుగుతుంది. ఇంటర్వ్యూ చేయడమంటేనే, అతిథి చెప్పేది వినడానికి సిద్ధపడటం! అదే సమయంలో అతిథి తనకిష్టమొచ్చింది మాట్లాడేందుకు ఇంటర్వ్యూ చేయరన్న సంగతినీ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా టీవీ సంభాషణలకైతే ఒక సమయ పరిమితి ఉంటుంది. ఆ సమయంలోనే కావాల్సింది రాబట్టుకోవాలి. అతిథి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నా, విషయాన్ని సాగదీస్తున్నా వారి మాటలను అడ్డుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ అడ్డు తగలడం సరైన సమయంలో జరగాలి. అడ్డుకోవడం అవసరమేనన్న భావన వీక్షకులకూ కల్పించాలి.ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నేను అవతలి వాళ్ల మాటలకు తరచూ అడ్డుపడుతూంటా ననీ, ఇది చాలామంది ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుందనీ చాలామంది నాతో చెబుతుంటారు. నువ్వు తలదూర్చే ముందు నీ అతిథి ఏం చెబు తున్నాడో వినాలని అనుకుంటున్నామన్న వాళ్లూ ఉన్నారు. అయితే ఒక ప్రశ్న. అడ్డుకోవడాన్ని ఎప్పుడు తప్పించవచ్చు? అతిథిని అస్సలు అడ్డుకోరాదా? అతడు మాట్లాడటం ఆపేంతవరకూ ఓపికగా ఎదురు చూడాలా? దీనికి ఎంత సమయం పట్టినా ఫరవాలేదా?వాస్తవానికి ఇదంతా అవతలి వ్యక్తి నేను అడిగిన ప్రశ్నకు బదు లుగా ఏం చెబుతున్నాడన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే... అతిథి తనకిష్టమొచ్చింది చెప్పేందుకు కాదు ఇంటర్వ్యూ అన్న సంగతినీ గుర్తుంచుకోవాలి. ప్రశ్నలు, జవాబుల ఆధారమైన చర్చ ఇంటర్వ్యూ అంటే! అడిగే ప్రశ్నకు తగ్గట్టు సమాధానం ఉండాలి. కాబట్టి... అడిగిన ప్రశ్నతో సంబంధం లేని సమాధానం వచ్చి నప్పుడు అడ్డుకోవడం అన్నది అత్యవసరం. తప్పించలేనిది కూడా! తనేం చెబుతున్నాడో తనకే తెలియని స్థితిలో అతిథి ఉన్నా... లేదా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఏదో ఒకటి చెబుతున్నా, కాలయాపన చేస్తున్నా అడ్డుకోవాల్సిందే. ఈ ఇంటర్వ్యూలన్నీ నిర్దిష్ట సమయం లోపల జరగాల్సినవి. కాబట్టి వ్యూహాత్మకంగా కాలయాపన చేసేందుకు కొందరు ప్రయత్నిస్తూంటారు. లేదా మరిన్ని ప్రశ్నలను నివారించేందుకూ ప్రశ్నతో సంబంధం లేని సమాధానాలు చెబుతూంటారు.అలాగే అడ్డుతగలడం అనేది స్పష్టత కోసం గందరగోళాన్ని తొలగించేందుకూ అవసరమే. అంతగా తెలియని సంక్షిప్తనామాలు ఉపయోగిస్తూంటే... మనం అడ్డుకుని వాటి అర్థమేమిటో వివరించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా... అతిథి చెప్పాలనుకున్న విషయం మాటల్లో తప్పిపోతే అతడిని మళ్లీ చర్చిస్తున్న అంశానికి తీసుకురావడం కోసం కూడా అడ్డుకోవడం అవసరమవుతుంది. చెప్పే విషయం ఏమిటన్న దానిపై అతిథికి స్పష్టత ఉండవచ్చు కానీ... వీక్షకులకు స్పష్టత లేదని అనిపిస్తే అడ్డుకుని వివరణ తీసు కోవాల్సిందే. విషయం అర్థమైనప్పుడు వీక్షకులకు ఈ అడ్డుకోవడం అన్నది చికాకుగానే ఉంటుంది కానీ అర్థం కాని వాళ్లు కూడా ఉంటా రన్నది మనం గుర్తుంచుకోవాలి. వివరణ తీసుకునేందుకు, స్పష్టత కోసం సమయానుకులంగా అడ్డు తగలాల్సిందే! అయితే, అతిథి వాస్తవాలకు భిన్నంగా మాట్లాడుతున్నాడు అనుకోండి... అప్పుడు కూడా అడ్డుకోవాల్సిన అవసరముంటుంది. వీక్షకులకు అందే సమాచారం కచ్చితమైనదిగా ఉండేలా చూసుకోవా ల్సిన బాధ్యత ఇంటర్వ్యూ చేసే వ్యక్తిది. లేదంటే, మర్యాదగానైనా లేదా నిశ్చయంతోనైనా అతిథిని అడ్డుకోవాలి. అతిథి దురుసుగా లేదా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నా అడ్డుకోవడం అవసరం. ఒక్కో సారి, విచక్షణ మీద ఉద్వేగానిది పైచేయి అయినప్పుడు కూడా ముందు జాగ్రత్తగా అడ్డుకోవాల్సి ఉంటుంది.చివరగా... వాగ్వాదం జోరుగా సాగుతున్నప్పుడూ అడ్డుకోవడం జరుగుతూంటుంది. వివాదాస్పదమైన, శక్తిమంతమైన వాదన జరుగు తున్నప్పుడు ఒకరిపై ఒకరు కేకలు పెట్టుకోవడం సహజం. ఇది సాధారణంగా జరుగుతూంటుంది. అయితే ఇలాంటి స్థితిలో ఏదో అడ్డుకోవాలి కాబట్టి అడ్డుకోరాదు. ఉద్వేగపూరిత వాతావరణంలోనే చర్చలు జరుగు తాయన్నది తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లోనే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిపై అతిథి సవాళ్లు గట్రా విసురుతూంటారు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నిగ్రహంతో ఉండాల్సింది కూడా ఇక్కడే! ఇంటర్వ్యూలు చేసే వారికి ప్రధానంగా మూడు హెచ్చరికలు చేయాలి. మొదటిది–అడ్డుకోవడం దూకు డుగా ఉండకూడదు. సంయమనం కోల్పోరాదు. మన్నించమంటూ అడ్డుకోవడం మేలైన పద్ధతి. మన్నించమనడం వేడిని కొంతవరకూ చల్లారుస్తుంది. రెండోది–అడ్డుకోవడం అన్నది విజయవంతంగా పూర్తి చేయాలి. సగం సగం ప్రయత్నాలు చేయరాదు. మరీ తరచుగా అడ్డుకోకపోవడం మంచి పద్ధతి. అడ్డుకోలేక పోతే దానికి సార్థకతే ఉండదు. పదే పదే అడ్డుకుంటూవుంటే, చికాకు కలగడం సహజం.చివరగా... అతి ముఖ్యమైన అంశం... అడ్డుకోవడం అన్నది సరైన సమయంలో జరగాలి. సమర్థుడైన ప్రెజెంటర్ వీక్షకుల కంటే చాలా ముందుగానే ఎప్పుడు అడ్డుకోవాలో నిర్ణయించుకోగలడు. అయితే అనుకున్న వెంటనే అడ్డుకున్నాడనుకోండి, అది కొంచెం తొందరపాటు అవుతుంది. వీక్షకులు హర్షించరు. చూసేవాళ్లు కూడా అతిథి మాటలింకా కొనసాగితే బాగోదు అనుకునేంత వరకూ వేచి చూసి అప్పుడు అడ్డుకోవాలి. వాస్తవానికి అడ్డు తగలడానికి ఇదే కీలకం. అడ్డుకోవడం అవస రమైందన్న ఫీలింగ్ వీక్షకులకూ కల్పించాలి. ఎందుకంటే... వాళ్లకు ఇంటర్వ్యూ అనేది ఒక ‘ప్రదర్శన’ లాంటిది. అతిథికీ, ఇంటర్వ్యూ చేసేవాళ్లకూ ఇద్దరికీ వీక్షకుల మెప్పు కావాలి. అదే జరగకపోతే ఇంటర్వ్యూకు అర్థమే లేదు. అది ఇద్దరికీ వర్తిస్తుంది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వెనక్కి నడవమంటున్నారా?
మహిళల భద్రత కోసమని చెబుతూ ఈమధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. వాటి ప్రకారం... మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదు; మగవాళ్లు జిమ్ముల్లో ఆడవాళ్లకు ట్రెయినర్లుగా ఉండకూడదు. వాళ్ల ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ ఇది ఇంకో రకమైన తాలిబనిజం అవుతుంది. ఎందుకంటే, ఇలాంటివి చివరకు మహిళలకు కీడే చేస్తాయి. వారి వ్యక్తిగత ఎంపికకు భంగం కలిగిస్తాయి. ఇది ఇంతటితోనే ఆగుతుందా? ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేయాలా? అందుకే ఈ ప్రతిపాదనలు హాస్యాస్పదమైనవే కాదు, అర్థంలేనివి కూడా!మన మంచి కోసమేనని చెబుతూ కొందరు తరచూ కొన్ని పిచ్చి సూచనలు చేస్తూంటారు. వీటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఈ మధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. అవి ఎంత మూర్ఖమైనవంటే మనం వాటిని గట్టిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపట్ల మౌనంగా ఉంటే, అవన్నీ సమ్మతమే అనుకునే ప్రమాదముంది.‘బహిరంగ, వాణిజ్య స్థలాల్లో మహిళల భద్రతను పెంచడం ఎలా?’ అన్న అంశంపై ఈ సూచనలు వచ్చాయి. ఉద్దేశం చాలామంచిది. కానీ ప్రతిపాదించిన సలహాలు మాత్రం నవ్వు పుట్టించేలా ఉన్నాయి. మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదన్నది ఒకానొక సలహా. అలాంటప్పుడు పురుషులు మహిళల వస్త్రాలు కూడా తయారు చేయకూడదా? మహిళలు మాత్రమే సిద్ధం చేయాలా? బహుశా ఇది ఇకపై అమల్లోకి తెస్తారేమో! సెలూన్లలోనూ మహిళలకు క్షౌర క్రియలు చేయడం ఇకపై పురుషులకు నిషిద్ధం. అలాగే జిమ్, యోగా సెషన్లలోనూ మగవాళ్లు మహిళలకు శిక్షణ ఇవ్వడానికి అనుమతి లేదు.ఇంతటితో అయిపోయిందనుకోకండి. అన్ని పాఠశాలల బస్సు ల్లోనూ మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఉండాలన్న సలహా కూడా వచ్చింది. బహుశా పురుషులు ఎవరూ యువతులను, చిన్న పిల్లలను భద్రంగా ఉంచలేరని అనుకున్నారో... వారి నుంచి ముప్పే ఉందను కున్నారో మరి! మహిళల వస్త్రాలమ్మే చోట మహిళా సిబ్బంది మాత్రమే ఉండాలట. పురుషులను అస్సలు నమ్మకూడదన్న కాన్సెప్టు నడుస్తోందిక్కడ. మహిళలను ప్రమాదంలో పడేయకుండా పురుషులు వారికి సేవలు అందించలేరన్నమాట.ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ ఈ సలహాలు, సూచనలపై ఏమంటున్నారంటే... మహిళల భద్రతను పటిష్ఠం చేసేందుకు మాత్రమే కాకుండా, మహిళల ఉపాధి అవకాశా లను మెరుగుపరిచేందుకు కూడా వీటిని ఉద్దేశించినట్లు చెబుతున్నారు. ఈ సలహాలను ‘‘మహిళల భద్రత కోణంలోనూ, అలాగే ఉపాధి కల్పన కోణంలోనూ’’ ఇచ్చినట్టు మొహమాటం లేకుండా ఆమె చెబు తున్నారు. ఇంకోలా చెప్పాలంటే, రకరకాల ఉద్యోగాల్లో పురుషులపై నిషేధం విధిస్తున్నారన్నమాట. తద్వారా మహిళలకు కొత్త రకమైన అవకాశాలు కల్పిస్తున్నారనుకోవాలి. సరే... వీటి ద్వారా మనకర్థమయ్యేది ఏమిటి? అసలు ఏమైనా అర్థముందా వాటిల్లో? అలాటి ప్రతిపాదనలు అవసరమా? న్యాయ మైనవేనా? అనవసరంగా తీసుకొచ్చారా? మరీ నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయా? ఇప్పటివరకూ చెప్పినదాన్ని బట్టి నా ఆలోచన ఏమిటన్నది మీకు అర్థమై ఉంటుంది. కొంచెం వివరంగా చూద్దాం. మొదటగా చెప్పు కోవాల్సింది... ఈ ప్రతిపాదనల వెనుక పురుషులపై ఉన్న అప నమ్మకం గురించి! పురుష టైలర్లు, క్షురకులు, దుకాణాల్లో పనిచేసే వారి సమక్షంలో మహిళల భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్నారు. చిన్నపిల్లల రక్షణ విషయంలోనూ మనం మగ సిబ్బందిని నమ్మడం లేదంటే... వాళ్లకేదో దురుద్దేశాలను ఆపాదిస్తున్నట్లే! పైగా... ఈ ప్రతిపాదనలు కాస్తా మహిళల జీవితాల తాలూకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేవి కూడా! తాము సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా చేస్తున్నాయి. పురుషులు బాగా రాణిస్తున్న రంగాల్లో, వారి సేవలను తాను వినియోగించు కోవాలని ఒక మహిళ నిర్ణయించుకుంటే ఈ ప్రతిపాదనల పుణ్యమా అని అది అసాధ్యమవుతుంది. ఇంకోలా చూస్తే ఇది తాలిబనిజంకు ఇంకో దిశలో ఉన్న ప్రతిపా దనలు అని చెప్పాలి. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు మహిళలను తిరస్క రిస్తున్నారు. ఇక్కడ పురుషులను మహిళలకు దూరంగా ఉంచు తున్నారు. వారి దుర్మార్గమైన మనసులను విశ్వసించకూడదు; కాబట్టి వారిని మహిళలకు దూరంగా ఉంచాలి.ఇప్పుడు చెప్పండి... ఈ ప్రతిపాదనలు వాస్తవంగా అవసరమా? ఇలాగైతే పురుషుల దుస్తులమ్మే దుకాణాల్లో మహిళలు పని చేయకూడదు మరి! మహిళా జిమ్ శిక్షకులు పురుషులకు ట్రెయినింగ్ ఇవ్వకూడదు. ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేద్దామా?పురుష రోగులకు, వినియోగదారులకు సేవలు అందించడానికి అను మతిద్దామా? మగ శిక్షకులు, దుకాణాల్లోని మగ సేవకులను నమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు... స్త్రీలు పేషెంట్లుగా, వినియోగదారులుగా వచ్చినప్పుడు వాళ్లు ఎలా ఎక్కువ నమ్మకస్తులవుతారు?నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో మీకు ఇప్పటికి అర్థమైందనే అనుకుంటున్నా. పురుషులు నిర్వహిస్తున్న పనులపై నమ్మకం లేకపోతే... మహిళలపై కూడా అదే అవిశ్వాసం ఉంటుంది కదా! అప్పుడు అదే ప్రశ్న కదా ఉత్పన్నమయ్యేది! పురుషులను అస్సలు నమ్మడం లేదని చెప్పడం ద్వారా ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏ రకమైన సందేశం ఇవ్వదలచుకున్నారు?కొంచెం ఆలోచించి చూడండి. మహిళల విషయంలో వివక్ష చూపేవారిని మిసోజినిస్ట్ అంటూ ఉంటారు. ఈ లెక్కన బబితా చౌహాన్‌ను మిసాండ్రిస్ట్ అనాలి. మహి ళల పట్ల వివక్ష చూపడం ఎంత తప్పో... పురుషులపై చూపడం కూడా అంతే తప్పు. అయితే మిసోజినీ గురించి మనకు కొద్దోగొప్పో పరిచయం ఉంది కానీ మిసాండ్రిస్టుల విషయం నేర్చుకోవాల్సే ఉంది. ఈ పనికిమాలిన విషయానికి మనం బబితా చౌహాన్‌కు కృతజ్ఞులుగా ఉండాలి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వ్యక్తిగా టాటా ఎలా ఉండేవారు?
అత్యంత ప్రభావవంతుల జీవితాలు ఎలా ఉంటాయో మనకు ఎప్పుడూ తెలీదు. కేవలం వారి కంపెనీల గురించిన ఉత్థాన పతనాలే తప్ప వ్యక్తిగతజీవితంలోని ఎగుడుదిగుళ్లు బయటికి రావు. ఇటీవల మరణించిన దేశంలోని అతి పెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రతన్ టాటా చిన్నతనంలో తల్లితండ్రులు విడాకులు తీసుకున్న కారణంగా అభద్రతకు గురయ్యారు. దానివల్లే పాఠశాలలో హేళన ఎదుర్కొన్నారు. ప్రేమించినప్పటికీ పెళ్లికి దూరంగా ఉండిపోయిన రతన్‌కు తన చివరి జీవితంలో తోడుగా ఉన్నది టిటో అనే కుక్క. టిటోతో గడిపే సమయమే ఆయనకు రోజులో అత్యుత్తమంగా ఉండేదట.ఇలాంటి ఎన్నో అంశాలను ‘రతన్ టాటా: ఎ లైఫ్’ పుస్తకం వెల్లడిస్తుంది.మనందరికీ పారిశ్రామికవేత్త రతన్ టాటా తెలుసు. ఒక పారిశ్రామికవేత్తగా ఆయన ప్రత్యేకత కలిగివున్నారు. కానీ ఒక వ్యక్తిగా ఆయన ఎలా ఉండేవారు? ఆయనకు ఎలాంటి బాల్యం ఉండేది? ఆయన ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోని స్త్రీలు ఉన్నారా? ఆయన వ్యక్తిగత జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఏమిటి? ఇలాంటి అంశాలను సాధారణంగా మనం ఎప్పటికీ తెలుసుకోలేం. కానీ థామస్ మాథ్యూ ఇటీవల ప్రచురించిన పుస్తకం ‘రతన్ టాటా: ఎ లైఫ్’ కలిగించే మహదానందం ఏమిటంటే, ఆయన ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను వెల్లడించారు.రతన్ టాటా పదేళ్ల వయసులో ఉండగా ఆయన తల్లితండ్రులు విడాకులు తీసుకున్నారు. అందువల్ల వాళ్ల నానమ్మ (నవాజ్‌బాయి టాటా) వద్ద పెరిగాడు. లేడీ టాటా వైభవంగా ఒక పెద్ద భవంతిలో యూనిఫారం ధరించిన పనివాళ్లతో నివసించారు. ఆమెకు రోల్స్ రాయిస్ కారు ఉండేది. నేను ‘బీబీసీ’ కోసం రతన్ టాటానుఇంటర్వ్యూ చేసినప్పుడు, తాను చెడిపోలేదని టాటా నొక్కి చెప్పారు; కాకపోతే ఎంతో గారాబంగా పెరిగానని ఒప్పుకున్నారు. అయితేఆ విషయాన్ని కనుగీటి మరీ చిరునవ్వుతో చెప్పారు.తమ తల్లితండ్రుల విడాకులురతన్ పై, ఆయన సోదరుడు జిమ్మీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని థామస్ మాథ్యూ మనకు చెబు తారు. అది వారిలో అభద్రతా భావాన్ని కలిగించింది. వారు పాఠ శాలలో చదువుతున్నప్పుడు ర్యాగింగ్‌కు గురయ్యారు, హేళనకు గురయ్యారు. ఈ సమయంలో టాటా తన నాన్నమ్మకు మరింత దగ్గర య్యారు. నిజం చెప్పాలంటే, ఆమెను ఆరాధించారు.సీనియర్ కేంబ్రిడ్జ్ విద్య పూర్తి చేసిన తర్వాత టాటా అమెరికా వెళ్లారు. కుమారుడు చార్టర్డ్ అకౌంటెన్సీ చదవడానికి బ్రిటన్ వెళ్లాలని ఆయన తండ్రి కోరుకున్నారు. కానీ రతన్ ఆర్కిటెక్చర్‌పై మనసు పడ్డారు. చివరికి ఆయన నిర్ణయమే గెలిచింది. చాలా ఏళ్ల తర్వాత రతన్ టాటా బొంబాయిలో హలేకై (సముద్రం పక్కని ఇల్లు అనిఅర్థం) అని పిలిచే తన సొంత ఇంటిని తానే డిజైన్ చేసుకున్నారు.అయితే టాటా అమెరికాతో ప్రేమలో పడ్డారు. వృద్ధురాలైన నానమ్మ ఆయన్ని తిరిగి రమ్మని గట్టిగా కోరుకోకపోతే, ‘‘ఆయన అమెరికాలోనే ఉండి పని చేస్తూ తన జీవితాన్ని అక్కడే గడిపేవారు. దానిని ఆయన తన రెండవ ఇల్లు అని పిలుస్తారు’’ అని మాథ్యూ వెల్లడించారు.లాస్ ఏంజిల్స్‌లో ఆయన తన మొదటి ప్రియురాలు కరోలిన్ ఎమ్మన్స్ను కలుసు కున్నారు. ఆమె తండ్రి ఫ్రాంక్ ఆయన మొదటి బాస్. ఆయనే వారిని పరస్పరం పరిచయం చేశారు. రతన్ జీవితంలో మరో మూడు ప్రేమలు ఉన్నాయి కానీ ఎవరినీ పెళ్లి చేసు కోలేదు. ‘బీబీసీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను ఇతర విషయాలకు ప్రాధాన్యంఇచ్చాను గానీ ఎన్నడూ పెళ్లిపై దృష్టి పెట్టలేదని చెప్పారు. అయినప్పటికీ, కరోలిన్ తో టాటా టచ్‌లో ఉండేవారు. 2017లో జరిగిన ఆయన 80వ పుట్టినరోజుకు ఆమె హాజరయ్యారు. రతన్ అమెరికాలో ఉన్న ప్రతిసారీ కరోలిన్‌ను డిన్నర్‌కి తీసుకువెళ్లేవారని మాథ్యూ పేర్కొన్నారు. అందుకే దీన్ని చేదైన తీపి కథగా నేనుభావించడంలో పొరబడలేదు కదా? ఇది కచ్చితంగా నిజమని కూడా అనిపిస్తుంది.టాటా వ్యక్తిత్వంలోని ఆకర్షణీయమైన అంశాలను థామస్ పుస్తకం వెల్లడిస్తుంది. ఉదాహరణకు, ఆయన చెక్స్ షర్టులను ఇష్టపడే వారు. ‘‘ఆయన బాలుడిగా లేదా పెద్ద వయస్సులో ఉన్నప్పుడు తీసిన ఫొటోలలో దాదాపు 90 శాతం వరకు ఆయన ఫార్మల్ దుస్తులుకాకుండా చెక్స్ షర్టు ధరించి ఉన్నట్లు చూపుతాయి.’’ ఆయనకుకార్లంటే కూడా మోజు ఉండేది. వాటిని హాలెకైలో ప్రత్యేకంగా నిర్మించిన నేలమాళిగలో భద్రపరిచారు. అమెరికన్ ‘మజిల్ కార్లు’ అంటే ఆయనకు ఎంతో ఇష్టం.టీవీలో రతన్ టాటా అంత్యక్రియలను చూసిన మీకు, ఆయన పెంచిన కుక్క గోవా ఎలా దూకి శవపేటిక పక్కన కూర్చుందోగుర్తుకు వస్తుంది. టాటా తన కుక్కలకు ఎంత సన్నిహితంగాఉండేవారో ఇది తెలియజేస్తుంది. మాథ్యూ దీనిపై పూర్తి కథను వెల్లడించారు.ఆయన కుక్కలను తనకు లేని పిల్లలుగా చూసుకున్నారన్న భావన మీకు వస్తుంది. వీటిలో చాలా కుక్కలను టిటో, ట్యాంగోఅనిపిలిచేవారు. మాథ్యూ అదే పేరుతో ఉన్న మూడు తరాలకుక్కల గురించి చెబుతారు.2008లో ట్యాంగోలలో ఒకదానికి కాలు విరిగింది. అప్పుడు టాటా ఆ కాలిని రక్షించగల పశువైద్యుని కోసం ప్రపంచాన్ని జల్లెడ పట్టారు. చివరికి ట్యాంగోను చికిత్స కోసం మిన్నెసోటా (యూఎస్ నగరం) తీసుకెళ్లారు.తన చివరి జీవితంలో టిటో ఆయన ప్రధాన సహచరుడు. ‘‘ఇప్పుడు టాటాకు టిటో మాత్రమే ఉంది’’ అని మాథ్యూ రాశారు. ‘‘ప్రతి సాయంత్రం టిటో కోసం ఏ అవాంతరం లేకుండా ఒక సమయం రిజర్వ్ చేయబడేది. ఆ షెడ్యూల్‌కు ఎవరైనా, లేదా ఏ కార్య క్రమమైనా భంగం కలిగించడం టాటాకు ఇష్టం ఉండేది కాదు. టిటోతో గడిపే సమయమే ఆయనకు రోజులో అత్యుత్తమ సమయం’’ అని మాథ్యూ వివరిస్తారు.బహుశా నమ్మశక్యం కాని విధంగా, టాటాలో చిలిపిగుణం కూడా ఉండేది. బోర్డ్ మీటింగ్‌లలో వృద్ధ డైరెక్టర్లు తమ బూట్లను తీసేస్తారని గమనించిన తర్వాత, ఆయన నిశ్శబ్దంగా వాటిని వీలైనంత దూరంలోకి తన్నేవారు. ఆ బూట్లు ఎక్కడ ఉన్నాయో వారికి కనిపించనప్పుడు అల్లరిగా నవ్వుతూ ఉండేవారు. మాథ్యూ పుస్తకంలోని అన్ని విశేషా ల్లోకీ ఇది నాకు రసవత్తరమైన సంగతిగా అనిపించింది.అయితే, సైరస్ మిస్త్రీ, టెట్లీ టీ, కోరస్, జాగ్వార్ అధ్యాయాలతో సహా ఇంకా చాలానే ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆ వివరాలు ఉండకుండా ఎలా ఉంటాయి? కానీ వ్యక్తిగత వివరాలే నా దృష్టిని ఆకర్షించాయి. అవి మిమ్మల్ని కూడా ఆకర్షిస్తాయని నేను ఆశించవచ్చా?- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- కరణ్ థాపర్ -
చరిత్రలో సువర్ణాధ్యాయం
రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్‌కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మధ్యఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిదని అంటారు విలియం డార్లింపిల్. క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 12, 13 శతాబ్దాల కాలం ఇండియాలో సువర్ణాధ్యాయం అని చెబుతారు తన తాజా పుస్తకంలో. భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్‌కు వ్యాప్తి చెందిన వైనం గురించి రాశారు. ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందన్న విమర్శలను డార్లింపిల్ కొట్టేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం’’ అంటారు.విలియం డార్లింపిల్ తాజా పుస్తకం భారతీయ చదువరులకు బాగా నచ్చుతుందనుకుంటున్నాను. ఎందుకంటే... మనలాంటి వాళ్లు చాలాకాలంగా నమ్ముతున్న విషయాన్ని ఆయన మరోసారి రూఢి చేశారు. అయితే అదేమిటన్నది ఆయన మాటల్లో వినడమే మేలు. డార్లింపిల్ రాసిన పుస్తకం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12 – 13 శతాబ్దాల మధ్య కాలం నాటి పరిణామాలకు సంబంధించినది. ఈ కాలానికి సంబంధించి ఆయన ఏమంటారంటే... ‘‘రోమ్కు, ఆ తరువాత మధ్యధరా, యూరప్‌కు గ్రీస్ ఎలాంటిదో... దక్షిణాసియా, మ««ధ్య ఆసియా, ఆ మాటకొస్తే చైనాకూ భారత్ అలాంటిది’’ అని!ప్రాచీన భారతదేశం ప్రపంచంలో తీసుకొచ్చిన మార్పుల గురించి డార్లింపిల్ ‘ద గోల్డెన్ రోడ్: హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్’’ పేరుతో రాసిన పుస్తకంలో అక్షరబద్ధం చేశారు. భారతీయల చెవులకు ఇంపైన ఇంకో మాట కూడా ఇందులో ఉంది. ఇది చైనాతో భారత్ పోలికకు సంబంధించినది. చైనా తనను తాను ఈ ప్రపంచానికి కేంద్రంగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు ప్రత్యక్ష వ్యాపారం ఉన్న ఆనవాళ్లేమీ లేవంటారు ఆయన. ఆ కాలంలో ‘‘ఒకరి గురించి మరొకరికి చూచాయగా మాత్రమే తెలుసు’’ అని ఆయన యూరప్, చైనాల గురించి నాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్, రోమన్ సామ్రాజ్యాల మధ్య వాణిజ్య విస్తృతి చాలా ఎక్కువ. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వసూలు చేసే సుంకం రోమన్ సామ్రాజ్య ఖజానాలో మూడో వంతు వరకూ ఉండేది. ఇంకో రుజువు ఏమిటంటే... భారతీయ సంగ్రహాలయాల్లో రోమ్ సరిహద్దుల్లోని దేశాల్లోనూ లేనన్ని రోమన్ నాణేలు ఉండటం. ఇది భారత్– చైనాల మధ్య శత్రుత్వాన్ని కొత్త రూపంలో రాజేసినట్టుగా లేదూ?ఇవన్నీ డార్లింపిల్ పుస్తకంలో మూడు రకాల కథనాల్లో కనిపిస్తాయి. చైనా, మధ్యాసియాలకు ఆపై సైబీరియా, మంగోలియాల వరకూ విస్తరించిన బౌద్ధం తాలూకూ కథనం ఒకటైతే... భారతీయ గణిత, ఖగోళ శాస్త్ర భావనలు అరబ్ దేశాలకు, అక్కడి నుంచి యూరప్‌కు వ్యాప్తి చెందిన వైనం రెండో కథనం. హిందూయిజ, సంస్కృతాలు దక్షిణాసియాలో కంబోడియా, లావోస్, జావాల వరకూ వ్యాపించిన కథనం చివరిది. బాగ్ధాద్ మంత్రుల మొదలుకొని ఇటలీ గణిత శాస్త్రవేత్తల వరకూ రకరకాల పాత్రల ద్వారా ఈ కథనాలు నడుస్తాయి. టొలెడో మతాధికారి, చైనాలోని ఏకైక మహిళ సామ్రాజ్ఞి, కంబోడియాలోని అంగ్‌కోర్‌వాట్, జావాలోని బోరోబుడుర్, బిహార్‌లోని నలందాల వెనుక దాగి ఉన్న ఎన్నో కథలను వివరిస్తుందీ పుస్తకం. టొలెడో మతాధికారి 1068లో ప్రపంచంలోని మే«ధా చరిత్ర గురించి రాస్తూ... అది భారత కాలమని వర్ణించాడు. ‘విలియం ద కాంకరర్’ తొలిసారిగా బ్రిటిష్ గడ్డపై అడుగుపెట్టిన ఈ కాలంలోనే రాసిన ఈ చరిత్రలో భారత్ తన వరాలకు పేరొందిందని రాశాడు. ‘‘శతాబ్దాలుగా విజ్ఞానానికి సంబంధించిన అన్ని శాఖల్లో భారతీయుల సామర్థ్యాన్ని రాజులు అందరూ గుర్తించారు. జ్ఞానవంతులు వాళ్లు. జ్యామితి, అంక గణితాల్లో ఎంతో పురోగతి సాధించారు. వైద్యం విషయంలో మానవులందరి కంటే ముందున్నారు’’ అని కీర్తించాడు. ఈ పుస్తకం ద్వారా నాకు మూడు విషయాలు స్పష్టమయ్యాయి. పుస్తక శీర్షికలోని బంగారు దారి నేల మార్గం కాదు. సముద్రాల పైది. శక్తిమంతమైన వానాకాలపు గాలులు భారతీయ వర్తకులను పశ్చిమాన అరేబియాకు, తూర్పున సుమత్రా, జావా వరకు చేరేలా చేశాయి.దక్షిణాసియాకు హిందూయిజం, సంస్కృత సంబంధిత సంస్కృతి విస్తరించేందుకు యుద్ధాలు కారణం కాదు. ఇందులో బ్రాహ్మణ మిషనరీలు ముందుంటే... తరువాతి కాలంలో వ్యాపారులు వ్యాప్తి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... భారత్‌లోని అన్యాయ కుల వ్యవస్థ ఇక్కడకు విస్తరించకపోవడం. దురదృష్టం కొద్దీ డార్లింపిల్ ఈ విషయంపై ఎక్కువగా వివరించలేదు.అన్నింటికంటే ఆసక్తికరమైన అంశం, ఇది మనం ఆశించేది అయినప్పటికీ చారిత్రక వాస్తవం కాకపోవచ్చు... సోర్బోన్ , ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాన్నీ నలందా విశ్వవిద్యాలయ స్ఫూర్తితో ఏర్పాటు చేశారని అనిపిస్తుంది. చివరగా... ప్రాచీన భారతదేశం విశ్వగురు అని, 12వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ఆ బంగారు కాలం అంతరించడం మొదలైందని వాదించే హిందుత్వవాదులకు ఈ పుస్తకం మద్దతుగా నిలుస్తుందని కొంతమంది విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. డార్లింపిల్ రెండింటికీ సంబంధమే లేదని స్పష్టం చేస్తారు. ‘‘అది యాదృచ్ఛికం, అసంగతం.’’ ఆయన పుస్తకంలో చెప్పే ఇంకా ఆసక్తికరమైన సంగతులు చాలానే ఉన్నాయి. వాటిని మీ కోసమే వదిలేస్తాను.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భారత రత్న ఇవ్వాల్సిన మనిషి
ఇటీవల మరణించిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’కు అన్ని విధాలుగా అర్హుడు. ఆయన సమర్థుడైన వ్యాపారవేత్త. దార్శనిక దృక్పథమున్న పారిశ్రామివేత్త మాత్రమే కాదు... మనుషుల పట్ల సహానుభూతి, ఆప్యాయతలు కలిగిన మంచి మనిషి. రతన్ టాటాను చాలామంది కేవలం ఆరాధించలేదు; హీరోగా భావించారు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. మరణానంతరమైనా ఆయనకు భారత రత్న ఇవ్వడం ద్వారా మనల్ని మనం గౌరవించుకునే పని మొదలు కావాలి. వేర్వేరు రంగాల్లో అర్హులైన వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లకూ ఈ పుర స్కారం దక్కి ఉంటే బాగుండేది. భారత రత్న విషయంలో రాజకీయ అనుకూలతల కంటే, అర్హతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ‘భారత రత్న’కు అన్ని విధాలుగా అర్హుడే. అయితే బతికున్న రోజుల్లోనే అవార్డు ఇచ్చి ఉంటే బాగుండేది. ఇటీవలే రతన్ టాటా మరణించిన నేపథ్యంలో మరణానంతరం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇస్తారా?మరణానంతరమైనా సరే... రతన్ టాటాకు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలి అనేందుకు బోలెడు కారణాలు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి, ఆయన సమర్థుడైన వ్యాపారవేత్త. దార్శనిక దృక్ప థమున్న పారిశ్రామివేత్త కూడా. మనుషుల పట్ల సహానుభూతి, ఆప్యాయతలు కలిగిన మంచి మనిషి. అయితే ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్లు చాలామందే ఉన్నారు. టాటాను వీరందరి నుంచి వేరు చేసే లక్షణం ఏదైనా ఉందీ అంటే... అది ఆయన అందరి నుండి పొందిన గౌరవం, మర్యాద, మన్ననలు. రతన్ టాటాను చాలా మంది కేవలం ఆరాధించలేదు; హీరోగా భావించారు. ఒకరకంగా చెప్పాలంటే పూజించారు అనాలి! ఇలాంటి వాళ్లు కొందరే కొందరు ఉంటారు. వారిలో రతన్ టాటా ఒకరు!రెండో విషయం... మనం ఆదర్శంగా భావించే వ్యక్తికి లభించే గుర్తింపు కూడా ఆ స్థాయిలోనే ఉండాలని ఆశిస్తాం. ఎందుకంటే వీళ్లు కేవలం సాధకులు మాత్రమే కాదు... చాలా ప్రత్యేకమైన వాళ్లు. అందుకే దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం అలాంటి వారికి దక్కడం ఎంతైనా ఆహ్వానించదగ్గ విషయం.దేశంలో ఇప్పటివరకూ 53 మందికి భారత రత్న పురస్కారం లభించింది. టాటా వీరందరిలోనూ ఉన్నతుడిగానే నిలుస్తారు. బి.సి. రాయ్, పి.డి. టండన్ , కె. కామరాజ్, వి.వి. గిరి, ఎం.జి. రామచంద్రన్ , రాజీవ్ గాంధీ, అరుణా అసఫ్ అలీ, గుల్జారీలాల్ నందా, గోపీనాథ్ బోర్డోలోయి, కర్పూరీ ఠాకూర్, చౌధురీ చరణ్‌సింగ్... లాంటి రాజకీయ నాయకుల విషయంలో అది నిజం కాదా?ఇంకోలా చెబుతాను. మదర్ థెరీసా, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, అమర్త్య సేన్ , పండిట్ రవిశంకర్, లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్ , భీమ్సేన్ జోషీ, సచిన్ టెండూల్కర్... అందరూ భారత రత్నకు అర్హుల నుకుంటే, రతన్ టాటాకు ఎలా కాదనగలం?వాస్తవం ఏమిటంటే... ఈ అవార్డు ఇచ్చేది రాజకీయ నాయకులు. వాళ్లు ఎక్కువగా రాజకీయ నాయకులకే ఇస్తూంటారు. ఇప్పటివరకూ అందుకున్న 53 మందిలో 18 మంది మాత్రమే ఇతర రంగాల్లో అత్యు న్నత ప్రతిభను కనబరిచినవారు. 1954 నుంచి తొలిసారిగా భారత రత్న పురస్కారం ప్రదానం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఒకే ఒక్క పారిశ్రామిక వేత్త, అత్యంత అర్హుడైన జేఆర్డీ టాటాకు మాత్రమే ఆ అవార్డు దక్కింది. అంతే!వేర్వేరు రంగాల్లో అర్హులైన వాళ్లు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్లకూ ఈ పురస్కారం దక్కి ఉంటే బాగుండేదని నేను అనుకుంటూంటాను. బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్, అమితాబ్ బచ్చన్ , ఫీల్డ్ మార్షల్ మానెక్‌శా, సల్మాన్ రుష్దీ, జూబిన్ మెహతా వంటి వాళ్లు ఒక్కొక్కరూ తమ వైయక్తిక ప్రతిభతో ఆ యా రంగాల్లో అత్యున్నత శిఖరాలను అందుకున్న వారే. ప్రపంచం వీరి ప్రతిభను గుర్తించింది, కీర్తించింది. దురదృష్టవశాత్తూ మనం ఆ పని చేయలేకపోయాం.ఇప్పటికీ సమయం మించిపోలేదు. రతన్ టాటాకు భారత రత్న ఇవ్వడం ద్వారా మనల్ని మనం గౌరవించుకునే పని మొదలు కావాలి. బి.ఆర్.అంబేడ్కర్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, అబుల్ కలావ్‌ు ఆజాద్, మదన్ మోహన్ మాలవీయా వంటి వారికి మరణానంతరం దశాబ్దాల తరువాత భారత రత్న ఇవ్వగలిగినప్పుడు... 2008లో మరణించిన ఫీల్డ్ మార్షల్ మానెక్శాకు, 2021లోనే కన్ను మూసిన దిలీప్‌కుమార్‌తోపాటు మనతోనే ఉన్న అమితాబ్ బచ్చన్,సల్మాన్ రుష్దీ, జూబిన్ మెహతా వంటి వారిని భారత రత్నతో సత్కరించడం సాధ్యమే! అయితే ఇక్కడ మనం ఇంకో నిష్ఠుర సత్యాన్ని అర్థం చేసు కోవాలి. భారత రత్న విషయంలో రాజకీయ అనుకూలతల కంటే అర్హతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పేర్లు అవసరం లేదు. వారి భేషజాలను దెబ్బతీయాలన్న ఆలోచన కూడా నాకు లేదు. కానీ, వారందరూ రాజకీయ నేతలే. జవహర్లాల్ నెహ్రూతో మొదలుపెట్టి... నరేంద్ర మోదీ వరకూ అన్ని ప్రభుత్వాలూ ఈ పని చేశాయి.విషాదం ఏమిటంటే... మనం తరచూ కొంతమంది అనర్హులకు భారత రత్న ఇచ్చాం. ఇంకోలా చెప్పాలంటే అర్హులకు నిరాకరించాం. ఎలాగైతేనేం, ఆ అవార్డు గౌరవమైతే మసకబారింది. అర్హులకు ఇవ్వలేదు, అనర్హులకు ఇచ్చారన్న వాదాన్ని కాసేపు పక్కనపెట్టి... జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సమయం ఇదే. దేశమాత అసలు ఆణిముత్యాలను ప్రజలెప్పుడూ గుర్తుంచుకుంటారు. సందేహం ఏమీ లేదు. రతన్ టాటా అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది సామాన్యులు ఈ విషయాన్ని మరోసారి నిర్ధ్ధరించారు. వార్తాపత్రికల్లో పేజీలకు పేజీ కథనాలు, టెలివిజన్ ఛానళ్లలో గంటల లైవ్ కవరేజీలన్నీ రతన్ టాటాపై ఈ దేశ ప్రజలకు ఉన్న అభిమానాన్ని చాటేవే! ఎవరూ కాదనలేని సత్యమిది. అలాగని రాజ్యం ఆయనను గుర్తించదంటే మాత్రం సరికాదు. నన్నడిగితే అలా చేయడం క్షమించలేనిది.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సానుభూతి నుంచి ఛీత్కారం దాకా...
ఒకప్పుడు ఇజ్రాయెల్ అంటే ప్రపంచమంతటికీ ఎంతో ఇష్టం. అత్యద్భుతమైన నిఘా వ్యవస్థ, మాజీ ప్రధానులను సైతం జైలులో పెట్టగల న్యాయవ్యవస్థ, సరదాగా మాటలకు ఉపక్రమించే ప్రజల తీరు వంటి లక్షణాలన్నింటినీ మెచ్చుకునేవారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడికి గురైనప్పుడు కూడా ఇజ్రాయెల్ పట్ల ప్రపంచ సానుభూతి ఉండింది. ఎంతైనా ఉగ్రవాద బాధితురాలు అనుకున్నారు. అయితే ఆ జ్ఞాపకాలేవీ ఇప్పుడు లేవు. బదులుగా ఇజ్రాయెల్ చేపట్టిన మానవ హననమే అందరి కళ్లల్లో మెదులుతోంది. తమను హింసలకు గురిచేసిన హిట్లర్ మాదిరిగానే తామూ పాలస్తీనీయులను హింసలు పెడుతున్నామని అంగీకరించేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. కాకపోతే ఇదే అద్దంతో మరేదో చూపేందుకు ఇజ్రాయెల్ తాపత్రయ పడుతోంది. బ్రిటన్ మాజీ ప్రధాని హరాల్డ్ మెక్‌మిలన్‌కు రాజకీయాల్లో వారం రోజులంటే చాలా ఎక్కువ సమయం! ఇదే విధంగా హమాస్‌తో నడుస్తున్న యుద్ధం విషయంలో ఇజ్రాయెలీలు కూడా ఒక యుగమైందని అనుకుంటున్నారు. ఈ ఏడాది సమయంలో ఇజ్రాయెలీల ప్రపంచం మొత్తం తల్లకిందులైంది. తమ సంబంధాలన్నీ వాళ్లు కోల్పోయారు.గత ఏడాది అక్టోబర్ ఏడవ తేదీన హమాస్ చేసింది అత్యంత భయంకరమైంది, ఆటవికమైంది. అది క్షమించరాని నేరం. సుమారు 1,200 మంది ఇజ్రాయెలీల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న హమాస్ ఆ రోజు ఇంకో 250 మందిని బందీలుగా చేసుకుంది. ఇజ్రాయెల్ మొత్తం ఈ ఘటనతో వణికిపోయింది. ఇజ్రాయెల్ పట్ల ఆ రోజు కొంతైనా సానుభూతి వ్యక్తమైంది. ఎంతైనా ఉగ్రవాద బాధితురాలు కదా అని అనుకున్నారు. కానీ, ప్రతీకారం పేరుతో ఏడాది కాలంలో ఇజ్రాయెల్ దమనకాండను పరిశీలిస్తే, హమాస్ అకృత్యాలు కూడా పేలవమై నవిగా అనిపించక మానవు. ఆడవాళ్లు, పిల్లలతోపాటు 42 వేల మంది పాలస్తీనియులు ఇప్పటిదాకా చనిపోయారు. ఇంకో లక్ష మంది గాయ పడ్డారు. గాజాలో 23 లక్షల మంది జనాభాకు నిలువ నీడ లేకుండా పోయింది. ఎటు చూసిన విధ్వంసపు ఆనవాళ్లే. అందుకేనేమో... ఏడాది క్రితం వరకూ ఇజ్రాయెల్‌పై ఉన్న సానుభూతి కాస్తా ధిక్కారంగానూ, ఛీత్కారంగానూ మారిపోయింది. అందరి దృష్టిలో ఇజ్రాయెల్ ఇప్పుడు దురాక్రమణదారుగా మారిపోయింది!హమాస్‌ను సమూలంగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కంకణం కట్టుకున్నారు. దశాబ్దాల పాలస్తీనా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టడం ద్వారా తమకు మేలు జరుగుతుందని ఆశించారు. అయితే హమాస్ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటు కోవడమే కాకుండా, సైద్ధాంతికంగా మరింత బలం పుంజుకుందని చెప్పాలి.ఇంకో ముఖ్యమైన విషయం... నెతన్యాహూ గాజాపై చేస్తున్న యుద్ధం కాస్తా పాలస్తీనా అంశాన్ని అంతర్జాతీయ వేదిక పైకి చాలా బలంగా చేర్చింది. ఐక్యరాజ్య సమితిలోనూ పాలస్తీనాకు న్యాయం జరగాలన్న నినాదాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు... అగ్రరాజ్యం అమెరికా విశ్వవిద్యాలయాల్లోనూ ఇజ్రాయెల్ వ్యతిరేక ఉద్యమాలు, ప్రదర్శనలు జరగడం గమనార్హం. నెతన్యాహూ ఈ పరిణామాలను బహుశా ఊహించి ఉండరు. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం నడిచిన గత 365 రోజుల్లో ఇర్లాండ్, స్పెయిన్ , నార్వేలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి. సౌదీ అరేబియా ఇంకో అడుగు ముందుకేసి ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాల కోసం పాలస్తీనా సమస్య పరిష్కారాన్ని ఒక నిబంధనగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నోట పాలస్తీనా ఏర్పాటు మాట వస్తూనే ఉంది.పాలస్తీనా, ఇజ్రాయెల్ సమస్య పరిష్కారానికి ఇప్పుడు అందరూ సూచిస్తున్న మార్గం ఆ ప్రాంతాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా విడగొట్టడం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని అందరూ మరచిపోతున్నారు. ఎందుకంటే వెస్ట్‌బ్యాంక్‌లో సుమారు ఏడు లక్షల మంది ఇజ్రాయెలీ వలసదారులు ఉంటున్నారు. గాజాలో తను చెప్పినట్టు నడుచుకునే అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు నెతన్యాహూ శతథా ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు పాల స్తీనా దేశం ఎక్కడ ఏర్పాటు అవుతుంది? ఏడాది క్రితం... కనీసం ఆరు నెలల క్రితం కూడా పాలస్తీనీ యులు దేశం మొత్తం తమదే అన్నట్టుగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. యూదులకు ఇది అస్సలు అంగీకారం కాదు. కారణం ఒక్కటే. తాము యుగాలుగా ఆశిస్తున్న తమదైన మాతృదేశం తమకు లేకుండా పోతుందని!ఎంత విచిత్ర పరిస్థితి? పాలస్తీనాకు న్యాయం జరగాలని మొట్టమొదటిసారి ప్రపంచం మేల్కొన్న సమయంలో అసలు ఆ న్యాయం ఏమిటన్నది కూడా తెలియని పరిస్థితి. రాజకీయ ఆలోచన లకు అతీతంగా అంతా మారిపోయింది. మరో దృక్కోణం ఒకటి ఉంది. ఇది ఇజ్రాయెలీలకు అంతగా రుచించకపోవచ్చు. ఆశ్చర్యంగానూ అనిపించవచ్చు. ఏడాది క్రితం వరకూ తమ దేశం పట్ల ఇతరులకు ఉన్న దృక్పథం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే... ఆక్రమణదారుడైనప్పటికీ బాధితు డిగా తనను తాను చిత్రీకరించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది మరి!2023లో ప్రజాభిప్రాయం ఒకదాన్ని సేకరించే ముందు కాలంలో ఇజ్రాయెల్ అంటే ప్రపంచమంతటికీ ఎంతో ఇష్టం. అత్యద్భుతమైన నిఘా వ్యవస్థ, మాజీ ప్రధానులను సైతం జైలులో పెట్టగల న్యాయ వ్యవస్థ, సరదాగా మాటలకు ఉపక్రమించే ప్రజల తీరు వంటి లక్షణా లన్నింటినీ మెచ్చుకునేవారు. అయితే ఆ జ్ఞాపకాలేవీ ఇప్పుడు లేవు. బదులుగా ఇజ్రాయెల్ చేపట్టిన మానవ హననం మాత్రమే అందరి కళ్లల్లో మెదలుతోంది. ఒకప్పుడు అభినందించిన ప్రజలే ఇప్పుడు ఛీత్కరించే పరిస్థితి. ఇజ్రాయెలీలకు ఈ విషయాలు తెలియవా? రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ల చేతిలో ఊచకోతకు గురైన వాళ్లే కదా! హిట్లర్ మాదిరిగానే తామూ పాలస్తీనీయులను నానా హింసలూ పెడు తున్నామన్న విషయాన్ని అంగీకరించేందుకు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. కానీ వాస్తవమైతే అదే! కాకపోతే ఇదే అద్దంతో మరేదో చూపేందుకు ఇజ్రాయెల్ తాపత్రాయపడుతోంది. హమాస్ నేత ఇస్మాయెల్ హనియే, హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లాల నాటకీయ హత్యలు ఇజ్రాయెలీల నిఘా వ్యవస్థ చురుకు దనానికి నిదర్శనంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. కానీ గత ఏడాది అక్టోబరులో నిఘా విభాగం వాళ్లు సిగ్గుతో తలదించుకున్నారు. అయితే గాజాపై ఇజ్రాయెల్ చేసిన రక్తపు మరక అంత తొందరగా చెరిగిపోయేది కాదు. మరచిపోయేది, క్షమించదగ్గది కూడా కాదు. ఇజ్రాయెల్‌ను ఓ భిన్న దేశంగా చూపింది ఈ యుద్ధం. ఈ విషయాన్ని ఇజ్రాయెలీలు ఎంతవరకూ అంగీకరిస్తారన్నది చూడా ల్సిన విషయం. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వివేచన హక్కుపై నిషేధమా?
మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. అదే సమయంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... అది మనల్ని మనిషిగా తక్కువ చేసేస్తుంది. ప్రభుత్వం నిజాయితీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే సృజనాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికి అవకాశాలు న్నాయి. కానీ దండనలతో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది.అప్పుడు నాకు 16 ఏళ్లు ఉంటాయి. కానీ, నిన్ననే జరిగినంతగా ఆ సంగతి గుర్తుండి పోయింది. వీకెండ్ కోసం స్టోవ్ (యూఎస్‌లోని వమాంట్ రాష్ట్రంలో ఒక పట్టణం) నుండి వచ్చాను నేను. అందరం కలిసి టీవీ చూస్తున్నాం. కిరణ్ సిగరెట్ తాగుతూ ఉంది. ‘క్యారీ ఆన్’ (ప్రసిద్ధ బ్రిటిష్ కామెడీ సీరీస్)లోని ఒక చిత్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు సగం వరకూ రాగానే, మధ్యలో ఒక వాణిజ్య ప్రకటన మా దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు బ్రిటిష్ పోలీసు అధికారులు రోడ్డు పక్కన ఉన్న ఒక కేఫ్‌ను దాటి నడుచుకుంటూ వెళుతుండగా, వారి చూపు ఒక అందమైన యువతిపైన పడుతుంది. ఎడమ చేతిలో పొడవాటి సిగరెట్‌తో ఉన్న ఆమె కొద్ది కొద్దిగా కాఫీని సిప్ చేస్తుంటుంది. ‘‘ఆమెను చూడు’’ అని మొదటి పోలీస్ ఆఫీసర్ గుసగుసగా అంటాడు. ‘‘సిగరెట్ తాగుతోంది కదా?’’ అని రెండో ఆఫీసర్. ‘‘ఆమె కాళ్లు నాకు నచ్చాయి.’’‘‘అవి, కాలుతున్న ఆమె సిగరెట్ పొడవంత ఉన్నాయి.’’‘‘ఆ పెదవులను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది నాకు.’’‘‘కంపు కట్టే యాష్‌ట్రేని ముద్దు పెట్టుకున్నట్లా?’’ఆ డైలాగ్ తర్వాత ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ముందుకు సాగిపోతారు. ఆ అందమైన యువతి స్క్రీన్ వైపు చూసి నవ్వుతుంది. విడివడిన ఆమె పెదవుల మధ్య పలువరుస నికోటిన్ మరకలతో పొగచూరి, గోధుమ వర్ణంలో ఉంటుంది! ‘యాక్’ అని అసంకల్పితంగా అరిచేశాను నేను. నా వెన్నులో వణుకు పుట్టింది. కిరణ్ అయితే తను తాగుతూ ఉన్న సిగరెట్‌ను అప్పటికప్పుడు విసిరి పారేసింది. ఆ వీకెండ్లో ఆమె మళ్లీ సిగరెట్ తాగినట్లు నాకు గుర్తు లేదు.ఆ వాణిజ్య ప్రకటనకు రూపకర్తలు ఎవరో నాకు తెలియదు. ప్రభుత్వమే చెప్పి చేయించిందో, లేదా ఏదైనా ప్రైవేటు ట్రస్టుఅందుకు నిధులు సమకూర్చిందో కానీ అది మాత్రం చాలా ప్రభావ వంతంగా ఉంది. మన ప్రభుత్వం నిజాయతీగా కనుక ధూమపాన నిర్మూలన జరగాలని కోరుకుంటూ ఉంటే ఆ ప్రకటనలో ఉన్నట్లే సృజ నాత్మకమైన, చిరస్మరణీయ ప్రచారాన్ని చేపట్టాలి. పొగతాగే వారికి నచ్చజెప్పి ఆ అలవాటును మాన్పించటానికైతే అవకాశాలున్నాయి. కానీ దండనలతో వారిలో మార్పు తేచ్చే ప్రయత్నాలు మాత్రం విఫలం అవుతాయి. అందుకే ధూమపానాన్ని నిషేధించాలన్న నిర్ణ యాలు ఘోరమైన తప్పిదాలుగా మిగులుతున్నాయి. బ్రిటన్‌లో గత ప్రభుత్వం ఇలాంటి నిష్ఫల ప్రయత్నమే చేసింది. మన ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయదనే ఆశిస్తున్నాను. మంచేదో చెడేదో, తప్పేదో ఒప్పేదో, నైతికతేదో అనైతికమేదో మనకు మనం నిర్ణయించుకోగల మన సామర్థ్యమే నిస్సందేహంగా మనల్ని తక్కిన జంతువులకు భిన్నంగా ఉంచుతోంది. ఇతరులను మనం ప్రమాదంలోకి నెట్టనంత వరకు మనకున్న ఈ వివేచన హక్కు అభేద్యమైనది. అది మన వ్యక్తిత్వాన్ని కూడా నిర్వచిస్తుంది. అదే సమ యంలో, మనపై విధించిన పూర్తిస్థాయి నిషేధం ఏదైనా... మానవత లోని అత్యవసరతల్ని నిరాకరిస్తుంది. అది మనల్ని తక్కువ చేసేస్తుంది. సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం లేని పిల్లల్ని చూసి నట్లుగా మనల్ని చూస్తుంది. నిర్ణయించుకునే హక్కు నుండి మనం అవిభాజ్యంగా ఉండటం అన్న భావనతో ఇతరులు ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ ఒకే ఒక్క కార ణమే ఆ హక్కును నిలబెడుతుంది. మీకు భిన్నంగా ఉండటమనే నా హక్కులోనే నా వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది. అంతేకాదు, నాలోని ఆ భిన్న త్వం మీకు నచ్చకపోయినా మీరు గౌరవించాలనే నేను కోరుకుంటాను. పొగ తాగే విషయం కూడా ఇంతే. పొగ తాగకుండా ఉండేందుకు వెయ్యి మంచి కారణాలు ఉంటాయి. పొగ మాన్పించేందుకు నన్ను ఒప్పించటానికి పది లక్షల సానుకూల వాదనలు ఉంటాయి. కానీ అప్పటికి కూడా నేను పొగ తాగుతున్నానంటే మీరు నా మీద నిషేధం విధించకూడదు. నా ఇష్టాన్ని అడ్డుకోకూడదు. మీరిలా నా మంచి కోసమే చేస్తున్నారన్న మీ వాదన విచిత్రమై నది, నమ్మశక్యం కానిది. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అన్న దానిని నేను కాదనలేదు. నేనే కాదు, నాకు తెలిసిన ధూమమాన ప్రియులు ఎవరూ కూడా కాదనలేరు. అతిగా తినటం, మితిమీరిన వ్యాయామం, కళ్లకు ఒత్తిడి కలిగించుకోవటం, విపరీతంగా కోక్‌లు తాగటం... ఇవన్నీ కూడా హానికరం కాదని ఎవరూ అనరు. అయినప్ప టికీ వీటిల్లో దేనినైనా నేను ఇష్టపడితే కనుక, అప్పుడు కూడా నేను మాత్రమే సలహాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లే విషయాన్ని నిర్ణయించుకోవాలి. దాని వల్ల నేను ఇబ్బంది పడితే అలాగే కానివ్వండి. ఎందుకంటే నిర్ణయించుకునే హక్కులోనే ఆ నిర్ణయం వల్ల బాధ పడే హక్కు కూడా కలిసి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎలా ప్రవర్తించాలి? సమాధానం చాలా సరళమైనది, సూటిౖయెనది. నిషేధం విధించటం కాకుండా ఎవరికి వారు సిగరెట్‌కు దూరమయ్యేలా ప్రభావం చూపే చర్యలు తీసు కోవాలి. సిగరెట్ ప్యాకెట్ల మీద అతి పెద్ద, అత్యంత భయానకమైన ఆరోగ్య హెచ్చరికలను చేయవచ్చు. పన్నులను తరచుగా పెంచుతూ ఉండొచ్చు. (దీని వల్ల ఒక దశ తర్వాత ప్రభుత్వానికి రాబడి తగ్గవచ్చు లేదా ప్రతికూల ఉత్పాదకత సంభవించవచ్చు). ధూమపానానికి వ్యతి రేకంగా విస్తృత ప్రచారాన్ని చేపట్టేందుకు నిధులను అందజేయవచ్చు. ఈ మూడింటినీ నేను సమర్థిస్తాను. అంతేతప్ప ఎప్పుడూ కూడా ధూమపాన నిషేధానికి ప్రయత్నించకూడదు. వ్యక్తులు, సమూహాలు తాము కోరుకున్నప్పుడే తమకై తాము ఆ పనికి సంకల్పించటం జరుగుతుంది. వారి కోసం ప్రభుత్వమే ఆ పని చెయ్యకూడదు. మరింత స్పష్టంగా చెబుతాను. మంచి ప్రభుత్వాలు – పెద్దలు పిల్లల్లో పరిణతి తెచ్చే విధంగా – తమకు తాముగా నిర్ణయించుకునే అవకాశాన్ని, అవకాశంతో పాటుగా వచ్చే బాధ్యతను స్వీకరించే సమర్థతను తమ పౌరులకు అందిస్తాయి. ఆ విధంగా దేశం తన కాళ్ల మీద ఎలా నిలబడాలో నేర్చుకుంటుంది. ఇందుకు భిన్నంగా చెడు ప్రభుత్వాలు పెద్దల్ని కూడా పిల్లలుగా పరిగణిస్తూ వారికున్న నిర్ణయ అధికారాన్ని లాగేసుకుని తమ సొంత నిర్ణయాలను వారిపై అమలు చేస్తాయి. అలా దేశాలు కూలిపోవటం మొదలవుతుంది. అన్నట్లు, నేను పొగ తాగటం మానేసి చాలాకాలమే అయ్యింది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సమాఖ్యకు ‘జమిలి’ సవాళ్లు!
జమిలి ఎన్నికల వల్ల దేశానికీ, ప్రజాస్వామ్యానికీ ఎంతవరకు ఉపయుక్తం అనే దానిపై చర్చ జరుగుతోంది. లోక్‌సభ నుంచి అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు అనుకూలంగా ఎన్ని వాదనలున్నాయో, వ్యతిరేకంగా అన్ని వాదనలున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికల ఖర్చు కంటే తక్కువగా ఉంటుంది. కానీ అలా పొదుపు చేసే మొత్తం భారత్ లాంటి పెద్ద దేశానికి ఒక లెక్కలోకే వస్తుందా? అలాంటి ఎన్నికల వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించదా? బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు.నాకు తెలిసిన చాలామంది లాగే మీరు కూడా ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ను అర్థం చేసుకోవటానికి తన్నుకులాడుతుంటే కనుక మీకు సహాయం చేయటానికి నన్ను ప్రయత్నించనివ్వండి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే భావనను ప్రతిపాదించినవారు, దానిని వ్యతిరేకిస్తున్నవారు తమ అనుకూల, ప్రతికూల వాదనలతో మనల్ని ముంచెత్తారు. కానీ లాభ నష్టాల నడుమ దీనిపై మనమెలా ఒక తీర్పుకు రాగలం? ఈ వాదోపవాదాలన్నీ సముచితమైనవేనా? లేదా కొన్ని మాత్రమే మిగతా వాటి కంటే ప్రాముఖ్యమైనవా? ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే ఈ భావనకు మద్దతు లభించటానికి గల కారణాలతో విషయాన్ని ప్రారంభిద్దాం. మొదటిది – డబ్బు ఖర్చు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికలకు అయ్యే ఖర్చు కంటే తక్కువగా ఉంటుందనటంలో సందేహం లేదు. అయితే అలా పొదుపు చేసే మొత్తం ఏడాదికి రూ. 5000 కోట్ల కన్నా తక్కువేనన్నది శశి థరూర్, ప్రవీణ్ చక్రవర్తిల వాదన. ఇండియా వంటి భారీ ఆర్థిక వ్యవస్థకు ఇదేమంత తేడా చూపే మొత్తం అవుతుందని?రెండవ కారణం – ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆంక్షలు పరిమిత కాలానికి మాత్రమే వర్తింపులో ఉంటాయి కనుక రాజకీయ నాయకులు తమను తాము పాలనా వ్యవహారాలలో నిమగ్నం చేసు కోవచ్చు. అయితే ప్రవర్తనా నియమావళి అన్నది జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే అమలులో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో అదొక పెద్ద విషయమే అవదు. మళ్లీ ప్రశ్న, ఇదేమంత ముఖ్యమైన కారణం అవుతుందని?నిజమేమిటంటే, పై రెండూ కూడా చెప్పుకోదగిన కారణాలు కావు. ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన వ్యక్తీకరణ... ఎన్నికలు. వాటి నిర్వహణకు అయ్యే వ్యయాన్ని బట్టి, లేదా అవి సజావుగా జరిగేందుకు అవసరమైన నియమావళిని బట్టి ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని లాభనష్టాలను చర్చించకూడదు. ఇప్పుడు మనం వ్యతిరేక వాదనల్లోకి వద్దాం. మొదటిది – ఇది మన దేశ విలక్షణతకు విరుద్ధం అవుతుందా? మనది ఒకే దేశం–ఒకే మతం కాదు. ఒకే దేశం–ఒకే భాష కాదు. ఒకే దేశం–ఒకే సంస్కృతి కాదు. ఒకే దేశం–ఒకే విధమైన మరేదీ కాదు. మన వ్యత్యాసాలనే మన సంపదలుగా మలుచుకున్న రాష్ట్రాల సమాఖ్య మన దేశం. ఆ వ్యత్యాసాలు, సంపదలే మనల్ని ప్రత్యేకంగా ఉంచుతాయి. మనకు ప్రాముఖ్యం కల్పిస్తాయి. మరి ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ప్రత్యేకతలు, ప్రాముఖ్యాల నుంచి మన దేశాన్ని దూరం చేయదా? దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. రెండవది – ఒకే దేశం–ఒకే ఎన్నిక వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించే ప్రమాదంఉంటుందా? అలా జరిగితే – జరుగుతుందనే నా అనుమానం – అది దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఏకీకృత వ్యవస్థగా మార్చే ధోరణి కలిగి ఉండదా? వెంటనే కాకపోయినా, కాలక్రమేణా అలా జరిగే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల చిన్న రాష్ట్రాల ప్రాంతీయ ఆందోళనలు కేంద్రస్థాయి జాతీయ డిమాండ్లలో కొట్టుకుని పోతాయి. గోవా, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్, పుదుచ్చేరి, ఈశాన్య రాష్ట్రాల నిరసన గళాలు ఢిల్లీ రణగొణ ధ్వనుల్లో తేలిపోతాయి. మూడవది – పార్లమెంటరీ ఎన్నికలు క్రమంగా అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారినప్పుడు ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ధోరణిని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం లేదా? అదే జరిగితే, అది మన బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇది అర్థవంతమైన భయమే అయితే దీనిని తేలిగ్గా తీసుకోవలసిన అవసరం లేదు. ఇదంతా కూడా మన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘనకు గురి చేయగలిగినదే. ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని పర్యవసానాలపై ఆధారపడి ఉంది. అయితే మరొక విషయం కూడా ఉంది. మనం మన ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతంగా, వేళ్లూను కునేలా చేసుకోవలసిన అవసరం అది. నిజానికి 50 ఏళ్ల క్రితమే అటల్ బిహారి వాజ్‌పేయి ‘రైట్ టు రీకాల్’ (పదవుల్లో ఉన్నవారిని తొలగించే హక్కు)ను కోరు కున్నారు. దానికి పూర్తి భిన్నమైనది ఈ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’. ఓటు వేసే అవకాశాన్ని పరిమితం చేయటం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇది కురచబారుస్తుంది. ఇంకోలా చెప్పాలంటే, వెళ్లవలసిన మార్గాన్ని వెనక్కి తిప్పుతుంది.ఇంకొక సమస్య ఉంది. వాస్తవంలో ఎదురుకాగల సమస్య అది. ఒకవేళ ప్రభుత్వం ఐదేళ్ల కాల పరిమితి కంటే ముందు గానే తన మెజారిటీని కోల్పోతే ఏం జరుగుతుంది? మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సూచిస్తోంది. కానీ అది ఐదేళ్ల కాలానికి ఓటరు ఇచ్చిన తీర్పును పలుచబార్చదా? కొన్నిసార్లు వాళ్లు ఐదేళ్ల ప్రభుత్వానికి ఓటు వేస్తారు. మరికొన్ని సార్లు ఒకటీ లేదా రెండేళ్ల ప్రభుత్వానికి ఓటేస్తారు. ఈ విధంగా మనం ఓటు విలువను యథేచ్ఛగా తగ్గించటం లేదా?ఉప ఎన్నిక అవసరమైన ప్రతిసారీ నిస్సందేహంగా ఇలాగే జరుగుతుంది కానీ... వ్యక్తికి ఓటేయటానికి, మొత్తం అసెంబ్లీకో, పార్లమెంటుకో ఓటేయటానికి తేడా లేదా? ఆలోచించదగిన ప్రశ్నే ఇది. నిజానికి, మధ్యంతర ఎన్నికలకు కారణమయ్యేవి ఏవీ లేకుండా పోవు. ఇంకా అనేక కారణాల వల్ల కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చు. ఈ విధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు వీలుగా తక్కువ కాల పరిమితిని కలిగి ఉంటాయి. ఈ కోణంలోంచి చూస్తే ‘ఒకే దేశం–ఒకే’ ఎన్నిక వల్ల ఏం తేడా కనిపిస్తున్నట్లు? చెప్పాలంటే మనం మరిన్ని ఎన్నికలకు వెళ్లటం అవుతుంది తప్ప, తక్కువ ఎన్నికలకేం కాదు. కనుక, అంతిమంగా నేను చెబుతున్నదేమిటి? అది మీతో చెప్ప టానికి సంకోచిస్తున్నాను. ఏమైనా, నా అభ్యంతరాలన్నీ ఇక్కడ స్పష్టంగానే వ్యక్తం అయ్యాయి. మీరు నా మార్గదర్శకత్వాన్ని కోరుకుంటే కనుక అందుకు చాలినంతగానే రాసేశాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అన్నాడంటే మాటపై ఉన్నాడనే!
ఇచ్చిన మాటకే కాదు, తామన్న మాటలకూ ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే అతి కొద్దిమంది రాజకీయ నాయకులలో సీతారాం ఏచూరి ఒకరు. ఇంటర్వ్యూ లలో వెలిబుచ్చిన అభిప్రాయాల పర్యవసానాలను ఆ తర్వాత ఎదుర్కొనే ధైర్యం లేక ప్రసారాలకు ముందే వాటిని తొలగించమని నాయకులు కోరటమన్నది అసాధారణమేమీ కాదు. కానీ ఏచూరి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండేవారు. యునైటెడ్ ఫ్రంట్‌కు సీపీఎం మద్దతిస్తున్నప్పటికీ, అప్పటి ప్రధాని దేవె గౌడ మీద ఆయన చేసిన విమర్శ దీనికి నిదర్శనం. రాజకీయ నాయకులు ఏ మాత్రం సంకోచించకుండా తిరస్కరించే విజ్ఞప్తులను సైతం అంగీకరించటం కోసమే ఏచూరి మార్గాలను వెతికేవారు. ఆయన గుణం సావధానం. ఆయన జ్ఞాపకశక్తి అపారం.సీతారాం ఏచూరిని నేను మొదటిసారి ఎప్పుడు కలిశానో గుర్తుకు రావటం లేదు. బహుశా అది నేను 1990లో ఇండియాకు తిరిగి వచ్చిన కొద్ది రోజులకు కావచ్చు. అయితే నేనెప్పటికీ మర్చిపోలేనిది మాత్రం ఆయనతో సుదీర్ఘమైన నా మొదటి ఇంటర్వ్యూ. అది 1996వ సంవత్సరం.ఇంటర్వ్యూ చేసింది ఆనాటి నూతన ప్రధాని దేవె గౌడ గురించి. అప్పటికి సీతారాంతో నాకు బాగా పరిచయం ఏర్పడి ఉంది. ఇంటర్వ్యూలో ‘సీత’ (తనను ఇలా పిలవొచ్చని ఏచూరి నాతో అన్నప్పట్నుంచీ నేనాయన్ని సీత అనటం మొదలుపెట్టాను) దేవె గౌడ తన అధికారిక పర్యటనకు తనతో పాటుగా అనేక మంది తన కుటుంబ సభ్యులను ఇటలీకి వెంటబెట్టుకుని వెళ్లటాన్ని విమర్శించారు. నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి దేవె గౌడ పార్టీ, సీపీఎం రెండూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నందు వల్ల సీత అలా విమర్శించటం అనూహ్యం, దాపరికం లేకపోవడం మాత్రమే కాక వార్తగా కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. అది కేవలం ఒక సాధారణ వ్యాఖ్య కాదు. పూర్తి స్థాయి విమర్శ. ఇంటర్వ్యూ ప్రసారానికి ముందు రోజు సాయంత్రం సీత నాకు ఫోన్ చేశారు. ‘‘ఇంటర్వ్యూలో నేను చెప్పిన దానిని తొలగించమని అడగటానికి నేను మీకు కాల్ చేయలేదు’’ అని నవ్వుతూ అన్నారు. అదొక వ్యాప్తి చెందే స్వభావం కలిగిన సహృదయ హాసం. ‘‘నేను దాని గురించి ఇప్పటికే నా సహచరులకు చెప్పి, వారి స్పందనలకు తగిన వివరణ ఇచ్చేశాను కనుక దానిని మీరు తీసేయలేదని నిర్ధారించుకోటానికే మీకు కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు దానిని తొలగిస్తే ఇద్దరం కూడా నవ్వులపాలౌతాం’’ అన్నారు. నిజానికి సీత, తామన్న మాటలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే అతి కొద్ది మంది రాజకీయ నాయకులలో ఒకరు. నాయకులు ఇంటర్వ్యూలలో వెలిబుచ్చిన తమ వాస్తవ అభిప్రాయాల పర్యవసానా లను ఎదుర్కొనే ధైర్యం లేక వాటిని తొలగించమని కోరటమన్నది అసాధారణమేమీ కాని ఆ 9వ దశకంలో, 2000–2009 మధ్య కాలంలో సీత అలా నాకు కాల్ చేయటం అత్యంత అసాధారణం. చెప్పాలంటే అభినందనీయం. అదొక్కటే కాదు, సీత సావధానంగా వినే గుణం కలిగిన వారనీ, ఆయన జ్ఞాపకశక్తి అపారమనీ కనిపెట్టటానికి నాకు మరికొంచెం సమయం పట్టింది. నేను ‘ఐ విట్నెస్’ వీడియో మేగజీన్‌కు పని చేస్తూ, తరచు చర్చలు నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఓసారి నాకు ఢిల్లీ కమానీ ఆడిటోరియం వెలుపలి ప్రాంగణంలో సీత సిగరెట్ తాగుతూ కనిపించారు. ‘‘మీకూ ఒకటి కావాలా?’’ అని నన్ను అడిగారు. బహుశా నా ముఖం సిగరెట్టు తాగే రకంలా ఆయనకు కనిపించి ఉండాలి. తన సిగరెట్ వెలిగించుకున్నాక, నాకూ ఒకటి ఇచ్చారు. నేను సిగరెట్ తాగుతానని మీకెలా తెలుసు అని అడిగాను. ‘‘మీరేగా చెప్పారు, మర్చిపోయారా?’’ అని ఆశ్చర్యపోయారు. ‘‘జనవరిలో మాత్రమే తాగుతానని, అది కూడా ఇతరులు ఇచ్చే సిగ రెట్లు మాత్రమే తాగుతానని మీరు నాతో చెప్పారు కదా’’ అన్నారు. ఆయన అన్నది నిజమే. అయితే ఎవరికి గుర్తుంటుంది కనుక అని నేను తమాషాగా చెప్పే విషయాలలో ఇది కూడా ఒకటి. కానీ సీత దానిని గుర్తుపెట్టుకున్నారు! వాస్తవానికి ఆయన జ్ఞాపకశక్తి పరిధి, కచ్చితత్వాలే ఇంటర్వ్యూ లలో ఆయనకు శక్తిమంతమైన ఆయుధాలు. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా ప్రశ్నల్లో నేను తేదీలను కలిపేసినప్పుడు లేదా వాస్త వాలలో నా వైపు తప్పులు దొర్లినప్పుడు వెంటనే ఆయన నన్ను సరి దిద్దేవారు. అలాగని ఎప్పుడూ కూడా అభ్యంతరకరంగా మాట్లాడే వారు కాదు. నేను మర్చిపోయిన ఒకటీ రెండు పాయింట్లను కూడా జోడించి మరీ విషయాన్ని ముగించేవారు. అలాగుండేది ఏచూరితో. అయితే ఆయనలో అస్సలు లేనివి ఏమిటంటే ముఖం చిట్లింపు, హాస్య విహీనత. ఆయన చమత్కారం ఉవ్వెత్తున పొంగిన షాంపేన్లా మిరిమిట్లతో నురగలు కక్కుతుంది. 2005లో బృందా కారత్ సీపీఎం పాలిట్ బ్యూరోలో చేరారు. అప్పటికే ఆమె భర్త (ప్రకాశ్ కారత్) అందులో ఉన్నారు. బృందా పాలిట్ బ్యూరో సభ్యురాలైన కొత్తల్లో ‘సీఎన్ బీసీ’ లేట్ నైట్ డిస్కషన్లో ఆమె అతిథిగా పాల్గొన్నారు.బృందాతో పాటు మరికొందరు అతిథులు ఉన్నారు. ఆ డిస్కషన్‌కు నాదే యాంకరింగ్. చర్చ సాగుతుండగా అతిథుల్లో ఒకరు... సీపీఎం పొలిట్ బ్యూరోలో స్థానం సంపాదించిన తొలి మహిళ కదా బృందా కారత్ అన్నారు. ‘‘అవును’’ అని చిరునవ్వుతో చూస్తూ, ‘‘మాది ఇప్పుడు రెండు క్యారెట్ల పార్టీ!’’ అన్నారు సీత. సీత... సల్లాపాల ఉల్లాస ప్రియుడు కూడా. కథలు కథలుగా తన గురించి చెప్పుకుంటున్నప్పుడు... ఆయన కళ్లు దివ్వెలై వెలగటం, ఆయన ముఖం నవ్వులై విరియటం చూసి... ఆయన స్వీయానంద భరితులై ఉన్నట్లు మీరు చెప్పగలుగుతారు. కొన్నిసార్లు ఆయనకు ఒక ఇంటర్వ్యూ నచ్చి, లేదా అంతక్రితమే ఆయన చదివిన ఒక కాలమ్ గురించి చెప్పాలనిపించి, పొద్దుపోయాక నాతో ఫోన్లో వృత్తాంత భరితంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖంలోని చిరుమంద హాసం లేదా ఆ గొంతులో తొణికిసలాడే నవ్వు నా గ్రహింపులోనికి వచ్చేవి. సీత ఎప్పుడో గాని చెప్పిన సమయానికి చేరుకోలేరు. ఒక ఇంటర్యూకి ఫలానా సమయానికి వచ్చేస్తానని మాట ఇచ్చి కూడా దారి మధ్యలో తనను కలవాలని వచ్చిన అనేక మంది కోసం కారును ఆపించేవారు. ‘‘సమస్య చిన్నదే. వాళ్లందరూ ఆయనతో మాట్లాడాలని ఆశ పడతారు. అందుకు ఆయన ఎప్పుడూ నిరాకరించరు’’ అని ఇంటర్వ్యూకు ఆయను తీసుకువచ్చేందుకు వెళ్లిన నా సహచరులు చెప్పేవారు. ‘కాదు’ అని సీత ఎప్పుడైనా నాతో అన్నట్లు గుర్తు లేదు. సాధా రణంగా జర్నలిస్టులు చేసే విధంగానే, ఇతర రాజకీయ నాయకులు ఏ మాత్రం సంకోచించకుండా తిరస్కరించే అసంభవమైన విజ్ఞప్తులను నేను సీతకు చేసేవాడిని. అందుకు సీత ఎప్పుడూ వాటిని అంగీకరించటం కోసమే మార్గాలను వెతికే ప్రయత్నం చేసేవారు. కొన్నిసార్లు తన భార్య సీమ వైపు నుంచి చేయించే విన్నపాలను మన్నించేవారు. ఇన్ని విధాలుగా ఆయన నాకు ఎల్లప్పుడూ గుర్తుంటారు.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కొండంచుపై యుద్ధకాల ప్రధాని!
