కామెంట్
భారతీయ పౌరులకు ఒకటే పౌరసత్వం ఎందుకు ఉండాలి? పౌరసత్వం అనేది పుట్టుకతో మాత్రమే సంక్రమించే ప్రత్యేక హక్కు కాదు. అది పౌరుడి సొంత గుర్తింపును వెల్లడించడంతో పాటు బహుళజాతి పూర్వీకుల వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇండియా ప్రయోజనాలకు విఘాతం కలిగించే శత్రుదేశాల పౌరులను ఇండియా పౌరులుగా ఎలా గుర్తిస్తామన్నది ఒక వాదన. ఇది చాలా చిన్న సమస్య. ఈ సాకుతో మొత్తంగా ద్వంద్వ పౌరసత్వం మీద వేటు వేయడం సరికాదు. ఒక వ్యక్తి బ్రిటిష్ లేదా అమెరికా పౌరుడు కూడా అయినంత మాత్రాన అతడి భారతీయత ఎలా తగ్గిపోతుంది? నూతన సంవత్సరంలోనైనా ఈ సంకుచిత వైఖరి మీద పునరాలోచన చేయాలి.
2025 వచ్చేసింది. కొత్త సంవత్సరం అనగానే విధిగా కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. నేను ఇది మానేస్తాను, అలా ఉంటాను అంటూ ప్రతిజ్ఞలు చేస్తాం. వాటితో పాటు... ఒక విష్ లిస్ట్ కూడా పెట్టుకుంటాం. నాకు అది కావాలి, ఇలా జరగాలి అని కోరుకుంటాం. నేనూ ఈ విషయంలో తక్కువేం కాదు. చాలా తీర్మానాలు తయారు చేసుకుంటా! కొద్ది రోజుల తర్వాత షరా మామూలు. ఒట్లన్నీ గట్టున పెట్టేస్తానేమో! అందుకే నా విష్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం.
నాది చాలా సింపుల్ కోరికే. కానీ అది నెరవేరితే లబ్ధి పొందేది నేనొక్కడినే కాదు, కొన్ని లక్షల మంది ఉంటారు! భారతీయ పౌరులకు ఒకటే పౌరసత్వం ఎందుకు ఉండాలి? మరో దేశపు జాతీయత కూడా పొందే అవకాశం ఎందుకు కల్పించకూడదు? ప్రభుత్వం ఈ డ్యూయల్ నేషనాలిటీ హక్కును మన్నించాలి. తల్లి దండ్రుల మాతృదేశం పరంగా కావచ్చు, నివాసం రీత్యా అవ్వచ్చు... ఒక వ్యక్తి ఇలాంటి హక్కు పొందగలిగినప్పుడు దాన్నెందుకు నిరాకరించాలి?
పౌరసత్వం అనేది పుట్టుకతో మాత్రమే సంక్రమించే ప్రత్యేక హక్కు కాదు. అది పౌరుడి సొంత గుర్తింపును వెల్లడించడంతో పాటు బహుళజాతి పూర్వీకుల వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పుకుందాం. తల్లిదండ్రులు బ్రిటిష్, ఇండియా దేశాల వారు అనుకోండి. వారి పిల్లలకు ఏకకాలంలో అటు బ్రిటిషర్లు, ఇటు ఇండియన్లు అయ్యే హక్కు ఉంటుంది.
అలా కాకుండా, ఇండియా పౌరసత్వం కావాలంటే బ్రిటిష్ పౌరసత్వం వదులుకోవాలని పట్టుపట్టడం న్యాయం కాదు. అదేమాదిరిగా విదేశాల్లో నివాసం ఉండేవారికి... స్వదేశంలో హక్కు కోల్పోకుండా నివాస దేశంలో పౌరసత్వం తీసుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు భారతీయ చట్టాల ప్రకారం, ఈ రెండూ నిషిద్ధం.
ఉన్నత ప్రజాస్వామ్య దేశాలుగా మన్నన పొందిన చోట్లా ఈ ద్వంద్వ పౌరసత్వ హక్కు లేదు కదా అంటారు. నిజమే. ఆస్ట్రియా, జపాన్, నెదర్లాండ్స్, నార్వేలు ఈ కోవలోకి వస్తాయి. ద్వంద్వ పౌర సత్వ నిరాకరణను వారు అప్రజాస్వామిక విధానంగా పరిగణించరు. కాకపోతే అనుమతించే దేశాల గురించి చెబుతాను.
ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, డెన్మార్క్ , ఫ్రాన్స్, ఐర్లాండ్, స్వీడన్, యుకే, యూఎస్‌ఏ వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ అత్యంత గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశాలే! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకునే ఇండియా వీటి సరసన చేరాలని ఎందుకు అనుకోదు?
