Indian citizens
-
EC: ఓటర్లకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో మొత్తంగా 64.2 కోట్ల మంది భారతీయ పౌరులు ఓటు హక్కును వినియోగించుకుని నూతన ప్రపంచ రికార్డును సృష్టించారని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు. దేశ చరిత్రలో తొలిసారి ఓట్ల లెక్కింపునకు ముందు తోటి కమిషనర్లతో సహా సీఈసీ సోమవారం ఢిల్లీలో పత్రికాసమావేశం ఏర్పాటుచేసి పలు అంశాలపై మాట్లాడారు. జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ ‘‘ 31.2 కోట్ల మంది మహిళలుసహా 64.2 కోట్ల మంది ఓటేశారు. ఈ సంఖ్య జీ7 దేశాల ఓటర్ల కంటే 1.5 రెట్లు ఎక్కువ. 27 యురోపియన్‌యూనియన్ దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లందరికీ అభినందనలు’’ అంటూ సీఈసీ వేదికపై లేచి నిలబడి ఓటర్లకు అభినందనలు తెలిపారు. ‘‘ఎన్నికల సిబ్బంది జాగ్రత్త, అప్రమత్తత వల్లే తక్కువ చోట్ల మాత్రమే రీపోలింగ్ చేపట్టాల్సి వచి్చంది. 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగితే ఈసారి 39 మాత్రమే జరిగాయి’’ అని పేర్కొన్నారు. మా గురించి మాట్లాడుకోరు ‘ 1.5 కోట్ల పోలింగ్, భద్రతా సిబ్బంది పోలింగ్ పర్వంలో పాల్గొన్నారు. 4 లక్షల వాహనాలను వినియోగించాం. 135 ప్రత్యేక రైళ్లలో సిబ్బంది, బలగాలను తరలించాం. 1,692 సార్లు హెలికాప్టర్లను వాడాం. కరెన్సీ కట్టలు, ఉచిత తాయిలాలుగా పంపిణీచేస్తున్న వస్తువులు, మద్యం, మత్తుపదార్థాలు సహా రూ.10,000 కోట్లు సీజ్‌చేశాం. ఇంత చేస్తే ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూల జాడ లేదంటూ ‘లాపతా జెంటిల్మెన్’ అని మీమ్స్ వేస్తున్నారు. మేం ఎక్కడికీ పోలేదు. మీ ముందే ఉన్నాంకదా. ఎప్పుడూలేనంతగా ఎన్నికలవేళ 100 పత్రికా ప్రకటనలు, అడ్వైజరీలతో అందర్నీ చైతన్యపరిచాం. మమ్మల్ని చూశాకైనా ‘లా పతా జెంటిల్మెన్ ఆర్ బ్యాక్’ అని మీమ్స్ మారుస్తారేమో. విరబూసిన పువ్వులనే చూస్తారుగానీ తోటమాలిని ఎవరూ పట్టించుకోరు. ప్రజాస్వామ్యంలో గెలుపుఓటములనే అందరూ పట్టించుకుంటారుగానీ సమర్థవంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించిన మా గురించి ఎవరూ మాట్లాడుకోరు’’ అని అన్నారు. దమ్ముంటే నిరూపించండి ‘‘ ఎన్నికలను విదేశీ శక్తులు ప్రభావితం చేసే ప్రమాదముందని, వాటిని అడ్డుకునేందుకు మేం ఎప్పుడో సిద్ధమయ్యాం. తీరాచూస్తే ఇక్కడి విపక్షాలే అనవసర ఆరోపణలు చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రభావితం చేయనున్నారని రిటర్నింగ్ అధికారులపై విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. దమ్ముంటే మీ ఆరోపణలను సాక్ష్యాధారాలతో నిరూపించండి. పుకార్లు వ్యాపించజేసి అనుమాన మేఘాలు కమ్ముకునేలా చేయకండి. రిటరి్నంగ్ అధికారులుగా పనిచేసే జిల్లా మేజి్రస్టేట్, కలెక్టర్లపై మీరు చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే కౌంటింగ్‌కు ముందే వారిపై కఠిన చర్యలకు మేం సిద్ధం’ అని అన్నారు. ఎన్నికల తర్వాత హింసనూ అడ్డుకుంటాం ‘‘ ఎన్నికల కోడ్ ముగిసినా సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు కొనసాగుతాయి. ఫలితాలు వచ్చాక ఎన్నికల తర్వాత హింసను అడ్డుకునే లక్ష్యంగా తొలిసారిగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నాం. ఎన్నికల వేళ ఘర్షణ ఘటనలు చోటుచేసుకున్న పశి్చమబెంగాల్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్‌సహా పలు రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మొహరిస్తాం. రాష్ట్రాలు, కేంద్ర పరిశీలకుల సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఏపీ, బెంగాల్‌లలో ఓట్ల లెక్కింపు తర్వాత 15 రోజులపాటు, యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌లో రెండు రోజులపాటు బలగాలు కొనసాగుతాయి’’ అని సీఈసీ వివరించారు. జమ్మూకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి జమ్మూకశీ్మర్‌లో నాలుగు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా గరిష్టంగా 58.58 శాతం పోలింగ్ నమోదైంది. కశీ్మర్ లోయలో గరిష్టంగా 51.05 శాతం రికార్డయింది. సెపె్టంబర్ 30లోపు జమ్మూకశీ్మర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. అందుకే అక్కడ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు తలకెత్తుకుంటాం. ఇవి నిజంగా అత్యంత సంతృప్తికరమైన క్షణాలు అని అన్నారు. -
లండన్ అమ్మాయి.. మంచిర్యాల అబ్బాయి
మంచిర్యాల: లండన్ అమ్మాయి.. బెల్లంపల్లి అబ్బాయి పరిచయం ప్రేమగా మారింది.. ఒకరి నొకరు ఇష్టపడ్డారు.. దేశాలు వేరైనా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన కర్రె రాజు కొన్నాళ్ల క్రితం లండన్‌కు వెళ్లాడు. అక్కడ ఓ షాపింగ్ మాల్లో పని చేస్తుండగా డయానా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. ఆచారాలు, సంప్రదాయాలు వేరైనా పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. బెల్లంపల్లిలోని ఏఆర్ కన్వెన్షన్‌లో గురువారం రాజు డయానాకు తాళి కట్టి తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. చీరకట్టుతో పెళ్లిపీటలపై కూర్చున్న వధువు డయానా అందరి దృష్టిని ఆకర్శించింది. వీరి పెళ్లికి వధువు తల్లిదండ్రులు రాకపోవడంతో రాజు కుటుంబీకులు అన్నీ తామై వ్యవహరించి పెళ్లి జరిపించారు. -
ఉమ్మడి బాటలో భిన్నాభిప్రాయాలు
ఆదేశిక సూత్రాలకే పరిమితమైన ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) అంశం మళ్లీ తెరమీదికొచ్చింది. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, పోషణ, భరణం వంటి కుటుంబ, వ్యక్తిగత అంశాల్లో ఒకే పౌర నియమాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదేశిక సూత్రాలలో చేర్చడమంటే ఒక విస్తృత ప్రయోజనమున్న చట్టాన్ని బీరువాలకు పరిమితం చేయడం కాదనీ, దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలన్నది ప్రజాస్వామిక వ్యవస్థకు గీటురాయనీ ఒక వాదన. అదే ఆదేశిక సూత్రాలలో ఉన్న సమానత్వం, విద్య, వైద్యం, ఉపాధి వగైరా లాంటి అంశాలకు చట్టాలు ఎందుకు చేయరనీ, ఇది కేవలం ఎన్నికల ఎత్తుగడ మాత్రమేననీ మరొక వాదన. సమానత్వ సిద్ధాంతం మిగిలిన చట్టాల మాదిరిగానే ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) కూడా 1948 లోనే రాజ్యాంగంలో ఒక చట్టంగా చోటు చేసుకోకపోవడానికి ప్రధాన కారణం, ఆనాటి పరిస్థితులు. అందరికీ మానసిక సంసిద్ధత సమకూరిన తరువాతనే దానిని తెచ్చే ఆలోచన చేయడం మంచిదన్నది ఒక దశలో రాజ్యాంగ పరిషత్ అనివార్యంగా తీసుకున్న నిర్ణయం. ఫలితంగానే ఆ ఆలోచన ఆదేశిక సూత్రాలకు (44వ అధిక రణ) పరిమితమైంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత హింసాత్మక, విషాద ఘట్టంగా చెప్పుకొనే భారతదేశ విభజన, నాటి మత ఉద్రిక్తతలు రాజ్యాంగ పరిషత్ పెద్దలను అలాంటి వాయిదా నిర్ణయానికి పురిగొల్పాయి. ఆదేశిక సూత్రాలలో చేర్చడమంటే ఒక విస్తృత ప్రయోజనమున్న చట్టాన్ని బీరువాలకు పరిమితం చేయడమైతే కాదు. దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలన్నది ప్రజాస్వామిక వ్యవస్థకు గీటురాయి. మతసూత్రాల ఆధారంగా పర్సనల్ లా చెల్లుబాటు అయితే రాజ్యాంగమే చెబుతున్న సెక్యులరిస్టు వ్యవస్థలో ఆ భావనకే భంగపాటు. షాబానో విడాకుల కేసు, మనోవర్తి వివాదం మొదలు (1985) ఇటీవలి కాలం వరకు సుప్రీంకోర్టు కూడా ఉమ్మడి పౌర స్మృతి గురించి కేంద్రానికి గుర్తు చేయడమే కాదు, ఒక సందర్భంలో నిష్టూరమాడింది కూడా. రాజకీయ చర్చలు, చట్టసభలలో వాగ్యుద్ధాల స్థాయి నుంచి ఎన్నికల హామీ వరకు ఉమ్మడి పౌరస్మృతి ప్రయాణించింది. స్వాతంత్య్రం వచ్చిన తరు వాత 1948 నవంబర్ 23న తొలిసారి దీని రూప కల్పన ఆలోచన తెరమీదకు వచ్చింది. రాజ్యాంగ పరిషత్‌లో ఈ ప్రస్తావన తెచ్చినవారు కాంగ్రెస్ సభ్యుడు మీను మసానీ. ఇప్పుడు ఆ పార్టీ ఈ అంశం మీద నీళ్లు నమలడం ఒక వైచిత్రి. అంబేడ్కర్, నెహ్రూ, పటేల్, కృపలానీ వంటి వారంతా దీనిని సమర్థించారు. దీని గురించి ప్రతికూల వైఖరి తీసు కుంటున్నవారు ఈ చట్టం ద్వారా మేలు పొందేది మహిళలే అన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. రాజ్యాంగ పరిషత్‌లో హన్సా మెహతా సహా 15 మంది మహిళలు దీని కోసం తపించారు. ఈ స్ఫూర్తి బుజ్జగింపు ధోరణిలో కొట్టుకుపోకుండా చూసు కోవలసిన బాధ్యత ఇవాళ్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానిదే. ఉమ్మడి పౌర స్మృతితో దేశం సంత రించుకునే అంశాలుగా చెప్పినవి: స్త్రీ పురుష సమానత్వం, జాతీయ సమైక్యత, సమగ్రత, లౌకికవాదం, వ్యక్తిగత హక్కుల రక్షణ, న్యాయవ్యవస్థ ఆధునీకరణ, భిన్న ఆచారాల సమన్వయం. ఇవన్నీ స్వాతంత్య్రం వచ్చిన ఏడున్నర దశాబ్దాలకు కూడా పౌరులందరికీ సమానంగా లేక పోవడం ఒక దుఃస్థితిని సూచిస్తుంది. మద్రాస్ నుంచి రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన మహమ్మద్ ఇస్మాయిల్ దీన్ని వ్యతిరేకించినవారిలో మొదటివారు. నజీరుద్దీన్ అహ్మద్, మెహబూబ్ అలీ బేగ్, బి.పొకార్ సాహెబ్, అహమ్మద్ ఇబ్రహీం, హస్రత్ మొహానీ ఆయన వెనుక నిలిచారు. ఈ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి వారు ఎన్నుకున్న నినాదం ‘ఇంక్విలాబ్ జిందాబాద్’. ఇది కూడా ఒక చారిత్రక వైచిత్రి. వీరి వాదనలోని అంశాలు తమ మత,సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకోవడం, ఉమ్మడి పౌర స్మృతి వస్తే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పడం. ఇప్పుడు కూడా అవే కారణాలు వినిపిస్తున్నాయి. అందుకే దీని మీద చర్చ అనివార్యం. ఇందుకు దోహదం చేస్తున్నదే 22వ లా కమిషన్ పిలుపు.ఏదో ఒక కాలంలో ప్రతి మతం స్త్రీని చిన్నచూపు చూసిన మాట వాస్తవం. ఒకనాడు హిందూధర్మం కూడా ఇలాంటి బంధనాలలోనే ఉన్నా, హిందూ కోడ్‌తో చాలావరకు ఆ దుఃస్థితి నుంచి మహిళకు రక్షణ దొరికింది. ఇలాంటి రక్షణ ఏ మతం వారికైనా లభించాల్సిందే. విడాకులు, వివాహం వంటి వ్యక్తిగతఅంశాల్లో దేశ పౌరులందరికీ ఒకే న్యాయం అందించాలన్నదే యూసీసీ ధ్యేయం. విడాకులు పొందిన మహిళ ఎలాంటి ఆంక్షలు లేకుండా పునర్ వివాహం చేసుకునే వెసులుబాటు, దత్తత చట్టం అందరికీ ఒకే విధంగా ఉండడం కూడా ఇందులో భాగమే. ఆస్తిహక్కుకు, వివాహ వయసు 21 సంవత్సరాలు వంటి నియమాలకు మత, వర్గ, ప్రాంతాలతో నిమిత్తం లేకుండా యూసీసీ పాటు పడుతుంది. ఇవన్నీ స్వాగతించవలసిన అంశాలు. 13వ శతాబ్దానికి చెందిన అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా ఢిల్లీ మత పెద్దను కాదని షరియాలో మార్పులు తెచ్చాడు. 1937 నుంచి మాత్రమే భారతీయ ముస్లింలు అమలు చేసుకుంటున్న ముస్లిం పర్సనల్ లా విషయంలో ఇంత రాద్ధాంతం చేయడంలో అర్థం కనిపించదు. అలా అని ఆ పర్సనల్ లా యథాతథంగా అమలు చేయగలిగే శక్తి, కాఠిన్యం ఇవాళ వారిలోనూ లేవు. పాకిస్తాన్, ఈజిప్ట్, ట్యునీషియా వంటి దేశాల అనుభవాలు కూడా పర్సనల్ లా శిలాశాసనం కాదనే రుజువు చేస్తున్నాయి. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇటీవలనే హదిత్ (ముస్లిం న్యాయసూత్రాలు) పునర్ నిర్మాణానికి ఒక సంఘాన్ని నియమించారు. ఈ న్యాయసూత్రాలు ఉగ్రవాదానికి తోడ్పడకుండా ఉండేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. యూసీసీని బీజేపీ తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నది కాబట్టి అది హిందువుల కోసమేనని చెప్పడం ఆత్మవంచన. రాజ్యాంగ చరిత్ర ఒక మలుపు తీసుకుంటున్న సమయంలో మోకాలడ్డే ప్రయత్నం సరికాదు. పి. వేణుగోపాల్ రెడ్డి,వ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్’ వ్యవస్థాపక ఛైర్మన్ pvg2020@gmail.com ఎన్నికల రాద్ధాంతం ‘‘ఒక ఇంట్లో ఒకరికి ఒక చట్టం, మరొకరికి మరొక చట్టం ఉంటే ఆ ఇల్లు నడుస్తుందా? అలాంటి కపట వ్యవస్థతో దేశం ఎలా పనిచేస్తుంది?’’ అన్నారు బీజేపీ ఎన్నికల కార్యకర్తల సభలో ప్రధాని మోదీ. ఈ చర్చ సరైన వేదికపై చేయాలి. ప్రజలను రెచ్చగొట్టరాదు. ప్రశాంత జీవనానికీ, భిన్న కుల, మత, జాతి, సంస్కృతుల మధ్య భారతీయతకూ ‘భిన్నత్వంలో ఏకత్వం’ కారణం. ఈ భిన్నత్వం స్థానంలో వైదిక ఏకత్వాన్ని రుద్దాలన్నది ‘సంఘ్’ ఆకాంక్ష. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) చట్టాన్ని తేవాలన్నది మోదీ ఆలోచన. ఎన్నికలకు ముందు ముస్లిం మహిళల న్యాయసాధనకు పూనుకుంటారాయన. హిందూ స్త్రీలను పట్టించుకోరు. సాధికా రితకు మహిళా రిజర్వేషన్ చట్టం చేయరు. యూసీసీని అమలు చేయమని సుప్రీంకోర్టు అనేక సంద ర్భాలలో ఆదేశించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2024 ఎన్నికల లబ్ధికి ఇప్పుడు ఈ చట్టాన్నిముందుకుతెచ్చారు. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత, పోషణ, భరణం వంటి కుటుంబ, వ్యక్తిగత అంశాల్లో ఒకే పౌర నియమాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ మతాల ప్రజలు తరతరాలుగా ఆచరిస్తున్న పద్ధతులు, సంప్రదాయాలు అనేకం ఉన్నాయి. భార్యాభర్తలకు, కూతురు కొడుకులకు వేరువేరు దుస్సంప్రదాయాలున్నాయి. అయితే భావజాలం కుదరని చోట చట్టాలతో, చట్టాలు పనిచేయనిచోట భావజాలంతో వీటిని సరిదిద్దాలి. ఏకరీతి పౌరసూత్రాల ప్రస్తావన ప్రాథమిక హక్కుల్లో లేదు. రాజ్య విధానాల ఆదేశిక సూత్రాలు ఆసక్తికరమైనవి. వీటి ప్రకారం ప్రభుత్వం శాసన, కార్యనిర్వాహక విధులు నిర్వహించాలి. ఇవి మార్గదర్శకాలే. వీటిని న్యాయవ్యవస్థ ద్వారా అమలుచేయలేము. వీటిని న్యాయస్థానాలలో సవాలు చేయగల చట్టాలను చేయరాదు. సంస్క రణల ద్వారా ఈ సూత్రాలను సాధించాలి. దేశ పౌరులకు ఏకరీతి పౌర నియమావళిని పదిలపర్చే పని రాజ్యం చేయాలని ఆదేశిక సూత్రం 44 చెప్పింది. ఒకేసారి చట్టం చేయరాదనీ, సంస్కరణలతో సాధించాలనీ వివరించింది. ఆదేశిక ఆదేశాలలో సమానత్వం, విద్య, వైద్యం, ఉపాధి, జీవన వేతనాలు, పోషకాహార సరఫరా వగైరా చాలా అంశాలున్నాయి. వీటి అమలుకు మాత్రం చట్టాలు చేయరు. యూసీసీ అమలులో చిక్కులున్నాయి. దీనిపై ఇప్పటి వరకు జరిగిన రాజ్యాంగ, శాసన చర్చలను పరిగణించాలి. విభిన్న జాతుల, మతాల దేశంలో ఇది ఆచరణ సాధ్యం కాదని తేల్చింది. ఇది కోరదగ్గదే కాని ఐచ్ఛికంగా ఉండాలన్నారు రాజ్యాంగ ముసాయిదా సభ అధ్యక్షులు అంబేడ్కర్. యూసీసీ కంటే వివిధ కుటుంబ సంస్కరణలు స్త్రీ, శిశువుల శ్రేయస్సుకు హామీనివ్వగలవు. యూసీసీ ముస్లింల పైనేకాదు, ఇతర అల్పసంఖ్యాక వర్గాలపై, గిరిజనులపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. ఇది అనవసరం, అవాంఛనీయం అని 21వ లా కమిషన్ చెప్పింది. అయినా మరలా 22వ లా కమిషన్‌కు నివేదించడం, అదీ 30 రోజుల స్వల్ప వ్యవధిలో ప్రభావితుల అభిప్రాయాలు కోరడం ఆశ్చర్యం. అన్ని మతాల వ్యక్తిగత చట్టాలు మధ్యయుగ మహిళా ద్వేషాలే. ఈ విషయంపై చర్చ జరగదు.‘సంఘ్’ ముస్లిం వ్యక్తి చట్టాలనే విమర్శిస్తుంది. వైదికమత నియంతృత్వాన్ని స్థాపిస్తుంది. మత స్వేచ్ఛ హక్కునిచ్చే అధికరణ 25, మత సంస్థల స్థాపన, నిర్వహణ హక్కులను కల్పించే అధికరణ 26, మత మైనారిటీలకు ప్రత్యేక హక్కులనిచ్చిన అధికరణ 29లను యూసీసీ బలహీనపరుస్తుంది. ఉన్న చట్టాలను అమలుచేస్తూనే ఏకీకృతాన్ని సాధించవచ్చు. హిందువులకు కులరహిత ఏకరీతి సూత్రాలను శాసించాలి. ఆ తర్వాతే ఆదేశిక సూత్రాల జోలికి పోవాలి. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్య విలువలను, దేశ సమాఖ్య తత్వాన్ని, సమానత్వ అధికరణలను తుంగలో తొక్కింది. అధికరణ 47 ప్రకారం ప్రజారోగ్యానికి పోషకాహార స్థాయి, జీవన ప్రమాణాలను పెంచాలి. ఆరోగ్యానికి హానికరమైన మత్తుపానీయాలను, మాదక ద్రవ్యాలను నిషేధించాలి. యూసీసీకంటే ఇవి చాలా ముఖ్యం. సంఘ్‌కు ముస్లింల గుంపు కావాలి. వారిని చూపి హిందుత్వవాదులను రెచ్చగొట్టాలి. అయితే ప్రతిపక్షాలు దీనికి లౌకిక పౌర ప్రత్యామ్నాయ విరుగుడు పద్ధతులను చేపట్టలేదు. ఇప్పుడు విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం. యూసీసీ వద్దంటే ముస్లింవాదులనీ, వైదిక వ్యతిరేకులనీ నింద. సమర్థిస్తే ముస్లిం వ్యతిరేకులనీ, వైదికవాదులనీ ముద్ర. చట్టసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టే ముందు దాని ముసాయిదాను సమర్పించాలి. ఆ అంశంలో వాస్తవ పరిస్థితిని తెలపాలి. సంబంధిత గణాంకాలను జోడించాలి. ఆ చట్ట ప్రయోజనాలను వివరించాలి. మోదీ ప్రభుత్వం ఏ చట్టంలోనూ రాజ్యాంగబద్ధంగా ఇవ్వవలసిన ఈ వివరాలను బిల్లుకు జోడించలేదు. ఇల్లు, దేశం ఒకటి కావనీ; రాజ్యాంగ సమానత్వ అమలే ప్రజాస్వామ్యమనీ, పాలకవర్గ కపటమే దేశాన్ని దిగజార్చిందనీ ప్రధాని గ్రహించాలి. కుటుంబ అంశాల్లో ప్రతి మతం పురుషాధిక్య రాజ్యమే. దీన్ని మతాలన్నీ సరిదిద్దుకోవాలి. ఎన్నికల్లో యూసీసీ ప్రభావం లేకుండా చేయాలి. హనుమంత రెడ్డి, వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి మొబైల్: 949020 4545 సంగిరెడ్డి -
భయపడకండి! మరిన్ని విమానాలను పంపిస్తాం!
India has asked its citizens living in Ukraine not to panic: రష్యా ఉక్రెయిన్ల ఉద్రిక్తల నడుమ రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉంచిందంటూ వరుస కథనాలు వస్తున్నాయి. ఓ పక్కన అమెరికా యుద్ధం తప్పదు అంటూ వరుస హెచ్చరికలు జారి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను వచ్చేయమని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారతీయ విద్యార్థులు సమయాత్తమయ్యారు కూడా. అయితే ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రజలకు విమానాలు అందడం లేదని ట్విట్టర్లో పేర్కొంది. దీంతో కేంద్రం పౌరులను విమాన టిక్కెట్లు దొరకడం లేదని భయపడవద్దు మరిన్ని విమానాలను పంపిచేందుకు యత్నిస్తున్నాం అని తెలిపింది. అయితే ఉక్రెయిన్ నుండి భారతదేశానికి విమానాలు అందుబాటులో లేవని భారత రాయబార కార్యాలయానికి అనేక విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారత రాయబార కార్యాలయం "విద్యార్థులను భయాందోళనలకు గురికావద్దని, భారత్‌కు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న అనుకూలమైన విమానాలను బుక్ చేసుకోండి" అని ట్వీట్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం ఉక్రేనియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయ్, ఖతార్ ఎయిర్వేస్ మొదలైనవి విమానాలను నడుపుతున్నాయి" పేర్కొంది. పైగా ఎయిర్ ఇండియా, ఉక్రేనియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌తో సహా "సమీప భవిష్యత్తులో మరిన్ని విమానాలు నడిపేందుకు యత్నించనుందని కూడా వెల్లడించింది. అంతేకాదు ఏదైనా సమాచారం లేదా సహాయం కోసం భారత విదేశీ వ్యవహారాల మంతత్రిత్వ శాఖను సంప్రదించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం 24 గంటల హెల్ప్‌లైన్‌ని కూడా ఏర్పాటు చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల నుండి సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఒకరోజు తర్వాత మాస్కో అధీనంలో ఉన్న క్రిమియాలో సైనిక కసరత్తులు ముగిశాయని, సైనికులు తమ స్థావరాలకు తిరిగి వస్తున్నారని తెలపడం విశేషం. కానీ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మాట్లాడుతూ.. మాస్కో మరిన్ని బలగాల ఉపసంహరణను ప్రకటించినప్పటికీ రష్యా సైనికదళాలు ఉక్రెయిన్ చుట్టూ మోహరించే ఉన్నాయని, సైనిక కసరత్తు కొనసాగుతోందని పేర్కొనడం గమనార్హం. (చదవండి: ఉక్రెయిన్ ఉద్రిక్తతలు: భారతీయ విద్యార్థులకు చుక్కలు.. పరిస్థితి చెయ్యి దాటిందంటూ ఆవేదన) -
లక్షల కోట్లకన్నా గోప్యతే ముఖ్యం
న్యూఢిల్లీ: యూరోపియన్ వినియోగదారులతో పోలిస్తే భారత పౌరుల గోప్యతను తక్కువగా చూస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌కి సమాధానమివ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం వాట్సాప్, దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌లను సుప్రీంకోర్టు ఆదేశించింది. భారతపౌరుల ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. రూ.లక్షల కోట్ల కన్నా, ప్రజలు తమ వ్యక్తిగత గోప్యతకే అధిక ప్రాధాన్యతనిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల సామాజిక మాధ్యమం వాట్సాప్ ప్రకటించిన నూతన గోప్యతా విధానం ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును హరించి వేస్తోందంటూ, వాట్సాప్ గోప్యతా విధానంపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఫేస్బుక్, వాట్సాప్‌లను ఉద్దేశించి.. ‘మీది 2–3 ట్రిలియన్ డాలర్ల కంపెనీ అయితే అయ్యుండొచ్చు. కానీ ప్రజలు డబ్బుకన్నా వారి సమాచార గోప్యతకే అధిక ప్రాధాన్యతనిస్తారు’ అని వ్యాఖ్యానించింది. ► నూతన గోప్యతా విధానాన్ని అమలుచేస్తే, ప్రజల ప్రైవసీని పరిరక్షించేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ సుబ్రమణియన్‌ల ధర్మాసనం వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు నోటీసులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వానికీ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై స్పందించేందుకు 4 వారాల సమయాన్ని కోర్టు మంజూరు చేసింది. వాట్సాప్ గోప్యతా విధానంపై పౌరులకు సందేహాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ► కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ‘ఇది దేశానికి సంబంధించిన సమస్య అని, వినియోగదారుల సమాచారాన్ని షేర్ చేసేందుకు ససేమిరా ఒప్పుకునే ప్రసక్తే లేదు’ అని కోర్టుకి చెప్పారు. వాట్సాప్ భారత చట్టాలను అనుసరించలేదని మెహతా ఆరోపించారు. ► వాట్సాప్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ ఒక్క యూరప్‌లో తప్ప భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఒకే రకంగా ఉందని, యూరోపియన్లకు జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఉందని, భారత్‌లో పార్లమెంటు అదే విధమైన చట్టం చేస్తే వాట్సాప్ దాన్ని అనుసరిస్తుందని వ్యాఖ్యానించారు. ‘ఈ ప్రైవసీ పాలసీ ప్రకారం భారత పౌరుల డేటాను షేర్ చేయొచ్చు’ అని అన్నారు. ► ఇటీవల వాట్సాప్ కంపెనీ నూతన గోప్యతా విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ఫిబ్రవరి 8 నుంచి అమలులోకి వస్తుందని వాట్సాప్ పేర్కొంది. దీనిపై భారత ప్రభుత్వం ఇప్పటికే తన అభ్యంతరాలను వెల్లడించింది. భారత ప్రభుత్వం నోటీసుల మేరకు నూతన గోప్యతా విధానం అమలును మే 15కి వాయిదావేశారు. వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని, ఇది భారతీయులకు ఒకలా, యూరోపియన్స్‌కి మరోలా అమలు చేస్తున్నారు అని పిటిషనర్ తరఫున వాదిస్తోన్న న్యాయవాది శ్యామ్ దివాన్ ఆరోపించారు. ‘యూరప్‌లో ఎవరికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్నైనా ఇతరులకు షేర్ చేయాల్సి వస్తే, దానికి ముందు సదరు వ్యక్తి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ పాలసీనే భారత్‌కూ అన్వయించాలి’ అని దివాన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం కొత్త గోప్యతా విధానాన్ని ప్రకటించే వరకు వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీని అమలుచేయరాదని ఆదేశించాల్సిందిగా కోర్టుని కోరారు. ► ఇతరులతో తమ సంభాషణలని, తమ డేటాని, వాట్సాప్ కంపెనీ ఎవరితోనైనా షేర్ చేస్తే తమ వ్యక్తిగత గోప్యతకు నష్టం వాటిల్లుతుందేమోనని భారత పౌరులు భయపడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కోర్టు స్పష్టం చేసింది. ► తమ లబ్ధికోసం వినియోగదారుల డేటాని ఇతరులకు ఇస్తున్నారంటూ పిటిషన్‌దారుడు నూతన ప్రైవసీ పాలసీని సవాల్ చేశారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో 2017లో రాజ్యాంగ ధర్మాసనం ‘ఇది వ్యక్తిగత గోప్యతా హక్కుకి సంబంధించిన పెద్ద సమస్య’ అని వ్యాఖ్యానించినట్టు సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ► డేటా షేరింగ్ విషయంలో తమ విధానం ఏమిటో వాట్సాప్, ఫేస్బుక్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని సీజేఐ అన్నారు. -
మయన్మార్ సంక్షోభం : ఎంబసీ కీలక సూచనలు
సాక్షి, న్యూఢిల్లీ : మయన్మార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి పరిణామాల దృష్ట్యా, భారతీయ పౌరులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు మంగళవారం ఒకప్రకటన విడుదల చేసింది. అత్యవసరమైతే తప్ప సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండాలని, రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని వెల్లడించింది. (మయన్మార్‌లో ఎమర్జెన్సీ: బందీగా ఆంగ్ సాన్ సూకీ ) కాగా కొన్ని రోజులుగా అక్కడి ప్రభుత్వంతో విభేదిస్తున్న సైన్యం నిన్న (సోమవారం) మరోసారి తిరుగుబాటు చేసింది. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ సహా ఆ పార్టీ కీలక నేతలను అరెస్ట్ చేసింది. ఏడాదిపాటు ఎమర్జెన్సీ విధించింది. దేశం తమ పాలనలోకి వచ్చినట్టు ఆర్మీ ప్రకటించింది. ఈ ఉదంతాన్ని భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాలు ఖండించిన సంగతి తెలిసిందే. (మిలటరీ గుప్పెట్లో మయన్మార్ ) -
1.9 కోట్లమందిని భారత పౌరులుగా గుర్తించారు!
గువాహటి: రాష్ట్రంలోని 1.9 కోట్లమందిని చట్టబద్ధమైన పౌరులుగా గుర్తిస్తూ అసోం ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి జాతీయ పౌర నమోదు (ఎన్ఆర్సీ) తొలి ముసాయిదాను ప్రచురించింది. మొత్తం 3.29 కోట్లమంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1.9 కోట్లమందిని చట్టబద్ధమైన భారత పౌరులుగా గుర్తించింది. మిగతా వారు దరఖాస్తులు వివిధ ధ్రువీకరణ దశల్లో ఉన్నాయని భారత రిజిస్టర్ జనరల్ శైలేష్ తెలిపారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కూడా ఈ విషయమై స్పందించారు. ఈ జాబితాలో పేరులేని ‘నిజమైన పౌరులు’ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తుది జాబితాలో వారి పేర్లు తప్పకుండా ఉంటాయని సీఎం సోనోవాల్ అన్నారు. ఇది ఈ జాబితాను రూపొందించడం చారిత్మాతక సందర్భమని ఆయన అభివర్ణించారు. దేశ విభజన అనంతర వలసల నేపథ్యంలో 1951లో జాతీయ పౌర నమోదు జాబితాను తొలిసారి చేపట్టిన రాష్ట్రంగా అసోం నిలిచిందని, ఇప్పుడు కూడా అలాంటి జాబితా రూపకల్పనను చేపట్టిన ఏకైక రాష్ట్రం అసో అని అన్నారు. ‘ఈ-సేవ’ కేంద్రాలు, ఎస్సెమ్మెస్ సర్వీస్ ద్వారా తమ పేరు జాబితాలో ఉందో లేదో ప్రజలు తెలుసుకోవచ్చు. పొరుగు దేశాల నుంచి వలసల నేపథ్యంలో అసోంలోని నిజమైన స్థానిక పౌరుల గుర్తింపు కోసం జాతీయ పౌర నమోదును చేపట్టాలన్న డిమాండ్‌పై 2005 నుంచి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం దీనిని చేపట్టింది. -
వారికి జూన్ 30 వరకు చాన్స్
ముంబై: ఎన్నారైలు రద్దయిన నోట్లను మార్చుకోవడానికి ఆర్బీఐ 2017 జూన్ 30వరకు గడువిచ్చింది. గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు విదేశాల్లో ఉన్న ఎన్నారైలు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. అలాగే ఈ కాలావధిలో విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు(రెసిడెంట్ ఇండియన్ సిటిజన్స్) 2017 మార్చి 31 వరకు నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హులైన భారత పౌరులు ఎంత డబ్బు మార్చుకోవాలన్న దానిపై పరిమితి లేదని, ఎన్నారైలకు మాత్రం ఫెమా చట్ట నిబంధనల కింద(ఒక్కొక్కరు రూ. 25వేలు) పరిమితి ఉంటుందని పేర్కొంది. గుర్తింపు పత్రాలు, పైన పేర్కొన్న కాలవ్యవధిలో విదేశాల్లో ఉన్నట్లు, ఇదివరకు నోట్లు మార్చుకోలేదని చూపేఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. మార్పిడిలో మూడో పక్షాన్ని(థర్డ్ పార్టీ) అనుమతించబోమని పేర్కొంది. ఈ నిబంధనలు పూర్తి చేస్తే బ్యాంకు ఖాతాలో మార్పిడి మొత్తం జమ అవుతుందని పేర్కొంది. -
యెమెన్‌కు 2 నౌకలను పంపిన కేంద్రం
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశం యెమెన్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో రెండు నౌకలను పంపింది. సోమవారం కొచ్చిన్ పోర్టు అధికారులు ఈ విషయాన్నివెల్లడించారు. అంతకుమందు ఈ రోజు ఉదయం యెమెన్‌కు ఎయిర్ ఇండియా విమానాన్ని పంపారు. యెమెన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అక్కడున్న భారతీయులను కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
మనోళ్ల కోసం వెళ్లిన విమానం
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశం యెమెన్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానం బయలు దేరింది. యెమెన్‌లో ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడ రాజకీయ అస్థిరత చోటుచేసుకుందని, భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, తమను స్వదేశానికి తీసుకెళ్లాలని అక్కడి భారతీయులు కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతోపాటు యెమెన్ అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రంగంలోకి దిగారు. యెమెన్ అధికారులతో చర్చలు జరిపి రోజుకు మూడు గంటలపాటు భారత విమానానికి అనుమతిని పొందారు. దీంతో అక్కడి వారిని వెనుకకు తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా విమానం ఏ 320 సోమవారం ఉదయం 7.45గంటలకు అక్కడి సనా విమానాశ్రయానికి బయలు దేరింది. ఏ 320కి 180 మంది ప్రయాణీకుల సామర్ధ్యం ఉంది. ప్రస్తుతం ఇక్కడ మొత్తం 3,500 మంది భారతీయులు ఉండగా వీరిలో నర్సులే ఎక్కువగా ఉన్నారు. ఒకే సారి 1500మందిని తరలించగల భారీ నౌకను కూడా యెమెన్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సుష్మా స్వరాజ్ తెలిపారు. యెమెన్‌లో ప్రస్తుతం అన్ని విమానాశ్రయాలు మూతపడ్డాయి. -
వైద్యం.. దైన్యం