బ్రిటన్ ప్రధానులలో హెర్బర్ట్ హెన్రీ ఆస్క్విత్ భిన్నమైనవారు. మొదటి ప్రపంచ యుద్ధారంభ సమయంలోనూ నిమ్మళంగానే ఉన్నారాయన! ఎంతటి అత్యవసర పరిస్థితులూ, సంక్షోభాలూ ఆయన్ని వెంటబడి తరమలేకపోయాయి. ‘తొందరెందుకు?’ అన్నట్లే తాపీగా ఉండేవారు. నెమ్మదిగా మాట్లాడే వారు. అర్ధరాత్రి వరకు సాగే విందు వినోదాలలో కనిపించేవారు. వీధులలోని పుస్తకాల దుకాణాలలో కాలక్షేపం చేసేవారు. బాడుగ టాక్సీ ఎక్కేసేవారు. అంగరక్షకులు లేకుండానే కాలు కదిపేవారు. అలాంటి వ్యక్తి తన కంటే 35 ఏళ్లు చిన్నదైన ఒక యువతి ప్రేమలో కొండంచు పైనుంచి జర్రున జారినట్లుగా పడిపోయారు. ఆ యువతి ధ్యాసలో తలమునకలైపోయి మొదటి ప్రపంచ యుద్ధ సమయపు ఘోరమైన విపత్తులలో ఒక దానికి జీవం పోశారు!చారిత్రక రచనల్ని కాల్పనిక సాహిత్యంగా పరిగణించటం మన ఇండియాలో సాధారణ విషయం. అయితే మనకు తెలియనిదేమిటంటే – మంత్రముగ్ధులను చేసే కల్పనతో అక్షర రూపం దాల్చిన వాస్తవ చరిత్రలు కూడా ఉంటాయని! అటువంటి రచనే రాబర్ట్ హ్యారిస్ రాసిన తాజా పుస్తకం ‘ప్రెసిపిస్’ (కొండ చరియ). నిజ జీవిత పాత్రలు, నిజమైన సంఘటనలు, నిజంగా లభ్యమైన లేఖలతో ఈ పుస్తకం ఉత్కంఠను కలిగిస్తూ ... ‘ఇదంతా నిజమేనా లేక అల్లికలోని నేర్పరితనమా?’ అనే ప్రశ్నను మీలో రేకెత్తిస్తుంది. ‘ప్రెసిపిస్’ హెర్బర్ట్ హెన్రీ ఆస్క్విత్ కథ. ఆస్క్విత్ 1908 నుంచి 1916 వరకు బ్రిటన్ ప్రధాని. ఆయన పేరుతోనే ఆయనకు ‘ఎర్ల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అండ్ ఆస్క్విత్’ అనే బిరుదు (టైటిల్) ఉండేది. సమాజంలోని సంపన్న వర్గాలలో గొప్ప గుర్తింపు కలిగిన వెనీషియా స్టాన్లీ అనే కులీన యువతి పట్ల ఆయన తీవ్రమైన మోహావేశంతో ఉండేవారు. ఆయనకు 62. ఆమెకు 27. రచయిత చెప్పిన విధంగా, ‘‘ఈ పుస్తకంలో ఉటంకించిన లేఖలన్నీ ప్రధాని ఆస్క్విత్ – పాఠకులు ఆశ్చర్యచకితులు అయ్యేంతగా–ప్రామాణికమైనవి. ప్రధాని ఆస్క్విత్కు వెనీషియా స్టాన్లీ రాసిన లేఖలు మొత్తం తొలిసారి వెలుగు చూసినవి’’. ఆయన తన లేఖల్లో ‘‘నా ప్రియా’, ‘‘ప్రియ సఖీ’’, ‘‘ప్రియమైన ప్రేయసీ’’ అని ఆమెను సంబోధించేవారు. రహస్య దౌత్య సందే శాలను, మంత్రివర్గ చర్చల వివరాలను ఆమెతో పంచుకునేవారు. విన్స్టన్ చర్చిల్ (అప్పటికి నేవీ ఆఫీసర్)ను, లేదా లార్డ్ కిచనర్ (ఆర్మీ ఆఫీసర్)ను ఎలా దారికి తేవాలని అనే విషయమై తరచూ ఆమె సలహాలను కోరేవారు. ఆయన ప్రతిరోజూ, తరచుగా ఒక్కరోజులోనే రెండు మూడుసార్లు ఆమెకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. శుక్రవారాల్లో వాళ్లిద్దరూ తీరిగ్గా మధ్యాహ్నం ప్రారంభమయ్యేలా సుదీర్ఘ ప్రయాణాలను పెట్టుకునేవారు. ‘‘తక్కిన రోజులలో, వారాంతంలో వారు తరచూ భోజనానికి, విందు భోజనాలకు కలుసు కునేవారు. అయితే వారు ఎప్పుడూ కూడా చుట్టూ ఉన్న ఇతర వ్యక్తుల మధ్యనే కలుసుకోవటం జరిగేది. వారు ఏకాంతంగా కలుసుకునే అవకాశం ఉన్న ప్రదేశాలలో మాత్రం వారి కారు కూడా ఒకటి’’. దీని అంతరార్థం ఏమిటంటే – డ్రైవర్ కారు నడుపుతుండగా ఆ 1908 మోడల్ నేపియర్ కారు వెనుక భాగంలో ఆమె ‘‘తెరలు దించాక’’ వారిద్దరూ లైంగిక క్రియకు ఉపక్రమించేవారు. 30 నిమిషాల తర్వాత ఆమె తన ‘‘స్కర్ట్‌ను సవరించుకుంటూ’’ పైకి లేచేవారు. హ్యారిస్ రాసిన ఇతర గొప్ప నవలల మాదిరిగానే ‘ప్రెసిపిస్’ కూడా మిలియన్లలో అమ్ముడు పోతుందా అనే సందేహం నాకే మాత్రం లేదు. అయితే ఆస్క్విత్ వార సుల ఖండనతో ఈ పుస్తకం వివాదా స్పదం అయింది. ఆస్క్విన్ ముని మన వడు, ‘3వ ఎర్ల్’ బిరుదాంకితుడు అయిన రేమండ్ దీనినొక (కారులో లైంగిక క్రియను) ‘‘అర్థం లేని’’ విషయంగా కొట్టిపడేశారు. ‘‘ఇది పూర్తిగా హాస్యా స్పదం’’ అన్నారు. బహుశా వెనీషియాపై ఆస్క్విత్కు ఉన్న గాఢమైన మోహం – అలా జరిగేందుకే ఎక్కువ అవకాశం ఉందని – అనుకోవటానికి ఆస్కారం ఇచ్చిందా? పుస్తకంలో హ్యారిస్ రాసిన దానిని బట్టి వెనీషియాపై ఆస్క్విత్కు ఎంత గాఢమైన, నిలువనివ్వనంత ప్రేమ ఉండేదంటే... కేబినెట్ మీటింగ్‌లో గలిపలీ (టర్కీలోని ద్వీపకల్పం) పైన సైనికచర్య జరిపే తీర్మానాన్ని విన్స్టన్ చర్చిల్ ప్రతిపాదనకు పెడుతున్నప్పుడు ఆస్క్విత్ వెనీషియాకు లేఖ రాస్తూ కూర్చున్నారు! ఆయన ధ్యాసంతా తన ప్రేమపైనే ఉంది కానీ, డార్డనెల్లెస్ జలసంధి (గలిపలీ) మీద కాదు. బహుశా అందుకే గలిపలీపై సైనికచర్య అంత ఘోరంగా విఫలం చెంది ఉంటుంది. ఆ కేబినెట్ సమావేశం ఎలా జరిగిందనే దాని గురించి హ్యారిస్ ఎంత రసవత్తరంగా రాశారో చూడండి. ‘‘ప్రైమ్ మినిస్టర్?’’ అనే పిలుపునకు ఆస్క్విత్ తలెత్తి చూశారు. విన్స్టన్ ఆయన వైపే చూస్తూ – ‘‘నేనిప్పుడు కౌన్సిల్ ముందుకు డార్డనెల్లెస్ విషయాన్ని తీసుకు రావచ్చునా?’’ అని అడిగారు. ‘‘తప్పకుండా’’ అంటూ, చప్పున తను రాస్తున్న లేఖను కొన్ని విదేశాంగ శాఖ కార్యాలయ టెలిగ్రామ్‌ల మధ్య దాచేశారు ఆస్క్విత్. కానీ ఆ లేఖ తిరిగి వెంటనే ఆస్క్విత్ మదిలోకి వచ్చేసింది. ‘‘ఆయన తన కాగితాల కుప్ప కింది నుంచి అప్పుడే ప్రారంభించిన ఆ లేఖను బయటికి లాగారు. తిరిగి రాస్తున్నప్పుడు పక్కనే ఉన్న బాల్ఫోర్ (విదేశాంగ కార్యదర్శి) నిరామయ దృష్టి పడకుండా ఒక చేత్తో లేఖను మూసి ఉంచారు. ‘‘లేఖ రాయటం పూర్తయ్యాక మాత్రమే విన్స్టన్ చర్చిల్ ప్రసంగంపైకి ఆయన ధ్యాస మరలింది. అప్పటికే ఆ ‘ఫస్ట్ లార్డ్ ఆఫ్ ది అడ్మిరాలిటీ’ (రాయల్ నేవీ అధిపతి చర్చిల్) తన గలిపలీ ప్రతిపాదనకు తిరుగులేని విధంగా ఆమోద ముద్ర పొందేశారు. హ్యారిస్ రాసిన దాని ప్రకారం... ‘‘ఎవరూ ఎటువంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయలేదు’’. ‘‘డార్డనెల్లెస్‌పై సైనిక చర్యకు ఏకగ్రీవ ఆమోదం లభించింది’’ అని ఆస్క్విత్ ప్రకటించారు. కానీ దాని వివరాలపై ఆయన మనసు పెట్టలేదని తెలుస్తోంది. ఆ విధంగా మొదటి ప్రపంచ యుద్ధపు ఘోరమైన విపత్తులలో ఒకటి జీవం పోసుకుంది. ఆస్క్విత్ది గతించిపోయిన కాలం. విస్మృత ప్రపంచంలోని ఒక భాగం. తొందరెందుకు అన్నట్లుగా ఆయన తీరు ఉండేది. తాపీగా, నెమ్మదిగా ఉండేవారు. అత్యవసర స్థితులు, సంక్షోభాలు ఆయన్నె ప్పుడూ తరమలేకపోయాయి. తరచూ డిన్నర్ పార్టీలకు వెళ్లే వారు. అవి అర్ధరాత్రి వరకు సాగేవి. బాడుగ టాక్సీలో వెళ్లేవారు. పుస్తకాల దుకాణాలో కాలం గడిపేవారు. అంగరక్షకులు లేకుండా కాలు కదిపే వారు. బిడియపడకుండా మద్యం సేవించేవారు. యుద్ధం మొదలవటానికి ముందు జరిగిన ఒక సందర్భం ఇది. ‘‘రాత్రి ఒంటి గంటకు ప్రధాని ఆస్క్విత్ ఒక క్వార్టర్ బాటిల్ బ్రాందీని దుస్తుల లోపల ఉంచుకుని తూలుతూ టాక్సీలో ఎక్కి, వెనుక కూర్చు న్నారు. తబ్బిబ్బై తనను చూస్తున్న ఆ టాక్సీ డ్రైవర్‌తో నేరుగా బకింగ్ హామ్ ప్యాలెస్‌కు పోనిమ్మని చెప్పాడు. ప్యాలెస్‌లోకి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే బ్రిటన్ రాజు ఐదవ జార్జి ప్రత్యక్షమయ్యారు. స్లిప్పర్స్ తొడుక్కుని, నైట్ షర్టుపై గోధుమ రంగు డ్రెస్సింగ్ గౌను వేసుకుని పూర్తి నిద్రకళ్లతో ఉన్నారాయన. ఆ స్థితిలో– కైజర్ (జర్మనీ చక్రవర్తి)కి వ్యతిరేకంగా జార్ (రష్యా చక్రవర్తి) మద్దతు కోరుతూ టెలిగ్రామ్పంపమని ఆస్క్విత్ ఆయనను కోరారు’’ అని రాశారు హ్యారిస్. మోదీని అలా ఉంచండి. స్టార్మర్, సునాక్ (బ్రిటన్ ప్రస్తుత, మాజీ ప్రధానులు) కూడా అలా చేయటానికి వెనుకాడి ఉండేవారు. అలా వెనుకాడక పోవటమే ఆస్క్విత్ కథను ప్రత్యేకమైనదిగా చేసింది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పాత ‘కలకత్తా’ మిగిలే ఉంది!
బెంగాలీ రాజధానిలో బ్రిటన్ రాచరికపు విశేషంగా కొన్ని చక్కటి అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ‘కలకత్తా’ నగరం నడిబొడ్డున, ఒకప్పుడు పార్క్ స్ట్రీట్‌గా వాడుకలో ఉన్న ప్రదేశానికి కొద్ది దూరాన... బ్రిటిష్ హయాంను గుర్తు చేసేలా ‘ద గ్లెన్‌బర్న్’ అనే ఒక ఆహ్లాదకరమైన చిన్న భోజనశాల ఉంది. బ్రిటన్ మారిపోయింది కానీ, కలకత్తాలోని ఈ ప్రదేశం ధిక్కారంగా నేటికీ అలానే ఉండిపోయింది. ఇటీవల ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన విషాదం,ఆ వెంబడి సామూహిక నిరసనలు, ముఖ్యమంత్రి అనిశ్చిత భవిష్యత్తు... వీటన్నిటిపై చర్చలు, వాదనలు ఇక్కడ కూడా జరగకుండా లేవు. కానీ ఇక్కడి నుండి చూస్తే అవి వేరే ప్రపంచానికి చెందిన అంశాలుగా అనిపిస్తాయి.తొలి పరిచయంలోనే ఏర్పరచుకునే అభి ప్రాయాలు తప్పుదారి పట్టించేవిగా ఉండ వచ్చునని నేను అంగీకరిస్తాను. కానీ అవి చెరగని ముద్రలుగా కూడా నిలిచిపోగలవు. గత వారాంతపు నా ‘కలకత్తా’ పర్యటన విషయంలో ఇది నిశ్చయంగా వాస్తవం. నాకు ఆ నగరం గురించి ఏమంత తెలి యదు. కనీసం ఐదేళ్లుగా నేను ఆ నగరాన్ని సందర్శించిందే లేదు. అయితే, ఆ బెంగాలీ రాజధానిలో రాచరికపు విశేషంగా కొన్ని చక్కటి అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయన్న ఒక కాదనలేని భావనకు నేను లోనయ్యాను. నేనక్కడ కలిసిన స్థానికులు కూడా ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని అనుకోను. అందువల్లనే నేను ఆ నగరానికి ఉన్న ‘కలకత్తా’ అనే వలసరాజ్య నామాన్ని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉపయోగిస్తున్నాను. నగరం నడిబొడ్డున, ఒకప్పుడు పార్క్ స్ట్రీట్‌గా వాడుకలో ఉన్న ప్రదేశానికి కొద్ది దూరాన, అనాకమైనదిగా తప్ప మీరు గుర్తించని ఒక భవంతి... బ్రిటిష్ హయాంను గుర్తు చేసేలా ‘ద గ్లెన్‌బర్న్’ అనే ఒక ఆహ్లాదకరమైన చిన్న భోజనశాలను తనలో పొదవుకుని ఉంటుంది. ఒకసారి మీరు ఆ అసహ్యకరమైన పరిసరాలను, జీర్ణావస్థలో ఉన్న ప్రవేశ ద్వారాన్ని దాటుకుని లోపలికి వెళ్లారా... 7, 8 అంతస్థులలోని గతకాలపు విస్మృత ప్రపంచంలోకి అడుగు పెడతారు. గ్లెన్బర్న్లోని తొమ్మిది గదులలో రేఖాగణితం నమూనాలో డిజైన్ చేసిన చెక్క పలకల ఫ్లోరింగ్, షాండ్లియర్లు, కలపను మలిచి తీర్చిన సోఫాలు, వార్నిష్ పట్టిన ఒంపుకాళ్ల బల్లలు, వర్ణాలంకరణలను అచ్చు గుద్దిన పత్తి వస్త్రాల పరుపులు, ఇత్తడితో పటం కట్టిన పురాతన పూల కళాకృతులు ఉన్నాయి. అక్కడి విశాలమైన స్నానపు గదులు పాతకాలపు నాటి ఆధునిక శైలిలో రూపొందిన గాజు లోహపు తొట్టెలను కలిగి ఉన్నాయి. వాటిల్లో మీరు మునిగిపోవచ్చు. దేహాన్ని సాధ్యమైనంతగా సాగదీసుకోనూవచ్చు. సూర్యోదయపు తొలి కిరణాలు తొంగి చూసే అక్కడి ఒక గదిలో నేను మూడు రోజుల పాతదైన లండన్ టైమ్స్ దిన పత్రికను చదు వుతూ అల్పాహారం తీసుకున్నాను. అది మన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సమకాలీన సంచిక కన్నా మరింత సందర్భోచితంగా ఉన్నట్లు అనిపించింది. ‘లండన్ టైమ్స్’లోని కోర్ట్ సర్క్యులర్ శీర్షికలో ఆనాటి రాచ కార్యాల వివరాలు ప్రచురించి ఉన్నాయి. రాజు గారు బల్మోరల్ విహారంలో ఉన్నారు, బహుశా గ్రౌస్ పక్షుల్ని వేటాడటం కోసం. పేపర్ నుంచి తలెత్తి చూసినప్పుడు బయట విక్టోరియా మెమోరియల్ నా వైపు తదేకంగా చూస్తూ ఉండటాన్ని గమనించాను. (దాని నిర్మాణ స్ఫూర్తి సారథి) లార్డ్ కర్జన్ తన ప్రాతఃకాల కాఫీ సేవిస్తూ, ఇంతకంటే మెరుగైన దృశ్యాన్ని ఆశించివుండరు!ఇంకో వైపు నుంచి కలకత్తా మైదానం కనిపిస్తోంది. గత ఆదివారం అది హరితపత్రంలా, ఆహ్వానిస్తున్నట్లుగా దర్శనమిచ్చింది. దూరంగా వర్షాకాలపు శీతల ఉషోదయంలో కొంతమంది పురుషులు ఉల్లాసంగా గుర్రాలను దౌడు తీయించటం గమనించాను. గొడుగులు పట్టుకొని ఉన్న మహిళలు, చిన్న పిల్లలు, వారి పెంపుడు కుక్కపిల్లలు అక్కడి పచ్చికలో ఆడుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత వాళ్లు టిఫిన్ చేయటం కోసం గ్లెన్బర్న్కు వస్తారా? వస్తే కనుక వారి విహార యాత్రను ముగించటానికి పింక్ జిన్లు కచ్చితంగా ఒక అత్యంత సముచితమైన మార్గంగా ఉంటాయి. బెంగాల్ క్లబ్బు సభ్యులతో మాట్లాడటానికి నాకు ఆహ్వానం లభించింది. పంజాబీ ధాబాలా మారిపోయిన ఢిల్లీ జింఖానా క్లబ్‌కు భిన్నమైన ప్రపంచం అది. ఇక్కడి బ్రిటిష్ వాసనల్లోని గొప్ప ఆపేక్ష, అమితమైన శ్రద్ధ... ఆహ్లాదాన్ని కలిగి ఉన్నాయి.క్లబ్బుకు వచ్చిన వారిలో షిఫాన్ చీరలు, ముత్యాల కంఠ హారాలు ధరించిన స్త్రీలు; చక్కగా ఇస్త్రీ చేసిన ప్యాంట్లు, హుందాగా ఉండే చొక్కాలు ధరించిన పురుషులు ఉన్నారు. ఎక్కడా కుర్తా–పైజమా కానీ, భద్రలోక్ ధోతీ కానీ కనిపించలేదు. వారికి బెంగాలీ భాష తెలుస నటంలో సందేహం లేదు కానీ, నాకు ఇంగ్లిష్ మాత్రమే విని పించింది... అచ్చంగా నైట్స్‌బ్రిడ్జ్ (లండన్)లో మాట్లాడిన విధంగా. మేము జనరల్ అవుట్రామ్ నిలువెత్తు తైలవర్ణ చిత్తరు వులోని ఆయన చురుకైన చూపుల కింద భోజనం చేశాం. క్లబ్బు పూర్వపు అధ్యక్షుడు ఆయన. ఇప్పుడైతే నిస్సందేహంగా కొత్త సభ్యత్వంపై ఒక కన్నేసి ఉంచేవారు. మెనూలోని ఆహార పదార్థాలు తప్పక ఆయన సమ్మతిని కలిగి ఉండేవి. అది రెండు వైన్లతో కూడిన నాలుగు వంటకాల భోజనం. తళతళ మెరుస్తున్న తెల్లటి చైనా ప్లేట్లకు రెండు వైపులా వెండితో చేసిన స్పూన్లు, ఫోర్కులు అందంగా అమర్చి ఉన్నాయి. క్యారెట్, సెలెరీ కాడల చారు, రాతి పీతలు, క్రాన్బెర్రీ జెల్లీలో మిగుల వేయించిన మాంసం ముక్కలు, చుట్టూతా పుదీనా సాస్ పోసి ఉన్న మృదువైన బ్రాందీ స్నాప్ గొట్టాలు భోజనం బల్లపై ఉన్నాయి. గాజు స్ఫటికాల లోటాలలో వచ్చిన జివ్వనిపించే చల్లని మద్యం, దానికి జతగా ఉన్న సన్నని ఆకుకూరల కాండాలతో మా సాయంత్రం ముగిసింది. ‘‘నేను వారానికి ఒకసారి బ్లెన్హైమ్(బ్రిటన్ రాజప్రాసాదం)లో భోజనం చేస్తాను’’ అని కర్జన్ గొప్పగా చెప్పుకున్న మాటను ఇది నాకు గుర్తు చేసింది. బ్రిటన్ మారిపోయింది కానీ, కలకత్తాలోని ఒక భాగం ధిక్కారంగా అలానే ఉండిపోయింది. ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన విషాదం, ఆ వెంబడి సామూహిక నిరసనలు, ముఖ్యమంత్రి అనిశ్చిత భవి ష్యత్తు... వీట న్నిటిపై చర్చలు, వాదాలు జరగటం అన్నది నిస్సందే హమే! అయినా, ఈ పరమ పావన గ్లెన్‌బర్న్, బెంగాల్ క్లబ్బు ఆవర ణల నుంచి చూస్తే అవి వేరే ప్రపంచానికి చెందినవిగా అనిపిస్తాయి. కాబట్టి, మీరు కనుక పొగలు కక్కుతున్న ఉడుకుడుకు తృణధాన్య ఆహారం, ఆ తర్వాత గిలకొట్టి వేయించిన గుడ్లు, ఊరబెట్టిన పంది మాంసంతో ఆదివారాలను ప్రారంభించేందుకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి అయుండి, ‘అమృత్ కాల్’తో నాకొచ్చేదేమిటని అనుకుంటూ ఉంటే నేను మీకు గ్లెన్బర్న్ను, బెంగాల్ క్లబ్బును సిఫారసు చేస్తాను. అక్కడ ఎల్లప్పుడూ సమయం నిశ్చలంగా ఉంటుందని మీరు దృఢంగా విశ్వసించవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పొంతన లేని వింత కథ!
కొన్నిసార్లిది తలకిందుల పిచ్చి మాలోకంగా అయిపోగలదు. ‘మ్యాడ్’ మేగజీన్లోని ఒక కార్టూన్ నిజరూపం లోనికి రూపాంతరం చెందినట్లే ఈ ప్రపంచం ఉంటుంది. ప్రస్తుతం పక్కింట్లో అదే జరిగిందని అనిపిస్తోంది. అయితే ఏ విధంగానూ అది అందరికీ జరిగినట్లు కాదు. కచ్చితంగా జరిగిందైతే అక్కడి ప్రభుత్వానికి, భయానకమైన ‘ఐఎస్ఐ’కి. నేను చెప్ప వలసి ఉన్నది అతి వింతైన కథ కనుక చాలామందికి అది కనీసం కల్పనగా కూడా నమ్మదగనిది. అయినప్పటికీ, నన్ను నమ్మండి... అది నిజంగా జరిగింది.పాకిస్తాన్‌లోని యూట్యూబర్లు, అక్కడి ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ వంటి వార్తా పత్రికలు, ఆ దేశపు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఆఖరికి స్వయానా ఆ శాఖ మంత్రి కూడా నన్ను పాకిస్తాన్ వ్యతిరేకిననీ, మోదీ ప్రభుత్వానికి సన్నిహితుడిననీ, ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్)తో చేతులు కలిపాననీ ప్రకటించటం జరిగింది. ఇప్పుడిది, చివరిసారి నేను చేసిన ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే లేచి బయటికి వెళ్లిపోయిన ప్రస్తుత ప్రధాన మంత్రికీ, దశాబ్దాలుగా నన్ను పాకిస్తాన్ పక్షపాతిగా నిందిస్తూ వస్తున్న విమర్శకులకూ నిస్సందేహంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే సరిహద్దు వెంబడి గస్తీ సైనికులు, వారి పౌర ప్రభుత్వాలు, నిఘా అధికారులకు ఇది... అవునా! నిజమా... అనిపించేలా ఉంటుంది.ఇదెలా జరిగిందో వివరించటానికి నన్ను ప్రయత్నించనివ్వండి. కొన్ని వారాల క్రితం పాక్ అధికారులు తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (ఇమ్రాన్ ఖాన్ పార్టీ) సమాచార కార్యదర్శి, అధికార ప్రతినిధి అయిన రవూఫ్ హసన్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై దేశద్రోహ నేరం మోపాలన్న కృతనిశ్చయంతో నిర్బంధించి అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈమెయిల్స్‌ను, వాట్సాప్ మెసేజ్‌లను పరిశీలించారు. అక్కడ వారికి రవూఫ్ నాతో పంచుకున్న – 2022 నవంబర్ వెనకటి – మెసేజ్‌లు కొన్ని కనిపించాయి. ఆహా! ఇకనేం, భారతదేశంలోని వ్యక్తులతో అతడు మాట్లాడుతున్నాడన్న నిర్ధారణకు వారు వచ్చేశారు. అది అత డిని దేశ వ్యతిరేకిని చేసేసింది. ఇంకా దారుణం, ఇమ్రాన్‌తో పాక్ ఎలా వ్యవహరిస్తోందో రవూఫ్ తన మెసేజ్‌లలో వ్యాఖ్యానిం^è టం, పాకి స్తాన్ రాజకీయాలపై చర్చించటం, చివరికి ఆర్మీ చీఫ్ గురించి కూడా మాట్లాడటం! ఇవన్నీ కూడా నిస్సందేహంగా పాక్ దృష్టిలో దేశ వ్యతి రేకమైనవే.ఇప్పుడిది రూఢీ అవ్వాలంటే పాక్‌ని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తిగా నన్ను చిత్రీకరించాలి. ఆ దేశంలోని ఎంతోమంది నియంతలు, ప్రధానులు నాకు తెలుసనీ, వారిని నేను ఇంటర్వ్యూ చేశాననీ, తరచు నేను ఆ దేశాన్ని సందర్శిస్తుంటాననీ; ఇస్లామాబాద్‌లో, లాహోర్‌లో, కరాచీలో నా సన్నిహిత మిత్రుల జాబితా పెద్ద చాంతాడంత ఉంటుందనీ గుర్తించటం వంటివేవీ పాక్ చిత్రీకరణ ఉద్దేశాన్ని నెరవేర్చేవి కావు. బేనజీర్ భుట్టో నాకు ఆప్త నేస్తం అనీ, నవాజ్ షరీఫ్ ఆఖరుగా 2014లో ఇండియా వచ్చినప్పుడు నన్ను కలుసుకోవాలని కోరారనీ, షెహబాజ్ షరీఫ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన, నేను కలిసి పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో కూర్చొని స్నేహపూర్వకంగా లేదా, పిచ్చాపాటీగా కబుర్లు చెప్పుకున్నామనీ అంగీకరించటం కూడా పాక్ అనుమానాలను బలపరిచేందుకు ఉపయోగపడదు. అలా అంగీ కరించటం అన్నది రవూఫ్‌కు వ్యతిరేకంగా నిర్మిస్తున్న కేసును కుప్ప కూల్చి ఉండేది.కాబట్టి తన అధికారిక ప్రకటనలో పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ: ‘‘భారతదేశ జర్నలిస్టు కరణ్ థాపర్‌కు రవూఫ్ హసన్ జాగ్రత్త లేకుండా పంపిన మెసేజ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయి. నిజా నికి ఈ మెసేజ్‌లు కరణ్ థాపర్‌కు మద్దతుగా ఉన్న ‘రా’ అధికారులకు అమూల్యమైన సంపద వంటి సమాచారం అని రక్షణశాఖ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మెసేజ్‌లను బట్టి పాక్ వ్యతిరేక ప్రచారాన్ని రాజేసేందుకు పి.టి.ఐ. (పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్) ప్రతినిధి దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఒక భారతీ యుడికి చేరవేస్తున్నట్లు బహిర్గతం అయిందని వారు తెలిపారు’’ అని పేర్కొంది. పాక్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అతావుల్లా తరార్, ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’తో మాట్లాడుతూ... ‘‘పాక్ వ్యతి రేక భావాలకు పేరుమోసిన ఒక భారతీయ జర్నలిస్టుతో హసన్‌కు ఉన్న సంబంధాలు స్వదేశం పట్ల పి.టి.ఐ. అవిధేయతను మరింతగా తేటతెల్లం చేస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.పర్యవసానంగా, రవూఫ్ నాతో నెరిపిన సంక్షిప్తమైన, చాలా అరుదైన, ఏమాత్రం హానికరం కానివైన మెసేజ్‌లు – నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశానన్న వాస్తవం కూడా – మార్మికమైన రీతిలో పాకిస్తాన్ సార్వభౌమాధికారతకు, సమగ్రతకు, భవిష్య త్తుకు ముప్పుగా పరి వర్తనం చెందాయి. నిస్సందేహంగా ఇది ఆయనపై విచారణ జరిపించేందుకు ఉపయోపడుతుంది. వారి దృష్టిలో అదే న్యాయం. మా మధ్య సాగిన ఉద్దేశపూర్వకం కాని వాట్సాప్ మెసేజ్‌లు, ఇంటర్వ్యూ లాంటి మాటామంతీ, ఇంకా చెప్పాలంటే ఓ రెండు సంభాషణలు... వీటన్నిటినీ దాటి అసలు నిజం ఏమిటంటే రవూఫ్ నాకు తెలియదు. అతడికీ నేను తెలియదు. మేము ఒకరికొకరం అపరిచితులం. కాబట్టి ఇదెప్పటికీ మారదు.వాస్తవానికి, వారు రవూఫ్ బాస్ అయిన ఇమ్రాన్ ఖాన్ నాతో మంతనాలు జరిపారని ఆరోపించినట్లయితే వారి కేసుకు మరింత బలం చేకూరి ఉండేది. ఇమ్రాన్‌ను నేను అనేకసార్లు ఇంటర్వ్యూ చేశాను. బని గలా (ఇస్లామాబాద్) లేదా ఢిల్లీలో మాత్రమే కాదు... ఒక సందర్భంలో నేను లండన్ వెళ్లి మరీ, అక్కడి రిచ్మండ్లో ఇమ్రాన్ మాజీ అత్తమామలు ఉండే భవనం లోపలి తోటల్లో ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. పాకిస్తాన్ చార్జిషీట్లో అది నేరంగా కనిపించటం లేదా? అంతకుమించిన నేరం, తనెప్పటికైనా ప్రధాని అయితే ఆర్మీ చీఫ్ తనకు లోబడి పని చేయవలసి ఉంటుందని కూడా ఇమ్రాన్ అనటం. నవ్వుతూ ఏమీ ఆయన ఆ మాట అనలేదు. పాకిస్తాన్‌లోని నా ప్రియ స్నేహితుడు ఒకరు ఈ అస్థిమితం నుంచి నన్ను శాంతింపజేయటానికి ఇలా అన్నారు: ‘‘అలీస్ ఇన్ ది వండర్ల్యాండ్’తో నీకు పరిచయం ఉంది. ఇప్పుడిక, మాలిస్ (దుష్ట బుద్ధి) ఇన్ ది ఫౌజీలాండ్ (సైనికదేశం)కు స్వాగతం.’’– కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
విభజన రేఖను చెరిపిన విజేతలు
దేశ విభజనానంతరం ఎన్నో పరిణామాలు సంభవించాయి. గత నలభై ఏళ్లలో – విభజనకు ముందు తరం రాలిపోయింది. రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. బాలీవుడ్ సినిమాలు మునుపటిలా లేవు. అయినప్పటికీ భారత్, పాక్ మనుషులు ఒకేలా ఉన్నారు. ఒకే ఆహారం తీసుకుంటున్నారు. ఒకే ఒక చోట వేరుపడింది ఎక్కడంటే మతంలో! బ్రిటిష్ వాళ్లు గీసిన మ్యాపులో! దాన్ని దాటగలిగేందుకు ‘పంజాబీయత’కు తగినంత బలమే ఉంది. ఆ బలమే... నీరజ్–అర్షద్ ఒకరితో ఒకరు చక్కగా కలిసిపోవటానికి కారణం అయింది. వారి క్రీడ మాత్రమే కాదు, వారి సంస్కృతి కూడా ఆ దగ్గరితనాన్ని నిర్ణయించింది. బరిలో ప్రత్యర్థులైనా పరస్పరం సానుకూలంగా మాట్లాడటం, బాంధవ్యాన్ని పంచుకోవటం అసహజత్వానికి దూరంగా ఉన్నాయి.పంజాబీలు పాకిస్తాన్‌ను ఎలా చూస్తారనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అది దేశంలోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఉంటుంది. నిజానికి, బెంగాలీలు బంగ్లాదేశ్‌ను ఎలా చూస్తారనే దానిని అందుకు చాలా దగ్గరి సమాంతరంగా నేను ఊహించుకుంటాను. రెండు రాష్ట్రాలు కూడా విభజన వల్ల తమ దేశాలతో వేరైపోయినప్పటికీ, కోల్పోయిన తమ రెండో సగంతో ఉన్న ఆత్మీయతలు, ఆనాటి అమ్మ ఒడి జ్ఞాపకాలు కొడిగట్టిపోలేదు. కాకపోతే అవి తరాల నుండి తరా లకు సంక్రమిస్తున్నట్లుగా ఉంది. బహుశా అందుకే నీరజ్ చోప్రా–అర్షద్ నదీమ్‌ల కథ దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత గల వార్త అయితే, పంజాబీలకు అది – ఇందులో వింతేముందన్నంతగా – ఒక మామూలు సంగతి అయింది. నేను మరికాస్త ముందుకు వెళ్లబోయే ముందు, హరియాణా 1966 వరకు కూడా కొన్ని శతాబ్దాలపాటు అవిభక్త పంజాబ్‌లో ఒక ముఖ్యమైన భాగంగా ఉందన్న సంగతిని మీకు గుర్తు చేయనివ్వండి. లాహోర్, లూథియానా మాదిరిగానే అంబాలా, రోహ్తక్ పంజాబీ ప్రాంతాలు. కాబట్టి, నీరజ్–అర్షద్ ఒకరితో ఒకరు చక్కగా కలిసిపోవటంలో ఆశ్చర్యం లేదు. వారి క్రీడ మాత్రమే కాదు, వారి సంస్కృతి కూడా ఆ దగ్గరితనాన్ని నిర్ణయించింది. ఒకరితో ఒకరికి తమ గ్రెనడా, ఐరోపా, అమెరికా సహ–అథ్లెట్ల కంటే ఎక్కువగా ఉమ్మడితనం ఉంది. ఆలింగనం, నవ్వు, ఒకరి గురించి ఒకరు సానుకూలంగా మాట్లాడటం, ఒక బాంధవ్యాన్ని పంచుకోవటం ఇద్దరి మధ్య ఎంతో స్పష్టంగా, అసహజ త్వానికి దూరంగా ఉన్నాయి. ఇలా కాకపోతేనే ఆశ్చర్యం.వారి తల్లుల విషయంలో కూడా ఇది వాస్తవం. వారు తమ కొడు కుతో తలపడిన వారిని ప్రత్యర్థిగా చూడకపోవటానికి కారణం వారు తమ ‘పంజాబీయత’ను అనుభూతి చెందటమే. నిస్సందేహంగా ఇది, వారు మాట్లాడే విధానంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న సారూప్యాన్ని వివరిస్తోంది. ‘‘నేను నీరజ్ కోసం కూడా ప్రార్థిస్తున్నాను’’ అని అర్షద్ తల్లి రజియా పర్వీన్ చెప్పారు. అదే విధంగా నీరజ్ తల్లి సరోజ్ దేవి కూడా ‘‘అతను కూడా నా కుమారుడి లాంటి వాడే’’ అని చెప్పారు. ‘‘బంగారం గెలుచుకున్న అబ్బాయీ మా బిడ్డే, వెండి గెలుచుకున్న అబ్బాయీ మా బిడ్డే’’ అని ఆమె అన్నారు. నేనంటున్న పంజాబీ బాంధవ్యం అనే దాని గురించి మొదట నాకు 1980లో తెలిసింది. నేనప్పుడు లాహోర్‌లో ఉన్నాను. దేశ సరి హద్దుల ఆవలి ఆ తొలి పర్యటనలో నేను అటువైపు చేరుకునే వరకు కూడా పాకిస్థాన్‌ను నేను ఒక పరాయి దేశంగానే చూశాను. నిజంగా పరాయి దేశమే. కానీ అక్కడి ప్రజలైతే కచ్చితంగా పరాయి వారు కాదు. అలాగే వారికి నేను అపరిచితుడినీ కాదు, గ్రహాంతరవాసినీ కాదు. ఒక సాయంత్రం నేను పాత ‘వాప్డా’(వాటర్ అండ్ పవర్ డెవలప్మెంట్ అథారిటీ, పాకిస్తాన్) భవనంలోని సల్లూస్ రెస్టారెంట్లో కూర్చున్నాక, ఆ రెస్టారెంట్లో నేను తప్ప మరొకరు లేకపోవటం గమనించాను. ఒంటరిగానే డిన్నర్ చేసి, త్వరగా బయటికి వెళ్లి పోవటానికి సిద్ధం అయ్యాను. ఎంత పొరపాటు! నేను ఇండియా నుంచి వచ్చిన పంజాబీనని కనిపెట్టిన కొద్ది నిమిషాలకే రెస్టారెంట్ సిబ్బంది నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి మీతో మాట్లాడవచ్చా అని అడిగారు. నేను అంగీకరించగానే నాతో కలిసి కూర్చున్నారు. ఎంపిక చేసిన ఆహారాన్ని నా కోసం తెప్పించారు. లాహోర్‌లో నేను తప్పక చూడవలసిన ప్రదేశాలు ఏమిటో చెప్పారు. వెచ్చగా ఉన్న రోటీలను బలవంతంగా పక్కన పెట్టించి, తాజాగా చేయించిన పొగలు కక్కే రోటీలను నా ప్లేటులో ఒక దాని పైన ఒకటిగా వెడ్డింగ్ కేక్‌ను తలపించేలా ఇంత ఎత్తున సర్వ్ చేయిస్తూనే ఉన్నారు. అయితే నేను ఎప్పటికీ మరచిపోలేనివి మాత్రం వారు నన్ను అడిగిన ప్రశ్నలు. ‘‘మీరెప్పుడైనా జలంధర్‌లోని గల్లీ నంబర్ టెన్‌కి వెళ్లారా? అది మా తల్లితండ్రులు నివసించిన ప్రదేశం’’ అని ఒక ప్రశ్న. ‘‘మీరెప్పుడైనా అమితాబ్ బచ్చన్‌ని, రేఖను కలిశారా? నేను వారిని కలవటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను’’ అని ఇంకో ప్రశ్న. ‘‘ఇందిరా గాంధీ గురించి చెప్పండి. ఆమె గురించి ప్రతిదీ తెలుసుకోవాలని ఉంది నాకు’’ అని అత్యంత ఆశ్చర్యకరమైన మరొక ప్రశ్న. తమ తల్లితండ్రులు జీవితాన్ని గడిపిన ప్రదేశం గురించి ఆ ప్రదేశం తమది కూడా అన్నంత ఉద్విగ్నంగా, ఉత్సాహంగా వారు ఉన్నారు. భారతదేశం అన్నది వారికి వేరే దేశం అయుండొచ్చు కానీ, వారి తల్లితండ్రులు జన్మించిన ప్రదేశం ఇప్పటికీ తమ ‘ఇల్లే’. అందు వల్ల నేను వారు కోల్పోయిన దేశం నుంచి వెళ్లిన వ్యక్తినే అయినప్పటికీ, వారు మర్చిపోలేని వ్యక్తిని. ‘సల్లూస్’ ద్వారా వారు కనుగొన్న ఒక బాంధవ్య అనుసంధానాన్ని నేను. ఇప్పుడు, 1980 అంటే... నలభై సంవత్సరాలకు పైమాటే. నాటి నుంచి ఎన్నో పరిణామాలు సంభవించాయి. దేశ విభజనకు ముందు తరం రాలిపోయింది. రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. అవి మనల్ని ఆకర్షించటం లేదు. బాలీవుడ్ సినిమాలు మునుపటిలా లేవు. అయినప్పటికీ మనం ఒకేలా ఉన్నాం. ఒకే భాష మాట్లాడుతున్నాం. ఒకే ఆహారం తీసుకుంటున్నాం. ఆఖరికి ఒకేలా శాపగ్రస్థులమై ఉన్నాం. ఒకే ఒక చోట వేరుపడింది ఎక్కడంటే మతంలో, బ్రిటిష్ వాళ్లు గీసిన మ్యాపులో! దాన్ని దాటగలిగేందుకు పంజాబీయతకు తగినంత బలమే ఉంది. నీరజ్–అర్షద్‌లు ఒకరికొకరు దగ్గరయ్యేలా చేసింది ఇదే. విదేశాలలో భారతీయులు, పాకిస్తానీలు ఒకరికొకరు – వాళ్లు పంజాబీలు అయినా కాకున్నా – కలివిడిగా ఉండేందుకు కూడా కారణం ఇదే. వారు ఒకరి సమక్షంలో ఒకరు సౌకర్యవంతంగా ఉంటారు. తమ గురించి తాము వివరించాల్సిన అవసరం వారికి లేదు. తమను అర్థం చేసుకుంటారని వారికి తెలుసు. ఉమ్మడి సంస్కృతి విభజన రాజకీ యాల కంటే కూడా శక్తిమంతమైనది. ఇది మన రాజకీయ నాయకు లకు అర్థమైతే బాగుండు!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మాయాలోకపు జీవన నైపుణ్యాలు
మోసం ఏ రూపంలోనైనా మనల్ని మాయలో పడేసే లోకంలో జీవిస్తున్నాం! ఒకరికి ఒకరం ఎన్ని జాగ్రత్తలు చెప్పుకుని మోసపోవటం అన్నది ఎప్పుడూ కొత్తగా జరుగుతుంది. కాలింగ్ బెల్ కొడతారు. ఫలానా కంపెనీ నుంచి వచ్చాం అంటారు. మనల్ని బుట్టలో పడేసి, ‘సర్దుకుని’ వెళ్లిపోతారు... ఇదొక రకం మోసం! ఎవరో ఒక పెద్ద కంపెనీ నుంచి ఫోన్ చేస్తారు. మీరు ఫారిన్ ట్రిప్‌కి ఎంపికయ్యారని చెబుతారు. ఫలానా చోటుకు రమ్మంటారు. వెళ్లాక అక్కడ మనల్ని పెద్ద వెంచర్లో ఇరికించేస్తారు... ఇది ఇంకో రకం మోసం! ఇక ఓటీపీ మోసాలైతే ఏ మార్గంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయో అంతే పట్టదు. అనుక్షణం జాగ్రత్తగా ఉండటం, ప్రతిదాన్నీ అనుమానించటం జీవితానికి ఇప్పుడు అవసరమైన నైపుణ్యాలు అయ్యాయి!వాట్సాప్‌లో తరచూ మిమ్మల్ని హెచ్చరిస్తూ వస్తుండే సందేశాల వంటిదే ఇది. గడప గడపకూ తిరిగే సేల్స్‌మెన్‌తో జాగ్రత్త, రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసే కంపెనీల ఆకర్షణీయమైన ఆఫర్ల ఎరకు చిక్కుకోకండి, బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి మిమ్మల్ని మీ క్రెడిట్ కార్డు పిన్ నెంబర్ అడిగితే ఇవ్వకండి... అంటూ అప్రమత్తం చేసే మెసేజ్‌లు నాకు నిరంతరం వస్తూనే ఉంటాయి. మీక్కూడా వస్తుంటాయని కచ్చి తంగా చెప్పగలను. అలా వారు ఒక హెచ్చరికగా తప్పించాలనుకున్న సంఘటన గతవారం నా సోదరి కిరణ్ విషయంలో జరిగింది. శనివారం మధ్యాహ్నం ఆమె ఇంటి కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి తలుపు తీయగానే ద్వారం ముందు ముగ్గురు వ్యక్తులు కనిపించారు. తాము ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) ఇంజినీర్లమని చెప్పు కున్నారు. గ్యాస్ కనెక్షన్‌ను పరిశీలించేందుకు వచ్చామని చెప్పారు. అదృష్టవశాత్తూ వారిని గుర్తింపు కార్డులు అడగాలన్న ఆలోచన కిరణ్‌కు వచ్చింది. వాళ్లవి చూపించినప్పటికీ, నేననుకోవటం అవి నకిలీవి అయుంటాయని. ఆమె తెలివిగా ఇంకో పని చేసింది. ఆ ఐడీ కార్టులను ఫొటో తీసుకుంది. వారి ఫోన్ నెంబర్లను అడిగి రాసుకుంది. అందుకు వాళ్లు కంగు తిన్నప్పటికీ వాళ్ల ఆత్మవిశ్వాసం ఏ మాత్రం సడలలేదు. కిరణ్... వాళ్లని వంటింట్లోకి తీసుకొని వెళ్లారు. కానీ, ఇంట్లో పనిమనుషులు కూడా వాళ్లతో పాటు అక్కడ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఆ ముగ్గురు వ్యక్తులు గ్యాస్ పైపులను ‘తనిఖీ’ చేసి, ఆ పైపులలో ఒకటి వారెంటీ గడువును దాటేసింది కనుక దానిని మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. అందుకు కిరణ్, ‘మాది పాతబడిపోతే మిగతా ఫ్లాట్‌లో ఉన్నవాళ్లవీ పాతబడి ఉండాలి కదా! మా గ్యాస్ కనెక్షన్లన్నీ ఒకేసారి బిగించినవి’ అని వారితో అన్నారు. ఆ మాటకు, ఆ ముగ్గురిలో సీనియర్ ఇంజినీర్‌నని చెప్పుకున్న వ్యక్తి ఏ మాత్రం వెరపు లేకుండా పక్క ఫ్లాట్‌లో చెక్ చేసి వస్తానని చెప్పి వెళ్లాడు. కొన్ని నిమిషాల తర్వాత తిరిగొచ్చి, ‘వాళ్ల పైప్ బాగానే ఉంది. కొత్తది మార్చి ఉంటారు, మీక్కూడ కొత్తది వెయ్యవలసిన అవసరం ఉంది’ అని కిరణ్‌తో చెప్పాడు. ఆ ముగ్గురు వ్యక్తులు పైప్‌ను మార్చే పని ప్రారంభించగానే కిరణ్ తన దగ్గరున్న ఐజీఎల్ నెంబర్లకు మెసేజ్ చేయటం మొదలు పెట్టారు. ‘పైపును మార్చాలని, మా ఇంజినీర్లను పంపిస్తున్నామని’ ఐజీఎల్ తనకు ముందే సమాచారం ఇవ్వకపోవటం పట్ల కిరణ్ విసుగ్గా ఉన్నారు. పది, పదిహేను, ఇంకా ఎక్కువ నెంబర్లకే ఆమె మెసేజ్ పెట్టి ఉంటారు. వాటిల్లో ఒకటి ఐజీఎల్ పూర్వపు సీఈవోది అన్నట్లు ఆమెకు గుర్తు. ఆ నెంబర్ల నుండి రిప్లయ్‌లు రావటానికి మరీ అంత సమయం ఏమీ పట్టలేదు. ఆ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఐజీఎల్ పంపినవారు కాదు! వారు మోసగాళ్లు. అంతకన్నా కూడా, ‘వాళ్లను పైపులు మార్చనివ్వకండి’ అని, ‘ఐజీఎల్ సిబ్బంది ముసుగులో కొందరు మోసాలకు పాల్పడుతున్నార’ని హెచ్చరిస్తూ ఐజీఎల్ నంబర్లలో కొన్నింటి నుంచి కిరణ్‌కు వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయి. ఆ మను షుల్ని తక్షణం బయటికి పంపించేయండి అన్నది వారి నుంచి వచ్చిన స్పష్టమైన సందేశం. నిజంగానే వాళ్లు మోసగాళ్లు! కానీ అప్పటికే వారు పైపును తొలగించి, దాని స్థానంలో మరొక పైపును బిగించారు. చిత్రంగా వాళ్లు ఆ పనికి డబ్బులు అడగలేదు. పైగా వెళ్లిపోయే తొందరలో ఉన్నట్లు కనిపించారు. బహుశా కిరణ్ ఐజీఎల్ వాళ్లతో మాట్లాడినందువల్ల భయపడినట్లున్నారు. తదుపరి గ్యాసు బిల్లులో పైపు మార్పిడి చార్జీలు కలిసి ఉంటాయని చెప్పి బయల్దేరుతూ, అనుకోకుండా కందెన అంటిన ఒక ఫోల్డర్‌ను అక్కడ వదిలి వెళ్లారు. ఈలోపు ఐజీఎల్ కంపెనీ వాళ్లు కిరణ్‌కి ఫోన్ చేసి, తక్షణం తమ ఇంజనీర్లను ఆమె ఇంటికి పంపుతున్నట్లు చెప్పారు. నిజానికి పూర్వపు సీఈఓ నెంబరు అయివుండవచ్చని మెసేజ్ ఇవ్వటం ద్వారా ఆమె చేసిన ప్రత్యేక ప్రయత్నం ఐజీఎల్ సొంత ఇంజనీర్లు – మెక్ కాయ్ కంపెనీ వాళ్లు – వీలైనంత త్వరగా ఆమె ఇంటికి చేరుకుని, ఆ మోసగాళ్లు బిగించి వెళ్లిన కొత్త పైప్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించటాన్ని సాధ్యం చేసింది. మొత్తానికి మోసం జరగబోయిందన్నది స్పష్టం. కిరణ్ వసంత్ విహార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి ఫోన్ చేసిన వెంటనే ఆయన తమ పోలీసులను పంపారు. ఆఫీసర్ స్పందన నిజాయితీగా, చురుకుగా, సౌమ్యంగా ఉందని కిరణ్ చెప్పారు. ఆ ముగ్గురు మోసగాళ్లు తమ ‘పని’ పూర్తి చేసి వెళ్లిన కొద్దిసేపటికే ఐజీఎల్ ఇంజినీర్లు, పోలీసులు దాదాపుగా ఒకేసారి అక్కడికి చేరుకున్నారు. మార్చిన పైపు నకిలీది అవటమే కాకుండా, దాని దిగువ భాగం సరిగా బిగించి లేదని ఐజీఎల్ ఇంజనీర్లు కిరణ్‌కు చెప్పారు.అంటే ఒకవేళ గ్యాస్ స్విచ్ ఆన్ చేసి ఉంటే లీక్ అయుండేది.కిరణ్ ఫొటో తీసిన గుర్తింపు కార్డుల్ని, ఆ మోసగాళ్లు వదిలి వెళ్లిన ఫోల్డర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి కిరణ్ తీసుకున్న ఫోన్ నెంబర్లను బట్టి వారిని కనిపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ విధంగా 90 నిమిషాల వ్యవధిలో పరిస్థితి చక్కబడి, నష్టం జరగకుండా ఆగింది. ఇందుకు విరుద్ధంగా జరిగి ఉంటే కిరణ్ దాని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు అది మరింత దారుణమైన పరిస్థితిగా ఉండేది. అదృష్టవంతురాలు. అలా జరగలేదు. మూడు విషయాలను ఆమెను రక్షించాయని నేను అంటాను. గుర్తింపు కార్డులను ఫొటో తీసుకోవటం, వాళ్ల ఫోన్ నెంబర్లను అడిగి తీసుకోవటం, ‘మీ ఇంజినీర్లను పంపిస్తున్నట్లు ముందుగా నాకెందుకు సమాచారం ఇవ్వలేద’ని ఐజీఎల్ వాళ్లను ఆమె అడగటం! అన్నిటి కన్నా ముఖ్యంగా ఆ మోసగాళ్లు ‘పాడైపోయిన’ పైపును మార్చే ‘పని’ మీద ఉన్నప్పుడు తన ఇంట్లో పని చేసేవాళ్లు కూడా అక్కడ ఉండేలా జాగ్రత్త పడటం. ఒకవేళ ఆమె ఇవేవీ చేయకపోయుంటే?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కలిసి ‘కూర్చోవడానికి’ కాని కాలం!
క్లబ్బులు స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇతరులతో కలిసి కూర్చోవడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి. క్లబ్బు లోపలికి మీరు ఒక్కరిగానే వచ్చి ఉండవచ్చు. కానీ ఒక సంతోషకరమైన బృందంలో ఒకరిగా కలిసిపోతారు. క్లబ్బు సభ్యులు గౌరవప్రదంగా ప్రవర్తిస్తారనే భావన అంతర్లీనంగా ఉంటుంది. అలాంటి పెద్ద మనుషులను చిన్నబుచ్చే సంగతి ఇది. దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ జింఖానా క్లబ్బు సభ్యుల ఖాతాలలో ‘పాజిటివ్ క్రెడిట్ బ్యాలెన్స్’ ఉండాలంటోంది. గుప్పెడుమంది డబ్బులు ఎగ్గొట్టి ఉండొచ్చు. మరీ అనుమానాస్పదంగా కనిపిస్తే తప్ప తినేందుకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఏ రెస్టారెంటూ అడగదు. అలాంటిది ఇంత పెద్ద క్లబ్బే ఇలా చేస్తే? కానికాలం అంటే ఇదే!మీరు కనుక ఒక క్లబ్బులో సభ్యుడై ఉన్నట్లయితే, అలా ఉండటం ఎంతో ప్రత్యేకమైనదని మీకు తెలిసి ఉంటుంది. సమస్థాయి వ్యక్తులు కలుసుకోవడానికి, సేద తీరేందుకు, అక్కడ తాము మాట్లాడేవి, చేసేవి బయటికి బహిర్గతం అవుతాయనే భయం లేకుండా ఒక సమూహంగా మసలుకునేందుకు బ్రిటిష్‌వాళ్లు ప్రవేశపెట్టినవే ఈ క్లబ్బులు. నిర్వచనం ప్రకారం అవి ఆంతరంగికమైనవి, గోప్యనీయతను కలిగి ఉండేవి. బహశా అందువల్లే సభ్యులకు తమ క్లబ్బులు ప్రియమైనవిగా ఉండి, వారు తరచు వాటి పట్ల అపరిమితమైన విధేయతను కలిగి ఉంటారు. దాంతోపాటుగా క్లబ్బు సభ్యులు ‘పెద్ద మనుషులు’గా పరిగణన పొందుతారు. మహిళా సభ్యుల విషయంలోనూ ఇది నిజం. ఒక అలిఖిత – అయితే అందరూ ఎరిగిన – ప్రవర్తనా నియమావళి క్లబ్బుల్లో అమలులో ఉంటుంది. క్లబ్బు సభ్యులు ఎల్లప్పుడు గౌరవప్రదంగా ప్రవర్తిస్తారనే భావన అంతర్లీనంగా ఉంటుంది. సభ్యతగల పనులే చేస్తారని వారిపై నమ్మకం ఉంచవచ్చు. సంప్రదాయం ప్రకారం, క్లబ్బు సభ్యులు సభ్యత్వ నియమావళి మేరకు తామక్కడ పొందే సేవలకు డబ్బు చెల్లిస్తారు. అది బారులో డ్రింక్స్‌కి అయినా, డైనింగ్ హాల్లో విందుకైనా; లేదా క్రీడల సదుపాయాలను వినియోగించుకున్నా, వాటిల్లో పాల్పంచుకున్నా అందుకు అయిన ఖర్చును కచ్చితంగా, పూర్తిగా చెల్లించవలసి ఉంటుందనటంలో సందేహం లేదు. మొత్తమ్మీదైతే, ఈ మర్యాదస్తులు తమ చెల్లింపు నిబంధనలను గౌరవిస్తారు. పాడు కాలం, ఇప్పుడేమైందంటే దేశ రాజధానిలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, సభ్యత్వానికి అపరిమితమైన డిమాండును కలిగి ఉన్న ఢిల్లీ జింఖానా క్లబ్ ఇక మీదట మునుపటిలా ఉండబోవటం లేదు. ఆ క్లబ్బు తన సభ్యత్వానికే అవమానకరంగా, అసంబద్ధంగా – సభ్యులు తాము పొందబోయే సేవలకు గాను ముందుగానే డబ్బును డిపాజిట్ చేయాలన్న పద్ధతిని ప్రవేశపెట్టింది! క్లబ్బు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి క్లబ్బు బారులో తాగాలన్నా, క్లబ్బు డైనింగ్ హాలులో తినాలన్నా ఇకపై క్లబ్బు సభ్యుల ఖాతాలలో ‘పాజిటివ్ క్రెడిట్ బ్యాలెన్స్’ ఉండి ఉండాలి. అంటే మిగులు డబ్బులు ఉండాలి. వార్షిక సభ్యత్వ రుసుము కడుతున్నాం కదా అంటే ఇప్పుడు అదొక్కటే సరిపోదు. విషయం ఏంటంటే, మనకు ఇష్టమైనప్పుడు క్లబ్బుకు వెళ్లి కూర్చోవడానికి సదుపాయం కల్పించటమనే క్లబ్బు ప్రధాన ప్రయోజనాన్ని ఈ కొత్త పద్ధతి నెరవేరకుండా చేస్తుంది. మీరు మీ క్లబ్బు ఖాతాలో మిగులు డబ్బు లేకుండా తినలేరు. తాగలేరు. అప్పుడిక పక్క వారి మీద పడిపోవటమొక్కటే మీకుండే మార్గం. అది అధ్వాన్నమైన పరిస్థితి. క్లబ్బులు అనేవి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇతరుల కోసం మీరు డ్రింక్స్ కొనడానికి, లేదా వారితో కలిసి విందులో కూర్చోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. లోపలికి మీరు ఒక్కరిగానే వచ్చి ఉండవచ్చు. కానీ చివరికి మీరు ఒక సంతోషకరమైన బృందంలో ఒకరిగా కలిసిపోతారు. అయితే మీరు డిపాజిట్ చేసిన అడ్వాన్సు చాలినంతగా లేనప్పుడు మీరలా డ్రింక్స్‌ని కొనివ్వలేరు. లేదా ఫ్రెండ్ ఇచ్చిన డిన్నర్‌కు మీరు బిల్లు చెల్లించలేరు. ఆఖరికి వాణిజ్యపరమైన రెస్టారెంట్లు కూడా తమ అతిథులతో ఇంతకన్నా గౌరవంగా, సాదరంగా వ్యవహరిస్తాయి. అక్కడ తినటం ముగించి, వెళ్లటానికి సిద్ధం అయ్యాకే బిల్లు చెల్లిస్తారు. తినటానికి ముందే వాళ్లేమీ అడ్వాన్సు డిపాజిట్ చేసి ఉండనక్కర్లేదు. మీరు మరీ అనుమానాస్పదంగా, నమ్మదగనివారిగా కనిపిస్తే తప్ప మీరేం తినదలచుకున్నారో దానిని తినేందుకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఏ రెస్టారెంటూ మిమ్మల్ని అడగదు. అయినప్పటికీ జిమ్ – జింఖానాను ముద్దుగా సభ్యులు ఇలాగే పిలుచుకుంటారు – ఇకపై కొత్త పద్ధతి అమలు చేయబోతోంది. తన సభ్యత్వం పట్ల ఈ విధమైన అమర్యాదకర వైఖరికి క్లబ్బు చూపిస్తున్న సాకు ఏమిటంటే – కొంతమంది సభ్యులు తమ బిల్లులు చెల్లించటం లేదని! దురదృష్టవశాత్తూ, ఆ మాట నిజం. బకాయి పడిన వారి పేర్ల జాబితాను అందరికీ కనిపించేలా ఉంచినప్పటికీ కూడా వారికి చీమ కుట్టినట్లయినా ఉండటం లేదు. కానీ సభ్యులలో అలాంటి వారు కొద్ది మంది, లేదంటే కొంత భాగం. సభ్యత్వపు విధి విధానాలకు కట్టుబడి, బహుశా పది వేల మందికి పైగా ఉన్న సభ్యుల జాబితాలో అదే పనిగా, తీరు మార్చుకోకుండా బకాయి పడుతుండే సభ్యులు వందకు మించి ఉండరు. తరచు న్యాయబద్ధమైన, ఆమోదయోగ్యమైన కారణాల వల్ల బాకాయిలను ఆలస్యంగా చెల్లిస్తుండేవారిని ఉద్దేశపూర్వకంగానే నేను ఈ జాబితాలో చేర్చటం లేదు. ఇప్పుడు, మిగతా ప్రతి ఒక్కరూ – గౌరవప్రదంగా, అధిక సంఖ్యాకంగా ఉండేవారు – బకాయి పడుతున్న కొద్దిమంది విషయమై ప్రతిస్పందించటానికి క్లబ్బు ఇంతకన్నా మెరుగైన, ప్రభావవంతమైన మార్గాన్ని కనుగొనలేక పోయిన కారణంగా ఇబ్బంది పడాలా?చూస్తుంటే క్లబ్బు సమాధానం ‘అవును’ అన్నట్లే కనిపిస్తోంది. అలా కనిపించటమే క్లబ్బు యాజమాన్యం గురించి ఆందోళన కలగటానికి కారణం. క్లబ్ అంటే ఏమిటో, అదెలా ఉండాలని కోరుకుంటారో యాజమాన్యం అర్థం చేసుకోలేక పోయింది.ఏదేమైనా, ఇందుకు – దాటవేశారని చెప్పటానికి వీల్లేని – మరొక పరిష్కారం ఉంది. క్లబ్బు యాజమాన్యం నిజంగానే బిల్లు చెల్లింపులను బకాయి పెట్టే సభ్యుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన చెందుతున్నట్లయితే బయటి రెస్టారెంట్లలో మాదిరిగా తాగిన వెంటనే, లేదా తిన్న వెంటనే బిల్లు చెల్లించాలని వారిని కోరవచ్చు. నిజానికి లండన్‌లోని చాలా క్ల్లబ్బులు ఈ పనే చేస్తున్నాయి. అది మరింత చిత్తశుద్ధిగా, మర్యాదగా ఉంటుంది. ఢిల్లీ జింఖానా క్లబ్ అటువైపుగా ఎందుకు ఆలోచించలేక పోయింది?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కోపానికి మహోగ్ర రూపం.. మౌనం!
మనుషులు భిన్న వైరుధ్యాలతో ఉంటారు. ఉన్న వారు, లేనివారు అని మాత్రమే కాదు. మంచి వాళ్లు, చెడ్డవాళ్లు; రూపసులు, కురూపులు; ఇంకా... ఉల్లాసంగా ఉండేవాళ్లు, ఉసూరుమంటూ పడి వుండే వాళ్లు; ఆలోచనాపరులు, ఉద్వేగప్రాణులు; తియ్యగా మాట్లాడేవారు, మాటలసలే రానివాళ్లు, అలాగే ఉత్తి పుణ్యానికి భగ్గుమనేవారు కొందరైతే, కోపమే తెచ్చుకోని వారు మరికొందరు. ఈ జాబితా లోని చివరి వైరుధ్యం గురించే నేను ఈ వారం మాట్లాడబోతున్నది. దీనికి కారణం ఏమిటంటే, నేను ఇట్టే చికాకు పడిపోతాను. మర్యాదస్తుల సమాజం నన్ను ‘షార్ట్ టెంపర్డ్’ అంటుంది. అయితే మీరు నన్ను ఓర్పు లేని, సహనం లేని మనిషి అనవచ్చు. చివరికి కోపధారి అని కూడా.నాలోని వైరుధ్యం ఏమిటంటే... శాంతంగా ఉండేందుకు నేను ప్రయ త్నిస్తున్నానని నాకు అనిపించటంతోనే నేను నా ప్రసన్నతను కోల్పోతూ ఉంటాను. ఎంతగానంటే కోపాన్ని అణచుకోవటం నాకు అలవిమాలిన సవా లుగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇంగితజ్ఞానం లేకుండా, ఉద్దేశ పూర్వకంగా నన్ను రెచ్చగొడుతున్నప్పుడు కొద్ది నిముషాలు మాత్రమే నన్ను నేను నిగ్రహించుకుని ఉండగలను. తర్వాత, హఠాత్తుగా పెను వేగంతో నా చిరునవ్వు మాయమవటం మొదలై, నా మెదడు పదునైన మాటలతో పొంగి పొర్లి దెబ్బకు దెబ్బా తిప్పికొట్టటానికి నేను సిద్ధమౌతాను. ఒక మెరుపుదాడిలా నా కోపం బయటికి బద్ధలౌతుంది.వెసూవియస్ అగ్నిపర్వతంలా అది సత్వర మే చిత్రంగా అంతటా వ్యాప్తి అవుతుంది. అదృష్టవశాత్తూ మరిగి ఉన్న టీ పాత్రలా నేను వేగంగా చల్లబడ తాను. కానీ మళ్లీ లావా లాగా – లేదా, చింది పడిన వేడి నీళ్ల మాదిరిగా – ఆ నష్టం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే నేను కోపం ప్రదర్శించిన వ్యక్తులు గుంభనంగా ఉండిపోతారు. వాళ్లు అంత తేలిగ్గా బద్దలవరు. నిజానికి వాళ్లు అలా బద్దలవటానికి సిద్ధపడేముందు చాలా సమయం తీసుకుంటారు. ఒకసారి బద్దలయ్యాక రోజుల పాటు వారు రగిలి పోతూ ఉంటారు. వెంటనే చల్లారటం ఉండదు.అలాంటి మనిషి నా భార్య నిషా. మా తొలి తగాదా చాలా చిన్నదైన ఒక విషయం మీద జరిగింది. అది ఇలా సాగింది: తన ధ్యాస నాపై ఉండటాన్ని నేను కోరుకుంటానన్న సంగతి నిషాకు బాగా తెలుసు. నేను ఆశించినట్లే తను ఉండేది. సమస్యేమిటంటే... నేను ఆశిస్తున్నట్లు తను ఉంటున్నానన్న గమనింపును నిషా నాలో కలిగించేది. దాంతో ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నాకు తెలిసిపోయింది. అటువంటి సందర్భాలలో నిషా నన్ను ‘కె.టి. బాబా’ అని పిలిచేది. అలా పిలవటంలో ప్రేమా ఉండేది, నవ్వులాటా ఉండేది.ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నా గ్రహింపునకు వచ్చినప్పుడు మొదట నేను జోక్‌గానే తీసుకున్నాను. కానీ జోకులతో సమస్య ఏమిటంటే మిగతా వారు కూడా వాటిల్లోకి చొరబడతారు. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్, ఇంకా అఫ్తాబ్, మరొక స్నేహితుడు నిషా మాటల్ని పట్టుకుని నాపైకి నవ్వులాటకు వచ్చేవారు. నిమి షాల వ్యవధిలోనే అది అటువైపు ముగ్గురు, ఇటువైపు ఒక్కరు అయ్యేది. ఆ తర్వాత నా మతిస్థిమితం నాపై విజయం సాధించి హాస్యమంతా పాడైపో టానికి ఎంతో సమయం పట్టేది కాదు.నా ఉద్వేగం నా తలలోకి పరుగులు పెట్టేది. నా ముఖం ఎర్రబడేది. నా గొంతు పైకి లేచేది. దురదృష్టవశాత్తూ, ఇలా జరగటం అన్నది రాబోయే ప్రమాదం నుంచి వాళ్లను హెచ్చరించటానికి బదులుగా వాళ్లను మరింతగా నవ్వులాటకు పురిగొల్పేది. ఆ మాటల యుద్ధంలో నేను తలదూర్చేలా నా కోసం వల పన్ని వేడుకగా చూస్తుండేవారు.ఆ ముగ్గురితో నేను గొడవ పడేవాడినని చెప్పటం సరిగ్గా ఉంటుంది. అయితే ప్రవీణ్, ఆఫ్తాబ్ నవ్వుతూ కొట్టి పడేస్తే, నిషా నా కోపాన్ని తను చిన్నతనంగా భావించి బాధపడేది. మీరు కనుక పెళ్లయినవారైతే భార్యలు... భర్తల (అలాంటి) తత్వాన్ని అక్కడ ఉన్నదాని కంటే చాలా ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తుంది. వాళ్లంతా వెళ్లాక నిషా నాపై తన కోపాన్ని కుమ్మరించింది.‘‘మీరొక పరమ బుద్ధిహీనుడిలా ప్రవర్తించారు.’’ ‘‘నవ్వులాటను తేలిగ్గా తీసుకోలేరా?’’ అని నిషా. ‘‘అదేం తమాషాగా లేదు’’ అని నేను. ‘‘అందరికీ తెలుసు అదంతా తమాషాకేనని. కానీ అది మీ మీద జోక్ కనుక మీకు కోపం వచ్చింది’’ – నిషా. ఇరవై నిముషాల తర్వాత నా కోపం అంతా చల్లారిపోయింది. నేను ప్రశాంతచిత్తుడినై ఉండిపోయాను. కానీ నిషా ఇంకా తన కోపాన్ని లోలోపల అణచుకునే ఉంది.‘‘కాఫీ’’ అని అడిగాను. మౌనం! ‘‘టీ?’’ అన్నాను, అది కాకపోతే ఇది అన్నట్లు. మరింతగా మౌనం! ‘‘ఏంటి నీ బాధ?’’ అని పెద్దగా అరిచాను... ఆమె నాతో మాట్లాడటానికి తిరస్కరిస్తున్నందువల్ల వచ్చిన కోపంతో. అప్పుడు కూడా మౌనం! ‘‘ఛీ పో...’’ అన్నాను. ‘‘నువ్వే ఛీ పో’’ అంటూ అప్పుడు నోరు తెరిచి, మళ్లీ మౌనంగా ఉండిపోయింది. ఇదంతా సర్దుకోడానికి రెండు రోజులు పట్టింది.ఏమైనా, బయటివాళ్లతో వచ్చే తగాదాలు బద్దలయ్యేంతగా గానీ, దీర్ఘ కాలం కొనసాగేంతగా గానీ ఉండవు. ఇట్టే అవి చెలరేగితే చెలరేగి ఉండొచ్చు గాక. నాకిప్పుడు తెలుస్తోంది నా ప్రారంభ ప్రతిస్పందన ఆత్మనిగ్రహం లేని దిగా, సాధారణంగా నా వైపు నుండే తప్పును ఎత్తి చూపించేదిలా ఉంది అని. కానీ ఏం చేయటం, నాకు తెలివి వచ్చేటప్పటికే బాగా అలస్యం అయిపోయింది. తర్వాత నేను చేయగలిగిందంతా నేనే మొదట క్షమాపణలు చెప్పి పరిస్థితిని చక్కబరచుకోవటం. కొన్నిసార్లు అది పని చేస్తుంది కానీ అన్నిసార్లూ కాదు. ఆఫీసులో నా సహోద్యోగులు కొందరు రోజుల తరబడి బిగదీసుకుని ఉండేవారున్నారు.గతవారం, మానవ ప్రవర్తనల్ని విశ్లేషించే ఒక అమెరికన్ ఇచ్చిన వివరణ అనుకోకుండా నా దృష్టికి వచ్చింది. ‘‘షార్ట్ టెంపర్డ్గా ఉండేవాళ్లకు, అంటే... తేలిగ్గా, తరచు తప్పుగా కోపం తెచ్చుకునేవాళ్లకు మనసులో ఏమీ ఉండదు. అంతా పైకే కనబరిచేస్తారు. తమను ఎగతాళి చెయ్యటాన్ని వారు నవ్వుతూ తీసుకుంటారు. అయితే దాని వల్ల వారు తరచు అన్యాయంగా వెక్కిరింపులు పడవలసి వస్తుంది. దాంతో అదుపు తప్పుతారు. వాళ్ల మాదిరిగా నియంత్రణ కోల్పో వటం మంచిదే. కానీ అందులో మీరు నిజాయితీగా ఉండండి. దారి మళ్లించటానికి, మనసులో ఉన్నది దాచిపెట్టుకోటానికి మాత్రమే నిజమైనది కాని మౌనాన్ని కొనసాగించండి.’’నిషా ఈ మాటల్లోని సమర్థనీయతను అంగీకరించి ఉండేదా అని నా ఆశ్చర్యం. లేదంటే, ఆమె పెద్దగా నవ్వి, ‘‘కె.టి. బాబా ఇదంతా మీరు కల్పించారు కదా? వినటానికైతే బాగుంది’’ అని ఉండేదా? కావచ్చు. అప్పుడైతే అది మానవ ప్రవృత్తిలోని గొప్ప విషయం.– కరణ్ థాపర్, వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ -
బ్రిటన్ రాజకీయాలు నేర్పుతున్న పాఠాలు
దాదాపు ఒక దశాబ్దకాలంగా మనం బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, విశ్వసనీయత లేని రాజకీయ నాయకులు, నాణ్యమైనవి కాని మౌలిక సదుపాయాలు, క్రమంగా క్షీణిస్తున్న పాలనా ప్రతిష్ఠ... వంటివాటిని మాత్రమే బ్రిటన్ గురించి చూడడానికి అలవాటు పడుతూ వచ్చాము. అది మన తప్పు కాదు. కానీ ఇప్పుడు బ్రిటన్ను భిన్నంగా చూసే అవకాశం వచ్చింది. అలాగే ఇండియాలో మనం కూడా ఈసారి కొన్ని అమూల్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. యునైటెడ్ కింగ్డమ్ బహుశా ప్రపంచంలోనే అత్యంత బహుళ సాంస్కృతిక సమాజం. భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశానికి ప్రధానిగా పని చేశారు. ఇంకా అనేకమంది నల్లజాతీయులు లేదా ఆసియాకు చెందినవారు చాన్స్లర్లుగా, విదేశీ కార్యదర్శులుగా, హోమ్ శాఖ కార్యదర్శులుగా; స్కాట్లాండ్, వేల్స్, లండన్ల అధినేతలుగా ఉన్నారు. మిగతా ఏ దేశమూ ఇంతగా అపూర్వమైన స్థాయిలో వైవిధ్యాన్ని కలిగి ఉంటుందని నేను అనుకోను. గత సభలోని 10 శాతంతో పోల్చి చూస్తే ఇటీవల హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎంపికైన ఎంపీలలో 13 శాతం మంది నల్లజాతీయులు / ఆసియన్లు లేదా మైనారిటీ జాతుల మూలవాసులే. వీరిలో 29 మంది భారత సంతతి వారు కాగా, 15 మంది పాకిస్తాన్‌కు చెందినవారు. 12 మంది సిక్కులు. అయితే బ్రిటన్ జనాభాలో ఆసియన్లు 8 శాతం మాత్రమే కాగా, నల్లజాతీయులు 4 శాతం, భారత సంతతివారు 3.1 శాతం, పాక్‌కి చెందినవారు 2.7 శాతం మాత్రమే. హౌస్ ఆఫ్ కామన్స్‌తో పోల్చి చూసినప్పుడు.. భారతదేశ జనాభాలో దాదాపు 15 శాతంగా ఉన్న ముస్లింలు దామాషా ప్రకారం మన లోక్‌సభలో 74 మంది ఉండాలి. కానీ ఉన్నది 24 మందే. 2019లో వారి సంఖ్య 26. ఆ ముందు 2014లో 23. దేశంలోని 28 రాష్ట్రాల్లో మనకు ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి కూడా లేరు. 15 రాష్ట్రాలలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు. 10 రాష్ట్రాలలో ఒక ముస్లిం ఉన్నారు కానీ, ఆ ఒక్కరూ ఉన్నది అల్పసంఖ్యాక వ్యవహారాలకు ఇన్ఛార్జిగా మాత్రమే!ఇంకా చెప్పాలంటే, అధికార బీజేపీ పార్టీకి లోక్‌సభలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు. 20 శాతం ముస్లింలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ఆ పార్టీకి శాసన సభలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. 2017లో కూడా అంతే. గుజరాత్లో బీజేపీ 1998 నుండి లోక్‌సభ ఎన్నికల్లో గానీ, విధాన సభ ఎన్నికల్లో కానీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. రాష్ట్రంలో 9 శాతం మంది ముస్లింలే అయినప్పటికీ ఒక పావు శతాబ్దం నుంచీ ఆ పార్టీ ముస్లిములతో ఉద్దేశపూర్వకమైన దూరాన్ని పాటిస్తోంది. మనం నేర్చుకోవలసిన చాలా భిన్నమైన రెండో పాఠం కూడా ఉంది. మీరు మీ పార్టీని ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయం వైపు నడిపించినప్పుడు మీ స్పందన ఎలా ఉండాలన్నది. బ్రిటన్‌లో అయితే రిషీ సునాక్ రాజీనామా చేశారు. 12 గంటలు గడవక ముందే ఆయన అలా చేశారు. నిజానికి ఫలితాలింకా పూర్తిగా వెల్లడవక ముందే కన్జర్వేటర్లు తాము తిరిగి అధికారంలోకి రావాలంటే తామెలాంటి పార్టీగా ఉండాలన్న దానిపై బహిరంగంగా చర్చించటం ప్రారంభించారు. రానున్న వారాల్లో, నెలల్లో ఆ చర్చ మరింత తీవ్రతరం అవుతుంది. మొత్తం దేశం అందులో పాల్గొంటుంది. మీడియా ప్రశ్నిస్తుంది. రెచ్చగొడుతుంది. ఎంపీలు తగాదా పడతారు. వాదోపవాదాలు జరుగుతాయి. ఆశావహులు ముందుకు వస్తారు. వెనక్కు తగ్గుతారు. అనేకమంది వ్యక్తిగత ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. పార్టీకి అది ఇబ్బందికరమైన పరిస్థితిగా పరిణమిస్తుంది. అయితే చివరికి ఒక కొత్త పార్టీ ఆవిర్భవిస్తుంది. ఇప్పుడొకసారి, 2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో కుప్పకూలి పోయాక ఏం జరిగిందో చూద్దాం. ఎవరూ రాజీనామా చేయలేదు. పార్టీ తన భవిష్యత్తు గురించి చర్చించలేదు. సోనియా గాంధీ మరో మూడు సంవత్సరాలు అధ్యక్షురాలిగా కొనసాగి, చివరికి తన కుమారుడికి మార్గం ఏర్పరిచారు. గాంధీల కుటుంబానికి వెలుపలి వ్యక్తిని అధ్యక్షుడిని చేసే ఎన్నిక 2022 వరకు జరగలేదు. అప్పుడు కూడా శశిథరూర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. పదేళ్ల తర్వాత ఈ రోజుకు కూడా ఆ పార్టీ గాంధీల గట్టి నియంత్రణలోనే ఉంది. మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడే కావచ్చు, కానీ రాహులే కీలకమైన వ్యక్తి. సోనియా గాంధీ వార్ధక్యంలో ఉన్నా, అస్వస్థతతో ఉంటున్నా, పార్లమెంటులో మాట్లాడేందుకు అనాసక్తతను కనబరుస్తున్నా కూడా సోనియానే పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. మూడో పాఠం కూడా ఉంది కానీ నేను దానిని క్లుప్తంగా మాత్రమే ప్రస్తావిస్తాను. సునాక్ రాజీనామా చేసేందుకు ప్రధాని అధికారిక వాహనంలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లారు. రాజీనామా అనంతరం ప్రైవేటు వాహనంలో ప్యాలెస్ పక్క ద్వారం నుండి బయటికి నిష్క్రమించారు. ఒక గంట తర్వాత కొత్తగా ఎన్నికైన ప్రధాని స్టార్మర్ ప్రతిపక్ష నాయకుడి కారులో అక్కడికి వచ్చారు. ప్రధాన మంత్రిగా తన నియామకం జరిగాక ప్రధాని అధికారిక వాహనం లిమజీన్ కారులో 10, డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లారు. ఆయన అక్కడికి చేరుకునే సమయానికి సునాక్ కుటుంబానికి చెందిన వస్తువుల్ని ప్యాక్ చేసి, తరలించారు. 10 డౌనింగ్ స్ట్రీట్ కొత్త ప్రభుత్వాధినేతకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ఇదంతా కూడా ఫలితాలు స్పష్టమైన కొద్ది గంటల్లోనే జరిగింది. వైభవోపేతమైన ప్రమాణ స్వీకారోత్సవం కోసం రాజ్యాంగ ప్రక్రియకు వాళ్లేమీ ఐదు రోజుల విరామం ఏమీ ఇవ్వలేదు. ఎన్నికలు ముగియటంతోనే పాలన ప్రారంభమై పోయింది. ప్రపంచంలోని కొత్త ప్రధానులందరూ వెంటనే పని మొదలు పెడతామని చెప్పినా, వాస్తవానికి బ్రిటన్ మాత్రమే ఆ పని చేయగలిగింది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పని చేస్తోందా? పట్టు తప్పుతోందా?!
ఇప్పుడిక మనం 18వ లోక్‌సభను ఎన్నుకున్నందున ప్రాథమికమైన రెండు ప్రశ్నలను లేవనెత్తాల్సిన సమయం ఆసన్నమయింది. మొదటిది– లోక్‌సభ మన ఆశలకు అనుగుణంగానే పని చేస్తోందా? రెండవది – కేవలం పాలక పక్షాలు చెప్పింది వినడం వరకే కాక, భారత ప్రజల గొంతును కూడా వినిపించేందుకు తగినంతగా సమయాన్ని సాధించేలా ప్రతిపక్షాన్ని ఒప్పించటానికి ఎలాంటి మార్పులు అవసరం?17వ లోక్‌సభ కేవలం 1,354 గంటలు మాత్రమే పని చేసిందని పీఆర్ఎస్ (పాలసీ రీసెర్చ్ స్టడీస్) లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రచురించిన వాస్తవాలు తెలియజేస్తున్నాయి. మొత్తం అన్ని పూర్తి–కాల లోక్‌సభల పని గంటల సగటు కంటే నలభై శాతం తక్కువగా 1,615 గంటలు మాత్రమే పని చేసిన 16వ లోక్‌సభ కన్నా కూడా ఇది తక్కువ. నిజానికి 17వ లోక్‌సభ 15 సమావేశాలలో 11 సమావేశాలు నిర్దిష్ట సమయానికి ముందే వాయిదా పడ్డాయి. మొత్తం అన్ని పూర్తి–కాల లోక్‌సభలలో ఒక్క 17వ లోక్‌సభ మాత్రమే అతి తక్కువగా కేవలం 274 సార్లు మాత్రమే సమావేశం అయింది. ఏడాదికి 135 రోజులు సమావేశం అయిన తొలి లోక్‌సభతో పోల్చి చూస్తే 17వ లోక్‌సభ ఏడాదికి కేవలం 55 రోజులు మాత్రమే సమావేశమైంది. ఇది చట్ట నిర్వహణ విధానంపై స్పష్టమైన ప్రభావం చూపింది. బిల్లులు చాలావరకు వాటిని ప్రవేశపెట్టిన రెండు వారాల లోపే ఆమోదం పొందాయి. 35 శాతం బిల్లులు గంట కంటే తక్కువ చర్చతోనే చట్టరూపం దాల్చాయి. పార్లమెంటరీ కమిటీల పరిశీలన కోసం కేవలం 16 శాతం మాత్రమే వెళ్లాయి. ఆ ముందరి మూడు లోక్‌సభలలో పరిశీలనకు వెళ్లినవాటి కంటే ఇది తక్కువ. అంటే, లోక్‌సభ పని గంటలు తగ్గిపోతుండటమే కాకుండా, అందులోనూ మళ్లీ... బిల్లుల నిశిత పరిశీలన, బిల్లులపై జరగవలసిన అర్థవంతమైన చర్చల విషయంలో లోక్‌సభ సామర్థ్యం క్షీణించిపోతోంది! లోక్‌సభ అతి ముఖ్యమైన విధులలో ఈ బిల్లుల చర్చ–పరిశీలన ఒకటి కనుక అది మన అంచనాలకు తగ్గట్లుగా లేదని మనం నిస్సంకోచంగా అనుకోవచ్చు. దీనికి పరిష్కారం సరళమైనది, స్పష్టమైనది. అదేమిటంటే, లోక్‌సభలు ప్రతి సంవత్సరం కనీసం ఇన్ని రోజులని నిర్దిష్టంగా సమావేశం అవ్వాలి. బిల్లులు ఆమోదం పొందటానికి ముందు సవివరమైన పరిశీలన కోసం వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపాలి. మరొకటి – ఎంతో క్లిష్టమైనదీ – లోక్‌సభ పనితీరుకు ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయటం! ఇక్కడే పాలకపక్షం తమ గొంతును వినటం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించవలసిన అవసరం ఉంది. అలా చేస్తే తప్ప ప్రభుత్వాన్ని అర్థవంతంగా ప్రశ్నించటం, సవాలు చేయటం కుదరదు. మరి దీన్నెలా మనం సాధించాలి? దీనికొక కుదురైన పరిష్కారం హౌస్ ఆఫ్ కామన్స్ పాటించే విధానాన్ని స్వీకరించటం! ప్రతి సమావేశాలలోనూ కొన్నిరోజులు ప్రతిపక్షాలే అజెండాను నిర్ణయించేలా చేయటం. బ్రిటన్‌లో వాటిని ‘ప్రతిపక్షాల రోజులు’ అంటారు. ప్రతి పార్లమెంటు సమావేశంలో అవి 20 ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షానికి 17, రెండవ అతిపెద్ద ప్రతిపక్షానికి 3 రోజులు. మనం అనుసరించదగిన బ్రిటిష్ పార్లమెంటరీ విధానాలలో రెండవది... పీఎంక్యూస్ (ప్రైమ్ మినిస్టర్స్ క్వశ్చన్స్). సమావేశాలు జరుగుతున్న కాలంలో ప్రతివారం ఒక నిర్ణీత రోజున పూర్తిగా ఒక అరగంట పాటు ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధానే నేరుగా సమాధానం చెబుతారు. వాటిల్లో కనీసం ఆరు ప్రశ్నలను ప్రతిపక్ష నేత అడుగుతారు. పీఎంక్యూస్ అని బ్రిటన్‌లో వాడుకలో ఉన్న ఈ ప్రశ్నా సమయం అమితమైన ప్రజాసక్తిని కలిగి ఉంది. పీఎం, ప్రతిపక్ష నేతల బలాలను, బలహీనతలను బహిర్గతపరిచే ఉత్తేజభరితమైన క్షణాలు అవి. వారి సమాచార లేమి, సామర్థ్య లోపం ఇట్టే తెలిసిపోతాయి. పీఎంక్యూస్ బ్రిటన్కొక గవాక్షం వంటిది కూడా! తమ నాయకుడు ఎంతటి ఘనుడో ప్రజలు చూస్తారు. ఒక అంచనాకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రజాస్వామ్యం పని చేస్తోందా, లేక పట్టుతప్పుతోందా అనేదానికి పీఎంక్యూస్ ఒక రుజువు. ఈ సంప్రదాయాలను మనం స్వీకరించినట్లయితే, ప్రజాస్వామ్యం పట్ల అవి మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలన్న ప్రతిపక్షాల ప్రయత్నానికి అవి మద్దతును ఇస్తాయి. భిన్నమైన అభిప్రాయాలు, వాదనలకు చర్చావేదిక దొరికిందన్న నమ్మకాన్ని భారత ప్రజలకు కల్పిస్తాయి. చివరిగా, కోల్పోయిన విశ్వాసాన్ని నిజంగా పాదుకొల్పడానికి మనం స్పీకర్ స్థానం విషయమై కూడా మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. స్పీకర్‌గా ఎంపికైన వారు వెంటనే తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా ఉండగలరని నమ్మగలం. ఆమె లేదా అతడు తర్వాతి లోక్‌సభకు కూడా కొనసాగాలని అనుకుంటే వారి ఎన్నిక పోటీ లేకుండానే జరగాలి. అదంతా కూడా ఎలాగూ వారి స్వభావం, ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నప్పటికీ వార్ధక్య వైకల్యాలు లేకుండాలి. ఇవి స్పష్టమైన పరిష్కారాలే కానీ ప్రభుత్వం ఆమోదించినప్పుడు మాత్రమే సంభవమౌతాయి. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతిపక్షమే స్వయంగా ఈ మార్పులను సిఫారసు చేయవచ్చు. అందుకు బీజేపీ కనుక నిరాకరిస్తే భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది అని చెప్పుకోవటాన్ని ఆ పార్టీ కొనసాగించగలదా? అప్పుడు తల్లి అని కాకుండా సవతి తల్లి అని చెప్పుకోవటమే సరిగ్గా ఉంటుందా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పని చేస్తోందా? పట్టు తప్పుతోందా?!
