ప్రజలందరికీ జాతీయ గుర్తింపు కార్డులు
హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: అసలైన భారత పౌరులందరి వివరాలతో ప్రభుత్వం జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్‌పీఆర్)ను రూపొందిస్తోందని, అందరికీ నిర్దిష్ట గడువులోగా జాతీయ గుర్తింపు కార్డులు(ఎన్‌ఐసి) అందజేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. దేశంలోకి చొరబాట్లు సాగుతున్నాయన్న వార్తలపై మంగళవారం లోక్‌సభలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. ‘అసలైన భారతీయులను గుర్తించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సమగ్ర ఎన్‌పీఆర్ డేటాబేస్ తయారీకి ఎన్‌పీఆర్, ‘ఆధార్’ కార్డులిచ్చే ప్రత్యేక గుర్తింపు సాధికార సంస్థ(ఉడాయ్) పర స్పర సహకారంతో ఎలా పనిచేయాలో చర్చించడానికి ప్రధాని మోడీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్‌పీఆర్ ను త్వరలోనే తయారు చేస్తామ’న్నారు. చొరబాట్లను ఆపడానికి అంతర్జాతీయ సరిహద్దులో కంచె నిర్మాణం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, 2003లో సవరించిన పౌరసత్వ చట్టం ప్రకారం.. పౌరులందరి వివరాలను నమోదు చేసి, ఎన్‌ఐసిలను ఇవ్వాల్సి ఉందని హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక జవాబిచ్చారు.
ఆధార్‌కు, ఎన్‌ఐసీకి తేడా ఏంటి?
ఆధార్ కార్డు ప్రత్యేక గుర్తింపు సంఖ్య మాత్రమే. గుర్తింపు కార్డు కాదు. దీనికి చట్టబద్ధత లేదు. ఈ కార్డుదారులందరి బయోమెట్రిక్(వేలిముద్రలు,కనుపాపలచిత్రాలు) వివరాలు, వంటి సమాచారం ‘ఉడాయ్’ వద్ద ఉంటుంది. జాతీ య గుర్తింపు కార్డు(ఎన్‌ఐసీ) దేశ పౌరులకు ఇచ్చే గుర్తింపు కార్డు. ఇందులో కార్డుదారు పేరు, ప్రత్యేక జాతీయగుర్తింపు సంఖ్య, బయోమెట్రిక్ సమాచారంతోపాటు పేరు, ఊరు తదితర 16 వివరాలు ఉంటాయి. సంక్షేమ పథాకాల అమలు, సబ్సిడీల మంజూరుకు ఇకపై ఎన్‌ఐసీనే ప్రాతిపదికగా తీసుకునే అవకాశముంది. ఎన్‌ఐసీల రాకతో ఆధార్‌కు కాలం చెల్లినట్లే. జాతీయ భద్రతకు ఎన్‌ఐసీ ప్రాజెక్టు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు రూ. 50 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ఆధార్ ప్రాజెక్టు కింద గత ఏడాది చివరి నాటికి 50 కోట్ల మంది పేర్లు నమోదు చేయడం తెలిసిందే.