సెప్టెంబర్ 4, 5 తేదీల్లో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది.
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 4, 5 తేదీల్లో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది. కశ్మీర్ గవర్నర్, ముఖ్యమంత్రితో బృందం చర్చలు జరుపుతుంది. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతర వర్గాలతో శ్రీనగర్‌లో చర్చిస్తుంది. మొత్తం 30 మంది సభ్యుల బృందంలో 20కి పైగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. మరోవైపు అఖిలపక్ష బృందంతో చర్చల్లో పాల్గొనవద్దని హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ అలీ షా గిలానీ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రార్థనల దృష్ట్యా కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాతో పాటు అనంతనాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్, బారాముల్లా, పట్టాన్‌ల్లో కర్ఫ్యూ విధించారు.
35 చోట్ల రాళ్ల దాడి వంటి సంఘటనలు జరిగాయని పోలీసులు చెప్పారు. శ్రీనగర్ శివారులో ఏడో తరగతి చదువుతున్న డానిష్ సుల్తాన్ స్నేహితులతో కలిసి అల్లర్లలో పాల్గొనగా పోలీసులు వారిని వెంటతరిమారు. తప్పించుకునేందుకు ఆ బాలుడు జీలం నదిలో దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అల్లర్ల మృతుల సంఖ్య 70కి పెరిగింది. మరోవైపు పాక్ దళాలు సరిహద్దు రేఖ వెంట అక్నూర్ సెక్టార్‌లో కాల్పులకు తెగబడ్డాయి.