ఇప్పుడిక మనం 18వ లోక్‌సభను ఎన్నుకున్నందున ప్రాథమికమైన రెండు ప్రశ్నలను లేవనెత్తాల్సిన సమయం ఆసన్నమయింది. మొదటిది– లోక్‌సభ మన ఆశలకు అనుగుణంగానే పని చేస్తోందా? రెండవది – కేవలం పాలక పక్షాలు చెప్పింది వినడం వరకే కాక, భారత ప్రజల గొంతును కూడా వినిపించేందుకు తగినంతగా సమయాన్ని సాధించేలా ప్రతిపక్షాన్ని ఒప్పించటానికి ఎలాంటి మార్పులు అవసరం?17వ లోక్‌సభ కేవలం 1,354 గంటలు మాత్రమే పని చేసిందని పీఆర్ఎస్ (పాలసీ రీసెర్చ్ స్టడీస్) లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రచురించిన వాస్తవాలు తెలియజేస్తున్నాయి. మొత్తం అన్ని పూర్తి–కాల లోక్‌సభల పనిగంటల సగటు కంటే నలభై శాతం తక్కువగా 1,615 గంటలు మాత్రమే పని చేసిన 16వ లోక్‌సభ కన్నా కూడా ఇది తక్కువ. నిజానికి 17వ లోక్స¿¶ 15 సమావేశాలలో 11 సమావేశాలు నిర్దిష్ట సమయానికి ముందే వాయిదా పడ్డాయి. మొత్తం అన్ని పూర్తి–కాల లోక్‌సభలలో ఒక్క 17వ లోక్‌సభ మాత్రమే అతి తక్కువగా కేవలం 274 సార్లు మాత్రమే సమావేశం అయింది.ఏడాదికి 135 రోజులు సమావేశం అయిన తొలి లోక్‌సభతో పోల్చి చూస్తే 17వ లోక్‌సభ ఏడాదికి కేవలం 55 రోజులు మాత్రమే సమావేశమైంది. ఇది చట్ట నిర్వహణ విధానంపై స్పష్టమైన ప్రభావం చూపింది. బిల్లులు చాలావరకు వాటిని ప్రవేశపెట్టిన రెండు వారాల లోపే ఆమోదం పొందాయి. 35 శాతం బిల్లులు గంట కంటే తక్కువ చర్చతోనే చట్టరూపం దాల్చాయి. పార్లమెంటరీ కమిటీల పరిశీలన కోసం కేవలం 16 శాతం మాత్రమే వెళ్లాయి. ఆ ముందరి మూడు లోక్‌సభలలో పరిశీలనకు వెళ్లినవాటి కంటే ఇది తక్కువ. అంటే, లోక్‌సభ పని గంటలు తగ్గిపోతుండటమే కాకుండా, అందులోనూ మళ్లీ... బిల్లుల నిశిత పరిశీలన, బిల్లులపై జరగవలసిన అర్థవంతమైన చర్చల విషయంలో లోక్‌సభ సామర్థ్యం క్షీణించిపోతోంది! లోక్‌సభ అతి ముఖ్యమైన విధులలో ఈ బిల్లుల చర్చ–పరిశీలన ఒకటి కనుక అది మన అంచనాలకు తగ్గట్లుగా లేదని మనం నిస్సంకోచంగా అనుకోవచ్చు. దీనికి పరిష్కారం సరళమైనది, స్పష్టమైనది. అదేమిటంటే, లోక్‌సభలు ప్రతి సంవత్సరం కనీసం ఇన్ని రోజులని నిర్దిష్టంగా సమావేశం అవ్వాలి. బిల్లులు ఆమోదం పొందటానికి ముందు సవివరమైన పరిశీలన కోసం వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపాలి.మరొకటి – ఎంతో క్లిష్టమైనదీ – లోక్‌సభ పనితీరుకు ప్రభుత్వం బాధ్యత వహించేలా చేయటం! ఇక్కడే పాలకపక్షం తమ గొంతును వినటం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించవలసిన అవసరం ఉంది. అలా చేస్తే తప్ప ప్రభుత్వాన్ని అర్థవంతంగా ప్రశ్నించటం, సవాలు చేయటం కుదరదు. మరి దీన్నెలా మనం సాధించాలి?దీనికొక కుదురైన పరిష్కారం హౌస్ ఆఫ్ కామన్స్ పాటించే విధానాన్ని స్వీకరించటం! ప్రతి సమావేశాలలోనూ కొన్నిరోజులు ప్రతిపక్షాలే అజెండాను నిర్ణయించేలా చేయటం. బ్రిటన్‌లో వాటిని ‘ప్రతిపక్షాల రోజులు’ అంటారు. ప్రతి పార్లమెంటు సమావేశంలో అవి 20 ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షానికి 17, రెండవ అతిపెద్ద ప్రతిపక్షానికి 3 రోజులు.మనం అనుసరించదగిన బ్రిటిష్ పార్లమెంటరీ విధానాలలో రెండవది... పీఎంక్యూస్ (ప్రైమ్ మినిస్టర్స్ క్వశ్చన్స్). సమావేశాలు జరుగుతున్న కాలంలో ప్రతివారం ఒక నిర్ణీత రోజున పూర్తిగా ఒక అరగంట పాటు ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధానే నేరుగా సమాధానం చెబుతారు. వాటిల్లో కనీసం ఆరు ప్రశ్నలను ప్రతిపక్ష నేత అడుగుతారు.పీఎంక్యూస్ అని బ్రిటన్‌లో వాడుకలో ఉన్న ఈ ప్రశ్నా సమయం అమితమైన ప్రజాసక్తిని కలిగి ఉంది. పీఎం, ప్రతిపక్ష నేతల బలాలను, బలహీనతలను బహిర్గతపరిచే ఉత్తేజభరితమైన క్షణాలు అవి. వారి సమాచార లేమి, సామర్థ్య లోపం ఇట్టే తెలిసిపోతాయి. పీఎంక్యూస్ బ్రిటన్కొక గవాక్షం వంటిది కూడా! తమ నాయకుడు ఎంతటి ఘనుడో ప్రజలు చూస్తారు. ఒక అంచనాకు వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రజాస్వామ్యం పని చేస్తోందా, లేక పట్టుతప్పుతోందా అనేదానికి పీఎంక్యూస్ ఒక రుజువు.ఈ సంప్రదాయాలను మనం స్వీకరించినట్లయితే, ప్రజాస్వామ్యం పట్ల అవి మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలన్న ప్రతిపక్షాల ప్రయత్నానికి అవి మద్దతును ఇస్తాయి. భిన్నమైన అభిప్రాయాలు, వాదనలకు చర్చావేదిక దొరికిందన్న నమ్మకాన్ని భారత ప్రజలకు కల్పిస్తాయి.చివరిగా, కోల్పోయిన విశ్వాసాన్ని నిజంగా పాదుకొల్పడానికి మనం స్పీకర్ స్థానం విషయమై కూడా మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది. స్పీకర్‌గా ఎంపికైన వారు వెంటనే తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా ఉండగలరని నమ్మగలం. ఆమె లేదా అతడు తర్వాతి లోక్‌సభకు కూడా కొనసాగాలని అనుకుంటే వారి ఎన్నిక పోటీ లేకుండానే జరగాలి. అదంతా కూడా ఎలాగూ వారి స్వభావం, ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నప్పటికీ వార్ధక్య వైకల్యాలు లేకుండాలి.ఇవి స్పష్టమైన పరిష్కారాలే కానీ ప్రభుత్వం ఆమోదించినప్పుడు మాత్రమే సంభవమౌతాయి. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతిపక్షమే స్వయంగా ఈ మార్పులను సిఫారసు చేయవచ్చు. అందుకు బీజేపీ కనుక నిరాకరిస్తే భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది అని చెప్పుకోవటాన్ని ఆ పార్టీ కొనసాగించగలదా? అప్పుడు తల్లి అని కాకుండా సవతి తల్లి అని చెప్పుకోవటమే సరిగ్గా ఉంటుందా?– కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కల్తీ మద్యం కట్టడి ఎప్పుడు?!
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి 60 మందికి పైగా మృతి చెందటం, మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉండటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. జూన్ మూడో వారంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి సీబీసీఐడీ పోలీసులు ఇప్పటి వరకు అనేక మందిని అరెస్టు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ప్రజలు, పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు, సామాజిక కార్యకర్తలు కల్తీ సారా విక్రయాలను అడ్డుకోటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ – దేశంలో తరచూ జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనలకు బాధ్యులెవరు? తప్పు... కల్తీ సారా తాగిన వారిదా? లేక కల్తీ సారాను కట్టడి చేయలేకపోతున్న వారిదా?నిజం ఏమిటంటే కల్తీ సారా సేవించటం వల్ల సంభవించే మరణాలు రెట్టింపుగా విషాదకరమైనవి. అవి భయానకమైనవి మాత్రమే కాదు, పూర్తిగా నివారించగలిగినవి కూడా! మనిషి వల్ల సంభవించే ఆ మరణాలను మనిషే సంభవించకుండానూ చూడగలడు. అందుకు కావలసిందల్లా వాస్తవికతలోని పచ్చి నిజాన్ని అంగీకరించటమే! అందరు మనుషులూ మద్యం సేవించనివాళ్లు కాదు. చాలామంది తాగాలనుకుంటారు. తాగటంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ముసుగు లేకుండా చెప్పాలంటే – ఏ పరిణతి చెందిన, వివేకవంతమైన, ప్రజాస్వామ్య సమాజంలోనైనా అందుకు వారికి కాదనలేని హక్కు ఉంది. ఆ హక్కును నిరాకరించటానికి, ఆమోదయోగ్యం కాని ఆంక్షలు విధించటానికి ఆ సమాజం చేసే ప్రయత్నాలు సమస్యకు కారణం అవుతాయి. మద్యం కనుక సురక్షితమైన, నాణ్యత గలిగిన, చవకైన లేదా సరసమైన ధరలో... చట్టం అంగీకరించిన, ఆమోదించిన నియమ నిబంధనలకు లోబడి వయోజనులందరికీ లభించినట్లయితే కల్తీ సారాకు ప్రాణాన్ని పణంగా పెట్టుకునేవారెవరూ ఉండరు. మద్యం సేవించేవారిలో అత్యధికులు తీవ్ర అసంతృప్తితో నిరాశకు గురై ఆత్మహత్యను ఆశ్రయించే మనఃస్థితిని కలిగి ఉన్నవారు కాదు. వారు కేవలం ఉపశమనాన్ని కోరుకునేవారు. ఒత్తిడి నుంచి, అలసట నుంచి కాస్త సేదతీరాలని, లేదా ఆహ్లాదకరమైన సాయంత్రాలను గడపాలనీ అనుకునేవారు. వారు కోరుకున్నది కొనలేకపోయినందు వల్లనే ప్రమాదకరమైన, ప్రాణం తీసే అవకాశం ఉన్న వాటిని వారు ఆశ్రయిస్తారు. అంతేతప్ప, మరణించటం ఎప్పుడూ కూడా వారి ఉద్దేశం కాదని గుర్తుంచుకోండి. అది కేవలం ఉద్దేశపూర్వకం కాని పరిణామం. పరిస్థితులు బలవంతంగా వారిపై వచ్చి పడ్డ పర్యవసానం. అసలు సమస్యంతా మద్యం చెడ్డదని, అందువల్ల మద్యపానాన్ని నిలువరించాలని, కనీసం తీవ్రస్థాయిలో అందుకు విముఖత కలిగించాలని ఉన్న మన మూల భావనలోనే ఉంది. ‘‘ఔషధాల వినియోగానికి మినహా... ఆరోగ్యానికి హాని కలిగించే మత్తుపానీయాలు, మత్తు పదార్థాల వాడకాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి’’ అని రాజ్యాంగంలోని 47వ అధికరణం చెబుతోంది. మితిమీరిన మద్యపానం చెడు చేస్తుందనటంలో సందేహం లేదు. బుద్ధిహీనులైన వారు మాత్రమే ఈ మాటను కాదంటారు. మితిమీరితే మద్యమేం కర్మ... పంచదార, వెన్న, మీగడ, అంతెందుకు వ్యాయామం కూడా ఆరోగ్యానికి హానికరమైనవే! మోతాదుల్లో తీసుకుంటే అది వేరే సంగతి. సరే, ఏదైనా ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. వారి సొంత తప్పుల్ని కూడా! అయితే మద్యనిషేధం అన్నది ఒక ప్రభుత్వ విధానంగా (బిహార్, గుజరాత్‌లలో మాదిరిగా) పౌర హక్కులను ఉద్దేశపూర్వకంగా నిరాకరించటం మాత్రమే కాదు, పౌర ‘శిశుపాలన’ కూడా చేస్తుంది. పౌరుల్ని పిల్లలుగా చూసే దేశానికి ఏది సరైనదో తెలియదు. అయితే ప్రజల్ని నర్సరీ పిల్లల్లా చూసే ప్రభుత్వాలు ఈ మాటను అంగీకరించవు. ఏదేమైనా ఇక్కడొక లోతైన సమస్య ఉంది. మద్యం పట్ల అది మన వైఖరిని వివరిస్తుంది. అందుకే మహాత్మా గాంధీ వంటి నాయకులు, కొన్నిసార్లు మన వంటి రాజ్యాంగాలు మానవ బలహీనతగా లేదా అనైతికమైనదిగా భావించే వాటి నుంచి ప్రజల్ని దూరంగా ఉంచాలని కోరుకోవటం జరుగుతుంది. ప్రజల్ని సద్వర్తన కలిగినవారిగా తీర్చిదిద్దాలనుకోవటం, కనీసం అలా చేయటానికి ప్రయత్నించాలనుకోవటం నా దృష్టిలో ఒక తప్పుడు అభిప్రాయపు తపన. నైతిక కోణం నుంచి చూసినప్పుడు ఆ ప్రయత్నం అర్థవంతమైనదిగా కనిపించవచ్చు. బహుశా ఆచరణాత్మక దృక్కోణం నుంచి అది కొన్ని సమస్యల్ని నివారించవచ్చు. కానీ మానవ దృక్కోణం నుండి చూసినప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి సరైనదని నిర్ణయించినదాన్ని మీరు విభేదించినప్పుడు మీరు సరికాదు అనే భావన ఏర్పడుతుంది. మహాత్మా గాంధీ; బిహార్, గుజరాత్ ప్రభుత్వాలు మద్యాన్ని ఎలా చూడటం జరిగిందన్న విషయంలో ఇది నిజం. ఫలానా సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్లందరికీ ధూమపాన నిషేధం విధించాలన్న రిషీ సునాక్ మూర్ఖపు ప్రతిపాదన విషయంలో కూడా ఇది నిజం. మనుషుల్ని వారి స్వీయాకర్షణల నుంచి రక్షించగలిగితే పరివర్తన చెందుతారని వారి నమ్మకం. కానీ అది తప్పు. నిజమైన పరివర్తన మీ తప్పుల నుండి మీరు నేర్చుకోవటం వల్ల వస్తుంది. అయితే నేర్చుకోటానికి ముందుగా మీరు ఆ తప్పుల్ని చేసి ఉండాలి. పొగ తాగటం మానేసినవారికి, మానేయాలని ఎప్పుడూ అనుకోనివారికి మధ్య వ్యత్యాసం ఇదే! అదిలిస్తే కదిలిన దాని కన్నా అనుభవం నుండి నేర్చుకున్నది గట్టి పాఠం అవుతుంది. ఎప్పటికీ మనసులో ఉండిపోతుంది. మద్యానికి సంబంధించి నిజంగా విచిత్రమైన సంగతి... మన సంస్కృతిలో, ప్రాచీన సంప్రదాయాలలో అది భాగమై ఉండటం! సోమరసం దేవతలకు అమృతం. ముఖ్యంగా ఇంద్రుడికి ప్రీతికరమైనది. మరోవైపు నిషేధం అన్నది విదేశీయులది. అమెరికా 1920లలో మద్య నిషేధానికి ప్రయత్నించి విఫలం అయింది. అది మనం పరిష్కరించవలసిన మరికొన్ని సమస్యల్ని ఉత్పన్నం చేసింది. మనమెందుకు దేవతల మార్గాన్ని అనుసరించకూడదు? అలా చేయటం సంపూర్ణ స్వదేశీ అవుతుంది. అందుకు బదులుగా మనం ఎందుకని అమెరికా మార్గాన్ని అనుకరిస్తున్నాం? ఈ వ్యాసంలోని నీతి సరళమైనది, సూటిౖయెనది. చట్టం రాసి ఉంచిన ‘మందు’ చీటీని అనుసరించి ప్రజలు నిజాయితీగా, సురక్షితమైన మద్యాన్ని సేవించేలా చూడటంలో సుపరిపాలన ఉంటుంది. దుష్పరిపాలన దానిని కష్టతరం చేస్తుంది, లేదంటే అసాధ్యమైనదిగా మార్చి ప్రజల్ని తరచూ తమ ప్రాణాల్ని హరించే ప్రత్యామ్నాయాల వైపు నెట్టివేస్తుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వాక్ స్వాతంత్య్రంపై విచారణా?
కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమా అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు ఆరోపణలు వచ్చిన పద్నాలుగేళ్ల తర్వాత ‘ఉపా’ చట్టం కింద అరుంధతీ రాయ్‌ని విచారించేందుకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. భారత్‌లో విలీనాన్ని ప్రశ్నించటం, లేదా విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. అందుకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ, అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. నేడు మనం విశ్వ గురువులమని చెప్పుకొంటున్నప్పుడు అరుంధతీ రాయ్ పట్ల ఈ నిర్దయాపూరితమైన వ్యవహారశైలి మన గురించిన బాధాకరమైన సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా?మహాత్మా గాంధీ, అందునా మన జాతిపిత... ఆయన చెప్పిన విషయాలను మనం ఎంత తరచుగా గుర్తు చేసుకుంటున్నాం? అంతకన్నా కూడా ఎంత తరచుగా మన ప్రభుత్వాలు ఆయన ఆకాంక్షలకు కట్టుబడి ఉంటున్నాయి? ఇదేమీ అలంకారిక ప్రశ్న కాదని మీరు తొందరలోనే గ్రహిస్తారు. నిజానికి, మనకింకా మనస్సాక్షి అన్నది మిగిలి ఉంటే బహుశా అదొక ఇబ్బందికరమైన మనోస్థితి కావచ్చు!1922 మార్చి 18న ‘యంగ్ ఇండియా’ పత్రికలో... ప్రభుత్వాలకు, మన పైన అధికారం కలిగి ఉన్న వారికి తన వైఖరి ఏమిటో గాంధీ వివరించారు. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అని రాశారు. ‘‘ఒక వ్యక్తికి – ఆ వ్యక్తి హింసను తలవనంత వరకు, హింసను ప్రోత్సహించనంత వరకు, లేదా హింసను ప్రేరేపించనంత వరకు – తన అయిష్టతను పూర్తిగా వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఉండాలి’’ అన్నారు. మన ప్రభుత్వం శిలాక్షరాలుగా చెక్కించి ప్రతి ఒక్క మంత్రి కార్యాలయంలో ప్రముఖంగా కనిపించేలా ఉంచాల్సిన మాటలివి. ఆ మాటలు ఈ కాలానికీ ఎందుకు సరిపోతాయో వివరిస్తాను. కశ్మీర్ అన్నది భారతదేశంలో ‘అంతర్భాగమా’ అని ప్రశ్నించటం ద్వారా వేర్పాటువాదాన్ని సమర్థించినట్లు పద్నాలుగేళ్ల క్రితం వచ్చిన ఆరోపణలపై ‘ఉపా’ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక) చట్టం కింద అరుంధతీ రాయ్‌ని విచారించేందుకు తాజాగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు – ఇందులో సుదీర్ఘమైన పదేళ్ల కాలం మోదీ ప్రభుత్వంలోనిది – ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవటం, లేదా తీసుకోవటం అవసరమని భావించకపోవటం అనే వాస్తవం ఎన్నో విషయాలను చెబుతోంది. ‘ఇప్పుడు ఎందుకు?’ అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. భారతదేశంలో ప్రముఖులు ఒకరు రాష్ట్ర విలీనాన్ని ప్రశ్నించటం, లేదా విడిపోవాలని కోరటం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సి.ఎన్. అన్నాదురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలనే వ్యక్తం చేశారు. ‘‘ద్రవిడియన్లు స్వయం నిర్ణయాధికారం కోసం డిమాండ్ చేస్తున్నారు... దక్షిణాది రాష్ట్రాలకు మాకు ప్రత్యేక దేశం కావాలి’’ అన్నారు. ఆ మాటకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు కానీ అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. ఆయన మాటల్ని దేశ వ్యతిరేకమైనవిగా పరిగణించలేదు. నిజమే, అన్నాదురై అలా కోరటం అభ్యంతరకరం, అవాంఛనీయం కావచ్చు. కానీ ఆరు దశాబ్దాల క్రితమే భారతదేశం ఆన్నాదురై మాటల్ని ఆయన వాక్ స్వాతంత్య్రంలో భాగంగా అంగీకరించింది. ఆ కాలంలోనే వివాదాస్పద ఉద్దేశాన్ని వ్యక్తం చేయటాన్ని సైతం వాక్ స్వాతంత్య్రంలోని ఒక హక్కుగా మనం గుర్తించాం. ‘‘ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటాన్ని ఒక ధర్మంగా నేను భావిస్తున్నాను’’ అనే గాంధీజీ ప్రసిద్ధ ప్రకటనను గౌరవించాం. ప్రపంచం మనకు ఏదైనా నేర్పించిందీ అంటే అది నేడు మరింత సహనాన్ని, సర్దుబాటును కలిగి ఉండమనే. బ్రిటన్‌లోని స్కాటిష్ జాతీయవాదులు, కెనడాలోని పార్తీ కెబెక్వాలు, లేదా స్పెయిన్‌లోని కెటలాన్‌లు ఆయా దేశాల నుంచి విడిపోవటం కోసం చేసిన వేర్పాటు ఉద్యమాలు గౌరవనీయమైనవిగా, దేశ వ్యతిరేకమైనవి కానివిగా పరిగణన పొందటం అంటే... పరిణతి చెందిన వివేకవంతమైన ప్రజాస్వామ్యాలు అలాంటి వేర్పాటువాద ఉద్యమ పిలుపులను దేశ వ్యతిరేకమైనవిగా చూడకూడదని సూచించటమే కదా? ఎలా మనం వివేచన గల సహనశీలత నుండి అనాలోచితమైన, ఆమోదయోగ్యం కాని అసహనంలోకి జారిపోయాం?అందుకు కారణం... వేర్పాటు గురించి మాట్లాడి, మనల్ని కలవరానికి గురి చేసినవారు అరుంధతీ రాయ్ కావటమేనా? అందుకు కారణం... మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శ చేస్తున్న ఆమె గొంతుక ఎదురులేనిదిగా, నమ్మదగినదిగా ఉండటమేనా? అందుకు కారణం... ఎదుర్కోడానికి మనం ఇష్టపడని సందేహాలను లేవనెత్తటం ద్వారా ఆమె మన మనసు లోతుల్లో లేని పైపై మనశ్శాంతిని హరించటమేనా?అరుంధతీ రాయ్‌ని మన అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్ (రష్యా రచయిత)లా భావించాలి కానీ, విస్మృత సోవియెట్ యూనియన్ ఆయన పట్ల ప్రవర్తించిన రీతిలో ఆమె పట్ల మనం ఉండకూడదు. ఆమె మన ఉత్తమ రచయితలలో ఒకరు. ప్రపంచానికి కూడా ఆమె ఇలాగే తెలుసు. మనం నిస్సిగ్గుగా మర్చిపోయిన సల్మాన్ రష్దీ తర్వాత అంతటి ప్రసిద్ధురాలైన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్. ఆమె పట్ల ఈ అనాగరిక, అధికార దర్ప, అనాలోచిత ప్రవర్తన... ప్రపంచంలోని అతి పెద్దదైన ప్రజాస్వామ్యానికి, అంతకుమించి ప్రజాస్వామ్యాలకే మాతృమూర్తి అయిన ఇండియాకు చెడ్డ పేరు తెస్తుంది. నిజాయితీగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలంటే అంతే. నేడు మనం విశ్వ గురువులమని, దక్షిణార్ధ గోళానికి నాయకులమని, ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తగిన వాళ్లమని చెప్పుకొంటున్నాం. ఇటీవల ప్రధానమంత్రి తను తిరిగి ఎన్నికవటం ‘యావత్ ప్రపంచ ప్రజాస్వామ్య విజయం’ అని అన్నారు. అలాంటప్పుడు అరుంధతీ రాయ్ అభిప్రాయం పట్ల నిర్దయాపూరితమైన వ్యవహార శైలి మన గురించిన బాధాకరమైన, తప్పించుకోలేని సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకై మీరే చెప్పుకొమ్మని వదిలేస్తున్నాను. బదులుగా, నాకు ఎలా అనిపిస్తోందో చెబుతాను. మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనకు ప్రసాదించిన స్వేచ్ఛలు, పౌరహక్కుల పట్ల జీవితకాలం గర్వంగా గడిపాను. వాటినెవరూ మన నుంచి తస్కరించలేరన్నది సత్యం. ఇందిరాగాంధీ ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. కానీ ఇప్పుడు, ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకున్న ఉపశమనంలో ఉన్నప్పుడు అవి మన చేతుల్లోంచి జారిపోతాయా? అవును, అరుంధతీ రాయ్‌పై విచారణ తప్పుడు ఫలితంతో ముగిస్తే!కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఉప్పందిందా? లేక నిప్పులేని పొగేనా?
జూన్ 1న ఎగ్జిట్ ఫలితాలు వెల్లడవటానికి ముందు రోజు మే 31న జరిగిన షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల విలువ ఆ ముందరి రోజు జరిగిన దానికి రెట్టింపు! ఈ మొత్తం కొనుగోళ్లలో 58 శాతం వాటా విదేశీ ఇన్వెస్టర్లదే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ మోదీ ఘన విజయం సాధించబోతున్నారని ప్రకటించిన రోజుకు సరిగ్గా ముందు రోజే స్టాక్ మార్కెట్లో రెట్టింపు ట్రేడింగ్ జరగటం యాదృచ్ఛికమైతే కాదు. దీనివల్ల అసలు ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్ 4న స్టాక్ మార్కెట్ కుప్పకూలి పోవటం, సాధారణ ఇన్వెస్టర్ల షేర్ల విలువ పాతాళానికి పడిపోవటం జరిగింది. ఆ రోజు స్టాక్ మార్కెట్‌కు వచ్చిన నష్టం అక్షరాలా 30 లక్షల కోట్ల రూపాయలు. అందుకే... ‘ఎగ్జిట్‌పోల్ స్టాక్ మార్కెట్ స్కామ్’ జరిగిందా అన్నది ప్రశ్న.మే 31–జూన్ 4 మధ్య నేషనల్ స్టాక్ ఎక్సే ్చంజి (ఎన్.ఎస్.ఇ)లో ఏదైనా అనుమానాస్పదమైన, ఆందోళన కలిగించే పరిణామం సంభవించిందా? సంభవించింది అని రాహుల్ గాంధీ అంటున్నారు. దానిపై దర్యాప్తు జరిపించాలని ఆయన కోరుతున్నారు. అయితే ఆయన అంటున్నది నిజమేనని మనమెలా చెప్పగలం? వాస్తవాలను పరిశీలించడం ద్వారా మాత్రమే. కనుక ఈ విషయమై ‘ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్’ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి వద్ద అందుబాటులో ఉన్న కొన్ని వివరాలను మీ ముందు ఉంచుతాను. ఇందుకు చక్రవర్తినే నేను ఎంచుకోవటానికి కారణం రాహుల్ అంటున్న దానికి, చక్రవర్తి చెబుతున్నది చాలా దగ్గరి ఏకీభావం కలిగి ఉన్నదని నేను అనుకోవటం. మొదటిది– మే 31న ఎన్.ఎస్.ఇ.లో జరిగిన షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల విలువ ఆ ముందటి రోజు మొత్తానికంటే రెట్టింపు. పదేళ్ళ కిత్రం 2014 మే నెలలో ఇలాంటిదే నరేంద్ర మోదీ తన తొలి మెజారిటీ సాధించినప్పుడు జరిగినప్పటికీ అలా జరగడం ‘‘చాలా అరుదు’’ అని చక్రవర్తి అంటారు. 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించినప్పుడు సైతం స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు ఆ ముందరి రోజు కన్నా రెట్టింపు ఏమీ కాలేదు. 22 శాతం మాత్రమే పెరిగాయి. రెండవది– ఎన్.ఎస్.ఇ. సొంత డేటా చెబుతున్న దానిని బట్టి 31న జరిగిన ‘‘మొత్తం షేర్ల కొనుగోళ్లలో 58 శాతం వాటాను ఫారిన్ ఇన్వెస్టర్లే (ఎఫ్ఐలు) కలిగి ఉన్నారు’’ అని చక్రవర్తి అంటున్నారు. ‘‘ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వారంలో ఆ ముందు వరకు ఎఫ్ఐలు అంత భారీ మొత్తంలో షేర్లను కొనటం, కొన్న వాటికి మించి అమ్మటం జరగలేదు’’ అని కూడా ఆయన అన్నారు. మరి విదేశీ ఇన్వెస్టర్లను అంత భారీ మొత్తాలలో కొనిపించింది ఏమిటి? భారీగా కొనటం మాత్రమే కాదు, 31న వారు అంతే భారీగా అమ్మకాలు కూడా జరిపారన్న వాస్తవాన్ని చక్రవర్తి విస్మరించారు. బదులుగా ఆయన, ‘‘తర్వాతి రోజు ఏం జరిగిందన్న దానిని బట్టే ఆ ముందు రోజు జరిగిన దానిని వివరించగలం’’ అన్నారు. తర్వాతి రోజు అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటికి వచ్చిన రోజు. మే 31కి, జూన్ 1కి చక్రవర్తి పెట్టిన ఈ లంకె... ఎగ్జిట్ పోల్స్ ఫలితాల గురించి విదేశీ ఇన్వెస్టర్లకు ముందే తెలిసైనా ఉండాలి, లేదంటే వారికై వారు సర్వే జరిపించుకొని ఉండాలి అన్నదానిని సూచిస్తోంది. అయితే విదేశీ ఇన్వెస్టర్లు అంత భారీగా షేర్లు కొనటానికి ఈ రెండూ కాకుండా మూడో కారణం ఏదైనా ఉండి ఉంటుందా?ఉంటుందనైతే చక్రవర్తి అనుకోవటం లేదు. ‘‘ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒకే రీతిన మోదీ అపారమైన విజయం సాధించబోతున్నారని ఫలితాలను వెల్లడించిన రోజుకు సరిగ్గా ముందు రోజే స్టాక్ మార్కెట్లో రెట్టింపు ట్రేడింగ్ అనే అత్యంత అరుదైన పరిణామం జరగటం అన్నది కేవలం యాదృచ్ఛికమైతే కాదు’’ అంటారాయన. కానీ అది యాదృచ్ఛికం ఎందుకు కాకూడదు? ఇందిరా గాంధీ తన మరణం గురించి మాట్లాడిన 24 గంటల తర్వాత ఆమె హత్య జరిగింది. అది యాదృచ్ఛికం మాత్రమే! విషయాన్ని ఒకడుగు ముందుకు తీసుకెళదాం. విదేశీ ఇన్వెస్టర్లు మే 31న షేర్లు కొనుగోలు చేశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అనంతరం జూన్ 3న స్టాక్ మార్కెట్ రాకెట్లా పైకి దూసుకెళ్లింది. కాబట్టి అప్పుడు కనుక వారు ఆ షేర్లను అమ్ముకుని ఉంటే భారీగా లాభాలు వచ్చేవి. అలా చేయటంలోని నియమబద్ధత గురించే ఇప్పుడు చక్రవర్తి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇలాంటి ప్రశ్నలకు ఆయనైతే ఎలా సమాధానం ఇస్తారనే విషయంలో సందేహం లేదు. ‘‘సంఘటనల కాలక్రమం, స్టాక్ మార్కెట్ డేటాలను అనుసరించి... ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయటానికి మాత్రమే కాకుండా, స్టాక్ మార్కెట్లను ఉపయోగించి లాభపడటానికి కూడా ఎగ్జిట్ పోల్స్ ఆయుధాలు అయ్యాయని ఎవరైనా తేలిగ్గా చెప్పేయొచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఎగ్జిట్ పోల్ స్టాక్ మార్కెట్ స్కామ్’ ఇండియాలో జరిగి ఉంటుంది’’ అంటారు చక్రవర్తి. మీడియా నిర్వహించినవి కనుక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు లీక్ అయే అవకాశం ఉందనే విషయాన్ని పక్కనపెడదాం. ఒకవేళ విదేశీ ఇన్వెస్టర్లే తమ సొంతంగా ఎగ్జిట్ పోల్స్‌ని జరిపించుకొని ఉండి, ఆ ఫలితాలు కూడా మీడియా నిర్వహించిన ఫలితాల దిశనే సూచిస్తూ ఉండి, వాటి ఆధారంగా వాళ్లు షేర్లు కొని ఉంటే అప్పుడది నియమబద్ధం అవుతుందా? ఒకటే ప్రశ్న ఏమిటంటే... విదేశీ ఇన్వెస్టర్లు అంత ప్రయాసతో ఎగ్జిట్ పోల్స్ జరిపించుకొని ఉంటారా? నాకైతే సందేహమే. సగటు భారతీయ పెట్టుబడిదారుల విషయానికి వద్దాం. మొదట, వారు విన్నది ఇదీ: నరేంద్ర మోదీ ‘ఎకనమిక్ టైమ్స్’తో (మే 23న) మాట్లాడుతూ, ‘‘నేను నమ్మకంగా చెప్పగలను, జూన్ 4న బీజేపీ రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకుంటుంది. స్టాక్ మార్కెట్ కూడా కొత్త రికార్డులకు చేరుకుంటుంది’’ అన్నారు. అంతకు ముందు హోంమంత్రి ‘ఎన్డీటీవీ’తో (మే 13న) మాట్లాడుతూ, ‘‘జూన్ 4 లోపు షేర్లు కొనమని మీకు చెబుతున్నాను. అవి అమాంతం పెరగబోతున్నాయి’’ అన్నారు. ఆ సలహాలపై వారు షేర్లు కొని ఉంటే, జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్ కుప్పకూలి పోవటం, వారి షేర్ల విలువ పాతాళానికి పడిపోవటం చూశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ రోజు స్టాక్ మార్కెట్‌కు వచ్చిన నష్టం రూ. 30 లక్షల కోట్లు. దాంతో సాధారణ ఇన్వెస్టర్లు నష్టపోయారు. అయితే మూడు రోజుల తర్వాత, వారాంతంలో శుక్రవారం 7వ తేదీన స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి 4వ తేదీన వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవటం మాత్రమే కాదు, షేర్ల పెరుగుదల ఎన్నడూ లేనంతగా గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. ఇక్కడ ఇన్వెస్టర్లకు వచ్చినదానికంటే పోయినది ఎక్కువ.దీనర్థం ‘సమస్య’ విదేశీ ఇన్వెస్టర్లలో ఉందని! అది దర్యాప్తు జరిపించవలసినంత సమస్యా? భారతదేశంలోని వ్యక్తులు, సంస్థల తరఫున వారు షేర్లలో పెట్టుబడి పెట్టి ఉంటారని మీకు అనుమానంగా ఉంటే అప్పుడు దర్యాప్తు అవసరం కావచ్చు. మీకలాంటి అనుమానం లేదా? వాళ్లు తమకై తామే ఇన్వెస్ట్ చేసి ఉంటారని బహుశా మీకు అనిపిస్తోందా? అప్పుడైతే తదుపరి చర్య అవసరం అవుతుందా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పాత మోదీపై ‘కొత్త మోదీ’ నెగ్గగలరా?
నరేంద్ర మోదీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో ఆ రావటం అన్నది జరిగింది. కీలకమైన ప్రశ్న ఏమిటంటే – ప్రధాన మంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోదీ స్వాభావికంగా, మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరన్నదే! సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకోవటం, తరచూ వారికి లోబడి ఉండటం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచటం వంటి వాటికి ఆయన సంసిద్ధతను కలిగి ఉంటారా? గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఆయనకు ఇలా చేసే అవసరం లేకపోయింది. అందుకు భిన్నంగా పాత మోదీ ఇప్పుడు కొత్త మోదీ కాగలరా?మునుపు మీరీ నానుడిని నిస్సందేహంగా విని ఉంటారు. ఎంచేతనంటే ఇదొక కాదనలేని సత్యం. కొరుకుడు పడనివిగా కనిపించే పరిస్థితులను ఓటర్ల సమష్టి విజ్ఞత చక్కబెట్టగలగటమే ప్రజాస్వామ్యంలోని అద్భుతమైన విషయం. 1977లో ఇలా జరిగింది. మళ్లీ ఈ జూన్ 4న ఇది సంభవించింది. ఫలితాల్లో పై విధమైన అద్భుతాన్ని చాలామందే ఆశించినప్పటికీ, నిజానికి కొద్దిమందే అది కార్యరూపం దాల్చుతుందని భావించారు. నరేంద్ర మోదీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో ఆ రావటం అన్నది జరిగింది. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత దారుణమైన ఫలితాలను ఈ ఎన్నికల్లో బీజేపీ చవి చూసింది. మెజారిటీకి 30కి పైగా తక్కువ సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి, విశ్వసనీయత ఎల్లప్పుడూ ప్రశ్నార్థకమైన మిత్ర పక్షాల మద్దతు అవసరం. గతంలో వారు బీజేపీని విడిచి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వారు మళ్లీ అలా చేస్తారనటాన్ని తోసిపుచ్చలేము. ఇది ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి పాలనపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇప్పటికైతే వాటికి మన దగ్గర సమాధానాలు లేవు. బహుశా మోదీకి కూడా అవి తెలియక పోవటానికే అవకాశం ఎక్కువ. కానీ ఆ ప్రశ్నలు ఆయన ఎదుర్కొనే సవాలును సూచిస్తాయి. ఆ ప్రశ్నల సమాధానాలు ఆయన గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తాయి. భారతదేశానికి ఎదురవనున్న ప్రమాదాలను, లేదంటే కనీసం సమస్యలను అవి బయటపెడతాయి. బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని మోదీ మొదటి నుంచి జోస్యం చెబుతూ వచ్చారు. ఐదో విడత పోలింగ్ అయ్యాక ‘ఎకనమిక్ టైమ్స్’తో మాట్లాడుతూ తమ పార్టీ అప్పటికే 272 మార్కును దాటేసిందని అన్నారు. కానీ, చివరికి అది 240 సీట్లతోనే ముగిసింది. మెజారిటీకి చాలా తక్కువ. కనుక, ఇవాళ ఆయన... కలవరపడే మనిషా లేక దులిపేసుకుని వెళ్లగలిగినంత మొద్దు చర్మం ఉన్నవారా?వారణాసిలో ఆయనకు వచ్చిన ఓట్ల మాటేమిటి? 2019లో ఆయనకు 4 లక్షల 80 వేల మెజారిటీ వచ్చింది. అదిప్పుడు కేవలం లక్షా ఐదు వేలకు పరిమితం అయింది. ‘‘గంగా మేరీ మా హై, ముఝే గంగా నే గోద్ లియా హై’’ (గంగానది నా మాతృమూర్తి. గంగమ్మ తల్లి నన్ను దత్తత తీసుకుంది) అని గత నెలలో చెప్పుకున్న ఒక మనిషి.. పూర్తి వ్యక్తిగతమైన ఈ తిరోగమనాన్ని ఎలా తీసుకుంటారు?ఏదేమైనా కీలకమైన ప్రశ్న ఏమిటంటే – ప్రధాన మంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోదీ స్వాభావికంగా, మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరు? లేదా, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకోవటం, తరచూ వారికి లోబడి ఉండటం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచటం వంటి వాటికి ఆయన సంసిద్ధంగా కలిగి ఉన్నారా?గుర్తు చేసుకోండి. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఆయనకు ఇలా చేసే అవసరం లేకపోయింది. బదులుగా ఆయన అభీష్టం ప్రతి ఒక్కరికీ ఆదేశం అయింది. ఆయన కేంద్రీకృత ప్రభుత్వాన్ని నడిపారు. ప్రధాని కార్యాలయం కోరినట్లే మంత్రులు నడుచుకున్నారు. ఒక్కరు కూడా ఇదేమిటి అని అడిగే సాహసం చేయలేదు.పార్లమెంటు, జ్యుడీషియరీ, మీడియా వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థల పట్ల ఆయన వైఖరి గురించి ఏమిటి? శ్రీ ‘పాత మోదీ’ పార్లమెంటును పలుమార్లు విస్మరించారు. న్యాయశాఖలోని నియామకాలను నిలిపివేశారు. మీడియాను తీసిపడేశారు. కానీ ఇప్పుడు శ్రీ ‘బలహీన మోదీ’ మరింతగా ఏకాభిప్రాయ విధానాన్ని అవలంబించవలసిన అవసరం ఉంటుంది. లేదంటే తన మిత్రపక్షాలకు ఆయన కోపం తెప్పించవచ్చు. తన సంకీర్ణాన్ని ప్రమాదంలోకి నెట్టేసుకోవచ్చు. అలా చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటారా? ఇక విమర్శలకు, అసమ్మతికి ఆయన స్పందించే ధోరణి ఒకటి ఉంటుంది. శ్రీ పాత మోదీకి ఆ రెండూ నచ్చవన్నది రహస్యమేం కాదు. కనుక శ్రీ కొత్త మోదీ సహించటాన్ని, సమ్మతించటాన్ని మాత్రమే కాదు... రెండింటితో కలిసి ముందుకు సాగటాన్ని కూడా నేర్చుకోవాలి. అది అంత సులభమేనా?మరికొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇటీవల ఆయన చేసిన ప్రకటనలకు సంబంధించినవి. వాటిని ప్రజలు మరిచిపోయి ఉంటారని ఆయన అనుకోవచ్చు. ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ వాతావరణంలో కాకపోవచ్చు కానీ, మొత్తానికైతే నేననుకోవటం అవి గుర్తుండే ఉంటాయని! మొదటిగా, ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన కనుక నవ్వటాన్ని, తేలిగ్గా తీసుకోవటాన్ని అలవరచుకోకపోతే అవి ఆయన్ని వెంటాడగలిగినవి. కానీ ఆయన అలా చేయగలరా? తనది దైవాంశ జననం అని ఆయన చెప్పుకోవడంపై అవహేళనలు ఎదురైతే ఆయన నవ్వుతూ, వాటిని పట్టించుకోకుండా ఉండగలరా? నా మాట గుర్తుపెట్టుకోండి. అవహేళనలు ఉంటాయి. అది జరిగినప్పుడు ఆయన కోపం తెచ్చుకుంటారా?మరీ ముఖ్యంగా, ముస్లింలను దయ్యాలుగా చూపించకుండా ఉండలేకపోవటాన్ని నిలువరించుకోగలరా? ముస్లింలను చొరబాటు దారులుగా; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి రిజర్వేషన్లను లాక్కుని లబ్ధి పొందేవారిగా చూపే తదుపరి సందర్భాలలో మిత్రపక్షాలు అందుకు అంగీకరించే అవకాశం లేదు. కానీ అలాంటి భాష తన నుంచి స్వభావసిద్ధంగా బయటికి రాకుండా తనను తాను సంబాళించుకోగలరా? ఇది 2001 నుండి ఆయన వాక్చాతుర్యంలోని ఒక భాగమని గుర్తుంచుకోండి. నిజానికి నేను లేవనెత్తిన ప్రతిదాన్నీ ఒకే ఒక సాధారణ ప్రశ్నగా కుదించవచ్చు: శ్రీ పాత మోదీ ఇప్పుడు శ్రీ కొత్త మోదీ కాగలరా? ఆయన ప్రభుత్వం దాని పైనే ఆధారపడి ఉంటుంది. మన పాలన దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా! కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- కరణ్ థాపర్ -
శత్రు దేశాల గూఢచారి మిత్రులు
ఒకరిది భారత్, మరొకరిది పాకిస్తాన్. ఒకరిది ‘రా’, ఇంకొకరిది ‘ఐఎస్ఐ.’ వారిద్దరూ ఒకప్పుడు వైరి దేశాల గూఢచార సంస్థల అధిపతులు. ఇద్దరూ కలిసి తాజాగా ‘కోవర్ట్: ద సైకాలజీ ఆఫ్ వార్ అండ్ పీస్’ అనే పుస్తకం రాశారు. వాళ్లమధ్య అసలీ స్నేహం ఎలా మొదలైంది? ఇంతకీ ఈ పుస్తకంలో ఏం ఉంది? చాలానే ఉన్నాయి. గూఢచారి అధినేతల ఆంతరంగిక జీవితాలు, ప్రేరణలు, అంతర్లీన మానసిక స్థితుల అన్వేషణ అది. అంతేకాదు, భారత్–పాక్ దేశాల శాంతి సాధనకు తమ తమ దేశాల పట్ల చిన్నపాటి అవిధేయ సంకేతం కూడా లేకుండా వారు ముందుకు వెళ్లిన మనోహరమైన విధానం కూడా పుస్తకంలో కనిపిస్తుంది.బహుశా జాన్ లి కరే(గూఢచర్య కథాంశాల బ్రిటన్ రచయిత) కూడా దీనినొక ఏమాత్రం నమ్మదగని అసంభవంగా భావించి ఉండేవారు. సి.ఐ.ఎ.(అమెరికా నిఘా సంస్థ), కె.జి.బి.(రష్యా నిఘా సంస్థ)ల అధినేతలు కలిసి పని చేసేందుకు ఒక అంగీకారానికి రావటమే ఇది. కానీ నమ్మేందుకు కష్టంగా ఉన్నా, దక్షిణాసియాలో ఇటువంటిదే ఒకటి ఇంకా ఎవరూ గుర్తించకుండా, ఎవరి గమనింపునకూ రాకుండా సంభవించింది. భారత్–పాకిస్తాన్ల గూఢచారి సంస్థలైన ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్), ఐ.ఎస్.ఐ. (ఇంటర్–సర్వీసెస్ ఇంటిలిజెన్స్)ల మాజీ అధిపతులు స్నేహితులుగా మారి తాము ఉమ్మడిగా కలిసి రాసిన పుస్తకాలకు పరస్పరం సహకరించుకున్నారు. అమర్జీత్ సింగ్ దులత్, జనరల్ అసద్ దుర్రానీ తమ తాజా పుస్తకం ‘కోవర్ట్: ద సైకాలజీ ఆఫ్ వార్ అండ్ పీస్’ను ఈ నెలలో ఆవిష్కరించారు (నీల్ క్రిషణ్ అగర్వాల్ మరో సహ రచయిత). వారి మొదటి పుస్తకానికి ‘ద స్పై క్రానికల్స్’ అని సముచితమైన పేరే పెట్టారు. ఈ అనుబంధం ఎలా మొదలైంది? చూస్తుంటే బ్యాంకాక్‌లోని ఛావ్ ప్రాయా నదిపై ఒక చిన్న నౌకలో మొదలైనట్లుంది. ఉగ్రవాదంపై ఒక అనధికార చర్చా కార్యక్రమానికి వాళ్లిద్దరూ ఆ నౌకలోని ఆహ్వానితులు. దులత్‌ని మాట్లాడమని ఆహ్వానించారు. ఇలాంటి చర్చా కార్యక్రమాలకు ఆయన కొత్త కనుక సంకోచంగా, అనాసక్తిగా ఉండిపోయారు. దుర్రానీ ఆ సంగతి గమనించి దులత్‌కు మద్దతుగా నిలిచారు. ఆ సందర్భం గురించి దులత్... తమ మధ్య ‘కెమిస్ట్రీ’ కుదిరిందని అంటారు. ఆ తర్వాత అనతికాలంలోనే వారిద్దరూ స్నేహితులైపోయారు. ‘కోవర్ట్’ పుస్తకం ఆ ఇద్దరి మధ్య సారూప్యాలను, వైరుధ్యాలను వెల్లడిస్తుంది. చిన్నతనంలో దుర్రానీ ‘‘ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడేవారు’’. పెద్దయ్యాక కూడా ‘‘సమూహంలో భాగం కావాలని కోరుకోలేదు’’. చిన్నవాడిగా ఉన్నప్పుడు దులత్‌కు కొద్ది మంది స్నేహితులు ఉండేవారు. వారిలో ‘‘ఎక్కువగా పనివాళ్ల పిల్లలు’’. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... ‘‘తనకై తను ఉండగలగటం, తనను తను కాపాడుకోవటం నేర్చుకున్నారు’’. ఇక భవిష్యత్తు ఐఎస్ఐ చీఫ్... స్కూల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచేవాడు. ‘‘నేను ఎల్లప్పుడూ దాదాపు ప్రతి సబ్జెక్టులో మొదటి నలుగురు లేదా ఐదుగురిలో ఒకరిగా ఉండేవాడిని’’ అంటారాయన. దులత్ అందుకు విరుద్ధం. ఆయన ‘‘చాలా సగటు విద్యార్థి’’. కానీ ఈ భవిష్యత్తు ‘రా’ అధిపతి క్రీడల్లో తన తఢాకా చూపించారు. స్కూల్లో ఆయన ‘‘ప్రతి ఆటా ఆడాడు’’. ఒంటరి దుర్రానీకి ‘‘సైక్లింగ్ అంటే చాలా ఇష్టం’’. కానీ ‘‘లాహోర్ వంటి నగరంలో సైకిల్ తొక్కేందుకు దూరపు స్థలం ఉండేది కాదు’’. వ్యక్తిగతంగా దుర్రానీ ఎలా ఉండేవారో, అలాంటి వ్యక్తిగానే ఆయన ఎదగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ‘‘నేను భిన్నం, నేను నాలా ఉండే స్వభావం నాది’’, ‘‘నా గుణం ఎప్పుడూ కూడా కాస్త తిరుగుబాటు ధోరణితో ఉంటుంది’’ అంటారు దుర్రానీ. దులత్ ప్రధానంగా తల్లిదండ్రుల మాట వినటానికీ, విద్యాబుద్ధులు నేర్పిన క్రమశిక్షణ ప్రకారం నడచుకోటానికీ సిద్ధంగా ఉంటారు. ‘‘తగిన పనులు, తగని పనులు అని ఉంటాయి’’ అనే నమ్మకంతో ఆయన పెరిగాడు. ఇది ఆయనకు స్పష్టమైన నైతిక దిశా నిర్దేశం చేసిందని నేను అనుకుంటాను. దుర్రానీ సైన్యంలో చేరారు. ‘‘ఆ కారణంగా నేనెప్పుడైనా పశ్చాత్తాపం చెందానని నేను అనుకోను’’ అంటారు. దులత్ పోలీస్ అయ్యారు. ఎందుకంటే, ‘‘అంతకన్నా మెరుగైన సర్వీసులలోకి వెళ్లలేకపోయాను’’ అని ఆయన అంగీకరిస్తారు. అయితే యాదృచ్ఛికమో లేదా అనుకోని అదృష్టమో ఇద్దరూ కూడా ఇంటిలిజెన్స్ సంస్థల వైపు మళ్లారు. ‘‘అనుకోకుండా నేను అక్కడికి చేరాను’’, ‘‘ఆ విషయాన్ని ఒప్పుకుంటాను’’ అంటారు దుర్రానీ నవ్వుతూ. ‘‘ఇంటిలిజెన్స్ అంటే ఏంటో తెలియకుండానే’’ దులత్ ఇంటిలిజెన్స్ బ్యూరోలో చేరారు. అయినప్పటికీ ఇద్దరూ అత్యున్నత స్థాయికి చేరుకుని, తమ తమ దేశ ప్రజల చేత ఐఎస్ఐ, ‘రా’ సంస్థల అత్యుత్తమ మాజీ అధిపతులుగా గుర్తింపు పొందారు. కనుక వారు విధిని నమ్ముతారని నేను అనుకోవచ్చా? జేమ్స్ బాండే ఇలాంటి మూఢ నమ్మకాలను ఎప్పుడూ ఎకాఎకిన కొట్టిపడేయలేదు. వీళ్లు మాత్రం అలా ఎందుకు చేస్తారు?‘‘కుండబద్దలు కొట్టటం’’ అని దులత్ ఎప్పుడూ అంటుండే దుర్రానీలోని ‘‘నిర్మొహమాటాన్ని’’ దులత్ ఇష్టపడతారు. దుర్రానీ ఉన్నదున్నట్లు బహిరంగంగా మాట్లాడతారు. పాకిస్తాన్ ఆర్మీని విమర్శించటానికి కూడా సంకోచించరు. అలాగే ఆయన భారతీయ సైన్యాన్ని ప్రశంసిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అది మరింత కష్టమైన పని. ఆయన అనిన ఒక మాటను మీకు వదిలేసి, నా ముగింపు సరైనదేనా పరిశీలించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ‘‘భారతదేశంలో ప్రజలు ప్రతిభ ద్వారా పైకి ఎదిగి ఐ.బి. (ఇంటిలిజెన్స్ బ్యూరో) ని, ‘రా’ను చేజిక్కించుకుంటారు. కానీ మా దగ్గర దేశాధ్యక్షుడు, లేదా సైన్యాధ్యక్షుడికి నచ్చిన వ్యక్తి అటువంటి పదవులను చేపట్టవచ్చు. కనుక ఒక మంచి ఐఎస్ఐ చీఫ్ ఎవరు అవగలరు అనే దానికి ఎల్లవేళలా మేము అనుసరించే ఒక ప్రమాణం ఉండదు.’’ రహస్యాలను అలా ఉంచండి – ‘కోవర్ట్’ పుస్తకంలో వీరు ‘రా’, ‘ఐఎస్ఐ’ అంతర్గత కార్యకలాపాల పనితీరును బహిర్గతం చేయలేదు. ‘ద స్పై క్రానికల్స్’ లోనూ వాటి గురించి లేదు. బదులుగా ఈ తాజా పుస్తకం, ‘‘గూఢచారి అధినేతల ఆంతరంగిక జీవితాలు, ప్రేరణలు, అంతర్లీన మానసిక స్థితులను అన్వేషిస్తుంది’’. రెండు సూత్రాల మీద ఇది దృష్టి సారించింది. వారు ఎలాంటి మనుషులు? వారు అలా ఎందుకు చేయవలసి వచ్చింది? అనేవి ఆ రెండూ. అంతేకాదు, భారత్–పాక్ దేశాల శాంతి సాధనకు తమ తమ దేశాల పట్ల చిన్నపాటి అవిధేయ సంకేతం కూడా లేకుండా వారు ముందుకు వెళ్లిన మనోహరమైన విధానాన్ని కూడా వివరించింది. వారి అభిప్రాయాలు కూడా తరచూ ఒకేలా ఉన్న విషయం కూడా. చూస్తుంటే, గూఢచారులు చాలా అరుదుగా విభేదిస్తారని అనిపిస్తోంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రధాని ఇంటర్వ్యూలు ఇలా ఉన్నాయా?
ఒక ప్రధానమంత్రితో ముఖాముఖి అన్నది ఆయన విమర్శకులపై దాడి చేయటానికి వేదికగా ఉండకూడదు. అంతేకాదు, సరైన విమర్శలకు ఆయన్ని స్పందింపజేసేలా ఉండాలి. స్పందింప ‘చేయటం’ అనే క్రియ ముఖ్యం. ప్రశ్నడిగి వదిలేస్తే ఏ ప్రధాని అయినా ఆ ప్రశ్నను తప్పించటానికి, సమాధానాన్ని దాటవేయటానికి చూడొచ్చు. అలా చేయకుండా, సమాధానం కోసం పదే పదే ఒత్తిడి తేవడం ఇంటర్వ్యూ చేసేవారి బాధ్యత. అంతేకాదు, వీక్షకుల తరఫున ప్రశ్నలు అడుగుతున్నామన్న స్పృహను వారు కలిగి ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ చేసేవారు బెరుకుగా, ప్రధానికీ తనకూ వ్యత్యాసం ఉందన్న గ్రహింపుతో ఉన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ప్రధానిని తను కఠినమైన ప్రశ్నలు కూడా అడగగలడు అనే భావన వీక్షకులలో కలిగించాలి.ఇప్పటి బి.బి.సి. చైర్మన్ సమీర్ షా ఒకప్పుడు ‘లండన్ వీకెండ్ టెలివిజన్’ లో నా మొదటి బాస్. టెలివిజన్ ఇంటర్వ్యూలలో ప్రశ్నలు అడగటం గురించి నాకు తెలిసిన చాలా విషయాలు ఆయన నేర్పించినవే. వాటిలో ముఖ్యమైన పాఠం... వీక్షకుల తరఫున ప్రశ్నలు అడుగుతున్నామన్న స్పృహను మనం కలిగి ఉండటం. అందుకే మీ ప్రశ్నలు సందర్భోచితంగా ఉండాలి. సమాధానం వచ్చేవరకు మీరు పట్టుపట్టి ఉండాలి. లేదంటే మీరు సమాధానం రాబట్టలేక పోతున్నారని వీక్షకులకు స్పష్టమైపోతుంది.కనుక టీవీలో ప్రధానమంత్రి ఇంటర్వ్యూలను చూస్తున్న ప్పుడు నేను ఏం వినాలని కోరుకుంటాను? ఏముందీ, వీక్షకుడిగా నా తరఫున ఆ ప్రశ్నలు అడుగుతున్నట్లుంటే కనుక, నా ప్రశ్నలు ఎలా ఉండి ఉండాలి అని ఆలోచిస్తుంటాను. ముందుగా, ప్రధాని వేటిని తన విజయాలుగా భావిస్తున్నారో వాటి గురించి తెలుసుకోవాలనుకుంటాను. ఆయనకు ఎదురైన సవాళ్లకు, బహిర్గతమైన వాస్తవాలకు, చేసిన తప్పులకు, కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలకు ఆయన ఏ విధంగా స్పందిస్తారో కూడా తెలుసుకోవాలని అనుకుంటాను. సంభాషణ ఏకపక్షంగా కాకుండా రెండు వైపుల నుండీ ఉండాలని కోరుకుంటాను. కాబట్టి సంభాషణలో ప్రధానిని అంతరాయపరచటం ఉంటుంది. కొన్నిసార్లు అంతరాయాలు అవసరం కూడా! రెండోది – ఒక ప్రధానమంత్రితో ముఖాముఖి అన్నది ఆయన విమర్శకులపై దాడి చేయటానికి వేదికగా ఉండకూడదు. అంతేకాదు, సరైన విమర్శలకు ఆయన్ని స్పందింపజేసేలా ఉండాలి. స్పందింపచేయటం అనే క్రియ ముఖ్యం. ప్రశ్నడిగి వదిలేస్తే ఏ ప్రధాని అయినా ఆ ప్రశ్నను తప్పించటానికి, సమాధానాన్ని దాటవేయటానికి చూస్తారు. అలా చేయకుండా, సమాధానం కోసం ఒత్తిడి తేవడం ఇంటర్వ్యూ చేసేవారి బాధ్యత. మూడవది – ఇంటర్వ్యూ ఆసాంతం.. ఇంటర్వ్యూ చేసేవారు, ప్రధానీ ఇద్దరూ కూడా సమానమే. అలాంటప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ ప్రధానిని బాధ్యుడిని చేస్తుంది. కనుక ఇంటర్వ్యూ చేసేవాళ్లు ఆయన్ని ‘సర్’ అని పిలవకూడదు. అలా అనడం అంటే ఆయన్ని ఉన్నత పీఠం మీద ఉంచినట్లు! అలాగే ఇంటర్వ్యూ చేసేవారు బెరుకుగా, ఆయనకూ తనకూ వ్యత్యాసం ఉందన్న గ్రహింపుతో ఉన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ప్రధానిని తను కఠినమైన ప్రశ్నలు కూడా అడగగలడు అనే భావన వీక్షకులలో కలిగించాలి. నాల్గవది – అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరిగా ఇంటర్వ్యూ చేసేవారు లేవనెత్తిన అంశాలకు సంబంధించినవై ఉండాలి. కొద్దిపాటి ఊకదంపుడును అర్థం చేసుకోవచ్చు కానీ, అడగని వాటికి జవాబు చెబుతూ, అడిగిన వాటికి విరుద్ధమైన సమాధానం ఇస్తూ పీఎం పూర్తిగా దారి మళ్లేందుకు అనుమతించకూడదు. అలా జరిగితే మర్యాదపూర్వకమైన బలవంతపు అంతరాయం అవసరం. పీఏం అదే పనిగా దారి మళ్లుతూ ఉంటే ఒకటి కంటే ఎక్కువసార్లు అంతరాయాలు ఉండొచ్చు. ఐదవది – ఇంటర్వ్యూయర్‌కు వ్యూహం అవసరం. ఏదో అడగటానికి అన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఎప్పుడూ కూడా అడగకూడని ఒక ప్రశ్నకు ఉదాహరణ: ‘ఈసారి మీరు కచ్చితంగా గెలుస్తారు, అయితే 2029లో కూడా గెలుస్తారా?’ఇప్పుడు, సంబంధిత పీఎం స్వభావం, వ్యక్తిత్వాలకు అనుగుణంగా స్పందించేందుకు తగిన సామర్థ్యాన్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఒక ప్రధాని తను చేసిన ప్రతి పనీ దేశం కోసమే చేశానని దేశభక్తి ఢంకాను బజాయిస్తుంటే... ప్రధాన మంత్రులందరి విషయంలోనూ అది సహజమే కదా అని అనండి. అలా అనడం ఆయన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపి ఉంచదు. లేదా, అందరికీ తెలిసి ప్రధాని చెప్పిన ఒక విషయం గురించి, లేదా ఆయన చేసిన ఒక పని గురించి నిర్ద్వంద్వంగా ప్రధాని తాను అనలేదని, చేయలేదని వాదిస్తుంటే... అప్పుడు దానిని సమయ సందర్భ, స్థల కాలాలతో సహా గుర్తు చేసే స్థితిలో ఇంటర్వ్యూయర్ ఉండాలి. ఆ విషయంలో స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే అది ప్రధానమంత్రిని సవాలు చేయటం వంటిది. ఇంటర్వ్యూయర్ సిద్ధపడి ఉండాల్సిన వాటిలో ఇదొక సహేతుకత కలిగి ఉండాల్సిన భాగం. కొన్నిసార్లు స్పష్టమైన ప్రశ్నలు లేవనెత్తాలి. ఎందుకంటే అవి ఆ ఇంటర్వ్యూ ఇస్తున్న ప్రధానికి సంబంధించినవై ఉంటాయి. వాటిని విస్మరించలేము. ఉదాహరణకు, ఆ ప్రధాని తను భగవంతుని వాహకమని విశ్వసిస్తుంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కొంతవరకైనా ఆయన్ని శంకిస్తున్నట్లుగా.. అది మీకెలా తెలుసు? మీరలా అనడం హేతుబద్ధమేనా? అని అడిగి తీరాలి. లేదా, ప్రధానిని అనుకరిస్తూ జీవనం సాగించే హాస్యగాడికి ఆయనపై పోటీ చేసేందుకు అనుమతి లభించకపోతే మీరు అందుకు అనుమతిస్తారా అని ఆ ఇంటర్వ్యూయర్ అడగాలి. ఆయన చికాకు పడుతూ కోపగించుకుంటున్నా కూడా పట్టు వదలక అడిగి తీరాలి. అంతేకాదు, ప్రధాని ఎల్లప్పుడూ తనను తాను తృతీయ పురుషలోనే ఎందుకు చెప్పుకుంటారు? గొప్ప కోసమా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాలి. చివరిగా – నేనిక్కడ రాసిన వాటిని ఒక స్వచ్ఛమైన మనసు గల, గౌరవనీయులైన ప్రధాని అంగీకరిస్తారన్న నమ్మకం నాకుంది. గుర్తుంచుకోండి! ప్రజలను ఆకట్టుకోవటానికి తన ఇంటర్వ్యూను ఉపయోగించుకోవాలని ఆయన అనుకుంటారు. వాళ్ళకు చీకాకు తెప్పించాలనుకోరు. ఆ సంగతి మర్చిపొవద్దు. సమీర్ నాతో చెప్పిన మరొక మాట ఇది.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
ఒకవైపు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదంటూనే.. మరోవైపు రాజకీయ వ్యూహకర్త హోదాలో ఎన్నికల ఫలితాలపై జోస్యాలు చెబుతున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే ఆయన పలుకులు ఫలానా పార్టీలకే అనుకూలంగా ఉంటుండడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఏపీ విషయంలోనూ ఆయన అలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పీకేకు క్రెడిబిలిటీకి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. ఆ దెబ్బకు సహనం కోల్పోయారాయన.ఇంతకీ ఏం జరిగిందంటే.. సీనియర్ జర్నలిస్ట్ కరణ్‌థాపర్ ది వైర్ తరఫున ప్రశాంత్ కిషోర్‌ను ఇంటర్వ్యూ చేశారు. అయితే పీకే జోస్యాలపై కరణ్ థాపర్ ఓ ప్రశ్న సంధించారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారని కరణ్ థాపర్ ప్రశ్నించారు. అయితే.. తానేమీ అలా జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ పీకే మాట్లాడారు. అందుకు.. హిమాచల్ విషయంలో పీకే వ్యాఖ్యలపై రికార్డులు ఉన్నాయని కరణ్ థాపర్ వివరించే యత్నం చేశారు. దీంతో.. ప్రశాంత్ కిషోర్ నీళ్లు నమలలేక అసహనం ప్రదర్శించారు. అలా తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని, పత్రికలు-వెబ్సైట్లు ఇష్టానుసారం రాస్తాయని పీకే చిరాకుగా మాట్లాడారు. అయినా కరణ్ థాపర్ తన ప్రశ్నను వివరించే యత్నం చేస్తున్నప్పటికీ.. ప్రశాంత్ కిషోర్ వినలేదు. ‘మీరు తప్పు చేశారు’ అంటూ దాదాపు ఆగ్రహం ప్రదర్శించారు. దానికి కరణ్ థాపర్.. ‘‘హిమాచల్‌లోనే కాదు తెలంగాణలోనూ మీరు చెప్పిన జోస్యం(బీఆర్ఎస్ గెలుస్తుందని) ఫలించలేదు, మీరు(పీకే) అలా అన్నట్లు రికార్డులు ఉన్నాయి’’ అని స్పష్టంగా వివరించబోయారు. అయినప్పటికీ.. కరణ్ థాపర్‌ను మాట్లాడనీయకుండా తాను అలా అన్నట్లు వీడియో చూపించాలంటూ పీకే పట్టుబట్టారు. అంతేకాదు ఇంటర్వ్యూ పేరుతో తనను టార్గెట్ చేయొద్దంటూ పీకే అసహనం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా కరణ్ థాపర్‌ను తనను తాను గొప్పగా ఊహించుకోవద్దంటూ పీకే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ సమయంలో కరణ్ థాపర్ తాను కేవలం ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలరు అని మాత్రమే ప్రశ్నిస్తున్నానని అనగా.. మరో ప్రశ్నకు వెళ్లాలంటూ పీకే దాటవేయడం ఆ వీడియోలో చూడొచ్చు.Karan Thapar screwed Prashant Kishor to the extent that he lost his cool & showed his true colours.pic.twitter.com/inn8vuaFCx— ✎𝒜 πundhati🌵🍉🇵🇸 (@Polytikles) May 22, 2024 -
‘బుల్డాగ్’ తీరు వేరుగా ఉండేది!
ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ ఇంతవరకూ చర్య తీసుకోలేదు. మోదీ స్టార్ క్యాంపెయినర్ అనే బలహీనమైన కారణంతో నేరుగా ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్ మరొక వారం పొడిగింపునకు అంగీకరించింది. ఆ తర్వాత ఇంకొక వారం పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ప్రస్తుత కమిషనర్లు ఎన్నికల కమిషన్‌కు అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు. అదే టి.ఎన్. శేషన్ అయితే ఏం చేసి ఉండేవారు? ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా పిలిపించి ఉండేవారు.‘‘నేను నిక్కచ్చిగా, నిష్కర్షగా ఉంటే ఉండొచ్చు. అయితే నేను ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉంటాను. మీరు చూసేదే మీకు కనిపిస్తుంది. నాలో మాత్రం ఏ పార్శా్వలూ లేవు.’’ – ఎన్నికల కమిషన్‌ను తన పనితీరుతో ప్రశంసనీయమైన గట్టి వ్యవస్థగా తయారు చేశారని పేరుగాంచిన ఎన్నికల ప్రధాన అధికారి టి.ఎన్.శేషన్ తన గురించి తాను ఇలా చెప్పేవారు. ‘‘నేను ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు నేను చేయవలసిన పని ఒకటి ఉంటుంది. ఆ పనిని నేను నా సామర్థ్యం మేరకు అత్యుత్తమంగా చేస్తాను. ఏవీ నన్ను ఆపలేవు’’ అనేవారు శేషన్. ఇక ఆయన ‘బుల్డాగ్’ అని ముద్దుగా పేరు పడటంలో ఆశ్చర్యం ఏముంటుంది? పైగా ఇది ఆయనను ఉల్లాసపరిచిన పేరు కూడా!దురదృష్టం... నేటి ఎన్నికల సంఘం ఎంతో భిన్నమైన జంతువులా ప్రవర్తిస్తోంది. ఈ పోలికను పొడిగించాలనుకుంటే కనుక ఇప్పుడది కాపలా కుక్క కంటే కూడా గారాల పెంపుడు కుక్కగానే ఎక్కువగా నడుచుకుంటోంది. నిష్పాక్షికత, పారదర్శకతల అవసరాన్ని అది మరిచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇకపై తాను – కోరలతో తీవ్రంగా ప్రతిఘటించవలసిన సమయాల్లో సైతం – తన పని తాను చేయవలసి అవసరం లేదని అది నిర్ణయించుకుంది. బదులుగా, బయట పడేందుకు సులభమైన దారులను వెతుకుతోంది. ప్రధానమంత్రి బాంస్వాడా(రాజస్థాన్)లో ప్రసంగించి నెల దాటింది. నిజానికి నేటి నుంచి ఇంకో పదమూడు రోజులలో ఓటింగ్ ముగియనుంది కూడా. ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై కమిషన్ ఇంతవరకు చర్య తీసుకోకుండా ఏం చేస్తున్నదో గమనించండి. కె. చంద్రశేఖరరావు, ఎ. రాజా, సుప్రియా శ్రీనేత్, రణ్‌దీప్ సూర్జేవాలా కేసులలో మాదిరిగా... మోదీకి ప్రత్యక్షంగా నోటీసు జారీ చేయకూడదని కమిషన్ నిర్ణయించుకుంది. బదులుగా, మోదీ స్టార్ క్యాంపెయినర్ అనే ఒక బలహీనమైన కారణంతో ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. నోటీసులో ప్రధానమంత్రి పేరును, హోదాను పేర్కొనలేదు. అనుబంధ పత్రాలలో మాత్రమే అవి ఉన్నాయి. లేఖలో కమిషన్ పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్ మరొక వారం పొడిగింపునకు వెంటనే అంగీకరించింది. ఆ తర్వాత కూడా గడువును ఇంకొక వారానికి పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ఉద్దేశపూర్వకమైన ఈ వాస్తవ దాటవేత కాలయాపన కోసమేనని అర్థమవుతోంది. ఇంతకీ, ప్రధాని ఏం చేశారు? ఓబీసీలు, ఎస్టీలు, ఎస్సీలకు ఉద్దేశించిన రిజర్వేషన్లను వారి నుంచి లాక్కుని ముస్లింలకు ఇవ్వటం జరుగుతుందని దాదాపు ప్రతిరోజూ ఆయన పదేపదే ఆరోపిస్తూ హిందువుల దృష్టిలో ముస్లింలను దయ్యాలుగా చిత్రీకరిస్తున్నారు. చివరికి మంగళ సూత్రాలు, స్త్రీధనం – మీకు రెండు గేదెలు ఉంటే వాటిలో ఒకటి – మీనుంచి లాక్కుని ముస్లింలకు ఇస్తారు అని కూడా ప్రధాని అన్నారు. ప్రధాని జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా పదే పదే ఇలా అనడం నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించటమే కదా? కమిషన్ అధికారాన్ని లెక్కచేయకపోవటం కమిషన్‌ను పరిగణనలోకి తీసుకోకపోవటమే కదా?ఈ విషయంలో కమిషన్ చేయగలిగిందల్లా వెనక్కు జారగిలబడి కూర్చోవటం, వినటం, చేతి బొటనవేళ్లు నొక్కుకోవటం అన్నట్లే ఉంది. కమిషన్ ఎందుకు కఠినచర్య తీసుకోలేదు? తనకై తాను సూమోటోగా ఎందుకు ముందుకు రాలేదు? ప్రధాన మంత్రిని, కనీసం బీజేపీని ఈ కొనసాగింపు, నిజానికి ఈ నిరంతరాయమైన ఉల్లంఘనపై ఎందుకు పిలిపించలేదు? రాజ్యాంగంలోని 324వ అధికరణం కమిషన్‌కు అవసరమైన అన్ని అధికారాలనూ ఇస్తోంది. కానీ వాటిని ఉపయోగించటానికే కమిషన్ ఇష్టపడటం లేదు. దానర్థం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించే నిబద్ధత కమిషన్‌లో కొరవడింది. న్యాయంగా, సమానంగా, పారదర్శకంగా వ్యవహరించే నైతిక అత్యవసరత కమిషన్‌లో లోపించింది. అదే టి.ఎన్. శేషన్ అయితే ఏం చేసి ఉండేవారో ఒక్కక్షణం ఊహించండి. ఆయన ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా, బాహాటంగా పిలిపించి ఉండేవారు. రెండు లేదా మూడు రోజులు ఎన్నికల ప్రచారం నుంచి ఆయన్ని దూరంగా ఉంచేవారు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి, ఇంటర్వ్యూలు ఇచ్చి తను తీసుకున్న చర్యను సమర్థిస్తూ, వివరణ ఇచ్చేవారు. ప్రతిస్పందనగా దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేసి ఉండేవారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు తక్షణం ఆగిపోయేవి. మనకున్న అత్యంత ప్రామాణిక చరిత్రకారులు, సూక్ష్మగ్రాహ్యత గల ప్రజా వ్యాఖ్యాతలలో ఒకరైన రామచంద్ర గుహ... ‘‘ప్రస్తుత ముగ్గురు కమిషనర్లు ఎన్నికల కమిషన్‌కు అగౌరవాన్ని, అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు’’ అని అన్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. కమిషన్ చరిత్ర రాసినప్పుడు ఆ ముగ్గురూ చరిత్రహీనులుగా గుర్తుండిపోతారని ఆయన అన్నారు. అది నిజం. అయితే ఈ చేదు నిజం మరింత లోతైనది. మొదట మన ప్రజాస్వామ్యానికి గాయం అయింది. ప్రపంచంలోనే మనది అది పెద్ద ప్రజాస్వామ్యం అయినందుకు మనం గర్విస్తూ ఉంటాం. కానీ మనకు ఏదైతే గర్వకారణమై ఉన్నదో దానికి ఎన్నికల సంఘం తూట్లు పొడుస్తోంది. ప్రపంచం గమనించలేదని అనుకోకండి! పైనుంచి వేయి కళ్లతో చూస్తూనే ఉంటుంది. అంతిమంగా, ఎలాగూ మూల్యం చెల్లించవలసింది మనమే... ‘భారత ప్రజలమైన మనం’! చర్య తీసుకోవటంలో విఫలం అవటం ద్వారా కమిషన్ మనందరినీ లోకువ చేసేసింది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వెచ్చని హృదయ రాగ సందేశం
ఇది నిన్ననే జరిగినట్లుగా నా జ్ఞాపకంలో స్పష్టంగా ఉంది. నిజానికైతే, నేను తొలిసారి ఫాదర్ టెర్రీ గిల్ఫెడర్ను కలిసింది నలభై ఏళ్ల కిందట! అది 1982 వేసవి చివరిలో... నిషా, నేను మా పెళ్లికి సిద్ధం అవుతున్న సమయం. ఒక క్యాథలిక్‌గా నిషా తను కోరుకున్న సంప్రదాయబద్ధమైన చర్చి వివాహానికి నేను నా అంగీకారాన్ని తెలిపినప్పుడు, స్థానిక పారిష్ చర్చి ప్రీస్ట్‌ను కలసి ఆయన చేత మూడు ఉపదేశాలు ఇప్పించుకోవలసి అవసరం ఏర్పడటం నన్ను చీకాకు పెట్టింది. కానీ వేరే దారి లేదు. వెదికితే, అతి దగ్గరగా నార్తంబర్లాండ్ అవెన్యూలో ఉన్న పునీత మేరీ మగ్దలీనా చర్చి ఒక్కటే నిషాకు ఒక క్రైస్తవేతరునితో వివాహం జరిపించేందుకు అంగీకరించింది, నిబంధనలకు లోబడి ఉండే షరతు మీద! సెప్టెంబరులో ఒక శనివారం, సాయంత్రం 6 గంటలప్పుడు నిషా, నేనూ ఫాదర్ టెర్రీ ఇంటి తలుపు తట్టాం. ఆయన తన డెస్క్ ముందు కూర్చొని ఉన్నారు. ఆయన కళ్లజోడు ముక్కు చివరికి దిగి ఉంది. ఆ చిన్న గదికి ఎదురుగా ఉన్న ఒక పాత, వెలసిపోయిన లెదర్ సోఫా మీద మేము కూర్చున్నాం. బయట ఎప్పుడూ లేనంత వేడిగా ఉంటే, లోపల వాతావరణం మంచులో ఉన్నట్లుగా ఉంది. నేను ఊరకే ఉండలేకపోతున్నాను. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ అని ఆయన అనటం నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది. ‘‘మీ ఇద్దరి గురించీ నాకు తెలియదు. కానీ నేను షెర్రీ పట్ల కొంత మొగ్గుగానే ఉన్నాను’’ అన్నారు.అది టియో పెపె. నాకు ఇష్టమైనది. షెర్రీ బ్రాండ్. కానీ ఆ రోజుల్లో లండన్‌లో అది చాలా అరుదుగా మాత్రమే దొరికేది. ఫాదర్ టెర్రీ వివేచనతో కూడిన అభిరుచి గల వ్యక్తి. నేను ఆయనతో యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, రష్దీ ‘మిడ్నైట్ చిల్డ్రన్’ వంటివాటిపై చర్చిస్తూ ఉన్నాను– మేము చేసుకోబోయే వివాహం, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతాన్ని అనుసరించవలసి ఉంటుంది– అనేవి తప్ప... అన్నీ. ఫాదర్ టెర్రీ మా గ్లాసులను నింపుతూ సంభాషణను నడిపిస్తున్నారు. ఆయన నా వాదనను గ్రోలుతూనే, తన వాదనను సౌఖ్యంగా నిలిపి ఉంచుకుంటున్నారు. కాలం ఉల్లాసవంతమైన వేగంతో గడిచిపోయింది. వచ్చేవారం కలుద్దాం అనుకున్నాక, బయల్దేరేందుకు మేము లేచి నిలబడ్డాం. ఫాదర్ టెర్రీ మమ్మల్ని ఆపినప్పుడు మేము తలుపు దగ్గర ఉన్నాం. ‘‘మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్న విషయమై ఒక ప్రశ్న నా దగ్గర ఉంది’’ అన్నారు. ఆ ప్రశ్నకు సూచనగా చిరునవ్వొకటి విశాలమైన ఆయన గుండ్రటి ముఖం మీద నాట్యమాడింది. ఆయన కళ్లు సూటిగా మావైపే చూస్తున్నాయి. ‘‘మీరిద్దరూ కలిసి ఎందుకు సహజీవనం చేయకూడదు?’’ అన్నారు ఫాదర్ టెర్రీ. మా ముఖాల్లోంచి రక్తం చివ్వున చిమ్మిందేమో నేను కచ్చితంగా చెప్పలేను కానీ, మేమిద్దరం మాత్రం నోట మాట రాక అలా ఉండిపోయాం. నిజం ఏమిటంటే నిషా, నేను అప్పటికే సహజీవనంలో ఉంటూ ఆ వాస్తవాన్ని దాచటానికి ఉద్దేశపూర్వకంగానే ఫాదర్ టెర్రీకి వేర్వేరు చిరునామాలను ఇచ్చాం. అది ఆయన ఊహించారు. అందుకే తన పద్ధతిలో అదేం పెద్ద విషయం కాదన్నట్లు చెప్పారు. నిషా పూర్తి క్రైస్తవ సంప్రదాయంలో వివాహాన్ని కోరుకుంది. వరుడు క్రైస్తవుడు కాదు అనే విషయాన్ని పట్టించుకోకుండా ఫాదర్ టెర్రీ అందుకు సమ్మతించారు. ఆయన ఉపదేశ వాక్యం అందరి దృష్టిని ఆకర్షించింది. నరకం, అపరాధం, దైవం, çసచ్ఛీలత... వీటి గురించి ఆయన ఉపదేశించలేదు. ‘‘ఐ లవ్ యు’’ అనే మూడు చిన్న పదాల గురించి మాట్లాడారు. ‘‘కరణ్, నిషా...’’, ‘‘గుర్తుంచుకోండి. ‘ఐ’ నీ, ‘యు’నీ ‘లవ్’ జత కలుపుతుంది. కానీ అది వేరు కూడా చేస్తుంది. మీరిద్దరూ వేర్వేరు వ్యక్తులని మీరు మరచిపోయిన రోజున మీ బంధం విడిపోతుంది’’ అన్నారు ఫాదర్ టెర్రీ. అదొక వెచ్చని, తేలికపాటి, హృదయపూర్వక సందేశం. లాంఛనప్రాయమైన తంతు కంటే కూడా నిప్పు చుట్టూ కూర్చొని మాట్లాడుకోవటం వంటిది. కానీ అది పావు శతాబ్దం పాటు నా మదిలో వెలుగుతూనే ఉండిపోయింది. ఆరేళ్ల తర్వాత, ఆసుపత్రిలో నిషా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లైఫ్ సపోర్టును తొలగించటానికి కొన్ని నిమిషాల ముందు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు చివరి మతకర్మను నిర్వహించారు. అమ్మను కూడా హైందవ సంప్రదాయం ప్రకారం నిషా చెవిలో ప్రార్థనలు వినిపించమని ప్రోత్సహించారు. ఆ తర్వాత యంత్రాలు మెల్లగా, బాధగా మినుకు మినుకుమని కొడిగడుతున్నప్పుడు నిషా అంతిమ శ్వాసలో ఫాదర్ టెర్రీ నా పక్కన నిలబడ్డారు. నాకు తెలిసిన ఏకైక క్రైస్తవ మత గురువు టెర్రీ గిల్ఫెడర్. ఆయన ఒక వింత మనిషి అయినప్పటికీ ఒక గొప్ప వ్యక్తి. ఒరిస్సా, కర్ణాటకలలో క్రైస్తవులపై జరిగిన దాడి గురించి చదివిన ప్రతిసారీ నేను ఆయన గురించి ఆలోచిస్తాను. గాయపడిన హృదయాలను నయం చేసే పదాలను ఆయన కనుగొని ఉంటారని నేను నమ్ముతాను. అందుకు నిస్సందేహంగా ఆయనకు షెర్రీ సహాయపడి ఉంటుంది. కరణ్ థాపర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇలాగేనా మాట్లాడేది?