వాస్తవానికి, మన పొరుగున ఉన్న అనేక దేశాలు ద్వంద్వ జాతీయతను అనుమతిస్తున్నాయి. బంగ్లాదేశ్‌కు సమ్మతమే. శ్రీలంకదీ అదే బాట. ఆఖరుకు పాకిస్తాన్ కూడా అనుమతిస్తోంది. ఎటొచ్చీ చైనా, బర్మా, నేపాల్ ససేమిరా అంటాయి. అయితే, ఈ దేశాలా మనకు ఆదర్శం?
ద్వంద్వ పౌరసత్వం అనుమతించక పోవడానికి అడ్డు పడే కారణాలు ఏంటో చూద్దాం. ఇండియా ప్రయోజనాలకు విఘాతం కలిగించే శత్రుదేశాల పౌరులను ఇండియా పౌరులుగా ఎలా గుర్తిస్తామన్నది వీటిలో ఒకటి. ఇది చాలా చిన్న సమస్య. ఈ సాకుతో మొత్తంగా ద్వంద్వ పౌరసత్వం మీద వేటు వేయడం సరికాదు. పాకిస్తాన్ పదహారు దేశాలను గుర్తించి వాటికి మాత్రమే ద్వంద్వ పౌరసత్వ విధానం అమలు చేస్తోంది. ఇండియా ఈ జాబితాలో లేదు. ఇలాంటి వ్యతిరేక దేశాల జాబితా రూపొందించుకోవాలి. వాటిని పక్కన పెట్టాలి.
ద్వంద్వ పౌరసత్వ నిషేధాన్ని సమర్థించుకునేందుకు చెప్పే మరో ప్రధాన కారణం ఏమిటంటే, అలా అనుమతిస్తే భారతీయ పౌరసత్వ ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇది అర్థం లేనిది. వేరేది తీసుకోగలిగిన వారు ఇండియా పౌరసత్వం అక్కర్లేదు అనుకుంటే, ఎప్పుడు కావా లంటే అప్పుడు వదిలేస్తారు.
ఇతర దేశాల్లో పౌరసత్వం ఉండి కూడా భారత జాతీయతను కొనసాగించాలి అనుకునేవారూ ఉంటారు. వారికి ఈ ద్వంద్వ పౌరసత్వం ముఖ్యమైన అంశం అవుతుంది. ఒక వ్యక్తి బ్రిటిష్ లేదా అమెరికా పౌరుడు కూడా అయినంత మాత్రాన అతడి భారతీయత ఎలా తగ్గిపోతుంది? అలా అని చెప్పి ఈ హక్కు నిరాకరించడం ఎలా సబబు?
ఇలా కోరుకునేవారు అతి కొద్ది మందే ఉంటారు, కేవలం వారి కోసం ప్రత్యేక చట్టం ఉండాలా అన్నది కొందరి వాదన. ఎందుకు ఉండకూడదన్నది నా సమాధానం.
ప్రవాస భారతీయులను అన్ని ప్రభుత్వాలూ ఏదో విధంగా దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించాయి. వారికి ‘పర్సన్స్ ఆఫ్ ఇండి యన్ ఆరిజిన్’, ‘ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా’ కార్డులు ఇచ్చాయి. వ్యవసాయ భూమిపై యాజమాన్య హక్కు, ఓటు హక్కు, ప్రభుత్వ పదవులు మినహా ఇతరత్రా అన్నిటికీ వారు అర్హులు. అలాంటప్పుడు, ద్వంద్వ పౌరసత్వంతో అదనంగా లభించేది ఏమిటి?
సింపుల్‌గా చెప్పాలంటే, విదేశీ ప్రయాణం అత్యంత సులభం అవుతుంది. ఉదాహరణకు, బ్రిటిష్ లేదా అమెరికా పౌరసత్వం ఉన్న పాకిస్తానీయులు యూరప్ అంతటా వీసాల్లేకుండా పర్యటించవచ్చు. ఇండియా పాస్‌పోర్ట్ దారుడికి ఈ సౌలభ్యం లేదు. భారత పౌరులు పర్యటన వీసాలు సంపాదించడానికి నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. చాలామందికి ఇది ప్రధానమైన అంశమే.
కాబట్టి, 2025 నూతన సంవత్సరంలోనైనా నరేంద్ర మోదీ గానీ రాహుల్ గాంధీ గానీ ఈ ద్వంద్వ పౌరసత్వం విషయంలో తమ పార్టీల సంకుచిత వైఖరి మీద పునరాలోచన చేయాలి. అవకాశం ఉన్న భారత పౌరులు రెండో పౌరసత్వం పొందేందుకు అంగీకరించాలి. ఎవరికీ ఎలాంటి నష్టం లేకుండా వారికి ప్రయోజనం చేకూర్చవచ్చు. ఇది న్యాయం. అర్థవంతం. ఇదే నా న్యూ ఇయర్ విష్!
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment