దళిత చిన్నారుల సజీవ దహనం
ఇంట్లో పెట్రోలు పోసి నిప్పంటించిన అగ్రవర్ణాలవారు
♦ రెండున్నరేళ్ల బాలుడు, 11 నెలల పాప సజీవ దహనం
♦ భార్యభర్తలకు తీవ్రంగా కాలిన గాయాలు.. భార్య పరిస్థితి విషమం
♦ ఢిల్లీ శివార్లలోని సున్‌పెడ్‌లో సోమవారం రాత్రి ఘటన.. ఇద్దరి అరెస్టు
ఫరీదాబాద్: దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఘోరం జరిగింది. ఒక దళిత కుటుంబంపై అగ్రవర్ణాలకు చెందినవారు దాడి చేసి.. ఇద్దరు చిన్నారులను సజీవ దహనం చేశారు. అర్ధరాత్రి దాటాక అందరూ నిద్రపోతుండగా కిటికీలోంచి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆ చిన్నారుల తల్లిదండ్రులు కూడా తీవ్రంగా గాయాలపాలై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. హరియాణా రాష్ట్రం లోని సున్‌పెడ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గతంలోని ఓ హత్యకేసుకు సంబంధించిన విభేదాలే ఈ దాడికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్న సున్‌పెడ్ గ్రామానికి చెందిన జితేందర్‌కు కొద్దిరోజుల కింద ఓ హత్యకేసు విషయంగా అగ్రవర్ణానికి చెందినవారితో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో వారు జితేందర్‌పై కక్షగట్టారు. 11 మంది కలసి సొమవారం అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో జితేందర్ ఇంటివద్దకు వచ్చారు. తలుపులకు బయటి నుంచి గడియ పెట్టి, కిటికీలోంచి పెట్రోలు పోసి నిప్పంటించారు. పెట్రోలు వాసనను పసిగట్టిన జితేందర్ లేచి చూసేటప్పటికే మంటలు అంటుకున్నాయి. ఈ అగ్నికీలల్లో జితేందర్ రెండున్నరేళ్ల కుమారుడు వైభవ్, 11 నెలల పాప దివ్య సజీవ దహనమయ్యారు.
ఆయనకు, భార్య రేఖకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వారిని ఢిల్లీకి తరలించి చికిత్స అందజేస్తున్నారు. రేఖ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఒక వివాదం నేపథ్యంలో తనపై రాజ్‌పుత్ కులానికి చెందినవారు కక్షగట్టారని, కుటుంబం మొత్తాన్నీ చంపేస్తామని బెదిరించారని జితేందర్ చెప్పారు. ‘‘మేమంతా నిద్రలో ఉన్న సమయంలో తలుపులకు బయట గడియ పెట్టారు. కిటికీలోంచి పెట్రోలు పోసి నిప్పంటించారు. నా ఇద్దరు పిల్లలూ చనిపోయారు. నేనెప్పటికీ ఆ ఊరికి తిరిగి వెళ్లను. నా పిల్లల్ని నాకు తిరిగి తెచ్చివ్వండి..’’ అంటూ గుండెలవిసేలా రోదించారు.
ఇద్దరి అరెస్టు.. ఈ ఘటనలో 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు సున్‌పెడ్‌కు చెందిన బల్వంత్, ధర్మ్‌సింగ్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటన నేపథ్యంలో అల్లర్లు తలెత్తకుండా అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. దళిత చిన్నారుల సజీవ దహనం చాలా దురదృష్టకర సంఘటన అని, దీనిపై వేగంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హరియాణా సీఎం మనోహర్ ఖట్టార్ పేర్కొన్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మనోహర్ ఖట్టార్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధిత కుటుంబానికి హరియాణా ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.