‘‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’’ అని ఒక లౌకికవాద దేశానికి ప్రధానమంత్రి తోటి పౌరుల గురించి మాట్లాడడం తగినదేనా? ‘వారు’ కూడా సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, గ్రహాంతరవాసులూనా? అలా మాట్లాడటాన్ని ఆయన్ని అభిమానించేవారు సమర్థిస్తున్నట్లు్ల అనిపిస్తోంది. లేకుంటే ఆయన అలా అనటాన్ని ఆపి ఉండేవారా? తనను సరిదిద్దుకునేవారా?ప్రధానమంత్రులు ఎల్లవేళలా సరైన, గౌరవ ప్రదమైన పనే చేస్తారన్న భావన ఉన్న యుగంలో నేను పెరిగాను. అంతేకాదు, ప్రధాని చెప్పారంటే ఇక అది సరైనది అయినట్లే! మాటల్లో పొల్లుపోవటం అత్యంత సహజం అయి నప్పటికీ, జవహర్లాల్ నెహ్రూకు కూడా అలా జరిగేదంటే నా తల్లి తండ్రులు అస్సలు నమ్మేవారు కారు. ఆ పాతకాలపు ప్రామాణికతకు ఆయనొక శ్రేష్ఠమైన నమూనాగా పరిగణన పొందారు. ‘యాభైలు’, ‘అరవైల’ నుంచి మనం చాలా దూరం ప్రయాణించి వచ్చాం. ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడి గురించి మీరు ఊహించరానిదేమీ ఉండదు. ఏ ఉత్కృష్టులైన వారినో పక్కన పెడితే ప్రధానమంత్రులూ ఇక ఏమాత్రం భిన్నమైన వ్యక్తులుగా మిగిలి లేరు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి దశాబ్దంలో వారి పట్ల కనిపించిన సహజమైన గౌరవభావన, వారంటే ఉండే కొద్దో గొప్పో ఆరాధన పూర్తిగా కనుమరుగయ్యాయి. ‘సబ్ చోర్ హై’ (అందరూ దొంగలే) అన్నదే ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న నమ్మకం అయింది.ఇప్పటికి కూడా, నా అత్యంత నిరాశావాద, చీకటిమయ మనః స్థితుల్లో సైతం– తన సొంత, తోటి పౌరులలో ఒక గణనీయమైన వర్గం మీద ఒక ప్రధాని దాడి చేస్తూ, వారిని పిశాచాలుగా చూపటం వింటానని నేనెప్పుడూ అనుకోలేదు. అదేపనిగా అందుకోసం మార్గా లను కనుగొంటారని కూడా! ఆయనను అభిమానించేవారు తెలివిగా దీనిని... అదేపనిగా అని కాక, అనేకసార్లు అని అనవచ్చు. ఆయన అలా చేయటాన్ని వారు ఆనందిస్తున్నట్లు, సమర్థిస్తున్నట్లు, సహేతుక మేనని భావిస్తున్నట్లు అనిపిస్తోంది. లేకుంటే కచ్చితంగా ఆయన అలా చేయటాన్ని ఆపి ఉండేవారా? తనను తను సరిదిద్దుకునేవారా? బహుశా పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసేవారా? కానీ అలా జరగక పోగా, అవి పునరుద్ఘాటనలు అవుతున్నాయి. బహిరంగంగా, శక్తిమంతంగా, స్థానాలను మార్చుకుంటూ కొనసాగుతున్నాయి. మొదట చెప్పినదానినే ఉన్నది ఉన్నట్లుగా మళ్లొకసారి చెబుతాను. నా ప్రతిస్పందన అర్థంచేసుకోదగినదా లేక అతిశయోక్తితో కూడినదా అని మీకై మీరు ఆలోచించండి. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికలో వచ్చిన దానిని బట్టి హిందీలో ఆయన మాట్లాడిన మాటలు సరిగ్గా ఇవే: ‘‘పెహ్లే జబ్ ఉన్కీ సర్కార్ థీ, ఉన్హోనే కహా థా కీ దేశ్ కీ సంపతీ పర్ పెహ్లా అధికార్ ముసల్మానోం కా హై. ఇస్కా మత్లబ్, యే సంపతీ ఇకఠ్ఠీ కర్కే కిస్కో బాటేంగే? జిన్కే జ్యాదా బచ్చే హై, ఉన్కో బాటేంగే, ఘుస్పైఠియోన్ కో బాటేంగే. క్యా ఆప్కీ మెహనత్ కీ కమాయి కా పైసా ఘుస్పైఠియోన్ కో దియా జాయేగా? ఆప్కో మంజూర్ హై యే?’’ (‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’)మరి, ‘ఎక్కువమంది పిల్లలను’ కలిగివున్న ఆ వ్యక్తులు ఎవరు? ‘చొరబాటుదారులు’ అని పిలవబడుతున్న ఈ వ్యక్తులు ఎవరు? స్పష్టంగానే ఉంది కదా, మొదటి వాక్యాన్ని బట్టి ఇంకా స్పష్టంగా లేదా? ఇంకా ఏమైనా సందేహమా? అలాగే పైన పేర్కొన్న ‘ముసల్మా నులు’ ఎవరు? వారు భారతదేశ ముస్లింలు కారా? మన తోటి పౌరులు కారా? సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ కలిగి ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, బయటి వ్యక్తులు, గ్రహాంతరవాసులూనా?ఇప్పుడు చెప్పండి, నా ప్రశ్నకు మీ సమాధానం ఏమిటి? దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే నేను అమాయకుడిని అవుతానా? ఇంకా చెప్పాలంటే కదిలిపోవటానికి ? లేదా ఆ విధమైన ఆరోపణలను మీరు మన ప్రధా నులు ఎవరినుంచైనా విని ఉన్నారా?డోనాల్డ్ ట్రంప్ తరచూ ఇలా మాట్లాడ్డం నాకు తెలుసు. ఆయన అలా మాట్లాడినప్పుడు మనకు వికారం పుడుతుంది. 1960లలో బ్రిటన్‌లో ఇనాక్ పావెల్ ఇలాగే మాట్లాడితే అక్కడి ఆధిపత్య సమాజ సమూహం ఆయన మాటల్ని పట్టించుకోలేదు. కానీ మన తరంలోని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్లు, సాధ్వీ రుతంభరలు ఇటువంటి వాక్చాతు ర్యాన్ని ఆస్వాదిస్తారనడంలో సందేహమే లేదు. అయితే అందుకు వారు తిరిగి పొందేది ధిక్కారాన్ని, ఎగతాళిని మాత్రమే! నా బోళాతనం బహుశా మీ దృష్టిలో తీవ్రంగా దెబ్బతిని ఉంటుందని నేను అంగీకరిస్తున్నప్పటికీ, ఇప్పటికైతే నన్ను ఆశ్చర్యపరిచే విషయం వేరొకటి ఉంది. అది మన మీడియా స్పందన. ఒకవేళ అలాంటిదేమైనా ఉండివుంటే, నాకైతే ఆందోళన కనబడలేదు, ఏహ్యభావం కనబడలేదన్నదైతే నిశ్చయం. బహుశా నేను చదవాల్సిన పత్రికల్ని చదవలేదేమో! చూడాల్సిన టీవీ చానెళ్లను చూడలేదేమో! కానీ నాకు అనిపించింది ఏమిటంటే, చెప్పినదాన్ని మౌనంగా అంగీ కరించారని! అంగీకరించకపోయినా, కనీసం దానిమీద వ్యాఖ్యానించ నైనా లేదు. విమర్శ అయితే అసలు చేయలేదు. అది ఖండనార్హమైనది కాదని నేను అనుకుంటే తప్ప నాకది దాదాపుగా నమ్మకశ్యంగా లేదు. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారా?క్షమించండి. నేను ఈరోజు చాలా ప్రశ్నలు సంధించి మీకు అతి కొద్ది సమాధానాలు మాత్రమే ఇచ్చాను. కానీ నా అభిప్రాయాలను మీపై రుద్దడం నాకు ఇష్టం లేదు. బదులుగా, మీరేం అనుకుంటున్నారో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కనుక మరొక చివరి ప్రశ్నకు నన్ను మన్నించండి: ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన మంత్రి అయిన వారు భిన్న మత విశ్వాసాన్ని కలిగిన తోటి పౌరుల గురించి ఇలా మాట్లాడడం తగినదేనా? మరింత కచ్చితంగా అడగాలంటే, నైతికంగా సరైనదేనా?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
హింసకు కళాత్మక ప్రతీకారం!
న్యూయార్క్‌లోని చౌటక్వా ఇన్స్టిట్యూషన్లో రెండేళ్ల క్రితం ఆగస్టు 12న ఉపన్యాసం ఇచ్చేందుకు సిద్ధమౌతున్న భారత సంతతి రచయిత సల్మాన్ రష్దీ అతి పాశవికంగా పదిహేను కత్తిపోట్లకు గురయ్యారు. చావు తప్పి కన్ను పోగొట్టుకున్న ఆ ప్రాణాపాయం నుండి మెల్లగా కోలుకుంటున్న స్థితిలో ఉన్న రష్దీ... నాటి ఘటనపై తాజాగా ‘నైఫ్: మెడిటేషన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్’ పుస్తకం రాశారు. భయంకరమైన ఆ దాడి గురించి ఈ పుస్తకంలో సల్మాన్ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. నేటికీ వెంటాడుతున్న తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ... నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో తనెలా కోలుకున్నదీ హృద్యంగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ.మునుపటి తన కళాఖండాల మాదిరిగా కాకుండా, తన తాజా పుస్తకం ‘నైఫ్: మెడిటే షన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్’లో... దాదాపుగా తనను చంపి నంత పని చేసిన ఆనాటి భయంకరమైన దాడి గురించి సల్మాన్ రష్దీ నేరుగా పాఠకులతో సంభాషించారు. సన్నిహితంగా, నిజాయితీగా, ఒప్పించే ప్రయత్నంలో విశ్వాసాన్ని చొరగొనే విధంగా, తన అనిశ్చిత స్థితిని పంచుకుంటూ, తన బాధను, అంతఃసంఘర్షణలను బహిర్గతం చేస్తూ, నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో నిలకడైన ప్రయాణంగా తనెలా కోలుకున్నదీ చక్కగా వివరించారు. అదొక గొప్ప మానవీయ పద స్వరీకరణ. పూర్తిగా వ్యక్తిగతమైనది. రష్దీ కంటే సల్మాన్‌గానే ఆయన ఎక్కువగా మాట్లాడారని చెప్పొచ్చు. ఆయన తన పైన జరిగిన దాడి(2022) గురించి రాస్తారని నాకు కచ్చితంగా తెలుసు. అయినా ఒక నవలా రచయిత రాయకుండా ఎలా ఉండగలరు? నాకెప్పుడో తెలుసు అని నేను అనడం ఒక పాఠకుడి అంచనాగా మాత్రమే. దాడి ప్రభావాన్ని తనెలా మానసికంగా తట్టుకుని నిలబడ్డారన్న దానిపై పుస్తకంలో రష్దీ చేసిన విశదీకరణ ఆయన ప్రయత్నబలం ఎంత పటిష్టమైనదో చెబుతోంది. ‘‘జరిగిన దానిని అర్థం చేసుకునేందుకు, దానిని అధిగమించేందుకు, నాదిగా అలవాటు చెందేందుకు, ఒక బాధితుడిగా మాత్రమే ఉండటాన్ని నిరాకరించేందుకు నేను ఎంచుకున్న మార్గం ఈ రాయటం అన్నది కావచ్చు. హింసకు నేను చెప్పే సమాధానం కళ ’’ అంటారు రష్దీ.ఈ పుస్తకం రష్దీ ప్రతిస్పందన అయితే, పుస్తకపు శీర్షిక రష్దీ ఉద్దేశపూర్వకమైన ఎంపిక. అతి దారుణంగా ఆయనపై కత్తిపోట్ల దాడి జరిగింది. కత్తి అన్నది తుపాకీకి చాలా భిన్నమైనది. ‘‘కత్తిపోటు ఒక విధమైన హత్తుకోలు. మనిషికి దగ్గరగా వచ్చి పొడిచే ఆయుధం. కత్తిపోట్లు అతి సమీప నేరాలు’’ అంటారు రష్దీ. అయితే కత్తి ఒక ఉపకరణం కూడా. ఉపయోగించే దాన్ని బట్టి ఆయుధమో, సాధనమో అవుతుంది. ఆ కోణంలో చూస్తే భాష కూడా పదునైన కత్తి వంటిదే. ‘‘భాషే నా కత్తి’’ అని చెబుతారాయన. ‘‘నేనొకవేళ అనుకోకుండా ఒక అవాంఛనీయమైన కత్తి పోరాటంలో చిక్కుకున్నట్లయితే, ఎదురుదాడికి నేను తిప్పే కత్తి బహుశా నా భాషే కావచ్చు. నా ప్రపంచాన్ని నేను పునర్నిర్మించుకోటానికి, తిరిగి నా అధీనంలోకి తెచ్చు కోటానికి నేను వాడే పరికరం అదే కావచ్చు’’ అంటారు.దాడి గురించి రష్దీ వర్ణన సూక్ష్మ సునిశితంగా, వెన్నులో వణుకు పుట్టించేలా, ఆ ఘటనను అదే రీతిలో తిరిగి చూపించినట్లుగా ఉంది. ‘‘నేను ఇప్పటికీ ఆ క్షణాన్ని నెమ్మదిగా కదిలే దృశ్యంలా చూడగలను. అతడు ప్రేక్షకుల నుంచి ఒక్క ఉదుటున దుమికి పరుగున నన్ను సమీపిస్తున్న ప్పుడు నా కళ్లు అతడిని అనుసరించాయి. దూకు డుగా పడుతున్న అతడి ప్రతి అడుగును నేను గమనిస్తున్నాను. చప్పున నేను నా కాళ్లపై లేవటం నాకు తెలుస్తూ ఉండగా అతడి వైపు తిరిగాను. ఆత్మరక్షణగా నా ఎడమ చేతిని పైకి లేపాను. ఆ చేతిపై అతడు తన కత్తిని దిగపొడిచాడు.’’ బాధితుడిలా కాకుండా, జరుగుతున్న దానిని బయటి నుంచి చూస్తున్న వ్యక్తిగా... ‘‘అతడు చాలా పాశవికంగా పోట్లు పొడు స్తున్నాడు. పొడు స్తున్నాడు, కత్తిని నాపై తిప్పుతున్నాడు. కత్తి దాని కదే ప్రాణం కలిగి ఉన్నట్లుగా నాపై విరుచుకుపడింది’’ అని రష్దీ రాశారు. రష్దీ స్పృహ కోల్పోయినట్లు లేదు. జరుగుతున్న దాడి ఎలాంటిదో తెలుస్తూనే ఉన్న దిగ్భ్రాంత స్థితిలో ఆయన ఉన్నారు. ‘‘నేలపై పడి ఉన్న నేను నా శరీరం నుంచి కారుతున్న రక్తపు మడుగును చూస్తూ ఉండటం నాకు గుర్తుంది. చాలా రక్తం. అప్పుడు నాకు అనిపించింది: ‘నేను చనిపోతున్నాను’ అని. కానీ అదేమీ నాకు భయం కలిగించ లేదు. ఊహించనిది జరుగబోతున్నట్లుగానూ లేదు. బహుశా అలా జరిగే అవకాశం ఉంది అనుకున్నాను. జరగవలసిందే జరిగిపోతున్న దనే ఆలోచన.’’ ఆ సమయంలో రష్దీ గ్రహించని విషయం ఏంటంటే, బతికి బట్టకట్టాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ‘‘నా క్రెడిట్ కార్డులు ఈ జేబులో ఉన్నాయి. ఇంటి తాళాలు మరో జేబులో ఉన్నాయి’’ అని, ఆ స్థితితో ఎవరైతే తన పట్ల శ్రద్ధ వహిస్తున్నారో వారితో అస్పష్టంగా చెబుతున్నారు. ‘‘ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే, నా బొంగురు గొంతు దైనందిన వస్తువుల గురించి పట్టింపుతో ఉందంటే, నేననుకోవటం నా దేహంలోని ఒక భాగం – లోలోపలి పోరాడే భాగం – చనిపోయేందుకు సిద్ధంగా ఏమీ లేదని; ఆ క్రెడిట్ కార్డులు, ఇంటి తాళాలు మళ్లీ ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఉందని, ‘బతుకు, బతుకు’ అని నాతో గుసగుసలాడుతోందని’’అంటారు రష్దీ. ఆయన శరీరంపై పదిహేను కత్తిపోట్లు పడ్డాయి. మెడ, కుడి కన్ను, ఎడమ చెయ్యి, కాలేయం, పొత్తి కడుపు, నుదురు, చెంపలు, నోరు, ఇంకా... తల నుంచి కింది భాగమంతటా. ‘బీబీసీ’ ప్రతినిధి ఎలాన్ యెన్తోబ్‌తో మాట్లాడుతూ, మెత్తగా ఉడికించిన గుడ్డును తన పైచెంప మీద ఉంచినట్లుగా తన కుడికన్నుకు అనిపించిందని రష్దీ అన్నారు. ఆ కన్ను పోవటం అనే తీవ్రమైన కలత గురించి పుస్తకంలో ఆయన మనోభావనతో కాక ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడారు. ‘‘ఇప్పుడు కూడా, ఇది రాస్తున్నప్పుడు ఈ నష్టంతో సర్దుకుని పోవడం నా వల్ల కావటం లేదు. అది శారీరకంగా కష్టమైనది. మానసికంగా మరింత కష్టమైనది. ఇది నా జీవితాంతం ఇలాగే ఉండిపోతుందని అంగీకరించడం నిస్పృహను కలిగిస్తోంది’’ అని రాశారు రష్దీ. మెక్రాన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు), బైడెన్ (అమెరికా అధ్యక్షుడు), ఆఖరికి రష్దీ అంటే ఎప్పుడూ ఇష్టపడని బోరిస్ జాన్సన్ (ఆ సమయంలో బ్రిటన్ ప్రధాని) కూడా రష్దీపై దాడి జరగటం పట్ల భయాన్ని,ఆందోళనను వ్యక్తం చేశారు. ‘‘అతని పోరాటం మా పోరాటం’’ అని మెక్రాన్ ప్రముఖంగా ప్రకటించారు. కానీ రష్దీ జన్మించిన దేశంలో, తన జన్మభూమి అని రష్దీ చెప్పుకునే దేశంలో మౌనమే అధికారిక ప్రకటన అయింది. ‘‘నను గన్న నా భారతదేశానికి, నాకు లోతైన ప్రేరణ అయిన భారతదేశానికి ఆ రోజున మాటలే దొరకలేదు’’ అన్నారు రష్దీ. ఎంత సిగ్గుచేటు!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కాంగ్రెస్ ఇవ్వలేకపోయిన హామీ!
మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ‘రాజ్యాంగ పరిరక్షణ’కు మూడు ముఖ్యమైన హామీలను ఇచ్చింది. ఉభయ సభల్ని ఏడాదికి కనీసం వంద రోజులు సమా వేశ పరచటం; ప్రతిపక్షాలు సూచించిన అంశాలపై చర్చకు సమయాన్ని కేటాయించటం; రెండు సభల ప్రిసైడింగ్ అధికారులు తమ పార్టీలతో సంబంధా లను తెంచుకోవాలన్న నిబంధన ద్వారా నిష్పాక్షికతను సాధించటం. అలాగే ఇంకొక హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఉండవలసింది. బ్రిటన్‌లో మాదిరిగా పార్లమెంటు సమావేశాలలో ‘ప్రైమ్ మినిస్టర్స్ క్వశ్చన్ టైమ్’ని ప్రవేశపెట్టి ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు ప్రధానమంత్రే స్వయంగా సమాధానాలు ఇచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించటం. మన పార్లమెంటు కోసం, మన ప్రజాస్వామ్యం కోసం, అంతకుమించి సుపరిపాలన కోసం ఇవి అవసరం. సాధారణంగా నేను రాజకీయ మ్యానిఫెస్టోల జోలికి వెళ్లను. చాలా సందర్భాలలో పార్టీ గానీ, లేదా ఓటరు గానీ వాటిని అంత సీరియస్‌గా తీసుకోరు. అయితే కాంగ్రెస్ పార్టీ తాజా మ్యానిఫెస్టోలోని పార్లమెంటు పని తీరుకు సంబంధించిన ఒక క్లాజు నా కంటపడింది. మ్యానిఫెస్టోలోని ‘రాజ్యాంగ పరిరక్షణ’ అనే అంశం కింది 9వ క్లాజు మూడు నిర్దిష్టమైన, ముఖ్యమైన హామీలను ఇస్తోంది. మొదటిది ఇలా చెబుతోంది: ‘పార్లమెంటు ఉభయసభలు దేనికది ఏడాదికి 100 రోజులు సమావేశం అవుతాయి అని మేము హామీ ఇస్తున్నాం.’నిజంగా ఇది మన ప్రజాస్వామ్య విధి నిర్వహణకు కావలసిన సత్తువను ఇస్తుంది. ఇందుకు వివరణగా, కోవిడ్ వల్ల ప్రభావితమైన లోక్సభవి కాకుండా, ఆ ముందరి సమావేశాల నుంచి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. 16వ లోక్‌సభ 1,615 గంటలు మాత్రమే పని చేసింది. ఇది అన్ని పూర్తికాల లోక్‌సభల సగటు కంటే 40 శాతం తక్కువ. 15వ లోక్ సభలో 26 శాతం వరకు చట్టపరమైన బిల్లులు 30 నిమిషాల లోపే ఆమోదం పొందాయి. ఆ సంఖ్య తర్వాతి కాలంలో పెరిగి ఉండొచ్చు కానీ, 14, 15 లోక్‌సభలలో నమోదైన 71 శాతం, 60 శాతంతో పోలిస్తే 16వ లోక్‌సభలో కేవలం 25 శాతం బిల్లులే కమిటీల సూచనల కోసం వెళ్లాయి. దీనిని బట్టి, అమలుకు అవసరమైన అర్హతల పరిశీలనకు చట్టపరమైన బిల్లులు వెళ్లలేదని స్పష్టం అవుతోంది. లోక్‌సభ ఏడాదికి 100 రోజులు సమావేశం అయితే కనుక ఆ సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. రెండవ హామీ: ‘రెండు సభల్లోనూ వారానికి ఒకరోజును ప్రతి పక్షాలు సూచించిన అంశంపై చర్చించటానికి కేటాయిస్తామని మేము హామీ ఇస్తున్నాం’. దీని అర్థం, ప్రభుత్వం నిరాకరించిన జీఎస్టీ, ధరల పెరుగుదల, పెగసస్, రఫేల్, చైనా చొరబాట్లు, ఎలక్టోరల్ బాండ్ల వంటి అంశాలు చర్చకు వస్తాయని! ప్రభుత్వం మొండిగా తిరస్కరించే వాటిని చర్చించేందుకు ఈ నిబంధన అత్యవసరతను కల్పిస్తుంది. పార్లమెంటరీ చర్చలను సంపూర్ణం, అర్థవంతం చేస్తుంది. మూడవ హామీ ఇలా చెబుతోంది: ‘రెండు సభల ప్రిసైడింగ్ అధికారులు (స్పీకర్, ఛైర్మన్) ఏ రాజకీయ పార్టీతో తమకున్న సంబంధాన్నయినా తెంచుకోవాలన్న నిబంధనను చేర్చుతామని మేము హామీ ఇస్తున్నాం.’ ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్ సభకు అధ్యక్షు డిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కూడా తన పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అది ఆమోదయోగ్యం కాదు. అలా ఉండటం పక్షపాతానికి దారి తీస్తుంది. నిర్ణయాలను ప్రశ్నార్థకం చేస్తుంది. రాజ్య సభ ఛైర్మన్ కూడా అంతే. ప్రిసైడింగ్ అధికారి అయ్యాక కూడా వారు తమ పార్టీలో కొనసాగడం అన్నది అంతే సమానంగా (లోక్‌సభ స్పీకర్‌తో సమానంగా) ఆమోదయోగ్యం కానిది. దీనికి అదనంగా నేను మరొకటి జోడిస్తాను. సిట్టింగ్ స్పీకర్ కనుక మళ్లీ ఎన్నికకు నిలబడితే అతడికి పోటీ లేకుండా చూడాలి. బ్రిటన్‌లో అలాగే జరుగుతుంది. దాని వల్ల స్పీకర్ స్థానంలోకి వచ్చే వారి తటస్థతకు హామీ ఉంటుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌కు ఎందుకు ఆలోచించలేదో మరి? ఏమైనా, కాంగ్రెస్ మ్యానిఫెస్టో మరొక కీలకమైన అడుగును ముందుకు వేసి ఉండవలసింది! బ్రిటన్ ‘హౌస్ ఆఫ్ కామన్స్’ సమా వేశాలలో ఒక నిర్దిష్టమైన రోజున, ఒక అరగంట సేపు ‘ప్రైమ్ మిని స్టర్స్ క్వశ్చన్ టైమ్’ (పీఎంక్యూ) పేరిట – ప్రతిపక్ష నాయకుడు వేసే కనీసం అరడజను ప్రశ్నలతో పాటుగా, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ప్రధాన మంత్రి సమాధానాలు ఇవ్వటం అనే సంప్రదాయాన్ని మన దగ్గర మొదలు పెడతామని హామీ ఇవ్వవలసింది. దీని వల్ల ఉన్నత స్థాయిలో జవాబుదారీతనానికి భరోసా ఏర్పడటం మాత్రమే కాదు, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తిని ప్రశ్నించటానికి ప్రతి పక్షానికి అవకాశం లభిస్తుంది. యూకేలో పీఎంక్యూస్ అని పిలిచే ఈ ప్రశ్నోత్తర సమయం రసవత్తరంగా సాగుతుంది. ఇటు ప్రధానమంత్రి, అటు ప్రతిపక్ష నాయకుడు... ఆ ఇద్దరిలోని అత్యుత్తమమైన ప్రతిభను వెలికి తీస్తుంది. అందుకే అది, దేశ ప్రజలు తమ నాయకుల పనితీరును వీక్షించి, వారేమిటో తెలుసుకోటానికి, వారి బలహీనతలను గుర్తించటానికి, వారి బలాలను ప్రశంసించటానికి ఒక గవాక్షం. ఒక్క మాటలో అది... ప్రజాస్వామ్యం పని చేయటం. ప్రపంచంలోనే అతి పెద్దదైన మన ప్రజాస్వామ్యానికి అలాంటి ఒక గవాక్షం ఇప్పుడు అత్యవసరం. మరి ఈ హామీని ఇవ్వటానికి కాంగ్రెస్ ఎందుకు వెనకడుగు వేసింది? నరేంద్ర మోదీ దాడిని మల్లికార్జున్ ఖర్గే, లేదా రాహుల్ గాంధీ... తిప్పికొట్టలేరన్నదే కారణమా? వాళ్లు దీని గురించి ఎప్పుడూ ఆలోచించి ఉండరనీ, లేదా ఇది అసాధ్యం అని వారు కొట్టిపడేసి ఉంటారనీ నేను నమ్మలేను కనుక బహుశా అదే కారణం అయుండా లని నా అనుమానం. మ్యానిఫెస్టోలో ఇప్పుడు హామీ ఇచ్చినవాటినైనా కాంగ్రెస్ నెర వేర్చవలసిన అవసరం ఉంది. మన పార్లమెంటు కోసం, మన ప్రజా స్వామ్యం కోసం, అంతకుమించి సుపరిపాలన కోసం నెరవేర్చాలి. అందుకే ఇది నరేంద్ర మోదీకి, బీజేపీకి కూడా పరీక్ష. వారు నిజంగా భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిది అని విశ్వసిస్తుంటే కనుక కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని హామీల అమలుకు వారెలా ‘కాదు’ అని చెప్పగలరు? నిజానికి ప్రతి ఆలోచనాత్మకమైన, బాధ్యత గల రాజ కీయ పార్టీ కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తుందని నేను ఆశిస్తున్నాను. అయితే... విచారకరమైన, అంతుచిక్కని నిజం ఒకటి ఉంది. ప్రశ్నలను ఎదుర్కోవటానికి సిద్ధం అని ఏ పార్టీ అయినా అంటుందని కచ్చితంగా చెప్పగలను. కానీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే, చర్య తీసుకోవలసిన స్థితిలో ఉంటే ప్రశ్నలకు సిద్ధంగా ఉండగలదా? ఇక్కడే సందేహాలు కదలాడుతున్నాయి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఊహకు అందని ఉక్కిరిబిక్కిరి
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ‘జరగని’ ఒక ఘటన ఆనాటి బ్రిటిష్ ఆధిపత్యంలోని భారత సామ్రాజ్యాన్ని వణికించింది. మద్రాస్‌కు అభిముఖంగా ఉన్న పశ్చిమ దిశ ప్రాంతమంతటా భయభ్రాంతులు వ్యాపించాయి. సింగపూర్‌ను లొంగదీసుకున్న జపాన్‌కు తర్వాతి లక్ష్యం ఈ ప్రాంతమే అనుకోవ డమే దీనికి కారణం. దాంతో నగరంలోని 8 లక్షల మందిలో 7 లక్షలమంది కట్టుబట్టలతో పారిపోయారు. మద్రాసు జూ లోని సింహాలు, పులులు, నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, విషసర్పాలను కాల్చి చంపారు... బాంబులు పడితే అవి ఆ గందరగోళంలో జనాల మీద పడకుండా! ఆ యుద్ధానికి అవి మూల్యం చెల్లించాయి. ఊహాత్మకమైన దండయాత్ర ముప్పునకే ఆనాటి ప్రభుత్వం అంతగా ప్రభావితం అయిందా? అవునని ఒప్పుకోక తప్పదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఎనభై ఏళ్లు అయినప్పటికీ, ఆ యుద్ధం గురించి మనకు తెలియనిది ఏముంటుందని చాలామంది అనుకుంటారు. అది తప్పు అని ముకుంద్ పద్మనాభన్ రుజువు చేశారు. అసలేనాడూ సంభవించకనే, నిజంగానే సంభవించిందన్నంతగా ఒక అసంబద్ధ మైన కలవరానికి గురిచేసిన ఒకానొక ఘటనపై తాజాగా ఆయన పుస్తకం రాశారు. దాని పేరు: ‘ద గ్రేట్ ఫ్లా్యప్ ఆఫ్ 1942: హౌ ద రాజ్ ప్యానిక్డ్ ఓవర్ ఎ జపనీస్ నాన్–ఇన్వేషన్’. 1942 ఫిబ్రవరిలో సింగపూర్ పతనానంతరం... అప్పటికింకా బ్రిటిష్ ఆధిపత్యంలోనే ఉన్న భారత సామ్రాజ్యానికి–మరీ ముఖ్యంగా మద్రాస్‌కు అభిముఖంగా ఉన్న పశ్చిమ దిశ ప్రాంతమంతటా భయ భ్రాంతులు వ్యాపించాయి. మలయా ద్వీపకల్పానికి మద్రాసు దగ్గరగా ఉండటమన్నది... సింగపూర్ తర్వాత జపాన్ తదుపరి దాడి ఇక మద్రాసు మీదనేనన్న సూచనప్రాయతకు తావిచ్చింది. అసలక్కడేమీ లేకుండానే, ఊరికే ఊహించుకుని భయపడ్డామని ప్రత్యేకించి మీరు గుర్తు చేసుకున్నప్పుడు ఆ భయాందోళన స్థాయి మరింతదైన గొప్ప దిగ్భ్రమను కలిగిస్తుంది. సింగపూర్ పతనం అయ్యే సమయానికి మద్రాసులోని మూడింట ఒక వంతు జనాభా ప్రాణ భయంతో తట్టాబుట్టా వదిలి పారిపోయింది. ఆరు వారాల తర్వాత నగర జనాభా కేవలం 25 శాతమే మిగిలి ఉందని ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ రాసింది. పాల్ జయరాజన్ అనే ఐసీఎస్ అధికారి అంచనా ప్రకారమైతే మద్రాస్ జనాభా 13 శాతానికి తగ్గిపోయింది. దానర్థం 8 లక్షల మందిలో 7 లక్షలమంది కట్టుబట్టలతో నగరాన్ని వదిలి వెళ్లారని! ‘ఈ లెక్క నమ్మశక్యమైనదిగా కనిపించకున్నా, నమ్మశక్యం కానిది గానూ అనిపించడం లేదు’ అని ముకుంద్ పద్మనాభన్ వ్యాఖ్యానించారు. పుస్తకంలో ఆహ్లాదం కలిగించే కథలు చెప్పుకోదగినన్ని ఉన్నప్ప టికీ, వాటిల్లో ఒక్కటి కూడా మద్రాసులో జరిగిన దానిని మించి అద్భు తమైనదేమీ కాదు. ‘‘సింహాలు, పులులు, నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, విషసర్పాలను వెతికి మరీ కాల్చి చంపారు. జపాన్ విసిరే బాంబులు కనుక జంతు ప్రదర్శన శాలలను, వాటì కదలికలను నియంత్రించి ఉంచిన ఆవరణలను (ఎన్క్లోజర్లు) ధ్వంసం చేసినప్పుడు, వాటి నుంచి క్రూర జంతువులు స్వేచ్ఛగా బయటికి ఉరికి, మనుషుల మీద పడకుండా నివారించటానికి ముందస్తుగానే వాటిని చంపేయాలన్న ఆదేశాలు అమలు అయ్యాయి.’’ చూస్తుంటే ఆనాటి జరగని ఘటనకు అత్యధిక మూల్యం చెల్లించుకున్నది జంతువులే అనిపిస్తోంది. నిజంగా ఇటువంటిదే లండన్‌లో జరిగింది. ‘‘1939 సెప్టెంబర్ ఆరంభంలో, యుద్ధం మొదలైన మొదటి వారం... విస్తుగొల్పేటంతటి స్థాయిలో 4 లక్షల నుంచి 7 లక్షల 50 వేల దాకా పిల్లులు, శునకాలను చంపేశారని అంచనా.’’ అంటే, బ్రిటిష్ ప్రజలు తమ పెంపుడు జీవు లను త్యాగం చేయటానికి కూడా సంకోచించనంతగా ప్రేమిస్తారు! మద్రాసు గవర్నరు పారిపోయి ఉండకపోవచ్చు. కానీ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు చేసింది కచ్చితంగా పారిపోవటమే! సర్ సిడ్నీ వాడ్స్‌వర్త్ ‘‘రెండు కార్లలో తన సతీమణి, డ్రైవరు, బట్లరు, కుక్, మూడు పెంపుడు శునకాలతో అనంతపురం బయలుదేరారు. తమ వాహనాల పైభాగాన పరుపులను కట్టి, వాటిల్లో పింగాణీపాత్రలు, గిన్నెలు, బట్టలు, న్యాయశాస్త్ర గ్రంథాలు, వెండి దీపాల వంటి అవస రమైన, విలువైన సామగ్రిని కుక్కేశారు’’. తిరిగి రెండు వారాల తర్వాత ఆయన వెనక్కు వచ్చారు. ఒక మంచి ఉల్లాసభరితమైన సెలవు సమయాన్ని గడిపాక! ఐ.సి.ఎస్. అధికారులు మద్రాసును విడిచిపెట్టి పోలేదు. బదు లుగా వారు జపాన్ సేనలకు చుక్కయినా దక్కకుండా ఉండేందుకు ‘గొప్ప’ మార్గాలనే కనిపెట్టారు. చెట్టినాడు రాజా సాహచర్యంలో పాల్ జయరాజన్ మద్రాస్ క్లబ్బుల్లో పీకల దాకా మద్యం సేవించారు. తర్వాత, వారంతా కలిసి ‘‘మిగిలిన మద్యాన్నంతా కాలువలో పారబోశారు’’. ఇక జపాన్ బాంబు దాడుల గురించి చింతించాల్సినంత భయం లేని ఢిల్లీలో కవి డబ్లు్య.హెచ్. ఆడెన్ సోదరుడైన జాన్ బిక్నెల్ ఆడెన్ సౌత్ బ్లాక్‌ను రక్షించటానికి ఒక హాస్యాస్పదమైన తలతిక్క పథకాన్ని రూపొందించారు. సౌత్‌బ్లాక్ భవంతిని కనిపించనీయ కుండా చేయటం కోసం దట్టమైన పొగ మేఘాలను సృష్టించే ఒక పరికరాన్ని తయారు చేశారు. అయితే అది కేవలం కాలుష్యాన్ని వెదజల్లడానికి మాత్రమే పనికొచ్చింది. యునైటెడ్ ప్రావిన్సు (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్)లో ఒక వదంతి అనియంత్రిత ఆందోళన గాడ్పులను వ్యాపింపజేసింది. ‘‘ఒక జపాన్ మనిషి ఆకాశం నుంచి భూమిపైన జరుగుతున్న ఒక వేడుకలోని జనసమూహం మధ్యకు దిగి, వారిని ఉద్దేశించి ప్రసంగించి, తిరిగి అలాగే ఆకాశంలోకి వెళ్లిపోయాడు అనే కథ అది.’’ కళ్లారా చూసినంతగా ఆ వదంతిని అంతా నమ్మేశారు. చివరికొచ్చేసరికి పద్మనాభన్ ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు. కానీ దురదృష్టవశాత్తూ వాటికి సమాధానాలు మాత్రం చెప్పలేదు. ‘‘కేవలం ఊహాత్మకమైన దండయాత్ర ముప్పునకే భారతదేశం అంతగా ప్రభావితం అయిందా? పాలన యంత్రాంగం ఆ స్థాయిలో అప్రమత్తం అవాల్సి ఉండిందా? దేశవ్యాప్తంగా అంతగా కీకర బీకరలు అవసరమా?’’ సహజంగానే విమర్శలు వచ్చాయి. ‘‘టిబెట్‌లోకి ఉపసంహరించుకోవడానికి గానీ భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోందా? లేక, చివరికి మనం పామిర్ పర్వతాలను అధిరోహించి, ప్రపంచ పైకప్పును గానీ చేరుకోబోతున్నామా? ఇంకా ఎక్కడైనా ధైర్య సాహ సాలు మిగిలి ఉన్నాయా?’’ అని ‘ద స్టేట్స్‌మన్’ పత్రిక గొప్ప గద్దింపుతో ఉరిమింది. కానీ ఎవరూ ఆ ఉరుమును విన్నట్లు లేరు. సరే, ఇంత జరిగినా ‘ద గ్రేట్ ఫ్లా్యప్...’ రావలసినంతగా ఎందుకు గమనింపునకు రాలేదు? ఎందుకంటే, ‘‘ఇండియా వైపు నుంచి ఒక్క అధికారిక ప్రకటన, ఒక్క పరిగణన కూడా లేకపోవడం వల్ల!’’ మద్రా సును వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయిన తన తాత గారి నుంచి, తన తల్లి నుంచి పద్మనాభన్ ఆనాటి విషయాలను తెలుసుకున్నారు. వారు చెప్పిన కథల్ని ఈయన మరింతగా తవ్వి పోశారు. తత్ఫలితంగా నాటి భయాలు ఎంత విస్తృతంగా, ఎంత అతిశయోక్తితో ఉండేవో, తరచు వాటి ప్రతిస్పందన ఎంత నవ్వు పుట్టించేలా ఉండేదో ఆయన కనుగొన్నారు. ఇది కనుక మీకు డాడ్స్ ఆర్మీ (ప్రహసనం)ని గుర్తు చేసినట్లయితే, అలా గుర్తుకు రావటం తప్పేమీ కాకపోవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పరమ కంగాళీ కథానాయకుడు
ఒక దేశానికి హైకమిషనర్‌గా, విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి నుంచి తన వృత్తిపరమైన అనుభవాల రచనలను ఆశిస్తాం. కానీ కృష్ణన్ శ్రీనివాసన్ ఈ సంప్రదాయానికి పూర్తి భిన్నంగా డిటెక్టివ్ రచయితగా అవతరించారు. అయితే ఒకటి, ఆ రచనల్లోనూ ఆ యా పాత్రలు ఆ వృత్తి తాలూకు జీవితాన్ని ప్రతిఫలిస్తాయి. ఒక్కోసారి అవి రచయిత వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా కూడా కనిపించవచ్చు. క్రిస్ రచనల్లోని అపరాధ పరిశోధకుడు పదవీ విరమణ పొందిన సోమాలియా రాయబారి. పేరు మైఖేల్ మార్కో. మనకు తెలిసిన హీరో ఎలా ఉంటాడో అలా ఉండడు. తెర వెనుక ఉండి కథ నడిపిస్తాడు. అధికారాలు ఉండవు. కానీ అనధికార యుక్తి సామర్థ్యాలతో నేర రహస్యాలను ఛేదిస్తుంటాడు. అతడు తొడుక్కునే సూట్లు నలిగి ఉంటాయి. అతడి ‘టై’లు నిటారుగా ఉండవు. షూ లేసులు వదులుగా కట్టి ఉంటాయి. క్రిస్ అతడిని ‘రెట్రో–కేయాటిక్’ (పాతకాలపు పరమ కంగాళీ) అంటాడు. మాజీ విదేశాంగ కార్యదర్శుల నుంచి మీరు ఇలాంటి రచనలను ఊహించనే లేరు. ఒక పుస్తకం ఆ పుస్తక రచయిత వ్యక్తిత్వాన్ని ఎంత వరకు వెల్లడిస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? బహుశా ఆ రచయిత గురించి ముందే మీకు తెలిసి ఉంటే తప్ప మీరెప్పటికీ ఆ వైపుగా ఆలోచించరు. ఒకవేళ అలా ఆలోచిస్తే కనుక ఆ వచ్చే ఫలితం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయగలిగినదై ఉంటుంది. కృష్ణన్ శ్రీనివాసన్ విషయంలో సరిగ్గా ఇలాగే జరుగుతుంది. క్రిస్, అదే... కృష్ణన్ శ్రీనివాసన్... నలభై ఏళ్లుగా నాకు మిత్రుడు. మొదట లాగోస్‌లో మేము కలుసుకున్నాం. అప్పుడాయన హై కమిషనర్. నేను లండన్ పత్రిక ‘ది టైమ్స్’కు కరస్పాండెంట్. ఆయన విదేశాంగ కార్యదర్శిగా ఎదిగాక మా స్నేహం కూడా వికసించి విప్పారింది. రాయటం అనేది క్రిస్‌కి సంతోషం కలిగించే సంగతని నాకు తెలుసు కానీ, అపరాధ పరిశోధన రచనల్లో ఆయన ఆరితేరినవారని నాకెన్నడూ అనిపించలేదు. పదవీ విరమణ అనంతరం క్రిస్ ఏడు పుస్తకాలు రాశారు. మాజీ విదేశాంగ కార్యదర్శుల నుంచి మీరు ఇలాంటివి ఊహించనే లేరు. లేక, నేనేమైనా పొరపడ్డానా?క్రిస్ రచనల్లోని అపరాధ పరిశోధకుడు పదవీ విరమణ పొందిన సోమాలియా రాయబారి. పేరు మైఖేల్ మార్కో. మనకు తెలిసిన హీరో ఎలా ఉంటాడో అలా ఉండడు అతడు. తెర వెనుక ఉండి కథ నడిపిస్తాడు. అధికారాలు ఉండవు. కానీ అనధికార యుక్తి సామర్థ్యాలతో నేర రహస్యాలను ఛేదిస్తుంటాడు. అతడు తొడుక్కునే సూట్లు నలిగి ఉంటాయి. అతడి ‘టై’లు నిటారుగా ఉండవు. షూ లేసులు వదులుగా కట్టి ఉంటాయి. క్రిస్ అతడిని ‘రెట్రో–కేయాటిక్’ (పాతకాలపు పరమ కంగాళీ) అంటాడు. అంతేకాదు, క్రిస్ చెబుతున్న దానిని బట్టి... అతడి దుస్తులను అంధుడైన ఒక టైలర్ వాడుకగా కుడుతుంటాడు. మాక్రో... జేమ్స్ బాండేమీ కాదు. అందమైన స్త్రీల కోసం అతడు కానీ, అతడి కోసం ఆ అందమైన స్త్రీలు కానీ పరుగులు పెట్టటం ఉండదు. అతడు అలవాటుగా సేవించే మద్యం టమాటా రసం. ‘మార్టినీ’ని ఏం చేసుకోవాలో అతడికి తెలియదు. అయితే ‘‘అతడి నిశిత దృష్టికి సంబంధించి పైపైన కనిపించేదంతా మనల్ని పక్కదారి పట్టించేదే’’. అతడు ప్రతీదీ చూస్తాడు, అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే ముగింపులకు వచ్చేస్తాడు. అతడిని ఊహించుకుంటే నాకు అగాథా క్రిస్టీ అపరాధ పరిశోధక నవలల్లోని మిస్ మాపుల్ అనే కల్పిత పాత్ర స్ఫురించింది. మార్కో వంటి ఒక వ్యక్తిని క్రిస్ ఆరాధిస్తాడని నేనెప్పుడూ ఊహించలేదు. అతడి పట్ల గొప్ప ఇష్టంతో అతడి గురించి రాస్తాడని కూడా అనుకోను. క్రిస్ స్నేహితులుగా నేను ఎరిగిన వారంతా మార్కో తరహాకు పూర్తిగా భిన్నమైనవారు. నిజా నికి క్రిస్ కూడా అలాంటì వ్యక్తిని వ్యతిరే కిస్తాడు. నేను కనుగొన్న మరొక సంగతి... క్రిస్ చూపు మిక్కిలి లోతైనదని. వస్త్రధార ణను బట్టి ఎలాంటి వారో చెప్పగల నైపుణ్యం ఆయనకు ఉంది. ఆయన తాజా పుస్తకం ‘రైట్ యాంగిల్ టు లైఫ్’ లోని ఒక పురుష పాత్ర వర్ణన ఎలా ఉందో చూడండి: ‘‘రెండు రోజులుగా గడ్డం గీయని ఆకర్షణీయమైన ముఖం, పదునైన చెంప ఎముకలు, లేత గోధుమ రంగు కళ్లు, నుదుటిపై పడుతున్న దట్టమైన ముంగురులు, టమాటా రంగు ఓపెన్ నెక్ డ్రెస్ మీదకు తటస్థ వర్ణంలోని పియాహ్ కార్డాన్ లినన్ జాకెట్, చర్మానికి అంటుకుపోయే చినోస్ ప్యాంట్స్, సాక్సు వేయని స్వేడ్ లోఫర్స్ పాదరక్షలు... ఒక్క మాటలో ఒక మేల్ మోడల్ టైప్’’అంటూ... మనిషిని సాక్షాత్కరింపజేసిన ట్లే రాస్తాడు క్రిస్. స్త్రీ పాత్రలను క్రిస్ మరింత మెరుగ్గా వర్ణిస్తాడు. తాజా పుస్తకంలో... తన కథ చెప్పుకుంటూ పోయే వ్యాఖ్యాన పాత్ర కోయెల్ దేవ్... తనను తాను దృశ్యమానం చేసుకుంటూ: ‘‘ఒక చక్కటి సాధారణ వస్త్రధారణలోకి నేను మారిపోయాను. హారీమ్ ప్యాంట్స్ మీదకు పొడవాటి చేతుల వి–నెక్ సిల్కు బ్లవుజ్, దాని పైన డెనిమ్ జాకెట్ తొడుక్కుని, సెయింట్ వాలెంటైన్ లెదర్ షూజ్ ధరించాను. నా ముత్యాల చెవి దుద్దులు తీసి పెట్టుకున్నాను. బెల్లా వీటా స్ప్రేను మెడపైన, చెవుల వెనకాల చిమ్మినట్లుగా చల్లుకున్నాను. క్లినిక్ ప్లమ్ లిప్‌స్టిక్‌తో నా పెదవులను అద్దుకున్నాను’’ అని చెప్పుకుంటూ పోతారామె. క్రిస్ తనకు అప్పగించిన రాయబార విధుల్ని ఏ విధంగా పూర్తి చేసిందీ రాసి పంపేటప్పుడు కూడా ఇదే విధమైన వివరణాత్మకతను పాటించేవారా అని నేనిప్పుడు ఆశ్చర్యానికి లోనవుతున్నాను. తను సంభాషించిన వారిని ఇంత సూక్ష్మంగానే వర్ణించి ఉంటారా? ఆయన విదేశాంగ కార్యదర్శిగా ఉన్నప్పుడు మీరు ఆయన ఎదురుగా కూర్చొని ఉండగా మిమ్మల్ని కూడా ఇంతే నిశితంగా అంచనా వేయడాన్ని మీరు పసిగట్టారా? ఏమైనా ఇది కేవలం తేరిపార చూడటం మాత్రమే కాదు. సరిగ్గా అంచనా వేయటం కూడా! ఒక మూసలో కాక, వ్యక్తులకు వేర్వేరుగా ఉండే ప్రత్యేక సూక్ష్మాంశాలను కొద్దిమంది రచయితలు మాత్రమే వడకట్టగలరు. చాలామంది లేస్–అప్స్(లేసులు పైకి కనబడేట్టుగా ఉండే షూలు)కు, మాకసిన్స్(లేసులు ఉండని షూలు)కు వ్యత్యాసాన్ని గుర్తించగలరు. కానీ ఎంతమందికి ఆక్స్‌ఫోర్డ్ షూజ్కి, బ్రోగ్స్ షూజ్కి తేడా తెలిసుంటుంది? నేనేం చెబుతున్నదీ మీకు అర్థం కావడం మొదలైందా? క్రిస్ తాజా రచనలోని కాల్పనికత ఆయన వ్యక్తిత్వంలోని ఒక కోణాన్ని బహిర్గతం చేసింది. అది – మీరాయన్ని కేవలం రాయబారిగా, లేక సాయంత్రపు పార్టీలను ఇష్టపడే విలాస పురుషుడిగా మాత్రమే చూస్తుంటే కనుక మీరెప్పటికీ తెలుసుకోలేనిది! ఒక కాక్టైల్ పార్టీని ఆయన వర్ణించిన తీరు అలాంటి పార్టీల పట్ల ఆయన ఎంతగా జాగ్రత్తగా ఉంటారో సూచనప్రాయంగా తెలియ జేస్తుంది. ఇది గమనించండి: ‘‘అతిథులు మెల్లగా దగ్గరయ్యారు. తెచ్చి పెట్టుకున్న హృదయపూర్వకతల్లో కలిసిపోయారు. ప్రతి ఒక్కరూ తిరగడమే పనిగా తిరుగుతున్నారు. మళ్లీ మళ్లీ వాళ్లే వాళ్లే నిర్లక్ష్యంగా కలిపిన చేతుల్లోంచి జారి పడుతున్న పేకముక్కల్లా ఉన్నారు. పానీయాలు, నోటితో కొరికి తినగలిగినంత పరిణామంలోని నంజుళ్లు ఉన్న ట్రేలను మౌనంగా అందిస్తున్న వెయిటర్లు, వారి వెనుక – అయో మయ విశదీకరణలు, అస్పష్ట ఉపోద్ఘాతాలు, అర్థరహితంగా చెప్పిందే చెప్పడాలు, నిర్జీవ కరచాలనాలు, జవాబులే లేని వాకబులు, ఉత్సాహ పూరిత వాతావరణ ప్రస్తావనలు, హఠాన్మౌనాలు, చిత్తశుద్ధి లేని కుశల ప్రశ్నలు...’’ నిజంగానే నేను క్రిస్‌కి పార్టీలంటే ఇష్టం అనుకున్నాను. ఎంత పొరపడ్డాను! కానీ నేను చెప్పినట్లుగా – ఒక మనిషిలో మొదట మీరు అర్థం చేసుకున్న దాని కంటే చాలా ఎక్కువే ఉందని తెలుసుకోడానికి మీరు ఆ మనిషి రాసిన పుస్తకం చదవాలి. సమస్యేమిటంటే ఈసారి క్రిస్ ఎదురైనప్పుడు నేనేమి ధరించాలో నాకు తెలీదు. అలాగే నేనేం చెప్పాలన్నది కూడా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
తీక్షణ భావాల మృదుభాషి
‘‘ప్రతిపక్షం అన్నది ప్రజల అసంతృప్తిని ప్రతిఫలించే దృష్టికేంద్రం. ప్రతిపక్షమే లేకుంటే ప్రజాస్వామ్యమే ఉండదు’’ అని దృఢంగా నమ్మేవారు ఫాలీ శామ్ నారిమన్. ‘‘ప్రస్తుత పరిస్థితులతో ఎప్పటికీ మనం ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకోలేం’’ అని అనేవారు. ‘‘దారికి ఒప్పించటం, కోరినది ఇవ్వటం, ఓరిమి వహించటం’’ అనే ఔదార్యాలు లేకుండా అద్భుతమైన, వినూత్నమైన ఆలోచనలు మాత్రమే మనకొక ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని ఏనాటికీ అందించలేవు. పరిస్థితులను బట్టి చూస్తే భారతదేశంలో ప్రస్తుతం ఇవి మూడూ క్షీణించి ఉన్నాయి’’ అన్నది ఆయన అభిప్రాయం. ‘‘భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిరక్షణకు మన న్యాయమూర్తులు మరింత సుముఖంగా ఉండాలి’’ అనేవారు. ఆఫీసులో నా డెస్కుకు ఎదురుగా ఉన్న గోడకు ఫాలీ నారిమన్ ఫొటో వేలాడదీసి ఉంటుంది. అది ఆయన స్వాభావిక మృదుహాసాన్ని, మిలమిల మెరిసే కళ్లను పట్టివ్వదు కానీ, ఆయనలోని దృఢచిత్తాన్ని, ఒడుదొడు కులను తట్టుకోగలిగిన స్థితిస్థాపక గుణాన్ని మాత్రం ప్రతిఫలిస్తూ ఉంటుంది. కెమెరాలోకి గుచ్చి చూస్తూ, తన కుడి చేతితో కుర్చీ ఆన్పును దృఢంగా పట్టుకుని ఉన్న ఆయన తీరును గమనిస్తే... ఆయన – తనేమిటో తనకు తెలిసిన మనిషి అనీ, తనను తాను స్వీయ స్పృహ లేకుండా వ్యక్తపరచుకోగలరనీ మీరు పసిగట్టగలరు. ఆ గోడపైన ఉన్నది – ఆయన చివరి పుస్తకం ‘యు మస్ట్ నో యువర్ కాన్స్టిట్యూషన్’ ఆవిష్కరణ సందర్భంగా ఆయనతో నా చివరి ఇంటర్వ్యూకు ముందరి ఇంటర్వ్యూలో తీసిన ఫొటో. ఆ ఇంట ర్వ్యూలో ఆయన మాట్లాడిన చాలా విషయాలు మన దేశానికి ఒక సందేశం అనే నేను నమ్ముతున్నాను. ప్రసిద్ధ బ్రిటిష్ న్యాయ–విద్యావేత్త ఐవర్ జెన్నింగ్స్‌ను అంగీకా రంగా ఉటంకిస్తూ, నారిమన్ ఇలా అన్నారు: ‘‘పార్లమెంటులో అత్యంత ముఖ్యమైన వ్యవస్థ ప్రతిపక్షమే అని అనడంలో అవాస్తవ మేమీ లేదు. ప్రతిపక్షం అన్నది ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం. ప్రజల అసంతృప్తిని ప్రతిఫలించే దృష్టికేంద్రం. ప్రభుత్వం ఎంత ముఖ్య మైనదో, ప్రతిపక్షం పనితీరు కూడా దాదాపుగా అంతే ముఖ్యమైనది. ప్రతిపక్షమే లేకుంటే ప్రజాస్వామ్యమే ఉండదు.’’ అలా అని ప్రభుత్వాన్ని మనం ఎలా ఒప్పించగలమని ఇంటర్వ్యూ మధ్యలో నేను అడిగినప్పుడు, ఆయన నవ్వి ఊరుకున్నారు. అది నేను చేయగలిగిందైతే కాదు అన్నారు. ఏమైతేనేం, ఆయనే ఆ తర్వాత ‘‘నాకొచ్చిన సందేహాన్నే మీరు వ్యక్తం చేయటం నాకెంతగానో సంతోషంగా ఉంది’’ అన్నారు. నారిమన్ మాట్లాడే ధోరణి సూటిగా, సందర్భశుద్ధితో ఉంటుంది తప్ప... ఎప్పుడూ కూడా బాధించేలా, అభ్యంతరకరంగా ఉండదు. కొన్నిసార్లు ఆయనే మిమ్మల్ని మెల్లగా నడిపిస్తున్నారని కూడా మీరు తెలుసుకోలేరు. ఉదాహరణకు, బహుశా మేము తొలిసారి కలుసు కోవటం రచయిత పత్వంత్ సింగ్ ఇంట్లోననుకుంటా... ఆయన నా భుజం చుట్టూ చేయి వేసి – మిగతావాళ్లంతా డైనింగ్ టైబుల్ దగ్గర్నుంచి డ్రాయింగ్ రూమ్‌కు కదులుతూ ఉండగా – నన్ను ఒక మూలకు తోడ్కొని వెళ్లారు. ‘‘గుర్తుంచుకో! పత్వంత్ ఎప్పుడూ కూడా చివరి మాట తనదే కావాలని కోరుకుంటాడు. అలా ఉండేందుకు మీరు ఆయన్ని అనుమతిస్తే ఎప్పటికీ మీ స్నేహితుడిగా ఉంటాడు’’ అన్నారు. బాగా గుర్తు... పత్వంత్ని నేను ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూనే ఉన్నాను. సన్నటి గీతను దాటేస్తున్నానేమోనని నారిమన్ నన్ను నెమ్మదిగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అతి సమీపంగా ప్రస్తావనకు వచ్చిన అనేక అంశాలపై ఇంటర్వ్యూలో నారిమన్ ఇదే విధమైన సున్నిత శైలిని అవలంబించారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికీ మనం ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకోలేం’’ అని ఆయన అన్నారు. ‘‘దారికి రప్పించటం, కోరినది ఇవ్వటం, ఓరిమి వహించటం’’ అనే ఔదార్యాలు లేకుండా అద్భుతమైన, వినూత్నమైన ఆలోచనలు మాత్రమే మనకొక ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని ఏనాటికీ అందించలేవు. ‘‘పరిస్థి తులను బట్టి చూస్తే భారతదేశంలో ప్రస్తుతం ఇవి మూడూ క్షీణించి ఉన్నాయి’’ అన్నారాయన. ఇటీవలి ఆయన మరణం తర్వాత నేను మళ్లీ ఆనాటి ఇంట ర్వ్యూను విన్నాను. నారిమన్ ఎంత బుద్ధిశాలిగా మాట్లాడారో వెంటనే గమనించాను. ‘‘రాజ్యాంగంలో ప్రవేశిక చాలా ముఖ్యమైన భాగం’’ అన్నారు. ప్రవేశికను ఆయన రాజ్యాంగం యొక్క మనస్సాక్షి అన్నారు. ప్రవేశికలోని ‘సౌభ్రాతృత్వం’ అనే భావన గురించే ఆనాడు ఆయన నొక్కి మాట్లాడారా? ప్రవేశికలో మాత్రమే ఉన్న మాట అది. ఆ తర్వాత ‘సహనశీలత’ వైపుగా మా సంభాషణను నడిపించింది నేను కాదు, ఆయనే! ప్రస్తుతం సమస్యేమిటంటే మనకు ‘‘సహనం లేదు’’ అన్నారాయన. మళ్లీ ఆ తర్వాత కూడా ఈ మాట అనడం కోసం ఆయన తన పుస్తకం హద్దులను సైతం దాటేశారు. ఆప్పుడు నేను పట్టుకోలేకపోయాను కానీ, ఇప్పుడు ఆయన మరణం తర్వాత ఆలోచిస్తే ఆయన ఎంత జాగ్రత్తగా ఆ సందేశాలు ఇచ్చారో కదా అని ఆశ్చర్యం కలుగుతోంది. మరికొన్ని కూడా ఉన్నాయి. భారత పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని నిలబెట్టేందుకు మన న్యాయమూర్తులు మరింత సుముఖంగా ఉండాలి అన్నారు. అలా ఉండేందుకు వారు ఇష్టపడకపోవటం ఆయన్నెంతో నిరాశకు గురి చేసింది. అయితే వారిని తీవ్రంగా విమర్శించేందుకు సంకోచించి, ‘క్యురేట్స్ ఎగ్’తో పోల్చి సరిపెట్టుకున్నారు... మంచీ ఉందీ, చెడూ ఉందీ... అయితే మంచిని చెడు తినేస్తోంది అనే అర్థంలో! నారిమన్‌తో నేను పలు ఇంటర్వ్యూలు చేశాను. తొలినాళ్లలో ఆయన స్పోర్టింగ్ బ్రేసెస్‌ని ధరించి ఉండేవారు. నాకు బౌ టై ఉండేది. మా మధ్య సంభాషణ గొప్ప శక్తితో, ఆసక్తితో సాగేది. మధ్యలో స్నేహ పూర్వకమైన అంతరాయాలను కలిగించుకునేవాళ్లం. ఉల్లాసం, ఉత్సాహం తరచూ మా ఇంటర్వ్యూలను నడిపించేవి. అవును, మా సంభాషణ గురించి ఇలాగే చెప్పాలి. ఆయన భార్య బాప్సి ఓ వైపున కూర్చొని ఉండి మా సంభా షణను ఆలకిస్తూ ఉండేవారు. దాదాపు ప్రతిసారీ ఆమె నన్ను భోజనానికి ఉండమనేవారు. ఆమె అలా అనడమే ఆలస్యం నేను భోజనా నికి తయార్! ఆయన నాతో పాటుగా కారు వరకు బయటికి నడిచి వచ్చేవారు. నేను వారికి వీడ్కోలు చెబుతున్నప్పుడు... ‘‘ఆమెకు నువ్వంటే అభిమానం’’ అని నవ్వుతూ అనేవారు. ఆ గుణం కూడా ఆయన గురించిన సముచితమైన విశేషణమే. ఆయన పట్ల నాకు గొప్ప గౌరవభావం. ఆయన మేధ నన్ను ముగ్ధుడిని చేసేది. మనసులో ఏదీ దాచుకోలేని ఆయన స్వభావం, ఒక సరైన పని చేయటంలో ఆయనకు ఉండే నిస్సంశయ నిబద్ధత నన్ను ఆశ్చర్యచకితుడిని చేసేవి. నేను కూడా ఆయనపై అభిమానం పెంచు కున్నాను. పెద్దగా పరిచయం లేకుండానే ఏర్పడే ఆప్యాయత వంటిది ఆ అభిమానం. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇచ్చిన హామీ కోసమే ఇంత పట్టు!
వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే వారు అడుగుతున్నారని అర్థం. ఇంకోలా చెప్పాలంటే... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాత్రమే వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వానికయ్యే ఖర్చు పది లక్షల కోట్ల వరకు ఉంటుందన్నది తప్పు. ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయలనేది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఆర్థికశాస్త్రాన్ని ఆకళింపు చేసుకోవటం దుర్ల భమనీ, అందులోని వ్యవసాయ ఉపాంగం గందరగోళ పరుస్తుందనీ భావించే వ్యక్తి మీరైతే గనుక... కనీస మద్దతు ధరకు ప్రభుత్వం చట్టపరమైన హామీ ఇవ్వాలన్న రైతుల డిమాండ్ గురించీ, అసలు కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలన్న విషయం గురించీ రెండు వైపుల నుంచి వినవస్తున్న పూర్తి భిన్నాభి ప్రాయాలను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఐసీఆర్ఐఈఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్) వ్యవసాయ సమాచార విభాగం ప్రొఫెసర్ అశోక్ గులాటీ తనకున్న వృత్తిపరమైన సౌలభ్యం ఆధారంగా కొన్ని కీలకమైన విషయాలను ప్రస్తావనలోకి తెచ్చారు. మొదటిది, భారతదేశంలోని మొత్తం వ్యవసాయ ఉత్పత్తులలో 27.8 శాతం మాత్రమే కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్ –ఎంఎస్పీ) వర్తింపు కిందికి వస్తాయి. తత్ఫలితంగా 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే ఎంఎస్పీ వల్ల లబ్ధి పొందుతున్నాయి. అత్యంత వేగంగా 8–9 శాతంతో పుంజుకుంటున్న కోళ్ల పరిశ్రమ, 7–8 శాతంతో దూకుడు మీదున్న మత్స్య పరిశ్రమ, 5–6 శాతంతో పొంగిపొర్లుతున్న పాల ఉత్పత్తి వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలు ఎంఎస్పీ పరిధిలోకి రావు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా 23 రకాల దిగుబడులకు కనీస మద్దతు ధరను చట్ట పరమైన హామీగా ఇవ్వటం అన్నది ‘రైతు వ్యతిరేక చర్య’ కావచ్చునని గులాటీ అభిప్రాయం. ఎంఎస్పీ అన్నది మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్న సందర్భాలలో ప్రైవేటు వ్యాపారులు పంట దిగు బడులను కొనుగోలు చేయటానికి నిరాకరిస్తారు. ఆ కారణంగా అమ్ముడు కాని వ్యవసాయ ఉత్పత్తులు రైతుల దగ్గర భారీగా మిగిలి పోతాయి. చివరికి ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆ మిగులును కొనుగోలు చేయక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. మొదటిది రైతుకు విపత్కరమైనది. రెండోది ప్రభుత్వానికి ఆర్థికపరమైన చిక్కులను తెచ్చిపెట్టి, బడ్జెట్‌నే తలకిందులు చేసేది. అయితే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ హిమాన్షు ఈ వాదనను అంగీకరించడం లేదు. వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ... వాస్తవానికి గోధుమ, వరికి తప్ప మిగతా వాటికి మొదటసలు ఎంఎస్పీ అమలే కావటం లేదు. అయినప్పటికీ రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల ఎంఎస్పీకి చట్టపరమైన హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే అడుగుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇంకోలా చెప్పాలంటే, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం అది! ఎంఎస్పీ అమలు వల్ల కేవలం 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందటానికి కారణం... ఆచరణలోకి వచ్చే టప్పటికి గోధుమ, వరికి తప్ప మిగతా రకాల దిగుబడులకు అది అమలు కాకపోవటమేనని హిమాన్షు అంటారు. వాటికీ అమలయ్యే పనైతే అప్పుడు లబ్ధిదారుల శాతం 30 వరకు, ఇంకా చెప్పాలంటే 40 వరకు పెరగొచ్చు. రెండోది... కోళ్లు, చేపలు, పాడి వంటి కొన్ని పరిశ్రమలు కనీస మద్దతు ధర లేకున్నా అభివృద్ధి చెందుతున్నాయంటే అర్థం పంటలకు అవసరం లేదని కాదనీ, అదొక తూగని వాదన అనీ హిమాన్షు అంటారు. మరీ ముఖ్యంగా, హిమాన్షు అనడం – ఎంఎస్పీ అనేది «ధరల స్థిరీకరణకు ఒక సాధనం అని! నిజానికి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో కనీస మద్దతు ధర సదుపాయం లేని రైతులు చాలా తక్కువ. రెండోది – ఎంఎస్పీ కనుక మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వమే ప్రతిదీ కొనేస్తుందని కాదు. మొదట ఆ రెండు ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించటం వరకు మాత్రమే ప్రభుత్వం ఆ పని చేయవలసి ఉంటుంది. ఒకసారి అలా చేస్తే మార్కెట్ ధరలు వాటంతట అవే పెరుగుతాయి. ఆ దశలో ప్రభుత్వ జోక్యం నిలిచి పోతుందని అంటారు హిమాన్షు. ఎంఎస్పీ అనేది ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీగా ప్రజలలో ఒక భావన ఉందన్న దానిపైన మాత్రం గులాటీ, హిమాన్షు ఇద్దరూ అంగీకరిస్తున్నారు. కనీస మద్దతు ధరను వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీగా వారు భావిస్తున్నారు. ఉదాహరణకు, ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నప్పుడు అది ఆ ప్రజలు పొందుతున్న సబ్సిడీ అవుతుందని హిమాన్షు అంటారు. అలాగే ఇద్దరూ కూడా కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇచ్చేందుకు అయ్యే ఖర్చును అంచనా వేయటం అంత తేలికైన విషయమైతే కాదని అంగీకరిస్తున్నారు. ప్రాంతానికీ ప్రాంతానికీ అంచనాలు మారుతుండటం మాత్రమే కాదు; అప్పటికి ఉన్న మార్కెట్ ధర, ఆ మార్కెట్ ధరకూ – ఎంఎస్పీకీ మధ్య ప్రభుత్వం ఎంత భారీగా వ్యత్యాసాన్ని తగ్గించాలి, ఎంతకాలం ఆ తగ్గింపు కొనసాగాలి అనే వాటి మీద అంచనాలు ఆధారపడి ఉంటాయి. హిమాన్షు మరో అంశాన్ని కూడా లేవనెత్తారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ధరకూ, ప్రభుత్వం అమ్మే ధరకూ మధ్య వ్యత్యాసమే ప్రభుత్వానికి అయ్యే అసలు ఖర్చు అని ఆయన అంటారు. అంటే కనీసం పాక్షికంగానే అయినా ఖర్చు ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇచ్చేందుకు కాగల ఖర్చు పది లక్షల కోట్లు అన్న లెక్క స్పష్టంగా తప్పు. నిజానికి ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయల లెక్క వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలి? ఉత్పత్తి ఖర్చును, అందులో 50 శాతాన్ని లాభంగా కలిపి లెక్కించాలా? అలా చేస్తే ఆహార ద్రవ్యోల్బణం 25 నుంచి 35 శాతం పెరుగుతుందని గులాటీ అంటారు. అంతేకాక బడ్జెట్లో భారీ కేటాయింపులు అవసరమై, ప్రభుత్వ ఆహార పథకం అమలులో ఆర్థికపరమైన సంకట స్థితులు తలెత్తవచ్చు. ప్రముఖ ఆర్థికవేత్త స్వామి నాథన్ అయ్యర్ కూడా 50 శాతాన్ని లాభంగా కలిపి మద్దతు ధర ఇవ్వటం సహేతుకం కాదని అంటున్నారు. ఈ వాదనలతో హిమాన్షు విభేదిస్తున్నారు. ప్రభుత్వం చెబు తున్నట్లు ఇప్పటికే సీ2 (ఉత్పత్తి వ్యయం), అందులో 50 శాతం మొత్తాన్ని కలిపి వరికి, గోధుమలకు కనీస మద్దతు ధరలు వర్తింపజేస్తున్నారు. అయినప్పటికీ గులాటీ భయాలకు దగ్గరలో కూడా ద్రవ్యోల్బణం లాంటిదేమీ లేదని అంటున్నారు. ఇక అయ్యర్ సహేతుకం కాదన్న 50 శాతం లాభం గురించి మాత్రం, కావాలంటే అందులో మార్పులు చేసుకోవచ్చన్నారు. అయితే రైతులకు తగిన ప్రతిఫలం అవసరం. అలా పొందిన ప్రతిఫలాన్ని వారు తిరిగి ఖర్చు చేయటం అన్నది దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ అభివృద్ధి అక్కడితో ఆగదు అంటారు హిమాన్షు. చివరి ముఖ్య విషయం. రైతుల ఆదాయాలను పెంచడానికి ఉత్తమమైన మార్గం... అధిక విలువ గలిగిన పంటల వైవిధ్యానికి వ్యవసాయ ప్రోత్సాహకాలను అందివ్వటం అని గులాటీ అంటారు. దీనికి స్పందనగా హిమాన్షు ఎంఎస్పీని మొత్తం 23 రకాల పంటలకు వర్తింపచేస్తే చాలు వైవిధ్యాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని అంటున్నారు. ఆయన అనటం... రైతులు వ్యాపారులు కూడాననీ, అందువల్ల ప్రోత్సాహాలను పొందటానికి మొగ్గు చూపుతారనీ!ఇదేమైనా మీకు ఉపకరించిందా? ఉపకరించిందనే భావిస్తాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
డ్రాగన్‌కు పావురంతో పనేంటి?
కాళ్లకు లోహపు రింగులు, రెక్కల వెనుక చైనీస్ అక్షరాలున్న ఒక పావురాన్ని గత మే నెలలో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకుని, ఎనిమిది నెలల పాటు ‘కస్టడీ’లో ఉంచారు. ‘అనుమానాస్పదమైన సమాచారం’ లభించకపోవడంతో విడుదల చేశారు. చివరకు అది తైవాన్ నుంచి తప్పిపోయి వచ్చిన రేసు పావురం అని తేలింది. ఇవి రోజుకు వెయ్యి కిలోమీటర్లు ఎగరగలవు. భారత అధికారులు ఒక పావురాన్ని బంధించటం ఇదే మొదటిసారి కాదు. 2015లో, 2020లో కూడా ఇలా జరిగింది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల కాలంలో పావురాలను నిఘా కోసం ఉపయోగించారు. కానీ గూఢచర్యం కోసం ఇప్పుడు అనేక అత్యాధునిక సాధనాలు ఉన్నప్పుడు, చైనా ఒక రేసు పావురాన్ని వదిలిపెడుతుందా? తరచూ మన దేశంలో చిత్ర విచిత్రాలు, అద్భుతమైన విషయాలు సంభవిస్తూ ఉంటాయని మనందరికీ తెలుసు. అసలలా ఉండటమే ఇండియాను ఉత్సుకతను రేకెత్తించేలా, ఉత్తేజం కలిగించేలా, అనేకసార్లు ఊహాతీత మైనదిగా చేస్తుంటుంది. అయితే ‘ద వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలో ఇటీవల వచ్చిన ఒక కథనం ఇవేవీ కానటువంటి పూర్తి భిన్నమైన కొత్త కోణాన్ని ఇండియాకు జోడించింది. నిజం చెప్పాలంటే, ఆ కొత్త కోణాన్ని నేను ఏ విధంగానైనా వివరించగలనేమో నాకు తెలియటం లేదు. మీకే వదిలేస్తాను. ‘ద పోస్ట్’లో వచ్చిన కథనం ఇలా మొదలౌతుంది: ‘‘చైనా తరఫున గూఢచర్యానికి వచ్చి వాలిందన్న అనుమానంపై ఎనిమిది నెలల పాటు బందీగా ఉంచిన ఒక పావురాన్ని చివరికి అది గూఢచారి ఏజెంట్ కాదనీ, దిక్కుతోచక దారి తప్పి వచ్చిన తైవాన్ రేసింగ్ పక్షి అనీ నిర్ధారించుకున్న భారత అధికారులు దానికి విముక్తి కల్పించారు.’’ కాళ్లకు లోహపు రింగులు, రెక్కల వెనుక ఈకల చాటున చైనీస్ అక్షరాలు కలిగి ఉన్న ఈ పావురాన్ని గత మే నెలలో ముంబైలోని ఒక ఓడరేవు సమీపంలో కనిపెట్టిన పోలీసులు దానిని అదుపులోకి తీసుకుని, ఎనిమిది నెలల పాటు ‘కస్టడీ’లో ఉంచారు. ‘‘లోతైన మరియు సరైన దర్యాప్తుతో పాటుగా, అనేక విచా రణలను’’ జరిపిన అనంతరం ‘‘అనుమానాస్పదమైన సమాచారం గానీ, తగిన సాక్ష్యాధారాలు గానీ’’ తమకు లభించలేదని ముంబై పోలీసులు చెప్పినట్లు ఆ పత్రిక నివేదించింది. తదనుగుణంగా – ఇప్పటికి దాదాపు మూడు వారాల క్రితం – విడుదలైన ఆ పక్షి మంచి ఆరోగ్యంతో ఉంది. ‘ద పోస్ట్’ పత్రిక సంప్రదించిన నిపుణులు చెప్పటం ఏమిటంటే– బహుశా ఆ పావురం పరుగు పందేల్లోని పక్షి అయుండి, ‘‘తైవాన్ తీరానికి సమీపంలో జరిగిన రేసింగ్ పోటీల నుంచి దారి తప్పి, అక్కడి నుంచి పడవలో దాదాపు 3,000 మైళ్లు ప్రయాణించి’’ ఉండొచ్చని! అయితే రేసు పావురాల వ్యాపారం చేస్తుండే తైవాన్ కంపెనీ ‘నైస్ పీజన్’ యజమాని యాంగ్ త్సంగ్–టే ‘‘ఒక రేసు పావురం ఒక రోజులో 1,000 కిలోమీటర్ల వరకు ఎగరగలదనీ, అయితే అది ఇండియా వరకు ఎగురుతూ వెళ్లగలిగిందీ అంటే మధ్యలో కొన్ని మజిలీలు చేసి ఉంటుందనీ’’ అన్నారు. ‘‘ఏమైనా, కొన్ని పావురాలు తైవాన్ తీర ప్రాంతం నుంచి యూఎస్, కెనడా వరకు కూడా వచ్చిన ఉదంతాలు ఉన్నాయి’’ అని ఆ పత్రిక రాసింది. తైవాన్, ఉత్తర అమెరికాల మధ్య విస్తారమైన మహా సముద్ర జలం తప్ప వేరే ఏమీ లేనందున, పక్షులు అంతదూరం ఎలా వెళ్లగలిగాయో నాకైతే అంతు పట్టటం లేదు. ఒకవేళ పావురాలకు ఈత కొట్టటం గానీ తెలిసి ఉంటుందా? భారత అధికారులు ఒక పావురాన్ని పట్టి బంధించటం ఇదే మొదటిసారి కాదు. ‘ద పోస్ట్’ చెబుతున్న దానిని బట్టి 2015లో,మళ్లీ 2020లో ఇలా జరిగింది. ఆ సందర్భంలోనే... ‘‘భారీ సైనిక మోహరింపులతో ఉండే సరిహద్దుల మీదుగా ఎగిరొచ్చిన ఒక పాకి స్తానీ మత్స్యకారుడి పావురాన్ని పోలీసులు స్వల్పకాలం పాటు అదుపులోకి తీసుకున్నారు.’’ ఇప్పుడు మీరు వృత్తి పట్ల ఎంతో నిబద్ధతను కలిగి ఉన్న ముంబై పోలీసులను చూసి పరిహసించే ముందు, చరిత్రలో పక్షుల గూఢ చర్యం నిజంగానే ఉండేదని ఆ పత్రిక రాసిన విషయాన్ని గమనించాలి. ‘‘మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ... పావురాల ఛాతీకి కెమెరాలను కట్టి శత్రు దేశాల గుట్టుమట్లను కనిపెట్టేందుకు వాటిని ప్రయోగించేది. పక్షి కంటే కూడా ఆ పక్షికి కట్టిన కెమెరా పెద్దదిగా ఉండేదని నేను రూఢిగా చెప్పగలను. ‘‘రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలు (జర్మనీని వ్యతిరేకించే బ్రిటన్, రష్యా, అమెరికా, చైనా మొదలైన దేశాలు) తమ మధ్య రహస్య సందేశాల బట్వాడాకు పక్షులను ఉపయోగించాయి.’’ దీని వెనుక ఉండే కారణానికి పెద్ద వివరణేమీ అక్కర్లేదు. ‘‘పావురాలు సాధారణ పక్షి జాతులు. కెమెరా కట్టి ఉన్న పావురాలైనా సరే, గూఢచారి పక్షుల్లా ప్రత్యేకంగా కాక, వేలాది ఇతర పక్షుల కార్యకలాపాల మధ్య దాగిపోయేవి’’ అని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ చెప్పడమే కాకుండా, అలాంటి ఒక రహస్య కెమెరాను సైతం వృద్ధి చేసింది. స్వయంగా సీఐఏనే ఈ విషయాన్ని వెల్లడించింది కనుక అది నిజమే అయి వుంటుంది. అయితే ‘ద పోస్ట్’ సంప్రదించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయమై ఏకాభిప్రాయాన్నేమీ కలిగి లేరని తెలుస్తోంది. న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ‘ద గ్లోబల్ పీజన్’ పుస్తక రచయిత కాలిన్ జరోల్మాక్కు ఇందులో భారతదేశ అసంబద్ధ పరిస్థితే కనిపించింది. ఆ స్థితిని సరిగ్గా చెప్పాలంటే, ‘చాలా హాస్యాస్పదం’ అన్నారు. ‘‘గూఢచర్యం కోసం చైనా అనేక అత్యాధునిక సాధనాలను కలిగి ఉందనీ, వాటిని విజయవంతంగా భారత్‌పై ప్రయోగిస్తుంది తప్పితే, రేసు పావురాలనైతే వదిలిపెట్టదు కదా’’ అని కాలిన్ జరోల్మాక్ వ్యాఖ్యానించారు. కావొచ్చు! నేను కిటికీ దగ్గర కూర్చొని, పావురాల ‘గూ.. గూ’ లను వింటు న్నప్పుడు, అవి నాపై నిఘా పెట్టేందుకు రాలేదు కదా అని అనుకోకుండా అయితే ఉండలేకపోయాను. నేను ఏం చేస్తున్నానో మన ప్రియమైన ప్రభుత్వం ఈ విధంగానే తెలుసుకుంటుందా? పావురాలు తరచూ కిటికీ అంచులపైన కనిపించడానికి కారణం అవి తమ రెట్టలను అక్కడ వదిలి వేయడానికే అయుంటుందా అన్నది నేను కచ్చితంగా చెప్పలేను. అయితే వాటి చిన్నికళ్ల లోతుచూపులను బట్టి, అక్కడ అవి వదిలిన దాని కన్నా ఎక్కువగా తీసుకుని ఉంటాయా అని యోచిస్తాను. కాబట్టి, ఈసారి ఒక పక్షి మీ తలపైన ఎగురుతూ ఉండటాన్ని, లేదా ఒక చెట్టు కొమ్మపై కూర్చొని కిందికి చూస్తూ ఉండటాన్ని మీరు గమనించినప్పుడు అది ఏదైనా ప్రయోజనం కోసం అక్కడికి వచ్చి వాలిందా అని ఆలోచించండి. బహుశా అంతదూరంలోని బీజింగ్ నుండి కాకపోయినా, దగ్గర్లోని ‘సౌత్ బ్లాక్’ (ప్రధానమంత్రి కార్యా లయం ఉండే చోటు) నుండి అది వచ్చి ఉండొచ్చు. అలాంటి పక్షులకు మేత మాత్రం వేయకండి. మనం వాటికి అందించే ఆహారపు తునకలు అవి తమ యజమానుల నుండి పొందే ప్రతిఫలాల ముందు పెద్ద విషయమేం కాదు. చివరిగా, ఈ వ్యాసం పక్షులకు సంబంధించినదని మీరనుకుంటే కనుక మీరలా అనుకోవటం సరైనదే కావచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
లౌకిక వాదానికి హిందుత్వ వారధి
‘భారతరత్న’ లభించడంతో వార్తలలోకి వచ్చిన బీజేపీ రాజకీయ దిగ్గజం లాల్ కృష్ణ అద్వానీ విలక్షణమైన నాయకుడు. ఆయన మాటల్లో దాపరికాలు ఉండవు. తన తప్పును అంగీకరించడానికి భేషజ పడటం ఉండదు. అవసరం అయితే క్షమాపణ అడిగేందుకు కూడా సుముఖంగా ఉంటారు! స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడిన నాయకుడాయన. హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆయనంతటి ఆత్మనిశ్చయం గల శక్తిమంతులు ఓ గుప్పెడు మంది మాత్రమే కనిపిస్తారు. పరస్పర వైరుధ్యం కలిగిన హిందుత్వానికి, లౌకికవాదానికి మధ్య వారధి నిర్మించే ప్రయత్నంలో అద్వానీ... లోకమాన్య తిలక్, గాంధీజీల దృక్పథాన్ని అనుసరించారు. నాకు చాలాకాలంగా, అతి సన్నిహితంగా పరిచయం ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు – ఆయన ద్వారా ఆయన కుటుంబం కూడా – లాల్ కృష్ణ అద్వానీ అని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఒక కాలం ఉండేది... నేను ఆయన విశ్వాసాన్ని స్పష్టంగా గెలుపొందిన కాలం; కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో నా సలహాను సైతం ఆయన తీసుకున్న కాలం. ఆ క్రమంలో ఆయన నన్ను భారత రాజకీయాలలోని గుంభనమైన అంతర్గత కార్యకలాపాలపైన కూడా నా దృష్టి చొరబాటును అనుమతించారు. ఇప్పుడు ఆయనకు ‘భారతరత్న’ లభించడంతో ఆయనతో నా మొదటి ఇంటర్వ్యూ నా మదికి, మననానికి వచ్చింది. ఆయన్ని నిజమైన ప్రత్యేక రాజకీయ నాయకుడిగా మార్చిన ఆయనలోని లక్ష ణాలను సంగ్రహించిన ఇంటర్వ్యూ అది. తన మాటల్లో దాపరికాలు లేకుండా, నిజాయితీగా ఉండే నాయకుడు మాత్రమే కాదాయన... తన తప్పుల్ని అంగీకరించడానికి సైతం సుముఖంగా ఉండేవారు. అవసరం అయితే ‘మన్నింపు’ను కోరేవారు. ఆయన లాంటి రాజకీయ నాయకులు అతికొద్ది మంది మాత్రమే నాకు తెలుసు. 1990లో అద్వానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు నేను – ఆ ముందరే ఇండియాకు తిరిగి వచ్చిన – ఒక అనామక జర్నలిస్టుని. ‘హిందూస్థాన్ టైమ్స్ ఐవిట్నెస్’ ప్రారంభ ఎపిసోడ్ కోసం ఆ ఇంటర్వ్యూను చేశాన్నేను. డిసెంబరు నాటి ఒక అహ్లాదకరమైన అపరాహ్నవేళ అద్వానీ పండారా పార్క్ నివాసంలో ఆయనతో కలిసి కూర్చున్నాను. మరీ దీర్ఘంగా ఏం కాదు, బహుశా కేవలం పది నిముషాలు మా మధ్య సంభాషణ జరిగినట్లుంది.అందులోని చిన్న భాగం ఇది: కరణ్ థాపర్: మీరు అధికారంలో ఉండి ఉంటే కనుక ఇండియాను హిందూ దేశంగా మార్చేవారా? ఒక అధికారిక హిందూ దేశంగా? ఎల్.కె. అద్వానీ: ఇంగ్లండ్ క్రైస్తవ దేశం అయినట్లే, ఇండియా హిందూ దేశం అని నేను నమ్ముతాను. ఇందులో ఎక్కువ తక్కువలేం లేవు. ‘‘మీరు మాటలతో ఆడుకుంటారనే భావన చాలామందిలో ఉంది. కాబట్టి హిందుత్వం అంటే అర్థం ఏంటో చెప్పండి? హిందుత్వం కోసం మీరు నిలబడతారా, లేక తడబడతారా? హిందు త్వానికి మీరు అనుకూలమేనా?’’ ‘‘నేను స్వచ్ఛమైన, సరళమైన జాతీయవాదం కోసం నిలబడతాను. కానీ తన హైందవ దుస్తుల్ని తొలగించుకున్న దిగంబర జాతీయవాదం అర్థం లేనిదని నమ్ముతాను. ఇంతకు మించి చెప్పేదేం లేదు.’’ ‘‘ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం. కచ్చితంగా ఇదీ అని చెప్పండి. మీరు కోరుకుంటున్నది లౌకిక భారతదేశాన్నా లేక హిందూ భారతదేశాన్నా?’’ ‘‘నిశ్చయంగా, నిజాయితీగా నేను లౌకిక భారతదేశం కోసమే నిలబడతాను.’’ ‘‘అక్కడే సమస్య వస్తోంది మిస్టర్ అద్వానీ. చాలామంది ప్రజలు మీరు అనుకూలంగా ఉన్న హిందుత్వకు, మళ్లీ మీరే అనుకూలంగా ఉన్న లౌకికవాదానికి మధ్య తీవ్రమైన వైరుధ్యాన్ని చూస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు మీరు వంతెన వేయలేరని అనుకుంటున్న వాటికి మీరు వంతెన వేయటానికి ప్రయత్నిస్తున్నారు.’’ ‘‘నేను విశ్వసిస్తున్నది లౌకికవాదం పట్ల నెహ్రూకి, లేదా సర్దార్ పటేల్‌కు ఉన్న దృక్పథాన్ని కాదు. లోకమాన్య తిలక్‌కు, గాంధీకి ఉన్న టువంటి దానిని. అయితే ఈ దృక్పథాన్ని గత నాలుగు దశాబ్దాలలో ఎన్నికల ప్రయోజనాలు వక్రీకరిస్తూ వచ్చాయి.’’ ‘‘భారతదేశంలోని పది కోట్లమంది ముస్లింల పట్ల మీ వైఖరి ఏమిటి? వారు ఈ దేశంలోని విడదీయరాని భాగం అని మీరు విశ్వసిస్తారా?’’ ‘‘కచ్చితంగా. కచ్చితంగా. నిస్సంకోచంగా.’’ ‘‘అప్పుడైతే, దేశంలోని దాదాపు 3,000 మసీదులను కూల్చివేసి వాటి స్థానంలో దేవాలయాలు నిర్మించాలనే వీహెచ్‌పీ డిమాండ్‌కు వ్యక్తిగతంగా మీరు వ్యతిరేకం అని నేను నమ్మొచ్చా?’’ ‘‘నేను వ్యతిరేకమే.’’ ‘‘పూర్తిగా?’’ ‘‘పూర్తిగా.’’ కావలిస్తే ఈ సంభాషణను మళ్లీ చదవండి. ప్రశ్నల దృఢత్వాన్ని, జవాబులలోని నిజాయితీని గమనించండి. అద్వానీ తర్వాతి నాయకు లలో ఎవరితోనైనా ఇలాంటి సంభాషణ ఈరోజు సాధ్యం అవుతుందని నేను అనుకోను. వాళ్లు దీనిని ఏమాత్రం సహించలేరు. లేచి వెళ్లి పోతారు. అయితే అసలు విషయం, ఇంటర్వ్యూ తర్వాత ఏం జరిగిందన్నది. తర్వాత నేను ఆద్వానీని కలిసినప్పుడు ‘‘ఇంటర్వ్యూ గురించి మీరేమనుకుంటున్నారు?’’ అని అడిగాను. అందుకు ఆయన కఠిన మైన పలుకులతో... అదొక హాస్యాస్పదం అని కొందరు తనతో అన్నట్లు చెప్పి, ఒక్కసారిగా వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు! ఆయన ప్రవర్తన నన్ను నిరుత్తరుడిని చేసింది. ఆయనకు ఇంటర్వ్యూ వీడియోను పంపి, స్వయంగా తననే చూడమని కబురు పెట్టాను. ఆయన్ని ఎవరో తప్పుదారి పట్టించారని నా నమ్మకం. వారాలు, నిజానికి నెలలు గడిచినా ఆయన్నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. నేను కూడా వస్తుందని ఎదురు చూడటం మానే శాను. హఠాత్తుగా... చీకటి పడుతున్న ఒక వేసవి సాయంత్రం నా ఫోన్ మోగింది. అటువైపు ఎల్.కె. అద్వానీ. ‘‘కరణ్, నేనిప్పుడే ఇంటర్వ్యూ చూశాను. అందులో కొంచెం కూడా నాకు తప్పు కనిపించలేదు. కానీ నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దానిని సాకుగా చూపడం నా వయసుకు తగినది కాదు. మనం చివరిసారి కలుసుకున్నప్పుడు నీతో అనుచితంగా ప్రవర్తించాను. క్షమాపణలు చెప్పడానికే నీకిప్పుడు ఫోన్ చేశాను’’ అన్నా రాయన. తప్పును అంగీకరించడానికి ఏ సంకోచమూ లేని సంసిద్ధతే బహుశా అద్వానీలోని గొప్ప గుణంగా తక్షణం ఆయన పట్ల నాకు అక ర్షణ కలిగేలా చేసింది. ఆయన తర్వాత మళ్లీ అతి కొద్దిమంది రాజకీయ నాయకులు ఓ గుప్పెడు మంది భేషజాలు లేకుండా తమ తప్పును ఒప్పుకుని క్షమాపణ అడగగల శక్తిమంతులు ఉన్నారు. అద్వానీ గురించి ఇంకా మీరేం అనుకున్నా – ఆయనపై ఇతరులకు భిన్నాభిప్రా యాలు ఉంటాయని నేను అంగీకరిస్తాను – ఒక మంచి మనిషి మాత్రమే అలా ఉండగలరు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
తప్పుడు ప్రచారాలపై పాత్రికేయ అస్త్రం
ఉద్దేశపూర్వకమైన తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఇవీ అని వెల్లడించడం ఉత్తమమైన పాత్రికేయ విలువలకు ప్రామాణికం అవుతుంది. అటువంటి ఒక ప్రామాణిక గ్రంథమే సీనియర్ జర్నలిస్టులు రాసిన ‘లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్: సింపుల్ ఫ్యాక్ట్స్ టు కౌంటర్ వైరల్ ఫాల్స్‌హుడ్స్’! పుస్తకం పేరులో కనిపిస్తున్న ‘అదర్ ఫిక్షన్స్’ ఏమిటంటే... పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్లు, ముస్లింలను బుజ్జగించడం లాంటి అసత్య ప్రచారాలు. వాస్తవాల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో నుండి, మీడియా వార్తల తవ్వకాల నుండి సంగ్రహించిన కచ్చితమైన పరిశోధనాంశాలతో హాస్యాస్పద మైన అభియోగాలను రచయితలు బట్టబయలు చేశారు. 2014 తర్వాత ‘గో–సంబంధ దాడులు’ ఎంత పెరిగాయో కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ఒకవేళ మీకు కూడా నాలాగే భారతీయ పాత్రికేయ వృత్తి వైఖరులపై నిరాశ మొదలై ఉంటే, కనుచూపు మేరలో భూమ్యాకాశాలు కలిచేచోట ఒక శుభవార్త ఉందని తెలుసుకుని మీరెంతగానో సంతోషిస్తారు. అది టీవీ న్యూస్ ఛానెల్ కోసమో లేదా వార్తాపత్రిక కోసమో జరిగిన పనైతే కాదు. నిజానికి అదొక పుస్తకం. ఆ పుస్తకం అత్యున్నత పాత్రికేయ ప్రమాణాలను కలిగివుండి, ఖ్యాతిని కోల్పోతున్న వృత్తిపై విశ్వాసాన్ని పాదుగొల్పే ఒక గణనీయ పునరుద్ధరణ. ఈ రోజు నేను ఆ పుస్తకం వైపు మీ దృష్టిని మరల్చాలని అనుకుంటున్నాను. ‘లవ్ జిహాద్ అండ్ అదర్ ఫిక్షన్స్: సింపుల్ ఫ్యాక్ట్స్ టు కౌంటర్ వైరల్ ఫాల్స్‌హుడ్స్’ అనే ఆ పుస్తకాన్ని ఇద్దరు మాజీ ఎన్డీ టీవీ జర్నలిస్టులు శ్రీనివాసన్ జైన్, మరియమ్ అలావీ; ‘స్క్రోల్’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుప్రియా శర్మ కలిసి రాశారు. పుస్తకం పేరులో కనిపిస్తున్న ‘అదర్ ఫిక్షన్స్’ ఏమిటంటే... పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్లు, ముస్లింలను బుజ్జగించడం, ఇంకా సోకాల్డ్... ‘పింక్ రివల్యూషన్’. ప్రతి కేసులోనూ మొదట ఈ పుస్తక రచయితలు ఉద్దేశ పూర్వకమైన తప్పుడు ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఇవీ అని వెల్లడిస్తారు. ఆ తర్వాత వాస్తవాల నిర్ధారణకు క్షేత్రస్థాయిలో నుండి, మీడియా వార్తల తవ్వకాల నుండి సంగ్రహించిన కచ్చితమైన పరిశో ధనాంశాలతో హాస్యాస్పదమైన ఆ అభియోగాలను బట్టబయలు చేస్తారు. లేదా ఆ ఆరోపణల్లోని అవాస్తవాలను ధ్వంసం చేస్తారు. పుస్తకం గురించి నేను చెప్పవలసి ఉన్నదానిలో ఇంతకుమించి ఒక్కమాటైనా చెప్పకుండా నేను జాగ్రత్త పడాలనుకుంటున్నాను. మీకై మీరు చదవవలసిన అవసరం ఉన్న పుస్తకం ఇది. తనని చదివించు కునేలా చేస్తుంది. మిమ్మల్ని ఒప్పించేలా చదివిస్తుంది. అయినా గానీ, మీ ఆకలిని నన్ను కాస్త రెచ్చగొట్టనివ్వండి. లవ్ జిహాద్‌పై ఈ పుస్తక రచయితలు విశ్వ హిందూ పరిషత్ అంతర్గత పత్రిక ప్రత్యేక సంచిక ప్రచురించిన జాబితాలోని కేసులను విశ్లేషించారు. ‘‘లవ్ జిహాద్‌పై అందుబాటులో ఉన్న ఏకైక సమగ్ర సాక్ష్యాధార సమాచారం అదొక్కటే’’. అయితే నిజానికది, ‘‘147 వార్తా కథనాల క్రమానుగత కూర్పు మాత్రమే’’. ఆ కూర్పులో మొదటి కేసు 2011 నవంబరు నాటిది, చివరి కేసు 2020 సెప్టెంబర్ లోనిది. వాటిల్లో డెబ్బై మూడు, అంటే సగానికి సగం కేసులు ‘వాస్తవాలకు నిలబడనివి’. ‘‘అవన్నీ లింకులు తెగినవి, చెప్పిందే చెప్పినవి, భారతదేశానికి సంబంధం లేనివి’’. తక్కిన డెబ్బై నాలుగు... ‘‘మోసం, అపహరణ, విడిచిపెట్టటం, అత్యా చారం, హత్య మొదలైన వాటితో సహా లింగ సంబంధ నేరాల విస్తృత సమాచారం. ‘‘అన్నిటిలోనూ ఉమ్మడిగా ఉన్నది ఒకటే. నిందితుడు ముస్లిం, బాధితురాలు హిందువు’’ అని రచయితలు పేర్కొన్నారు. లవ్ జిహాద్ లక్ష్యం హిందూ మహిళల్ని మాయచేసి, మభ్యపెట్టి మతం మార్చడమే అయితే ఈ ఉదాహరణలు కేసును బలహీన పరుస్తాయి. 2014 తర్వాత ‘‘గో–సంబంధ దాడులు’’ ఎంతలా విపరీతంగా పెరిగాయో కూడా ఈ పుస్తకం చూపిస్తుంది. ‘‘ఇంటర్నెట్లోని మీడియా ఆర్కైవ్స్‌ను ఉపయోగించి మేము రెండు కాలాల వ్యవధిలో... 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో, 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 2023 మే వరకు... జరిగిన గో–సంబంధ దాడుల సంఖ్యను లెక్కించాం’’ అని పుస్తక రచయితలు వెల్లడించారు. నిజం ఏమిటో తెలిసిన కొద్దిమందికి ఆ లెక్కలు ఆశ్చర్యం కలిగించవు. తెలియని ఎక్కువమంది మాత్రం నమ్మలేనట్లు చూస్తారు. ‘‘2009–2014 మధ్య ఒకే ఒక గో–సంబంధ హింసాత్మక సంఘ టనను మేము కనుగొన్నాము.’’ ఆ కేసులో కూడా, ‘‘దాడి వీహెచ్‌పీ నేతృత్వంలో జరిగింది’’. అందుకు భిన్నంగా, ‘‘2014 నుంచి 2023 మే వరకు అలాంటి గో–సంబంధ దాడులు 136 వరకు జరిగినట్లు మా లెక్కల్లో తేలింది. ఆ దాడుల్లో 66 మంది మరణించారు. 284 మంది గాయపడ్డారు. హతులైన వాళ్లలో కనీసం 70 శాతం మంది ముస్లింలే’’ అని వారు వివరాలు పొందు పరిచారు. ద్వేషపూరిత ప్రసంగాల విస్తృతిపై ఈ రచయితలు బహిర్గతపరచిన వివరాలను కూడా మీకు చెబుతాను. ‘‘2009–2014 మధ్య కాంగ్రెస్ హయాంలో దాదాపుగా 25 వరకు అలాంటి ద్వేష ప్రసంగాలు మా లెక్కకు అందాయి. ఆ సంఖ్య బీజేపీ హయాంలో ప్రముఖ వ్యక్తులు చేసిన విద్వేష ప్రసంగాలతో కలిపి 460కి చేరు కుంది’’. అంటే తొమ్మిది రెట్ల దూకుడు! మీలో చాలామంది లవ్ జిహాద్, పాపులేషన్ జిహాద్, బలవంతపు మతమార్పిళ్ల వంటి అపోహల్ని నమ్మకపోవచ్చు. ముస్లింల బుజ్జగింపు జరుగుతోందంటే మాత్రం బహుశా మీలో ఎక్కువమంది నమ్మే అవకాశమైతే ఉంది. అప్పుడైతే మీరు ఆ అంశానికి సంబంధించిన అధ్యాయాన్ని ఈ పుస్తకంలో తప్పనిస రిగా చదవాలి. అందులో రచయితలు ఈ బుజ్జగింపు అభియోగాన్ని అక్షరాలా తుడిచిపెట్టేశారు. ఎంత ప్రభా వవంతంగా వారు ఆ పని చేశారన్నది కనిపెట్టే విష యాన్ని మీకే వదిలేస్తాను. కానీ వారిచ్చిన ముగింపు లలో ఒకదాని గురించి చిన్న ముక్క చెబుతాను. ‘‘హిందూ రైట్‌వింగ్ పొరబడింది. ముస్లింలు కాంగ్రెస్ బుజ్జగింపులకు దూరంగా ఎక్కడో అట్టడుగున ఉండిపోయారు. కాంగ్రెస్ దేనికైనా దోషిగా నిలబడిందీ అంటే... ఆ దోషం... అంత సుదీర్ఘంగా అధికారంలో ఉండి కూడా ముస్లింలను పైకి తేవటంలో విఫలం అవటమే’’ అని రచయితలు వ్యాఖ్యానించారు. చిన్నపాటి ధార్మిక ఉపన్యాసంతో నేనిది ముగిస్తాను. సత్యాన్ని చూడకూడదని అనుకునేవారు, అంధులుగానే ఉండిపోయేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ పుస్తకం చదవకండి. ఎందుకంటే అది వారి నిరాధారమైన భ్రమల్ని పటాపంచలు చేస్తుంది. కానీ నిజం ఏమిటో తెలుసుకోగోరే యథార్థవాదులకు ఇది చదవవలసిన పుస్తకం. వాస్తవాలను సరళంగా, పూత పూయని పదాలతో తేలిగ్గా జీర్ణమయ్యేలా మీకు ఈ పుస్తకం చెబుతుంది. అంతే తేలిగ్గా మీరు పుస్తకం లోపలి విషయాలను అంగీకరించ గలుగుతారని నేను ఆశిస్తున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎన్ని తగ్గిస్తే అన్ని నెగ్గినంత!
28 పార్టీల ‘ఇండియా’ కూటమి ప్రధాన లక్ష్యం ఏమిటి అన్నదాన్ని బట్టే అది తన లక్ష్యం సాధించగలదా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. బీజేపీని 272 సీట్ల కన్నా తక్కువకు నియంత్రించి, మిత్రపక్షాల మద్దతు లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితికి తేవడమా? లేక, కూటమిలోని 28 పార్టీలు దేనికదిగా అత్యధిక సీట్లలో విజయం సాధించటమా? ఈ రెండు కూడా వేర్వేరు లక్ష్యాలు. అత్యధిక సీట్లను గెలుచుకోవటమే ‘ఇండియా’ కూటమి లక్ష్యమైతే... చేజేతులా బీజేపీని తిరుగులేని విధంగా అధికారంలోకి రానివ్వటమే! అలా కాకూడదంటే, ఓట్లు చీలకుండా ఆ యా పార్టీలు తాము గెలవలేని రాష్ట్రాల్లో మిత్రపక్షాల కోసం సీట్లను త్యాగం చేయవలసి ఉంటుంది. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం సరళమైనది, సూటిగా మాట్లాడు కోబోయేదీ. అదేమిటంటే – వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీని, భార తీయ జనతా పార్టీని ‘ఓడించాలన్న’ 28 పార్టీల ‘ఇండియా’ కూటమి కల నిజం అవుతుందా అన్నది! అయితే ఆ కల నిజం అవటం అన్నది ఒకే ఒక ప్రశ్నకు లభించే సమాధానం పైనే అధారపడి ఉంటుంది. ‘ఇండియా’ కూటమి లక్ష్యం ఏమిటన్నదే ఆ ప్రశ్న. బీజేపీని 272 సీట్ల కన్నా తక్కువకు నెట్టేసి, మిత్రపక్షాల మద్దతు లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితికి ఆ పార్టీ తేవడమా? లేక, కూటమిలోని 28 పార్టీలు దేనికదిగా అత్యధిక సీట్లలో విజయం సాధించటమా? ఇవి రెండూ వేర్వేరు లక్ష్యాలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే లక్ష్యంగా అవి కూటమి కలను సాకారం చేయగలిగినవి కావు. రెండు లక్ష్యాలకు వేటికవిగా భిన్న విధానాలు, భిన్న వ్యూహాలు అవసరం. అత్యధిక సీట్లను గెలుచుకోవటమే తన లక్ష్యంగా ‘ఇండియా’ కూటమి పెట్టు కున్నట్లయితే... అది చేజేతులా చాలా పెద్ద సంఖ్యలో సీట్ల గెలుపుతో బీజేపీని తిరుగులేని విధంగా అధికారంలోకి రానివ్వటమే! బీజేపీని 272 సీట్లకు దిగువనే ఉంచటానికి కూటమిలోని ప్రతి ఒక్క పార్టీ తన పరిమితుల్ని అంగీకరించవలసి ఉంటుంది. పైకి అదే మంత పెద్ద విషయంగా అనిపించకపోయినా ప్రధానంగా అదే పెద్ద విషయం. కూటమి లబ్ధి కోసం పార్టీలు తమ ప్రయోజనాలను త్యాగం చేయటం అవసరం. అప్పుడు మాత్రమే ఇండియా కూటమి కనీసం 400 సీట్లలో ప్రత్యర్థితో ముఖాముఖి తలపడగలదు. అప్పుడు మాత్రమే ప్రతిపక్ష కూటమికి పడిన 60 శాతం ఓట్లు... పోటీలో ఉన్న ఎక్కువమంది అభ్యర్థుల మధ్య చీలిపోయే అవకాశం ఉండదని ఆశించవచ్చు. ఈ విషయం మీకు వివరంగా చెప్పడానికి కాంగ్రెస్‌ను నేను ఒక ఉదాహరణగా తీసుకుంటాను. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఇటీవలి చరిత్రలను చూస్తే కనుక అక్కడ కాంగ్రెస్‌కు ఉన్న విజయా వకాశాలు పరిమితమేననీ, వాటిని మెరుగుపరుచుకునే ప్రయత్నాలకు కూడా ఇది సమయం కాదనీ నిర్ధారణగా తెలుస్తుంది. 2014లో ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ రెండంటే రెండే లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. యూపీలోనే 2022 విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు కూడా రెండే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఓట్లు వరుసగా 6.4. శాతం, 2.4 శాతం. బెంగాల్లో మరీ హీనం. అక్కడ 2019లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. 2021 శాసనసభ ఎన్నికల్లోనైతే ఒక్క సీటు కూడా రాలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన ఓట్లు వరుసగా 5.7 శాతం, 3.1 శాతం. స్పష్టంగా తెలుస్తున్నది ఏమిటంటే, కాంగ్రెస్ ఎన్ని ఎక్కువ సీట్లకు పోటీ చేస్తే బీజేపీ అన్ని ఎక్కువ సీట్లలో గెలుస్తోంది. బిహార్‌లో సరిగ్గా ఇదే జరిగింది. 2020 బిహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తే, గెలిచింది 19 సీట్లు మాత్రమే. అంతకు ముందరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలే ఇక్కడా పునరావృతం అయ్యాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 సీట్లకు పోటీ చేస్తే ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. అయితే, ‘ఇండియా’ కూటమిలోని తక్కిన పార్టీలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా త్యాగాలు చేయవలసిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అవి: మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఈ రాష్ట్రాల్లో సమాజ్‌వాది, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు తమ ప్రయోజనాలకు అతీతంగా పని చేయాలి. ఆశల రెక్కల్ని చాపుకోడానికి వాటికిది సమయం కాదు. బీజేపీని ఆ రాష్ట్రా లలో ఓడించగల స్థానంలో ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఉంది. అలాగే ‘ఇండియా’ కూటమికి సమస్యాత్మకమైన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వాటిల్లో పంజాబ్, ఢిల్లీ ప్రధానమైనవి. పంజాబ్‌లో లోక్‌సభ స్థాయిలో కాంగ్రెస్ 8 సీట్లు, ఆమ్ ఆద్మీ 1 సీటు గెలుచు కున్నాయి. శాసనసభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈ పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యింది. ఆప్ 92 చోట్ల, కాంగ్రెస్ 18 చోట్ల విజయం సాధించాయి. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ గానీ, ఆప్ గానీ ఒక్క లోక్‌సభ సీటును కూడా గెలుచుకోలేక పోయాయి. అయితే ఆప్ కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలిచింది. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో మాత్రం ఆప్‌దే పైచేయిగా ఉంది. ఈ రెండు రాష్ట్రాలలో కూడా కూటమి పార్టీల మధ్య సీట్ల విభజన అంత సులభమేమీ కాదు. అయినప్పటికీ అత్యాశతో అవి విభజనకు ప్రయత్నించాయా... బీజేపీ గెలిచినట్లే! నేను చెప్పాలనుకున్న ఈ విషయం ఎందుకింత సరళంగా, సూటిగా... అదే సమయంలో ఎందుకింత ముఖా నికి కొట్టొచ్చినంత స్పష్టంగా కూడా ఉన్నదో మీకు అర్థ మయిందా? నా ఈ విశ్లేషణతో విభేదించడం ‘ఇండియా’ కూటమికి స్వయంకృత పరాజయం మాత్రమే అవుతుం దన్న విషయాన్ని కూడా మీరు అంగీకరించగలరా? బీజేపీని 272 సీట్లకంటే తక్కువకు పరిమితం చేయడానికి ప్రతి పక్షాలు కనీసంలో కనీసంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే. త్యాగాలకు సిద్ధపడటం, అత్యాశను వదులుకోవటం. ఇవి కాకుండా వారు తెలుసుకోవలసినవి ఇంకొన్ని కూడా ఉన్నాయి. మొదటిది: ప్రధానమంత్రిపై వ్యక్తిగత విమర్శలు పనికిరావు. రెండు: అదానీ, క్రోనీ క్యాపిటలిజం (రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు కుమ్మక్కు అవటం), చైనా వైఖరి పట్ల మోదీ బలహీనమైన ప్రతిస్పందన, లేదా మైనారిటీలను తక్కువగా చూడటం అనే అంశా లేవీ ఓట్లు రాల్చేవి కాదు. ఈ రెండు విషయాలను పక్కన పెట్టి, సామాన్య ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తున్న ద్రవ్యో ల్బణం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు, పేదరికం వంటి వాటిపై కూటమి దృష్టి పెట్టాలి. ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళతాను. ‘మోదీకి పోటాపోటీ ఎవరు?’ అనే ప్రశ్న... ‘ఇంకెవరు? రాహుల్‌గాంధీ’నే అనే సంసిద్ధ సమాధానంతో పూర్తవదని ఇండియా కూటమి స్పష్టతను కలిగి ఉండాలి. రాహుల్ గాంధీ కూడా తను కనీసం సంభావ్య ప్రధాని మంత్రి అభ్యర్థినైనా కానని స్పష్టం చెయ్యాలి. అవసరమైతే, నిస్సందే హంగా అది ఆమోదం పొందేవరకూ రాహుల్ పదే పదే దాన్ని పున రుద్ఘాటించాలి. చివరిగా కాంగ్రెస్‌కు ఒక మాట. మోదీని, బీజేపీని ఓడించడం తేలిక కాదు. ఆ పార్టీని 272 సీట్ల దిగువకు దింపడమే కాంగ్రెస్ పార్టీ 2024 లక్ష్యం కావాలి. 2029లో మాత్రమే కాంగ్రెస్ తను సొంతంగా మెజారిటీ సాధించేందుకు పని చేయాలి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇలా కాదే వీళ్లు ఉండాల్సింది!
బ్రిటన్ భిన్నమైన దేశం. బ్రిటన్ దేశస్థులు విలక్షణమైనవారు. ఎవరి వ్యక్తిగత జీవితాలలోకీ తొంగిచూడరు. నిత్య జీవిత భౌతిక సంభాషణలలో అంత ర్లయగా ఉన్న హాస్యాన్ని చక్కగా పట్టుకోగలరు. విధి నిర్వహణలలో ఘటనాఘట సమర్థులు. మర్యాద ఇవ్వడంలో మన రామన్నలను మించినవారు. ఎంతటి విపత్తుకైనా ముందస్తుగా సిద్ధమై ఉండేవారు. పరదేశీ అతిథులను గౌరవించి, ఆదరించేవారు. తలవని తలంపుగానైనా తమ దేశానికి అప్రతిష్ఠను తీసుకురాని వారు. అంతటి ఉత్కృష్ట ప్రజల పైన, అంతటి నాగరిక దేశం మీద గత డిసెంబరు 23న హీత్రో విమానాశ్రయంలోని మూడవ నంబరు టెర్మినల్ పూర్తి విరుద్ధమైన నీడల్ని ప్రసరింపజేసింది! ‘ఇలా కాదే వీళ్లు ఉండాల్సింది’ అన్న భావనను ఆనాటి ప్రయాణికులకు కలిగించింది. ఇక్కడి నా వ్యాసాల సరళిని బాగా ఎరిగి వున్న వారికి ఆ వ్యాసాలలో తరచు నేను బ్రిటన్ దేశాన్ని, బ్రిటన్ దేశస్థులను ఆకాశానికి ఎత్తేసినంతగా వెన కేసుకు రావటమన్నది గ్రహింపునకు వచ్చే ఉంటుంది. బ్రిటన్ దేశస్థుల గుండె ధైర్యాన్ని నేను ఇష్టపడతాను. వ్యక్తుల జీవితాలలోని గోప్యతను గౌరవించి, వారి ఆంతరంగిక విషయాలలోకి చొరబడకుండా ఉండే ఆ స్వభావాన్ని ప్రశంసిస్తాను. అంతేకాదు, ప్రపంచంలోనే బ్రిటిషరస్ గొప్ప హాస్యచతురత ఉన్నవారనీ దృఢంగా విశ్వసిస్తాను. ఇది చాలా వరకు ఉద్దేశపూర్వకమైన అతిశయోక్తి, తేలికపాటి వ్యంగ్యోక్తి, పైనుంచి కిందివరకు కూడా నర్మగర్భ విమర్శ. ఇదంతా ఎక్కువగా బ్రిటన్ రాచకుటుంబం పైన! ఈ క్రమంలో వారి అసహజ ప్రవర్తనల్ని అభినందించడం, వారి అసాధారణతల్లోని అవకరాలను కనుకొనల్లోంచి చూసీచూడనట్లుగా వదిలేయడం, వారు మాటిమాటికీ చేస్తుండే తప్పులను మన్నించడం వంటి మనో నైపుణ్యాలను నేను పెంపొందించుకున్నాను. కానీ డిసెంబర్ 23 సాయంత్రం హీత్రో విమానాశ్రయంలోని 3వ టెర్మినల్‌లో ఏదైతే జరిగిందో అది మాత్రం క్షమించలేనిది. నిజానికి క్షమించ తగనిది. మరోమాటకు ఆస్కారం లేకుండా అదొక వాదన లకు తావులేని అసమర్థతకు నిదర్శనం. బ్రిటన్ను సందర్శించే వ్యక్తుల పట్ల నమ్మశక్యం కానంతటి అమర్యాదకరమైన ధోరణి. బహుశా ఎన్నడూ లేనంతగా పూర్తిస్థాయి ఆత్మాశ్రయ ఓటమి. బ్రిటన్ స్వరూపాన్ని గరిష్ఠ స్థాయిలో ఘోరాతిఘోరంగా వీక్షింపజేసిన ఉదాసీనత. రాత్రి ఎనిమిది గంటలకు విమానం దిగిన ప్రయాణికులు విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం కిక్కిరిసిపోయి, మందకొడిగా మెలికలు తిరుగుతూ ముందుగు సాగుతూ ఉన్న పొడవాటి వరుసలో రెండున్నర గంటలసేపు విధిలేక వేచి ఉండవలసి వచ్చింది. పాదం నొప్పితో నేను అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఇంకా ల్యాండ్ అవుతున్న విమానాల నుంచి కొత్త ప్రయాణికులు మా వరుస లోకి వెనుక నుంచి జమ అవుతుండటం గమనించాను. ఇప్పుడు వరుసలో వేచి ఉండే కాలం బహుశా రెండున్నర నుంచి నాలుగు గంటలు అవుతుందా! ఫస్ట్ క్లాస్, అంతకంటే కాస్త మాత్రమే దిగువ శ్రేణిలో ఉండే క్లబ్ క్లాస్ ప్రయాణికులు కూడా మా క్యూలో ఉన్నారు. వారి కోసం వేరుగా ఏర్పాటై ఉండే ‘ఫాస్ట్ ట్రాక్’ను బ్రిటన్ తొలగించి ఉండటమే అందుకు కారణం. విమానాశ్రయ అధికారులకు ఇదేమైనా పట్టి ఉంటుందా? నిజం ఏమిటంటే, వారిలో ఒక్కరు కూడా విచారం వ్యక్తం చేయటం లేదు. క్షమాపణ కోరటం అటుంచండి, అడిగిన దానికి సమాధానం చెప్పిన వారైనా ఎవరు? ఒకవేళ క్యూలో ఉన్న ప్రయాణికులు బాత్రూమ్కి వెళ్లవలసివస్తే వారి పరిస్థితి ఏమిటన్న కనీస ఆలోచనైనా వారికి వచ్చి ఉంటుందా? నాకు గుర్తున్నంత వరకు క్యూలో ఉన్న వారెవరికీ అదృష్టవశాత్తూ ఆ అవసరం రాలేదు. లేదా, అలాంటి అవసరం వచ్చిన ప్పటికీ వారు క్యూలో తమ స్థానం కోల్పోయి, మరిన్ని అంతులేని గంటలపాటు వేచి ఉండవలసి వస్తుందన్న భయంతో ఆ బాధను అలాగే ఉగ్గబట్టి ఉండాలి. అదింకా క్రిస్మస్కు వచ్చిపోయే వారు ఎక్కువలో ఎక్కువగా ఉండే సమయం. ఆ రద్దీని ముందే ఊహించి, అందుకు సిద్ధంగా కదా అధికా రులు ఉండాలి. పైగా హీత్రో విమానాశ్రయానికి గతంలో ఇలాంటివి చాలినన్ని అనుభవాలు ఉన్నాయి. 2019లో ఈ విమానాశ్రయం ద్వారా దాదాపు 8 కోట్ల 10 లక్షల మంది రాకపోకలు సాగించారు. అయినప్పటికీ 23న సగానికి పైగా ఇమిగ్రేషన్ కౌంటర్లు సిబ్బంది లేకుండా కనిపించాయి. చివరికి ఎట్టకేలకు నా వంతు వచ్చినప్పుడు, క్లియరెన్స్ కోసం నా దగ్గరికి వచ్చిన అధికారి దగ్గర కనీసం పెన్ను కూడా లేదు! పెన్ను కోసం అతడు తన సహ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను మరికొన్ని ఆవేదనా భరితమైన నిమిషాలను గడుపుతూ అతడి కోసం వేచి ఉండవలసి వచ్చింది. అదృష్టవశాత్తూ నాల్గవ వ్యక్తి దగ్గర అతడికి – మళ్లీ తిరిగి ఇచ్చే షరతుపై – ఒక పెన్ను లభించింది. అప్పటికి మా బ్యాగులు లగేజ్ బెల్టుల నుంచి జారి వచ్చి, తీరూతెన్నూ లేకుండా కలగాపులగంగా పడి పోయాయి. కొన్ని అసలైన చోటులో, మిగతావి చాలా వరకు విసిరివేసినట్లుగా అక్కడికి దూరంగా చెల్లాచెదురైన వాటిలో! వాటి నుంచి నా రెండు బ్యాగుల్ని కనిపెట్టి తీసుకోడానికి మరొక అరగంట! దాదాపు మూడు వందల మంది ప్రయాణికుల బ్యాగులతో అవి కిందా మీదా అయి కేవలం కలిసిపోవడం మాత్రమే కాదు, వాటిని వెతికి పట్టుకోడానికి అవి ఏమాత్రం పడి ఉండే అవకాశం లేని చోట వాటిని కనిపెట్టాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి ముందురోజు రాత్రి బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ నేను హీత్రోలో ల్యాండ్ అయిన వెంటనే నాకు ఫోన్ చేసి, తను విమానాశ్రయ నిష్క్రమణ మార్గం వైపు ఉన్న డబ్లు్య.హెచ్. స్మిత్ కౌంటర్ దగ్గర నా కోసం వేచి ఉన్నానని చెప్పాడు. కానీ నేను అతడిని చేరడానికి మూడు గంటల సమయం పడుతుందని అనుకుని ఉండడు. నా కోసం ఓపికగా వేచి ఉండటం తప్ప అతడికి వేరే దారి లేదు. లేకుంటే హీత్రో బాడుగకు అతడికి డబ్బు రాదు కదా! ఇది ఆమోదయోగ్యం కాదని బ్రిటిష్ ప్రభుత్వానికి గట్టిగా చెప్పా ల్సిన అవసరం ఉన్నందున నేను ఇదంతా నిజాయితీగా రాస్తున్నాను. ఇంతకుమించి వేరే మార్గం లేదు. ఎవరికి నేనీ అనుభవాన్ని చెప్పినా భయపడిపోయారు. కానీ ఇది నాకు మాత్రమే ప్రత్యేకమైన అనుభవం కాదు. ఇలా వేల మందికి, బహుశా పదుల వేల మందికి జరిగి ఉంటుంది. టెర్మినల్ 3లో ఇది సర్వసాధారణం. అయితే ఈ సర్వ సాధారణత్వాన్ని ఒక మామూలు విషయంగా బ్రిటిష్ అధికారులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కనుక ఒక వ్యంగ్య వ్యాఖ్యతో, ఒక విధమైన ప్రతీకారం వంటి సూచనతో ఈ వ్యాసాన్ని నేను ముగిస్తాను. టెర్మినల్ 3లో దిగితే భారతదేశ పాస్‌పోర్టు కలిగివున్న తన అత్తమామలకు కూడా ఇదే జరుగుతుందని రిషి సునాక్ గ్రహించగలరా... బహుశా ఆయన వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తే తప్ప? నా సలహా. ప్రతి భారతీయ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్‌ను ఉపయోగించకుండా బ్రిటిష్ పౌరులందరినీ నిరోధించాలి. అది నిజంగా జరిగితే హీత్రోలో పరిస్థితులు చాలా త్వరగా మెరుగు పడతాయి. నిజం! నా మాట నమ్మండి! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కొత్త నిర్ణయాలు తీసుకుందాం!
కొత్త సంవత్సరంలో వ్యక్తులుగా మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. అదే విధంగా మనమంతా ఒక దేశంగా కూడా కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. పార్లమెంటులో సభా సమయాన్ని దుర్వినియోగం చేయబోమని ఎంపీలూ, చర్చల పేరుతో జనాల మధ్య గొడవలు సృష్టించబోమని టీవీ యాంకర్లూ తీర్మానించుకోవాలి. ట్రాఫిక్ నియమాలను అతిక్రమించకుండా వాహనాలను ధ్యాసగా, జాగ్రత్తగా నడుపుతామని మనం సంకల్పం చెప్పుకోవాలి. కానీ మూణ్ణాళ్లకే ఈ తీర్మానాలన్నీ వట్టి ముచ్చటగా మారిపోతే? అసలీ తీర్మానాలు తీర్చేవా, మార్చేవా? దీనికి ఒకటే జవాబు. తీర్చడం, మార్చడం కళ్లకు కనిపించపోవచ్చు. కానీ, అసలంటూ కొత్త నిర్ణయం తీసుకోవటం అన్నదే సంకల్ప సాధనలోని నిబద్ధతకు మొదటి మెట్టు అని గుర్తించాలి. పూతకొచ్చే తీర్మానాలకు కొత్త సంవత్సరం ప్రియమైన రుతువు అయినప్పటికీ, వాటిల్లో చాలా వరకు ఎక్కువ కాలం జీవించి ఉండవు. గొప్ప ఉత్సాహపు ధ్వనితో మొగ్గ తొడిగి, చప్పుడే కాని పరిహాసపు గాలివానలతో టప్పున నేల రాలేందుకే అవి చిగురిస్తాయి. అయినప్పటికీ, మనమంతా ఒక దేశంగా కొన్ని తీర్మానాలను స్వీకరించాలని నేనిప్పుడు సూచించబోవడం మీకొక ప్రశ్నార్థకం అవొచ్చు. దీనికి చాలా సులభమైన జవాబే ఉంది. చేయాలని అనుకున్న దానిలో నిబద్ధత కొరవడినా, ఏం చేయవలసిన అవసరం ఉన్నదో దానిని ఒక సంకల్పంలా తీసుకోవడమే అసలొక తీర్మానం. కనుక ఈ కొత్త సంవత్సర ఆరంభంలో ఆ మొదటి అడుగు వేద్దాం. ‘సంకల్పం’ అనే అడుగు. మొదటిది, ఒకటేంటంటే మన రాజకీయ నాయకులు చేయ వలసినది. పార్లమెంటులో ఎంతో విలువైన ప్రజాసమయ దుర్విని యోగానికి పాల్పడే విధంగా తమ ప్రవర్తన ఉండకూడదని వారు తీర్మానం చేసుకోవాలి. వాళ్లు అక్కడ కూర్చున్నందుకు మీకు, నాకు అవుతున్న ఖర్చు నిమిషానికి 2 లక్షల 50 వేల రూపాయలు. ఈ ఖర్చును మనం సంతోషంగానే భరిస్తున్నాం. ఎందుకంటే, నిజాలను నిగ్గు తేల్చేందుకు, ప్రభుత్వ పనితీరును ఎత్తిచూపేందుకు, నిశిత పరిశీలనకు; అవినీతిని, అసమర్థతను బహిర్గతం చేయడానికి... ప్రశ్నలు, చర్చలు తప్పనిసరి అని మనం విశ్వసిస్తాం. అటువంటిది... సభ ‘వెల్’లోకి దూసుకెళ్లే, స్పీకర్‌పై రంకెలు వేసే, సభకు గైర్హాజరు అయ్యే ఎంపీలకు మన కష్టార్జితాన్ని ఎందుకు ఖర్చుపెట్టాలి? 16వ లోక్‌సభ (2014–19) సభా సమయం 1,615 గంటలు కాగా,అందులో 16 శాతం సమయాన్ని అంతరాయాలు, వాయిదాల కారణంగా కోల్పోయాం. ఆ కోల్పోయిన సమయానికి అయిన ఖర్చు రూ. 39 కోట్లు. మన ప్రజాప్రతినిధులుగా, మనం వారికి నిధులు సమ కూరుస్తున్నాం కనుక, ఆ విలువకు సమానమైన సేవలను మన ఎంపీలు మనకు అందించాలి. అందుకు మనం అడుగుతున్నదల్లా పార్లమెంటు సమర్థంగా, అర్థవంతంగా పనిచేయాలని! వారి నుండి ఈ కొత్త సంవత్సరం మనకు ఇలాంటి హామీ లభిస్తుందా? తర్వాత, ప్రెస్! ఇక్కడ నా ఉద్దేశం ప్రెస్ అంటే ప్రధానంగా టెలివి జన్ న్యూస్ చానెళ్లు. టీవీ వీక్షకులు డబ్బు చెల్లిస్తారు కనుక ముఖ్యమైన వార్తల్ని ఆశించే హక్కు వారికి ఉంటుంది. ఏది ముఖ్యమైన వార్తో నిర్ణయించడానికి అనేకమైన ప్రామాణికాలు ఉంటాయన్న దాంట్లో సందేహమేమీ లేదు కానీ, చివరికొచ్చేటప్పటికి ప్రధానంగా ప్రాముఖ్యం, ఔచిత్యం, సమతౌల్యం అనేవి లెక్కలోకి వస్తాయి. కనుక టీవీ వాళ్లకు నేను చెప్పేదేమిటంటే, దయచేసి మీరు సినిమా తారలు, క్రికెటర్ల పట్ల మీకున్న మక్కువను వదులుకోండి. ‘బ్రేకింగ్ న్యూస్’ కోసం మీ పరుగులను ముగించండి; బదులుగా కచ్చితత్వం పైన, విశ్లేషణ మీద దృష్టి పెట్టండి; మరీ ముఖ్యంగా... సాగతీతల్ని ఆపేయండి. ఏ వార్తా కథనానికైనా తన సహజమైన నిడివి ఉంటుంది. కేవలం ప్రసార సమయాన్ని భర్తీ చేయడానికి ఆ నిడివిని పొడిగించుకుంటూ పోకండి. గుర్తుంచుకోండి. మేము పెద్దవాళ్లం; మమ్మల్ని పిల్లల్లా చూడకండి; మేము తరచు పిల్లల్లా స్పందిస్తున్నా కూడా అలాగే, మన యాంకర్లకు ఎవరైనా చర్చల లక్ష్యం జనం మధ్య గొడవలు సృష్టించడం కాదని చెప్పగలరా... ఆ జనం ఒకవేళ గొడవలకు సిద్ధంగా ఉన్నప్పటికీ! చర్చ అనేది ప్రజాభిప్రాయాన్ని రాబట్టేందుకు... అది కూడా ఒక వివేచనతో, వీలైతే తక్కినవారికి భిన్నంగా, పూర్తిగా తమదైన ప్రత్యేకతతో ఉండాలనీ... చర్చకు వచ్చిన అతిథులు తమతో ఏకీభవించేలా యాంకర్లు వారిపై మాటల బల ప్రయోగం చేయకూడదనీ వీక్షకులుగా ఈ కొత్త సంవత్సరంలో మనం ఆశపడదాం. చివరిగా, మనమంతా ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉన్న విషయం – సురక్షితంగా వాహనం నడపడం. పద్ధతిగా, తెలివిడిగా నడపాలి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీని దాటేందుకు వేరే వైపు మళ్లకండి. ఎర్ర రంగు పడటానికి ముందు ఆరెంజి రంగులోకి సిగ్నల్ మారినప్పుడు మీ అదృష్టంపై నమ్మకంతో జంక్షన్లో మీ వాహనాన్ని ముందుకు దూకించకండి. ఇంకొక సంగతి, మీరు మీ కారును పార్క్ చేస్తున్నప్పుడు వేరొకరి గేటుకు కానీ, తోవకు కానీ అడ్డంగా నిలుపుతున్నారేమో గమనించండి. ఇక మన డ్రైవింగ్ ఎలా ఉండాలనే దానికి ఎల్ల వేళలా వర్తించే సాధారణ నియమం – రోడ్డుపై మీరే కాకుండా ఇంకా చాలామంది వాహనం నడు పుతూ ఉంటారు కనక – రోడ్డుపై మీకున్నంత హక్కే వారికీ ఉంటుందని గ్రహించడం! మరీ పాత సంగతి కాదు కానీ, సిగరెట్ తాగడం మొదలుపెట్టాలని నాకొక కొత్త సంవత్సర తీర్మానం ఉండేది. గడియారం సరిగ్గా రాత్రి పన్నెండు కొట్టగానే నా వేళ్ల మధ్య సిగరెట్ వెలుగు తుండేది. మర్నాడు సాయంత్రమంతా ఉమ్మడం, దగ్గడం! ‘సిగరెట్ తాగకపోవడం’ అనే వ్యసనాన్ని దూరం చేసుకోడానికి నేను ఎంచుకున్న మార్గం అది. అయితే జనవరి చివరినాటికి నా తీర్మానం పట్టు సడలిపోయేది. అది వ్యసనంగా మారుతుందేమోనన్న భయం నా చేత సంతోషంగా సిగరెట్ మాన్పించేది. అలా నేను దానికి దూరంగా ఉండటం జరిగేది. ఈ సంవత్సరం నేను మరింత పెద్ద సవాలును స్వీకరిస్తున్నాను. టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వచ్చే నా అతిథులకు అంతరాయం కలిగించడాన్ని మానుకోవాలని నిర్ణయించుకున్నాను. బదులుగా, వారిని తమ ఊకదంపుడుకు, అదే పనిగా మాట్లాడేందుకు అనుమ తిస్తాను. వాళ్లేం మాట్లాడినా, మాట్లాడవలసిన దానిని వాళ్లసలే మాట్లాడకపోతున్నా – మీరు, మిగతా వీక్షకులు అరచి నిరసన తెలియజేసే వరకు వాళ్లకు అడ్డుతగలనే తగలను. ‘వద్దు కరణ్, మీరు మీ పాత భౌభౌమనే రాట్వైలర్ జాతి శునకం స్టెయిల్‌కి వచ్చేయండి’ అంటూ తొలి విజ్ఞాపన పత్రం నాకు అందినప్పుడు మాత్రమే నేను ఎప్పటిలా నా పాత శైలికి వచ్చేస్తాను. మరి అలాంటి విజ్ఞాపన పత్రం ఒకటి ఎప్పటికీ రాకపోతే? మా ప్రియమైన పోస్ట్‌మ్యాన్ నేను ఎదురు చూసే క్రిస్మస్, న్యూ ఇయర్ కార్డులన్నిటినీ ఎక్కడో తారుమారు చేసి ఉండొచ్చని అనుకోవాలి. ఏ సంగతీ ఏదో ఒక విధంగా త్వరలోనే మీకు తెలుస్తుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నిర్మొహమాట గుణ సంపన్నులు!
నిజం అని తాము నమ్మిన దానిని భారతీయులు ఒక అద్భుతమైన విధానంలో వ్యక్తపరుస్తారు. ఏమాత్రం సంకోచం లేకుండా అనువుకాని వేళనైనా చొరవ చేసుకుని వచ్చి తటాలున పేలుతారు. అలా మాట్లాడ్డం వల్ల ఎవర్నయినా తక్కువ చేస్తున్నామా అనే ఆలోచనా వారిలో కనిపించదు. పైపూతలేం ఉండవు. అది కొన్నిసార్లు బాధాకరంగా ఉన్నప్పటికీ దాదాపుగా అదే ఎల్లప్పుడూ ఒక బాధా నివారిణిగా పనికొస్తుంది. కేవలం మన దేశంలో మాత్రమే ముక్కూమొహం తెలియనివారు కూడా రాత్రి పొద్దు పోయాక ఫోన్ చేసి, వాళ్ల మనసులో ఉన్నదానిని మీ ముఖానికేసి కొడతారు. అటువంటి ప్రవర్తనతో అందరికీ తాము వేడుక అవుతున్నామని తెలిసినా లెక్కచేయరు. వాళ్లు అలా ఎందుకు చేస్తారంటే, వాళ్లకు అలా చేయాలనిపించింది కనుక! రాత్రి బాగా పొద్దుపోయాక ఒక్క ఉదుటున ఉలికిపాటుగా మోగిన ఫోన్‌ని – అవతల ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందో ఊహించలేను కనుక – క్షణమైనా ఆలస్యం చేయకుండా చేతికి అందుకున్నాను. మామూలుగా నైతే ఆ ఫోన్ మోగిన సమయం, ఆ మాట తీరు ఠప్పున నా చేత ఫోన్ పెట్టిపడేసేలా చేసి ఉండేవి. ‘‘నేను మిమ్మల్నొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను’’ అని అంటూనే... నా మాటకు చోటు ఇవ్వకుండా, ‘‘నేను మీ కాలమ్‌ని క్రమం తప్పకుండా చదివే పాఠకుడిని. మీరెప్పుడూ కూడా ప్రతిదాన్నీ విమర్శిస్తూనే ఉండటం గమనించాను. మెచ్చుకోవడానికి అసలు మీకేమీ కనిపించదా?’’ అని అవతలి వ్యక్తి! ముక్కు మీద గుద్దినట్లున్న ఆ మొద్దుబారిన ప్రశ్న ఒక్కసారిగా నన్ను తత్తరపాటుకు గురిచేసింది. ఏం చెప్పాలో తెలియలేదు. ఒకటి మాత్రం తెలుస్తూనే ఉంది. అతడు నన్ను బోనులో నిలబెట్టాడు. నా తరఫు వాదనను నేను చెప్పాలి. ఫోన్ పెట్టేసి తప్పించు కోవచ్చు. అలా చేయాలని నేను అనుకున్న సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. కానీ అది ప్రశ్నకు సమాధానం అవదు. అంతేకాదు, సంభాషణ నుండి ఉత్పన్నం అవవలసిన తక్కిన సందేహాలు అర్ధంతరంగానే వ్యక్తం కాకుండా పోతాయి. ‘‘విమర్శించడమే వివేకం అన్నట్లుగా రాస్తారు మీరు. విమర్శనాత్మకంగా ఉండటం అన్నది పాఠకులకు నచ్చే, పాఠకులకు మిమ్మల్ని నచ్చేలా చేసే విషయమే కావచ్చు. అందులో సందేహం లేదు. కానీ అందువల్ల మీరెప్పుడూ ప్రతికూలతలకు మాత్రమే ప్రఖ్యాతిగాంచిన వారవుతారు. అసలు మీకు నచ్చే విషయాలే ఉండవా? వాటి మాటేమిటి? మీరు ప్రశంసించాలనుకున్న వాటి సంగతేమిటి? వాటి గురించి రాయడం ద్వారా మీకొక గుర్తింపును మీరెందుకు కోరుకోరు? ఏదో ఒకదానినైనా సమర్థించండి. ప్రతి దానినీ విమర్శిస్తూ పోకండి’’ అంటోంది ఆ గొంతు. వారి పేరేమిటో చెప్పారు కానీ, ప్చ్... గుర్తుకు రావడం లేదు. నన్ను నేను సమర్థించుకోవటానికి దారులు వెతికే పనిలో పడ్డాను. నేను ప్రతికూలమైన వ్యక్తిని కాదని అతడిని సానుకూల పరి చేందుకు ప్రయత్నించాను. కానీ అతడు కొన్ని క్షణాల పాటు మాత్రమే నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వగలిగాడు. ‘‘నేను చెబుతాను ఏం రాయాలో’’ అన్నాడతను. అతడి స్వరంలోని అలజడి కాస్త నెమ్మదించింది. అంతకు ముందున్న అసహనం స్థానంలో ప్రశాంత చిత్తం ప్రతిఫలించింది. ‘‘మీకొక చిన్న సలహా ఇస్తాను. భారతదేశంలో మీకు నచ్చే వాటి గురించి మీరెందుకు రాయ కూడదు? ఆదివారం ఉదయం నేను మీ కాలమ్ చదివి సంతోషంగా, సంతృప్తికరంగా ఉండేందుకు అందులో నాకు మూడు మంచి కార ణాలు చూపించండి. కానీ మీరేం చేస్తున్నారో తెలుసా? పూర్తి భిన్న మైన అనుభూతులను నాకు కలిగిస్తున్నారు’’ అన్నాడు. ఫోన్ పెట్టేశాను. అతడి మాటలు నన్ను అయోమయంలోకి నెట్టేసినా, అతడితో సంభాషణ ఆశ్చర్యకరంగా నాకు సంతోషాన్ని కలుగజేసింది. మొదటిగా చెప్పాలంటే – అతడి వాదనను నేను అంగీ కరించనప్పటికీ, అతడి వైపు నుంచి అది నిజమే కావచ్చు. నాకున్న విమర్శించే హక్కును – అవసరమైతే దుడుకుగా, అదే సమయంలో దాడి చేసినట్లు కాకుండా – నేను వదులుకునే ప్రశ్నే లేనప్పటికీ అప్పు డప్పుడు ప్రశంసించడం, మెచ్చుకోవడం కూడా అవసరమేనని నేను ఒప్పుకుంటాను. మరీ ముఖ్యంగా నేను చెప్పవలసింది, ఇదే విధమైన సంభాషణ మునుపు కూడా అనేకసార్లు నా అనుభవంలోకి వచ్చింది. అయినప్పటికీ, గతంలో ఎప్పుడూ కూడా నేను ఈ విషయమై గమనింపుతో లేననీ, కనీసం అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేయలేదనీ నా కళ్లు తెరుచుకున్నాయి. ఇప్పుడది వచ్చి నేరుగా నా ముఖానికే తగిలిన అభిప్రాయం కాబట్టి బహుశా నేను దాన్నుంచి తప్పించుకునే అవ కాశమే లేదు. నిజం అని తాము నమ్మిన దానిని భారతీయులు ఒక అద్భు తమైన విధానంలో వ్యక్తపరుస్తారు. ఏమాత్రం సంకోచం లేకుండా అనువుకాని వేళనైనా చొరవ చేసుకుని వచ్చి తటాలున పేలుతారు. అందులో నమ్మదగనిదేం ఉండదు. అలాగే, ఎవర్న యినా తక్కువ చేస్తున్నామా అనే ఆలోచనా వారిలో కనిపించదు. పైపూతలేం ఉండవు. మన సులో ఏదుంటే అది, చేర్పులేమీ చేయనట్లుగా స్వచ్ఛంగా ఉంటుంది. అది కొన్నిసార్లు బాధాక రంగా ఉన్నప్పటికీ దాదాపుగా అదే ఎల్లప్పుడూ ఒక బాధా నివారిణిగా పనికొస్తుంది. ‘ఊరియా హీప్’ (చార్లెస్ డికెన్స్ నవల ‘డేవిడ్ కాపర్ఫీల్డ్’లో వినయాన్ని నటించే కపటి పాత్ర)కు దీటుగా మనం కలిగి ఉన్న సమాన కపట సామర్థ్యాన్ని అది పోగొడుతుంది. నిజానికి మరే ఇతర దేశంలోనూ ఇంతటి అద్భుతమైన గుణం ఉన్నట్లు కనిపించదు. బ్రిటిష్‌వాళ్లు మరీ ఉదాసీనంగా ఉంటారు. ఫ్రెంచి వాళ్లు లొడలొడా మాట్లాడుతారు. జర్మనీ దేశస్థులు ఎక్కువ న్యాయ బద్ధంగా పోతారు. ఇటాలియన్లు గడబిడ మనుషులు. అమెరికన్లకు పెద్దగా ఏం తెలియదు. సత్యంలా కనిపించేది ఏదైనా చైనీయుల్ని భయపెడుతుంది. కేవలం మన దేశంలో మాత్రమే ముక్కూమొహం తెలియనివారు మాటల కవాతు చేస్తారు. రాత్రిళ్లు పొద్దు పోయాక ఫోన్ చేసి, వాళ్ల మనసులో ఉన్నదానిని మీ ముఖానికేసి కొడతారు. అంతేకాదు... వాళ్ల వ్యాఖ్య వాళ్ల వ్యక్తిగతం అనీ, అర్ధరాత్రి కూడా దాటేసిందనీ, లేదా ఎవరైనా వింటూ ఉంటారనే నిజాలను కూడా వారు గ్రహించని స్థితిలో ఉంటారు. అటువంటి ప్రవర్తనతో అందరికీ తాము వేడుక అవుతున్నా మని తెలిసినా లెక్కచేయరు. వాళ్లు అలా ఎందుకు చేస్తారంటే, వాళ్లకు అలా చేయాలనిపించింది కనుక! వారిని అలా చేయించే ఉద్వేగం కనీస మర్యాదల్ని, సౌమ్యగుణాన్ని, చివరికి అవకాశం లేకపోవడాన్ని కూడా పట్టించుకోనివ్వదు. అలా తన్నుకొచ్చేస్తుందంతే! కనుక, ఈ ఉదయం... ఇంతకుముందు నేను సరిగా ఆలోచించని నాలో ఉండవలసిన గుణం గురించి నాలో ఆలోచన రేకెత్తించిన నా నడిరేయి సంభాషణకర్తను అభినందించాలని అనుకుంటున్నాను. మీలాంటి వాళ్లే సర్, ఒక మనిషిలో విమర్శించనందువల్ల కలిగే స్వీయ ఆమోదాన్ని, ఆత్మసంతృప్తిని కదిలిస్తారు. మీ కాల్ నాకు గొప్ప ప్రయోజనం కలిగించింది. ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇక్కడ ముస్లిమ్ కావడం నేరమా?
భారత రాజ్యాంగం భారతదేశాన్ని లౌకికరాజ్యంగా నిర్వచించింది. అందులోని లౌకిక భావానికి తీవ్రమైన సవాలుగా పరిణమిస్తున్న ఘటనలు నేడు దేశంలో అనేకచోట్ల సంభవిస్తున్నాయి. అధిక సంఖ్యాకుల ప్రాధాన్యాలకు కట్టుబడి అల్పసంఖ్యాకులు, ముఖ్యంగా ముస్లింలు జీవించక తప్పదనే వాస్తవాన్ని పాలనాపరమైన నిర్ణయాలు బలపరుస్తున్నాయి. దీనివల్ల ‘అధిక సంఖ్యాకుల దేశంలో అల్పసంఖ్యాకులుగా ఉండటం అనేది ఎలాంటిది?’ అనే ప్రశ్న రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ఆ ప్రశ్న అడిగే భారతీయుల సంఖ్య నానాటికీ ఎక్కువవుతుండటం గురించే మనం ఆందోళన చెందాలి. ఆఖరికి, ఉనికి వంటి అతి ముఖ్యమైన గుర్తింపు నిరాకరణకు కూడా ఒక వర్గాన్ని గురి చేయడం సమ్మతం అవుతుందా? వాదనలకిది తావులేని ప్రశ్న కాకున్నా, ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటం ఎలాంటిది?’’ అని మనం ఎక్కువగా అడుగుతుండటాన్ని అత్యంత దురదృష్టకరమైన అభియోగాలలో ఒకటిగా నేడు మనదేశం ఎదుర్కొంటూ ఉంది. ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటమన్నది ఎలాంటిది?’’ అనే ఈ ప్రశ్నకు జవాబు – ఒక హిందువు, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ లేదా నాస్తికుడిగా ఉండటం ఎలాంటిది అనే ప్రశ్నకు వచ్చే సమాధానానికి భిన్నంగా ఏమీ ఉండనవసరం లేదు. కానీ ఉంటోంది! అలా ఎందుకు ఉంటున్నదో... జియా ఉస్ సలామ్ తాజా పుస్తకం ‘బీయింగ్ ముస్లిం ఇన్ హిందూ ఇండియా: ఎ క్రిటికల్ వ్యూ’... కలవర పాటును కలిగించే వివరాలతో విశదీకరిస్తోంది. కాస్త వెనక్కెళ్లి ముందుకొస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి. గత దశాబ్ద కాలంలో పరిస్థితి ఇంతని అంతని చెప్పలేనంతగా దిగజారిపోయింది. దేశంలో ముస్లింల జనాభా 15 శాతం. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో వారి వాటా కేవలం 4.9 శాతం. పారా మిలిటరీ సైనిక దళాల్లో 4.6 శాతం. ఐయ్యేఎస్‌లు, ఐఎఫ్ఎస్లు, ఐపీఎస్‌లలో 3.2 శాతం. సైన్యంలో బహుశా తక్కువలో తక్కువగా 1 శాతం. 2006 సచార్ కమిటీ నివేదిక ప్రకారం... ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా షెడ్యూల్డు కులాలు, తెగల కంటే కూడా మరీ అధ్వా న్నమైన జీవన స్థితిగతులలో ఉన్నారన్నది మనకు తెలిసిన విషయమే. రాజకీయాలలో సైతం, ఒకప్పుడు వారి స్వరం వినిపించిన చోట ఇప్పుడది క్షీణిస్తూ ఉండటం మాత్రమే కాదు, కొన్ని చోట్ల వెనక్కు మళ్లుతూ కూడా ఉంది. దామాషా ప్రకారం ముస్లింలకు లోక్‌సభలో 74 సీట్లు ఉండాలి. కానీ ఉన్నది 27 మంది. మన 28 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రానికి కూడా ముస్లిం ముఖ్యమంత్రి లేరు. 15 రాష్ట్రాలలో ముస్లిం ఎంపీలే లేరు. 10 రాష్ట్రాలలో మాత్రమే మైనారిటీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఒక ముస్లిం ఉన్నారు. అదేమీ విశేషం కాదు కదా! నిజానికి ఏ పార్టీ కూడా భారతీయ జనతాపార్టీ అంత కరాఖండిగా ముస్లింలకు ముఖం చాటేయలేదు. 2014లో గానీ, 2019లో గానీ బీజేపీ ఒక్క ముస్లింను కూడా లోక్‌సభ ఎంపీగా ఎన్నికలకు ఎంపిక చేసుకోలేదు. నేటికీ ఆ పార్టీ కనీసం రాజ్యసభకు ఎంచుకున్న ముస్లిం ఎంపీ ఒక్కరు కూడా లేరు. కర్ణాటకలో 14 శాతం మంది, ఉత్తర ప్రదేశ్‌లో 19 శాతం మంది ముస్లింలు ఉన్నప్పటికీ బీజేపీకి ఆ రాష్ట్రా లలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. గుజరాత్లో 1998 నుండి ఏ లోక్‌సభకు, లేదా ఏ విధాన సభకు కూడా ముస్లిం అభ్యర్థిని నిల బెట్టలేదు. అంతెందుకు, గత ఏప్రిల్‌లో కర్ణాటక మాజీ ఉప ముఖ్య మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప బీజేపీకి ముస్లింల ఓట్లే అవసరం లేదన్నారు. పాలకపక్ష నాయకులు, వారి సన్నిహిత మద్దతుదారులు ముస్లింల గురించి ఏదైతే మాట్లాడుతుంటారో ఆ ప్రకారం ముస్లింల పరిస్థితి మన దేశంలో దిగజారిపోతూ ఉంటుంది. వారిని ‘బాబర్ కీ ఔలాద్’ (బాబర్ సంతానం) అంటుంటారు. ‘అబ్బా జాన్’లు అంటూ అవహేళన చేస్తుంటారు. ‘పాకిస్తాన్‌కు వెళ్లిపొండి’ అని పదే పదే చెబుతుంటారు. వారి ఊచకోతకు íపిలుపు అందినప్పుడు – అయితే గియితే, కొన్ని బీజేపీ గొంతులు ఆ పిలుపును ఖండిస్తూ మాట్లాడతాయి. వారు అల్లర్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే నేర నిర్ధారణ కాకముందే వారి ఇళ్లు నేలమట్టం అవుతాయి. తరచూ వారు లవ్ జిహాద్, పశువుల అక్రమ రవాణా ఆరోపణలతో హత్యకు గురవుతుంటారు. 2019 జూన్‌లో జార్ఖండ్‌లో ఒక ముస్లిం వ్యక్తికి ఏం జరిగిందనే దాని గురించి జియా ఉస్ సలామ్ పుస్తకం నుంచి నేనొక ఉదాహరణ ఇస్తాను. ఏదో ఒక ఉదంతాన్ని ప్రత్యేకంగా పేర్కొనడం ముస్లింలపై కనబరుస్తున్న అసహనాన్ని వేలెత్తి చూపడం కోసమేనని అనిపించవచ్చు కానీ, అటువంటి అనేక ఘటనలకు ఇదొక దృష్టాంతం. ‘‘విధ్వంసకరమైన ఆ హింసాత్మక సమూహం... అతడిని దీపస్తంభానికి కట్టివేసి ఇనుప కడ్డీలు మొదలు... కర్రలు, టైర్లు, బెల్టుల వరకు... చేతిలో ఏది ఉంటే అది తీసుకుని చావబాదింది. ఆ వ్యక్తి తల, చేతులు, ముఖం రక్తం ఓడుతున్నాయి. అతని కాళ్లు వాచిపోయాయి. చాలాచోట్ల ఎముకలు విరిగి పోయాయి. ఆ దెబ్బలకు నిలబడలేక మనిషి కూలి పోయాడు. అతడు చేసిన నేరం ఏమిటి? నేటి కొత్త భారతదేశంలో అతడొక ముస్లిం అవడమేనా?’’ ఇదేమీ నూటికో కోటికో ఒకటిగా జరిగిన ఘటన కాదని పుస్తకంలో జియా పొందుపరిచిన వాస్తవాలు సూచిస్తున్నాయి. ‘‘ముస్లింలపై ఇటు వంటి ద్వేషపూరితమైన నేరాలు 2014–2017 మధ్య కాలంలో 30 శాతం పెరిగాయి. అనంతరం, 2019లో మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. మతవిద్వేష నేరాలు రెట్టింపు అయ్యాయి. ఉనికి వంటి అతి ముఖ్యమైన గుర్తింపు నిరా కరణకు కూడా ముస్లింలు గురయ్యారు. ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్... ‘‘ప్రతి భారతీయుడూ హిందువే’’ అని అన్నారు. ఈ మాటను ముస్లింలు మాత్రమే కాదు, సిక్కులు కూడా సమ్మతించరు. అయినప్పటికీ ఆయన మరికాస్త ముందుకు వెళ్లి... ‘‘ఈ రోజున భారత దేశంలో ఉన్నవారంతా హైందవ సంస్కృతికి,హిందూ పూర్వీకులకు, హిందూ భూభాగానికి చెందినవారు. ఇందులో రెండో మాటే లేదు’’ అన్నారు. ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటం ఎలాంటిది?’’ అనే ప్రశ్నకు వచ్చే సమాధానం ఎందుకని మన దేశ సమగ్రతకూ, భవిష్యత్తుకూ ముప్పు కలిగించేలా ఉంటుందో వివరించేందుకు చాలినంతగా చెప్పాననే నేను భావిస్తున్నాను. ఇది చాలా స్పష్టమైన సమాధానమని నేను చెప్పగలను. కానీ ఈ సమాధానం మన ముస్లిం సోదరులకు, సోదరీ మణులకు ఎలా అనిపిస్తుందో ఒక్కక్షణం ఆలోచించండి. తక్కిన మనందరికీ ఇది మనదికాని సమస్యపై ఒక విశ్లేషణ. వారికి మాత్రం వారి జీవన్మరణ సమస్య. సమస్య గురించి మనం ఆశాజనకమైన రీతిలో లోతుగా ఆలోచిస్తాం. కానీ వారు ఆ పరిస్థితిలో జీవిస్తారు. అది మరింత దారుణంగా తయారవదు కదా అని బిక్కుబిక్కుమంటుంటారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఏం చెప్పినట్లు? ఏం చెప్పనట్లు?
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే, ‘రద్దు రాజ్యంగ బద్ధమే కానీ, అందుకోసం అనుసరించిన విధానం సమర్థనీయం కాదు’ అని అభిప్రాయపడటం చర్చనీయాంశం అయింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి వీలుగా కశ్మీర్ ‘రాజ్యాంగ సభ’ను కశ్మీర్ ‘రాష్ట్ర శాసన సభ’ అనే అర్థంలోకి తెచ్చేందుకు వెసులుబాటును కల్పించే ఆర్టికల్ 367ను కేంద్రం వాడుకుంది. మళ్లీ ఈ 367 సవరణ కోసం నియమ విరుద్ధంగా 272వ రాజ్యాంగ ఉత్తర్వును ఆసరా చేసుకుంది. ఇది అధికారాన్ని దాటి వెళ్లడమేనని న్యాయస్థానం అంటూనే, రద్దును సమర్థించడం తీర్పు సంపూర్ణత్వంపై న్యాయపరమైన సందేహాలను రేకెత్తిస్తోంది. మునుపు చెప్పిన దానినే మళ్లీ చెప్పడంతో ప్రారంభిస్తాను. ఒక సంక్లిష్టమైన ముగింపును అర్థం చేసుకోడానికి అత్యుత్తమమైన మార్గం ఏమిటంటే స్పష్టత అవసరమయ్యే అంశాలను లేవనెత్తే ప్రశ్నలకు రూపకల్పన చేసు కోవడం. చీకటి సొరంగంలో చిన్న కాంతిరేఖను కనుగొనడం వంటిది ఇది. అందువలన నన్ను కశ్మీర్‌పై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల వైపు వెళ్లనివ్వండి. ‘రద్దు’ అని అంతా అంటున్న ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నేను విషయాన్ని ప్రారంభిస్తాను. రద్దును సమర్థించడాన్ని అలా ఉంచితే – ఆర్టికల్ 370ని రద్దు చేయ డానికి వీలుగా కశ్మీర్ ‘రాజ్యాంగ సభ’ను కశ్మీర్ ‘రాష్ట్ర శాసన సభ’ అనే అర్థంలోకి తెచ్చేందుకు వెసులుబాటును కల్పించే ఆర్టికల్ 367ను కేంద్రం వాడుకుంది. మళ్ళీ ఈ 367 సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమ విరుద్ధంగా 272వ రాజ్యాంగ ఉత్తర్వు (కాన్స్టిట్యూషనల్ ఆర్డర్)ను ఆసరా చేసుకుంది. ఇది అధికార అతిక్రమణేనని బెంచిలోని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుకు కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న ఈ మార్గం చట్ట విరుద్ధమైనది కనుక రద్దు చెల్లుబాటు అవదని నిజానికి కోర్టు తీర్పు ఇవ్వవలసింది. కానీ అలా ఇవ్వలేదు. బదులుగా, క్లాజ్ 3ని ఉపయోగించి ఆర్టికల్ 370ని రద్దు చేయవచ్చని పేర్కొనడం ద్వారా కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థించింది. దీనర్థం... ప్రభుత్వం తప్పుగా చేసింది కానీ, మరోలా చేసి ఉంటే తప్పేమీ అయివుండేది కాదని కోర్టు తీర్పు ఇవ్వడం. అంటే ప్రభుత్వాన్ని సమర్థించడం. ఇది నాకు ప్రభుత్వం నోటిలో న్యాయస్థానమే వాదనలు పెట్టి నట్లుగా అనిపించింది. అయితే అవి ప్రభుత్వ వాదనలు కావు. దీనిపై కపిల్ సిబాల్, ‘‘ఆర్టికల్ 370పై ప్రభుత్వ స్వీయ అవగాహనకు, కోర్టు తీర్పునకు కొద్దిగానైనా పొంతన లేదు. సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇవ్వడం సరైన విధానమేనా?’’ అని ట్వీట్ చేశారు. ఆర్టికల్ 367లో రాజ్యాంగ ఉత్తర్వు 272 ద్వారా ప్రవేశపెట్టిన క్లాజు 3 ప్రకారం, కశ్మీర్ రాజ్యాంగ సభను రద్దు చేయొచ్చన్న వాదన కూడా... ‘కశ్మీర్ రాజ్యాంగ’ సభ రద్దు అవడం అంటే ‘కశ్మీర్ అసెంబ్లీ’కి ఉండే సిఫారసు అధికారం ఉనికిలో లేకుండా పోవడం మాత్రమే అనే వాదనపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప రద్దుకు భారత రాష్ట్రపతికి ఉన్న అధికారంపై – సిఫారసు చేసేందుకైనా, చేయకుండా ఉండేందుకైనా – అది ఎలాంటి ప్రభావమూ చూపదు. ఈ వాదన ఆమోదయోగ్యమైనదా లేక వివాదాస్పదమైనదా?ఇప్పుడిక ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు...అంటే, జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా కుదించేందుకు...కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నదా లేదా అని నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయానికి వద్దాం. కోర్టు రెండు వాదన లపై ఆధారపడింది. ఒకటి: ‘‘ఆర్టికల్ 356 అమలులో ఉన్న సమయంలో రాష్ట్రపతి తీసుకున్న ఏ నిర్ణయాలపైన అయినా వచ్చే దావాల విచారణకు కోర్టు కొలువు తీరవలసిన అవసరం ఉంటుందని మేము భావించడం లేదు. ఎందుకంటే రాష్ట్రం తరఫున రాష్ట్రపతి, పార్ల మెంటు తీసుకున్న ప్రతి చర్య కూడా సవాలుకు అనువుగా ఉంటే కష్టం. అప్పుడిక రాష్ట్రపతి పాలనలో తీసుకున్న ప్రతి చర్యతోనూ విభేదించే ప్రతి వ్యక్తినీ ఇది ఎలాంటి అడ్డంకులూ లేకుండా కోర్టు వరకు రానిస్తుంది’’ అని! రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ రాజ్యంగబద్ధమేనా, కాదా అని నిర్ధారించేందుకు నిరాకరించిన కోర్టు అందుకు చూపించిన ఈ కారణం న్యాయబద్ధమైనదేనా? కోర్టు చూపించిన రెండవ కారణం – ఆర్టికల్ 3 కింద రాష్ట్ర శాసనసభ సిఫారసులు అమలుకు బద్ధతను కలిగి లేవు. అందులో సందేహం లేదు. అయినప్పటికీ రాజ్యాంగం ప్రకారం అదొక∙ప్రక్రియ. సిఫారసులకు బద్ధమై ఉండే అవసరం లేనంత మాత్రాన కోర్టు తన నిర్ణయం చెప్పడానికి నిరాకరించవచ్చునా? ఇప్పుడు, పునర్వ్యవస్థీకరణ రాజ్యాంగబద్ధమైనదా, కాదా అని నిర్ధారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన పర్య వసానంగా జరిగేది ఒకటేమిటంటే... ఇదే పద్ధతిలో మరికొన్ని పునర్వ్యవస్థీకరణలు జరగవచ్చు. ప్రభుత్వం బెంగాల్, కేరళ, తమిళనాడులలో రాష్ట్రపతి పాలనను ప్రక టించి, అసెంబ్లీ అధికారాలను పార్లమెంటుకు బదిలీ చేసి, ఆ తర్వాత – రాష్ట్రాన్ని రద్దు చేయాలా, లేక కేంద్రపాలిత ప్రాంతంగా రాష్ట్ర స్థాయిని తగ్గించాలా అన్న దానిని పార్లమెంటులో నిర్ణయించవచ్చు. ఈ విధానం, మున్ముందు ఒక ఆనవాయితీగా స్థిరపడిపోతుంది. రెండో పర్యవసానం... బహుశా మరింత ముఖ్యమైనది. సమాఖ్య భావన (ఫెడర లిజం) అనేది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగం అని కదా అలోక్ ప్రసన్న కుమార్ అంటారు. దాని అర్థం దాన్ని పార్లమెంటు సవరించలేదని! అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అధికారాన్ని పార్లమెంటరీ అధికారంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానిం చింది. దీనివల్ల పార్లమెంటు అధికారానికీ, రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ ప్రాముఖ్యతకూ మధ్య ఇప్పుడు మనకు ఘర్షణ తలెత్తడం కనిపించదా? ‘ది హిందూ’ మరింత విస్తృతమైన అంశాన్ని వెల్లడించింది. ‘‘ఒక రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు రాష్ట్ర శాసనసభ తరఫున ఎటువంటి చర్యనైనా – శాసనపరమైనవి, తిరుగులేని పరిణా మాలకు తావిచ్చేవి – ఏవైనా గానీ కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చుననే ఒక సహేతుకం కాని తీర్మానాన్ని సుప్రీంకోర్టు తీర్పు సూచిస్తోంది’’ అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. దీని పైనే అర్ఘ్యా సేన్‌గుప్తా మాట్లాడుతూ, ‘‘ఇది భారతదేశ సమాఖ్యతత్వ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన పరిణామాలతో ముడివడి ఉన్న రాజ్యాంగపరమైన ప్రశ్న’’ అన్నారు. అంటే... కోర్టు తన తాజా తీర్పుతో సమస్యల తుట్టెను కదిలించినట్లయిందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే కశ్మీర్ తీర్పుల గురించి నేనేమనుకుంటున్నానో నాకు తెలుస్తుంది. కానీ ఆ సమాధానాలను ఎవరు అందిస్తారు? - కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భారత్‌పై అభియోగాల పత్రం
విలియం షేక్స్పియర్ నాటకం ‘ద మర్చెంట్ ఆఫ్ వెనిస్’లో షైలాక్ కనికరం లేని వడ్డీ వ్యాపారి. స్నేహితుడి కోసం ‘నాదీ పూచీ’ అంటూ డబ్బు తీసుకుని చివరికి తీర్చలేకపోతాడు ఆంటోనియో. పరిహారంగా ఒక పౌండు ఆంటోనియో మాంసాన్ని అడుగుతాడు షైలాక్. భారత్‌పై యూఎస్ తాజా అభియోగ పత్రంలోని నేరారోపణలు కొంతవరకు ఆంటోనియోను గుర్తు చేసే విధంగా ఉన్నాయి. అమెరికన్ పౌరుడు గురుపథ్‌వంత్ సింగ్ పన్నూపై కొద్దిరోజుల క్రితం జరిగిన హత్యాయత్నం వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందన్నది అమెరికా ఆరోపణ. సంబంధాలు ఇరు దేశాలకూ ముఖ్యమే కనుక యూఎస్ ఈ విషయంలో మౌనంగా ఉండి, షైలాక్లాగా భారత్ నుంచి పరిహారంగా ‘ఒక పౌండు మాంసాన్ని’ కోరుతుందా? చేర్పులు, జోడింపులతో మరింతగా బలప రిచి అమెరికా ప్రభుత్వం తాజాగా బహిర్గత పరచిన పూర్వపు అభియోగ పత్రాన్ని ఒక కల్పిత కథనంగా మీరు విశ్వసిస్తే తప్ప, అందులోని వెల్లడింపుల పట్ల అందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ, విచారణకు వెళ్లనున్న కేసు అది. తేలిగ్గా కొట్టి పడేసి పక్కకు తోసేయవలసినది కాదు. కాబట్టి, సహాయకారిగా ఉంటుందనుకుంటే కనుక మనం దృష్టి సారించవలసిన అంశాలను కొన్ని ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా ఒక జాబితాగా పొందుపరుస్తాను. మొదటిది – అమెరికా గడ్డ మీద ఒక అమెరికన్ పౌరుడిని (నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ సంస్థ నేత గురుపథ్ వంత్ సింగ్ పన్నూ) హత్య చేయించేందుకు సిసి–1 అనే సంకేత నామధారి పథక రచన చేయడం! యు.ఎస్. తిరగ రాసిన అభియోగ పత్రంలోని అరోపణ లను బట్టి– ‘భద్రతా నిర్వహణ’, ‘ఇంటెలిజెన్స్’ విభాగాలలో బాధ్య తలు నిర్వర్తిస్తూ తనను తాను ‘సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్’నని చెప్పుకుంటున్న ఆ సంకేత నామధారి భారత ప్రభుత్వ సంస్థలో గుర్తింపు పొందిన ఉద్యోగిగా ఉన్నాడు. గతంలో అతడు సెంట్రల్ రిజర్వ్›్డ పోలీస్ ఫోర్స్‌లో కూడా పని చేశాడు. మరీ ముఖ్యంగా ఈ సిసి–1 అనే వ్యక్తి ఆ అభియోగ పత్రంలో పేర్కొన్న అన్ని సమయాలలోనూ భారత ప్రభుత్వం నియమించిన విధుల నిర్వహణలో ఉన్నాడు. ఇండి యాలోనే ఉన్నాడు. ఇండియా నుంచే హత్యకు కుట్ర పన్నాడు. ఇదేం సూచిస్తోంది? సిసి–1 వెనుక భారత ప్రభుత్వం ఉందనా? లేక సిసి–1 అనే అతడు ఒక మోసగాడు అయి ఉండవచ్చుననా? రెండవది – ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మోసగాడు ఎలా ఉండి ఉంటాడు? ఒంటరి తోడేలు మాదిరిగానా? లేక, దేశ అత్యుత్తమ ప్రయో జనాల కోసం పనిచేస్తున్న ఒక చిన్న సమూహంలో భాగంగానా? లేదా అన్ని అధికారిక అనుమతులతో వ్యూహాత్మక టక్కరిగా నటిస్తున్న అత్యున్నతస్థాయి ప్రభుత్వ అధికారి అయివుంటాడా?మూడవది – ఆ సిసి–1 ఎవరైనా గానీ అసమర్థంగా ఈ పనిని నిర్వహించాడా? ‘నిఖిల్ గుప్తా అనే ఒకానొక అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రవాణా వ్యాపారిని సిసి–1 పనిలోకి దింపాడు.’ తనకు తెలియకుండానే అలా చేశాడా? తెలియకపోతే తెలుసుకోవలసిన పని లేదా? ఒకవేళ ఉద్దేశపూర్వకంగానే నిఖిల్ గుప్తాను ఎంచుకుని ఉంటే అది తెలివైన ఎంపికేనా? నాల్గవది – ఇక నిఖిల్ గుప్తా ఏం చేశాడంటే ‘డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్’ (డి.ఇ.ఎ.)కు రహస్య సమాచారం అందించే వ్యక్తిగా మారిన ఒక భాగస్వామ్య నేరస్థుడిని సంప్రదించాడు. ఆ వ్యక్తి కిరాయి హంతకుడిగా నటిస్తున్న ఒక రహస్య ప్రభుత్వ అధికారి (అండర్ కవర్ ఏజెంట్) దగ్గరికి గుప్తాను తీసుకెళ్లాడు. దీన్నిబట్టి డి.ఇ.ఎ. గుప్తాను నీడలా వెంటాడుతోందనీ, కాబట్టి గుప్తా గురించి మన వరకు రాని అనేక విషయాలు డి.ఇ.ఎ.కు తెలిసి ఉంటాయనీ అనుకోవచ్చా? మరీ ముఖ్యంగా, ఇదొక దారుణమైన గందరగోళంగా అనిపించడం లేదా? బహుశా దీనికంటే ‘డాడ్స్ ఆర్మీ’ (హోంగార్డులు) నయం కదా? ఐదవది – కెనడాలో జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత, ‘రక్తంతో తడిసిన నిజ్జర్ మృతదేహం ఆయన వాహనంపై పడివున్నట్లు చూపించే వీడియో క్లిప్పును గుప్తాకు సిసి–1 పంపించాడు.’ ఈ ఆరోపణ... సిసి–1కి నిజ్జర్ హత్యతో నేరుగా సంబంధం ఉందని చెప్పడానికి యు.ఎస్. అధి కారులు సాక్ష్యాధారాలను సృష్టించడాన్ని సూచిస్తోందా? అదే నిజమైతే భారత్‌పై జస్టిన్ ట్రూడో ఆరోపణలకు ఆ సాక్ష్యాధారాలే బలం చేకూరుస్తున్నాయా? కలవరపరిచే సమాచార వ్యవస్థ ఆరవది – ‘హత్య తర్వాత కొన్ని వారాల పాటు గుప్తా... భాగ స్వామ్య నేరస్థునితో, ఆ తర్వాత కిరాయి హంతకుడితో – ఫోన్, వీడియో, టెక్స్›్ట మెసేజేస్ వంటి వాటి ద్వారా వరుసగా ఎలక్ట్రానిక్, రికార్డెడ్ సంభాషణలను జరిపాడు’ అని యు.ఎస్. అభియోగ పత్రం చెబుతోంది. ఆ సంభాషణలు సంకేత నిక్షిప్త సందేశాల రూపంలో ఉన్నప్పటికీ వాటిని అడ్డగించి ఉంటారు. అంటే యు.ఎస్. అధికారుల వద్ద ఇప్పటికీ బయట పెట్టని సమాచారం గుట్టలు గుట్టలుగా మిగిలి ఉందనేనా? అది కూడా మన సమాచార వ్యవస్థ తాలూకు పటిష్ఠత, భద్రతల గురించి కలవరపరిచే ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఏడవది – కనీసం నాలుగు వేర్వేరు చోట్ల హత్యకు వ్యూహం పన్నినట్లు యు.ఎస్. అభియోగ పత్రం చెబుతోంది. వాటిల్లో ఒకటి న్యూయార్క్‌లో... బహుశా గురుపథ్‌వంత్ సింగ్ పన్నూని హత్య చేయడం కోసం... మరొకటి క్యాలిఫోర్నియాలో, మరో రెండు కెనడాలో! నిజానికి ఒక దశలో గుప్తా... ‘‘మేము ప్రతి నెలా 2–3 జాబ్ వర్క్‌లు ఇస్తాం’’ అని అన్నట్లు యు.ఎస్. ఆరోపణలలో ఉంది. ఇదెలా వినిపిస్తోంది? ఒకే ఒకసారి హత్యలన్నిటికీ లేదా వరుస హత్యల ప్రారంభానికి పథక రచన జరిగిందనే అర్థం ధ్వనించడం లేదా? చివరిగా – యు.ఎస్. ప్రభుత్వ స్పందన. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ ఆగస్టు నెలలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎదుట అమెరికా స్పందనను ప్రస్తావనకు తెచ్చారు. ఒక వారం తర్వాత సి.ఐ.ఎ. అధినేత విలియమ్ బర్న్స్ భారత్‌లోని ఆర్.అండ్ ఎ.డబ్లు్య.(రా) అధినేతతో మాట్లాడేందుకు ఢిల్లీ వచ్చారు. తర్వాత అధ్యక్షుడు జో బైడెన్ సెప్టెంబరులో జి–20 సదస్సులో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆ నెలాఖరున వాషింగ్టన్లో మళ్లీ సల్లివాన్, యు.ఎస్. విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్... విషయాన్ని జైశంకర్ దృష్టికి తెచ్చారు. చివరిగా అక్టోబర్‌లో నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హెయిన్స్ మరిన్ని అభియోగ వివరాలతో భారతదేశానికి వచ్చారు. దీనర్థం... వైట్ హౌస్ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోందనే కదా! వాస్తవానికి దోవల్‌తో సల్లివాన్ ‘‘ఇలాంటిది మరోసారి జరగదన్న హామీని అమెరికా ప్రభుత్వం కోరుతోంది’’ అని అన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. కఠినమైన భాష కాదా ఇది? యు.ఎస్. అభియోగ పత్రం మొత్తం అంతా కల్పితం అని విశ్వసించినప్పుడు మాత్రమే మనం ఈ ప్రశ్నలన్నిటినీ విస్మరించగలం. కానీ మీరు ఈ ప్రశ్నలను పూర్తి పరిగణనలోకి తీసుకుంటే కనుక మరొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒకవేళ, చివరికి వాషింగ్టన్ ఈ వ్యవహారాన్నంతా చూసీ చూడనట్లు ఉండిపోయేందుకు నిర్ణయించుకుంటే – భాగస్వామ్య వ్యూహాత్మక ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి – భారత్ నుంచి ఒక ‘మాంస ఖండాన్ని’(పౌండ్ ఆఫ్ ఫ్లెష్) ప్రతి ఫలంగా కోరుతోందా? అమెరికన్ షైలాక్ దయతో నేనొక భారతీయ ఆంటోనియోగా ఉండటాన్ని ద్వేషిస్తాను. లేదా మనల్ని కాపాడేందుకు పోర్షియా వంటి కారుణ్యమూర్తి ఎవరైనా రెక్కలు కట్టుకుని ముందుకొస్తుందా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
గాజా ఒడ్డున విపత్తు వంటకం
సంధి గడువు ముగియగానే... గాజాపై ఇజ్రాయెల్ ఉద్దేశాలు ఎలా ఉండబోతున్నాయన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం ప్రస్తుతం దక్షిణ గాజాలో తలదాచుకున్న దాదాపు 20 లక్షల మంది గాజా పౌరులను కేవలం 2.5 కిలోమీటర్ల వెడల్పు, 4 కిలోమీటర్ల పొడవు ఉన్న అల్–మవాసి అనే చిన్న ముక్క లాంటి భూభాగంలోకి నెట్టివేయడం గురించి ఆలోచిస్తోందని తెలుస్తోంది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఒక నిర్దిష్ట ఫలితానికి దారితీసే ‘విపత్తు వంటకం’గా అభివర్ణించారు. 1948లో వెస్ట్ బ్యాంక్ నుంచి తమను తరిమేసినప్పుడు తొలిసారి శరణార్థులుగా మారిన గాజా ప్రజలు... ఇప్పుడు అల్–మవాసిలో చిక్కువడిపోతే కనుక రెండోసారి శరణార్థులుగా మారతారు. ఇప్పటివరకు అర్థం అవుతున్నదానిని బట్టి మన దృష్టి ఇజ్రాయెల్‌కూ, గాజాలోని పాలస్తీనా ప్రజలకూ మధ్య సంబంధాలపైన మాత్రమే కేంద్రీకతం అయి ఉంది. యుద్ధ సమయంలో ఇది అనివార్యంగా జరిగేదే. అయితే మీరు కనుక ఇజ్రాయెలీలకు, పాలస్తీనియన్లకు మధ్య గల విస్తృతమైన సంబంధాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం ఇజ్రాయెల్ తన లక్షల మంది పాలస్తీనా పౌరులను, వారితో పాటుగా 1967 నుంచి చట్టవిరుద్ధంగా తన ఆక్రమణలో ఉంచుకున్న వెస్ట్‌బ్యాంక్ ప్రాంత పాలస్తీనియన్లతో ఎలా వ్యవహరిస్తూ వస్తున్నదో కూడా తెలుసు కోవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఇస్తున్న కొన్ని వాస్తవాలు బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. మొదటిది, ఇజ్రాయెల్ ప్రజాస్వామ్య దేశం. కానీ అది యూదు పౌరులకు మాత్రమే. అక్కడి ‘నేషనల్ స్టేట్ చట్టం – 2018’ యూదు పౌరులకు, దేశంలోని పాలస్తీనా జాతీయులకు మధ్య వివక్షను పాటిస్తోంది. ఉదాహరణకు, ఇజ్రాయెల్‌లోని ‘పునరాగమన చట్టం’ (లా ఆఫ్ రిటర్న్) ప్రపంచంలోని ఏ మూల నుండి వచ్చిన యూదులైనా అప్రమేయంగా ఇజ్రాయెల్ పౌరసత్వం పొందేందుకు అనుమతిని ఇస్తోంది. కానీ అక్కడే పుట్టి, 1948 నక్బా (జాతి ప్రక్షాళన) విపత్తులో, 1967 యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌ను వదిలి వెళ్లిన పాలస్తీనా కుటుంబాల వారికి మాత్రం ఈ హక్కును నిరాకరిస్తుంది. తరలిపోయిన అన్ని పాలస్తీనా కుటుంబాలు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు హక్కును కల్పిస్తున్న ఐక్యరాజ్య సమితి 194వ తీర్మానాన్ని ధిక్కరించడమే ఇది. రెండవది–ఎటువంటి అభియోగమూ లేకుండా పాలస్తీనియన్లను నిర్బంధంలోకి తీసుకునేందుకు అనుమతినిచ్చే ‘అడ్మినిస్ట్రేటివ్ డిటెన్షన్ లా’ను ఇజ్రాయెల్ కలిగి ఉంది. ‘అల్ జజీరా’ చెబుతున్న ప్రకారం, ఇజ్రాయెల్ జైళ్లలో 7,200 మంది పాలస్తీనా ఖైదీలు ఉంటే వారిలో 2,200 మంది ఎలాంటి అభియోగమూ లేకుండా అరెస్ట్ అయినవారే. గత వారాంతంలో కాల్పుల విరమణ సందర్భంగా, ఇజ్రాయెల్ ఈ వైపు నుంచి 240 మందిని విడుదల చేస్తూనే, ఆ వైపు నుంచి 310 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. 3,100 మంది లేదా 7,200లో 43 శాతం మంది అక్టోబర్ 7 తర్వాత (ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన రోజు) అరెస్ట్ అయినవారే. ఇక, వెస్ట్ బ్యాంకు వైపు వెళ్దాం. 1967 నుండి 7,50,000 మంది ఇజ్రాయెలీలు వెస్ట్ బ్యాంక్ అనే పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించి, లోపలి వాళ్లను ఖాళీ చేయించి తాము అక్కడ స్థిరపడిపోయారు. ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమణదారులను అడ్డుకోక పోగా, వారికి రక్షణ కల్పించింది. దీనిని నెతన్యాహూ ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. ఐక్యరాజ్యసమితి గుర్తింపు ఉన్న పాలస్తీనాను కుట్టడానికి వీలుకాని అతుకుల బొంతలా మార్చింది. వెస్ట్ బ్యాంక్‌కు వలస వచ్చి స్థిరపడిపోయిన ఇజ్రాయెలీలతో ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి జరుగుతున్న హమాస్ ఘర్షణల్లో 240 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ‘అల్ జజీరా’ నివేదించింది. ‘‘వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై జరుగుతున్న తీవ్రవాద హింస ఆగాలని, హింసకు పాల్పడేవారిని జవాబుదారులను చేసి తీరాలని’’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ నాయకులకు నొక్కి చెప్పి నట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం పేర్కొంది. కానీ బైడెన్ మాటలను నెతన్యాహూ లెక్క చేయలేదు. ‘‘స్థిరపడిన వారి కదలికల గురించి చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని అధ్యక్షుడు బైడెన్‌కు చెప్పాను’’ అని పత్రికా సమావేశంలో అన్నారాయన. చివరిగా, çసంధి గడువులన్నీ ఒకసారి ముగిశాక గాజాపై ఇజ్రా యెల్ ఉద్దేశాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిన అంశం. నెత న్యాహూ ప్రభుత్వం ప్రస్తుతం దక్షిణ గాజాలో తలదాచుకున్న సుమారు 20 లక్షల మంది గాజా పౌరులను కేవలం 2.5 కిలోమీటర్ల వెడల్పు, 4 కిలోమీటర్ల పొడవు ఉన్న అల్–మవాసి అనే చిన్న ముక్క లాంటి భూభాగంలోకి నెట్టివేయడం గురించి ఆలోచిస్తూ ఉందన్న విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధిని ఉటంకిస్తూ ‘బీబీసీ’ దౌత్య సంబంధాల ప్రతినిధి పాల్ ఆడమ్స్ బహిర్గతం చేశారు. 1948లో వెస్ట్ బ్యాంక్ నుంచి తమను తరిమేసినప్పుడు గాజా ప్రజలు తొలిసారి శరణార్థులుగా మారారు. ఇప్పుడు వారు అల్–మవాసిలో చిక్కు పడిపోతే కనుక రెండోసారి శరణార్థులుగా మారతారు. నిజంగా ఇది అధ్వాన్నమైన స్థితి. పాలస్తీని యన్ల సంక్షేమం కోసం పని చేస్తుండే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్.ఆర్.డబ్లు్య.ఎ. కమ్యూనికేషన్్స డైరెక్టర్ జూలియెట్ తౌమా... అల్– మవాసి గురించి చెబుతూ ‘అక్కడ ఏమీ లేదు. కేవలం ఇసుక దిబ్బలు, తాటి చెట్లు మాత్రమే’ అని అన్నారు. ఆఖరికి ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రతినిధి అయిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ హెక్ట్ కూడా ‘‘అల్–మవాసి భయానకం కాబోతోంది’’ అన్నారు. అల్–మవాసీలో అవసరం అయిన మౌలిక సదుపాయాలు లేవు. ఆసుపత్రులు లేవు. అంతే కాదు, అత్యధికులు గుడారాలలో నివసించవలసి వస్తుంది. చలికాలం మొదలయ్యాక చలి గజగజ లాడిస్తుంది. తరచు వర్షాలు పడుతుంటాయి. అయినప్పటికీ కూడా... ‘‘మీ ప్రియమైన వారికి అల్–మవాసి అనుకూలమైన పరిస్థితులనే అంది స్తుంది’’ అని ఇజ్రాయెల్ రక్షణ దళానికి చెందిన మరొక ప్రతినిధి అవిచే ఆడ్రయీ చెబుతున్నారు. ‘‘అల్–మవాసికి సదుపాయాలు అందేలా చేయడం సహాయక సంస్థల బాధ్యతే’’నని ఇజ్రాయెలీ అధికారులు అన్నట్లు ‘బీబీసీ’ నివే దించింది. దీనిని బట్టి గాజావాసులను వారి కర్మకు వారిని ఇజ్రాయెల్ వదిలేయబోతున్నట్లు స్పష్టం అవుతోంది. కానీ ఆ మాటను వారు ఒప్పుకోడానికి సుముఖంగా లేరు. ‘‘గాజాలో జరగబోయే ఎలాంటి సురక్షిత ప్రాంత ఏర్పాటులోనూ మేము పాల్పంచుకోబోమని ‘ఐ.రా.స.’కు చెందిన 18 సంస్థలు, ఎన్జీవోలకు చెందిన అధినేతలు ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఈ అల్–మవాసి ప్రతి పాదనను... ఒక నిర్దిష్ట ఫలితానికి దారితీసే ‘‘విపత్తు వంటకం’’ అని అభివర్ణించారు. ‘‘సదుపాయాలు, సేవలు అందుబాటులో లేని అంత చిన్న ప్రదేశంలోకి అసంఖ్యాకంగా మనుషులను చేర్చడానికి ప్రయ త్నించడం వల్ల ఇప్పటికే ప్రమాదపుటంచున ఉన్న గాజా పౌరుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది’’ అని హెచ్చరించారు. ఇక్కడితో నేను ఆగిపోతాను. మీకు చేరని వాస్తవాలను, మన మీడియా వెల్లడించని ఇజ్రాయెల్ ఆలోచనలను మీకు తెలియ జేయడమే నా ఉద్దేశం. ఈసారి ఇజ్రాయెల్‌ను ఒక వర్ణవివక్ష రాజ్యం అని అనవలసి వచ్చినప్పుడు ఈ మాటలను దన్నుగా చేసుకోండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఓటమిని ఒప్పుకోవడమే క్రీడాస్ఫూర్తి
పది వరుస విజయాల తర్వాత ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోవడం హఠాత్ఘాతమే. తట్టుకోలేని దెబ్బే. అయితే అది ఒక వ్యక్తి ప్రవర్తనను, ప్రవర్తన విధానాన్ని ప్రభావితం చేసినందువల్ల... అతడిలో మనం ఆశించిన సౌమ్యతను, మర్యాదను అతడు విస్మరిస్తే దానిని మనం చూసీ చూడనట్లు వదిలేయాలా? 2021 యు.ఎస్. టెన్నిస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్... నొవాక్ జొకోవిచ్‌కి చాలా పెద్ద మ్యాచ్. అతడు ఆ మ్యాచ్‌ని గెలిస్తే ఒకే ఏడాదిలో మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్లలోనూ విజయం సాధించినట్లు అవుతుంది. అద్భుతంగా ఆడాడు. కానీ ఓడిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినప్పటికీ మెద్వెదేవ్‌ను మనస్ఫూర్తిగా అభినందించాడు. మన క్రికెటర్లు తమ ఓటమిని హూందాగా ఎలా స్వీకరించాలో నేర్చుకోవలసే ఉంది. పెద్దమనిషి అని ఒకర్ని అంచనా వేయడానికి ఉన్న అనేకమైన మార్గాలలో బహుశా అత్యంత సునిశి తమైనది... వారు ఓటమిలో సైతం సహజ నిశ్చల శాంత గాంభీర్యాన్ని కలిగి ఉండటమేనని నేను చెప్పగలను. ఇక ఆ పెద్దమనిషి క్రీడాకారుడు అయితే కనుక ఓటమిలోని అతడి నిశ్చలతకు మరింతగా ప్రాముఖ్యం ఉంటుంది. ఏదైనా మీరు తీవ్రంగా కోరుకున్నదీ, ‘మన చేతుల్లో పనే’ అనేంతగా మీరు తిరుగులేని నమ్మకంతో ఉన్నదీ... ఊహించని విధంగా మీ పట్టు నుంచి జారి, మిమ్మల్నొక కలలు కల్లలైన పరాజితునిగా మిగిల్చినప్పుడు మీ కదలి కలు, మీ కవళికలు ఎలా ఉంటాయన్నది మీ వ్యక్తిత్వంలోని నాణ్యత పాలును పైకి తేలుస్తుంది. గత ఆదివారం ఓటమి అనంతరం మన క్రికెట్ జట్టు నిలదొక్కుకోలేక పోయిన పరీక్ష ఇటువంటిదే. అందుకే నేను గుండెల్ని ముక్కలు చేసిన ఆ ప్రపంచ కప్పు పరాజయానికి భారత జట్టు ఎలా స్పందించిందో ఒక ఎంపికగా ఈ వారం రాయదలచాను. గొప్ప వీరులను మీరు మీ హృదయ పీఠాలపై ప్రతిష్ఠించుకున్నప్పుడే, వారి రూపాలను పంకిలపరిచే లోపాలను సైతం సమస్థాయిలో అంగీకరించడం అన్నది కూడా మీ ఆరాధనలోని ఒక తప్పనిసరి బాధ్యత అవుతుంది.. ముఖ్యంగా టీవీల ప్రత్యక్ష ప్రసారంలో వీరులైన మీ జగజ్జెట్టీలను ప్రపంచం అంతా కళ్లింత చేసుకుని చూస్తున్నప్పుడు! ‘‘భారతజట్టులోని చాలామంది ఆటగాళ్లు... విజేతలైన ఆసీస్ జట్టులోని క్రీడాకారులతో కరచాలనం చేసిన తర్వాత మైదానం విడిచిపెట్టారు. కనీసం ప్యాట్ కమిన్స్ ట్రోఫీని పైకెత్తి చూపడాన్ని వీక్షించేంత వరకైనా అక్కడ ఉండలేకపోయారు’’ అని మేథ్యూ సాల్విన్ ‘న్యూస్.కామ్.ఎయు’లో రాశారు. అదే నిజమైతే అటువంటి ప్రవర్తన అమర్యాదకరమైనది మాత్రమే కాదు, క్షమించరానిది కూడా! ఈ ధోరణి భారత జట్టును, భారత ప్రజలను కూడా చెడుగా ప్రపంచానికి చూపెడుతుంది. విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు అందు కున్నప్పుడు అతడి ప్రవర్తనను నాకు నేనుగా గమనించాను. అతడు నిరుత్సాహానికి గురవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ స్థాయికి తగని అతడి వైఖరి మాత్రం నేను అంగీకరించలేనిది. సచిన్ టెండూల్కర్‌తో మాత్రమే కరచాలనం చేసి, తక్కిన వాళ్లలో ఒక్కర్ని కూడా కోహ్లీ పట్టించుకోలేదు. అది అమర్యాద మాత్రమే కాదు, క్షమార్హం కాని స్వీయాధిక్య భావన కూడా! కోహ్లీని మాత్రమే నేనెందుకు వేరు చేసి చూస్తున్నాను? రెండు కారణాల వల్ల. కోట్లాది మందికి అతడు హీరో. తన ఆదర్శపాత్రను గొప్ప సంపదగా సృష్టించుకున్నవాడు. అతడేం చేస్తే వాళ్లు దానిని అనుసరిస్తారు. అంతేనా, అనుకరిస్తారు కూడా! అందుకే అతడి తప్పి దాలు కనిపించకుండా పోవు. ఒక స్టార్‌గా అతడు ప్రశంసలకు ఎలాగైతే అర్హుడో, విమర్శలకూ అంతే యోగ్యుడు. నేను కఠినంగా మాట్లాడుతున్నానని మీరు అనవచ్చు. పది వరుస విజయాల తర్వాత ఫైనల్లో ఓడిపోవడం హఠాత్ఘాతమే. తట్టుకోలేని దెబ్బే. అయితే అది ఒక వ్యక్తి ప్రవర్తనను, ప్రవర్తన విధా నాన్ని ప్రభావితం చేసినందువల్ల అతడిలో మనం ఆశించిన సౌమ్య తను, మర్యాదను అతడు విస్మరిస్తే దానిని మనం చూసీ చూడనట్లు వదిలేయాలా? అది నాకు సమ్మతి కాని వాదన. ఎందుకో నన్ను చెప్పనివ్వండి. 2021 యు.ఎస్. టెన్నిస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్... నొవాక్ జొకోవిచ్‌కి చాలా పెద్ద మ్యాచ్. అందరి మదిలోనూ ఒకటే, అతడు ఆ మ్యాచ్‌ని గెలిస్తే ఒకే ఏడాదిలో అది అతడి నాలుగో గ్రాండ్ స్లామ్ విజయం అవుతుంది. 1969 నాటి రాడ్ లేవర్ ఘనతకు అతడిని సమం చేస్తుంది. పురుషుల టెన్నిస్‌లో ఒక ఏడాదిలోని గ్రాండ్ స్లామ్‌లు అన్నింటిలో విజయం సాధించిన మూడవ వ్యక్తిగా చరిత్రలో నిలుస్తాడు. కానీ ఏమైంది? ఓడిపోయాడు! ఏ లెక్కన చూసినా గత ఆదివారం విరాట్ కోహ్లీ చవి చూసిన ఓటమి కన్నా కూడా జొకోవిచ్ది చాలా పెద్ద ఓటమి. అంతేకాదు – అది చిన్న సంగతేం కాదు – పైగా వ్యక్తిగతమైనది. కనుక అది అసలు సిసలు పరీక్ష. జొకోవిచ్ అద్భుతంగా ఆడాడు. సందేహమే లేదు. అందుకే ఓటమి అతడిని కుంగదీసింది. అతడి కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. డేనియల్ మెద్వెదేవ్ అతడిని ఓడించిన క్షణాలలో జెకోవిచ్ అతడితో ఏమన్నాడో చూడండి: ‘‘ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్‌కు అర్హులు ఎవరైనా ఉన్నారంటే అది మీరు మాత్రమే. చక్కగా ఆడారు. నిజంగానే చాలా చక్కగా! మంచి సమన్వయంతో ఉన్నారు. గ్లాండ్ స్లామ్ ప్రస్తుత పర్య టనల్లోని గొప్ప ఆటగాళ్లలో మీరు ఒకరు. మన మధ్య మంచి స్నేహపూర్వకమైన పోటీ నడిచింది. మీరింకా మరిన్ని గ్లాండ్ స్లామ్‌లు గెలవాలని, మరిన్ని మేజర్ లీగ్స్‌లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. మళ్లీ కూడా మీరు ఇలాంటి విజయాన్ని నిశ్చయంగా సాధించ గలరని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని మెద్వేదేవ్ను మనస్ఫూర్తిగా అభినందించాడు జొకోవిచ్. అదీ క్రీడాస్ఫూర్తి అంటే. అదీ పెద్దరికం అంటే. దురదృష్టవశాత్తూ గతవారం మన క్రికెట్ జట్టు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఇక జొకోవిచ్ ప్రేక్షకులను ఉద్దేశించి ఏమన్నాడో తెలుసా! ‘‘నేను మ్యాచ్ గెలవనప్పటికీ ఈ రాత్రి నా హృదయం పట్టనలవి కాని ఆనందంతో నిండి ఉందని మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ అభిమానంతో మీరు నాకు కలిగించిన ప్రత్యేకమైన అనుభూతి కారణంగా నేనిప్పుడు భూమి మీద జీవించి ఉన్నవారిలో అత్యంత సంతో షకరమైన వ్యక్తిని. మీరు నా హృదయాన్ని స్పృశించారు. న్యూయార్క్‌లో నేనెప్పుడూ ఇలా లేను. నిజాయతీగా చెబుతున్నాను. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను మిత్రులారా! నాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు నాకోసం చేసిన ప్రతిదానికీ కూడా’’ అని ఉద్వేగంగా మాట్లాడాడు. మన క్రికెటర్లు– ప్రధానంగా కోహ్లీ – గొప్ప క్రీడాకారులే అయినప్పటికీ వారు తమ ఓటమిని హుందాగా ఎలా స్వీకరించాలో నేటికింకా నేర్చుకోవలసే ఉంది. ఇందుకు రెండు కావాలి. మొదటిది క్రీడా పరాక్రమం. రెండోది శ్రేష్ఠమైన అంతఃచేతనాశక్తి. రెండోది లేకుండా మాత్రం నిజంగా మీరు గొప్పవారు కాలేరు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కాలశకలమై మిగిలిన జ్ఞాపకం
సీజర్ విషయంలో జరిగినట్లే ఇందిరా గాంధీకీ జరిగింది! ఆమె మంచి అంతా ఆమె చితాభస్మంతో పాటుగా నీటిలో కలిసిపోయింది. మనం గుర్తుపెట్టుకున్నది చెత్తను మాత్రమే! ఇండో–పాక్ యుద్ధంలో పాకిస్తాన్‌ను భారత్ ఓడించిందనీ, బంగ్లాదేశ్ ఆవిర్భవించిందనీ శ్రీమతి గాంధీ ప్రకటించిన రోజు ఈనాటికీ ఎంతో ఉత్తేజభరితమైనది. ఆ తర్వాతి రోజో, లేక ఆ మర్నాడో ఆమె పీఎల్–480 ఆహార సహాయ ఒప్పందాన్ని నిష్కర్షగా తిరస్కరిస్తూ ప్రెసిడెంట్ నిక్సన్‌కు లేఖ రాయడం అమెరికా పక్షపాత వైఖరికి దీటైన సమాధానం. అయినప్పటికీ నాటి ఇండో–పాక్ యుద్ధంలో భారత్ ఘన విజయానికి కారకుడిగా ఈరోజున మనం శామ్ మానెక్షాను సరిగ్గానే కీర్తిస్తున్నాం కానీ, అందులో శ్రీమతి గాంధీ పాత్రను మాత్రం అన్యాయంగా తిరస్కరిస్తున్నాం. ఒకవేళ నేటికీ ఆమె సజీ వంగా ఉండి ఉంటే, తన 106 ఏళ్ల వయసులో ఉండేవారు (నవంబర్ 19న జయంతి). ఆమె హత్యకు గురయ్యారన్న నాలుగు దశాబ్దాల నాటి వాస్తవం నేడొక వెలిసిపోయిన జ్ఞాప కంగా మాత్రమే మిగిలినప్పుడు ఇందిరాగాంధీని నేనిలా గుర్తు చేసుకోవడం చిత్రమైన సంగతే. అయితే సఫ్దర్‌జంగ్ రోడ్డులోని ఆమె స్మారక చిహ్నాన్ని సందర్శించే అసంఖ్యాక జనసమూహానికి అదొక పర్యాటక ఆకర్షణ. తక్కిన మనందరికీ గతించి పోయిన కాల శకలం. ఎమర్జెన్సీ (అత్యవసర పరి స్థితి) తప్ప, మరేదీ మన మదిలో లేనిది. తొలిసారి నేనామెను నిబిడాశ్చర్యంతో చూశాను. అది 1975. ఎమర్జెన్సీ పరిస్థితులు పరా కాష్ఠకు చేరుకుని ఉన్న సమయం. నిజానికి నేనొక పురుషాధిపత్య స్వభావం కలిగిన ఒక మహిళను చూడబోతున్నాననే అనుకున్నాను. కానీ ఆమె సొగసుగా, స్నిగ్ధంగా ఉన్నారు. ఆమెలో నాకు అత్యంత స్పష్టంగా గుర్తున్నవి ఆమె చేతులు. అవి సన్నగా, కోమలమైన ఆకృతిని కలిగి ఉన్నాయి. ఒక నియంతలో అవి నేను ఊహించనివి. అప్పటికి నాలుగేళ్ల క్రితం ‘ది ఎకనమిస్ట్’ ఆమెను భారత సామ్రాజ్ఞి అని అభివర్ణించింది. ఆమె మణికట్టుకు మగవారి చేతివాచీ ఉన్నప్పటికీ ఒక రాకుమారిలోని సౌకుమార్యం ఆమెలో ఉట్టిపడుతూ ఉంది. అయినప్పటికీ ఆమె అతి సామాన్యంగా ఉండేవారు. ఎమర్జెన్సీ సమయంలో ఒక ఆదివారం నేను, మా అక్కచెల్లెళ్లు... గాంధీలతో కలిసి రాష్ట్రపతి భవన్లో ‘ద పింక్ పాంథర్’ను చూసేందుకు వెళ్లడానికి ముందు అంతా కూర్చొని అల్పాహారం తీసుకుంటూ, పూర్తిగా మాటల్లో మునిగిపోయాం. శ్రీమతి గాంధీ ఒక్క ఉదుటన ‘‘పదండి, పదండి...’’ అనేంత వరకు కూడా సమయం మించిపోతున్నట్లు మేము గమనించనే లేదు. ‘‘ఇప్పటికే మనం లేట్ అయ్యాం. ఎవరైనా ఒకటికి వెళ్లాలనుకుంటే ఇప్పుడే వెళ్లిరండి’’ అని కూడా ఆమె అన్నారు. అప్పుడు మా ప్రమీలక్క, ‘‘ప్రచారంలో ఉండగా ఒకటికి వెళ్ల వలసి వచ్చినప్పుడు మీరేం చేశారు?’’ అని శ్రీమతి గాంధీని అడి గారు. మా మాటకు ఆమె... ‘‘రాత్రి పడుకునే ముందు చివరిగా నేను చేసే పని కడుపునిండా నీళ్లు తాగడం. దాంతో ఉదయానికంతా నా సిస్టమ్ ఖాళీ అయిపోతుంది. తర్వాత ఒకటికి వెళ్లే అవసరమే ఉండదు’’ అని చెబుతూ, ‘‘మగవాళ్లలా నేను చెట్టు వెనక్కు వెళ్లలేను కదా’’ అని నవ్వారు. ఏమైనా సీజర్ విషయంలో జరిగినట్లే, ఆమె మంచి అంతా ఆమె చితాభస్మంతో పాటుగా నీటిలో కలిసిపోయింది. మనం గుర్తు పెట్టుకున్నది చెత్తను మాత్రమే! నా జ్ఞాపకాలలో 1971 డిసెంబర్ 16 నాటి ఉత్తేజం నేటికింకా స్పష్టంగా ఉంది. ఇండో–పాక్ యుద్ధంలో పాకిస్తాన్‌ను భారత్ ఓడించిందనీ, బంగ్లాదేశ్ ఆవిర్భవించిందనీ శ్రీమతి గాంధీ ప్రకటించిన రోజు అది. ఆ తర్వాతి రోజో, లేక ఆ మర్నాడో ఆమె పీఎల్–480 ఆహార సహాయ ఒప్పందాన్ని నిష్కర్షగా తిరస్కరిస్తూ ప్రెసిడెంట్ నిక్సన్‌కు లేఖ రాసినప్పుడు అమెరికా పక్షపాత వైఖరికి దీటైన సమాధానం ఇచ్చారని నా పదహారేళ్ల వివే చనకు అనిపించింది. నాటి ఇండో–పాక్ యుద్ధంలో భారత్ ఘన విజయానికి కారకుడిగా ఈరోజున మనం శామ్ మానెక్షాను సరిగ్గానే కీర్తిస్తున్నాం కానీ, అందులో శ్రీమతి గాంధీ పాత్రను మాత్రం అన్యా యంగా తిరస్కరిస్తున్నాం. విదేశాలలో ఇందిరా గాంధీ నెలకొల్పిన భారతదేశ ప్రతిష్ఠను చూసి గర్వించిన తరం నాది. 1960ల మధ్యలో లిండన్ జాన్సన్ పక్కన చక్కటి దుస్తులలో, తీరుగా కత్తిరించిన ఒత్తయిన జుత్తుతో ఇందిరా గాంధీ నిలబడి ఉండగా ఫొటో తియ్యడం ఆ ఫొటోగ్రాఫర్ జన్మకు ధన్యత అనే చెప్పాలి. శ్వేతసౌధం పచ్చిక బయళ్లలో తీసిన ఆ ఫొటోల కంటే మెరుగ్గా మళ్లీ ఎవరైనా తియ్యడం అసాధ్యం అను కున్నాను. అయితే అది 1982లో లండన్‌లో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో నేను ఆమెను చూసేంత వరకే! ఆ కార్యక్రమంలో మార్గరెట్ థాచర్‌తో కలిసి నడుస్తున్నప్పుడు ఇందిరా గాంధీ ఆహా ర్యాన్ని చూసి ప్రేక్షకులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. జామావర్ షాల్‌తో తయారైన అద్భుతమైన కోటును ధరించి ఉన్నారామె. ఆమెను అలా చూసి నా మనసు పాఠశాల రోజు లలో నేను చదువుకున్న ఎనోబార్బస్ వర్ణనను గుర్తు చేసింది. ‘‘వయసు ఆమెను వడలిపోనివ్వదు. సంప్రదాయం ఆమె అనంతమైన వైవిధ్యాన్ని నశించ నివ్వదు’’ అంటాడు ఎనోబార్బస్, క్లియో పాత్ర గురించి! 1977లో ఇందిరా గాంధీ సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడానికి కారణం ఏమిటి? బహుశా అది ఆమె గురించి ఎప్పటికీ విడివడని ముడి కావచ్చు. ఆ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఏమీ లేకపోవచ్చు. కానీ వాటిని వాయిదా వేయగల సామర్థ్యం ఆమెకు లేకపోతే కదా! ఎన్నికలకు ఆమెను బలవంతం చేసే బయటి శక్తులు కూడా ఏమీ లేవు. కాబట్టి ఆమె తన మనస్సాక్షి ప్రకారం ముందుకు వెళ్లారని అనుకోవాలా? లేక ఎమర్జెన్సీ విధించినందుకు ఆమెలో పశ్చాత్తాపం కలిగిందా? లేదంటే, ఎమర్జెన్సీ చాలా కాలం సాగిందన్న విషయాన్ని ఆమె అంగీకరించి ఉంటారా? వేర్వేరు వ్యక్తులు ఈ ప్రశ్నలకు భిన్నమైన సమాధానాలు ఇచ్చారు. వాటిల్లో ఒక్కటి కూడా సబబైన జవాబుగా అనిపించదు. నిజానికి ఇంకా లోతైన ప్రశ్న ఉంది. ఆ ఎన్నికలలో తను విజయం సాధించగలనని ఆమె భావించి ఉంటారా, లేదా తనొక ఘోర పరాజయం వైపు వెళుతున్నానన్న అవగాహనను ముందే కలిగే ఉన్నారా? జరగబోయేదేమిటో తెలిసి కూడా విధిని ఆమె స్వాగతించారా? అది తనకు తను విధించుకున్న శిక్షా? ఎమర్జెన్సీ అనే పాపానికి చేసుకున్న పరిహారమా? ఇందిరా గాంధీ తర్వాత కూడా మనకు బలమైన పాలకులు వచ్చారు. చక్కటి వస్త్రధారణతో మనల్ని ముగ్ధుల్ని చేసిన అనేకమంది ప్రధానులూ ఉన్నారు. అందరిలోకి ఇందిరా గాంధీ ఒక్కరే ప్రత్యేకమైన వారిగా ఎందుకు నిలిచారు? బహుశా అలా అనిపించడం యవ్వనంలోని జ్ఞాపకాలు జమ చేసుకుని ఉంచుకున్న అవ్యక్త గతానుభూతులు ప్రతిధ్వనించడం వల్లనా? మనోవైజ్ఞానిక నిపుణులు, తత్త్వవేత్తలు దీనికి మెరుగైన వివరణ ఇవ్వగలరనుకుంటాను. నేను చెప్పగలిగింది మాత్రం ఒక్కటే – అలాగని ఏదో చెప్పాలని చెప్పడం కాదు – నేను ఏమనుకుంటానంటే ఆమెలో ఏదో లేకుండానైతే లేదని! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మంకుపట్టుకు మనస్సాక్షి విడుపు
గాజాలో చిక్కుకుపోయిన 23 లక్షల మంది పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వేలాది మంది లండన్ వీధులలోకి రావడం చూసినప్పుడు ప్రజాస్వామ్యంలోని మిక్కిలి ‘సుందరమైన’ దృశ్యాలలో ఇది ఒకటి అనిపిస్తుంది. ప్రదర్శనకారుల సంఖ్య భిన్నంగా ఉండొచ్చు కానీ, ఇదే విధమైన ర్యాలీలు ప్యారిస్, బెర్లిన్ లాంటి నగరాలలోనూ జరిగాయి. యు.ఎస్.లో జరిగిందైతే ఎంతో హృదయగతమైనది. ‘జూయిష్ వాయిసెస్ ఫర్ పీస్’ సంస్థ ఆధ్వర్యంలో అమెరికన్ కాంగ్రెస్‌లోనూ, గ్రాండ్ సెంట్రల్ స్టేషన్లోనూ స్థానిక యూదులు భారీ ప్రదర్శన చేపట్టారు. అంతస్సాక్షి శక్తికి అదొక ధ్రువీకరణ. ఈ నిరసనలు దేనినైనా మారుస్తాయా? జరగబోయే అకృత్యాలను ఆపగలవా? ఏమో! అయినప్పటికీ నిరసనలు అవసరమైనవి. ప్రజాస్వామ్యంలోని మిక్కిలి సుందరమైన దృశ్యాలలో ఒకటి – ఈ ‘సుందరమైన’ అనే విశేషణాన్ని నేను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగిస్తున్నాను – పదులు లేదా వందల వేలమంది తాము సహించరాని అన్యాయంగా భావిస్తున్న దానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనను వ్యక్తం చేయడం. ఆ నిరసనకు మీ సొంత ప్రభుత్వం దారి ఇచ్చిందా లేక ప్రపంచంలోని మరొక చివరన అది మలుపు తిరిగిందా అన్నది విషయమే కాదు. అదొక మూకుమ్మడి నైతిక వివేచనను రేకెత్తించిందన్నది, మానవుల ఆత్మను కదిలించిందన్నది ముఖ్యం. నిజానికి అది వారి ఉనికి యొక్క లోతు. అందుకే వారి స్పందన మానవత్వానికి సహేతుకమైన సమర్థన. అది మానవులను జంతువుల కన్నా ఉన్నతంగా ఉంచుతుంది. గాజాలో చిక్కుకుపోయిన 23 లక్షల మంది పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వందల వేల మంది లండన్ వీధులలోకి రావడం చూసినప్పుడు నాలో ఈ ఆలోచన మెదిలింది. ప్రదర్శనకారుల సంఖ్య భిన్నంగా ఉండొచ్చు కానీ, ఇదే విధమైన ర్యాలీలు పారిస్, బెర్లిన్, అమెరికా నగరాలలోనూ జరిగాయి. వాస్తవానికి యు.ఎస్.లో జరిగిందైతే ఎంతో హృదయగతమైనది. ‘జూయిష్ వాయిసెస్ ఫర్ పీస్’ ఆధ్వర్యంలో అమెరికన్ కాంగ్రెస్ లోనూ, అలాగే గ్రాండ్ సెంట్రల్ స్టేషన్లోను స్థానిక యూదులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అంతస్సాక్షి శక్తికి అదొక ధ్రువీకరణ. ఈ సందర్భంలోనైతే అది విశ్వాసాల వెన్నుదన్నులను కలుపుకున్న మతం పట్టు కంటే గట్టిది. నన్ను తప్పుగా అనుకోకండి. అక్టోబర్ 7న హమాస్ ఏదైతే చేసిందో అది అనాగరికమైనది, క్రూరమైనది, ఏమాత్రం క్షమార్హం కానిది. అయితే ఒక నెల తర్వాత అది అర్ధసత్యం మాత్రమే. హమాస్ దాడికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ 9,200 మంది ప్రాణాలను బలి తీసుకుంది. 22,000 మందిని గాయపరిచింది. మృతులలో నలభై శాతం మంది చిన్నారులే. విద్యుత్తు, నీరు, ఇంధనం, ఆహారం అంద కుండా చేస్తూ వస్తున్న కొన్ని వారాల దారుణమైన వైమానిక దాడుల తర్వాత ఇప్పుడు రెండవ దశ భూతల దాడులు ప్రారంభమయ్యాయి. నిరసనకారులు అడుగుతున్నది చాలా సరళమైనదనీ, సూటి అయినదనీ నేను ఊహించగలను. శిక్ష, ప్రతీకారం సమర్థనీయం అయినప్పటికీ ఇది చాలాదూరం వెళ్లలేదా? చాలాకాలం అయి పోలేదా? ఉత్తర గాజాలో ఉన్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటం కోసం దక్షిణం వైపునకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. కానీ అలా వెళ్లినవారు తలదాచుకున్న దక్షిణ ప్రాంతాలైన ఖాన్ యూనిస్, రాఫాల పైన కూడా బాంబులు కురిపించడం మొదలుపెట్టింది. ‘అల్ జజీరా’ ప్రతినిధి కుటుంబం నుసిరత్ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో మరణించింది. గాజా నగరంలో 600 మంది మాత్రమే పట్టే సామర్థ్యం గల షిఫా ఆసుపత్రి ఇప్పుడు బాంబు దాడుల నుంచి తప్పించుకోడానికి అక్కడికి చేరిన 20,000 మందితో కిక్కిరిపోయిందనీ; శిథిలాలు, మురుగు నీరును మాత్రమే తాము చూడగలుగుతున్నామనీ అక్కడి వైద్యులు చెబుతున్నారు. మత్తుమందు లేకుండానే ఆసుపత్రి కారిడార్ నేలపైన శస్త్రచికిత్సలు జరుగుతున్నట్లుగా కూడా నివేదికలు అందుతున్నాయి. అదే నగరంలోని అల్ ఖుద్స్ ఆసుపత్రికి – నేరుగా వైమా నిక దాడులకు గురి అయ్యే ప్రమాదం ఉన్నందున రోగులను ఖాళీ చేయించవలసిందిగా ఆదేశాలు అందాయి. మరి ఇంక్యుబేటర్లలో, అత్యవసరంగా వెంటిలేటర్ల పైన ఉన్న శిశువులను ఎక్కడికి తరలించాలి? గాజాకు అయిన వర్ణనాతీతమైన గాయం గురించి ఒక పాలస్తీనా వ్యక్తి గుండెను పిండేసే మాటలను ‘బీబీసీ’తో అన్నారు: ‘‘సురక్షితంగా ఉండేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి అని ప్రజలు అడగడం లేదు. మనం చనిపోయేటప్పటికి ఎక్కడ ఉండాలి అని అడుగుతున్నారు.’’ నిజం ఏమిటంటే ఇజ్రాయెల్ అంత రాత్మ కూడా ఈ భయానక స్థితికి చలించింది. ఆ స్థితిని వ్యక్తీకరించడం అంత తేలిగ్గా కనిపించకపోవచ్చు. హమాస్ కంటే ఎక్కువ అని కాదు, హమాస్‌తో సమానంగా అణచి వేసే ప్రయత్నాలతో ఇజ్రాయెల్ ఏమీ సౌకర్యంగా ఉండకపోవచ్చు. కనుక నెమ్మ దిగా, కానీ స్థిరంగా మాటలను కూడబలు క్కుంటోంది. ‘హఆరెడ్జ్’... ఇజ్రాయెల్‌లో పేరున్న వార్తా పత్రిక. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగిన మరుసటి రోజు, అక్టోబర్ 8న తన సంపాదకీయ వ్యాసంలో... ‘దాడి వల్ల ఇజ్రాయెల్‌కు సంభవించిన విపత్తుకు బాధ్యత వహించవలసిన ఒకే ఒక వ్యక్తి బెంజమిన్ నెతన్యాహూ’ అని రాసింది. పాలస్తీనా ఉనికిని, హక్కులను నెతన్యాహూ విస్మరించారని ఆరోపించింది. 9వ తేదీన ఆ పత్రిక ‘ప్రతీకార ఉద్యమాలకు, యుద్ధ నేరాలకు ఆస్కారం ఉండొచ్చు’ అని హెచ్చరించింది. ఆ పత్రిక వ్యాసకర్తగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన గిడియన్ లెవీ 19వ తేదీన ‘ఎనఫ్’ (చాలు) అనే శీర్షికతో సంపాదకీయం పేజీలో రాసిన వ్యాసాన్ని ‘ఈ రక్తపాతాన్ని తక్షణం ఆపి తీరాలి, వినాశానికి హద్దులు ఉంటాయి’ అని ప్రారంభించారు. ఇజ్రాయెల్ గురించి మీరేం అనుకున్నా, స్థానిక యూదు పౌరులకు అది ప్రజాస్వామ్య దేశం అనేందుకు ‘హఆరెడ్జ్’ ఒక కాదన లేని రుజువు. భారతదేశంలో ఈ విధమైన పరిస్థితుల్లో పత్రికలు రాసే సంపాదకీయాలు, అభిప్రాయాలు తీవ్రవాదం, దేశద్రోహం అభియో గాలను ఆహ్వానించవచ్చు. అంటే ఇజ్రాయెల్‌లోనూ ఇప్పుడు నిరస నల సౌందర్యం కనిపిస్తూ ఉంది. అయితే ఈ నిరసనలు దేనినైనా మారుస్తాయా? మరింత దారుణంగా జరగబోయే అకృత్యాలను అవి ఆపగలవా? చెప్పలేను. బహుశా ఆపలేవేమో! అయినప్పటికీ నిరసనలు అవసరమైనవి.అందుకు ఒకే కారణం అవి జరగవలసి ఉండటం. నిశ్శబ్దంగా ఉండ లేని స్వరాలు అవి. కనుక మాట్లాడటాన్ని మన మనస్సాక్షి కొన సాగిస్తూనే ఉంటుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పోయినవాళ్లు మిగిల్చేవి జ్ఞాపకాలే!
ఇటీవల మరణించిన క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ ఉల్లాసంగా ఉండేవారు. ఆయన భావోద్వేగాలు పారదర్శకంగా ఉండేవి. మంచి సంభాషణను ఇష్టపడతారు. మాట్లాడినదంతా ఓపిగ్గా వింటారు. ఆపలేనంతగా మాట్లాడుతూనే ఉంటారు. మరో క్రికెటర్ స్నేహితుడు టైగర్ పటౌడీలో ఆహ్లాదం కలిగించే హాస్యస్ఫూర్తి ఉంటుంది. అది అచ్చమైన బ్రిటిష్ నుడికారంతో కూడిన వెటకారం. పడాల్సిన చోట, పడాల్సిన మాటను సమయానికి,సందర్భానికి తగినట్లుగా తనదైన శైలిలో తటాలున జారవిడుస్తారు. మరో క్రికెట్ దిగ్గజం అబ్బాస్ అలీ బేగ్ లోతైన రాజకీయ అవగాహనను కలిగి ఉండేవారు. టైగర్, బిషన్ ఇప్పుడు మనతో లేరు. స్నేహితులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలలో తరచు మనలో కదలాడేది వారి జ్ఞాపకాలే. నేను క్రికెట్ అభిమానిని కాదన్న సంగతి రహస్యమేమీ కాదు. నిజానికి ఆ ఆట నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడో గాని చూడను కూడా. ఫలితంగా చాలా మంది క్రికెటర్లు నాకు తెలియదు. కానీ గొప్ప జ్ఞాన గాంభీర్యంతో నేను క్రికెట్ చర్చలకు తెగించినప్పుడు, తెలిసీ తెలియని విషయ సమా చారంతో బుద్ధిహీనమైన ప్రశ్నలు సంధించినప్పుడు పదే పదే నన్ను గట్టున పడేసిన వారిలో నేను స్నేహితులుగా పరిగణించే క్రికెటర్లు ముగ్గురున్నారు. వారు – టైగర్ పటౌడీ, బిషన్ సింగ్ బేడీ, అబ్బాస్ అలీ బేగ్. బాధాకరం... టైగర్(2011లో మరణించారు), బిషన్ ఇప్పుడు మనతో లేరు. బగ్గీ (అబ్బాస్ అలీ బేగ్) ఈ మధ్యే తన భార్య వినూ (వినూ మీర్చందానీ)ను కోల్పోయారు. గత సోమవారం (23 అక్టోబర్) నాటి బిషన్ సింగ్ మరణం ఈ ముగ్గురు స్నేహితుల జ్ఞాప కాలను తిరిగి తెచ్చిపెట్టింది. వారి గౌరవార్థం, ఆ జ్ఞాపకాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. టైగర్‌కు నా క్రీడా పరిజ్ఞానం అంతంత మాత్రమేనని తెలుసు. ఒక్క టీవీ స్టూడియోలో తప్ప, ఆయన నా ముఖంపై కోడిగుడ్లు పగిలే అవకాశం ఉన్న పరిస్థితికి నన్ను వదిలేయకుండా మా సంభాషణను సున్నితంగా, నేర్పుగా నాకు నచ్చిన విషయాల వైపు మళ్లించేవారు. తరచు ఆ మళ్లింపు నేను ధరించిన టై గురించిన పొగడ్త అయివుండేది. వివేచనను అభిరుచిగా కలిగిన వ్యక్తి ఆయన. కనుక ఆయన మెచ్చు కోలు నన్ను అదే టైని మళ్లీ మళ్లీ ధరించేలా చేసేది. ఒక సందర్భంలో తొలిసారిగా ఆయన తన కనుబొమ నొకదాన్ని ఎగరేస్తూ, నెమ్మదైన స్వరంతో... ‘‘మీరు ఆ టై ధరించడం ఇది మూడోసారి!’’ అని అనేంతవరకు ఆ టైని నేను వదిలిపెట్టలేదు. టైగర్‌లో ఆహ్లాదం కలిగించే హాస్యస్ఫూర్తి కూడా ఉంది. అది అచ్చమైన బ్రిటిష్ నుడికారంతో కూడిన వెటకారం. పడాల్సిన చోట, పడాల్సిన మాటను సమయానికి, సందర్భానికి తగినట్లుగా తనదైన శైలిలో తటాలున జారవిడుస్తారు. బిషన్ చాలా భిన్నమైనవారు. ఉల్లాసంగా ఉండేవారు. ఆయన భావోద్వేగాలు, అంతర్గత భావాలు తరచు పారదర్శకంగా, పైకి కని పించేలా ఉండేవి. మంచి సంభాషణను ఆయన ఇష్టపడతారు. మాట్లా డినదంతా ఓపికగా వింటారు. అలాగే ఆపలేనంతగా మాట్లాడుతూనే ఉంటారు. మేము తరచు బగ్గీ, వినూ వాళ్లింట్లో కలుసుకునేవాళ్లం. మేడపైన మాటల్లో మునిగిపోయేవాళ్లం. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై మీ ఆలోచనలు ఏమిటి’ అని బగ్గీ నన్ను అడిగేవారు. అయితే రాజకీ యాలను ఆయన నాకంటే బాగా అర్థం చేసుకున్నారని నాకు అర్థమ యేందుకు ఎక్కువ సమయం పట్టేది కాదు. నేను చెప్పేది వినేవారు. నా గ్రహింపులో లేని లోతైన గమనింపుల గురించి చెప్పి నన్ను ఉల్లాస పరిచేవారు. ముగ్గురిలోకి బగ్గీ ఎక్కువగా తటపటాయింపుతో ఉండేవారు. వినూ అప్పుడు ఆ సంకోచాల నుంచి ఆయన్ని కాపాడేందుకు ముందు కొచ్చేవారు. ఆమె చురుకైనవారు. సంభాషణ ప్రియత్వం కలిగి నవారు. విలాసవంతమైన జీవనశైలిని ఆస్వాదించే స్నేహశీలి. అతిథు లను ఆదరించే అద్భుతమైన మహిళ. రుచిగా వండినంత మాత్రానే కాదు, అతిథుల సన్నిధి ఆమెను ఉల్లాసపరచడం వలన కూడా వారింట్లో భోజనం ఆరగించడం అన్నది ఒక సంతుష్టికరమైన భావ నను కలిగించేది. తన స్నేహితుల సమక్షంలో ఆమె అపరిమితమైన సంతోషంతో ఉండేవారు. నేనిది రాస్తున్న సమయానికి, స్నేహితులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలలో తరచు మనలో కదలాడేది వారి జ్ఞాపకాలే నన్న మెలకువను కూడా మొత్తంగా నేను కలిగి ఉన్నాను. మీరు నెలలు లేదా ఏళ్లపాటు కలుసుకుని ఉండకపోవచ్చు. మిమ్మల్ని సముద్రాలు, తరచు రాసుకోని ఉత్తరాలు వేరు చేస్తుండొచ్చు. అయితే ఆ దూరమే మిమ్మల్ని కలిపి ఉంచే జ్ఞాప కాలను శక్తిమంతం చేస్తుంది. కాల క్రమేణా ఆ జ్ఞాపకాలు తమ సొంత అస్తిత్వాన్ని ఏర్పచుకుంటాయి. ఇప్పుడు టైగర్, బిషన్, వినూ గురించి నాకు మిగిలింది జ్ఞాపకాలు మాత్రమే! ఆ ముగ్గురూ నాకు దూరమయ్యాక తమవైన స్థానాలను నాలో ఏర్ప చుకున్నారు. ఒక అర్థంలో నేను స్పష్టమైన దానిని చెబుతున్నాను. అలాగే, మరొక విషయం కూడా చెబుతాను. మనుషులు చనిపోయినప్పుడు మాత్రమే మళ్లీ ఇక వారిని కలవలేం అన్న భావనలో మనం మునిగి పోతాం. అప్పుడు వారి జ్ఞాపకాలు వేరే భిన్నమైన స్థాయిని పొందు తాయి. బతికున్నవాళ్లను – రేపో, తర్వాతి వారమో, ఫోన్ కాల్లోనో, ఈమెయిల్ ద్వారానో – జ్ఞాపకం చేసుకున్నట్లుగా అది ఇకపై ఉండదు. ఇప్పుడిక మీకున్నవన్నీ కేవలం జ్ఞాపకాలే! ఒక సమావేశం, ఒక సంభా షణ, ఒక ఈమెయిల్ అన్నది ఇక ఎప్పటికీ సంభవించవివే! అనేకమైన ఈ ఆలోచనలు నిస్సందేహంగా వయసు నిర్దేశించి నవే. అది అనివార్యం. నిజాయతీగా చెప్పాలంటే 34 ఏళ్ల క్రితం నా భార్య నిషా చనిపోయినప్పుడు కూడా పూర్తి భిన్నంగా ఏమీ లేదు. 2015లో మా అమ్మ చనిపోయినప్పుడు కూడా! లేదా నేను సన్నిహితంగా ఉన్న మరెవరి విషయంలోనైనా! నా చిన్నతనంలో నేను జ్ఞాప కాలు ఎలా జనిస్తాయి, ఎలా రూపాంతరం చెందుతాయి అనే ఆలోచ నను కలిగిలేను. ఇటీవల కొద్ది వారాల తేడాతో సంభవించిన విను, బిషన్ మరణాలు నాలో ఆ స్పృహను కలిగించాయి. ప్రియ మిత్రమా! నా ఉద్దేశం మనో దౌర్బల్యం లోనికో, తాత్విక చింతన లోనికో జారుకోవడం కాదు. ఆనందకరమైన జ్ఞాపకాలతోనే నేను మొదలయ్యాను. కానీ నేను చెప్పాలని భావించిన దానికంటే విచారంగా ముగించినట్లున్నాను. అంటుంటారు కదా: ఇదే జీవితం! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చేరువ కానివ్వని విరోధం!
ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ కూడా వేటికవి తామే బాధితులమని సంకేత పరచుకునే ప్రభామండలాన్ని తమ శిరస్సుల వెనుక నేడు ధరించి ఉన్నాయి. ఆ ఇద్దరు ప్రత్యర్థులు రాజీ పడటానికి సిద్ధపడకపోవడం మాత్రమే కాదు, రాజీకి ప్రయత్నించినప్పుడు వారి వారి కరడుగట్టిన సమూహాలు వారిని పూర్తిగా వెనక్కు లాగిపడేయటం కూడా జరిగింది. ఇంకా అధ్వాన్నమైన సంగతి ఏమిటంటే... వారి స్నేహితులు, మిత్ర పక్షాలు.. వారిని చెలిమి వైపు ప్రోత్సహించేందుకు ఇష్టపడే అవకాశం కనిపించకపోవడం! వాషింగ్టన్ లేదా లండన్ గానీ, అరబ్ కేంద్రంగా ఉన్న దేశాలు గానీ నిజమైన రాజీకి వారిని ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం లేదు. ఇజ్రాయెల్–పాలస్తీనా వ్యవహారాలు నాకు ఏ విధంగానూ అంతుబట్టనివి. నిజానికి ఆ రెండు దేశాల మధ్య వివాదం గురించి నాకు తెలిసిన రవ్వంత కూడా నేను ఈ రెండు మూడు వారాలుగా తెలుసుకుంటూ వచ్చినదే. అయితే ఆ తెలివిడి నాకు ప్రశ్నలు అడిగేందుకు సరిపోయేదే తప్ప, జవాబులు ఇవ్వగలిగేటంతటిది కాదు. అయినప్పటికీ ఆ మాత్రపు జ్ఞానం నాలో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచి దానిని నేను పూర్తిగా విశ్వసించేలా క్రమంగా నాలో నమ్మకాన్ని పెంచుతూ వచ్చింది. ఈ ఉదయం నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నది ఇదే. ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ కూడా వేటికవి తామే బాధితు లమని సంకేత పరచుకునే ప్రభామండలాన్ని తమ శిరస్సుల వెనుక నేడు ధరించి ఉన్నాయి. అయితే బాధ కంటే కూడా గర్వమే తరచూ ఆ ప్రభామండలం చుట్టూతా కాంతిలా ప్రకాశిస్తూ కనిపిస్తోంది. చరిత్రపై తమ దృష్టికోణమే నరైనదనే నమ్మకంతో, ఎవరికివారు స్వీయ నైతిక వర్తనను కలిగి ఉన్నామన్న విశ్వాసాన్ని సమానంగా కలిగి ఉన్నారు. వారు వర్తమానాన్ని ఎలా చూస్తున్నారన్న విషయంలోనూ ఇదే నిజం. ‘అవతలి’ దేశం తమ పట్ల ఘోరమైన తప్పిదాలకు ఒడిగట్టిందని ఆ రెండు దేశాలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. అయితే వారు అంగీకరించలేని విషయం ఏమిటంటే... శత్రువు పట్ల తాము వ్యవహరిస్తున్న తీరులో ఇద్దరూ కూడా సరి సమానంగా దోషులేనన్నది! తమకేదైతే జరిగిందో సరిగ్గా అదే తమ ప్రత్యర్థికీ జరిగిందని వారు అంగీకరించరు, అంగీకరించబోరు. ఆ విధమైన ‘సమాన త్వాన్నే’ వారు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. అందుకే చాలా తక్కువ మినహాయింపులతో – వాస్తవానికి మీరు వాటిని బహుశా చేతి వేళ్లపైన కూడా లెక్కించవచ్చు – ఇంటర్వ్యూలన్నీ భయానకమైన ఏకపక్ష ధోరణితో ఉన్నాయి. మీరు ఏ విధంగా ప్రశ్న వేసినా మీకు ఇంటర్వ్యూ ఇస్తున్న ఆహ్వానిత పాలస్తీనీయుడు ఆ ప్రశ్నకు జవాబుగా ఇజ్రాయెల్‌ను తీవ్రంగా విమర్శిస్తూ తామెంత ధర్మ బద్ధులో, రుజు ప్రవర్తన కలిగినవారో చెప్పుకుంటారు. ఒక ఇజ్రాయె లీని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కచ్చితంగా ఇదే విధమైన స్వీయ సమర్థన వైఖరి వ్యక్తం అవుతుంది. ప్రతి ఒక్క విషయంలోనూ! ఇజ్రాయెల్, పాలస్తీనా సంక్షోభంపై పద్నాలుగు రోజులలో పది ఇంటర్వ్యూల తర్వాత... ఈ రెండు వర్గాల వారు ఒకే భూమిపై – నిస్సందేహంగా ఒకరితో ఒకరు ఘర్షణ పడుతూనే, గాయాల రక్తం ఓడుతూనే – కలిసి ఉంటూ కూడా భిన్న ప్రపంచాలలో జీవిస్తున్నారని నేను గ్రహించాను. పర్యవసానంగా తమ భిన్న చరిత్రల నుంచి మాత్రమే కాకుండా తాము పంచుకున్న చరిత్రల నుంచి కూడా వారు అంగీకరించిన కఠిన సత్యాలతో వారికొక జగమొండి ప్రాపంచిక దృష్టి కోణం ఏర్పడింది. తర్వాత అది వర్తమానంలోని విరుద్ధ కోణాలతో బలోపేతం అయింది. వాస్తవాలు ఒకేలా ఉన్నప్పటికీ వాటి అర్థ, వివరణలు పూర్తిగా భిన్నమైనవి. విచారకరమైన వాస్తవం ఏంటంటే – ఈ రెండు దేశాల స్నేహి తులు, మిత్రపక్షాలు దేనికి దానిని విడిగా చూడటం అనే ఏక వైఖరి దృష్టి కోణానికి లోబడి ఉండటం. ‘ఏంటిది?!’ అని పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌ను ఏమాత్రం నిలదీయకుండా భూత వర్తమానాలపై ఆ దేశపు దృష్టి కోణాన్ని అంగీకరిస్తుండగా, మధ్యప్రాచ్యంలోని అరబ్, ముస్లిం దేశాలు పాలస్తీనా పట్ల తమ తమ అవగాహనలపై ఒకే విధమైన నిబద్ధతతో నిలబడి ఉన్నాయి. పర్యవసానంగా మీరు ఎవరికి మద్ధతు ఇస్తున్నారనేది మీరెలాంటి ఆలోచనను కలిగివున్నారన్న దానిని మాత్రమే కాక, జరుగుతున్న పరిణామాల పట్ల మీ స్పందనను కూడా నిర్ధారణగా తెలియజేస్తుంది. ఈ విధంగా ఇజ్రాయెల్ తోక పశ్చిమ కుక్కను ఊపుతుంది, అదే సమయంలో పాలస్తీనా తోక మధ్యప్రాచ్య కుక్కల్ని గుర్రుమని చూసేలా, మొరిగేలా ప్రేరేపించి వాటిని రెచ్చగొడుతుంది. బహుశా అందుకే పాలస్తీనా–ఇజ్రాయెల్ వివాదం నేడు మనం ఎదుర్కొంటున్న వాటన్నింటిలోనూ కొంచెమైనా కొరుకుడు పడని అత్యంత కఠినమైన పరిస్థితిగా పరిణమించింది. ఆ ఇద్దరు ప్రత్యర్థులు రాజీ పడటానికి సిద్ధపడకపోవడం మాత్రమే కాదు, రాజీకి ప్రయత్నించినప్పుడు కూడా వారి వారి కరడుగట్టిన సమూహాలు ఆ సంశయా త్మక ప్రారంభ ఉద్దేశాన్ని పూర్తిగా వెనక్కు లాగిపడేయటం కూడా జరిగింది. బహుశా అధ్వాన్నమైన విషయం ఏమిటంటే వారి స్నేహితులు, మిత్ర పక్షాలు... వారిని చెలిమి వైపు ప్రోత్సహించేందుకు ఇష్టపడే అవకాశం కనిపించకపోవడం! వాషింగ్టన్ లేదా లండన్ గానీ, అరబ్ కేంద్రంగా ఉన్న దేశాలు గానీ నిజమైన రాజీకి వారిని ముందుకు నెట్టే ప్రయత్నం చేయడం లేదు. శత్రుత్వ విరమణ కోసం, స్వల్పకాలిక అర్భక ఒప్పందాల కోసమైతేనే నెడతాయి. కానీ ఏదైనా – అసలు స్వరూపాలకు భిన్నంగా నిజాయితీతో అడుగు వేసినప్పుడు మాత్రమే సాధ్యం అయ్యే – దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మాత్రం నెట్టవు. అందుకే నేను చేసిన గత రెండు వారాల ఇంటర్వ్యూలు ఆసక్తికరంగా ఉన్నాయి తప్పితే, ఆశాజనకంగా ఏమీ లేవు. పైగా నిస్పృహను కలిగించేలా ఉన్నాయి. నిజానికి, చెరగని విధంగా వారు వేసిన ముద్రే ఇక ఎటువంటి ఆశల్నీ పెట్టుకోలేని మనఃస్థితికి కారణం అయింది. ఇజ్రాయెల్–పాలస్తీనా ఊబిని బాగు చేయడం, ఆ సమస్యను పరిష్క రించడం అసాధ్యంలా కనిపిస్తోంది. నా భయం ఏంటంటే అనంతంగా అది నిరంతరం సాగిపోతూనే ఉంటుందని! రేపన్నది మిగతా ప్రపంచానికి మరొక రోజు కావచ్చు కానీ ఇజ్రాయెల్–పాలస్తీనాలకు మార్పును వాగ్దానం చేయని రోజూ ఉండే ఒక రోజే! కాబట్టి మనం ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి ఆలోచించండి. భీకరమైన హమాస్ దాడి ఇజ్రాయెల్ ఆత్మవిశ్వాసాన్ని ఛిద్రం చేసి,ఆ దాడిని తిప్పి కొట్టాలన్న ఆగ్రహ జ్వాలల్ని రగిల్చినందువల్ల – సాధ్యమైతే – ఏకంగా హమాస్‌ను తుడిచిపెట్టాలన్న ఇజ్రాయెల్ ప్రతీకారం వల్ల తీవ్రమైన మనోవేదన, ఎంతకూ తరగని బాధ మాత్రమే మిగిలి అనివార్యంగా అది భవిష్యత్తులో అధ్వాన్న పరిస్థితికి పునాదులు వేస్తుంది. ఇది దేనిని సూచిస్తోంది? అత్యంత విచార కరమైన, శోచనీయమైన ముగింపు ఏమిటంటే ఈ అంతులేని కథలో మరొక విషాద అధ్యాయానికి పునాది పడబోతుండటం! భవిష్యత్తు ప్రతిసారీ కూడా తిరిగి మనల్ని గతంలోకే తీసుకెళుతున్నట్లుగా కనిపిస్తోంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నైతిక సందిగ్ధతల అంతస్సంఘర్షణ
సరైన ఫలితాన్ని సాధించడానికి సరైనవి కాని మార్గాలను అనుసరించడం ఆమోదయోగ్యమేనా? ‘‘అర్థవంతమైన దానిని సాధించడం కోసం మనం నమ్మిన సిద్ధాంతాలు, మనం పాటించే విలువలు, మనం అనుసరించే ప్రమాణాలలో కొన్నింటిని త్యాగం చెయ్యడం కూడా గౌరవనీయమే’’ అనే వాదన రాజకీయాలలో ఉంది. ఒక శక్తిమంతమైన నిర్ణయం తీసుకోడానికి ప్రధాని తన కార్యాలయానికి ఉన్న అపారమైన అధికారాలను ఎలాంటి నైతికపరమైన సంకోచాలూ లేకుండా ఉపయోగించడం ఆత్మ సమ్మతం అవుతుందా? కాలమిస్ట్ ఆకార్ పటేల్ తొలి నవల ‘ఆఫ్టర్ మెస్సయ’... గొప్ప ఉద్విగ్నతకు లోను చేసే సాంప్రదాయిక రాజకీయ రచనల మాదిరిగా కాకుండా... రాజకీయాల సహజ స్వభావాన్ని, గొప్ప విజయాలు తరచు సిగ్గుచేటు సర్దుబాట్ల నుంచి సంప్రాప్తించడంలోని వైరుద్ధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. నిజం చెప్పొద్దూ... తనొక నవల రాశానని ఆకార్ పటేల్ నాతో అన్నప్పుడు నేను ఆశ్చర్యచకితుణ్ణే అయ్యాను. పటేల్‌ను ఒక దృష్టికోణం గల పత్రికా రచయితగా, మోదీ ప్రభుత్వాన్ని తూర్పార పట్టే ఒక గట్టి రాజకీయ వ్యాసకర్తగా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు ధీశాలి అయిన ఛైర్మన్‌గానే నేను ఎరుగుదును. అంతే తప్ప, కాల్పనికత అయన అజ్ఞాత బలం అయి ఉంటుందని నేను ఏ కోశానా అనుకోలేదు. ఇంతేనా నాకు పటేల్ గురించి తెలిసింది! కథనానికి లోతైన నైతిక కోణాన్ని అందించే అంతస్సంఘర్షణతో పాత్రలను సృష్టించగల సామర్థ్యంతో పాటుగా ఆయన ఊహాశక్తిలోని ప్రతిభను, కదలనివ్వని కథన పటిమను ఆయన తాజా రచన ‘ఆఫ్టర్ మెస్సయ’ బహిర్గతం చేస్తోంది. గొప్ప ఉద్విగ్నతకు లోను చేసే సాంప్రదాయిక రాజకీయ రచనల మాదిరిగా కాకుండా ఈ పుస్తకం రాజకీయాల సహజ స్వభావాన్ని, గొప్ప విజయాలు తరచు సిగ్గుచేటు సర్దుబాట్ల నుంచి సంప్రా ప్తించడంలోని వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ నవలొక వాస్తవ ఘటనల అల్లికగా ప్రారంభం అవుతుంది. నిజమైన వ్యక్తులు ఉంటారు. అయితే వారికి పెట్టుడు పేర్లు ఉంటాయి. ప్రధాన మంత్రిని ‘ది బిగ్ మ్యాన్’ అంటారు పటేల్. పుస్తకంలో ఎక్కడా ప్రధాని పేరు కనిపించదు. కానీ ఆ బిగ్ మ్యాన్ మాట్లాడే టప్పుడు ‘‘ప్రజాస్వామ్యం యొక్క భాష, చిహ్నాలు... పాలకుడు తన గురించి తను మూడో వ్యక్తిగా వ్యక్తం చేసుకుంటున్న ప్రస్తావనలతో కలిసి ఉంటాయి.’’ అది మొదటి గుర్తు. ఆ బిగ్ మ్యాన్ ప్రారంభోత్సవాలను కూడా ఇష్టపడతారు కనుక, ‘‘బిగ్ మ్యాన్ అధ్యక్షత వహించేందుకు వీలైనంతగా అత్యుత్తమమైన ఒక కార్యక్రమాన్ని లేదా వేడుకను అందించడంపై మంత్రిత్వశాఖలు దృష్టి పెడతాయి.’’ అది రెండవ గుర్తు. ఇక మూడోది... ‘‘రాజకీయ వ్యతిరేకత. అదేదో అంతర్గత శత్రువైనట్లుగా దానిపై హింసాత్మక దాడులు జరుగుతుంటాయి. ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఆ శత్రువును చావనివ్వని, బతకనివ్వని వాస్తవ రాజకీయా లకు అతీతమైన ఒక నిరంతర స్థితిలో ఉంచడంలో పూర్తిగా నిమగ్నం అయి ఉంటాయి’’. ఇప్పుడీ పుస్తకంలోని అబ్బుర పరుస్తూ చదివించే సంతోష దాయకమైన సృజనాత్మక ముగింపు గురించి తప్ప మరింకేదీ బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు. బదులుగా ఇందులో పటేల్ కథనానికి పునాదిగా జరిగిన శక్తిమంతమైన రాజకీయ... నిజానికి నైతికపరమైన చర్చ గురించి మీకు చెబుతాను. పటేల్ పుస్తకంలో బిగ్ మ్యాన్ చాలా త్వరగా చనిపోతాడు. ఆయన తర్వాత మీరా అనే మహిళ అధికారంలోకి వస్తారు. ‘లాయర్స్ కలెక్టివ్’ అనే ఎన్జీవోకు పని చేస్తుంటారు మీరా. ఆమె అవివాహిత.ఒంటరి తల్లి. ఆమె కుమార్తె జైల్లో ఉంటుంది. బిగ్ మ్యాన్, ఆయన పార్టీ అనుసరించిన రాజకీయ విధానాలపై మీరాకు తృణీకారభావం ఉంటుంది. అనిష్టంగానే ప్రధాని అవుతారు. అయ్యాక మాత్రం గతంలోని క్రూరమైన చట్టాలను రద్దు చేయడం కోసం అపారమైన తన కార్యాలయ అధికారాలను ఉపయోగించు కోవాలనుకుంటారు. పేదల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించే ప్రయత్నంగా ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా, జవాబుదారీగా మార్చేయబోతారు. అయితే సమస్య ఎక్కడొస్తుందంటే ఆమె తన కార్యాలయ అపరిమిత అధికారాలను అభ్యంతరం, అనైతికం అయిన మార్గాలలో ఉపయోగించవలసి రావడం. ఇక్కడ జనించే ప్రశ్న: సరైన ఫలితాన్ని సాధించడానికి సరైనవి కాని మార్గాలను అనుసరించడం ఆమోదయోగ్యమేనా? అన్నది. ఆమె ముఖ్య సలహాదారు... ఆ సలహాదారుకు పేరేం ఉండదు... ‘హౌస్ మేనేజర్’ అంతే. ఆ మేనేజర్‌కు ఇది ఆమోదయోగ్యమే అనిపి స్తుంది. ‘‘అర్థవంతమైన దానిని సాధించడం కోసం మీరు నమ్మిన సిద్ధాంతాలు, మీరు పాటించే విలువలు, మీరు అనుసరించే ప్రమాణాలలో కొన్నింటిని త్యాగం చెయ్యడం గౌరవనీయం,ప్రశంసనీయం అయిన సంగతే’’ అంటారు హౌస్ మేనేజర్. కానీ అందువల్ల ప్రయోజనం పొందగలిగిన సగటు ప్రజలు దానిని అంగీకరించరు. మీరా వారిని సంప్రదించినప్పుడు ఒక వృద్ధురాలు... తరచు నిరాకరణకు గురవుతుండే, అదే సమయంలో సర్వకాలాలకు అమోదయోగ్యమైనదిగా ఉండే యుగాల వివేకాన్ని వ్యక్తపరుస్తుంది. ‘‘చేయవలసిన సరైనది ఒకే ఒకటి ఉంటుంది. అదే సరైనది’’ అని అంటుంది. ఈ విధంగా పటేల్ పుస్తకం ముగింపునకు చేరుకుంటున్న కొద్దీ భారత రాజకీయాల స్వభావం గురించి; ఒకవైపు ఎత్తుగడలూ వ్యూహాలకూ, మరోవైపు సిద్ధాంతాలూ నైతికతలకూ మధ్య జరుగు తుండే ఘర్షణలతో ఒక శక్తిమంతమైన కథగా అభివృద్ధి చెందుతుంది. ప్రధాని కార్యాలయానికి ఉండే అపారమైన అధికారాలను నైతిక పరమైన సంకోచాలు లేకుండా, అనుకున్న దానిని సాధించేందుకు మీరా ఏకచిత్తంతో దృష్టి సారించినందున పుస్తకంలోని ఈ భాగం కేవలం చదివించేలా మాత్రమే కాదు, ఒక వెల్లడింపుగానూ ఉంటుంది. మీరా తనలోని సందేహాలను అణిచివేస్తారు. అయితే ఆశించిన ఫలితాన్ని సాధించడానికి ఇదే ఏకైకమార్గం అని హౌస్ మేనేజర్ తనకు నచ్చజెప్పేందుకు ఆమె అనుమతిస్తారు. అందువల్లనే ముగింపులో ఫలితం అనేది ఫలితం కోసం అనుసరించిన మార్గాలపై విజయం సాధించడం కనిపిస్తుంది. అయితే చర్చ మాత్రం ముగింపు దశకు చేరకనే ఉండిపోతుంది. అది ఆమె మనస్సాక్షిని కృంగదీస్తూ ఉంటుంది. నిజంగా రాజకీయాల్లో తరచు ఇలా జరుగుతుంటుందన్నది వాస్తవం. పటేల్ ‘బిగ్ మ్యాన్’పై ఇదేమీ ప్రభావం చూపకపోవచ్చు కానీ ఇతర రాజకీయ నాయకులు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లయితే దానివల్ల నలిగిపోతుంటారు కూడా. భారతదేశంలోనే కాదు, చాలా ప్రజాస్వామ్య దేశాలలో ఇలాగే జరుగుతుంటుంది. అందుకే రాజకీయాల సారాంశం అన్నది రాజకీయపరమైన దాని కన్నా చాలా ఎక్కువైనది. ఎందుకంటే అది నిర్ణయాలకు, ఎంపికలకు, అంతిమంగా సైద్ధాంతికతల్ని మించిన అంశాలకు సైతం సంబంధించినది. అలాగే నైతికపరమైన వాటికి కూడా. పటేల్ ఆ సంగతిని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కలవర పెడుతున్న ప్రశ్నలు
ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ప్రత్యేక సీబీఐ బృందాన్ని మణిపుర్‌కు పంపింది. సీబీఐ పదకొండు కేసులను దర్యాప్తు చేస్తోంది. వాటి కోసం మణిపుర్ వెళ్లని సీబీఐ బృందం, ఈ కేసు కోసమే ఎందుకు వెళ్లినట్లు? ‘‘మణిపుర్‌లోని ప్రస్తుత సంక్షోభం జాతుల మధ్య ఘర్షణ కాదు. మయన్మార్, బంగ్లాదేశ్‌లలో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్న కుకీ మిలిటెంట్లు... మణిపుర్ నుంచి పని చేస్తున్న తీవ్రవాద సంస్థల సహకారంతో భారత ప్రభుత్వంపై తలపెట్టిన పూర్తిస్థాయి యుద్ధం’’ అని ముఖ్యమంత్రి బీరేన్ అన్నారు. తీవ్రవాద సంస్థలు ఈ రెండు తెగలతోనూ సంబంధాలను కలిగి ఉండి మణిపుర్లో ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయి. బీరేన్ ఎందుకు ఒక వైపే మాట్లాడుతున్నారు? ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సీబీఐ బృందాన్ని మణిపుర్‌కు పంపడంలో చూపిన ఉల్లాస పూరితమైన సంసిద్ధతను, ఆ కేసును ఛేదించారని చెబుతున్న సీబీఐ బృందం పని తీరులోని గొప్ప వేగాన్ని అభినందిస్తూనే... విషయాలను క్లిష్టతరం చేయగల కొన్ని ప్రశ్నల్ని కూడా ఇక్కడ పరిగణనలోకి తీసు కోవడం ఒక విలువైన పరిశీలన కాగలదని నేను విశ్వసిస్తున్నాను. ఈ ప్రశ్నల్లో కొన్ని నిస్సందేహంగా కుకీ తెగలవారు లేవనెత్తినవే అయి ఉంటాయన్నది ఆశ్చర్యమేమీ కాదు. అంతమాత్రాన ఆ ప్రశ్నలు చెల్లుబాటు కాకుండాపోతాయని మాత్రం నేనైతే కచ్చితంగా అనుకోను. మొదటి విషయం ఏంటంటే, సీబీఐ పదకొండు కేసులను దర్యాప్తు చేస్తోంది. కార్–వాష్ స్టేషన్లో ఇద్దరు కుకీ మహిళలపై లైంగిక దాడి జరిపి వారిని హత్య చేసినప్పుడు... డేవిడ్ థీక్ తల నరికి చంపినప్పుడు... అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న తల్లినీ, బిడ్డకూ వాహ నంతో సహా కాల్చి బూడిద చేసినప్పుడు... దర్యాప్తు కోసం మణిపుర్ వెళ్లని సీబీఐ ప్రత్యేక బృందం... ఇద్దరు మైతేయి విద్యార్థుల హత్యపై విచారణ జరిపేందుకు ఇంఫాల్‌కు ఎందుకు వెళ్లినట్లని మీరడగవచ్చు. మీరు కుకీ తెగకు చెందిన వారైతే కనుక ఇది మీకు మైతేయిల పట్ల కేంద్రం ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తున్నట్లుగా అనిపించదా? రెండో ప్రశ్న కూడా అంతే ముఖ్యమైనది. అజయ్ భట్నాగర్ నేతృత్వంలోని సీబీఐ ప్రత్యేక బృందం సెప్టెంబర్ 27 సాయంత్రం ఇంఫాల్ చేరుకుంది. నాలుగు రోజుల లోపే కొన్ని అరెస్టులు జరిపింది. ఇక్కడే ఐ.టి.ఎల్.ఎఫ్. (ఇండీజనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్) ఒక ప్రశ్నను లేవనెత్తింది. ‘‘ఇంత వేగంగా పని చేయగలిగిన సీబీఐ మిగతా హేయమైన కేసులలో ఎందుకని ఒక్కర్నీ అరెస్టు చేయలేదు?’’ అని ప్రశ్నించింది. కుకీ తెగ ప్రజల అత్యున్నత స్థాయి స్వయం ప్రకటిత సంఘం ‘కుకీ ఇంపీ’ మరింత సూటిదైన ప్రశ్నకు సమాధానం కోరుతోంది. ‘‘కుకీ–జో కమ్యూనిటీకి వ్యతిరేకంగా అనుమానాస్పద కారణాలతో అరెస్టులు చేసినప్పుడు... కుకీ–జో ప్రజలపై ఎంతో అమానుషంగా, అనాగరికంగా శిరచ్ఛేదనకు, అత్యాచారాలకు, గృహ దహనాలకు పాల్పడిన నేరస్థులను అదే తరహాలో ఎందుకు అరెస్టు చేయలేదు?’’ అని కుకీ ఇంపీ ప్రశ్నిస్తోంది. ఏమైనా, కుకీలు లేవనెత్తిన ఈ ప్రశ్నలతో పాటుగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చేసిన వ్యాఖ్యల నుంచి తలెత్తిన ప్రశ్నలూ కొన్ని ఆలోచన రేకెత్తించేవిగా ఉన్నాయి. సీబీఐ అరెస్టుల అనంతరం బీరెన్ సింగ్, ‘‘విద్యార్థుల అపహరణ, హత్యకు కారణమైన కొంతమంది ప్రధాన నేరస్థులు ఈ రోజు చురాచాంద్‌పుర్‌లో అరెస్ట్ అయ్యారని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు నిందితులు మాత్రమే కదా అవుతారు? బీరేన్ ఏ ప్రాతిపదికన నిందితులను దోషులుగా పేర్కొన్నారు? అలా పేర్కొనడం... కోర్టులో నిందితుల అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉంటుందా? కుకీలకు ఇది రుచించకపోవడంలో ఆశ్యర్యం ఏమీ లేదు. ఐ.టి.ఎల్.ఎఫ్. వ్యక్తం చేసిన ఆందోళనే ఇతరులు అనేక మందిలోనూ చోటు చేసుకుంది. ‘‘మహిళలు సహా అభాగ్యులైన కుకీ గిరిజనుల పట్ల కఠినంగా వ్యవహరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మైతేయి తెగల ఆగ్రహం నుండి ముఖ్యమంత్రిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది’’ అని వారి అనుమానం. కనుక మీరిప్పుడు నేనెందుకు ఈ ప్రశ్నల వైపు మీ దృష్టిని మరల్చానో అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్దిష్ట ఘటనలో ఇంఫాల్ లోని పరిణామాలు చురాచాంద్‌పుర్ నుండి చూసినప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. కచ్చితంగా ఐదు నెలల తర్వాత ఢిల్లీలో మంత్రులకు, అధికారులకు ఈ విషయం తెలిసి తీరుతుంది. అయినప్పటికీ అది వారినేమీ భావోద్వేగానికి గురి చేయదు. ‘‘నేనెందుకు ఆశ్చర్యపోతున్నాను?’’ అనే మరొక ప్రశ్నకు ఆ పరిణామం దారి తీస్తుంది. ఒక భిన్నమైన, అయినప్పటికీ సంబంధం కలిగివున్న ఒక విషయాన్ని లేవనెత్తడంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇప్పుడు తన రాష్ట్రాన్ని ఇలా చూస్తున్నారు: ‘‘మణి పుర్లోని ప్రస్తుత సంక్షోభం జాతుల సమూహాల మధ్య ఘర్షణ కాదు. రాష్ట్ర శాంతి భద్రతల సమస్య కూడా కాదు. మయన్మార్,బంగ్లాదేశ్‌లలో స్థావరాలు ఏర్పరచుకుని ఉన్న కుకీ మిలిటెంట్లు... మణిపుర్ నుంచి పని చేస్తున్న తీవ్రవాద సంస్థల సహకారంతో భారత ప్రభుత్వంపై తలపెట్టిన పూర్తిస్థాయి యుద్ధం’’ అంటారు ఆయన. ఇది మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇది బీరేన్ అభిప్రాయమా? లేక న్యూఢిల్లీ అభిప్రాయమా? న్యూఢిల్లీ అభిప్రాయమే అయితే ఈ విషయాన్ని నెపిడా(మయన్మార్ రాజధాని), ఢాకాల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందా? యుద్ధం అని మీరెలా చెప్పగలరు అని ముఖ్యమంత్రిని అడిగితే, ఆయన నిస్సందేహంగా సీమిన్లుమ్ గాంగ్టే అనే కుకీ అరెస్టును చూపుతారు. ఎన్.ఐ.ఎ. (నేషనల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ) అంటున్న దానిని బట్టి గాంగ్టే దేశ సరిహద్దుకు ఆవల ఉన్న తీవ్రవాద సంస్థ సభ్యుడు. అయితే గాంగ్టే అరెస్టుకు కొన్ని రోజుల ముందు నిషేధిత ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’ సభ్యుడైన మొయిరాంగ్థమ్ ఆనంద్ సింగ్ అనే మైతేయి తెగ వ్యక్తిని కూడా ఎన్.ఐ.ఎ. అరెస్టు చేసింది. దీనిని బట్టి తీవ్రవాద సంస్థలు ఈ రెండు తెగల వారితోనూ సంబంధాలను కలిగి ఉండి మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుండి మణిపుర్లో కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయని అనుకోవాలి. మరైతే ముఖ్యమంత్రి ఎందుకు ఒక వైపే మాట్లాడుతున్నారు? మళ్లీ ఇదొక కలవరపెట్టే ప్రశ్న. నా ముగింపు: మణిపుర్ రెండు వైపుల నుంచీ కలవరపరిచే ప్రశ్నలను విసురుతోంది. అందుకే కేవలం ఒక కోణం నుంచి ఇచ్చే సమాధానం పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. ఎందుకు అని అర్థం చేసుకోడానికి ఈ చిన్న ముక్క మీకు సహాయపడి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భారత్ తప్పించుకోగలదా?
