రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత పౌరులందరికీ త్వరలో జాతీయ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. దేశంలోకి చొరబాట్లు సాగుతున్నాయన్న వార్తలపై మంగళవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అసలైన భారత పౌరులందరి వివరాలతో ప్రభుత్వం జాతీయ జనాభా జాబితా(ఎన్‌పీఆర్)ను రూపొందిస్తోందని, వారందరికీ నిర్దిష్ట గడువులోగా జాతీయ గుర్తింపు కార్డులు అందజేస్తామని చెప్పారు.
‘అసలైన భారతీయులను గుర్తించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సమగ్ర ఎన్‌పీఆర్ డేటా బేస్ తయారీకి ఎన్‌పీఆర్, ప్రత్యేక గుర్తింపు సాధికార సంస్థ(ఉడాయ్) పరస్పర సహకారంతో ఎలా పనిచేయాలో చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్‌పీఆర్‌ను నిర్దిష్ట వ్యవధిలో తయారు చేస్తాం’ అని ఆయన వివరించారు. సరిహద్దుల నుంచి చొరబాట్లను ఆపడానికి అంతర్జాతీయ సరిహద్దులో కంచె నిర్మాణం వంటి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో 4,090 కిలోమీటర్ల కంచె నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 3,300 కిలోమీటర్ల కంచెను నిర్మించినట్లు తెలిపారు.
కాగా, 2003లో సవరించిన పౌరసత్వ చట్టం ప్రకారం దేశ పౌరులందరి వివరాలను నమోదు చేయవలసి ఉందని హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పౌరులకు జాతీయ గుర్తింపు కార్డులు కూడా ఇవ్వవలసి ఉందని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆయన ఈ వివరాలు తెలిపారు.