సాక్షి,కడప: నేటి బాలలే రేపటి పౌరులు.. ఇది మన నినాదం. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ, శాఖల మధ్య సమన్వయలోపం.. చిన్నారులను పట్టించుకోకపోవడం....సక్రమమైన వైద్య పరీక్షలు లేకపోవడం.. వెరసి విద్యార్థుల ఆరోగ్యానికి గండం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో సుమారు 4500కు పైగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ఇవేకాకుండా ప్రైవేటు పాఠశాలలు కూడా దాదాపు వెయ్యి వరకు ఉన్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు ఐదు లక్షల పైచిలుకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఎంతసేపు విద్యార్థి సక్రమంగా చదువుతున్నాడా....హోం వర్క్ బాగా చేస్తున్నాడా? లాంటి విషయాలు మాత్రమే చూస్తున్నారు తప్ప విద్యార్థుల ఆరోగ్యం గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడి...పుట్టినప్పుడే అవయవ లోపం.. తర్వాత వచ్చే జన్యులోపం.. వినికిడిలోపం.. బుద్ధిమాంద్యం, వైకల్యం తదితర సమస్యలతో విద్యార్థుల జీవితాలు చిక్కి శల్యమవుతున్నాయి. శాఖల మధ్య కనిపించని సమన్వయలోపం చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేకంగా జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకాన్ని ప్రవేశపెట్టినా పిల్లలను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖతోపాటు విద్యాశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, అంధత్వ నివారణ సంస్థ, సర్వశిక్ష అభియాన్, ఐసీడీఎస్, వికలాంగుల సంక్షేమశాఖ తదితర శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో విద్యార్థుల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. పాఠశాలల్లో అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఆరోగ్య పరీక్షలు చేయించి అవసరమైన ఆపరేషన్లు చేయించాల్సిన బాధ్యత ఆయా శాఖలపై ఉంది. అయినా వీరెవరూ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగించే పరిణామం. అనారోగ్యంతో బాల్యం 2011-12 ప్రాంతంలో ఒకసారి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించారు. ఇటీవలి కాలంలో సర్వశిక్ష అభియాన్ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం వేల మంది విద్యార్థుల్లో వికలత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రతి స్కూలుకు వెళ్లి ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తే తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారి వివరాలు కూడా బయటికి వస్తాయి. వేంపల్లె మండలంలోని ఒకటి, రెండు పాఠశాలల్లో బీపీ, షుగర్లతోపాటు కడప నియోజకవర్గంలోని ఒక పాఠశాలలో బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులున్నట్లు సమాచారం. పాఠశాలల్లో కనిపించని వైద్య పరీక్షలు ప్రభుత్వాలు మారుతున్నా అధికారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. విద్యార్థులకు సంబంధించి ప్రతినెల పాఠశాలకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను నిర్ధారించాల్సిన వైద్యాధికారులు ఎక్కడా కూడా పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నెలకొకమారు వైద్య పరీక్షలు నిర్వహించి అనారోగ్యంతో అవస్థలు పడుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. -
ప్రజలందరికీ జాతీయ గుర్తింపు కార్డులు
హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి న్యూఢిల్లీ: అసలైన భారత పౌరులందరి వివరాలతో ప్రభుత్వం జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్)ను రూపొందిస్తోందని, అందరికీ నిర్దిష్ట గడువులోగా జాతీయ గుర్తింపు కార్డులు(ఎన్ఐసి) అందజేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. దేశంలోకి చొరబాట్లు సాగుతున్నాయన్న వార్తలపై మంగళవారం లోక్‌సభలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. ‘అసలైన భారతీయులను గుర్తించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సమగ్ర ఎన్పీఆర్ డేటాబేస్ తయారీకి ఎన్పీఆర్, ‘ఆధార్’ కార్డులిచ్చే ప్రత్యేక గుర్తింపు సాధికార సంస్థ(ఉడాయ్) పర స్పర సహకారంతో ఎలా పనిచేయాలో చర్చించడానికి ప్రధాని మోడీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్పీఆర్ ను త్వరలోనే తయారు చేస్తామ’న్నారు. చొరబాట్లను ఆపడానికి అంతర్జాతీయ సరిహద్దులో కంచె నిర్మాణం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, 2003లో సవరించిన పౌరసత్వ చట్టం ప్రకారం.. పౌరులందరి వివరాలను నమోదు చేసి, ఎన్‌ఐసిలను ఇవ్వాల్సి ఉందని హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక జవాబిచ్చారు. ఆధార్‌కు, ఎన్ఐసీకి తేడా ఏంటి? ఆధార్ కార్డు ప్రత్యేక గుర్తింపు సంఖ్య మాత్రమే. గుర్తింపు కార్డు కాదు. దీనికి చట్టబద్ధత లేదు. ఈ కార్డుదారులందరి బయోమెట్రిక్(వేలిముద్రలు,కనుపాపలచిత్రాలు) వివరాలు, వంటి సమాచారం ‘ఉడాయ్’ వద్ద ఉంటుంది. జాతీ య గుర్తింపు కార్డు(ఎన్ఐసీ) దేశ పౌరులకు ఇచ్చే గుర్తింపు కార్డు. ఇందులో కార్డుదారు పేరు, ప్రత్యేక జాతీయగుర్తింపు సంఖ్య, బయోమెట్రిక్ సమాచారంతోపాటు పేరు, ఊరు తదితర 16 వివరాలు ఉంటాయి. సంక్షేమ పథాకాల అమలు, సబ్సిడీల మంజూరుకు ఇకపై ఎన్‌ఐసీనే ప్రాతిపదికగా తీసుకునే అవకాశముంది. ఎన్‌ఐసీల రాకతో ఆధార్‌కు కాలం చెల్లినట్లే. జాతీయ భద్రతకు ఎన్ఐసీ ప్రాజెక్టు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు రూ. 50 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ఆధార్ ప్రాజెక్టు కింద గత ఏడాది చివరి నాటికి 50 కోట్ల మంది పేర్లు నమోదు చేయడం తెలిసిందే.