ఖలిస్థానీ సానుభూతిపరుడు, నిషేధిత ‘ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్’ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణ అత్యంత వివాదాస్పదం అయింది. ఈ ఏడాది జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలోని ఓ గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు నిజ్జర్ని కాల్చి చంపిన నేపథ్యంలో... భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చనేందుకు ‘విశ్వసనీయమైన ఆరోపణలు’ ఉన్నాయని ట్రూడో గత నెలలో తమ పార్లమెంటులో ప్రకటించారు. దరిమిలా ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు క్రమంగా దెబ్బతింటూ వచ్చాయి. ఈ పరిణామాలను అమెరికాపై దృష్టిని కేంద్రీకరించి చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ దేశ స్పందన మనకు అత్యంత కీలకం కాబట్టి! జస్టిన్ ట్రూడో (కెనడా ప్రధానమంత్రి) ఆరోపణలపై మన ప్రభుత్వ ప్రతిస్పందనను నేను విశ్వసిస్తున్నప్పటికీ, ఒక జర్నలిస్టుగా కొన్ని ప్రత్యేకమైన వాస్తవాలను కూడా మన మది పరిగణనలోకి తీసుకోవాలేమోనని నా ఆలోచన. అయితే ఆ వాస్తవాలు అవసరమైనంత మేర కైనా నివేదనకు వచ్చాయని నేను అనుకోవడం లేదు. కొన్నిసార్లు అవి ఉద్దేశపూర్వకమైన విస్మ రణకు కూడా గురయ్యాయి. అందువల్ల వాటిని మీ దృష్టికి తీసుకురావడం నా కర్తవ్యంగా భావిస్తూ, ముగింపును మాత్రం మీకే వదిలేస్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయంతో మిమ్మల్ని ప్రభావితం చేయడం నాకు ఇష్టం లేదు. మొదటిది– ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఈ ఆరోపణలను లేవనెత్తి ‘‘ఆందోళన వ్యక్తం చేసినట్లు’’ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ రాసింది. యూఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ ‘‘అత్యున్నత స్థాయుల్లో ఈ అంశంపై చర్చ జరిగింది,’’ అని చెప్పినప్పుడే ఆయన ఈ ‘‘అందోళన వ్యక్తం అవడాన్ని’’ ధ్రువీకరించి ఉండొచ్చు. భారత్‌పై కెనడా చేసిన ఈ ఆరోపణలను బైడెన్ ఎలా చూస్తున్నారన్న విషయమై ఇది మనకు ఏం చెబుతోంది? గట్టి సాక్ష్యాలు ఉన్నాయా? రెండవది– కెనడాలోని అమెరికన్ రాయబారి ఒకటీ లేదా అంతకన్నా ఎక్కువ ‘పంచనేత్ర నిఘా కూటమి దేశాలు’ (ఫైవ్–ఐస్ కంట్రీస్: యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా) రహస్య సమాచారాన్ని అట్టావా (కెనడా రాజ ధాని)తో పంచుకున్నట్లు రూఢి పరిచారు. వాటిలో ఒక దేశం యూఎస్ఏ అని ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ఆ పత్రిక ఇంకా ఇలా రాసింది: ‘‘చూస్తుంటే కెనడా దగ్గర ‘పొగలు గక్కే తుపాకీ’ (వివాదానికి తావులేని సాక్ష్యం) ఉన్నట్టు కన బడుతోంది. ఆ దేశంలోని భారతీయ దౌత్యవేత్తల సమాచార వ్యవస్థలోకి చొరబడటం అన్నది పన్నాగంలో (వారికి) ప్రమేయం ఉందన్న సంకే తాలను ఇస్తోంది.’’ ఈ చొరబాట్లు ఏం చెబు తున్నాయి? అవి నిజంగానే పొగలు గక్కుతున్న తుపాకీతో సమానమైనవా? మూడవది – ఆరంభంలో జేక్ సల్లివాన్, ఆ మర్నాడు యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్: ‘‘మేమే మా కెనడియన్ సహోద్యోగులతో చాలా దగ్గరగా సంప్రదింపులు జరుపుతున్నాం. కేవలం సంప్రదింపులు మాత్రమే కాదు, ఈ అంశంపై వారితో సమన్వయం చేసుకుంటున్నాం’’ అని ప్రకటించారు. అంటే ఏమిటి? కెనడా దగ్గర ఉన్న సమాచారం ఎలాంటిదో మాత్రమే కాదు,అందులోని నాణ్యత ఎంతటిదో కూడా వాషింగ్టన్కు అవగాహన ఉందని ఇది సూచిస్తోందా? నాల్గవది – ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బ్లింకెన్, ‘‘ఈ పరిశోధనలో కెనడాతో కలిసి ఇండియా పని చేయడం చాలా ముఖ్యం. దీనికి బాధ్యులెవరో చూడాలనుకుంటున్నాం. దర్యాప్తు దానికై అదే జరిగి, ఫలితం వైపునకు దారి తీయాలి’’ అన్నారు. ఆయన అలా అన్నది ఒక పత్రికా సమావేశంలో అయినప్పటికీ అది న్యూఢిల్లీకి ఒక సందేశం అనుకోవాలా? ఐదవది – ‘‘ఇలాంటి చర్యలకు మీకు కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులేమీ ఉండవు. దేశంతో నిమిత్తం లేకుండా మేము గట్టిగా నిలబడి, మా ప్రాథమిక సూత్రాలను కాపాడుకుంటాం’’ అని సల్లివాన్ అనడం చూస్తుంటే, దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరిది అబద్ధం? ఆరవది–కెనడా జాతీయ భద్రతా సలహాదారు జోడీ థామస్... కెనడా ఇంటెలిజెన్స్ సర్వీసెస్ హెడ్‌తో కలిసి ఆగస్టులో నాలుగు రోజులు, సెప్టెంబరులో ఐదు లేదా ఆరు రోజులు ఢిల్లీలో ఉండి, భారత నిఘా సంస్థలకు సమాచారం అందించినట్లు కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్ల డించింది. అయితే భారత ప్రతినిధి మాత్రం... ‘‘కెనడా అప్పుడు గానీ, ఇప్పుడుగానీ, ఎప్పుడూ గానీ తమతో ఎటువంటి నిర్దిష్ట సమాచారాన్ని పంచుకోలేదు’’ అని పేర్కొన్నారు. మరి అలాంటి సమాచారం ఏదీ లేకుంటే జోడీ థామస్ భారత దేశంలో పది రోజుల పాటు ఎందుకు గడిపినట్లు? ఏడవది– మన భారత ప్రతినిధి అరిందమ్ బాగ్చి కెనడాను... ‘‘ఉగ్రవాదులకు, తీవ్రవాదు లకు, వ్యవస్థీకృత నేరాలకు సురక్షితమైన స్వర్గ ధామం’’ అని పేర్కొన్నారు. ఆ మాటలు సాధార ణంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి వాడుతుంటారు. అలాంటిది తమ నాటో మిత్రపక్షం, జీ–7 సభ్య దేశం, మరీ ముఖ్యంగా సన్నిహిత, సాంస్కృతిక పరిచయాలు కలిగిన తమ పొరుగు దేశం అయిన కెనడా గురించి ఇండియా అలా అనడాన్ని అమెరికా ఎలా చూస్తుంది? అమెరికా వైఖరి కీలకం ఎనిమిదవది– అట్లాంటిక్‌కు ఇరు వైపులా ఉన్న అనేక ఆంగ్ల భాషా వార్తాపత్రికలు భారతదేశం ఇలా ఎలా మారిందీ అని ప్రశ్నల్ని లేవదీశాయి. ఉదాహరణకు, ‘ది అబ్జర్వర్’ పత్రిక ‘‘స్వదేశంలో, విదేశాలలో మోదీ ప్రభుత్వ విధానం ప్రజా స్వామ్యం పట్ల ఆ దేశ నిబద్ధత, భాగస్వామ్య దేశంగా తన విశ్వసనీయతల పైన సందేహాలను లేవనెత్తుతోంది’’ అని రాసింది. ‘న్యూయార్క్ టైమ్స్’ కాలమిస్ట్ నికోలస్ క్రిస్టోఫ్ పాకిస్తాన్ పాలకుడు జనరల్ జియాతో మోదీని పోల్చారు. ‘ది ఎకనామిస్ట్’ నిర్మొహమాటంగా ‘‘ఇది కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం’’ అని పేర్కొంది. మన దేశం గురించి ఇలాంటి వ్యాఖ్య లన్నిటికీ మనం ఎలా స్పందించాలి? చివరిగా– ఒక అధికారిక ప్రకటనలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రూడో ఆరోపణలను ‘‘పూర్తిగా తిరస్కరించింది’’. వాటిని ‘‘అసంబద్ధము, ప్రేరణపూరితమూ అయినవి’’గా పేర్కొంది. బైడెన్ గురించి మనకు తెలిసిన దానిని బట్టి... అలాగే సల్లివాన్, బ్లింకెన్‌ల ప్రకటనలను బట్టి చూస్తే అమెరికా ఈ ప్రతిస్పందనను అంగీ కరిస్తుందని అనుకోవచ్చా? ఇప్పుడు నేను అమెరికా పైననే నా దృష్టిని కేంద్రీకరించాను. ఎందుకంటే ఆ దేశ ప్రతిస్పందన చాలా ముఖ్యమైనది. భారత్ కేవలం ఆరోపణలను మాత్రమే ఎదుర్కొంటుండగా, బ్లింకెన్ అంటున్న ‘అంతర్జాతీయ అణచివేత’లో దోషి కచ్చితంగా అమెరికానే అని నాకు తెలుసు. అయినప్పటికీ అమెరికా దీని నుంచి పదే పదే తప్పించుకుంటూ వచ్చింది. భారత్ కూడా అలా తనపై వచ్చిన ఆరో పణల నుంచి తప్పించుకోగల స్థితిలో ఉందా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
డౌనింగ్ స్ట్రీట్ మార్జాల మిత్రుడు
నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ‘ల్యారీ’ ఎందుకు కనిపించడు అని బ్రిటన్ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహూతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కొనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. అవడానికి అది మామూలు మార్జాలమే అయినప్పటికీ దానిని ‘సివిల్ సర్వెంట్’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం చీఫ్ మౌజర్ హోదాలో ఉన్న ఆ సివిల్ సర్వెంట్ పేరే ‘ల్యారీ’. 2011 నుంచి ల్యారీ బ్రిటన్ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్ కామెరున్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రుస్, రుషి సునాక్... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్ స్ట్రీట్ నుంచి కదలించగలవు. పెంపుడు కుక్కలపై మక్కువ కలిగిన వారిగా బ్రిటిషర్లు లోక విదితం అయినప్పటికీ, వారి ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ప్రాముఖ్యం పొందే చతుష్పాదం మాత్రం మార్జాలమే. పిల్లిది అక్కడ ‘చీఫ్ మౌజర్’ హోదా. చీఫ్ మౌజర్ ప్రధాన విధి డౌనింగ్ స్ట్రీట్‌లో ఒక్క ఎలుకైనా లేకుండా చూడటం. డౌనింగ్ స్ట్రీట్‌లోనే ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయాలు ఉంటాయి. అవడానికి అది మామూలు మార్జాలమే కానీ, దానిని ‘సివిల్ సర్వెంట్’గా పరిగణించాలని 2016లో నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరున్ పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం చీఫ్ మౌజర్ హోదాలో ఉన్న ఆ సివిల్ సర్వెంట్ పేరు ‘ల్యారీ’. ‘బ్యాటర్‌సీ డాగ్స్ అండ్ క్యాట్స్ హోమ్’ నుంచి తప్పించి, దానిని అక్కడికి తెప్పించారు. 2011 నుంచి ల్యారీ బ్రిటన్ ప్రధాని నివాసంలో ఉంటోంది. డేవిడ్ కామెరున్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రుస్, రుషి సునాక్... ప్రధానులుగా ఇంతమంది మారారు కానీ, ల్యారీ అక్కడే ఉంది. కాలధర్మం లేదా వృద్ధాప్యం మాత్రమే ల్యారీని డౌనింగ్ స్ట్రీట్ నుంచి కదలించగలవు. జీవిత చరిత్రల రచనలో ప్రావీణ్యం కలిగిన నా మేనకోడలు నారాయణీ బసు బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక మార్జాలాల జీవిత చరిత్రను సంక్షిప్తంగా సంకలన పరిచారు. ఎనిమిదవ హెన్రీ చక్రవర్తి కాలం నాటి బ్రిటిష్ ప్రభుత్వ మార్జాల జీవిత చరిత్రతో సంకలనం మొదలౌతుంది. ఆ కాలపు రాజనీతిజ్ఞుడు, క్యాథలిక్ బిషప్ అయిన లార్డ్ ఛాన్స్లర్... థామస్ వోల్సే దగ్గర ఆ మార్జాలం ఉండేది. 1929కి ముందే బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా పిల్లి సంరక్షణ బాధ్యతలను చేపట్టినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. పిల్లి పోషణ, పాలన కోసం రోజుకు ఒక పెన్నీ కేటాయించినట్లు అప్పటి బడ్జెట్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. నాటి నుంచి పిల్లి ఖర్చు క్రమంగా పెరుగుతూ వచ్చి 21వ శతాబ్దానికి ‘చీఫ్ మౌజర్’ బ్రిటిష్ ఖజానాకు పెట్టిస్తున్న ఖర్చు 100 పౌండ్లకు చేరుకుంది. డౌనింగ్ స్ట్రీట్ వెబ్సైట్ ప్రకారం ల్యారీ విధులు ఇలా ఉన్నాయి: ఇంటికి వచ్చే అతిథులను పలకరించడం, భద్రతకు ఉద్దేశించిన రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేయడం, కునుకు తీయడానికి పురాతన ఫర్నిచర్ ఏ మాత్రం నాణ్యతను కలిగి ఉన్నదో పరీక్షించడం. అలాగే, భవంతిలో ఎలుకలు చేరకుండా ఉండేందుకు పరిష్కారం ఆలోచించడం కూడా చేస్తోందనీ, ఆ పరిష్కారం ఇంకా వ్యూహాత్మక ప్రణాళిక దశలోనే ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిందని కూడా వెబ్సైట్లో ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ల్యారీ తన బాధ్యతల కంటే కూడా ప్రధాని కార్యాలయ అవసరాలను చూడ్డానికే ఎక్కువ ఇష్టపడుతుంది. నారాయణి పరిశోధనను బట్టి కామెరున్ దగ్గర తన తర్వాత వచ్చిన ప్రధానుల కంటే కూడా ల్యారీ గురించి చెప్పడానికే ఎక్కువ సమాచారం ఉంది. ఆ పిల్లి గురించి సునాక్ అభిప్రాయాన్ని నారాయణి ప్రస్తావించలేదు. కనుక ల్యారీని అర్థం చేసుకోవాలంటే మనం కామెరున్ మీద ఆధారపడాలి. ఆయన చెబుతున్న దానిని బట్టి ల్యారీ పురుషుల సమక్షంలో కాస్త బెరుకుగా ఉంటాడు. అయితే అందుకు బరాక్ ఒబామా మినహా యింపు. ‘‘తమాషా ఏంటంటే ఒబామాను ల్యారీ ఇష్టపడతాడు. ఒబామా అతడికి మృదువైన చిన్న తాటింపు వంటి స్పర్శను ఇస్తాడు. దాంతో ల్యారీ ఒబామా దగ్గర సౌఖ్యంగా ఉంటాడు. అయితే ల్యారీ ప్రధానమంత్రుల సతీమణులను కలవరపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ల్యారీ ఒంటి వెంట్రుకలు తన భర్త సూట్లపై కనిపించడంతో సమంతా కామెరున్ ల్యారీని ప్రధాని నివాసంలోకి అడుగు పెట్టనివ్వకుండా చేశారు. అంతెందుకు, పక్కనే ఉండే విదేశాంగశాఖ కార్యాలయంలోకి ల్యారీని ప్రవేశించనివ్వకుండా క్యాట్–ప్రూఫ్‌ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. విదేశాంగ కార్యదర్శి విలియం హేగ్ దానిని కిందికి తీసుకెళ్లండి అని కోరారు. అయితే హేగ్‌కి ల్యారీ పట్ల కొంత ఆపేక్ష ఉండేదట. కఠోర వాస్తవం ఏంటంటే ల్యారీకి ఉన్న ప్రజాదరణ కారణంగా తరచూ ప్రధాన మంత్రి కంటే కూడా ఎక్కువగా ల్యారీకి భద్రతా బలగం అవసరం అయ్యేది. కామెరాన్ దంపతులు ఆ పిల్లిని ఇష్ట పడటం లేదని కథలు వ్యాప్తి చెందడం ప్రారంభవమడంతో ల్యారీ, తను ‘పర్–ఫెక్ట్లీ వెల్’ అని ప్రధాని కామెరున్ తప్పనిసరై ట్వీట్ చేయవలసి వచ్చింది. ఆ ట్వీట్ బ్రిటిష్ ప్రభుత్వానికి భరోసాను ఇచ్చింది. నిష్క్రమించే ప్రధాని వీడ్కోలు కార్యక్రమ గౌరవ ఆహ్వానితుల జాబితాలో ల్యారీ ఎందుకు కనిపించడు అని బ్రిటన్ ప్రజలు తరచూ ఆలోచిస్తూ ఉంటారు. బహుశా ఆహుతుల అందరి దృష్టీ తన వైపు మళ్లేందుకు ల్యారీ ఎప్పటికప్పుడు కళాత్మకమైన మార్గాలను కనుగొంటూ ఉండడం అందుకు కారణం కావచ్చు. 10 డౌనింగ్ స్ట్రీట్ ప్రవేశ ద్వారం వద్ద ట్రంప్‌తో కలిసి థెరెసా మే, ఆమె భర్త ఫొటోలు దిగుతున్నప్పుడు ల్యారీ వారి వెనుక కిటికీ అంచుపై నిలబడి ప్రతి ఫొటోలోనూ కనిపించింది. తర్వాత వర్షం నుంచి తలదాచుకోడానికి సాయుధుల కనురెప్పల కాపలాలో ఉన్న ట్రంప్ క్యాడిలాక్ కారు కింద దూరిన ల్యారీని ఎంత నచ్చచెప్పీ బయటకు రప్పించలేక పోయారు. బి.బి.సి.కి చెందిన జోన్ సోపెల్ ఆ ఘటనను... ‘‘బ్రేకింగ్ న్యూస్: ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనకారులు డొనాల్డ్ ట్రంప్ వాహన శ్రేణిని నిలువరించడంలో విఫలమయ్యారు. కానీ 10 డౌనింగ్ స్ట్రీట్ పిల్లి ఆ పని చేయగలిగింది’’... అని ట్వీట్ చేశారు. కొంతకాలంగా ల్యారీపై మునుపెన్నడూ లేని విధంగా తరచూ విమర్శలు వినవస్తున్నాయి. ల్యారీ స్వభావం, పనితీరు చుట్టూ కేంద్రీకృతం అయిన విమర్శలవి. వేటాడి చంపే క్రూర స్వభావం ల్యారీలో విస్పష్టంగా లోపించడాన్ని డౌనింగ్ స్ట్రీట్ అధికారులు గమనించారు. ‘‘ఎలుకల్ని వేటాడడం కన్నా ఎక్కువ సమయం ల్యారీ నిద్రలోనే గడుపుతున్నాడు’’ అని కొందరు ఫిర్యాదు చేశారు. అయితే నేను విన్నదేమంటే సునాక్ అతడిని విధుల నుంచి విరమింపజేసే ప్రమాదం లేదని. ఏ విధంగా చూసినా కూడా సునాక్ దంపతులకు వీడ్కోలు పలికి, కొత్తగా వచ్చేవాళ్ల మెప్పు పొందే వరకైనా ల్యారీ అక్కడ ఉంటాడు. ల్యారీ మాంసం కూరను ఇష్టపడతాడా లేక పప్పూ, అన్నం అంటాడా అనేది బహుశా అప్పుడు మనం తెలుసుకోవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఒకేసారి ఓటు ప్రజాస్వామ్యానికి చేటు
‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది – ఖర్చు తగ్గుతుంది. రెండవది – ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల అభివృద్ధి కుంటుపడదు. ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించినవి. ఓటు హక్కును ‘ప్రజాస్వామ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం పరిమితులను విధిస్తుంది. పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం ఉంది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ వల్ల ప్రయోజ నాలు, నిష్ప్రయోజనాలను నేను సరిగ్గా, సరళంగా, సమతులంగా చెప్పగలనేమో చూద్దాం! ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే భావన పైన, ఆ ఆవశ్యకత పైన అవగాహన కోసం ఇది మీకు సహాయకారిగా ఉండవచ్చు. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ను సమర్థించే వారి దగ్గర రెండు వాదనలు ఉన్నాయి. మొదటిది, ఖర్చు తగ్గుతుంది. కదా మరి, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఐదేళ్లకు జరిగే ఎన్నికల ఖర్చు... వివిధ సమయా లలో అనేకసార్లు జరిగే పలు ఎన్నికల మొత్తానికీ అయ్యే ఖర్చు కంటే తక్కువగానే ఉంటుంది. అయితే థరూర్, చక్రవర్తి అదేమంత చెప్పు కోదగిన పొదుపు కాదని అంటున్నారు. ఏడాదికి రూ. 5,000 కోట్ల లోపే ఉండే ఆ పొదుపు మొత్తం లేకున్నా కూడా భారత్ వంటి ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలో అది ఏమంత నిర్ణయాత్మకమైన ఆందోళన కారకం కాదనేది వారి వాదన. రెండవ అనుకూల వాదన ఏమిటంటే, దేశం మొత్తానికీ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల నియమావళి ఆంక్షలు దేశవ్యాప్తంగా ఒకే కాలానికి వర్తింపులో ఉంటాయి. దాని వల్ల ఎప్పుడూ ఏదో ఒకచోట అమలులో ఉండే ఎన్నికల ఆంక్షల కారణంగా అభివృద్ధి కుంటుపడటం అనే సమస్య ఉండదు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నియమావళి అన్నది దేశవ్యాప్తంగా అమలుకావలసి ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఆ నియమావళి అమలు పెద్ద విషయంగా ఉండటం లేదు. అసలు అమలవుతోందా అన్నది కూడా ముఖ్యమైన ప్రశ్న. అక్కడ ఆంక్షల్ని అతిక్రమిస్తున్నది అధికార పార్టీకి చెందినవారైతే నియమావళి నిస్సందేహంగా అమలు కానట్లే! ఇక వ్యతిరేక వాదనలు వివేచన, వాస్తవికతల్లోంచి జనించే ప్రాథమికమైన స్వభావం కలిగి ఉన్నవి. ఓటు హక్కును ‘‘ప్రజాస్వా మ్యంలోని అత్యంత ప్రాథమికమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’’ అని చెబుతారు. ఆ హక్కుకు ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ పరిమితులను విధిస్తుంది. ఉదాహరణకు, ప్రభుత్వం తన మెజారిటీ కోల్పోయి నప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లకు ఉన్న హక్కును హరించేలా పార్లమెంటును కొనసాగించే మార్గాల అన్వేషణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే ఈ భావన మనం కోరుకుంటున్న ప్రజాస్వామ్య ప్రయాణ మార్గాన్ని విఘాత పరచనూవచ్చు. ఆ మార్గాన్ని మనం విస్తృతపరచుకోవడానికి, మరింత లోతుకు తీసుకు వెళ్లడానికి ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అడ్డుపడుతుంది. ఉదా హరణకు, ఓటు వేసి ఎన్నుకున్న నాయకులను తిరిగి వెనక్కు పంపే హక్కు మనకు ఉండాలి. 50 ఏళ్ల క్రితమే 1974లో వాజ్‌పేయి ఈ ‘రీకాల్’ హక్కు అవసరాన్ని గుర్తించారు. అయితే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ ఈ హక్కుకు విరుద్ధమైనది. ఐదేళ్లకోసారి ఎన్నికలు అనే విధానం... ఓటు వేసి, ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు పౌరులకున్న అవకాశాన్ని కుదించడం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇరుకైనదిగా మార్చేస్తుంది. ఇప్పుడిక ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అమలుకు అవసర మైన రాజ్యాంగ సవరణల చిక్కుల దగ్గరికి వద్దాం. మొదటిది–ఎన్నికల ఏకకాలీనత కోసం సవరణలు! ఆ సవరణల వల్ల కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలు పొడిగింపును పొందుతాయి. మరికొన్ని చోట్ల శాసనసభల కాలపరిమితిని కుదించాల్సి వస్తుంది. అప్పుడది కచ్చితంగా ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా ఆడుతున్న ఆట అవదా? ఓటర్లు ఇచ్చిన ఐదేళ్ల కాలాన్ని ఏకపక్షంగా తగ్గించడమో, పెంచడమో చేసినట్లే కదా! ఐదేళ్ల కన్నా ముందే ప్రభుత్వం పడిపోతే అప్పుడు రెండో రకం సవరణలు అవసరం అవుతాయి. మిగిలిన కాలానికి రాష్ట్రపతి పాలన రాష్ట్ర స్థాయిలో అవాంఛనీయమైనదీ, కేంద్రస్థాయిలో అసాధ్యమైనదీ. ఇందుకు ఒక పరిష్కారం– జర్మనీ తరహా నిర్మాణాత్మక అవిశ్వాస తీర్మానం. ఎలాగంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం ఉంటే తప్ప అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి లేదక్కడ. పడగొట్టినవాళ్లే ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. వినడానికి బాగుంది కానీ, ఆచరణలో ఎల్లవేళలా ఇది సాధ్యమా? ఉదాహరణకు, పాలకపక్షం నుంచి చీలిపోయిన పక్షం, ప్రతిపక్షం వైపు మొగ్గు చూపడానికి నిరా కరిస్తే అప్పుడేం జరుగుతుంది? ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం తన మెజా రిటీని కోల్పోతుంది, కానీ ఆ స్థానంలోకి వచ్చేవారెవరూ లేకపోవడం వల్ల అలాగే కుంటుతూ నడుస్తుంది. లేదా ఒకవేళ సంకీర్ణ కూటమిలోని భేదాభిప్రాయాల వల్ల బడ్జెట్‌కు పార్లమెంటులో ఆమోదం లభించలేదనే అనుకుందాం? అప్పుడిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. కానీ çసభ్యుల బలం ఉన్న కారణంగా బడ్జెట్‌కు ఆమోదం పొందలేని ఆ ప్రభుత్వం ఏమీ కుప్పకూలి పోదు. ఇలాంటి సందర్భాలలో ఐదేళ్ల కాల వ్యవధిలో మిగిలి ఉన్న కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. అయితే అది ఓటు అనే వనరును నిర్లక్ష్యంగా ఉపయో గించుకున్నట్టు అవదా? ఓటు విలువ కొన్నిసార్లు ఐదేళ్ల కాలానికీ, మరి కొన్నిసార్లు ఐదేళ్లలో మిగిలిన భాగానికీ ఉంటుందా? ప్రజాస్వామ్యంలో రెండు రకాల ఓట్లు ఉండొచ్చా? ఇవీ ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ భావనకు సంబంధించి పైపైన ఆలో చిస్తేనే ఉత్పన్నమయ్యే ప్రాథమిక ఆందోళనలు. భారతదేశ ప్రజాస్వా మ్యానికి సంబంధించి మరొక మూడు ఆందోళనకరమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మొదటిది – పార్లమెంటరీ ఎన్నికలు ఇప్పటికే అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారుతున్న పరిస్థితుల్లో, ఈ ఏకకాల ఎన్నికలనేవి ఆ ధోరణిని తీవ్రతరం చేసి మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మొత్తంగానే నాశనం చేసే ప్రమాదం లేదా? రెండవది – ఒక జాతీయ పార్టీ మంచి ఊపులో ఉన్నప్పుడు, ఏక కాల ఎన్నికలు బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ ఉన్న దేశంగా మార్చకుండా ఉంటాయా? మూడవది – ఎన్నికలు మన ప్రజా శాసన సభ్యులను ప్రతిస్పందించే వారిగా, జవాబుదారీగా ఉండేవారిగా చేస్తాయని మనకొక నమ్మకం. అయితే ఐదేళ్లకోసారి మాత్రమే ఎన్నికలను నిర్వహిస్తే మధ్యలో ఏం జరిగినా వారు తమకు పట్టనట్లుగా, అహంకారంగా ఉండిపోయే అవకాశం లేదా? ఈ సమస్యల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. మరీ ముఖ్యంగా మూడు అంశాలపై మీరు దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది: ఏకకాల ఎన్నికల ఆవశ్యకత, వాటిని అమలు చేయడంలో వచ్చే చిక్కులు, అనంతరం వచ్చే పర్యవసానాలు. ఆ తర్వాత ‘ఇది సరైనదేనా?’ అనే ప్రశ్నకు జవాబు ఇచ్చుకోండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నాటకీయత లేని యాక్షన్ సినిమా
ఒక దౌత్యవేత్త జీవితంలోని ఘటనలు పూర్తిస్థాయి యాక్షన్ సినిమాకేమీ తీసిపోవు. ముఖ్యంగా ఆయన లెబనాన్ అంతర్యుద్ధ కాలంలో చురుగ్గా ఉన్నవాడూ; మాజీ ప్రధానులు బేనజీర్ భుట్టో, రాజీవ్ గాంధీ మధ్య రహస్య సందేశాల వినిమయానికి తోడ్పడ్డవాడూ అయినప్పుడు! అందుకే ‘ఎ డిప్లొమాట్స్ గార్డెన్’ పుస్తకం ఉర్రూతలూగిస్తుందనుకుంటాం. కానీ విషయ తీవ్రత ఎలాంటిదైనా, చలిమంట కాచుకుంటూ, నింపాదిగా మాట్లాడే శైలి ఆఫ్తాబ్ సేఠ్ది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దశాబ్దాల పాటు నివేదికలను డిక్టేటు చేసిన ప్రభావం ఆయన శైలిలో స్పష్టంగా కనబడుతుంది. దౌత్యవేత్తగా ఆయన మనసు ఎప్పుడూ నాటకీయతను శూన్యం చేయడంపైనే ఉంటుందని ఈ పుస్తకం చెబుతుంది. ఒక భారతీయ దౌత్యవేత్త జీవితం ఎలా ఉంటుందోనని మీకు ఎప్పుడైనా అనిపించి ఉంటే, ఒక్కసారి ఆఫ్తాబ్ సేఠ్ జ్ఞాపకాల్లోకి తొంగిచూడండి. లెబనాన్ అంతర్యుద్ధ కాలంలో ఆయన చురుగ్గా ఉన్నారు, పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మధ్య రహస్య సందేశాల వినిమయానికి తోడ్పడ్డారు. అంతేనా? జపాన్ రాజ కుటుంబంతో విందులారగించడం మొదలుకొని, మంచానపడ్డ గ్రీకు ప్రధాన మంత్రులను ఆసుపత్రుల్లో పలకరించడం, మయన్మార్ విప్లవ నేత ఆంగ్‌సాన్ సూకీ దివంగత భర్త మైకేల్ ఆరిస్‌తో కలిసి కుట్రలు పన్నడం వరకూ దౌత్యవేత్తగా ఆఫ్తాబ్ చేసిన పనులు ఎన్నో! ఈ ఘటనలన్నీ పూర్తిస్థాయి యాక్షన్ సినిమాకేమీ తీసిపోవు. బహుశా ఇవి ఆయన ‘అడ్రినలిన్’ను ఎప్పుడూ పైపైకి ఎగబాకించి ఉంటాయి కూడా. కానీ సుశిక్షితుడైన దౌత్యవేత్తగా ఆఫ్తాబ్ రాసిన ‘ఎ డిప్లొమాట్స్ గార్డెన్ ’ పుస్తకం ఇలాంటి గాథలను పల్లెసీమల రోడ్ల మీద తిరిగే కారు వేగంలా నెమ్మదిగా వివరిస్తుంది. విషయం చాలా గొప్పది కావచ్చు కానీ చెప్పే శైలి మాత్రం ఆచితూచి, ప్రశాంతంగా ఉంటుంది. విషయ తీవ్రత ఎంత ఉన్నా, చలిమంట కాచుకుంటూ, నింపాదిగా నోట్లోని చుట్టతో పొగలు ఊదుకుంటూ, దేనికీ చలించని వ్యక్తిగా ఆఫ్తాబ్ను మనం ఊహించుకోవచ్చు. పుస్తకంలోని చాలా వాక్యాలు ‘ఒకసారి గుర్తు చేసుకుంటే’, ‘గుర్తుంచుకోవాల్సిన అంశం’, ‘ఇంతకుముందే చెప్పినట్లు’, ‘దీని గురించి క్లుప్తంగా చెప్పుకుని’ వంటి పదబంధాలతో మొదలవుతాయి. ‘దీని వివరాలు మనల్ని నిలిపి ఉంచకూడదు’ అన్నదీ తరచుగా కని పిస్తుంది. కొన్నిసార్లు అధ్యాయాల మధ్యలో ‘ఇప్పుడు మనం అసలు కథలోకి వెళితే’ అని ఉంటుంది. దశాబ్దాలపాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదికలను డిక్టేటు చేసిన ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. కానీ తలుచుకుంటే ఆఫ్తాబ్ సేఠ్ భాష గాల్లోకి లేస్తుంది, ఆయన విశేషణాలు ఆకాశాన్ని అంటుతాయి. ‘‘భయంకరమైన తరచుదనంతో కాండ్రించి ఉమ్మడం ఆయనకున్న ఒకానొక ఇబ్బందికరమైన అల వాటు. అదృష్టం ఏమిటంటే, ఆ ఉమ్మడమేదో తన కుర్చీ దగ్గరగానే పెట్టుకున్న ఉమ్మితొట్టెలోకి పడేలా చాకచక్యంగా ఊసేవాడు.’’ సేఠ్ భాషకు మచ్చుకు ఒక ఉదాహరణ ఇది. జాగ్రత్తగా తూచినట్టుండే ఆయన శైలి అప్పటికి ఆదరణీయం కాకపోయినా, ఆయన చేసిన పనులు, కలిసిన మనుషుల గురించి తెలిస్తే మాత్రం సంబరపడేన్ని కథలు ఉన్నాయనిపిస్తుంది. చిన్న ఉదాహరణ చూద్దాం. లెబనాన్ అంతర్యుద్ధం తీవ్రంగా జరుగుతున్న కాలంలో ఆఫ్తాబ్ బీరూట్‌లో ఉన్నారు. ఒక పక్క బాంబుల వర్షం, ఇంకోపక్క కుప్ప కూలుతున్న భవనాలు... వీటన్నింటి మధ్యలో సేఠ్ తన ఫ్లాట్ ముంగిట్లో నిద్ర పోయారట. పడే బాంబు ఏదో నేరుగా భవనం మీద పడవచ్చునన్న అంచనాతో! వాళ్ల డ్రైవర్ అలీ ‘‘కదులు తున్న దేనిమీదికైనా విచ్చలవిడిగా దూసుకొస్తున్న తుపాకీ గుళ్ల నుంచి తప్పించేందుకు కారును వాయువేగంతో ముందుకు ఉరికించాడు.’’ ఆఫ్తాబ్ భార్య పోలా అప్పుడు రెండోసారి గర్భవతిగా ఉన్నారు. పురిటినొప్పులు తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో మొదలయ్యాయి. ఆ సమయంలో ఆంబులెన్ ్స కూడా అందుబాటులో లేదు. తానే సొంతంగా కాన్పు చేసేందుకు కూడా సేఠ్ సిద్ధమయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ ఆ అవసరం రాలేదు. ఈ పుస్తకం మొత్తం ఉత్కంఠభరితంగా ఉంటుంది కానీ ఈ విషయాలన్నీ చెప్పే విషయంలో ఆఫ్తాబ్ చాలా డిప్లొమాటిక్‌గా వ్యవహరించారని చెప్పాలి. బేనజీర్ భుట్టో విషయాలు చెప్పేటప్పుడు ఆయనెంత జాగ్రత్తగా వ్యవహరించారన్నది స్పష్టంగా తెలుస్తుంది. బేనజీర్ ఓ అద్భుతమైన వ్యక్తి. ఆమె గురించి ఆఫ్తాబ్కూ బాగా తెలుసు. కరాచీ, లార్కానాల్లోని భుట్టో ఇళ్లకు ఆయన వెళ్లేవారు. అలాగే మలేసియా, న్యూఢిల్లీల్లోని హోటళ్లలోనూ సమావేశాలు, చర్చలు నడిచేవి. రాజీవ్ గాంధీ నుంచి వచ్చే రహస్య సందేశాలు ఇలాంటి సమావేశాల్లోనే చేతులు మారేవి. కానీ ఈ సందేశాల గురించి ఆయన మనోహరమైన మౌనం పాటిస్తారు. ఈ అధ్యాయం ఎంత అద్భుతంగా మారి ఉండేది! కానీ ఏం చేస్తాం? తన వజ్రాలను సానపెట్టడం కాకుండా, వాటిని ఇలాంటి వాక్యాలతో రాళ్లలా మార్చేశారు. ‘‘మాజీ ప్రధాని వ్యక్తిత్వం గురించి తమకు తెలిసిన అరుదైన విషయాలను రోషన్(ఆఫ్తాబ్ సోదరుడు)తో భుట్టోలు పంచుకున్నారు’’ అని రాస్తారు. కానీ ఆ విషయాలు ఏమిటో వెల్లడించరు. బేనజీర్తో జరిగిన ఒక సమావేశం గురించి ఆయన రాశారు. ఇందులో బేనజీర్ మిలిటరీ కార్యదర్శి ఆ సమావేశాన్ని అడ్డుకునేందుకు ‘‘తప్పుడు ఆఫ్తాబ్’’ గురించి చెబుతారు. ప్రతిగా బేనజీర్ ‘‘రహస్యంగా వినే మైక్రోఫోన్లను గందరగోళ పరిచేందుకు రేడియో సౌండ్ పెంచారు’’ అని రాశారు. దౌత్యవేత్తగా ఆయన మనసు నాటకీయతను సున్నా చేయడంపైనే ఉంటుంది. ‘‘నింపాదిగా భోంచేస్తూ పాకిస్తాన్ స్థానిక రాజకీయ పరిస్థితిపై కూడా చర్చించాము’’ అని రాయడం ఇలాంటిదే. అదృష్టం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఆఫ్తాబ్ విచక్షణకు కాకుండా, ధైర్యానికి ప్రాధాన్యం ఇవ్వడం. ఇలాంటి సందర్భాల్లోనే నియంత్రణలో నడిపే ఆయన వాక్యాలు సంకెళ్ల నుంచి తప్పించుకుంటాయి. కౌలాలంపూర్‌లోని ఓ రెస్టారెంట్లో బేనజీర్తో ఇద్దరిద్దరుగా భోంచేసిన కథ ఈ కోవకు చెందుతుంది. వారిద్దరూ ఒక టేబుల్ మీద ఉండగా, వారి సంభాషణను చెవులు రిక్కించినా వినలేనంతగా పదిహేను అడుగుల దూరంలో ఉన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి గుడ్లగూబలా చూస్తూ ఉండటం! ప్రధానిగా పాక్ అధ్యక్షుడితో తాను ఎదుర్కొంటున్న సమస్య లేమిటో ఆమె వివరంగా ఆఫ్తాబ్కు తెలిపిన సందర్భమిది. దాంతో పాటే ‘‘ఆయన రహస్య కార్యకలాపాల జాబితా’’ గురించి కూడా చర్చకు రావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఆ క్షణంలోనే విదేశాంగ మంత్రి యాకూబ్ ఖాన్‌ను విస్మరించి చాలా సమయమైందని బేనజీర్ అనుకున్నారో ఏమో, తమతో కలవమన్నట్టుగా ఆయన వైపు చూస్తూ సంజ్ఞ చేశారనీ, అలాగే మాట్లాడుతున్న అంశాన్ని కూడా ‘‘ఏదేదో ఊహించుకునే యాకూబ్ మనసుకు సాంత్వన ఇచ్చేలా’’ పాకిస్తాన్లో ఎవరికైనా చిర్రెత్తించే ‘జిన్నా హౌస్’ వైపు మళ్లించారనీ ఆఫ్తాబ్ రాశారు. ఇలాంటి పూవులే ఆఫ్తాబ్ సేఠ్ ఉద్యానవనంలో మనల్ని ఉల్లాసపరుస్తాయి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
దేశానికి తగిలిన చెంప దెబ్బ
మొదటి ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. హోమ్ వర్క్ చేయలేదన్న కారణంతో ఏడేళ్ల ముస్లిం బాలుడిని మిగతా పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి చెంప దెబ్బ కొట్టాలని తృప్తి త్యాగి అనే ఉపాధ్యాయురాలు ఆదేశించారు. రెండో ఘటన జమ్మూ–కశ్మీర్లో చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడు బ్లాక్ బోర్డు పైన ‘జై శ్రీరామ్’ అని రాసినందుకు, ఫరూఖ్ అహ్మద్ అనే టీచర్ పిల్లలంతా చూస్తుండగా ఆ బాలుడిని క్లాసు బయటికి ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టాడు. ఇక్కడ బాధితులు పసివాళ్లు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వారికి లోతైన గాయాలయ్యాయి. దారుణాతి దారుణం ఏంటంటే... వారు ముస్లిములో, హిందువులో అయిన కారణంగా అలా జరగడం! అది ఏకంగా భారతదేశం పైనే జరిగిన దాడి! మాట వినని పిల్లలు చెంపదెబ్బ తింటారని తెలియని తరం నుండేమీ నేను రాలేదు. కానీ నాన్న ఎప్పుడూ నాపై చెయ్యి ఎత్తలేదు. ఆయన ఆర్మీ ఆఫీసర్ అయినప్పటికీ నన్ను గారం చేసేవారు. సున్నితమైన మనసు గల తండ్రిగా ఆయన నా పట్ల వ్యవహరించేవారు. అమ్మ మాత్రం నన్ను క్రమశిక్షణలో ఉంచేవారు. అమ్మ చేతి దెబ్బలు ఒకటీ రెండు తిన్నట్లు కూడా నాకు గుర్తు. నిస్సందేహంగా నేను ఆ దెబ్బలకు యోగ్యమైనవాడినే! నిజానికి, ఆ విధమైన దండన ఆ కాలంలో సమర్థనీయతను కలిగి ఉందన్న సంగతి కూడా నాకు తెలియందేమీ కాదు. అయితే గత వారం రెండు వేర్వేరు పాఠశాలల్లో, ఇద్దరు వేర్వేరు వర్గాలకు చెందిన పిల్లలపై ‘ఇతర’ వర్గం నుంచి జరిగింది ఇందుకు భిన్నమైనది. వారు చెంపదెబ్బలు తినలేదు. దెబ్బలు తిన్నారు. ఇది మొదటిది. ఇక రెండవది... వారిని మందలించడానికి గానీ, సరిదిద్దడానికి గానీ కొట్టలేదు. అవి వారిని అవమానించడానికీ, ఆత్మా భిమానాన్ని దెబ్బతీయడానికీ కొట్టినవి. మూడవది, వారు వేరే మతానికి చెందిన వారైనందువల్ల జరిగినవి. వెల్లువెత్తిన మత విద్వేషం అది. ఇదేమీ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం కోసం జరిగినది కాదు. నిజం చెప్పాలంటే... ఆ ధోరణి గర్హనీయమైనది, నీచమైనది, అసహ్యకరమైనది. మొదటి ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఖుబ్బాపుర్లో జరిగింది. హోమ్ వర్క్ చేయలేదన్న కారణంతో ఏడేళ్ల ముస్లిం బాలుడిని మిగతా పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి చెంపదెబ్బ కొట్టాలని తృప్తి త్యాగి అనే ఉపాధ్యాయురాలు ఆదేశించారు. ఆమె ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కూడా! ఆ బాలుడిని అలా కొట్టిస్తున్న సమయంలో ఆ టీచరు... ‘మహమ్మదీయ పిల్లలు’ అంటూ అవహేళనగా, అవమానకరంగా మాట్లాడుతూ, ‘‘ఇంకా గట్టిగా కొట్టండి’’ అని సాటి పిల్లల్ని ప్రోత్స హించడం మరో మాటకు తావులేకుండా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. రెండో ఘటన, జమ్మూ–కశ్మీర్‌లోని బనీలో చోటు చేసుకుంది. అక్కడ పదేళ్ల బాలుడు బ్లాక్ బోర్డు పైన ‘జై శ్రీరామ్’ అని రాశాడు. అది చూసిన ఫరూఖ్ అహ్మద్ అనే టీచర్ ‘‘పిల్లలంతా చూస్తుండగా ఆ బాలుడిని క్లాసు బయటికి ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టాడు. అక్కడి నుంచి ఆ బాలుడిని ప్రిన్సిపాల్ గది లోకి లాక్కెళ్లి అక్కడ మళ్లీ ఆ టీచరు, ప్రిన్సిపాల్ కలిసి, గదికి తాళం వేసి మరీ ఆ చిన్నారిని కొట్టారు. ఇంకోసారి అలా రాస్తే చంపేస్తామని హెచ్చరించారు’’ అని ఎఫ్.ఐ.ఆర్.లోని వివరాలను బట్టి తెలుస్తోంది. ఈ రెండు ఘటనలు కూడా అత్యంత భయానకమైనవి. రెండో ఘటన గురించి కొద్దిగా మాత్రమే మనకు తెలుసు. మొదటి ఘటన తాలూకు వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వీడియోను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించే లోపే సోషల్ మీడియాలో లక్షల మంది వీక్షించారు. ఏడేళ్ల ముస్లిం బాలుడిని కొట్టినందుకు వచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. ఇక్కడే మరొక ఆందోళన కూడా కలుగుతోంది నాకు. బాలుడి తండ్రి న్యాయం కోసం డిమాండ్ చేసే స్థితిలో లేక పోగా... రాజీపడమని, ఇంకా చెప్పాలంటే ఆ టీచర్‌ను క్షమించి, జరిగిన దానిని మరచిపొమ్మని ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. అలా ఒత్తిడి తెస్తున్నవారిలో రైతుల పోరాట యోధుడు నరేశ్ టికైత్ కూడా ఉన్నారు. బాలుడి తండ్రిని రాజీ పడమని చెబుతూ, ఎందుకంటే, ‘‘ఆ టీచర్ చెడు ఉద్దేశంతో అలా చేయలేదు’’ అంటున్నారు. ‘‘కనీసం ఆమె క్షమాపణైనా చెప్పాలి కదా’’ అని అడిగినప్పుడు, ‘‘క్షమాపణ అనేది పెద్ద మాట. కానీ ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు’’ అని రాకేశ్ టికైత్ అన్నారు. ఖుబ్బాపుర్ పరిసర ప్రాంతాల గ్రామ పెద్దల ప్రతిస్పందన అయితే మరింత నిరుత్సాహకరంగా ఉంది. పూరా గ్రామానికి చెందిన నరేంద్ర త్యాగి ఆ ఏడేళ్ల పిల్లవాడి తండ్రితో, ‘‘ఇక ఈ నాటకాన్ని ఆపండి. గ్రామంలోకి మీడియా అడుగు పెట్టడం మాకు ఇష్టం లేదు. మీరు వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎఫ్.ఐ.ఆర్. వద్దని చెప్పండి. వెనక్కు తీసుకోండి. లేకుంటే మీరే దాని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అన్నారు. చివరికి పోలీసులు కూడా కనీసంలో కనీసమైనా చేయలేదు. వారెంటు లేకుండా అరెస్టు చేయడానికీ, కోర్టు అనుమతి లేకుండా విచారణ చేపట్టడానికీ వీల్లేని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ‘‘తృప్తి త్యాగికి ద్వేషపూరిత ఉద్దేశాలు లేవు’’ అని ముజఫర్‌నగర్ పోలీసులు పేర్కొన్నారు. ఇక స్థానిక బీజేపీ ఎంపీ సంజీవ్ బాల్యాన్ ‘‘ఇదొక చిన్న విషయం’’ అనేశారంటే ప్రభుత్వ స్పందన ఎలా ఉందో మీరు ఊహించవచ్చు. ఎన్నికలు మరో ఏడు నెలల్లో ఉన్నాయి కనుక క్షమించి, ఇక ఆ విషయాన్ని మర్చిపోవాలని అది కోరుతోంది. కానీ మీరు, నేను అలా క్షమించి, మర్చిపోకూడదని నేను అంటాను. లేదా మొత్తంగా మనం. ఇక్కడ బాధితులు పసివాళ్లు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వారికి లోతైన గాయాలు అయ్యాయి. అవి నయం అవడానికి ఎంతో సమయం, ఎంతగానో ప్రేమ అవసరం అవుతాయి. వారికి జరిగిన దారుణాతి దారుణం... వారు ముస్లిములో, హిందువులో అయిన కారణంగా జరిగింది. అది ఏకంగా భారతదేశం పైనే జరిగిన దాడి! చివరిగా ఒక మాట. ఇవి ‘అచ్ఛే దిన్’(మంచి రోజులు) కాదు. ఇది ‘అమృత్ కాల్’కు పిలుపు కాదు. ఇది నరకానికి ప్రవేశ ద్వారం కావచ్చు. అందుకనే ఈ టీచర్లకు గుణపాఠం నేర్పాలి. ప్రభుత్వం దగ్గర నుంచి కనీసంగా మనం ఆశించగలిగింది ఇదే! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నిజంగానే అంత చెడ్డ దేశమా?!
‘‘పాక్ పాలకులపై ఆగ్రహంతో మనం ఎందుకని పాకిస్తాన్ పౌరులకు వీసాలను తిరస్కరిస్తున్నాం? పాకిస్తానీయులందరూ జిహాదీలేనని మనం నమ్ముతున్నామా? పాకిస్తానీ జనాభాలోని 99.99 శాతం మందికి ఏ మాత్రం సంబంధం లేని ఉగ్రవాద చర్యలకు ప్రతీకారం తీర్చుకోవడానికి సంఝౌతా ఎక్స్‌ప్రెన్‌ను ఎందుకు రద్దు చేయాలి? పాకిస్తానీయులను భారతదేశంలోని తమ బంధువులతో కలవనీయకుండా చేస్తే హురియత్ తన ఆజాదీ పిలుపును విరమించుకుంటుందని నిజంగానే మనం భావిస్తున్నామా?’’... ఈ ప్రశ్నలన్నిటినీ మనం ఎదుర్కోవలసిన అవసరం ఉందని మణి శంకర్ అయ్యర్ తన ఆత్మకథలో రాశారు. కరాచీలో కాన్సుల్–జనరల్‌గా ఆయన నాలుగేళ్ల కాలాన్ని పొందుపరచిన అధ్యాయం... మనవాళ్లలో చాలామంది శత్రువుగా భావించే దేశంలోని ప్రేమ, అవగాహనలను తెలియబరుస్తుంది. మణి శంకర్ అయ్యర్ ఆత్మకథలోని మొదటి సంపుటం గురించి నా అభిప్రాయం ఏంటంటే – చెప్పడంలోని సొగసంతా క్లుప్తతలోనే ఉంటుందన్న మాటపై ఆయనకు నమ్మకం లేదని. ‘మెమోయిర్స్ ఆఫ్ ఎ మావెరిక్’లోని ప్రారంభ అధ్యాయాలు మరీ అంత మితిమీరిన సమాచారంతో ఉండవలసింది కాదు. ఉల్లాసమైనవీ విసుగు తెప్పించేవీ, ఆసక్తికరమైనవీ అసంబద్ధమైనవీ, హాస్యభరితమైనవీ నిస్సారమైనవీ... అన్నిటినీ కూడా అయ్యర్ తనకు సాధ్యమైనంతగా వివరాలతో కిక్కిరిసిపోయేలా చేశారు. అందంగా రాశారు, అందులో సందేహం లేదు. కానీ అవస రంలేని దీర్ఘమైన నిరంతరాయ సాగతీతలు ఉన్నాయి. నిజానికి ఆ విషయాన్ని ఆయన ఒప్పుకొన్నారు. అనివార్యంగా కథనంలో అంత స్సూత్రతను కోల్పోయానని తనను తాను తిట్టుకున్నారు కూడా. అయితే అంతకుమించి ఆయన్ని తప్పు పట్టేందుకేమీ లేదని వెంటనే నేను గుర్తించాను. తన జన్మనక్షత్రాలు, కుటుంబ వివరాలు, పెంపుడు జీవుల విశేషాలు, లేదా తన డూన్ స్కూల్ నాటి జ్ఞాపకాలను అలుపు తెప్పించేలా చెప్పడంలోని ఆయన స్వీయ సంతృప్తిని మీరు క్షమించాలి. కేవలం యూనియన్ (విద్యార్థి సంఘం) అంటే ఉన్న మక్కువతో మాత్రమే ఆయన కేంబ్రిడ్జిలో చేరే సమయం రాగానే పుస్త కంలోని పఠనీయ పరిస్థితులు మెరుగవుతాయనడంలో సందేహం లేదు. యూనియన్ అధ్యక్షుడవడం ఆయన ఏకైక ఆశయం. పాపం ఆ ఆశయాన్ని సాధించలేకపోయారు. వాస్తవానికి యూనియన్ అధ్యక్ష స్థానానికి చేరువయ్యే సోపాన క్రమంలో అట్టడుగున ఉండే స్థాయీ సంఘానికి ఎన్నికవడానికి కూడా ఆయనకు కష్టమయింది. కానీ ఆయన ప్రయత్నంలోని మనోహరమైన నిజాయితీ మీ మనసును గెలుచుకుంటుంది. అంతేకాదు, 21వ శతాబ్దపు తొలి దశాబ్దానికి చెందిన ఈ రాజకీయ నాయకుడు పన్నెండవ శతాబ్దపు రౌండ్ చర్చి వెనుక ఉన్న కేంబ్రిడ్జి యూనియన్ చాంబర్లో రూపొందాడన్నది స్పష్టంగా తెలుస్తుంది. బంజరు భూముల వంటి ఈ ప్రారంభ పుటలను దాటితే డిసెంబరు మాసపు మొఘల్ గార్డెన్స్‌లా పుస్తకం వికసించి కనిపిస్తుంది. హఠాత్తుగా ఆయన అలవిమాలిన సమాచారం... చూపు తిప్పని వివరాలతో కూడిన కథనంగా మారిపోతుంది. కథకు అందే ప్రతి చిన్న చేరికతో ఆయన చూపుతున్న ప్రపంచం మనల్ని మరింతగా ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి నేను పుస్తకాన్ని కింద పెట్టలేకపోయాను. రాత్రి బాగా పొద్దుపోయే వరకు కూడా, దానికి ఏదీ సాటిరాని స్కాట్లాండ్ జలాలతో బలోపేతం అయిన పేజీలను తిప్పుతూ ఉండి పోయాను. ఓ, ఢిల్లీలోని ఉష్ణో గ్రతల కారణంగా కొంచెం ఐసుతో కూడా! ఆయన ఫారిన్ సర్వీసుకు ఎప్పటికీ ఎలా చేరుకోలేక పోయా రనే గాథను పుస్తకంలోని ముఖ్యాంశంగా పత్రికలు ఇచ్చి తీరాలి. మన ప్రముఖ పత్రికలలో ఒకటేదైనా ఇస్తుందని నాకు గట్టి నమ్మకం కనుక ఆ వివరాలను ఇక్కడ వెల్లడించడం ద్వారా పాఠకుల ఆసక్తిని ముందే చెప్పి పాడు చేయలేను. ఒకటైతే చెబుతాను. పుస్తకంలోని ఈ ముఖ్యాంశాన్ని ఇవ్వకపోతే మీ అభిమాన దిన పత్రికను కొనడం మానేయండి. ఏదేమైనా, కరాచీలో కాన్సుల్–జనరల్‌గా పాకిస్తాన్‌లోని ఆయన నాలుగేళ్ల కాలాన్ని పొందుపరచిన అధ్యాయం... మనవాళ్లలో చాలా మంది శత్రువుగా భావించే దేశంలోని ప్రేమ, అవగాహనలను తెలియ బరుస్తుంది. మీలో చాలామందిని అది అక్షరాలా ఆకట్టుకునేలా ఉంటుంది. పాకిస్తాన్‌ని ఆయన ఉన్నదున్నట్లుగా లేదా, నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ అప్పట్లో ఉన్న విధంగా... మనవాళ్లు మనలో కలిగించిన, విధేయతతో సత్యం అని మనం నమ్మిన అపోహలను, అబద్ధాలను చెల్లాచెదురు చేసేలా ఆయన చిత్రీకరించారు. మర్యాదపూర్వకంగా, ఆప్యాయతతో ఉండండి, అప్పుడు పాకి స్తానీలు అదే విధమైన తమ ప్రతి స్పందనతో మిమ్మల్ని ముంచె త్తుతారు అని మణి కటువైనది కాని సూచనగా మీకు చెబుతారు. ‘‘భారతీయ శత్రుత్వం, లేదా శత్రుత్వ భావన పాకిస్తానీలను వారి ప్రభుత్వం లేదా సైన్యం వెనుక సమైక్యం అయ్యేలా చేస్తోంది’’అంటారు మణి. ఇప్పుడూ అంతే కదా... మనం వారిని వారి సైన్యం బాహువుల్లోకి విజయవంతంగా నెట్టేస్తున్నాం. మనం ఎదుర్కోవలసిన అవసరం ఉన్న ప్రశ్నలను మణి లేవ నెత్తారు. ‘‘పాక్ పాలకులపై ఆగ్రహంతో మనం ఎందుకని పాకిస్తాన్ పౌరులకు వీసాలను తిరస్కరిస్తున్నాం? పాకిస్తానీయులందరూ మన దేశంలో విధ్వంసాన్ని సృష్టించే జిహాదీలేనని మనం నిజంగా నమ్ము తున్నామా? పాకిస్తానీ జనాభాలోని 99.99 శాతం మందికి ఏ మాత్రం సంబంధం లేని ఉగ్రవాద చర్యలకు ప్రతీకారం తీర్చు కోవడానికి సంఝౌతా ఎక్స్‌ప్రెన్‌ను ఎందుకు రద్దు చేయాలి? మనం కనుక పాకిస్తానీయులను భారతదేశంలోని తమ బంధువులతో కలవ నీయకుండా చేస్తే హురియత్ తన ఆజాదీ పిలుపును విరమించు కుంటుందని నిజంగానే మనం భావిస్తున్నామా?’’ ఇందుకు ఆయన ఇచ్చిన సమాధానాన్ని నేను సమర్థిస్తాను... అది భౌగోళికంగా కచ్చితంగా లేకుండా ధ్వనిపూర్వకంగా మాత్రమే దగ్గరగా ఉన్నప్పటికీ. ‘‘పరాగ్వేలో మనం పడిపోకుండా ఉన్నాం. పొరుగు దేశమైన పాకిస్తాన్లో నిలబడలేకున్నాం.’’ మనలో చాలా మందికి తెలియని ఒక సత్యాన్ని సంగ్రహించే ఒక వాక్యాన్ని మీకు వదిలేస్తాను. అయితే కొద్ది మంది దానిని అంగీకరించరు. ‘‘శాంతి కోసం జరిగే ప్రయత్నాలు భారతదేశంలో కంటే పాకిస్తాన్‌లోనే ఎక్కువని అయిష్టంగానే నేను ముగించాల్సి వచ్చింది.’’ ఈ మాటను మీరు అంగీకరిస్తే... మీరు ఈ పుస్తకాన్ని చదివేందుకు, మీరెంత కచ్చితమైన వారో తెలుసుకునేందుకు అది మిమ్మల్ని ప్రలోభపెడుతుందని నా ఆశ. అలా కాకపోతే మీకు ఎన్నడూ చెప్పని, లేదా మీ నుండి దాచి పెట్టినవాటిని ఎదుర్కోడానికి మీలో కోపాన్నైనా రేకెత్తించనివ్వండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భారత ప్రధానుల నిర్ణయ విధానాలు!
ఆరుగురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇదివరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. ప్రధానంగా జీవిత చరిత్రలు నాకు మనో రంజకంగా ఉంటాయి. అందుకు కారణం ఆ ముఖ్య పాత్రల జీవితాలలో మనం పాలుపంచుకోవడం ఒక్కటే కాదు, అవి చదవడానికి సరదాగా అనిపించే అనేక చిన్న చిన్న నిజ జీవితపు ఘటనల ఆసక్తికరమైన కథలతో నిండి ఉంటాయి. గంభీరమైన చరిత్ర పుస్తకాలు ఇందుకు భిన్నమైనవి. అవి మరింత విశ్లేషణాత్మకంగా ఉండడం వల్ల వాటిని చదివేందుకు ప్రయాస పడవలసి వస్తుంది. ఇక అవి దేనినైనా పునఃమూల్యాంకనం జరుపుతున్నట్లుగా ఉంటే కనుక అవి అర్థం చేసుకునేందుకు దుర్భేద్యంగా తయారవడం కద్దు. పఠనీయతను, పారవశ్యాన్ని రెండు శైలులుగా జతపరచి ఆరు గురు ప్రధానమంత్రులపై నీరజా చౌధరి తాజాగా ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తక విజయ రహస్యం అంతా కూడా... చరిత్రనూ, జీవిత చరిత్రనూ మిళితం చేసి, దానికి ఉల్లాసభరితమైన చిట్టి పొట్టి కథల్ని, కబుర్లూ–కాకరకాయలను జోడించడంలోనే ఉంది. ఉదాహరణకు, రాజీవ్ గాంధీపై నీరజ రాసిన అధ్యాయం ఇలా మొదలౌతుంది. ‘‘రాజీవ్! ఈ ముస్లిం మహిళా బిల్లుపై మీరు నన్నే ఒప్పించలేకపోతే, దేశాన్ని ఎలా ఒప్పించబోతారు? అని సోనియా తన భర్తతో అన్నారు.’’ ఇక పీవీ నరసింహారావు అధ్యాయ ప్రారంభ వాక్యం అయితే మరింతగా ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది. ‘‘డిసెంబరు 6వ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం తర్వాత మీరు పూజలో కూర్చొని ఉన్నారని విన్నాను అని వామపక్ష పాత్రికేయుడు నిఖిల్ చక్రవర్తి ప్రధాని నరసింహారావుతో అన్నారు’’ అని ఉంటుంది. ఆ విధమైన ప్రారంభ వాక్యంతో లోపలికి వెళ్లకుండా ఉండటం అసాధ్యం. ఇప్పుడేమిటంటే, ఈ ప్రధానులలో ఎవరి మీదనైనా మీకు ఇది వరకే ఉన్న అభిప్రాయాన్ని పునరాలోచింపజేసేంతటి రహస్యాల వెల్లడింపులేమీ ఈ పుస్తకంలో లేవు. ఇది పునఃసమీక్ష కాదు. కానీ ఇందులో ఉల్లేఖనాలు, ఉటంకింపులతో పాటు... మీకు ఇప్పటికే తెలిసి ఉన్న వివరాలకు జోడింపుగా పరిశోధనాత్మక వివరాలు ఉన్నాయి. విషయాలను మీరు మరింత బాగా అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. నరసింహారావుపై ఆమె చేసిన వ్యాఖ్యలైతే విశేషంగా మనల్ని ఆకట్టుకుంటాయి. మొదటిది – ఆ మనిషి గురించి ఆమెకు ఉన్న అవగాహన. ‘‘పీవీ నరసింహారావు... తనతో తను వాగ్వాదానికి దిగు తారు. ఒక విషయాన్ని ఆయన అంతర్గతంగా చర్చించుకుంటారు. ఎంత లోతుగా వెళతారంటే, ఏ వైపూ స్పష్ట మైన చిత్రం కనిపించని స్థాయిలో ఆ విషయంలోని రెండు దృక్కోణాలనూ వీక్షి స్తారు’’ అంటారు నీరజ. ఇంకా అంటారూ, 1996లో ఆయన మెజారిటీ కోరుకోలేదనీ, ఆయన కోరుకున్న విధంగానే మెజారిటీ రాలేదనీ! ఎందుకంటే మెజారిటీ వస్తే సోనియాగాంధీకి దారి ఇవ్వవలసి వస్తుంది కదా! ‘‘కాంగ్రెస్ మైనారిటీలో ఉంటేనే రావుకు మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది’’ అని రాశారు నీరజా చౌధరి. ఆమె సరిగ్గానే చెప్పారు. ఇంతకు ముందె ప్పుడూ నాకు ఆ ఆలోచనే తట్టలేదు. వాజ్‌పేయితో నరసింహారావుకు ఉన్న దగ్గరితనం నా దృష్టిని మొత్తం అటు వైపునకే మరల్చింది. ‘‘ఇద్దరూ కలిసి చాలా దూరం ప్రయాణించారు. సంక్షోభ సమయాలలో ఒకరినొకరు కాపాడు కున్నారు’’ అని రాస్తారు నీరజ. 1996 అక్టోబరులో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమా వేశంలో వాజ్‌పేయి... నరసింహారావుకూ, భువనేశ్ చతుర్వేది అనే ఒక జూనియర్ మంత్రికీ మధ్య కూర్చొని ఉన్నారు. అప్పుడు ‘‘వాజ్ పేయి... రావు వైపు ఒరిగి, ‘కల్యాణ్ సింగ్ హమారే బహుత్ విరో«ద్ మే హై, ఉన్ కో నహీ బన్నా చాహియే’ (కల్యాణ్ సింగ్ నన్ను వ్యతిరేకి స్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్ట కూడదు) అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేదిని ఉటంకిస్తూ నీరజ రాశారు. ఆ సాయంత్రం చతుర్వేది, ‘వాజ్‌పేయికి సహాయం చేయాలా?’ అని రావును అడిగారు. అందుకు ఆయన ‘హా... కెహ్ దో వోరాజీ కో’ (అవును... అవసరమైనది చేయమని వోరాజీకి చెప్పండి) అన్నారు. వోరా ఆనాటి యూపీ గవర్నర్. నరసింహారావు సందేశం వోరాకు అందింది. కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి కాలేదు. నీరజ వివరణ ఎక్కువ మాటలతో ఉండదు. ‘‘లక్నోలో కల్యాణ్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా నియమించడం అంటే అధికారం అద్వానీ చేతుల్లోకి వెళ్లడం. ఇది వాజ్‌పేయికి సమస్యల్ని సృష్టించ వచ్చు. వాజ్‌పేయి విషయంలో యూపీకి ఉన్న ప్రాము ఖ్యాన్ని అర్థం చేసుకుని, తన స్నేహితుడికి సహాయం చేయాలని రావు నిర్ణయించు కున్నారు’’ అని ఒక్కమాటలో చెప్పేశారు నీరజ. తిరిగి ఐదేళ్ల తర్వాత పీవీ నరసింహారావుకు ప్రతిఫలంగా వాజ్‌పేయి సహాయం అందించారు. 2000 సెప్టెంబరులో అవిశ్వాస తీర్మానాన్ని వీగి పోయేలా చేసేందుకు ఎంపీలకు లంచం ఇచ్చిన కేసులో ట్రయల్ కోర్టు రావును దోషిగా నిర్ధారించింది. అప్పుడు, ‘‘ఆ కేసును మూసి వేయించడానికి వాజ్‌పేయి సహాయం కోరారు నరసింహారావు’’ అని నీరజ రాశారు. ‘‘మధ్యవర్తిగా తను వాజ్‌పేయి దగ్గరకు వెళ్లినట్లు చతుర్వేది నాతో చెప్పారు: ‘నేను అటల్‌జీని కలవడా నికి వెళ్లాను. అప్పుడు ఆయన నన్ను లోపలికి పిలిచారు. ‘ఇస్ కో ఖతమ్ కీజియే’ (ఆ విషయాన్ని ముగించండి) అని అన్నారు’’ అని భువనేశ్ చతుర్వేది తనతో చెప్పి నట్లు నీరజా చౌధరి పేర్కొన్నారు. 2002 మార్చిలో ఢిల్లీ హైకోర్టు నరసింహారావును నిర్దోషిగా ప్రకటించింది. ‘‘హైకోర్టు తీర్పుపై అప్పీలు చేయకూడదని వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయించుకోవడం గమనార్హం’’, ‘‘సీబీఐ కూడా కేసును ఉపసంహరించుకుంది’’ అని రాశారు నీరజ. నా ఇన్నేళ్లలోనూ నేను ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలను చూడ లేదు. వాళ్లిద్దరూ ప్రత్యర్థులు. ప్రధాని పదవి కోసం తలపడ్డవారు. అయినప్పటికీ తమకెదురైన సవాళ్లను మొగ్గలోనే తుంచేయడానికి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ‘నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా’ అనే మాటకు ఇదొక చక్కని నిదర్శనం. అత్తరు వాసనలా బయటికి కూడా రాదు. ఈ విషయంపై వారి వారి పార్టీలు ఎలా స్పందిస్తాయో తెలుకోవాలని నాకు ఇప్పుడు కుతూహలంగా ఉంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రాజపుత్రుల చిత్ర విచిత్రాలు
రాజకోట రహస్యాలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. పూర్వపు చక్రవర్తుల విపరీత మనస్తత్వాలు, విచారకర గుణాలు, దోషాలు, చిన్నపాటి పాపాలు, మహాపరాధాలు, చిలిపి చేష్టలు, సిగ్గుపడవలసిన ప్రవర్తనలు, వారి అపకీర్తుల గురించి ఎప్పుడో దివాన్ జర్మనీ దాస్ ఆసక్తికరంగా రాశారు. అందులో ఉన్నవన్నీ, ఒకవేళ అవి నిజమే అయినా, నమ్మశక్యంగా లేనివి! అయితే భారత రాజపుత్రుల లాగానే పాకిస్తాన్ రాజపుత్రులు కూడా ఉండేవారా? వారికీ వీరికీ ఏమాత్రం తేడా లేదని వెల్లడిస్తుంది ‘డీథ్రోన్డ్’ పుస్తకం. భారత చరిత్ర మీద పరిశోధించిన ఆస్ట్రేలియా రచయిత జాన్ జుబ్రిచికీ రాసిన ఈ పుస్తకం ఎన్నో వింత సంగతులను వెల్లడిస్తుంది. రాజకోట రహస్యాలు నన్ను అమితంగా సమ్మోహన పరుస్తాయి. పూర్వపు చక్రవర్తుల విపరీత మనస్తత్వాలు, విచారకర గుణాలు, దోషాలు, చిన్నపాటి పాపాలు, మహాపరాధాలు, చిలిపి చేష్టలు, సిగ్గుపడవలసిన ప్రవర్త నలు, వారి అపకీర్తుల పట్ల నాలో ఆసక్తి జనించడానికి కారణమైన వారు మహారాజా దివాన్ జర్మనీ దాస్. నేను కౌమార ప్రాయంలో ఉండగా తొలిసారి ఆయన పుస్తకం చదువుతూ వదల్లేకపోయాను. అందులో ఉన్నవన్నీ, ఒకవేళ అవి నిజమే అయినా, నమ్మశక్యంగా లేనివి! ఉదాహరణకు పటియాలా మహారాజులలో ఒకరు తమ రాచ ఠీవికి చిహ్నంగా స్తంభించిన తమ పురుషాంగాన్ని పురవీధులలో ప్రదర్శించుకుంటూ ఊరేగింపుగా ముందుకు సాగిపోయేవారట. ఉక్క పోతల వేసవి రాత్రులలో ఆయన మహారాణులు, ఉంపుడుగత్తెలు అంతఃపుర కొలనులో తేలియాడే భారీ మంచు దిబ్బలపై శృంగార నాట్య విన్యాసాలతో విహరించేవారట. పాకిస్తాన్ వైపున ఉన్న రాజ కుటుంబీకులు కూడా ఇలానే ఉండేవారా, లేకుంటే ఇందుకు భిన్నంగానా అని అప్పుడు నాకొక ఆశ్చర్యంతో కూడిన సందేహం కలిగేది. అర్ధ శతాబ్దం తర్వాత ఇప్పుడు, ఆనాటి నా ఆశ్చర్యంతో కూడిన సందేహం జాన్ జుబ్రిచికీ పుస్తకం ‘డీథ్రోన్డ్’తో నివృత్తి జరిగింది. వారికీ వీరికీ ఏమాత్రం తేడా లేదు. కాబట్టి వారి చిత్ర విచిత్రాలతో ఈ ఉదయం నన్ను మీకు వేడుకను చేయనివ్వండి. నాల్గవ సాదిఖ్ ముహమ్మద్ ఖాన్... బహావల్‌పుర్ నవాబు. ఆయన తన మూలాలు ముహమ్మద్ ప్రవక్త సంతతిలో ఉన్నాయని చెప్పు కొంటారు. అయితే ఆయన బూట్లు, ప్యాంట్లు, సుతిమెత్తని నూలు గుడ్డతో నేసిన మందపాటి చొక్కాలు ధరించి రాజప్రాసాద క్రికెట్ మైదానంలో కనిపిస్తూ తనకు గల ఆ ప్రత్యేక ఐరోపా క్రీడా వస్త్రధారణ అభిరుచుల పట్ల గర్వభూయిష్టంగా ఉండేవారని జుబ్రిచికీ రాశారు. ‘‘మహా ధన సంపన్నుడై, తెల్లజాతి మగువల పట్ల అమిత మక్కు వను కలిగిన ఈ నవాబు (ఆయన భార్యలలో ముగ్గురు యూరోపి యన్లు) 1882లో అత్యంత గోప్యంగా పర్షియాలో ప్రసిద్ధి చెందిన ‘లా మేజన్ క్రిస్టోఫ్లా’ గృహ సామగ్రి సంస్థ నుంచి ఖరీదైన కలపమంచాన్ని 290 కిలోల నాణ్యమైన వెండి అలంకరణలతో తన అభీష్టానికి అనుగుణంగా తయారు చేయించుకున్నారు. మంచానికి నలువైపులా మంచంకోళ్ల స్థానంలో సహజమైన జుట్టు; కదలిక కలిగిన కళ్లూ, చేతులూ; ఆ చేతులతో విసనకర్రలు, గుర్రపు తోకలు పట్టుకుని ఉన్న నగ్న స్త్రీల జీవమెత్తు కాంస్య విగ్రహాలు ఉండేవి. ఆ నలుగురు నగ్న స్త్రీలు ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, గ్రీసు దేశాలకు ప్రాతినిధ్యం వహించేవారు. యంత్ర శక్తి కలిగిన ఆ మంచం... నవాబు ఆదేశాలను అనుసరించి ఆ నగ్న దేహాలలో చలనం తెప్పించేది. ఫ్రెంచి సంగీతకారుడు గునోద్ సృష్టించిన ప్రఖ్యాత సంగీత రూపకం ‘ఫౌద్’ తన ముప్పై నిముషాల నిడివిని పూర్తి చేస్తుండగా మాగన్నుగా పడుతున్న నిద్రలో నవాబు సరసంగా కన్ను గీటగానే ఆ నగ్న యువతుల హస్తాలలోని విసన కర్రలు మెల్లగా వీచడం మొదలయ్యేది. అందుకు తగిన సాంకేతికత ఆ చెక్క మంచం లోపల ఉండేది’’ అని జుబ్రిచికీ వర్ణించారు. సింద్‌లోని ఖైర్పూర్లో ఇద్దరు పాలకులు కూడా జుబ్రిచికీ దృష్టిని ఆకర్షించారు. వారిలో ఒకరు విపరీతమైన ఊబకాయం కలిగిన మీర్ అలీ నవాజ్ ఖాన్. ‘‘అమెరికన్ జర్నలిస్ట్ వెబ్ మిల్లర్ 1930లో సిమ్లా లోని సిసిల్ హోటల్లో మీర్ అలీని కలిశారు. మీర్ అలీ భోజనం చేస్తున్న సమయంలో ఆయన నోటికి, చేతికి మధ్య గల ప్రయాణ మార్గంలో పులుసు ఒలికి ఆయన భారీ ఉదరం అంతటా చింది పడింది’’ అని ‘డీథ్రోన్డ్’లో మీర్ అలీని గుర్తు చేసుకున్నారు జుబ్రిచికీ. మీర్ అలీ నవాజ్ ఖాన్ కుమారుడు ఫైజ్ ముహమ్మద్ ఖాన్‌కు స్కిజోఫ్రెనియా గానీ, లేదంటే ఏదైనా చిన్న మనోవైకల్యం గానీ ఉండి ఉండాలి. ‘‘అనుకోకుండా తన తొమ్మిది నెలల కుమారుడిని తుపా కీతో కాల్చినప్పుడు తొలిసారి ఆయన మానసిక స్థితి సందేహాస్పదం అయింది. బులెట్ శిశువు కడుపులోంచి ఊపిరి తిత్తులలోకి దూసుకెళ్లి కుడి భుజం నుంచి బయటికి వచ్చేసింది.’’ నమ్మలేని విధంగా బాలుడు బతికి, తండ్రి మరణానంతరం ఆయనకు వారసుడయ్యాడు. పాకిస్తాన్‌కు వాయవ్య దిశలో ఉంటుంది దిర్. 1947లో ఆ ప్రాంతానికి పాలకుడు నవాబ్ షా జహాన్. రచయిత జుబ్రిచికీ ఆ ప్రాంతాన్ని ‘ఒక నిలువనీటి కయ్య’ అంటాడు. ‘‘అక్కడ ఆసుపత్రి పడకల కంటే నవాబు వేటకుక్కల కోసం కట్టిన గృహాలే ఎక్కువగా ఉంటాయి. పాఠశాలలను నిర్మించడానికి ఆయన నిరాకరించాడు. చదువు ఎక్కువైతే తన పాలనను అంతం చేస్తుందని ఆయన నమ్మాడు’’ అని రాశారు జుబ్రిచికీ. కలాత్ అనేది పాకిస్తాన్‌లోని ఒక సమస్యాత్మక ప్రాంతం. ఆ ప్రాంతం కథ మన హైదరాబాద్, కశ్మీర్లకు పోలిక లేనిదేమీ కాదు. ఆ వివరాలను మీరు గూగుల్‌లో, వికీపీడియాలో వెతికి తెలుసుకోవచ్చు. కలాత్ నవాబు ఖాన్ తన రాష్ట్ర విలీనానికి సంబంధించిన సంప్రతింపుల కోసం పాకిస్తాన్ గవర్నర్ జనరల్ ముహమ్మద్ అలీ జిన్నాను కలిసినప్పుడు ఏం జరిగిందనేది మాత్రం నేను వివరిస్తాను. కశ్మీర్లో మాదిరిగానే 1947 ఆగస్టు తర్వాత కలాత్ లో స్వాతంత్య్ర సంస్థాపన జరిగింది. ఆశ్చర్యకరంగా, ‘‘కరాచీలో ఒక రాయబారిని నియమించుకోడానికీ, ఆకుపచ్చ రంగు గుడ్డపై ఎరుపు రంగు ‘పవిత్ర యుద్ధ’ ఖడ్గం ఉన్న బలూచీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకూ కలాత్ ప్రాంతానికి అనుమతి లభించింది.’’ కలాత్ విదేశాంగ మంత్రిగా ఐ.సి.ఎస్. అధికారి డగ్లాస్ ఫెల్ నియమితులయ్యారు. ఫెల్ తన జ్ఞాపకాలలో... కలాత్ నవాబు – జిన్నాల మధ్య సమావేశం తిన్నగా సాగకపోవడంపై ఇచ్చిన వివరణను జుబ్రిచికీ పుస్తకంలో చదువుతున్నప్పుడు పొట్ట చెక్కలయ్యేంతగా నేను నవ్వేశాను. ‘‘కలాత్ నవాబు ఖాన్ అనర్గళమైన ఉర్దూలో గంభీరంగా మాట్లాడుతున్నారు. జిన్నా కూడా అంతే అనర్గళంగా, గంభీరంగా ఇంగ్లిషులో మాట్లాడుతున్నారు. జిన్నాను ఒప్పిస్తున్నానని ఖాన్, ఖాన్ని ఒప్పిస్తున్నానని జిన్నా అత్యంత ఆత్మవిశ్వాసంతో చర్చల్ని నడిపి స్తున్నారు. అయితే పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి గమనించినదే మిటంటే ఒకరు మాట్లాడుతున్నది ఒకరికి ఒక్క ముక్కా అర్థం కావడం లేదని...’’ అని రాశారు జుబ్రిచికీ. ఆ విదేశాంగ కార్యదర్శి మొహమ్మద్ ఇక్రముల్లా మన మాజీ ఉపరాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ హిదయతుల్లాకు సోదరుడు. ఇక్రముల్లా జోర్డాన్ యువ రాణి సర్వత్ తండ్రి. నిజమైన రాజవంశీకుడైన ఏకైక పాకిస్తానీ, నాకు ప్రియమైన స్నేహితుడు కూడా! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రేమ పెళ్లిళ్లపై రాజకీయ పెత్తనం
ప్రేమ వివాహాలలో తల్లితండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని గుజరాత్ ముఖ్యమంత్రి ప్రకటించడంపై తాజాగా చర్చ మొదలైంది. ఇంకా విచిత్రం ఏంటంటే, పలువురు విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా దీన్ని సమర్థించడం! ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి అయినటువంటి దేశంలో ఇదొక విచిత్ర పరిణామం. మన హక్కుల్ని మనమే హరించుకోవడం! నిజమైన ప్రజాస్వామ్యం... తల్లితండ్రులు, సమూహాల ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా వ్యక్తుల హక్కులను విస్తృతపరిచే మార్గాలను నిరంతరం అన్వేషిస్తూనే ఉంటుంది. ఆ విధంగా పౌరుల కలలు, ఆశయాలు సాకారం అవుతాయి. అయితే మన రాజకీయ నాయకులు అందుకు విరుద్ధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మన రాజకీయ నాయకుల నుండి, అంత కంటే ఎక్కువగా మన ప్రభుత్వాధినేతల నుండి నేను ఆశించే ఒక విషయం... కొద్ది మోతాదులోనైనా వారు జ్ఞానం కలిగి ఉండటం, మన రాజ్యాంగం ప్రకారం మనకు సిద్ధించిన హక్కుల గురించి వారు తెలుసుకోవడం, ఆ హక్కులను అతిక్రమించినప్పుడు అతిక్రమించామని తెలుసుకోగలిగిన తెలివిడి వారికి ఉండటం! ఇప్పుడీ దుర్భరమైన నైతిక ఉపన్యాసపు వెలుగులో నేను చెప్పబోతున్న కథను మీరు వినాలి. ప్రేమ వివాహాలలో తల్లితండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని గుజ రాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది. ఈ పరిశీలన రాజ్యాంగ పరిమితులకు లోబడే జరుగుతుందని ఆయన అన్నప్పటికీ అదే రాజ్యాంగంలోని నిబంధన ఆయన సంకల్పించిన ఆ పనిని కచ్చితంగా అసాధ్యం చేస్తుంది. ఎందుకంటే అలా చేయడం అన్నది రాజ్యాంగం మనకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం అవదా? రాజ్యాంగం అనే ఆ అమూల్య పత్రంలో రాసివున్న దానిని బట్టి 18 ఏళ్లకు మనం పెద్దవాళ్లం అయినట్లు! అక్కణ్ణుంచి ఒక స్త్రీకి తను ఎవర్ని పెళ్లి చేసుకోవాలో, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే, చట్ట ప్రకారం విడాకులు తీసుకుంటే కనుక, ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవచ్చన్న స్వేచ్ఛ కూడా! విచిత్రంగా పురుషులకు మాత్రం 21 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ హక్కును రాజ్యాంగం అందించదు. వారు 18 సంవత్సరాల వయసులో ఓటు వేయవచ్చు కానీ, పెళ్లి మాత్రం చేసుకోవడానికి లేదు. ఈ సమ రాహిత్యం గురించి ఇంకో రోజు చూద్దాం. రాజ్యాంగాన్ని మార్చితే తప్ప ప్రేమ వివాహాలలో తల్లితండ్రుల సమ్మతిని తప్పనిసరి చేయలేమని ముఖ్యమంత్రికి తెలియదా? చూస్తుంటే ఆయనకు మన రాజ్యాంగం గురించి తెలియదని అనిపి స్తోంది. లేదా రాజ్యాంగాన్ని ఏకపక్షంగా మార్చే అధికారం తనకు ఉందని ఆయన చెబుతున్నట్లుగా ఉంది. లేదంటే, బహుశా...చెప్పింది చేయాలనేం ఉంది అనే ఉద్దేశం ఆయనలో ఉన్నట్లుంది. ఉన్నవి ఉన్నట్లుగా ఆయన మాటలు ఇవీ: ‘‘రుషికేశ్భాయ్ పటేల్ (ఆరోగ్య మంత్రి) నాతో ఏం అన్నారంటే – నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం కోసం ఇల్లు వదిలి పారిపోతున్న అమ్మాయిల కేసులపై ఒక అధ్యయనం జరగాలనీ, పునరాలోచన జరపాలనీ... అందువల్ల ప్రేమ వివాహాలకు తల్లితండ్రుల సమ్మ తిని తప్పనిసరి చేసేందుకు ఏదో ఒకటి చేయ వచ్చనీ... ఇందుకు రాజ్యాంగం అడ్డుపడకపోతే కనుక మనం ఈ అధ్యయనాన్ని చేపట్టవచ్చు. ప్రయత్నం కూడా చేద్దాం. మంచి ఫలి తాలు రావచ్చు కదా!’’ ఇంకా విచిత్రం ఏంటంటే... పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భూపేంద్ర పటేల్‌ను ఈ విషయంలో సమర్థించడం. ముఖ్యమంత్రికి తన మద్ధతునిస్తూ ఇమ్రాన్ ఖేడావాలా ఒక లేఖను కూడా రాశారు. ‘‘తల్లితండ్రులు తమ పిల్లల్ని పెంచి పోషిస్తారు. కనుక పిల్లల వివాహానికి వారి సమ్మతి తప్పనిసరి’’ అని ఖేడావాలా పేర్కొన్నారు. అంతేకాదు, గుజరాత్ శాసనసభ వర్షాకాల సమావేశాలలో దీనిపై ఒక బిల్లును ప్రవేశపెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఈ బిల్లును తీసుకురావడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు తమ తల్లితండ్రుల అదుపులో ఉండటం లేదు. మొద్దుబారి ఉంటున్నారు’’ అని ఖేడావాలా వ్యాఖ్యానించారు. ఈ రకమైన మనస్తత్వంతో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా ఒక్కరే కాదు. జెనిబెన్ ఠాకూర్ కూడా! ఆమె మహిళా ఎమ్మెల్యే. జెనిబెన్, బీజేపీ ఎమ్మెల్యే ఫతేసిన్హ్ చౌహాన్ కలిసి, ‘‘అమ్మాయి నివసిస్తున్న తాలూకాలోనే, స్థానికుల సమక్షంలో, తల్లితండ్రుల సమ్మతితో వివాహం జరిగేలా గుజరాత్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్, 2009ను మార్చాలి’’ అని డిమాండ్ చేసినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. ఓటు కోసం 18 ఏళ్లు నిండిన బాలికలకు క్రమం తప్పకుండా విజ్ఞప్తి చేస్తుండే ఈ పద్ధతైన పురుషులు, పద్ధతైన స్త్రీలలో ఎవరైనా తమను ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునేంత పరిణతి ఆ వయసు వారిలో ఉండదన్న వాదనను తీవ్రంగా తోసిపుచ్చకుండా ఉండి ఉంటారా? అయినప్పటికీ వారు 18 ఏళ్ల బాలిక తన తండ్రి సమ్మతి లేకుండా తన ఇష్టానుసారం వివాహం చేసుకోరాదని విశ్వసి స్తున్నారు. ఇలాంటి విషయాల్లో తల్లుల సమ్మతి రెండవ ప్రాధాన్యంగా ఉంటుంది, వాళ్లనొకవేళ లెక్కలోకి తీసుకుంటే కనుక. ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి అయినటువంటి దేశంలో ఇదొక విచిత్ర పరిణామం. మన హక్కుల్ని మనమే హరించుకోవడం. నిజమైన ప్రజాస్వామ్యం... తల్లిదండ్రులు, సమూహాల ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా వ్యక్తుల హక్కులను విస్తృతపరిచే మార్గాలను నిరంతరం అన్వేషిస్తుంటుంది. ఆ విధంగా పౌరుల కలలు, ఆశయాలు సాకారం అవుతాయి. అయితే మన రాజకీయ నాయకులు అందుకు విరుద్ధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లుంది. మనం హక్కుల్ని పరిమితం చేస్తున్నాం. స్వేచ్ఛా పరిధులను తగ్గించేస్తున్నాం. వ్యక్తుల నిర్ణయాలపై అధికారంతో పెత్తనం చలాయిస్తున్నాం. తిరోగమనంలోకి వెళ్తున్నాం. భారతదేశానికి ప్రజాస్వామ్యంతో ఉన్నది మాతృమూర్తి సంబంధం అని మన ప్రధాన మంత్రి అనడంలోని ఉద్దేశాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి తప్పుగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి మన దేశాన్ని మారుతల్లిగా ఉంచేందుకు ఆయన సంకల్పించినట్లున్నారు. మార్మికంగా ఒక అద్భుతమైన మాతృమూర్తి అవతరించకుంటే మన యువరాణులు పర దృష్టికి చాటునే ఉండిపోతారు. బుగ్గపై చిన్న ముద్దుతో ఆ సౌందర్య రాశులను నిద్ర లేపే మహదావకాశాన్ని మన అందాల రాకుమారులు కోల్పోతారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కనీస స్పందన కరవైందా?
మణిపురలో మహిళలను నగ్నంగా ఊరేగించి, తర్వాత వారిపై అత్యాచారం జరిపిన ఘటన తాలూకు వీడియో దేశాన్ని దిగ్భ్రాంతికి లోనుచేసింది. దశాబ్దం క్రితం జరిగిన భయంకరమైన ఘటన ‘నిర్భయ’ లాగా ఇదీ మన అంతరాత్మలోకి చొచ్చుకుపోయింది. మే 4న జరిగినట్టు చెబుతున్న ఈ ఘోరమైన ఘటన తాలూకు వీడియో రెండు నెలల తర్వాత బయటికి రావడం ఒకటైతే, ఆ ఘటన పట్ల ప్రభుత్వం, అధికారులు, పోలీసుల స్పందన ఆందోళన కలిగిస్తోంది. దాన్ని కనీస స్పందన అని కూడా అనలేం. అది మిన్నకుండటమా? పట్టించుకోకపోవడమా? బాధ్యతారాహిత్యమా? వారి వివరణలను బట్టి చూసినా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఇవి కూడా మనలో ఆందోళన రేకెత్తించేవే! మణిపురలో జరిగిన హింసాత్మక ఘటన లను ఏ విశేషణాలతోనూ వివరించడం సాధ్యం కాదు. అది ఏ వర్ణనకూ లొంగనిది. దశాబ్దం క్రితం జరిగిన మరో భయంకరమైన ఘటన ‘నిర్భయ’ లాగా ఇదీ మన అంత రాత్మలోకి చొచ్చుకుపోయింది. అయితే మే 4వ తేదీన జరిగిన అత్యాచారాలు గర్హనీయమైన ఒక సంఘటన మాత్రమే. రెండు వేర్వేరు వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి చూస్తే, కనీసం ఇంకో ఐదు ఇలాంటివి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మన దృష్టి మొత్తం ఆ ఘటనల తాలూకూ బాధాకరమైన వివరాల వైపు వెళుతుంది. నా భయం ఏమిటంటే... మణిపుర ఘోరాలు ఇంకా ఎన్నో మనం చూడాల్సి వస్తుందన్నది! అయితే ప్రస్తుతానికి మే 4వ తేదీ ఘటనలపై అధికారిక వివరణలు లేవనెత్తుతున్న ప్రశ్నలకే పరిమితమవుదాం. ఇవి కూడా మనలో ఆందోళన రేకెత్తించేవే! బాధిత మహిళల్లో చిన్న వయసు మహిళ ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పత్రిక ప్రతినిధితో, ‘‘దుండగుల గుంపు మా ఊరిపై దాడి చేస్తున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు’’ అని చెప్పింది. దీనర్థం మనల్ని రక్షించాల్సిన వాళ్లే అక్కడ నిలబడి మౌన ప్రేక్షకులయ్యారా? ‘‘పోలీసులే మమ్మల్ని వారికి (దుండగులకు) అప్పగించారు’’ అని కూడా ఆ అమ్మాయి వాపోయింది. అంటే, తక్కువ సంఖ్యలో ఉన్నా సరే, పోలీసులు బలహీనంగా చేతులెత్తేశారు అని అర్థమా? అరాచక శక్తుల దాడి నుంచి పోలీసులు మహిళలను రక్షించలేదు సరికదా, వారు వారి భద్రత, ప్రాణాల సంగతి మాత్రమే చూసుకున్నారు. మనం వారి నుంచి ఆశించేది అది కాదు కదా? మహిళలను దుండగులకు అప్పగించిన తరువాతైనా పోలీసులు అదనపు బలగాలను ఎందుకు రప్పించలేదు? అలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసుల తక్షణ తప్పనిసరి ప్రతిస్పందన ఇలాగే కదా ఉండాలి? ఇది కూడా జరగలేదు. పైగా ఆ బాధిత మహిళలు దగ్గర లోని ఆసుపత్రిని చేరేందుకు దాదాపు ఏడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది! కనీసం ఇప్పుడైనా పోలీసులు తిరిగివచ్చి, ఆ మహిళలకు కాస్తంత చేయూతనివ్వాల్సింది కదా? మే నాలుగున జరిగిన ఘటనలకు సంబంధించి తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ నెల 18వ తేదీన. రెండోది జూన్ 21వ తేదీన. కానీ దాడులకు పాల్పడిందెవరో తెలియని కారణంగా తాము ఏ చర్య కూడా తీసుకోలేకపోయామని పోలీసులు అంటున్నారు. నిజంగానా? తాము ఎవరికి ఆ మహిళలను అప్పగించామో కూడా గుర్తు పట్టలేక పోయారా? వారి ముఖాలు మరచిపోయారా? దుండగుల గుంపులో కొందరిని తాను గుర్తుపట్టగలనని బాధిత యువ మహిళ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు తెలిపింది. అందులో తన సోదరుడి స్నేహితుడూ ఉన్నాడని పేర్కొంది. పోలీసులు చర్య తీసుకునేందుకు ఈ సమాచారమూ సరిపోలేదా? నిజమేమిటంటే... పోలీసులు ఆ బాధిత మహిళ వాఙ్మూలాన్ని ఇప్పటివరకూ రికార్డే చేయలేదు. సరే... ఇదంతా జరిగిన తరువాత కనీసం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అయినా తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారా? వీడియో చూసిన వెంటనే తనకు తానుగా సూమోటో కేసుగా దీన్ని తీసు కున్నానని ఆయన చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదైన రెండు నెలలకు ‘సూమోటో’ కేసుగా తీసుకోవడం ఏమిటి? మే నాలుగు నాటి ఘటనల గురించి తాను జూన్ 19న మణిపుర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)లకు సమా చారం ఇచ్చానని జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వెల్లడించారు. మరి, ముఖ్యమంత్రికి ఎవరూ చెప్పలేదా? ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఎందుకు ఏ రకమైన చర్యా తీసుకోలేదు? ఇంకో విషయం. దాడులకు పాల్పడిందెవరో గుర్తించలేని కారణంగా తాము రెండు నెలలుగా ఏ చర్యా తీసుకోలేకపోయామని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ (వీడియో బయటికి వచ్చిన) కేవలం 24 గంటల్లోనే నలుగురిని అరెస్ట్ చేశారు. రెండు నెలలుగా సాధ్యం కానిది 24 గంటల్లో మెరుపువేగంతో ఎలా చేయగలిగారు? ఈ ప్రశ్నకూ సమాధానం కావాలి. చివరగా... జాతీయ మహిళా కమిషన్ విషయానికి వద్దాం. జూన్ 12న నార్త్ అమెరికన్ మణిపుర ట్రైబల్ అసోసియేషన్, ఇద్దరు మణిపుర మహిళా కార్యకర్తలు రాసిన లేఖ ఒకటి కమిషన్ కు చేరింది. ‘‘మే నెల నాలుగవ తేదీన కాంగ్పోకీ జిల్లాలోని బి. ఫైనామ్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేశారు. నగ్నంగా ఊరేగించారు. కొట్టడం మాత్రమే కాకుండా చుట్టుముట్టిన మైతేయ్ మూక బహిరంగంగా మానభంగానికి పాల్పడింది. రాష్ట్రానికి చెందిన పోలీ సులు ప్రేక్షకుల్లా ఉండిపోయారు. ఇద్దరు బాధితులు చురాచాంద్‌పూర్ జిల్లా శరణార్థి శిబిరాల్లో ఉన్నారు’’ అని ఆ ఘటనలకు సంబంధించి నిర్దుష్టంగా, వివరంగా తెలిపారు. అయినాసరే... జాతీయ మహిళ కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ తాను ఎలాంటి చర్య తీసుకోలేక పోయానని చెబుతూ, అందుకు కారణం అది సాధారణ సమాచారం కావడమనీ, నిర్దిష్టంగా ఫలానా ఘటన గురించిన సమాచారం లేదనీ అన్నారు. మణిపురలోని పరిస్థితుల దృష్ట్యా కమిషన్ తన ప్రతినిధి బృందాన్ని అక్కడకు పంపలేకపోయిందని కూడా ఆమె చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపురను సందర్శించగలిగారు. సామాజిక కార్యకర్త అన్నీ రాజా వెళ్లగలిగారు. కానీ శౌర్య గల కమిషన్ మాత్రం వెళ్లలేకపోయింది! అయితే రేఖా శర్మకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇద్దాం. ఆమె మణిపుర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖనైతే రాశారు. వాళ్లేం చేయలేదు. ఈమె కూడా పట్టించుకోలేదు. దీనర్థం తాను చేయాల్సిన పని కనీస మాత్రంగానే చేశారనా? అది కూడా సంశయాస్పదమా? తమ కామెంట్లు తమపైకే తిరగబడే సందర్భం వస్తుందని ఊహించని కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యతో ముగిస్తాను. 2017లో కాంగ్రస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా... ప్రధానమంత్రి ఓ ట్వీట్ చేస్తూ...‘‘రాష్ట్రంలో శాంతిని కాపాడలేని వారికి మణిపురను పాలించే అర్హత లేదు’’ అన్నారు. ఈ వ్యాఖ్యతో నాకు ఎలాంటి విభేదాలూ లేవు! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అవునని తెలిసీ... కాదని అంటాం!
‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు... వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు ‘క్యాస్ట్ ప్రైడ్’ రచయిత మనోజ్ మిత్తా. కులహత్యలు జరిగినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కులం గురించి, అది మన వ్యవస్థలలోకి చొరబడిన విద్వేష మార్గం గురించి నాకు మరీ అంతగా తెలియదు. అదృష్టవశాత్తూ మనోజ్ మిత్తా రాసిన ‘క్యాస్ట్ ప్రైడ్: బ్యాటిల్స్ ఫర్ ఈక్వాలిటీ ఇన్ హిందూ ఇండియా’ నా చేతికి అందింది. దట్టమైన పుస్తకం అది. పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అడవిని చూడలేనంతగా చెట్ల కింద కూరుకుపోయినట్లుగా ఉంది. అయితే మీరు గొప్ప పట్టుదలను కలిగి ఉంటే కనుక చదవదగిన పుస్తకమే అనిపిస్తుంది. ఏమైనా, మనోజ్ తనకు తానుగా సత్యాన్ని గుర్తించాడని కనిపెట్టినప్పుడు మొదట నా ముఖంపై చిరునవ్వు వెలసింది. ‘‘1984లో సిక్కుల ఊచకోత, 2002లో ముస్లింలపై జరిగిన మారణకాండల మీద పుస్తకాలు రాశాక, మూడో పుస్తకాన్ని భారతదేశంలోని సామూహిక హింసపై రాయాలన్నది నా అసలు ప్రణాళిక. దళితుల హత్యలపై దృష్టి పెట్టాలన్నది నా ఉద్దేశం’’ అంటాడు మనోజ్. అయితే ఏడేళ్ల పరిశోధన తర్వాత అతడు తెలుసుకున్నది ఏమిటంటే, ఇంకా చాలా కథే ఉందని! ‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు, పునర్విచారణ న్యాయ నిర్ణేతలు వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు మనోజ్. అతడి ఈ గ్రహింపు సూటిగా ఉన్నది, సరళమైనది, బాధతో కూడినది. కులహత్యలు జరిగినప్పుడు, కుల మారణ కాండలు సంభవించినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా కూడా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘అత్యంత స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కుల వివాదాలను, కుల దౌర్జన్యాలను అదుపులోకి తెచ్చేందుకు 1816–2019 మధ్య ఏ విధమైన ప్రయత్నాలు జరిగాయో తెలిపే వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘‘అంటరానితనం నిర్మూలనకు అంటూ 1950లో ఏదైతే ప్రయత్నం జరిగిందో అది... అప్పటికే అంటరానితనం నుంచి విముక్తి పొంది ఉన్నవాళ్లపై మరింతగా దిగ్భ్రాంతి కరమైన హింసాత్మక చర్యలకు ఆధిపత్య కులాలవారిని ప్రేరేపించి, సామూహిక హత్యలు అనే ఒక కొత్త దురాగతాన్ని కనిపెట్టేందుకు వారు పాల్పడేంతగా వ్యతిరేకతకు కారణమైంది’’ అని మనోజ్ రాశారు. 1968లో తమిళనాడులోని కీలవేణ్మణిలో తొలిసారి అటువంటి సామూహిక హత్యలు జరిగాయి. మనోజ్ పేర్కొన్న దారుణాలలో నేను బాగా గుర్తెరిగినది బెల్చి హత్యాకాండ. అది జరిగినప్పుడు నా వయసు 22. ఆ భయానక ఊచకోతకు లండన్ నుంచి వెలువడే ‘ది స్పెక్టేటర్’ పత్రిక ‘ది హంటింగ్ ఆఫ్ హరిజన్’ అనే శీర్షికను పెట్టడం కన్నా కూడా నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉన్నది... ఇందిరా గాంధీ చూపిన చొరవ. అర్ధరాత్రి సమయంలో రుతుపవనాలు కుండపోతగా కురుస్తున్నప్పుడు మావటి వెనుక ఏనుగుపై కూర్చొని, ఆ చీకట్లో తనను అంతా గుర్తించగలిగేలా టార్చిలైట్ల వెలుగులో బెల్చి చేరుకోవడం. ‘‘ఆ విధంగా చేయడం ద్వారా ఆమె జనాదరణను ఒడిసి పట్టుకున్నట్లయింది’’ అంటాడు మనోజ్. ఈ పుస్తకం ద్వారా తప్ప... ఇంతవరకు నాకు తెలియందీ, నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందీ, ‘‘కులపరమైన హత్యలు జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించిన మొట్టమొదటి, బహుశా ఏకైక జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ’’ కావడం. మన తాజా రాజకీయాలపై, నిజానికి ఇప్పటి మన ప్రజాస్వామ్యంపై ఎంత కఠోర వ్యాఖ్య! మనల్ని బాధించే విషాదాలపై మన పాలకులు ఎలా çస్పందిస్తున్నారనే దానిపైన కూడా ఇది కచ్చితమైన వ్యాఖ్య. అయితే మనోజ్ ఉద్దేశం ఇందిరాగాంధీ చొరవ గురించి చెప్పడం కాదు. బెల్చి ఘటనను మన వ్యవస్థ ఒక కులద్వేష దురాగతంగా అంగీకరించడానికి ఎందుకు ఇష్టపడలేదన్న ప్రశ్నను లేవనెత్తడం. నాడు హోమ్ మంత్రిగా ఉన్న చరణ్‌సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ... ‘‘ఈ ఘటనకు కుల, మత, భూ తగాదాలు గానీ, రాజకీయాలు గానీ కారణం కాదు. కొన్ని పత్రికల్లో వచ్చిన విధంగా సమాజంలోని బలహీన వర్గాలపై జరిగిన దౌర్జన్యం కూడా కాదు’’ అని ప్రకటించారు. జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ధన్ చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ చరణ్ సింగ్‌తో తీవ్రంగా విభేదించింది కానీ, అది కుల దురాగతమేనని ఆయన్ని ఒప్పించలేకపోయింది. చరణ్ సింగ్ చేసినటువంటి ఖండన ప్రకటనలు దాదాపు ప్రతిసారి కూడా మన ప్రతిస్పందనల్ని వికలపరుస్తాయని మనోజ్ వాదిస్తాడు. అగ్రవర్ణాలవారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తిరస్కరిస్తారు. అది ప్రతి దశలోనూ జరుగుతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులు సహకరించుకోవడం, బలహీనమైన న్యాయ విచారణ, వాదనలు, తీర్పులు, సుప్రీంకోర్టుకు చేరిన పునర్విచారణల నిర్వహణలో సైతం ఈ అగ్రవర్ణ భావన పని చేస్తుందని మనోజ్ అంటాడు. ఆఖరికి మనమెంతో గొప్పగా భావించే నాయకుల గురించి కూడా మనోజ్ చేసిన వ్యాఖ్యలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ‘‘ఈ నిర్దిష్ట సందర్భంలో ఎల్లవేళలా మహాత్ముడిలా కనిపించరు’’ అని గాంధీ గురించి, ‘‘కుల సంస్కరణలను ఆయన ప్రతిఘటించలేదు, లేదా పెద్దగా వాటి కోసం ప్రయత్నించనూ లేదు. ఆయనది అతిథి పాత్ర మాత్రమే’’ అని నెహ్రూ గురించి, చివరికి అంబేడ్కర్ గురించి కూడా – నేను ఎక్కువ వివరాలు ఇవ్వను గానీ– ‘‘ఆయన కథేమీ ఆశ్చర్యాలు లేనిదైతే కాదు’’ అని అంటూ... ‘‘స్వాతంత్య్ర సమరయోధులు తప్పనిసరిగా సమానత్వ ఉద్యమశీలురు కావాలనేముంది?’’ అని ముగిస్తాడు మనోజ్. పుస్తకం గురించి నా ఏకైక విమర్శ ఏమిటంటే... చదివేందుకు ఇది కొంచెం తేలికగా ఉండవలసిందనీ, పేజీలు పొంగిపొర్లేలా వివరాలు ఇవ్వడం వల్ల పుస్తకంలో ప్రధాన సందేశాన్ని తరచు అవి మరుగున పడేస్తున్నాయనీ. అయినప్పటికీ అది మనం వినవలసిన, మనం గుర్తుంచుకోవలసిన సందేశమే. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
మొండి మౌనానికి మోక్షం ఎన్నడు?
రెండు నెలలుగా మణిపూర్ అతలాకుతలం అవుతోంది. అయినప్పటికీ ప్రధాని ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఆయన తాజా ‘మన్ కీ బాత్’లో గుజరాత్లో తుపాను గురించి మాట్లాడారు కానీ, అంతకన్నా ప్రధానమైనదైన మణిపూర్ గాయాన్ని వదిలేశారు. టర్కీలో భయంకర భూకంపం సంభవించినప్పుడు మొదట సానుభూతి తెలిపిన వారిలో ఆయనా ఒకరు. మణిపూర్ విషయం వచ్చేటప్పటికి... తన సొంత ప్రజలు, ఇంకా చెప్పాలంటే తన ఓటర్లకు జరుగుతున్న దానిపై మొండిగా మౌనాన్ని ఆశ్రయించారు. మణిపూర్ సంక్షోభం గురించి తాను ప్రతి ఒక్క రోజూ ప్రధానికి వివరిస్తూనే ఉన్నానని హోమ్ మంత్రి చెబుతున్నారు. అందులో సందేహించడానికేం లేదు. కానీ మణిపుర్‌పై మాట్లాడేందుకు ప్రధాని ఉద్దేశపూర్వకంగా నిరాకరించడాన్ని అంగీకరించడమే మరింత కష్టతరంగా ఉంది. నేను ఇంతకు ముందెన్నడూ ఆరంభించని విధంగా ఈ వ్యాసాన్ని మొదలు పెట్టబోతున్నాను. ఒక ఉద్దేశ ప్రకటనతో. కొలిచినట్లుగా, సమతూకంతో, వేరుగా ఉండి చూస్తూ నాకు వీలైనంతగా ఇందులో న్యాయంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. విషయం మణిపూర్ అయినప్పుడు ఇలా ఉండటం తప్పనిసరి. నేనిక్కడ మూడు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాలని అనుకుంటున్నప్పటికీ మానని గాయాల్ని రేపడం లేదా భావావేశాలను భగ్గుమనిపించడం మాత్రం నా ఆకాంక్ష కాదు. మొదటిది, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను ఎందుకు తొలగించలేదు? 65 రోజుల తర్వాత కూడా పరిస్థితిని అదుపు చేయలేక పోవడంలోని ఆయన అసమర్థత లేదా అశక్తత కచ్చితంగా రూఢి అయి నదే. సొంత శాసనసభ్యులకు కూడా ఆయనపై నమ్మకం పోయింది. మే నెలలో, ప్రత్యేక పాలన కోసం డిమాండ్ చేసిన ఏడుగురు బీజేపీ కుకీ ఎమ్మెల్యేలు తమ ముఖ్యమంత్రిపై తమకు విశ్వాసం లేదని బహిరంగంగానే ప్రకటించారు. జూన్‌లో ఎనిమిది మంది బీజేపీ మెయితీ ఎమ్మెల్యేలు, ‘‘మణిపూర్ ప్రజలు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయారు’’ అని పేర్కొంటూ ప్రధానమంత్రికి వినతి పత్రం సమర్పించారు. అంటే తమ 32 మంది ఎమ్మెల్యేలలో 15 మంది. లెక్కల్ని పక్కన పెడితే, బీరేన్ సింగ్‌ను తొలగించాలనే డిమాండ్ వెనుక లోతైన నైతిక హేతువే ఉంది. మణిపూర్ జనాభాలో 16 శాతంగా ఉన్న కుకీలు... ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న దానికి ఆయనే కారణం అని నిందిస్తున్నారు. మెయితీ దురహంకారిగా, కుకీల వ్యతిరేకిగా వారు ఆయన్ని పరిగణిస్తున్నారు. గతవారం బీరేన్ సింగ్ అధికార ట్విట్టర్ అకౌంట్ ఈ ఆరోపణకు ఒక ధ్రువీకరణగా నిలిచింది. తనను విమర్శిస్తున్నది కుకీలు, మయన్మార్‌కు చెందిన వారు మాత్రమే నన్న అర్థం వచ్చేలా బీరేన్ సింగ్ ఒక ట్విట్టర్ యూజర్‌కు బదులి చ్చినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. ‘‘మీరసలు ఎప్పుడో రాజీ నామా చేయవలసింది కదా?’’ అని ఆ యూజర్ చేసిన కామెంట్‌కు సమాధానంగా, ‘‘నీది భారతదేశమా? లేక మయన్మారా?’ అని బీరేన్ సింగ్ ప్రశ్నించినట్లు ట్విట్టర్ స్క్రీన్ షాట్లు చూపిస్తున్నాయి. కుకీలను అన్నిటి కంటే ఎక్కువగా ద్వేషించే వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగితే సయోధ్యపై ఏ విధమైన ఆశ ఉంటుంది? నేను లేవనెత్తాలని అనుకుంటున్న రెండవ అంశం, జూన్ నెలా ఖరులో జరిగిన ఒక సంఘటన. దాదాపు 1,500 మంది మెయితీ మహిళలు, బహుశా ‘మీరా పైబిస్’ మహిళా ఉద్యమ కార్యకర్తలు... తూర్పు ఇంఫాల్‌లోని 3వ ఆర్మీ దళ శిబిరాన్ని చుట్టుముట్టి మెయితీ వేర్పాటువాద ‘కంగ్లేయ్ యావోల్ కన్న లుప్’ గ్రూపునకు చెందిన 12 మంది మెయితీ తీవ్రవాదులను విడిపించుకుని వెళ్లారు. 2015లో చందేల్‌లో పొంచివుండి జరిపిన మెరుపుదాడితో 18 మంది సైనికులను హతమార్చింది ఈ ‘కంగ్లేయ్ యావోల్ కన్న లుప్’ గ్రూపు సభ్యులే. ఆ పన్నెండు మందిలో తనను తాను లెఫ్ట్‌నెంట్ కల్నల్ మెయి రంగ్‌థెమ్ తంబా అని చెప్పుకునే వ్యక్తి ఆనాటి దాడికి వ్యూహం రచించాడు. వీళ్లసలు ఎప్పటికీ విడుదల కావలసినవాళ్లు కాదు. కానీ విడు దలయ్యారు. ఇంకా ఘోరం ఏమిటంటే, విడిపించుకుని వెళ్లిన ఈ మహిళలందరికీ బీజేపీ మెయితీ ఎమ్మెల్యే తౌనోజం శ్యామ్‌కుమార్ సింగ్ మద్దతు ఉండటం. వారిని విడిపించుకుని వెళ్లేటప్పుడు తను అక్కడ ఉన్నానన్న విషయాన్ని ఆయన ఖండించడం లేదు కానీ, వాళ్లను విడుదల చేయాలని తను అడగలేదని మాత్రం గట్టిగా చెబు తున్నారు. అయితే భద్రతా అధికారులు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు చెప్పిన కథనం భిన్నంగా ఉంది. ఎమ్మెల్యేనే స్వయంగా మిలిటెంట్ల విడుదలకు బలగాలతో చర్చలు జరిపారని! వైరుద్ధ్యం ఏమిటంటే కుకీలను వెళ్లి కలుసుకోవాలనీ, ద్వైపాక్షికంగా ఉండాలనీ బీరేన్ సింగ్‌కు హోమ్ మంత్రి చెప్పారని ‘ది హిందూ’లో వార్త వచ్చిన తర్వాతే ఈ ‘విడిపించుకు పోవడం’ జరగడం. ఇంఫాల్‌లోని బీజేపీ ఎమ్మెల్యేలు... హోమ్ మంత్రి చెప్పారంటున్న దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ఇంకొక సంగతి. శ్యామ్ కుమార్ సింగ్ వార్తను మిగతా పత్రికలు ఎందుకు వేయలేదు? ఇంఫాల్‌లో గానీ, ఢిల్లీలో గానీ ఎవరూ ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? నా మూడో ఆందోళన... బాధను కలిగించేది మాత్రమే కాదు, భ్రాంతులను పోగొట్టేది కూడా! రెండు నెలలుగా మణిపూర్ అతలా కుతలం అవుతోంది. గృహ దహనాలు, మూకుమ్మడి హింస, ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు, ఇప్పుడిక భయానకమైన శిరచ్ఛేదనం! అయినప్పటికీ మన ప్రధాని ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఆయన తాజా ‘మన్ కీ బాత్’లో గుజరాత్లో తుపాను గురించి మాట్లాడారు కానీ, అంతకన్నా ప్రధానమైనదైన మణిపూర్ గాయాన్ని వదిలేశారు. టర్కీలో భయంకర భూకంపం సంభవించినప్పుడు మొదట సానుభూతి తెలిపిన వారిలో ఆయనా ఒకరు. మణిపూర్ విషయం వచ్చేటప్పటికి... తన సొంత ప్రజలు, ఇంకా చెప్పాలంటే తన ఓటర్లకు జరుగుతున్న దానిపై మొండిగా మౌనాన్ని ఆశ్రయించారు. ఈ విషయమై నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి మెయితీ, ప్రతి కుకీ, ప్రతి నాగా... నిరాశలో ఉన్నారు. మొదట వారు కలత చెందారు. తర్వాత ఆగ్రహించారు. ఆ తర్వాత తమకు నమ్మకద్రోహం జరిగి నట్లుగా భావించారు. ఇప్పుడు తాము ఎవరికీ అక్కర్లేదని నమ్ము తున్నారు. మణిపూర్ సంక్షోభం గురించి తాను ప్రతి ఒక్క రోజూ ప్రధానికి వివరిస్తూనే ఉన్నానని హోమ్ మంత్రి చెబుతున్నారు. అందులో సందే హించడానికేం లేదు. కానీ మణిపూర్‌పై మాట్లాడేందుకు మోదీ ఉద్దేశ పూర్వకంగా నిరాకరించడాన్ని అంగీకరించడమే మరింత కష్టతరంగా ఉంది. విధులు, రాజ్యాంగ అవసరాలను మించి దేశంలోని ఆందోళన కర పరిస్థితులపైన మాట్లాడవలసిన నైతిక ఒత్తిడి ప్రభుత్వాధినేతపై ఉంటుంది. ఆయన మాట్లాడారూ అంటే మనందరి తరఫున మాట్లాడి నట్లు. మన ప్రధానమంత్రిగా మాట్లాడినట్లు. కానీ ఆయనకు మాట్లా డేందుకు ఏమీ లేదంటే ఆయన మౌనం ఆయన ఒక్కరితోనే ఉంటుంది. ఆ మౌనం మనందరికి ప్రాతినిధ్యం వహించదు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నెహ్రూకు నచ్చింది మోదీ చేతికొచ్చింది!
అమెరికా పర్యటనలో మన ప్రధానమంత్రికి బైడెన్ దంపతులు ఇచ్చిన కానుకలలో ‘కలెక్టెడ్ పొయెమ్స్ ఆఫ్ రాబర్ట్ ఫ్రాస్ట్’ తొలి ముద్రణ ప్రతి ఉంది. ఫ్రాస్ట్ బహుశా నెహ్రూకు నచ్చిన కవి. ఆ సంకలనంలోని ఒక కవిత ‘... బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్, అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్’ అనే భావోద్వేగమైన వాక్యాలతో ముగుస్తుంది. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, మోదీకి నెహ్రూ ‘మన ప్రియతమ’ పూర్వపు ప్రధాని కాదని! ఆ సంగతిని ఆయన అనేక పర్యాయాలు స్పష్టం చేశారు. దీనిని బట్టి బైడెన్ నుంచి మోదీకి ఆ పుస్తకం కానుకగా అందడం వింతగా లేదూ? మనసు వింతైనది. విచిత్రంగా పని చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికో ఆలోచనల్ని కలుపుకొంటుంది. మరచిపోయిన జ్ఞాపకాలను రేపుకొంటుంది. అందులో తర్కం ఉండదు. అలా జరుగుతుందంతే. ఫలితం హాయినిగొల్పేది అయివుండొచ్చు, కలవర పరచేదీ కావచ్చు. గతవారం నాకు ఇలాగే జరిగింది. మీకెప్పుడైనా ఇలా అయిందా? జో బైడెన్ దంపతులు మన ప్రధాన మంత్రికి ఇచ్చిన కానుకలలో ‘కలెక్టెడ్ పొయెమ్స్ ఆఫ్ రాబర్ట్ ఫ్రాస్ట్’ తొలి ముద్రణ ప్రతి కూడా ఒకటని చదివినప్పుడు నాకు ఇలా అవడం మొదలైంది. ఫ్రాస్ట్‌ని కానుకగా ఇవ్వడంలో అసాధారణత ఏమీ కనిపించలేదు. ఫ్రాస్ట్ బహుశా అమెరికా దేశపు అత్యంత ప్రసిద్ధుడైన కవి. నాలుగుసార్లు పులిట్జర్ అవార్డు పొందిన వ్యక్తి ఆయన ఒక్కరే. కనుక అమెరికా అధ్యక్షుడు ఒక భారతీయ ప్రధానికి ఫ్రాస్ట్ కవితల తొలి ముద్రణ ప్రతిని ఇవ్వడం సముచితమైన కానుకే అవుతుంది. అయితే ఇక్కడొక చిక్కు ఉంది. లేదా నా ఉద్దేశంలో ఆక్షేపణ. ఫ్రాస్ట్ బహుశా జవహర్లాల్ నెహ్రూకు నచ్చిన కవి. మోదీకి బైడెన్ కానుకగా ఇచ్చిన ఈ కవితా సంకలనంలోని ఒక కవిత ‘స్టాపింగ్ బై ఉడ్స్ ఆన్ ఎ స్నోవీ ఈవెనింగ్’. ఆ కవిత భావోద్వేగభరితమైన ఈ వాక్యాలతో ముగుస్తుంది: ‘ది ఉడ్స్ ఆర్ లౌలీ, డార్క్ అండ్ డీప్, బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్, అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్,అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్.’ నెహ్రూ ఈ వాక్యాలలో లోతైన అర్థాన్ని చూశారు. వాటిని ఆయన ఉన్నవి ఉన్నట్లుగా చేత్తో తిరగ రాసుకుని ఆ కాగితాన్ని బల్లపైన ఉన్న గాజు పలక కింద... పైకి కనిపించేలా పెట్టుకున్నారని ఎవరి ద్వారానో నేను విన్నాను. మరికొందరు నెహ్రూ ఆ కాగితం ముక్కకు పటం కట్టించి బల్లపై ఉంచుకున్నారని అంటారు. నెహ్రూకు తను సేకరించిన అమూల్యమైన వస్తువులను తన పడక పక్కన అమర్చుకునే అలవాటు ఉందనీ, వాటిల్లో ఈ వాక్యాలు ప్రముఖ స్థానం పొందాయనీ కూడా కొందరు అంటారు. నిజం ఏదైనప్పటికీ అదొక కవిత. నెహ్రూకు ఎంతో అమూల్యమైనది. అయితే ఇదేమీ కొత్త కథ కాదు. 50లు, 60లు, 70లలో పెరిగి పెద్దవాళ్లయిన అనేకమంది భారతీయులకు ఈ సంగతి తెలుసు. నెహ్రూ జీవిత చరిత్రను రాసినవారు ఈ విషయం గురించి కూడా రాశారు. నెహ్రూ చుట్టూ అల్లుకుని ఉన్న నమ్మకాలలో ఇదొక భాగం. అటువంటిదే ఒక వాస్తవం... అందరికీ తెలిసిన విషయం ఏమి టంటే, మోదీకి నెహ్రూ ‘మన ప్రియతమ’ పూర్వపు ప్రధాని కాదని! ఆ సంగతిని ఆయన అనేకానేక పర్యాయాలు స్పష్టం చేశారు. దీనిని బట్టి బైడెన్ నుంచి మోదీకి ఆ పుస్తకం కానుకగా అందడం వింతగా అనిపించడం లేదూ? బైడెన్‌కు ఈ సంగతి ఆయనకై ఆయనకు తెలియకపోవచ్చు. లేదా ఇదే పుస్తకాన్ని మోదీకి కానుకగా ఇవ్వాలన్న నిర్ణయం ఆయనది కాకపోనూవచ్చు. కానీ ఆయనకు ఎల్లవేళలా సలహాలు ఇచ్చేవారు ఉంటారన్నది మాత్రం నిస్సందేహం. వారు ఇండియా గురించి బాగా తెలిసినవారై, మరీ ముఖ్యంగా... మోదీని సంతోషపరిచే కానుకను జాగ్రత్తగా ఎంపిక చేయగలవారై ఉండొచ్చు. వారైతే నెహ్రూ–ఫ్రాస్ట్ లేదా మోదీ–నెహ్రూల మధ్య ఎలాంటి సంబంధం ఉన్నదో తెలియని వారంటే నమ్మడం కష్టం! కనుక ఇది నిజంగా యాదృచ్ఛికమేనా, లేక ఇవ్వకనే ఇచ్చిన సూక్ష్మమైన సందేశమా అన్న ఆలోచన నా బుర్రను ఒక గమ్మత్తయిన, అనియంత్రిత దిశలోకి నడిపించింది. అదేమిటో తెలిసేలోపు నేను 1976లోకి వెళ్లిపోయాను. ఆ ఏడాది నేను నా 21వ జన్మదినాన్ని కేంబ్రిడ్జిలో... కొంచెం ఎక్కువ చేసి చెప్పుకోవాలంటే... మత్తుపానీ యాల ఆతిథ్యంతో వేడుకగా జరుపుకొన్నాను. ఆ సందర్భంగా... డఫ్నీ, ఆమె ప్రియ స్నేహితుడు హంఫ్రీ నాకు ఆకుపచ్చ, ఎరుపు చారల ‘టై’ని కానుకగా ఇచ్చారు. అది నేను కట్టుకునే రకం టై వంటిది కాదు కాబట్టి సొరుగులో పెట్టి, దానిని నాకు ఎవరిచ్చారో కూడా మర్చిపోయాను. తర్వాత ఎనిమిది నెలలకు హంఫ్రీ పుట్టినరోజు వచ్చింది. అతడి కోసం డఫ్నీ ముందేమీ చెప్పకుండా ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేలా బర్త్‌డే పార్టీని ఏర్పాటు చేసింది. నేనొక మతిమరుపు గల బుద్ధిహీనుడిని కనుక నా సొరుగులో కనిపించిన టైని హంఫ్రీకి ఇవ్వదగిన బహుమతి అని భావించాను. దానినొక ఖరీదైన కాగితంలో చుట్టి, దానికి సరిపోయే బర్త్‌డే కార్డును జతపరచి రయ్యిన పార్టీకి లంఘించాను. నేనిచ్చిన కానుకను తెరచి చూడగానే హంఫ్రీ ముఖం ఎలా మారి పోయిందో నేను ఎప్పటికీ మర్చిపోలేను. విషయం అతడికి అర్థమైన క్షణం అది. తను ఇచ్చిన అదే టై తిరిగి తనకు కానుకగా వెళ్లింది! హంఫ్రీ పెద్దగా నవ్వాడు. నా ముఖం ఎర్రబడింది. ‘‘మనం ఏదైతే చేస్తామో తిరిగి అదే మనకు జరుగుతుందని నేను ఊహించగలను’’ అని మాత్రం అన్నాడు హంఫ్రీ గొప్ప దయతో. బైడెన్ పుస్తకానికీ, నా టైకీ మధ్య మీకేదైనా ప్రత్యక్ష, లేదంటే పరోక్ష సంబంధం కనిపిస్తోందా? రెండింటినీ మీరు అనుచితమైన కానుకలుగా పిలవొచ్చు, లేదంటే తగని ఎంపికలు అనవచ్చు. కానీ బైడెన్ అసంకల్ప కానుక... నేను ఇబ్బంది పడ్డంతగా... ఆయన్ని ఏ విధం గానూ ఇబ్బంది పెట్టేదైతే కాదు. హంఫ్రీకి నాపై మనసులో ఏమీ లేదు. డఫ్నీతో అతడు విడిపోయినా, మేమిద్దరం ఇప్పటికీ స్నేహి తులుగానే ఉన్నాం. నన్నెప్పుడైనా అతడు టైతో చూస్తే, ‘ఆ’ టైని గుర్తు చేయడం మాత్రం మర్చిపోడు. బైడెన్ తనకు ఆ పుస్తకాన్ని కానుకగా ఇవ్వడం గురించి నరేంద్ర మోదీ ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలని నాకు మహా ఆరాటంగా ఉంది. నేను అనుకోవడం... అమెరికా అధ్యక్షుడి అప్రమేయ కానుక మోదీకి ముసిముసి నవ్వులు తెప్పిస్తుందని. మోదీ ఎప్పుడైనా తన జ్ఞాపకాలను పుస్తకంగా రాస్తే అందులో ఈ చిన్న కథ కోసం ఎదురు చూడవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అందుకే ఎప్పటికీ ఆయన ‘గురు’
1960లలో డూన్ స్కూలు అసమాన ప్రతిభ కలిగిన తన విద్యార్థుల కంటే, ఆ విద్యార్థులలోని క్రీడాకారులకే ఎక్కువ విలువ ఇచ్చింది. ఒక్కసారైనా క్రికెట్ బ్యాట్‌ను ఊపని, ఫుట్‌బాల్‌ను లాగిపెట్టి తన్నని విద్యార్థికి ప్రాముఖ్యం దక్కక పోవడం స్పష్టంగా కనిపించేది. ఇందుకు భిన్నంగా 99 ఏళ్ల వయసులో కన్నుమూసిన ‘గురు’ క్రీడాప్రతిభల కంటే కళాత్మక నైపుణ్యాలు గొప్పవనే భావనను విద్యార్థులలో కలిగించడానికి అనేక మార్గాలను కనిపెడుతుండేవారు. విద్యార్థులు ఆయన వద్ద పాఠ్యాంశంగా చదివిన సబ్జెక్టు భౌగోళిక శాస్త్రమే అయినప్పటికీ, వారు నేర్చుకున్న కొన్ని అత్యుత్తమమైన జీవిత పాఠాలు ఆయన బోధించినవే. ఇలా చేయమని గురు ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. అయితే ఆయనొక ఉదాహరణగా కనిపించేవారు. మేము ఆయన్ని ‘గురు’ అని పిలుచు కోవడం ఆపేక్షతోనే అయినప్పటికీ నిజానికి ఆయనకు అదే కచ్చితమైన మాట. విశ్వగురు అనడం ఫ్యాషన్ ఈ రోజుల్లో. కానీ ఆయన నిజమైన, అంకితభావం కలిగిన, శ్రద్ధాబద్ధుడైన ఉపాధ్యాయుడు. కావాలంటే మీరు ఆయన్ని భారతీయ ‘మిస్టర్ చిప్స్’ అనుకోవచ్చు. డూన్ స్కూల్ అబ్బాయిలకు ‘గురు’ అనే పేరుతోనే గురుదయాళ్ సింగ్ తెలుసు. గురు అన్నది ఆయన పేరుకు సముచి తమైన నామకరణ. గత నెలలో ఆయన కన్ను మూసినప్పుడు కూడా అదే పేరుతో మాకు స్మరణీయం అయ్యారు. నేను గురును మొదటిసారి కలిసినప్పుడు నా వయసు పదేళ్లు. జైపూర్ హౌస్ ‘హౌస్ మాస్టర్’ ఆయన. పొడవాటి మనిషి. నా వయ సుకు ఇంకా పొడవుగా, భారీగా కనిపించారు. అయితే ఆయన చిరు నవ్వుతో నా భయాలు, అందోళనలు అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి. ఆయన నవ్వినప్పుడు నేనూ పెద్దపెట్టున నవ్వాను. నవ్వును ఆపు కోలేకపోయాను. ఆయన వద్ద పాఠ్యాంశంగా నేను చదివిన సబ్జెక్టు భౌగోళిక శాస్త్రమే అయినప్పటికీ, నేను నేర్చుకున్న కొన్ని అత్యుత్తమమైన జీవిత పాఠాలు సైతం ఆయన బోధించినవే. ఆ కొన్నింటిలో మొదటిది అతి కష్టమైనది మాత్రమే కాకుండా, అసలు నేనేమిటన్న దాన్ని నాకు బహిర్గతం చేసినది కూడా! 1960లలో డూన్ స్కూలు అసమాన ప్రతిభ కలిగిన తన విద్యార్థుల కంటే, ఆ విద్యార్థులలోని క్రీడాకారులకే ఎక్కువ విలువ ఇచ్చింది. దీనర్థం ఒక్కసారైనా క్రికెట్ బ్యాట్‌ను ఊపని, ఫుట్‌బాల్‌ను లాగిపెట్టి తన్నని విద్యార్థికి ప్రాముఖ్యం దక్కక పోవడం అన్నది స్పష్టంగా కనిపించేదని! నేను నటనలో, వాదోపవాద చర్చలలో ముందుండే వాడిని. అలాగే, ఆఖరు నిమిషంలో చదివి మార్కుల్ని అదర గొట్టేయడంలో కూడా. కానీ నేను ఆటల్లో లేకపోవడం వల్ల నాలోని ఈ నైపుణ్యాలు చిన్నచూపునకు గురయ్యేవి. అయితే గురు, క్రీడా ప్రతిభల కంటే కళాత్మక నైపుణ్యాలు గొప్పవనే భావనను నాలో కలిగించడానికి అనేక మార్గాలను కనిపెడు తుండేవారు. నేను పాల్గొన్న చర్చల్లోని నా తెలివైన మాటల్ని గుర్తు చేసుకునేవారు. అదొక ప్రశంసలా ఉండేది నాకు. లేదా చర్చావేదిక మీద అలా స్తంభించిపోయిన నా భంగిమ గురించి మాట్లాడుతూ నవ్వేసేవారు. పైకి అది సున్నితమైన ఎగతాళిగా ఉన్నప్పటికీ నిన్ను నేను శ్రద్ధగా గమనిస్తున్నాను సుమా అనే ఒక అంతర్లీనత కూడా ఆయనలో వ్యక్తం అయి, నేనొక ప్రత్యేకమైన వ్యక్తినన్న భావన నాలో కలిగించేది. జూనియర్స్ క్రికెట్లో నేను అత్యుత్తమంగా ఆడినప్పటికీ ఆయన ఉద్దేశం ప్రకారం నా చివరి ఏడాదిలో నేను ‘హౌస్ కెప్టెన్’ అవడానికి తగిన కారణం మాత్రం నాలోని ఆ కళాత్మక నైపుణ్యాలే! ఎందుకంటే, క్రికెట్ గ్రౌండ్లో నేనొక్కడినే ఉన్న వైపు నేరుగా వచ్చి నా చేతుల్లో పడిన బంతిని కూడా నేను క్యాచ్ పట్టలేకపోయాను. ఆ విధంగా గురు, డూన్ స్కూల్ తానుగా ఎప్పటికీ నాకు అందించని విశ్వాసాన్ని నాలో కలిగించారు. నాలోని ప్రతిభ, నైపుణ్యాలతో సమానంగా, నా పరిమితుల్నీ నేను గుర్తించేలా; నా అపజయాల్ని, వైఫల్యాలను, తప్పుల్ని నేను ఎదుర్కొనేలా నేను ఎదగడానికి గురు తోడ్పడ్డారు. పడిపోతే పైకి లేచి, ముందుకు సాగిపోవడం ఎలాగో నేర్పించారు. అది నాకు ముఖ్యమైన పాఠం. ఎందుకంటే జీవితంలో తరచు నేను పొరపాట్లు చేసి పడిపోతుంటాను. ఏళ్ల తర్వాత నేను పెద్దవాడిని అయినప్పుడు గురు నాకు చెప్పిన మరొక పాఠాన్ని గుర్తుకు చేసుకున్నాను. తప్పు చేసిన వారిని శిక్షించడం అన్నదొక్కటి మాత్రమే ఉత్తమ మార్గం కాదు. తప్పును మన్నించడం అన్నది ఉత్తమమైన మార్గం అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అంటారు గురు. గురు స్వయంగా ఈ సూత్రాన్ని పాటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మొండితనాన్ని, అబద్ధాలను, ఉద్దేశ పూర్వకమైన తెలివితక్కువ వేషాలను ఆయన భరించారు. నా తప్పు లన్నీ ఆయనకు తెలుసు. అయినా ఆ తప్పుల్ని పోనిచ్చేవారు. అయితే ఆయన ముఖభావాలను బట్టి, నేను మరికొంత మెరుగ్గా ఉండాలని ఆయన ఆశిస్తున్నట్లు గ్రహించేవాడిని. ఏమీ తెలియని టీనేజ్‌లో ఉన్నప్పటికీ ఆ గ్రహింపు నాకు బాధను కలిగించేది. గురు దృష్టిలో గొప్పగా ఉండటం కన్నా నాకు వేరేదీ అక్కర్లేకపోయేది. అందుకే ఆయన అనిష్టత నా మనసును పిండేసినట్లుగా ఉండేది. ఆ మాత్రం శిక్ష సరిపోతుందని గురుకు తెలుసు. ఇతరులు తప్పు చేసినప్పుడు నేను ఈ పాఠాన్ని గుర్తు చేసు కోవడానికి ప్రయత్నిస్తాను. కానీ అదంత తేలికగా ఉండదు. అందుకు వివేకం, నిగ్రహం రెండూ కావాలి. గురుకు ఆ రెండూ ఉన్నాయి. నాకు తరచు అవి రెండూ ఉండవు. నేను సరిగా నేర్చుకోని ఒక పాఠం ఇది. మూడవ పాఠం, నేనింకా సాధన చేస్తూనే ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అది సులభమైనది. కొద్దిపాటి మర్యాదల పాటింపుతో స్పష్టమైన వ్యత్యాసాలను మీరు చూపగలుగుతారు. గదిలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్న అందరినీ పలకరించండి. ‘దయచేసి’, ‘ధన్యవాదాలు’ అని చెప్పడాన్ని ఎప్పుడూ విస్మరించకండి. ఇలా చేయమని గురు స్పష్టంగా నాకెప్పుడైనా చెప్పి ఉంటారని నేను అనుకోను. అయితే ఆయనొక ఉదాహరణగా ఎల్లవేళలా ప్రతి ఒక్కరికీ కనిపించేలా ఉంటారు. జాగ్రత్తగా గమనించవలసింది ఆయన పెంపొందించిన సత్ప్రవర్తన, ఆయన పట్ల మనలో ఉన్న గౌరవ భావన ఆయన్ని మనం అనుకరించేలా చేస్తాయన్నది. ప్రత్యక్షంగా ఆయన ప్రబోధించని విలువలకు మనమంతా అలవాటు అవుతాం. అనుకరణ ద్వారానే నేను నేర్చుకున్నాను. నా జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే నాపై గురు ముద్ర పొరపాటున పడినట్లుగా అనిపించదు. వాటర్లూ యుద్ధంలో బ్రిటన్ గెలుపు ఈటన్ (పాఠశాలల) ఆట మైదానాల వల్ల సాధ్యమయిందేమో నాకు తెలియదు కానీ నాలోని మనిషిని మలిచింది మాత్రం కచ్చితంగా జైపూర్ హౌస్ ‘హౌస్ మాస్టర్’ అనే చెప్పగలను. అందుకే ఎప్పటికీ ఆయన నా ‘గురు’. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
టీవీకి సరిగ్గా సరిపోయే ఆట!
ఫుట్‌బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోవడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం అవసరమౌతుంది. అందుకే అవి స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. అదే టెన్నిస్‌లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజయోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. దానికి తోడు, టెన్నిస్‌లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది. నేను క్రీడాకారుడిని కాదు. నిజం చెబు తున్నా, స్క్వాష్ తప్ప నేను ఏనాడూ ఏ ఆటా ఆడింది లేదు. క్రికెట్ అయితే నాకు ఒక దుర్భరమైన ధారావాహికలా తోస్తుంది. ఫుట్‌బాల్ మరీ అంత సాగతీతగా ఉండదు కనుక కొంచెం నయం అనుకుంటాను. ఎప్పుడైనా మర్యాద కోసం తప్ప ఆటల్ని నేను కనీసం చూడనైనా చూడను. కానీ టెన్నిస్... ఆహా! టెన్నిస్. అది నాకు మిగతా ఆటల్లా కాదు. మొత్తంగా అది వేరే కథ. నొవాక్ జొకోవిచ్ మొన్న నేను ఫ్రెంచి ఓపెన్ ఫైనల్స్‌లో నొవాక్ జొకోవిచ్‌ను చూసినప్పుడు టెన్నిస్ అన్నది టెలివిజన్ కోసం తయారైన ఆట అని గ్రహించాను. ఫుట్‌బాల్, క్రికెట్ అలా కాదు. బహుశా అందుకేనేమో ఎప్పుడో గాని గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ని నేను చేజార్చుకోను. ఇతర ఆటల వరల్డ్ కప్పులు ఏమైపోయినా నాకు పట్టదు. టెన్నిస్‌లో కెమెరాలు విడిగా ఒక క్రీడాకారుడిని అత్యుత్తమంగా చిత్రీకరిస్తాయి. అతడు ఫ్రేము నిండుగా ఉన్నప్పుడు అతడి ప్రతి చర్య, ప్రతి కదలిక కనిపిస్తుంది. అతడి నిస్పృహ అయినా, అతడి విజ యోద్వేగం అయినా స్పష్టంగా తెలిసిపోతుంది. సంకల్ప బలం, స్థయిర్య క్షీణత వంటి అంతర్గత గుణాల విషయంలో కూడా ఇది నిజం. కెమెరా ఆ గుణాలను వెలికి తీస్తుంది. దానికి తోడు, టెన్నిస్‌లో బంతిని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కొట్టడం లక్ష్యంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల నడుమ బంతి ప్రయాణ మార్గాలను కెమెరా అలవోకగా అనుసరిస్తుంది. ప్రతి విసురూ ఆట ఊపునుంచి వీక్షకుల చూపును తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. టెన్నిస్‌లా ఫుట్‌బాల్, క్రికెట్ వ్యక్తిగతమైన ఆటలు కావు. అవి జట్టు ఆటలు. అందువల్ల జట్టులోని ఏ ఆటగాడి ఆట తీరునైనా అర్థం చేసుకోడానికీ, అతడి నైపుణ్యాన్ని గుర్తించడానికీ మిగతా ఆటగాళ్లు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవడం మీకు అవసరమవుతుంది. అప్పుడు మాత్రమే మీరు బంతిని నియంత్రణలోకి తీసుకున్న ఆట గాడి మదిలోని వ్యూహాన్ని దృశ్యమానం చేయగలరు. అయితే ఒక ఆటగాడి మీద దృష్టిని నిలపడం అన్నది ఆటలోని తక్కిన భాగాన్నంతా కోల్పోయేలా చేస్తుంది. అందుకే ఏ ఆటగాడు ఏ స్థానంలో ఉన్నదీ ఒకేసారి చూడా లంటే మైదానం మీకు తగినంత దూరంగా ఉండాలి. ఆ దూరం ఆట గాళ్లందర్నీ కనిపించేలా చేస్తుంది. అందుకే ఫుట్‌బాల్, క్రికెట్లు స్టేడియంలలో చక్కగా కనిపిస్తాయి. మానవ నేత్రం ఒక్క సారింపుతో అన్నిటినీ చూడగలదు. టీవీ కెమెరా అలా చూడలేదు. అనేక కెమెరాలు పని చేస్తున్నప్పటికీ ఏదైనా ఒక కెమెరాలో వచ్చిన పేలవమైన దృశ్యాన్ని కూడా అవి ఏవీ భర్తీ చేయలేవు. టెన్నిస్‌లో ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్‌ను తిలకిస్తున్నట్లయితే దూరం నుంచి క్రీడా మైదానం సంతృప్తికరమైన వీక్షణను ఇవ్వదు. ఒక వేళ మీరు పక్కల నుంచి చూస్తున్నట్లయితే మీ మెడ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి మళ్లీ ఎడమకు మళ్లుతూ ఉంటుంది. బంతిని ఏ మాత్రం నేలను తాకనివ్వని పోటాపోటీ షాట్ల సుదీర్ఘమైన నిడివి కూడా మీకు అలసటను కలిగించవచ్చు. అదే టీవీలోనైతే రెండు మైదానాలు సమంగా కళ్ల ముందర ఉంటాయి. మీ మెడకు అసౌకర్యం కలుగదు. ఎందుకంటే మీరు స్క్రీన్కు ఎదురుగా కూర్చొని చూస్తుంటారు. బహుశా ఈ సదుపాయం వల్లనే దశాబ్దాలుగా నేను కొందరు టెన్నిస్ క్రీడాకారులను పిచ్చిగా అభిమానిస్తుండవచ్చు. వాళ్లు ఆడుతున్న ప్పుడు ఉత్కంఠగా చూస్తుంటాను. వాళ్లు గెలిచి తీరాలని ఆశ పడ తాను. ఓడిపోతే కలత చెందుతాను. వాళ్ల విజయాలను, వైఫల్యాలను నావిగా మనసులోకి తీసుకుంటాను. ఇలా వ్యక్తిగతంగా తీసుకోవడం 70 లలో బార్న్ బోర్గ్, మార్టినా నవ్రతిలోవాలతో మొదలైంది. వారి స్థానాన్ని 2000–2009 మధ్య రోజర్ ఫెదరర్ ఆక్రమించాడు. ప్రస్తుతం నొవాక్ జొకోవిచ్. 1980లో బోర్గ్ సాధించిన ఐదవ వింబుల్డన్ విజయాన్ని నేనెప్ప టికీ మర్చిపోలేను. నాలుగో సెట్లో అతడి ప్రత్యర్థి జాన్ మెకెన్రో అతడికి ఏడు చాంపియన్‌షిప్ పాయింట్లను దక్కకుండా చేశాడు. అది అతడి ఆత్మను ఛిన్నాభిన్నం చేస్తుందని వ్యాఖ్యాతలు విశ్వసించారు. విజయానికి చేరువై కూడా విఫలం చెందిన విషయాన్ని మర్చి పోయి ముందుకు సాగిపోవడం సాధ్యం అయ్యే పని కాదు. అయితే ఆ వ్యాఖ్యాతల అంచనా తలకిందులైంది. ఆ ఆటలో దృఢనిశ్చయంతో తలపడిన బోర్గ్ తన మోకాళ్లపై కూలబడటానికి ముందు ఐదో సెట్లో 8–6 తేడాతో విజయం సాధించాడు. అతడు చూపేది ఆ ఒక్క భావో ద్వేగమే. గెలిచిన ప్రతిసారీ అతడు అలాగే చేస్తాడు. అతడి వ్యక్తిత్వానికి సూచనప్రాయమైన సంకేతం ఇంకొకటి! టోర్నమెంటు జరుగుతున్నంత కాలం గడ్డం తీసేయకపోవడం! 1979లో సిమ్లాలో ఉండగా మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లోని బ్లాక్ అండ్ వైట్ టీవీలో నేను బోర్గ్ ఆడుతున్న వింబుల్డన్ ఫైనల్ చూస్తు న్నాను. పాకిస్తాన్ టీవీ దానిని ప్రసారం చేస్తోంది. ఐదో సెట్ చివరిలో ఆనాటి అత్యంత భయానక సర్వర్లలో ఒకరైన రాస్కో టానాతో పోరాడుతున్న బోర్గ్‌కు మూడు చాంపియన్ షిప్ పాయింట్లు చేతిలో ఉండగా పాకిస్తాన్ టీవీ చానల్ అకస్మాత్తుగా వార్తల ప్రసారంలోకి మళ్లింది. ఆ తర్వాత బోర్గ్ విజయం సాధించాడని తెలుసుకోడానికి ముందు అరగంట పాటు నేను తీరని వేదనతో టీవీ ముందు వేచి ఉన్నాను. ఆ నిర్దాక్షిణ్యమైన పీటీవీ, బులెటిన్లోకి ఆ వార్తను చేర్చడం సరికాదని భావించినట్లుంది. ఇప్పుడు మళ్లీ నాలుగు వారాల తర్వాత వింబుల్డన్ నన్ను టీవీ తెర ముందుకు తీసుకురానుందా? మొన్నటితో 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన జొకోవిచ్ 24వ టైటిల్‌ను కూడా కోరుకుంటాడు. అందులో సందేహం లేదు. కానీ అది అతడికి ఎంత ముఖ్యమో నాకూ అంత ముఖ్యమా? 1981లో బోర్గ్‌ను ఓడించినందుకు నేను మెకెన్రోని ద్వేషించాను. ఎస్.డబ్ల్యూ18 మైదానంలో జొకోవిచ్ ఓడిపోతే నా ప్రతి స్పందన ఇప్పుడూ అలాగే ఉండబోతుందా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రజల కోసమే ప్రశ్నించే స్వేచ్ఛ
తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలంలో మోదీ ఒక్కసారి కూడా పత్రికా సమావేశాన్ని నిర్వహించలేదనీ, జవాబుదారీతనం నుంచి ఆయన తప్పించుకోవాలని చూస్తున్నారనీ అనేకమంది ఒక అంతిమ భావనకు వచ్చేశారు. నిజానికి పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు తమ నాయకులను ప్రజలకు జవాబుదారీగా చేసేందుకు పత్రికా సమావేశాలను కాక, ‘రాజకీయ ఇంటర్వ్యూ’లకు ప్రాముఖ్యం ఇస్తాయి. ఏ అంశం మీద ప్రశ్నలు అడగాలన్నదీ, ఏ ప్రశ్నపై విడుపు లేకుండా పట్టుతో ఉండాలన్నదీ ఆ జర్నలిస్టు నియంత్రణలోనే ఉంటుంది. ఒక ప్రశ్నకు ప్రధాని నుంచి సంతృప్తికరమైన సమాధానం వచ్చే వరకు ఆ ప్రశ్నను కొనసాగించే హక్కును ఆ పాత్రికేయుడు కలిగి ఉంటాడు. నిజాన్ని నిగ్గు తేల్చే విధానం అది. పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి దేశ ప్రధాని సుముఖంగా ఉన్నారంటే ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఆయన సంసిద్ధతను కనబరుస్తున్నారని ఇండియాలో మనం భావిస్తాం. ప్రధానికి నిజంగానే తన పాలనకు బాధ్యత వహించే ఉద్దేశం ఉందా, లేదా అనేదానికి అసలైన పరీక్ష... ఆయన ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, లేదా చేయకపోవడం. పత్రికా సమావేశంలో వందలాది మంది పాత్రికేయులకు ముఖాముఖి బదులు ఇవ్వవలసి వచ్చినప్పుడు కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే డొంక తిరుగుడు లేకుండా సమాధానాలు చెప్పవలసి వస్తుంది. అందుకే తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలంలో మోదీ ఒక్కసారి కూడా పత్రికా సమావేశాన్ని నిర్వహించలేదనీ, జవాబుదారీతనం నుంచి ఆయన తప్పించుకోవాలని చూస్తున్నారనీ అనేకమంది ఇప్పటికే ఒక అంతిమ భావనకు వచ్చేశారు. మార్గరెట్ థాచర్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న బ్రియాన్ వాల్డెన్స్ వారి భావనతో ఒక్క క్షణమైనా నాకు నిమిత్తం లేనప్పటికీ, పత్రికా సమావేశాన్ని మోదీ దాటవేస్తూ రావడంపై నాకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ప్రపంచంలోని మిగతా ప్రజాస్వామ్య దేశాలలో నిజమైన జవాబుదారీతనాన్ని భిన్న పాత్రికేయ ప్రక్రియల ద్వారా సాధిస్తారు. ఆ విషయానికి తర్వాత వస్తాను. మొదట, పత్రికా సమావేశాల మీద మనకుండే విశ్వాసం ఎందుకు సన్నగిల్లుతున్నదో నన్ను వివరించనివ్వండి. మొదటి విషయం. పత్రికా సమావేశంలో అనేక మీడియాల నుంచి వచ్చిన అనేకమంది ప్రతినిధులు ఉంటారు. వారిలో ప్రతి ఒక్కరూ తమదైన ప్రశ్న ఒకటి అడిగేందుకు ఆతురతతో ఉంటారు. చాలా వరకు అవన్నీ ఒక దానితో ఒకటి సంబంధం లేని వేర్వేరు ప్రశ్నలే అయి ఉంటాయి. గంటల పాటు పత్రికా సమావేశం జరుగుతున్నా ఈ వేర్వేరు ప్రశ్నల కారణంగా ప్రధానమంత్రి జవాబులు చెప్పడానికి ఎప్పుడో తప్ప ఒత్తిడికి లోనయే అవకాశం దాదాపుగా ఉండదు. ప్రధాని ఎందుకు ఒత్తిడికి లోనవరో చెప్తాను చూడండి. ప్రధాని పత్రికా సమావేశాలలో ఒక జర్నలిస్టుకు ఒక ప్రశ్న వేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగాక, ఆ తర్వాతి జర్నలిస్టు తిరిగి అదే ప్రశ్న అడిగేందుకు ఉండదు. అప్పుడు ఆ జర్నలిస్టు తన ప్రశ్నను, ఒక్కోసారి తన సబ్జెక్టును కూడా మార్చుకోవలసి వస్తుంది. అంటే ఒకటే ప్రశ్నపై పట్టుపట్టడానికి తక్కువ అవకాశం ఉండటంతో ప్రధానిపై ఒత్తిడి పెరిగే పరిస్థితి ఉండదు. అప్పుడు ఆయన పొంతన లేని, లేదా సంపూర్ణం కాని సమాధానాలతో తప్పించుకోవచ్చు. ప్రధాని అజాగ్రత్తతో తొట్రుపడితేనో, లేదంటే ఏవైనా అవాస్తవాలు ఆయన నుంచి దొర్లితేనో తప్ప ఆయన పట్టుబడరు. అది నక్క తోకను తొక్కడమే కానీ, నాణ్యమైన జర్నలిజం కాదు. నిజానికి ప్రధాని పత్రికా సమావేశాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా చూస్తున్నప్పుడు ఆయన ఒక నేర విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తిగా కనిపిస్తారు. కానీ అది భ్రమ. ఒకే ప్రశ్నను పదే పదే అడుగుతూ, ఆయన ఇచ్చే సమాధానాలను నిశితంగా పరిశీలించి వాటిలోని తప్పుల్ని, దాటవేతల్ని ఎత్తి చూపుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆయన దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు. అయితే ప్రధాని పత్రికా సమావేశాలలో ఇలా జరిగే అవకాశం ఉండనే ఉండదు. అందుకే పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు తమ నాయకులను ప్రజలకు జవాబుదారీగా చేసేందుకు పత్రికా సమావేశాలకు కాక, ‘రాజకీయ ఇంటర్వ్యూ’లకు ప్రాముఖ్యం ఇస్తాయి. ప్రధాని–జర్నలిస్ట్ ఇద్దరే ఎదురెదురుగా ఆ ఇంటర్వ్యూలో ఉంటారు. ముఖ్యంగా అక్కడ ఆ ఏక పాత్రికేయుడే... ప్రధాని జవాబులు చెప్పవలసిన ప్రశ్నలను నిర్ణయిస్తారు. ఏ అంశం మీద ప్రశ్నలు లేవనెత్తాలన్నదీ, అలాగే ఏ ప్రశ్నపై విడుపు లేకుండా పట్టుతో ఉండాలన్నదీ ఆ జర్నలిస్టు నియంత్రణలోనే ఉంటుంది. ఒక ప్రశ్నకు ప్రధాని నుంచి సంతృప్తికరమైన సమాధానం వచ్చే వరకు ఆ ప్రశ్నను కొనసాగించే హక్కును ఆ పాత్రికేయుడు కలిగి ఉంటాడు. నిజాన్ని నిగ్గు తేల్చే విధానం అది. అలాంటి జర్నలిస్టు విషయాలన్నీ బాగా తెలిసినవాడై, నిర్భీతి, దృఢచిత్తం గలవాడై ఉండాలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కచ్చితంగా అయితే అతడు ప్రధాని ముందు నీళ్లు నమలనివాడై ఉండాలి. జిహ్వకు చాపల్యాన్ని అంటించే రుచికరమైన బ్రిటిష్ రాజకీయ వర్గ అసంబద్ధ అంతర్గత కథనాలతో రాబ్ బర్లీ అనే బ్రిటిష్ టీవీ ప్రొడ్యూసర్ తాజాగా వండి వార్చిన ‘వై ఈజ్ దిస్ లైయింగ్ బాస్టర్డ్ లైయింగ్ టు మి?’ అనే పుస్తకంలో ఇలా రాశారు: ‘‘రాజకీయ ఇంటర్వ్యూలు అనేవి అధికారంలో ఉన్నవారిని ప్రజలకు పూచీ పడేలా చేయడానికే తప్ప, నాయకులకు లబ్ధిని చేకూర్చడానికి కాదు. అవి ఉన్నది ప్రజా ప్రయోజనాల కోసం.’’ దేశ అత్యున్నత పదవికి అభ్యర్థులైన వారి యోగ్యతను రాజకీయ ఇంటర్వ్యూల ద్వారా ఎలా అంచనా వేయవచ్చో బర్లీ ఈ పుస్తకంలో చెబుతున్నప్పటికీ, ఇప్పటికే అధికారం మాటున దాగి ఉన్నవారికి కూడా ఆయన మాట వర్తిస్తుంది. ‘‘అటువంటి ఇంటర్వ్యూలు మన రాజకీయ సంస్కృతి స్వభావం, సమర్థత, విశ్వసనీయతలను బహిర్గతం చేయడానికి తోడ్పడే ఉత్తమ సాధనాలు. వాటి గురించి మనం గట్టిగా అడగాలి.’’ మోదీ కూడా రాజకీయ ఇంటర్వ్యూలు ఇచ్చారు. నిజానికి చాలానే ఇచ్చారు. ప్రశ్న ఏమిటంటే, ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులు ఎలాంటివారు? ఎలాంటి అంశాలను వాళ్లు ప్రధాని ముందు లేవనెత్తారు? ఎంత త్వరగా వాళ్ల ప్రశ్నల గేలం ప్రధానిని విడిచిపెట్టింది? ఈ ప్రశ్నలన్నిటి సమాధానాల కోసం మునుపటి ఇంటర్వ్యూలను చూడండి. అవి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఆ ఇంటర్వ్యూలు మోదీ తనేం చెప్పదలిచారో అవి చెప్పడానికీ, తరచూ ప్రతిపక్షాలను విమర్శించడానికీ కానుకగా అందివచ్చిన వేదికలు. బ్రిటిష్ బ్రాడ్క్యాస్టర్లు జెరెమి పాక్స్‌మ్యాన్, బ్రియాన్ వాల్డెన్స్ తమ రాజకీయ ఇంటర్వ్యూల కారణంగానే ప్రత్యేకంగా నిలిచిపోయారు. వాల్డెన్ తన సంధింపులతో బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌ను గుక్క తిప్పుకోకుండా చేశారు. పాక్స్‌మ్యాన్ అప్పటి బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి మైఖేల్ హోవర్డ్‌ను అడిగిన ప్రశ్ననే పన్నెండుసార్లు అడిగి ఆయన్ని గుటకలు వేయించారు. రెండు ఇంటర్వ్యూలలో అవి ముగిసే సమయానికి థాచర్, హోవర్డ్ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. చెప్పకపోవడం కాదు, చెప్పలేకపోవడం! ఆ చెప్పలేకపోవడమే ప్రజలకు వారిని జవాబుదారీగా చేసింది. మన ప్రధానులను కూడా ఇంత కఠినంగా, కనికరం లేకుండా ప్రశ్నించగల రోజు వస్తే, మన రాజకీయాలలో నాటకీయమైన మార్పును చూస్తాం. మన రాజకీయ నాయకులు మారతారు. మనతో అబద్ధాలు చెప్పడం మానేస్తారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
విలువల్లోనూ పట్టువిడుపులు!
వాజ్‌పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు అభిషేక్ చౌధరి. అటల్ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్‌పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటారాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేక పోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టుకోవాలా? ‘మహాత్ముడి మరణాన్ని అటల్ అస్సలేమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు’ అని చౌధరి రాశారు. అయితే యౌవనానంతర దశలో పరిణతి కలిగిన నాయకుడిగా తన పూర్వపు ధోరణికి భిన్నంగా అటల్ బిహారీ వాజ్‌పేయి మారిపోయారు. అటల్ బిహారీ వాజ్‌పేయి గురించి మనకు తెలుసనే అనుకుంటాం. నిజంగానే మనకు తెలుసా? ఎందరికో ఆయన ఆరాధ్యులు. చాలామందికి ఆయనొక మంచి ప్రధాని కూడా. ఇక ఆయన వాగ్ధాటికైతే మంత్రముగ్ధులు కానివాళ్లెవరు! అయిన ప్పటికీ, ఆయనేమిటో పూర్తిగా మనకు తెలుసా? వాజ్‌పేయి ఛాయ వెనుక ఉన్న వాజ్‌పేయి గురించి మనకు తెలుసా? ఇటీవల విడుదలైన వాజ్‌పేయి జీవిత చరిత్రలో మనకు తెలి యని, మనం ఊహించని ఎన్నో అంశాలు ఉన్నాయి. అవి మాత్రమే కాదు, ఆయన గురించి కచ్చితమైనవిగా మనం ఇప్పటివరకూ భావిస్తూ వస్తున్న కొన్ని కథనాలకు రుజువులు లేవని ఆ పుస్తకం ద్వారా తెలుస్తుంది. సంప్రదాయబద్ధం కాని వాజ్‌పేయి వ్యక్తిగత జీవితాన్ని కూడా పుస్తకం స్పృశించింది. ఆయనను బాగా ఎరిగిన వాళ్లు సైతం వాజ్‌పేయిలోని ఈ అసంప్రదాయపరత్వాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. తాజాగా అభిషేక్ చౌధరి రాసిన ‘వాజ్‌పేయి: ది అసెంట్ ఆఫ్ ది హిందూ రైట్ 1924–1977’ అనే పుస్తకంలోని విశేషాలు ఇవన్నీ. రెండు సంపుటాల ప్రయత్నంలోని మొదటి భాగం ఇది. రెండో భాగం డిసెంబరులో రానుంది. వాజ్‌పేయి ఆహార ప్రియులనీ, విలాసజీవుడనీ మనం విన్నాం. ‘భంగ్ ఆయనకు ప్రీతికరమైనది. తగు మోతాదుల్లో సేవించేవారు’. ‘చైనా వంటల్ని అదే తన జీవితేచ్ఛ అన్నట్లుగా ఆరగించేవారు’. న్యూయార్క్‌లో ఉన్నప్పుడు రాత్రి క్లబ్బులు ఆయన్ని రంజింప జేశాయి. ఆ అనధికార సందర్శనలలో ఒకటీ అరా పెగ్గులు మనసారా గ్రోలేవారు. చౌధరి అనడం అటల్ తన యౌవనంలో ముస్లిం వ్యతిరేకి అని. ‘జీవిక కోసం భారతదేశాన్ని ఎంపిక చేసుకున్న ముస్లింలను దేశ ద్రోహులుగానే చూడాలని అటల్ వాదించేవారు’ అని రాశారు. అటల్ ‘రాష్ట్రధర్మ’ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో ముస్లింలను ‘ఫిప్త్ కాలమిస్ట్‌లు’ (ఆశ్రయమిచ్చిన దేశంలో ఉంటూనే ఆ దేశానికి వ్యతి రేకంగా పోరాడేవారు) అని పేర్కొన్నారు. యౌవనానంతర దశలో మాత్రం తన పూర్వపు ధోరణికి పూర్తి భిన్నంగా ఆయన మారి పోయారు. అది నిజం. ఆ మార్పు ఎంత గొప్పదో చెప్పే వెల్లడింపులు కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. మహాత్మా గాంధీ పట్ల వాజ్‌పేయి వైఖరిని గురించి చెబుతూ, ‘మహాత్ముడి మరణాన్ని అటల్ అస్సలు ఏమాత్రం మానవాళికి సంభవించిన తీవ్రమైన నష్టంగా పరిగణించనే లేదు. అటల్ రాసిన అనేక వ్యాసాలు దేశ విభజనకు కారకుడిగా మహాత్ముడినే బాధ్యుడిని చేశాయి. నీతి కాని రీతిలో ముస్లింలను గాంధీజీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేయడం అన్నది ఆయన్ని హత్య చేసేంతగా పర్యవసాన పరిణా మాలను విషతుల్యం చేసిందని అటల్ విమర్శించారు’ అని అభిషేక్ రాశారు. ఇదేమైనా నిందను సంకేతిస్తోందా? కావచ్చు. వాజ్‌పేయి గురించి బాగా ప్రచారంలో ఉన్న కొన్ని కథనాల్లో అసలు నిజమే లేదనీ, అవి కేవలం అపోహలేననీ ఈ పుస్తకం తేల్చే స్తుంది. 1971 భారత్–పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన డిసెంబర్ 16వ తేదీ నాడు ఇందిరాగాంధీని దుర్గాశక్తిగా అటల్ కీర్తించారని ఒక కథనం. అయితే అది నిజం కాదని, ‘ఆ సాయంత్రం అటల్ పార్లమెంటులోనే లేరు. అప్పుడు ఆయన ఏదైనా ప్రయాణంలో గానీ, లేదా స్వల్ప అస్వస్థతతో గానీ ఉండి ఉండాలి’ అని అభిషేక్ రాశారు. అలాగే, అటల్ గురించి నెహ్రూ గొప్పగా భావించేవారనీ, ఆయనను భావి భారత ప్రధానిగా గుర్తించేవారనీ ఒక ప్రచారం ఉంది. అది అబద్ధం కాదు. అయితే మునుపు మనకు తెలియని విషయం ఒకటి కూడా ఈ పుస్తకంలో ఉంది. తొలినాళ్లలో అటల్‌పై నెహ్రూ అభిప్రాయం ఇంకోలా ఉండేదని! మొదట్లో ఆయన వాజ్ పేయిని ‘అత్యంత అభ్యంతరకరమైన వ్యక్తి’గా భావించారు. ‘జమ్మూలో మితిమీరిన తెంపరితనాన్ని ప్రేరేపిస్తున్నాడు’, ‘అతడిని జమ్మూలోకి అడుగుపెట్టనివ్వకండి’ అని నెహ్రూ తన క్యాబినెట్ కార్యదర్శి విష్ణు సహాయ్ని కోరినట్లు ఈ పుస్తకం చెబుతోంది. స్వాతంత్య్రోద్యమంలో వాజ్‌పేయి పాత్ర లేదన్న కాంగ్రెస్ వాదనను కూడా రచయిత కొట్టిపారేశారు. ‘గ్వాలియర్‌లో జరిగిన క్విట్ ఇండియా నిరసనల్లో వాజ్‌పేయి పాల్గొన్నారన్నది నిజం’. మరీ ముఖ్యంగా, బ్రిటిష్ వారికి అటల్ సమాచారం చేరవేస్తుండేవాడు అని ‘బ్లిట్జ్’ పత్రిక కలిగించిన ప్రేరేపణ పచ్చి అబద్ధం.’ మిమ్మల్ని ఆశ్చర్యపరచగల మరికొన్ని ముఖ్యమైన వివరాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. బాల్యంలో వాజ్‌పేయి పేద విద్యార్థి. స్కూల్లో చాలా అరుదుగా మాత్రమే ఆయనలోని ప్రతిభ బయట పడేది. ‘పాంచజన్య’ పత్రిక మాత్రం ఆయన్ని ఆకాశానికెత్తింది. అటల్ ఎప్పుడూ తరగతిలో రెండో స్థానంలో నిలవలేదని రాసింది. ఆయనకు ఎల్ఎల్బి డిగ్రీ ఉందన్న మాటలో కూడా నిజం లేదు. నిజానికి, ‘అటల్ లా డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేశారు.’ శ్రోతల్ని కట్టిపడేసే వక్తగా ప్రసిద్ధి చెందిన మనిషి, తన తొట్టతొలి స్కూల్ డిబేట్లో ఘోరంగా ఓడిపోయాడని తెలుసుకోవడం నన్ను ఆహ్లాదపరిచింది. ‘అతడి కాళ్లు చల్లబడ్డాయి. తడబడటం మొదలు పెట్టాడు. ప్రసంగ పాఠం మర్చేపోయాడు. అదొక అవమానకరమైన అనుభవం. సాటి విద్యార్థుల ఆనాటి వెక్కిరింతల్ని జీవితాంతం ఆయన గుర్తుచేసుకుంటూనే ఉన్నారు’. వాజ్‌పేయిని ‘భావోద్వేగాల ఒంటరితనంలో నిరాశ్రయుడైన పురుష బాలకుడి’గా అర్థం చేసుకున్నారు పుస్తక రచయిత. అటల్ సంక్లిష్టమైన వ్యక్తిగత జీవితానికి అది తగిన వివరణ కాగలదా? వాజ్ పేయిని ‘విలువల్లోనూ పట్టువిడుపులు పాటించే మనిíషి’ అంటా రాయన. 2002లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేంద్ర కేబినెట్ సహచరుల అభీష్టానుసారం ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి చేత రాజీనామా చేయించలేకపోవడానికి ఈ పట్టువిడుపుల స్వభావం నుంచే మనం సమాధానాన్ని రాబట్టు కోవాలా? రెండవ సంపుటి కూడా మొదటి సంపుటం మాదిరిగానే అనేక విశేషాలతో కూడి ఉన్నట్లయితే 1977–2004 మధ్య వాజ్‌పేయి గురించిన సత్యాలను తెలుసుకోడానికి నేను ఎక్కువ కాలం వేచి ఉండలేను. అది ఉత్తమ భాగం అవుతుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్